
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగంలోని (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలకు కేంద్రం నుంచి అదనపు మూలధనం లభించకపోవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ అవసరాలకు తగినన్ని నిధులు ఆయా సంస్థల దగ్గర ఉండవచ్చని, ఈసారి ఒక కంపెనీ నుంచి కేంద్రానికి డివిడెండ్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.
మూడు పీఎస్‌యూ బీమా సంస్థలు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం గతేడాది రూ. 5,000 కోట్ల మేర మూలధనం సమకూర్చింది. అయితే, 2023–24 బడ్జెట్‌లో మాత్రం బీమా కంపెనీలకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం బీమా సంస్థలు తాము చెల్లించాల్సి వచ్చే క్లెయిమ్ మొత్తాలకన్నా కొంత ఎక్కువగా మూలధన నిల్వలను ఉంచుకోవాలి.
ఒకవేళ తీవ్రమైన పరిస్థితులేమైనా తలెత్తితే అన్ని క్లెయిమ్‌లను చెల్లించగలిగేందుకు (సాల్వెన్సీ మార్జిన్) ఈ నిధులు ఉపయోగపడతాయి. ప్రస్తుతం దేశీయంగా నాలుగు పీఎస్‌యూ బీమా సంస్థలు ఉండగా.. వాటిలో న్యూ ఇండియా అష్యూరెన్స్ మాత్రమే మెరుగ్గా రాణిస్తోంది. 2024 మార్చి నాటికి మూడు పీఎస్‌యూ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు రూ. 17,200–17,500 కోట్ల మేర నిధులు అవసరమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2020–21లో మూడు పీఎస్‌యూ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం రూ. 9,950 కోట్లు కేటాయించింది.