విశ్లేషణ
దాదాపు ఏడాది క్రితం 38 పార్టీలతో ఏర్పడిన ‘ఇండియా’ కూటమికి ఇప్పటికీ ఒక ఉమ్మడి మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టోలు పార్టీ కన్నా కూటమికి మరింత అవసరం. ఎందుకంటే, వేర్వేరు ఆలోచనలు, లక్ష్యాలు ఉండే పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు, కలిసి ఎట్లా పని చేయగలవనే సందేహాలు ప్రజలకుంటాయి. కూటమి ఏర్పడింది కేవలం లోక్‌సభ ఎన్నికలు, వాటితోపాటు జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు. అదొక దీర్ఘకాలిక వేదిక. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలు, ఈలోగా పలు అసెంబ్లీ ఎన్నికలు వారి అజెండాలో ఉండాలి. ఉమ్మడి మేనిఫెస్టో అవసరమనే ఆలోచన సీరియస్‌గా ఉన్నదా, లేక ఎన్నికల ముందు చేసిన ప్రయత్నం కేవలం ఒక తతంగమా?
‘ఇండియా’ కూటమి 38 పార్టీలతో ఏర్పడి సంవత్సరం కావస్తున్నది. భౌతికంగా చూసిన ట్లయితే అది బలమైన రాజకీయ వేదికే. కానీ, గత సెప్టెంబర్ 22న ఆ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు వారికి ఒక ఉమ్మడి మేని ఫెస్టో లేకపోవటం గమనించదగ్గది. ఏ విధంగా ఆలోచించినా అది ఒక పెద్ద లోటు. వాస్తవానికి అటువంటి మేనిఫెస్టో ఎన్నికలకు ముందే రావాలి. తమ కూటమి అధికారానికి వచ్చినట్లయితే వివిధ రంగాలకు, సమస్యలకు, ప్రజల కోరికలకు సంబంధించి ఏమి చేయగలరో, అధికార పక్షపు వైఫల్యాలను ఏ విధంగా సరిదిద్దగలరో దేశం ఎదుట ఎన్నికలకు ముందే ఉంచాలి. కానీ, వారు ఆ పని చేయలేదు.
ఎన్నికలు మార్చి–మే 2024 కాలంలో జరిగాయి. ‘ఇండియా’ కూటమి ఏర్పాటు ప్రయత్నాలు అంతకు 10 నెలల క్రితం నుంచి మొదలయ్యాయి. తర్వాత 4 నెలలకు, అనగా ఎన్నికలకన్న 6 నెలల ముందు కూటమి ఏర్పడింది. అయినా ఇంత సుదీర్ఘ కాలంలో ఉమ్మడి మేనిఫెస్టో లేక పోయింది. ఎన్నికలు ముగిసి 3 నెలలు గడిచి 4వ నెల నడుస్తున్నది. అయినప్పటికీ అటువంటి డాక్యుమెంట్‌ను రూపొందించక పోవటం సరికదా, ఆ ప్రయత్నాల మాటైనా వినిపించక పోవటం ఆశ్చర్యం.
ఈ మాటలు ఇంతగా చెప్పుకోవటానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. యథాతథంగా మేనిఫెస్టోలు ఒక పార్టీకి గానీ, కూట మికిగానీ ఎంత అవసరమో చెప్పనక్కర లేదు. పార్టీ కన్నా కూటమికి మరింత అవసరం. ఎందుకంటే, వేర్వేరు ఆలోచనలు, లక్ష్యాలు ఉండే పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు, కలిసి ఎట్లా పని చేయగల వనే సందేహాలు ప్రజలకుంటాయి.
అది కిచిడీ కూటమిగా మారి పదవుల కోసం కీచులాడుకుంటారు తప్ప ప్రజల కోసం స్థిరంగా పని చేయరనీ, కొద్ది కాలానికే కుప్పగూలుతారనీ ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. లోగడ ఏర్పడిన ఫ్రంట్‌ల విషయంలో అట్లా జరిగింది కూడా! ఈ పరిస్థితుల దృష్ట్యా ‘ఇండియా’ కూటమికి ఒక ఉమ్మడి మేనిఫెస్టో అన్నది, కనీసం ప్రజలకు చూపేందుకైనా, ముందస్తుగా అవసరం. అధమ పక్షంలో, ఎన్నికలు ముగిసిన ఈ దశలోనైనా రాగల కాలం కోసం. కానీ వారికి ఇది ఆలోచనలో ఉన్నట్లయినా తోచటం లేదు.
ఉమ్మడి మేనిఫెస్టో అవసరాన్ని వారు ఎన్నికలకు ముందు గుర్తించలేదని కాదు. అందుకోసం కొన్ని సంప్రదింపులు జరిగాయి కూడా! కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరక పోవటంతో ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మేనిఫెస్టో లేకుండానే సీట్లు మాత్రం సర్దుబాటు చేసుకుని పోటీలు చేశారు. ఎవరి అజెండాలు వారు ప్రచారం చేసు కున్నారు. కొన్ని అంశాలపై ఏకీభావం వ్యక్తం కాగా, కొన్నింటిపై పర స్పర విరుద్ధ ప్రచారాలు సాగాయి. కొన్ని ముఖ్యాంశాలపై ఏమీ మాట్లాడక మౌనం వహించారు.
ఆ పరిణామాలన్నింటిని గమనించిన వారికి ‘ఇండియా’ కూటమిలో భౌతికమైన ఐక్యత కాకుండా రసాయ నిక ఐక్యత ఏమైనా ఉందా, ఉండగలదా అనే సందేహాలు కలగటం మొద లైంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తన సొంత మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘న్యాయ్ పత్ర’ పేరిట గల అందులో ఎప్పటివలెనే అనేక అంశాలున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లా డుతూ తమ వైఖరి ప్రధానంగా అభివృద్ధి, సమ్మిళితత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ,సంక్షేమం వంటి అంశా లను కేంద్రంగా చేసుకుని ఉందన్నారు. ఆ పార్టీ ఇవన్నీ షరా మామూలుగా చెప్పేవే. అమలు విషయం వేరే. కానీ మౌలికంగా మేనిఫెస్టో అంటూ ఒకటుందన్నది ప్రధానం.
‘ఇండియా’ కూటమికి అది లేకపోయింది. కూటమి పార్టీల మధ్య పైన పేర్కొన్నట్లు భిన్నాభిప్రాయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు. పాత పెన్షన్ స్కీం పునరుద్ధరణ, పౌర సత్వ చట్ట సవరణ, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (ఉపా) రద్దు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, గవర్నర్ పోస్ట్ రద్దు, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356 రద్దు, జమ్మూ–కశ్మీర్‌కు తిరిగి ప్రత్యేక హోదా వంటివి అందులో ఉన్నాయి. ఇవన్నీ కీలకమైనవి.
వీటిపై ఏకాభిప్రాయం దాదాపు అసాధ్యం. ‘ఇండియా’ కూటమి అనే సంక్షిప్త నామానికి పూర్తి పేరు ఏమిటో తక్కువమందికి తెలిసి ఉంటుంది. అది– ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. పేరు బాగున్నది. కానీ ఇటువంటి కీలకమైన అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఏదైనా ఎట్లా వీలవుతుందన్నది ప్రశ్న.
కూటమి పార్టీలకు కొంత వెసులుబాటు ఇస్తూ, ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు ఒత్తిడి వల్ల ఉమ్మడి మేనిఫెస్టోకు తగినంత సమయం లేకపోయిందనుకుందాం. కూటమి ఏర్పడింది కేవలం లోక్‌సభ ఎన్నికలు, వాటితోపాటు జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు. అదొక దీర్ఘకాలికమనుకునే వేదిక. ఇప్పటి నుంచి తిరిగి 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలు, ఈలోగా పలు అసెంబ్లీ ఎన్నికలు వారి అజెండాలో ఉండాలి.
అటువంటప్పుడు, కనీసం మొన్నటి లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాతనైనా ఉమ్మడి మేనిఫెస్టో ప్రయత్నాలు తిరిగి ఎందుకు చేయటం లేదు? కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాలు, పార్టమెంట్ సమావేశాల హడావిడి ముగిసిన వెనుకనైనా? అసలు ఆ శిబిరం నుంచి ఈ ప్రస్తావన నామమాత్రంగానైనా వినిపించటం లేదు. విచిత్రమేమంటే కూటమిలోని 38 పార్టీలలో ఎవరూ ఆ పని చేయటం లేదు. చివరకు తమది సైద్ధాంతికమైన, దీర్ఘకాలికమైన దృక్పథమని చెప్పే వామపక్షాలు సైతం కూటమిలోని 38 పార్టీలలో సగం పేర్లు మనం ఎన్నడూ విననివి.
కూటమి గెలిచిన మొత్తం స్థానాలు 234 కాగా, వాటిలో ఇవి తెచ్చుకున్నవి ఒకటి కూడా లేదు. ఆ యా రాష్ట్రా లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు వాటికి కూటమి బలంతో ఒకటీ అరా వస్తాయేమో తెలియదు. ఏమైనా ఐక్యత అన్నది ఐక్యతే గనుక వారంతా అక్కడ ఉండటం మంచిదే. అంతిమంగా లెక్కకు వచ్చేది మాత్రం కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయనే దానితో పాటు, లేదా అంతకన్నా ముఖ్యంగా, వాటి మధ్య గల ఐక్యత ఏమిటి? కెమిస్ట్రీ ఏమిటి? ఆ కెమిస్ట్రీని సృష్టించే ఉమ్మడి మేనిఫెస్టో ఏమిటి? అన్నవి.
ఇక్కడ చెప్పుకోవలసింది మరొకటి ఉంది. అటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి వివరమైనది ఉండి కూడా, ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’ పేరిట కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని కూడా, 1989–91 కాలపు ‘నేషనల్ ఫ్రంట్’ కుప్పగూలింది. వాస్తవానికి వీపీ సింగ్ పార్టీ జనతాదళ్‌తో పాటు, సోషలిస్టు నేపథ్యం గల కొన్ని కుల పార్టీలు, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు కలిసి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ సిద్ధాంతంతో స్థాపించిన బలమైన ఫ్రంట్ అది.
ఆ మేనిఫెస్టో ప్రకారం మంచి పనులు అనేకం చేశారు కూడా! కానీ కేవలం దేవీలాల్, చంద్రశేఖర్‌ల అధికార దాహానికి అది బలైంది. లేనట్లయితే, రథయాత్ర కారణంగా అద్వానీని లాలూ యాదవ్ అరెస్ట్ చేసి వీపీ సింగ్ ప్రభుత్వానికి జనసంఘ్ మద్దతు ఉపసంహరించుకున్నా నేషనల్ ఫ్రంట్ కొనసాగి బలపడేది.
ఇండియా కూటమికి అసలు ఉమ్మడి మేనిఫెస్టో అన్నది లేక పోయింది. అందుకోసం ప్రయత్నాలయినా జరగటం లేదు. ఉమ్మడి మేనిఫెస్టో అవసరమనే ఆలోచన కాంగ్రెస్‌కు సీరియస్‌గా ఉన్నదా లేక, ఎన్నికల ముందు చేసిన ప్రయత్నం ఒక తతంగమా? ఈ అనుమానం ఎందుకంటే, కాంగ్రెస్‌కు కావలసింది ఏకచ్ఛత్రాధిపత్యం తప్ప ఇతరు లతో అధికారాన్ని పంచుకోవటం ఇష్టముండదు.
కూటమి పేరిట చేయజూసేది తక్కిన పార్టీలను నిచ్చెన మెట్లవలె ఉపయోగించు కోవడం మాత్రమే. ఇది ఊహాగానం కాదు. 2004లో, 2009లో గెలిచి నపుడు వారు చేయజూసింది అదేననీ, అందువల్ల సమస్యలు తలెత్తి కొన్ని పార్టీలు దూరమైనాయనీ తెలిసిందే. ఇటువంటి స్వభావం కాంగ్రెస్‌కు ఇప్పటికీ మారలేదు. కనుక ఉమ్మడి మేనిఫెస్టో ఉండక పోవచ్చు కూడా!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment