అత్యధిక బీజేపీయేతర పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడటం మంచి ప్రయత్నమే. భిన్న స్వభావాలు, భిన్న అభిప్రాయాలున్న రాజకీయ పార్టీలు ఒక సమన్వయానికి ప్రయత్నించడమూ గొప్ప విషయమే. అయితే, ప్రత్యామ్నాయ రాజకీయ ప్రణాళిక రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటున్నామని ఈ పార్టీలు చెప్పడం లేదు.
భారతదేశంలో ఈనాటికీ అస్పృశ్యత, నిరక్షరాస్యత ఉన్నాయి. కులం వేళ్లను పెకిలించకుండా నూతన భారతదేశ ఆవిష్కరణ జరగడం అసంభవం. అందుకే అంబేడ్కర్ చూపిన మార్గంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకోవలసిన చారిత్రక బాధ్యత ఈ పార్టీలపై ఉంది. అప్పుడే అది నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి అవుతుంది.
భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (ఇండియా) పేరుతో ప్రతిపక్షాలు సెప్టెంబర్ 1, 2023న ముంబైలో సమావేశమవటం భారత రాజకీయా లలో చారిత్రక ఘటనగా చెప్పుకోవచ్చు. 28 బీజేపీయేతర పార్టీలు హాజరై వచ్చే ఎన్నికల నాటికి చేయవలసిన ఉమ్మడి పోరు సన్నద్ధతపై చర్చించటం ముదావహం. 14 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీని వేయడం కూడా ముందడుగే. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగ స్వామ్య ఏర్పాటుకు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వెళదామనేది కూడా మంచి ప్రయత్నమే. దీనికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గేను అభినందించాలి.
అంబేడ్కర్ ఆదర్శమని చెప్పరా?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే– బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌కు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపకల్పన ఇక్కడ మృగ్యమైంది. ముంబైలో జరిగిన కూటమి మూడవ సమావేశం కేవలం రాజకీయ సమన్వయంగానే సాగింది. భిన్న ప్రణాళికలు, భిన్న స్వభావాలు, భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ లన్నీ ఒక చోట కూర్చుని సమన్వయానికి ప్రయత్నించడం గొప్ప విషయమే కానీ, ప్రత్యామ్నాయ రాజకీయ ప్రణాళిక రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటున్నా మని అవి చెప్పలేదు. దీంతో దీన్ని ఉదార హిందూవాద సమన్వయ కమిటీగానే భావించాల్సి ఉంటుంది.
మతోన్మాద హిందూ భావజాల పక్షాల కంటే ఈ కూటమి మెరుగైనది అయినప్పటికీ, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అంబేడ్కర్ ఆశయాల్లో తాము నడుస్తామని వీరు అనలేకపోతున్నారు. కారణం ఇందులో అంబేడ్కరైట్‌లు ఎవరూ లేరు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మమతా బెనర్జీ, బీజేపీ పొత్తు నుంచి బయటికి వచ్చిన నితీష్ కుమార్, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్, అంబేడ్కర్‌ను ఇప్పటివరకు తమ ఎజెండాలోకి తీసుకోని సీపీఎం, సీపీఐ నాయకులు ఈ కూడికలో ఉన్నారు. ఓబీసీ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న తేజస్వి యాదవ్, బిహార్‌లో రాజకీయ ప్రాధాన్యత ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ లాంటివాళ్ళు కూడా అంబేడ్కర్‌ను తమ ఎజెండాలోకి ఇంతవరకూ తీసుకోలేదు.
అదే ప్రత్యామ్నాయ ఎజెండా
అలాగే రాహుల్ గాంధీ నోట అంబేడ్కర్ పేరు రాకపోవడం కూడా ఆశ్చర్యం. ఎందుకంటే అధికార పక్షానికి ఆయన ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. భారతదేశంలో ఈనాటికీ అస్పృశ్యత, నిరక్షరాస్యత ఉన్నాయి. కులం వేళ్లను పెకిలించకుండా భారతదేశం నూతన భారతదేశంగా ఆవిష్కరించబడటం కష్టమని శశి థరూర్ లాంటివాళ్లు రాశారు.
చిదంబరం, శశి థరూర్ లాంటి కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ గురించి రాసినవాటిని అయినా రాహుల్ గాంధీ చూసి ఉండవచ్చు. కానీ ఆయనలో ఉన్న ఉదార బ్రాహ్మణుడు కుల నిర్మూలనను తమ ఎజెండాలో ప్రకటించడానికి అడ్డు పడుతున్నాడని అనక తప్పదు. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి భారతదేశం వెళ్లిందని వామపక్ష పార్టీలు గగ్గోలు పెడతాయి కానీ కులం ఊబిలో దేశం కూరుకుపోయిందని చెప్పవు.
అంబేడ్కర్ ఎజెండా లేకుండా ఇండియా కూటమి విజయం అసాధ్యమని మనకి అర్థమవుతుంది. అంబేడ్కర్ చెప్పిన కుల నిర్మూ లనా వాదమే భారత దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా. అంబేడ్కర్ అస్పృశ్యతా నివారణ మీద స్పష్టమైన ఆలోచనలు పొందుపర్చారు. అస్పృశ్యత వల్ల భారతదేశ నాగరికత, సంస్కృతి, శాస్త్రజ్ఞానం కుంటు పడ్డాయి.
అస్పృశ్యులుగా చెప్పబడుతున్న ఉత్పత్తి శక్తులు, శ్రమ జీవులు, మాతృస్వామ్య భావం కలవారిని నిర్లక్ష్యం చేయడమే భారత దేశ దారిద్య్రానికి మూలం. ఈ రోజున మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన మీటింగులు జరుగుతున్నాయి. కానీ నోరు తెరచి ఒక్కళ్ళు కూడా ఆయన మనకు ప్రధానమంత్రి కావాలని అనడం లేదు. ఎందుకు? వారందరి మనసులో కులం ఉంది.
శుభసూచనే కానీ...
ప్రతి ఒక్కరికీ మతం మారే హక్కు ఉండాలన్నారు అంబేడ్కర్. ప్రజలు మతం నుండి బయట పడకుండా తమ బానిసత్వం నుండి విముక్తి కాలేరని చెప్పారు. ‘మీ బానిసత్వాన్ని మీరే రద్దు చేసుకోవాలి. దేవుడో, మరొక సూపర్‌మానో వచ్చి చేస్తాడని వారిపై ఆధారపడకండి. పవిత్ర గ్రంథాలను పూజించడం వల్ల మీరు బానిసత్వం నుంచి, దరిద్రం నుంచి విముక్తం కాలేరు. తరతరాలుగా మీ తాతముత్తాతలు అదే చేస్తూ వస్తున్నారు.
అయినా మీ దుర్భర జీవితంలో లేశమాత్ర మైనా మార్పు రాలేదు. మీ తాత ముత్తాతల్లానే మీరూ పీలికలు ధరిస్తు న్నారు. వారిలాగ విసిరేసిన ఎంగిలి మెతుకులపై ఆధారపడుతు న్నారు. వారిలాగే మీరు మురికివాడల్లోనూ, గుడిసెల్లోనూ జీవిస్తు న్నారు. వారిలాగే తేలికగా రోగాల బారిన పడుతున్నారు. మీ మతపర మైన ఉపవాసాలు, ఆచారాలు, దీక్షలు మిమ్మల్ని ఆకలి నుంచి కాపాడ లేకపోయాయి.
మీకు కూడు, గుడ్డ, గూడు, విద్య, మందులు, జీవికకు అవసరమైన ఉపాధిని కల్పించడం శాసనసభ బాధ్యత. మీ అంగీ కారం, సహాయం, ఇష్టంతో శాసనాలు రూపొందించడం, వాటిని అమలు చేయడం జరగాలి. క్లుప్తంగా చెప్పాలంటే భౌతిక ఆనందాల న్నింటికీ చట్టమే ఆధారం. చట్టాలు చేసే అధికారాన్ని గెలుచుకోండి. కనుక మీ దృష్టిని ఉపవాసాలు, ఆరాధనలు, దీక్షల నుంచి మళ్ళించి, శాసనాలు చేసే అధికారాన్ని దక్కించుకోవడంపై పెట్టండి.
ఈ మార్గంలోనే మీ ముక్తి ఉంది. ఈ మార్గమే మీ ఆకలి సమస్యకు పరిష్కార మిస్తుంది. మీ జనాభా మెజారిటీలో ఉండడం సరిపోదని గ్రహించండి. ఎప్పుడూ అప్రమత్తంగా, బలంగా, విద్యావంతులై, ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే విజయాన్ని సాధించి, దాన్ని నిలబెట్టుకోగలరు’ అన్నది అంబేడ్కర్ బోధనల సారాంశం. కులాధిపత్యాన్ని, మతోన్మా దాన్ని ఖండించి నూతన భారతదేశాన్ని ఆవిష్కరించడానికి తగిన పునాదులు వేశారు అంబేడ్కర్. ఆయనను పరిగణనలోనికి తీసుకో కుండా ఒక రాజకీయ కూటమిని నిర్మించడం అంటే కళ్ళకు గంతలు కట్టుకుని గుంతల్లో నడవడమే.
రాజ్యాంగంలోని 21వ అధికరణ భారతదేశ ప్రజలకు ఊపిరి లాంటిది. ఒక వ్యక్తి జీవించి ఉంటేనేకదా ప్రాథమిక హక్కులను అనుభవించేది. రాజ్యాంగం ప్రసాదించిన ఈ ప్రాథమిక హక్కును హరించివేస్తున్నది కూడా ప్రభుత్వం, పోలీసులు, రక్షణ బలగాలే. రాజ్య హింసకు దర్పణం ఈ అధికరణ. రాజ్య హింస రెండు రకాలు.
ప్రత్యక్ష హింస, పరోక్ష హింస. బూటకపు ఎన్‌కౌంటర్లు, లాకప్ హత్యల లాంటివి ప్రత్యక్ష హత్యలు. రైతుల ఆత్మహత్యలు, అర్ధాకలి మరణాలు, పోషకాహారం లేక శిశువులు, పిల్లల మరణాలు, సరైన వైద్య సదుపాయం లేక గాలిలో కలిసిపోతున్న బడుగు జీవుల ప్రాణాలు, వివిధ రకాల కాలుష్యాల ప్రభావంతో మరణాలు మొదలైనవన్ని పరోక్ష హత్యలు. వీటన్నింటికీ బాధ్యత ప్రభుత్వానిదే కనుక. అందుకే ఇండియా కూటమి జీవించే హక్కుకు భరోసా ఇవ్వాలి.
భారతీయుడైన ప్రతివాడు ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు అంబేడ్కర్. ప్రతి మనిషికి నిర్భ యంతో కూడిన స్వేచ్ఛను అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగద్రొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది.
ఆయన ఆలోచనలను వందకు వంద శాతం ముందుకు తీసుకుని వెళ్లాలి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దించాలని ప్రజాస్వామ్య వాదులు, లౌకికవాదులు అందరూ అనుకుంటున్నారు. ఇది ఇండియా కూటమికి శుభసూచన. కానీ వీళ్ళు అంబేడ్కర్ మార్గంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకోవలసిన చారి త్రక బాధ్యతను కలిగి ఉన్నారు. అప్పుడే అది నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి అవుతుంది.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment