మీకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందా? బ్లాక్‌ లిస్ట్‌ హాస్పిటల్స్‌ గురించి తెలుసా? | Must know about health plan details | Sakshi
Sakshi News home page

మీకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందా? మొదటి 30 రోజుల్లో బీమా వర్తించేది దేనికో తెలుసా?

Published Mon, May 1 2023 10:33 AM | Last Updated on Mon, May 1 2023 8:59 PM

Must know about health plan details - Sakshi

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పట్ల అవగాహన పెరుగుతోంది. ఒకవైపు జీవనశైలి వ్యాధులతో అస్పత్రుల్లో చేరాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మధ్యతరగతి వాసులకు ఆరోగ్యపరమైన సామాజిక రక్షణ ఏదీ ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండాలంటే, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఉండాల్సిందే. కరోనా ముందు నాటితో పోలిస్తే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రాధాన్యాన్ని ఎక్కువ మంది నేడు అర్థం చేసుకుంటున్నారు.

దీంతో దీన్ని కొనుగోలు చేసే వారి సంఖ్యలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. అయితే ఎవరో చెప్పారనో, ఏదైనా ప్రకటన చూసో హెల్త్‌ ప్లాన్‌ తీసుకోవడం కాదు. ఎంపిక చేసుకునే ప్లాన్‌లో రక్షణ ఏ మేరకు? ఏ ఏ వ్యాధులకు కవరేజీ ఉంది? ఉప పరిమితులు ఉన్నాయా? పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్‌ చేసుకోవచ్చా? ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలకు కవరేజీ లభిస్తుందా? ఇలాంటి ముఖ్యమైన అన్నింటి గురించి పాలసీదారులు తెలుసుకుని ఉండాల్సిందే. లేదంటే క్లెయిమ్‌ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చికిత్సకు అయిన బిల్లు మొత్తంలో కోతపడుతుంది. పాలసీదారుడు తనవంతు చెల్లించాల్సి వచ్చినప్పుడు విచారిస్తే వచ్చేదేమీ ఉండదు. ఇటువంటి కీలక అంశాలను వివరించే కథనమిది...  

మన దేశంలో ఎక్కువ మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను పన్ను ఆదా కోణంలో తీసుకుంటూ ఉంటారు. పాలసీదారులకు సాధారణంగా కొన్ని ఫీచర్లపై అవగాహన ఉంటుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని జీవితాంతం రెన్యువల్‌ చేసుకోవచ్చు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో మేటర్నిటీ ప్రయోజనాలు ఉంటాయి. నో క్లెయిమ్‌ బోనస్‌ ఉంటుందనే విషయాలపై సాధారణంగా అవగాహన ఉంటుంది. కానీ, ఎక్కువ మందికి తెలియని విషయం బ్లాక్‌ లిస్టెడ్‌ హాస్పిటల్స్‌ గురించి. మీరు కొనుగోలు చేయబోయే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఎక్కువ ఆస్పత్రుల్లో చికిత్సలకు కవరేజీ ఇచ్చే విధంగా ఉండాలి.

ఇంటి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందినా కవరేజీ వస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ, ఇంటి సమీపంలోని హాస్పిటల్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంటే, అందులో నగదు రహిత చికిత్స కాదు కదా, ముందే డబ్బులు చెల్లించి తీసుకున్న చికిత్సకు సైతం రీయింబర్స్‌మెంట్‌ రాదు. ఎందుకంటే సదరు ఆస్పత్రిని బీమా సంస్థ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడం వల్లేనని తెలుసుకోవాలి. అందుకనే హెల్త్‌ పాలసీ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ముందుగా బ్లాక్‌ లిస్టెడ్‌ హాస్పిటల్స్‌ జాబితా చూడాలి. అలాగే, మీరు నివాసం ఉండే ప్రాంతంలో నగదు రహిత చికిత్సలను అనుమతి ఉన్న ఎన్ని ఆస్పత్రులు బీమా సంస్థ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ జాబితాలో ఉన్నదీ చూడాలి.  

కొన్ని చిన్న ఆస్పత్రులు లేదా వ్యక్తులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. మోసపూరిత క్లెయిమ్‌లు చేస్తుంటారు. అందుకని అన్ని బీమా సంస్థల పరిధిలో సొంతంగా ఓ ఇన్వెస్టిగేషన్‌ డెస్క్‌ ఉంటుంది. ఏదైనా ఒక ఆస్పత్రి నుంచి క్లెయిమ్‌లు భారీగా వస్తుంటే అప్పుడు సదరు ఆస్పత్రిపై ఓ కన్నేసి ఉంచాలని బీమా సంస్థ తన ఇన్వెస్టిగేషన్‌ డెస్క్‌ను కోరుతుంది. అప్పు డు సంబంధిత విభాగం క్లెయిమ్‌లు ఎక్కువగా వస్తున్న లేదా అనుమానాస్పద క్లెయిమ్‌లు ఎక్కువగా వస్తున్న ఆస్పత్రికి వెళ్లి విచారణ నిర్వహిస్తుంది. తమ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా బీమా సంస్థ తదుప రి చర్యలు తీసుకుంటుంది. క్లెయిమ్‌ల విషయంలో చట్టవిరుద్ధమైన చర్యలు లేదా నిబంధనలకు వ్యతిరేకంగా, మోసపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తేలితే ఆయా ఆస్పత్రిని నిషేధిత జాబితాలోకి మారుస్తుంది. ఇలా బీమా సంస్థలు తాము నిషేధించిన, బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన హాస్పిటల్స్‌ వివరాలను పాలసీదారులతో ఎప్పటికప్పుడు పంచుకుంటాయి.  

వెయిటింగ్ పీరియడ్:
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్న వెంటనే ఏ సమస్య వచ్చినా క్లెయిమ్‌ చేసుకుంటామంటే నిబంధనలు అంగీకరించవు. కొన్ని రకాల వ్యాధులకు వెయిటింగ్‌ పీరియడ్‌ వేర్వేరుగా ఉంటుంది. ఈ వివరాలు పాలసీ డాక్యుమెంట్‌లో వివరంగా ఉంటాయి. ఉదాహరణకు మెటర్నిటీ (ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరడం) కవరేజీ అనేది చాలా పాలసీల్లో ఉన్నా, మొదటి రోజు నుంచే కవరేజీ వస్తుందనుకోవద్దు. ఇందుకోసం కనీసం 12 నెలలు అంతకుమించి వేచి ఉండే కాలం నిబంధన ఉంటుంది. ఆ తర్వాతే మెటర్నిటీ కవరేజీ క్లెయిమ్‌ చేసుకోగలరు. మరికొన్ని రకాల వ్యాధులకు 24 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌ అమల్లో ఉంటుంది.

పాలసీ తీసుకునే నాటికే వ్యాధులు కలిగి ఉంటే, వాటిని పాలసీ ప్రపోజల్‌లో వెల్లడించి ఉంటే, కవరేజీ పొందేందుకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) సేవలకు అన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. ఇది యాడాన్‌ కవరేజీగా వస్తుంది. హాస్పిటల్‌లో కనీసం 24 గంటల పాటు చేరి చికిత్స తీసుకుంటేనే ఇండెమ్నిటీ ప్లాన్‌లో క్లెయిమ్‌ చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. డే కేర్‌ చికిత్సల కోసం అయితే ఆస్పత్రిలో ఇన్ని గంటల పాటు చేరాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకునే వాటికి కనీసం 24 గంటల నిబంధన అమలవుతుంది. కనుక పాలసీదారులు మొదట బ్లాక్‌ లిస్ట్‌ హాస్పిటళ్లు, తర్వాత ఏ వ్యాధికి కవరేజీ కోసం ఎంత కాలం పాటు వేచి ఉండాలి, క్లెయిమ్‌ కోసం ఎంత సమయం పాటు ఆస్పత్రిలో చేరాలనే విషయాలను తెలుసుకోవాలి.  

ఫీచర్లపై అవగాహన అవసరం:
బీమా సంస్థ ఏదైనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో సాధారణ నిబంధనలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ, ఒక్కో బీమా సంస్థ తమ ఉత్పత్తిని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని అదనపు ఫీచర్లు, కవరేజీలను పాలసీల్లో భాగం చేస్తుంటాయి. ఉదాహరణకు రీస్టోరేషన్‌ ఫీచర్‌. దీన్ని చాలా సంస్థలు అందిస్తున్నాయి. ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా మొత్తం ఖర్చయిపోయిందని అనుకోండి. అప్పుడు అదే ఏడాది మరో వ్యక్తి లేదా అదే వ్యక్తి మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సి వస్తే? అలాంటి సందర్భాల్లో ఆదుకునేదే రిస్టోరేషన్‌ ఫీచర్‌.

ఏదైనా క్లెయిమ్‌ కారణంగా బీమా కవరేజీ ఖర్చయిన సందర్భాల్లో బీమా సంస్థలు తిరిగి అంతే మొత్తాన్ని రీసోర్టేషన్‌ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే ఏడాది మరోసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు అది ఆదుకుంటుంది. కొన్ని బీమా సంస్థలు అయితే ఒక ఏడాదిలో ఎన్నిసార్లు ఇలా క్లెయిమ్‌లు వచ్చినా, అన్ని సార్లు రీస్టోరేషన్‌ ఫీచర్‌ను అందిస్తున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరి పూర్తి బీమా కవరేజీని క్లెయిమ్‌ పొందాడనుకుందాం. అప్పుడు అదే వ్యక్తి అదే వ్యాధితో హాస్పిటల్‌లో చేరితే రీస్టోరేషన్‌ కవరేజీని చాలా ప్లాన్లు ఇవ్వడం లేదు. కొన్ని మాత్రం ఒక వ్యక్తి ఒక వ్యాధి కారణంగా ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందినా లేక మరో సమస్యతో చేరాల్సి వచ్చినా రీస్టోరేషన్‌ కింద కవరేజీని పునరుద్ధరిస్తున్నాయి. కనుక ఈ ఫీచర్‌ గురించి వివరంగా తెలుసుకున్న తర్వాతే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి.  

తప్పక తెలిసి ఉండాలి:
ముందు నుంచి ఉన్న వ్యాధులు: అధిక రక్తపోటు, కేన్సర్, మధుమేహం, ఆస్తమా, డిప్రెషన్, స్లీప్‌ ఆప్నియా, గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు (సీవోపీడీ), స్థూలకాయం, లూపస్, అధెరోస్కెలరోసిస్, థైరాయిడ్‌ తదితర ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు. పాలసీ కొనుగోలు చేసే నాటికి నాలుగేళ్ల ముందు వైద్యులు నిర్ధారించి, చికిత్స తీసుకున్నవి ముందస్తు వ్యాధుల జాబితాలోకి వస్తాయి. ముందస్తు వ్యాధుల సమాచారం కావాలని వెల్లడించకపోతే.. తర్వాత క్లెయిమ్‌ సమయంలో బీమా సంస్థ దీన్ని గుర్తిస్తే పరిహారాన్ని నిరాకరిస్తుంది. పాలసీ తీసుకుని ఎనిమిదేళ్లు ముగిసిన తర్వాత క్లెయిమ్‌ వస్తే అది ముందుగా వెల్లడించని వ్యాధి అయినా సరే తిరస్కరించడం కుదరదు. కనుక పాలసీ దరఖాస్తులో అంతకుముందుగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా, చికిత్స తీసుకున్నా ఆ వివరాలను తప్పకుండా వెల్లడించడం మంచిది. 

30 రోజుల వెయిటింగ్‌: పాలసీ విడుదల చేసిన తేదీ నుంచి మొదటి 30 రోజుల్లో ప్రమాదం లేదా ప్రమాదం కారణంగా తలెత్తే సమస్యలకే క్లెయిమ్‌ చేసుకోవచ్చు మరే విధమైన చికిత్సకూ క్లెయిమ్‌ను బీమా సంస్థలు అనుమతించవు.   

స్పెసిఫిక్‌ వెయిటింగ్‌: ముందు నుంచి ఉన్న వ్యాధులు కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత 24 నెలల వరకు క్లెయిమ్‌ చేసుకోలేని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిజం, జాయింట్‌ రీప్లేస్‌మెంట్, ఆర్థోస్కోపిక్‌ మోకాలు సర్జరీ, చెవి, ముక్కు, గొంతు సమస్యలు లేదా సర్జరీలు (సైనసైటిస్, అడెనాయిడ్స్‌), ప్రొస్టేటిక్‌ హైపర్‌ట్రోఫీ, క్యాటరాక్ట్, ఫిస్టులా, హెమరాయిడ్స్, గ్యాస్టిక్‌ డుయోడినల్‌ అల్సర్లు, అన్ని రకాల హెర్నియా, హిస్టరెక్టమీ, ఫైబ్రోమయోమా, ట్యూమర్లు, కిడ్నీలో రాళ్లు, యూరెటెరిక్‌ స్టోన్స్, గ్లాల్‌ బ్లాడర్‌లో రాళ్లు,  వారికోస్‌ వెయిన్స్, పార్కిసన్స్‌/అల్జీమర్స్‌/డిమెన్షియా తదితర వాటితో బీమా కంపెనీ డాక్యుమెంట్‌లో 24 నెలల వెయిటింగ్‌ జాబితా ఉంటుంది. వీటికి రెండేళ్ల తర్వాతే క్లెయిమ్‌ వస్తుంది.  

శాశ్వత మినహాయింపులు: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంది కదా, దేనికైనా పరిహారం వస్తుందిలేనని అనుకోవద్దు. కొన్నింటికి శాశ్వతంగా క్లెయిమ్‌ రాదు. వీటి జాబితా బీమా నియమ, నిబంధనల డాక్యుమెంట్‌లో ఉంటుంది. ఏదైనా వ్యాధి నిర్ధారణ కోసం ఆస్పత్రిలో చేరితే క్లెయిమ్‌ రాదు. వైద్యుల సిఫారసు లేకుండా బరువు తగ్గేందుకు సొంతంగా తీసుకునే చికిత్సలు, లింగమార్పిడి చికిత్సలు, కాస్మెటిక్‌ లేదా ప్లాస్టిక్‌ సర్జరీలకు (ప్రమాదం కారణంగా చేసుకోవాల్సిన వాటికి మినహాయింపు) క్లెయిమ్‌ రాదు.  

మెటర్నిటీ వెయిటింగ్‌: సాధారణంగా మెటర్నిటీ కవరేజీ కోసం బీమా సంస్థలు ఏడాది నుంచి మూడేళ్ల పాటు వేచి చూడాలనే నిబంధన అమలు చేస్తున్నాయి.  

వెయిటింగ్‌ను తగ్గించుకోవచ్చా..? 
వేచి ఉండే కాలాన్ని తగ్గించుకునేందుకు చాలా బీమా సంస్థలు ప్రత్యేక రైడర్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకు అదనపు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ముందస్తు వ్యాధులకు కవరేజీని 2 ఏళ్లకు తగ్గిస్తున్నాయి. పాలసీ తీసుకున్న నాటి నుంచే ముందస్తు వ్యాధులకూ కవరేజీనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌లో దాదాపుగా వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండడం లేదు. వేచి ఉండే కాలంలో కొత్తగా నిర్ధారణయ్యే వ్యాధులను ముందు నుంచి ఉన్నవిగా పరిగణించరు.

సమీప బంధువులకు షేర్ చేయాలి:
ఆస్పత్రిలో చేరిన వెంటనే బీమా సదుపాయం ఉందా? అని అక్కడ సిబ్బంది ప్రశ్నించడం వినే ఉంటారు. తమకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందని చెబితే, అందులో చికిత్స వ్యయాలకు ఎంత మేర కవరేజీ వస్తుంది? రాదనే విషయాలను వారు చెబుతారు. ముందుగా నిర్ణయించుకుని తీసుకునే చికిత్సల విషయంలో కవరేజీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే డిశ్చార్జ్‌ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే సాధారణంగా పాలసీదారులు చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఆస్పత్రిలో చేరగా, వారి సంబంధీకులు బీమా తదితర వ్యవహారాలు చూస్తుంటారు.

వారికి కవరేజీ విషయమై అవగాహన ఉండదు. అందుకని పాలసీదారులు తమ బీమా క్లెయిమ్‌కు సంబంధించి తమ కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు కొన్ని ఫీచర్లు, ముఖ్యమైన అంశాల గురించి తప్పకుండా చెప్పాలి. అందులో ముఖ్యమైనది రూమ్‌రెంట్‌ కవరేజీ. రూమ్‌ రెంట్‌కు ఎలాంటి పరిమితులు లేనట్టయితే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ షేర్డ్‌ రూమ్, సింగిల్‌ రూమ్‌ అని నిబంధన ఉంటే మిమ్మల్ని ఆస్పత్రిలో ఆయా వసతుల్లోనే చేర్చాలని సూచించాలి. పాలసీలో చెప్పినదానికంటే ఖరీదైన వసతి తీసుకుంటే బిల్లు ఎక్కువ వస్తుంది. దాంతో ఆ మేరకు బీమా సంస్థ క్లెయిమ్‌ మొత్తాన్ని తగ్గిస్తుంది.

అప్పుడు మిగిలినది పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ముందు నుంచి వ్యాధులు ఉండి, వాటిని పాలసీ దరఖాస్తులో వెల్లడించి ఉంటే వాటి గురించి వివరంగా చెప్పాలి. లేదంటే లిఖితపూర్వకంగా ఈ విషయాలను ఒక పేపర్‌పై రాసి ఇవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. హాస్పిటల్‌ క్యాష్‌ ఫీచర్‌ ఉంటే అది కూడా తప్పకుండా చెప్పాలి. హాస్పిటల్‌ క్యాష్‌ అనేది.. చికిత్స కోసం ఆసుపత్రిలో పాలసీదారు చేరినప్పుడు, వారికి సహాయంగా ఉండే వారికి రోజువారీ చెల్లింపులు చేస్తుంది. ఇది రోజువారీ రూ.500 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది. రీస్టోరేషన్‌ గురించి కూడా చెప్పాలి. హాస్పిటల్‌ క్యాష్‌ బెనిఫిట్‌ అనేది కొన్ని ప్లాన్లలో ఇన్‌బిల్ట్‌గా ఉంటే, కొన్నింటిలో యాడాన్‌ కవర్‌గా వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement