న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ, 2023 భారత్‌ను సమగ్ర ఆరోగ్య సంరక్షణ వనరుల కేంద్రంగా మారుస్తుందని పరిశ్రమ భావిస్తోంది. భారత్ అవసరాలు తీర్చడమే కాకుండా ప్రపంచానికి కావాల్సిన వనరులను అందించే స్థాయికి ఎదుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ప్రస్తుతం మన దేశ వైద్య అవసరాలకు కావాల్సిన పరికరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేశీయంగా వీటి తయారిని ప్రోత్సహించేందుకు, ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లుగా ఉన్న పరిశ్రమను 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో బుధవారం కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చింది.
సమగ్ర విధానం..
అసోచామ్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. వివిధ రకాల లైసెన్స్‌ల జారీకి సింగిల్ విండో, స్థిరమైన ధరల నిబంధనలు, తయారీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ పరంగా పురోగతి సాధించడం నూతన విధాన లక్ష్యాలుగా ఉన్నట్టు చెప్పారు.
భారత్ ఇప్పటికే ప్రపంచానికి ఫార్మసీ కేంద్రంగా ఉండగా, వైద్య ఉపకరణాల విషయంలోనూ సమ ప్రాధాన్యం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘‘నూతన పాలసీని విస్తృతమైన సంప్రదింపుల తర్వాత తీసుకొచ్చారు. మన దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా భారత్‌ను మార్చాలనే లక్ష్యం ఇందులో ఉంది’’అని అజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఆర్‌అండ్‌డీకి ప్రోత్సాహం
‘‘పరిశోధన అభివృద్ధిపై (ఆర్‌అండ్‌డీ)పై దృష్టి పెట్టడం ప్రోత్సాహనీయం. ప్రపంచ వైద్య ఉపకరణాల మార్కెట్‌లో భారత్ కేవలం 1.5 శాతం వాటా కలిగి ఉండగా, మెడికల్ టెక్నాలజీ ఆర్‌అండ్‌డీలో 8 శాతం వాటా మన దేశం సొంతం’’అని మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ పవన్ చౌదరీ పేర్కొన్నారు.
ఆరోగ్య రంగ నిపుణులకు నైపుణ్యాలు, అదనపు నైపుణ్యాలపై శిక్షణ ద్వారా రోగుల సంరక్షణ అవసరాలు తీర్చడంతోపాటు, మానవ వనరుల ఎగుమతులకు తోడ్పడుతుందన్నారు. మారుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా వైద్య ఉపకరణాల రంగంలో వృద్ధిని వేగవంతం చేయడాన్ని ప్రభుత్వ నూతన విధానం లక్ష్యంగా చేసుకున్నట్టు పీహెచ్‌డీసీసీఐ మెడికల్ డివైజ్ కమిటీ సహ చైర్మన్ భార్గవ్ కొటాడియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment