అందరి కోసం.. ఆరోగ్య సంజీవని! | Benefits Arogya Sanjeevani Policy | Sakshi
Sakshi News home page

అందరి కోసం.. ఆరోగ్య సంజీవని!

Published Mon, Jul 27 2020 5:12 AM | Last Updated on Mon, Jul 27 2020 5:17 AM

Benefits Arogya Sanjeevani Policy - Sakshi

ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం అన్నది ఎన్నో జాగ్రత్తలు, పరిశీలనలతో.. కాస్తంత శ్రమతో కూడుకున్నది. పాలసీలో కవరేజీ వేటికి లభిస్తుంది, వేటికి మినహాయింపులు, షరతులు, నియమ నిబంధనలు.. చూడాల్సిన జాబితా పెద్దదే. పైగా అందరికీ ఇవి అర్థమవుతాయని చెప్పలేము. దీంతో బీమా కంపెనీల వందలాది పాలసీల్లో ఏది మెరుగైనది అని తేల్చుకోవడం అంత ఈజీ కాదు.

బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఈ విషయాన్ని అర్థం చేసుకుని.. అన్ని రకాల సాధారణ కవరేజీ సదుపాయాలతో ఒకే ప్రామాణిక పాలసీని ‘ఆరోగ్య సంజీవని’ పేరుతో 2020 ఏప్రిల్‌ నాటికి తీసుకురావాలని బీమా సంస్థలను ఆదేశించింది. దీంతో అన్ని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు ఆరోగ్య సంజీవని పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వైద్య సేవల ఖర్చులు ఏటేటా పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కవరేజీ అవసరం ఎంతో ఉంది. ‘ఆరోగ్య సంజీవని’ అందరికీ అనుకూలమేనా..?  

గరిష్టంగా రూ. 5 లక్షల వరకు హెల్త్‌ కవరేజీని ఆరోగ్య సంజీవని పాలసీ కింద అందించాలన్నది తొలుత ఐఆర్‌డీఏఐ నిర్దేశించిన షరతు. రూ.5లక్షలకు మించి కూడా ఆఫర్‌ చేయవచ్చంటూ ఐఆర్‌డీఏఐ ఇటీవలే సవరణలు తెచ్చింది.  ఈ ప్లాన్‌లో క్లెయిమ్‌ చేసుకోని ప్రతీ సంవత్సరానికి గాను సమ్‌ ఇన్సూర్డ్‌ (బీమా రక్షణ) 5 శాతం పెరుగుతూ వెళుతుంది. గరిష్టంగా 50 శాతం వరకు ఇలా బీమా రక్షణ కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంది.

మోస్తరు ప్రీమియానికే విస్తృతమైన కవరేజీనిచ్చే ఈ ప్లాన్‌ను మొదటిసారి తీసుకునే వారు ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘పరిమిత బడ్జెట్‌ ఉన్న వారికి ఇది మంచి ఎంపికే అవుతుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరం పట్ల అవగాహన పెరుగుతున్నా కానీ, తీసుకుంటున్న వారి సంఖ్య మన దేశంలో ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంటోంది. అర్థం చేసుకునేందుకు సంక్లిష్టతలు, ప్రీమియం భరించలేనంత ఉండడం సగటు గృహస్తుడు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కొనుగోలు చేయకుండా అడ్డుపడుతోంది.

కానీ, ఆరోగ్య సంజీవని పాలసీ సులభంగా, సమంజసమైన ప్రీమియంతో ఉండడం అనుకూలత’’ అని ఫిన్‌ఫిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అనలైటిక్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ప్రబ్లీన్‌ బాజ్‌పాయ్‌ పేర్కొన్నారు. ఆర్జన ఆరంభమై, తనపై ఆధారపడిన వారు లేకుంటే (అవివాహితులు) ఈ ప్లాన్‌ను తప్పకుండా పరిశీలించొచ్చని ఆయన సూచించారు. ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ సమగ్ర కవరేజీ కోరుకునే యువతీయువకులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇతర పాలసీల కంటే ప్రీమియం తక్కువగా ఉండడంతోపాటు రోజువారీ చికిత్సలు సహా కవరేజీ విస్తృతంగా ఉంటుంది’’ అని ఫిన్‌సేఫ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ మృణ్‌ అగర్వాల్‌ తెలిపారు.  ‘‘ఆరోగ్య సంజీవని పాలసీ అన్నది సులభమైన ప్రాథమిక పాలసీ. పైగా చౌక అయినది. కాకపోతే ఇందులో 5 శాతం కోపేమెంట్‌ (ఆస్పత్రి బిల్లులో 5 శాతాన్ని పాలసీదారు భరించడం) షరతు ఉండగా, పూర్తి స్థాయి ఆరోగ్య బీమా ప్లాన్లలో ఇది ఉండదు’’ అని పాలసీఎక్స్‌ డాట్‌కామ్‌ సీఈవో నావల్‌ గోయల్‌ తెలిపారు.

వీటిని చూసి తీసుకుంటే మంచిది..

అనుకూలమేనా..?
రూ.5 లక్షల గరిష్ట కవరేజీకే ప్రస్తుతం అవకాశం ఉంది. కాకపోతే అంతకుమించి ఆఫర్‌ చేయవచ్చని ఐఆర్‌డీఏఐ తాజాగా అనుమతించడం సానుకూలం. పెరిగిపోతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల దృష్ట్యా రూ.5 లక్షల కవరేజీ అందరికీ, అన్ని వయసుల వారికీ, ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో నివసించే వారికి సరిపోకపోవచ్చు. కనుక రూ.5 లక్షలకు మించి కవరేజీ పెంచుకునే అవకాశం ఉంటే ఈ పాలసీని పరిశీలించొచ్చు. పెంచుకునేందుకు అవకాశం లేకపోతే మధ్య వయసు నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఈ పా లసీ అంత అనుకూలం కాదనే చెప్పుకోవాలి.

‘‘అధిక ప్రీమియం చెల్లించే సామర్థ్యం ఉండి, మెట్రోల్లో నివసిస్తున్న వారు అయితే ఆరోగ్య సంజీవని పాలసీ కాకుండా సమగ్ర కవరేజీనిచ్చే ఇతర ప్లాన్లను పరిశీలించొచ్చు’’ అని బాజ్‌పాయ్‌ సూచిం చారు. ‘‘తనపై పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే అధిక కవరేజీ అవసరమవుతుంది. సరిపడా కవరేజీనిచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకోవాలి’’ అని మృణ్‌ అగర్వాల్‌ సూచించారు. ఒకవేళ ఇప్పటికే సమగ్ర కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా ప్లాన్‌ కలిగిన వారు ఆరోగ్య సంజీవనిని పరిశీలించాల్సిన అవసరం లేదు.

ప్రీమియంలో వ్యత్యాసం..: ‘‘ఎన్ని క్లెయిమ్‌లు రావచ్చన్న అంచనా రేషియోల ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. ప్రతీ బీమా సంస్థకు యాక్చుయేరియల్‌ బృందం ఉంటుంది. వారి అంచనాలు వేర్వేరుగా ఉండడం వల్లే ప్రీమియం రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. అలాగే, అన్ని బీమా సంస్థ సేవల నాణ్యత ఒకే విధంగా ఉండదు. ప్రీమియంలో వ్యత్యాసానికి ఇది కూడా ఒక కారణం’’అని నావల్‌ గోయల్‌ వివరించారు.

ఇన్‌కర్డ్‌ క్లెయిమ్‌ రేషియో
ఒక బీమా కంపెనీ ఒక ఏడాదిలో పాలసీల ప్రీమియం రూపేణా ఆర్జించిన ప్రతీ రూ.100 నుంచి ఎంత మొత్తాన్ని క్లెయిమ్‌లకు చెల్లింపులు చేసిందో తెలియజేస్తుంది. ఇన్‌కర్డ్‌ క్లెయిమ్‌ రేషియో ఎక్కువగా ఉంటే అది పాలసీదారులకు ప్రయోజనం. కానీ, ఇది నూరు శాతం మించితే అది బీమా కంపెనీకి నష్టం. ఎందుకంటే ప్రీమియం ఆదాయానికి మించి క్లెయిమ్‌లు వస్తే బీమా సంస్థ నష్టపోవాల్సి వస్తుంది. దాంతో ప్రీమియంలు భారీగా పెంచేయాల్సి వస్తుంది. లేదంటే క్లెయిమ్‌లకు కొర్రీలు వేయాల్సి వస్తుంది. ఈ రేషియో 60 శాతానికి తక్కువ కాకుండా ఉన్న కంపెనీని ఎంచుకోవాలి.

క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో
తనకు వచ్చిన మొత్తం క్లెయిమ్‌ దరఖాస్తులలో ఎన్నింటికి కంపెనీ చెల్లింపులు చేసిందో దీన్ని చూసి తెలుసుకోవచ్చు. ఈ రేషియో 90 శాతానికి పైన ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.

వేగం, సేవలు
క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించే సంస్థ నుంచి పాలసీ తీసుకోవడం సౌకర్యాన్నిస్తుంది. అలాగే, కస్టమర్‌ సేవలు మెరుగ్గా ఉండే కంపెనీని ఎంచుకోవాలి.

నెట్‌వర్క్‌ ఆస్పత్రులు
బీమా కంపెనీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితాలో మీరు నివసించే ప్రాంతాలకు సమీపంలోని ఆస్పత్రులు ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల నగదు రహిత సేవలను ఆయా ఆస్పత్రుల్లో పొందొచ్చు.  

ప్రీ, పోస్ట్‌ హాస్పిటలైజేషన్‌
అనారోగ్యానికి సంబంధించి ఆస్పత్రి లో చేరడానికి ముందు వ్యాధి నిర్ధారణ తదితర ఖర్చులు ఎదురవుతాయి. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన తర్వాత కూడా కొంత కాలం పాటు ఖర్చులు ఎదురవుతాయి. కనుక ప్రీ, పోస్ట్‌ హాస్పిటలైజేషన్‌ కింద ఎక్కువ రోజులకు కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాలి.

రూమ్‌ రెంట్‌  
ఆస్పత్రిలో చేరిన తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు లేదా షేరింగ్‌ రూమ్‌కు లేదా ప్రైవేటు రూమ్‌కు షిఫ్ట్‌ చేస్తుంటారు. ఏ రూమ్‌ అయినా సరే అన్న నిబంధన ఉండే పాలసీని ఎంచుకోవాలి. అలా కాకుండా పాలసీలో రూమ్‌ రెంట్‌ పరిమితి ఉంటే.. అంతకుమించిన చార్జీలతో కూడిన రూమ్‌ తీసుకుంటే.. ఆయా ఖరీదైన స్టేయింగ్‌ వద్ద చేసే వైద్య ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో బీమా కంపెనీ పూర్తి స్థాయి చార్జీలను చెల్లించదు.  

సబ్‌ లిమిట్స్‌
కొన్ని రోజువారీ చికిత్సలు, కొన్ని రకాల వ్యాధులకు సంబంధిం చి ఇంతే పరిహారం చెల్లిస్తామనే నిబంధనలు ఉంటాయి. వాటి ని కూడా పరిశీలించి సమ్మతం అనుకుంటేనే ముందుకు వెళ్లాలి.  

రీస్టోరేషన్‌ సదుపాయం
ఉదాహరణకు రూ.5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకున్నారనుకోండి. ఒక ఏడాదిలో ఎవరైనా ఆస్పత్రి పాలై బిల్లు రూ.5 లక్షలకు మించితే అప్పుడు మరో రూ.5 లక్షలు ఆటోమేటిక్‌గా కవర్‌ను బీమా సంస్థ విడుదల చేస్తుంది. ఇదే రీస్టోరేషన్‌ బెనిఫిట్‌. ఒకరికి మించి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చి బిల్లు సమ్‌ ఇన్సూర్డ్‌ మొత్తం దాటిపోయిన సందర్భాల్లోనూ ఇది ఆదుకుంటుంది. అయితే ఈ రీస్టోరేషన్‌ బెనిఫిట్‌ను ఒక ఏడాదిలో అప్పటికే చికిత్స పొందిన సమస్య కోసం చాలా బీమా సంస్థలు అందించడం లేదు. అంటే పాలసీదారు వేరొక సమస్య కోసం రీస్టోరేషన్‌ను పొందొచ్చు. ఏ సమ స్య అయిన రీస్టోరేషన్‌ను అనుమతించే పాలసీ మంచి ఎంపిక.  

కోపే ఆప్షన్‌
ఆస్పత్రి బిల్లులో పాలసీదారు ఎంత పెట్టుకోవాలన్నది ఇందులో ఉంటుంది. కొన్ని పాలసీల్లో కోపే షరతు ఉంటోంది. ఇలా ఉన్న పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది.

సూపర్‌ టాపప్‌..: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని పెంచుకునేందుకు సూపర్‌ టాపప్‌ లేదా టాపప్‌ పేరుతో ఉండే ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని నిపుణుల సూచన. బేసిక్‌ హెల్త్‌ కవరేజీకి యాడాన్‌గా (జోడింపుగా) ఈ ప్లాన్‌ తక్కువ ప్రీమియానికే లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement