
అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రముఖ కుబేరులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఇండియాను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోమారు (మూడేళ్ళలో మూడోసారి) భారత్ పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్ ఖాతాలో వెల్లడించారు.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.
వ్యాధి నిర్మూలనలు
పోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలను బిల్ గేట్స్ ప్రస్తావించారు. పోలియోను నిర్మూలించడంలో ఇండియా సాధించిన విజయాన్ని గేట్స్ ప్రశంసించారు. 2011లో దేశం చివరి పోలియో కేసు నమోదైందని అన్నారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న అవహాన్ వంటి కార్యక్రమాలను సైతం కొనియాడారు.
నేడు క్షయవ్యాధి (TB)పై భారత్ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధరణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. భారతదేశం క్షయవ్యాధి (TB) నిర్మూలనలో ముందంజలో ఉందని గేట్స్ అన్నారు.
డిజిటల్ విప్లవం
బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వ సేవలకు మెరుగైన ప్రాప్యతను అందించిన ఆధార్ మరియు డిజిటల్ చెల్లింపులతో సహా భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను (DPI) గేట్స్ గుర్తు చేశారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ముందస్తు వ్యాధి గుర్తింపును మెరుగుపరచడానికి, గర్భధారణ సంరక్షణను ఆప్టిమైజ్ చేయడానికి, రోగి డేటాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి భారతదేశం ఏఐ బేస్డ్ డీపీఐ సాధనాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయంలో కూడా ఏఐ వాడకం ప్రశంసనీయమని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటో
భారతదేశ పురోగతి దాని సరిహద్దులను దాటి విస్తరించిందని గేట్స్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా భారతదేశం G20 అధ్యక్ష పదవి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం యొక్క ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత.. టీకా తయారీ నుంచి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్ వరకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిష్కారాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చిన తరువాత.. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో, శాస్త్రవేత్తలు చర్చలు.. సమావేశాలు జరిపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment