డిజిటల్ పరికరాల్లో వ్యక్తిగత డేటాను భద్రపర్చుకోవడం, వాటి ద్వారా షేర్ చేసుకోవడం, సేకరించడం వంటి ధోరణులు గణనీయంగా పెరిగాయి. దీంతో బడా కార్పొరేట్లు మొదలుకుని సాధారణ వ్యక్తుల వరకూ అందరూ ఆన్‌లైన్ మోసాలు, గుర్తింపు చోరీ, మాల్‌వేల్ బారిన పడే ముప్పులూ పెరుగుతున్నాయి. ఫలితంగా బోలెడంత నష్టపోవాల్సి కూడా వస్తోంది. ఇలాంటి వాటి నుంచి సరైన సాఫ్ట్‌వేర్ కొంత రక్షణ కల్పిస్తుండగా, మరి కొంత భరోసానిచ్చేదే సైబర్ బీమా. 18 ఏళ్లు పైబడిన వారు దీన్ని తీసుకోవచ్చు. ఇండివిడ్యుయల్ సైబర్ పాలసీల కింద కవరేజీ రూ. 1 లక్ష మొదలుకుని రూ. 1 కోటి వరకూ ఉంటోంది. ఈ పాలసీని తీసుకునే ముందు అర్థం చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
- క్యూఆర్ కోడ్ వల్ల జరిగే క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు మోసాలు, మనీ ట్రాన్స్‌ఫర్ స్కాముల సందర్భాల్లోనూ రిటైల్ కస్టమరుకు రక్షణ లభించగలదు. ‘బ్యాంకు ఖాతా, క్రెడిట్..డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాం, ఐడెంటిటీని ధృవీకరించడానికి లింక్‌పై క్లిక్ చేయండి‘ అంటూ మోసపూరిత మెయిల్స్ వస్తుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆర్థిక నష్టం వాటిల్లితే పాలసీ ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చు.
- గుర్తింపు చోరీ కవరేజీ: కంప్యూటర్‌లో భద్రపర్చిన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, చెరిపివేయడం, మార్చేయడం వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీపై కేసు వేస్తే ప్రాసిక్యూషన్‌కు అయ్యే వ్యయాలకు కవరేజీ కల్పిస్తుంది.
- మాల్‌వేర్ కవర్: ఎస్‌ఎంఎస్, ఫైల్ ట్రాన్స్‌ఫర్, లేదా ఇతరత్రా ఇంటర్నెట్ .. డిజిటల్ మాధ్యమాల ద్వారా మీ కంప్యూటర్ లేదా డిజిటల్ డివైజ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్న కంప్యూటర్ ప్రోగ్రాంతో మాల్‌వేర్ వంటిదేమేనా చొరబడి, నష్టం వాటిల్లితే ఇది భర్తీ చేస్తుంది.
- ఫిషింగ్ కవర్: నమ్మకంగా కనిపిస్తూనే .. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డుల వివరాలను (కొన్ని సందర్భాల్లో పరోక్షంగా డబ్బు) చోరీ చేసే యత్నాల వల్ల వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు, ప్రాసిక్యూషన్ ఖర్చులకు ఫిషింగ్ కవరేజీ ఉపయోగపడుతుంది.
- థర్డ్ పార్టీ ద్వారా ప్రైవసీ, డేటా ఉల్లంఘన: మీ వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీ అనధికారికంగా బైటపెట్టినా లేదా థర్డ్ పార్టీ కంప్యూటర్ సిస్టమ్‌లో భద్రపర్చిన మీ వ్యక్తిగత డేటాకు అనధికారికంగా యాక్సెస్ పొందినా లేదా ఉపయోగించినా, తత్ఫలితంగా వాటిల్లే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ కవరేజీ పని చేస్తుంది.
- కౌన్సిలింగ్ సర్వీసులు: పైన పేర్కొన్న ఏ కారణాల వల్లనైనా పాలసీదారు ఒత్తిడి, ఆందోళనకు లోనై అక్రెడిటెడ్ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ వద్ద చికిత్స పొందితే దానికి అయ్యే వ్యయాలను భర్తీ చేసుకోవచ్చు. మాల్‌వేర్ దాడి జరిగిన సందర్భంలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, డేటాను రీస్టోర్ చేసేందుకు అయ్యే ఖర్చులకు సైబర్ బీమా కవరేజీ లభిస్తుంది. పాలసీదారు ఒకవేళ డేటా నష్టానికి థర్డ్ పార్టీ సర్వీస్ / సర్వీస్ ప్రొవైడర్‌పై దావా వేయదల్చుకుంటే అందుకయ్యే లీగల్ ఖర్చులకు కంపెనీ కవరేజీ ఇస్తుంది. వీటికి తోడు, బీమా పాలసీ కింద కౌన్సిలింగ్ సర్వీసులు, సైబర్ దోపిడీ నష్టాలు, కోర్టుకు వెళ్లేందుకయ్యే ఖర్చులు మొదలైనవి కూడా కవర్ అవుతాయి. ఇలా సైబర్ బీమాతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. సైబర్ ప్లాన్ తీసుకోవడంతో పాటు మీ డిజిటల్ జీవితాన్ని భద్రంగా ఉంచుకునేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవడం కూడా కీలకం. ముఖ్యమైన డేటాను బ్యాకప్ తీసుకోండి. సమర్ధమంతమైన యాంటీ–వైరస్ సాఫ్ట్‌వేర్, ఫైర్‌వాల్స్‌పై కొంత ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఆన్‌లైన్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి.
సైబర్ ఎక్స్‌టార్షన్ కవర్:
ప్రైవసీ, డేటా ఉల్లంఘన లేదా సైబర్ దాడి ముప్పులకు దీని ద్వారా కవరేజీ పొందవచ్చు.
ఐటీ కన్సల్టెంట్ సర్వీసులు:
వాటిల్లిన నష్టాన్ని రుజువు చేసేందుకు ఐటీ కన్సల్టెంట్ సహాయం తీసుకుంటే దానికయ్యే వ్యయాలను కూడా బీమా కంపెనీ చెల్లిస్తుంది.
సోషల్ మీడియా కవర్:
బాధిత వ్యక్తికి చెందిన సోషల్ మీడియా ఖాతా నుంచి వారి ఐడెంటిటీని చోరీ చేస్తుంటారు. ఇలాంటి సైబర్ దాడులప్పుడు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ ఖర్చులను పాలసీ భర్తీ చేస్తుంది.
సైబర్ స్టాకింగ్ కవర్:
మిమ్మల్ని వేధించడానికో లేదా భయపెట్టేందుకో డిజిటల్ మాధ్యమం ద్వారా ఎవరైనా పదే పదే వెంటబడుతూ ఉంటే, దాని వల్ల వాటిల్లే నష్టాల భర్తీకి ఈ కవరేజీ ఉపయుక్తంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment