ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..! | Investments under section 80C to save tax | Sakshi
Sakshi News home page

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

Published Mon, Jul 22 2019 5:52 AM | Last Updated on Mon, Jul 22 2019 5:55 AM

Investments under section 80C to save tax - Sakshi

కొన్ని ఆప్షన్లు కంపెనీలకే కాదు... వినియోగదారులకూ మేలు చేస్తాయి. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అనేది, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా కవరేజీ దానంతట అదే పెరుగుతూ వెళితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి. అలాగే, సెక్షన్‌  80సీ కింద పన్ను రాయితీలు కూడా. సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారి ఆర్థిక జీవితం మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో వారి పెట్టుబడులపై కంపెనీలకు రాబడులు వస్తాయి.  ఇటు వ్యక్తిగతంగా లాభాలను చేకూర్చుతూనే మరోవైపు ఆర్థికవ్యవస్థకూ ప్రయోజనం చేసే పథకాల గురించిన చర్చే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం...

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారిలో చాలా మంది తమ పెరుగుతున్న ఆదాయానికి తగినట్టు పెట్టుబడులను పెంచుకోరు. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) స్టెప్‌ అప్‌ లేదా టాపప్‌ సిప్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. అంటే ప్రతి నెలా చేస్తున్న సిప్‌ మొత్తం, నిర్ణీత కాలానికి ఓ సారి (వార్షికంగా లేదా మీరు నిర్ణయించిన దాని ప్రకారం) నిర్ణీత శాతం పెరుగుతూ ఉంటుంది. దీంతో, ఇన్వెస్టర్లు స్వయంగా సిప్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క టాపప్‌ సిప్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే చాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థే ఆ పని చేసేస్తుంది.
   
ఇక బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో రాబడులు తక్కువేనన్న విషయం తెలిసిందే. సేవింగ్స్‌ ఖాతాలో మిగులు నిధులను, లిక్విడ్‌ ఫండ్స్‌లోకి సులభంగా బదలాయించుకోవడం ద్వారా అధిక రాబడులు పొందే అవకాశాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కల్పిస్తున్నాయి. ఫలితంగా లిక్విడ్‌ ఫండ్స్‌లోకి నిధుల రాక పెరిగింది. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ సంస్థ ‘యాక్టివ్‌ అకౌంట్‌ యాప్‌’ను ఆఫర్‌ చేస్తోంది. ఈ యాప్‌ను  ఇన్‌స్టాల్‌ చేసుకుని, తమ వివరాలను ఇవ్వడం ద్వారా అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్క సింగిల్‌ క్లిక్‌తోనే ఈ యాప్‌ సాయంతో బ్యాంకు సేవింగ్స్‌ ఖాతా బ్యాలెన్స్‌ను లిక్విడ్‌ ఫండ్‌లోకి  పంపుకోవచ్చు.
   
మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, పెట్టుబడుల కేటాయింపు విషయంలో వారికి సమస్య ఎదురవుతుంది. ఈక్విటీల్లో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి, డెట్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలన్నది వారి సందేహం. ఇన్వెస్టర్ల తరఫున ఈ బాధ్యతను తీసుకుని ఇన్వెస్ట్‌ చేసేవే బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌. ‘‘ఈక్విటీల విలువ (వ్యాల్యూషన్స్‌) పెరిగింద నుకోండి, ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించి, డెట్‌ విభాగంలో పెట్టుబడులు పెంచడం ఈ పథకాల్లో జరుగుతుంది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు బాగా దిద్దుబాటుకు గురై, స్టాక్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయనుకోండి, అప్పుడు డెట్‌ విభాగంలో పెట్టుబడులు తగ్గించి, ఈక్విటీల్లో పెంచడం జరుగుతుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు అస్థిరతంగా మారినా, డెట్‌ విభాగంలోని పెట్టుబడుల వల్ల ఆ ప్రభావం తగ్గించడం జరుగుతుంది’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఐవో, ఈడీ ఎస్‌.నరేష్‌  తెలిపారు.

స్వీప్‌ అకౌంట్లు
ఇప్పుడు చాలా బ్యాంకులు స్వీప్‌ అకౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ రూ.10,000–25,000 మధ్య ఉంటుంది. ఇది బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉండొ చ్చు. నిర్ణీత బ్యాలెన్స్‌కు మించి అదనంగా ఉన్న బ్యాలెన్స్‌ను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా బ్యాంకు మారుస్తుంది. ఇదంతా ఆటోమేటిగ్గా జరిగిపోతుంటుంది. సేవింగ్స్‌ ఖాతాల్లో బ్యాలెన్స్‌పై వార్షికంగా 3.5 శాతం వడ్డీనే గిడుతుందని తెలిసిందే. అదే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మార్చడం వల్ల అధిక వడ్డీ రేటు పొందే అవకాశం లభిస్తుంది. కస్టమర్‌ బ్యాంకుకు వెళ్లి తన సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాను స్వీప్‌ అకౌంట్‌గా మార్చుకుంటే సరిపోతుంది.

బీమా డిజైనర్‌ పాలసీలు
వ్యక్తి వయసును బట్టి వివిధ దశల్లో బీమా కవరేజీ అవసరాలు మారిపోతుంటాయి. యువతీ, యువకులు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతలు అధికమవుతాయి. అలాగే, వారికి పిల్లలు జన్మించిన తర్వాత బాధ్యతలు ఇంకాస్త పెరుగుతాయి. అందుకనే బీమా సంస్థలు వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజైన్‌  చేసిన పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి. టర్మ్‌ ప్లాన్‌ లలో సమ్‌ అష్యూరెన్స్‌ నిర్ణీత కాలానికి (ఐదేళ్లు) ఒకసారి ఆటోమేటిగ్గా పెరిగిపోతుంది.  సాధారణ టర్మ్‌ ప్లాన్‌ తీసుకుని, తమ అవసరాలకు అనుగుణంగా మళ్లీ అదనపు టర్మ్‌ ప్లాన్‌  తీసుకోవడం, అందుకోసం వైద్య పరీక్షలు తరహా ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయడం కంటే బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు ఈ తరహా పాలసీలు అనుకూలంగా ఉంటాయి. విడిగా టర్మ్‌ ప్లాన్‌  తీసుకోవడంతో పోలిస్తే, ఇలా ఉన్న ప్లాన్స్‌లోనే ఆటోమేటిగ్గా కవరేజీ పెరగడం వల్ల చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉండడం మరో సానుకూలత.

పన్ను రాయితీలు..
ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదాయపన్ను రాయితీలు కూడా... వ్యక్తులు తమ ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపరిచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలుగానే చూడాల్సి ఉంటుంది. రాయితీల కోసమైనా వ్యక్తులు జీవిత బీమా, రిటైర్మెంట్‌ ప్లాన్లు, ఇతర పెట్టుబడి సాధనాల వంటి వాటిపైపు దృష్టి సారిస్తారని అంచనా. ఆర్థిక సంవత్సరం చివర్లో సెక్షన్‌  80సీ కింద పన్ను ప్రయోజనాలకు అర్హమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వేతన జీవులు పరుగులు పెట్టడం ఇదే తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఈటీఎఫ్‌ (సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌)లో పెట్టుబడులకూ ఇకపై సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రకటించడం మరొకటి. ఇక విశ్రాంత జీవన అవసరాలను ముందుగానే గుర్తించి, రిటైర్మెంట్‌ పథకమైన ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయించేందుకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. సెక్షన్‌  80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయ రాయితీకి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50వేల పెట్టుబడికి సెక్షన్‌  80సీసీడీ 1బీ కింద పూర్తి పన్ను ప్రోత్సాహకాలు ఉన్నాయి. తాజా బడ్జెట్‌లోనూ ఎన్‌పీఎస్‌ పథకానికి సంబంధించి రాయితీలను కల్పించారు.

లైఫ్‌సైకిల్‌ ఫండ్‌
ఇక ఎన్‌పీఎస్‌ పథకంలోని లైఫ్‌సైకిల్‌ ఫండ్‌ కూడా ప్రోత్సాహకమే. ఎన్‌పీఎస్‌లో చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈక్విటీలు, కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలనే విషయాన్ని క్లిష్టంగా చూస్తున్నారు. అదే లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ ఎంచుకుంటే, ఇన్వెస్టర్‌ వయసు ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయింపులు జరుగుతుంటాయి. వయసు పెరుగుతూ, రిటైర్మెంట్‌ సమీపిస్తుంటే, ఈక్విటీలకు వాటా తగ్గుతూ డెట్‌ విభాగాలకు పెరగడం ఇందులో చూడొచ్చు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అందుబాటు ధరల గృహాలకు  (రూ.45 లక్షల వరకు) మరో ప్రోత్సాహకంగా, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రాయితీని మరో రూ.1.5 లక్షలు పెంచారు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రూ.3.5 లక్షల వరకు ఆదాయపన్ను రాయితీ పొందొచ్చు. ఇది మొదటిసారి ఇంటి కొనుగోలుదారులకు ప్రోత్సాహకంగానే పనిచేస్తుందన్నారు దీపేష్‌ రాఘవ్‌.

ప్రోత్సాహకాలతో జాగ్రత్త
► ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్స్‌ ఆన్‌లైన్‌ లోనే, కొన్ని క్లిక్‌లతోనే పొందొచ్చనే ఆఫర్లను ప్రోత్సాహకాలుగా చూడొద్దు. ఇవి అధిక రుణ భారం పెంచే ప్రమాదం ఉంది.  
► ప్రతీ నెలా మీ చేతికి అందే వేతనంలో ఇంటి రుణ ఈఎంఐ 50 శాతం మించకుండా చూసుకోవాలి.  
► వినియోగ వస్తువులకు రుణాలను తీసుకోరాదన్న సూత్రానికి కట్టుబడి ఉండాలి. కేవలం ఇల్లు వంటి విలువైన ఆస్తి సమకూర్చుకునేందుకు రుణం తీసుకోవడం సమంజసం అవుతుంది.
► ఆకట్టుకునే బెనిఫిట్స్‌ను చూపించి సంప్రదాయ ఎండోమెంట్‌ బీమా పాలసీలను అంటగట్టే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. వీటిల్లో రాబడుల తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రత్యేకించి ఆయా సందర్భాల్లో రాబడులపై దృష్టి పెట్టాలి.
► మాల్స్‌కు వెళ్లినప్పుడు వారి మాయల్లో పడి ఏవి పడితే అవి కొనుగోలు చేయకుండా ఉండేందుకు గాను క్రెడిట్, డెబిట్‌ కార్డుల వంటి ప్లాస్టిక్‌ మనీని తీసుకెళ్లొద్దు. కావల్సినంత నగదునే వెంట తీసుకెళ్లడం మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement