Section 80 C
-
కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!
కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇక వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టం 1960 సెక్షన్ 80 ఈఈఏ కింద అందించే రూ.1.5 లక్షల అదనపు పన్ను ప్రయోజనాన్ని గృహ కొనుగోలుదారులు పొందలేరు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అందరికీ ఇళ్లు పథకం కోసం ఆదాయపు పన్ను చట్టం 1960సెక్షన్ 80 ఈఈఏ కింద ఇప్పటి వరకు పన్ను మినహాయింపు కల్పించారు. కొద్ది రోజుల క్రితం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో 2022-2023 సంవత్సరానికి ఈ పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పొడగించలేదు. ఈ పన్ను రాయితీ 2019-2022 ఏడాది వరకు మాత్రమే అందుబాటులో ఉంది. గృహాలు కొనుగోలు చేస్తున్న వారికి ఇకపై పన్ను రాయితీ పొందే అవకాశం లేదు. గృహకొనుగోలుదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి), సెక్షన్ 80సీ కింద రెండు పన్ను మినహాయింపులను పొందవచ్చు. రుణగ్రహీతలు సెక్షన్ 24(బి) కింద వడ్డీపై మినహాయింపు రూ.2 లక్షల వరకు, సెక్షన్ 80సీ కింద అసలు మొత్తంపై రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. సెక్షన్ 24(బి) కింద రూ.2 లక్షల కంటే ఎక్కువగా పన్ను రాయితీ అందుకొన్నవారు ఇల్లు కోసం తీసుకున్న గృహ రుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షల అదనంగా తగ్గింపును పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రెండు సెక్షన్లు 24(బి), 80 ఈఈఏ కింద గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.3.5 లక్షల మినహాయింపును క్లెయిమ్ చేసుకొనే వీలు ఉంది. అయితే, కొన్ని షరతులు పాటించే వ్యక్తులు మాత్రమే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. మొదట ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2022 మధ్య కాలంలో గృహ రుణం మంజూరు కావాలి. రెండవది నివాసం స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలకు మించి ఉండకూడదు. మూడవది ఈ ప్రయోజనాన్ని పొందే వ్యక్తి రుణం మంజూరు చేసిన తేదీనాటికి మరే ఇతర ఇంటి ఆస్తిని కలిగి ఉండకూడదు. రుణాన్ని ఆస్తికొనుగోలు కొరకు మాత్రమే ఉపయోగించాలి. రిపేర్, మెయింటెనెన్స్ లేదా నిర్మాణం కోసం కాదు. వ్యక్తులు మాత్రమే ఈ మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. మార్చి 31, 2022న లేదా అంతకు ముందు గృహ రుణాన్ని పొందిన వ్యక్తి, సెక్షన్ 80ఈఈఏ కింద ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చని ఐటీఆర్ ఫైలింగ్ వెబ్సైట్ Tax2win సీఈఓ అభిషేక్ సోనీ తెలిపారు. "2022 మార్చి 31వ తేదీ లేదా అంతకు ముందు గృహ రుణం తీసుకున్న వ్యక్తి సెక్షన్ 80ఈఈఏ ప్రకారం ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి రుణం మంజూరు అయితే.. భవిష్యత్ ఆర్థిక సంవత్సరాల్లో గృహ రుణం పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ఈ మినహాయింపును క్లెయిమ్ చేయగలరు’ అని అభిషేక్ సోనీ చెప్పారు. (చదవండి: అదిరిపోయిన స్వదేశీ ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!) -
మీ ‘పన్ను’ దారేది?
ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన పన్ను రేట్లతో అయోమయంలో పడేశారు. ప్రస్తుత పన్ను విధానం లేదా నూతన పన్ను విధానంలో తమకు అనుకూలమైన విధానంలోనే రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్నును కొంత మేరకు తగ్గిస్తూ నూతన పన్ను రేట్లను మంత్రి ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగడం లేదా నూతన విధానానికి మారడం పన్ను చెల్లింపుదారుల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మరి నూతన పన్ను విధానానికి మారిపోవాలా..? లేక ఇప్పుడున్న విధానంలోనే కొనసాగాలా..? అని ప్రశ్నిస్తే.. అది ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. తమ ఆదాయాన్ని బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. పాత, కొత్త విధానంలో పన్ను భారంపై అవగాహన కల్పించే ప్రాఫిట్ కథనం ఇది. రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి నూతన పన్ను విధానంలో రూ.78,000ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇది నిజమే. కానీ, ఎవరికి ఈ ప్రయోజనం నిజంగా అంటే.. ఎటువంటి మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారికే నూతన పన్ను విధానంతో ప్రయోజనమని క్లుప్తంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయపన్ను విధానంలో ఎన్నో మినహాయింపులు(ఎగ్జంప్షన్), తగ్గింపులు(డిడక్షన్) ఉన్నాయి. అయితే, కొందరు కొన్ని రకాల మినహాయింపులనే వినియోగించుకుంటుంటే, కొందరు అయితే అస్సలు ఏ ప్రయోజనాన్ని కూడా వాడుకోకుండా రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇలా ఏ డిడక్షన్, ఎగ్జంప్షన్ వినియోగించుకోని వారికి నూతన పన్ను రేట్లు ప్రయోజనకరం. అలాగే, తీసివేతలు, మినహాయింపుల గందరగోళాన్ని అర్థం చేసుకోలేని వారు నూతన విధానానికి మారిపోవచ్చు. లేదు, చట్ట పరిధిలో అన్ని మినహాయింపులు, తగ్గింపులను ఉపయోగించుకుంటానంటే ప్రస్తుత విధానంలోనే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ‘‘ఇదొక మంచి నిర్ణయం. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చినట్టయింది’’ అని ట్యాక్స్‌స్పానర్ సహ వ్యవస్థాపకుడు సుధీర్ కౌశిక్ పేర్కొన్నారు. ‘‘హౌస్ రెంట్ అలవెన్స్, సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందుతున్న వారికి నూతన పన్ను విధానానికి మారిపోవడం ప్రయోజనకరం కాదు’’ అని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ ట్యాక్స్ లీడర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. చాప్టర్ 6ఏ పరిధిలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80సీసీడీ మినహాయింపులు రూ.2,50,000ను పూర్తిగా వినియోగించుకున్నట్టు అయితే రూ.7,50,000 వరకు ఆదాయం ఉన్న వారూ ప్రస్తుత విధానంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, రుణంపై ఇంటిని కొనుగోలు చేసిన వారు చాప్టర్ 6ఏకు అదనంగా సెక్షన్ 24 కింద ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2,00,000పై, స్టాండర్డ్ డిడక్షన్ 50,000ను కూడా వినియోగించుకుంటే అప్పుడు మొత్తం రూ.10,00,000 ఆదాయం ఉన్నప్పటికీ చెల్లించాల్సిన పన్ను బాధ్యత సున్నాయే అవుతుంది. ఇక సెక్షన్ 80టీటీఏ కింద డిపాజిట్లపై వడ్డీ రూ.10,000 వరకు మినహాయింపు కూడా ఉంది. నూతన పన్ను విధానానికి మారితే జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియం, ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులతోపాటు ఎల్‌టీఏ తరహా మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది. నూతన విధానంలోనూ ఎన్పీఎస్(రిటైర్మెంట్ సాధనం) పై పన్ను ఆదా చేసుకునే ఒక అవకాశాన్ని కొనసాగించారు. అది వ్యక్తిగతంగా ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులు కాకుండా.. ఉద్యోగుల తరఫున కంపెనీలు ఎన్పీఎస్కు జమ చేసే చందాలకు సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను ఆదా ప్రయోజనం వర్తిస్తుంది. మూలవేతనం, కరువు భత్యం (డీఏ)పై వార్షికంగా 10% ఎన్పీఎస్ చందాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు వార్షిక మూలవేతనం, కరువు భత్యం రూ.5 లక్షలు ఉందనుకుంటే ఇందులో 10% రూ.50,000పై పన్ను చెల్లించక్కర్లేదు. ఎన్పీఎస్ అయినా లేదా ఈపీఎఫ్ అయినా ఉద్యోగ సంస్థ చేసే చందా లకు ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఒక ఉద్యోగి తరఫున సంస్థ వార్షికంగా రూ.7.5 లక్షలకు మించి జమ చేస్తే అప్పుడు పన్ను పడుతుంది. ఒక్కసారి మారిపోతే..? ప్రస్తుత విధానంలో కొనసాగొచ్చు లేదా నూతన విధానానికి మారిపోవచ్చన్న వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఏటేటా ఉంటుందా..? లేక ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే అందులోనే మరుసటి ఏడాది నుంచి రిటర్నులు దాఖలు చేయాలా..? అన్న సందేహం రావచ్చు. ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయవచ్చన్నది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఎటువంటి వ్యాపార ఆదాయం లేకపోతే, గడిచిన ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై రిటర్నులు ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. ఇతర కేసుల్లో అయితే, ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే ఆ తర్వాత నుంచి అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుంది’’ అని బడ్జెట్ మెమొరాండం స్పష్టం చేస్తోంది. ‘‘ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు ఏ పన్ను విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు. పన్ను మినహాయింపులు, తగ్గింపులతో రిటర్నులు దాఖలు చేయవచ్చు లేదా నూతన విధానంలో తక్కువ పన్ను రేట్ల ప్రకారం రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని వారు నూతన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ వ్యాపార ఆదాయం ఉన్న వారు మినహాయింపులు, తగ్గింపులను వినియోగించుకుని ప్రస్తుత విధానంలో పన్ను రిటర్నులు దాఖలు చేసినట్టయితే అప్పుడు పాత విధానంలోనే కొనసాగినట్టవుతుంది. తర్వాతి సంవత్సరాల్లోనూ నూతన విధానానికి మారే అవకాశం ఉండదు’’ అని ట్యాక్స్‌మన్ డాట్ కామ్ డీజీఎం వాధ్వా తెలిపారు. వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదారుడు ప్రస్తుత విధానం లేక నూతన ప్రతిపాదిత విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారునికి ఈ రెండింటిలో ఎందులో కొనసాగాలన్న ఆప్షన్ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఏ విధానంలో ఎంత భారం రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారు ► స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80సీ సాధనాల్లో రూ.1,50,000 పెట్టుబడులతోపాటు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 ను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మొత్తం రూ.2,50,000 ఆదాయంపై మినహాయింపులు పొందొచ్చు. ఎన్పీఎస్ లేకపోతే సెక్షన్ 80డీ కింద తన కుటుంబానికి, తల్లిదండ్రులకు చెల్లిస్తున్న వైద్య బీమా ప్రీమియంను మినహాయింపుగా చూపించుకున్నా సరిపోతుంది. మొత్తం ఆదాయం రూ.7,50,000 నుంచి మినహాయింపులు రూ.2.5 లక్షలను తీసివేయగా మిగిలిన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 అవుతుంది. పన్ను వర్తించే ఆదాయం మినహాయింపుల తర్వాత రూ.5లక్షలు దాటనందున సెక్షన్ 87ఏ కింద పన్ను చెల్లించకుండా రిబేటు పొందొచ్చు. ► కొత్త విధానంలో ఈ మినహాయింపులు లేవుకనుక.. మొదటి రూ.2,50,001 –5,00,000పై 5% కింద రూ.12,500, తర్వాతి రూ.2.5 లక్షలపై 10% పన్ను రేటు ప్రకారం రూ.25,000.. మొత్తం రూ.37,500 పన్ను చెల్లించాలి. ► ఒకవేళ పాత విధానంలోనే కొనసాగుతూ కొన్ని మినహాయింపులనే క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయని వారు, సెక్షన్ 80సీ కింద రూ.150,000, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80డీ కింద వైద్య బీమా ప్రీమియంను మినహాయింపులుగా చూపించుకోవచ్చు. అలా రూ.2,00,000ను మినహాయింపుగా చూపించుకున్నారనుకుంటే.. మిగిలిన రూ.50,000పై ప్రస్తుత విధానంలో 20 శాతం పన్ను రేటు ప్రకారం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రస్తుత విధానమే బెస్ట్. ► ఒకవేళ సెక్షన్ 80సీ కింద కేవలం రూ.1,00,000 మాత్రమే వినియోగించుకుని, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000ను కూడా క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.1,00,000 అవుతుంది. దీనిపై 20% అంటే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ ప్రయోజనమే. ► సెక్షన్ 80సీ కింద రూ.50,000 వరకూ పెట్టుబడులు ఉంటే, దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 కలుపుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం రూ.12,000 వరకు చెల్లిస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ విధంగా చూస్తే కనీస మినహాయింపులు రూ.1,00,000–1,50,000 వరకు ఎక్కువ మందికి ఉంటుంటాయి. వీరికి ప్రస్తుత విధానమే లాభకరం. రూ.10 లక్షల ఆదాయం విషయంలో... ► వీరు కూడా స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ, 80సీసీడీ కింద పూర్తిగా రూ.3,00,000ను వినియోగించుకుంటే అప్పుడు రూ.2,00,000 మొత్తంపై ప్రస్తుత విధానంలో 20 శాతం కింద రూ.40,000 పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే ఆ విధంగా మరో రూ.2,00,000పైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించాల్సిన పన్ను సున్నాయే అవుతుంది. ఇప్పటి వరకు ఇల్లు సమకూర్చుకోని వారు రుణంపై ఇంటిని తీసుకోవడం ద్వారా ఈ ఆదాయ వర్గాల వారు ఏటా రూ.40,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ► అదే నూతన విధానంలో రూ.2,50,001–5,00,000పై 5 శాతం కింద రూ.12,500, 5,00,001–7,50,000 ఆదాయంపై 10 శాతం ప్రకారం రూ.25,000వేలు, తర్వాత రూ.2,50,000పై 15 శాతం పన్ను రేటు ప్రకారం రూ.37,500 మొత్తం రూ.75,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత విధానంలో కనీసం సెక్షన్ 80సీ, 80సీసీడీ, 80డీ, స్టాండర్డ్ డిడక్షన్లు వినియోగించుకున్నా నూతన విధానంతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లిస్తే చాలు. ► ప్రస్తుత విధానంలో ఏ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారు, అదే సమయంలో సెక్షన్ 80సీలో కేవలం రూ.లక్ష వరకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అప్పుడు వీరు రూ.4,00,000పై ప్రస్తుత విధానంలోనే 20 శాతం పన్ను రేటుపై రూ.80,000 చెల్లించాల్సి వస్తుంది. కనుక వీరికి కొత్త విధానం బెటర్. ► ఒకవేళ ఇంటి రుణం లేని వారికి హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. కనుక దాన్ని పరిగణనలోకి తీసుకుని చూడాలి. హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు మూడు విధానాలున్నాయి. వేతనంలో భాగంగా ఉద్యోగి పొందుతున్న వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం.. లేదా మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50%, అదే నాన్ మెట్రో ప్రాంతాల్లోని వారి మూల వేతనంలో 40%.. లేదా మీరు వార్షికంగా చెల్లించిన అద్దె నుంచి మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. ఈ మూడింటింలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ► 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు తమ పెట్టుబడులను అన్నింటినీ లిస్ట్ చేసుకుని, మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. -
పన్ను ఆదాకు చక్కని పథకం
పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల నుంచి పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్ పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్ పథకాల్లో చేసే పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఆ లోపు వాటిని వెనక్కి తీసుకు నే అవకాశం ఉండదు. దీర్ఘకాల లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం ఈ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. రాబడులు..: ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు మెరుగైన రాబడులనే ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 13.1 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 200 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్) రాబడులు ఏడాదిలో కేవలం 9 శాతంగా, మూడేళ్లలో వార్షికంగా 14.1 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రారంభించిన రోజు నుంచి చూస్తే ఇప్పటి వరకు సగటున వార్షికంగా 18.69 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి రూ.1.65 లక్షలు సమకూరేది. 2016, 2017లో పన్ను ఆదా విభాగం సగటు రాబడులను మించి పనితీరు చూపించిన ఈ పథకం, 2018 మార్కెట్ కరెక్షన్ సమయంలో నష్టాలను పరిమితం చేసింది. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో నష్టాలు సగటున 6 శాతంగా ఉండగా, మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకంలో నష్టాలు 2.3 శాతానికే పరిమితమయ్యాయి. పెట్టుబడుల విధానం..: 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 99 శాతం పెట్టుబడులకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ ఉంది. నగదు నిల్వలు కేవలం ఒక శాతం లోపునే ఉన్నాయి. ఈ పథకం బ్యాంకింగ్ రంగానికి పెద్ద పీట వేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలోని స్టాక్స్‌లో 37 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 12 శాతం మేర ఎనర్జీ రంగంలో, ఎఫ్ఎంసీజీలో 10 శాతం, హెల్త్‌కేర్‌లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. కన్స్ట్రక్షన్, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ విలువ పరంగా ఎటువంటి స్టాక్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈఎల్ఎస్ఎస్ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 54 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారీ లార్జ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 70% వరకు పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్‌క్యాప్ 25%, స్మాల్ క్యాప్‌నకు 5 శాతం వరకు పెట్టుబడులు కేటాయించింది. -
ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!
కొన్ని ఆప్షన్లు కంపెనీలకే కాదు... వినియోగదారులకూ మేలు చేస్తాయి. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అనేది, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా కవరేజీ దానంతట అదే పెరుగుతూ వెళితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆలోచించండి. అలాగే, సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీలు కూడా. సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారి ఆర్థిక జీవితం మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో వారి పెట్టుబడులపై కంపెనీలకు రాబడులు వస్తాయి. ఇటు వ్యక్తిగతంగా లాభాలను చేకూర్చుతూనే మరోవైపు ఆర్థికవ్యవస్థకూ ప్రయోజనం చేసే పథకాల గురించిన చర్చే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారిలో చాలా మంది తమ పెరుగుతున్న ఆదాయానికి తగినట్టు పెట్టుబడులను పెంచుకోరు. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) స్టెప్ అప్ లేదా టాపప్ సిప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ప్రతి నెలా చేస్తున్న సిప్ మొత్తం, నిర్ణీత కాలానికి ఓ సారి (వార్షికంగా లేదా మీరు నిర్ణయించిన దాని ప్రకారం) నిర్ణీత శాతం పెరుగుతూ ఉంటుంది. దీంతో, ఇన్వెస్టర్లు స్వయంగా సిప్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క టాపప్ సిప్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థే ఆ పని చేసేస్తుంది. ఇక బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో రాబడులు తక్కువేనన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ ఖాతాలో మిగులు నిధులను, లిక్విడ్ ఫండ్స్‌లోకి సులభంగా బదలాయించుకోవడం ద్వారా అధిక రాబడులు పొందే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కల్పిస్తున్నాయి. ఫలితంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి నిధుల రాక పెరిగింది. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సంస్థ ‘యాక్టివ్ అకౌంట్ యాప్’ను ఆఫర్ చేస్తోంది. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, తమ వివరాలను ఇవ్వడం ద్వారా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్క సింగిల్ క్లిక్‌తోనే ఈ యాప్ సాయంతో బ్యాంకు సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌ను లిక్విడ్ ఫండ్‌లోకి పంపుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, పెట్టుబడుల కేటాయింపు విషయంలో వారికి సమస్య ఎదురవుతుంది. ఈక్విటీల్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, డెట్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది వారి సందేహం. ఇన్వెస్టర్ల తరఫున ఈ బాధ్యతను తీసుకుని ఇన్వెస్ట్ చేసేవే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. ‘‘ఈక్విటీల విలువ (వ్యాల్యూషన్స్) పెరిగింద నుకోండి, ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించి, డెట్ విభాగంలో పెట్టుబడులు పెంచడం ఈ పథకాల్లో జరుగుతుంది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు బాగా దిద్దుబాటుకు గురై, స్టాక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయనుకోండి, అప్పుడు డెట్ విభాగంలో పెట్టుబడులు తగ్గించి, ఈక్విటీల్లో పెంచడం జరుగుతుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు అస్థిరతంగా మారినా, డెట్ విభాగంలోని పెట్టుబడుల వల్ల ఆ ప్రభావం తగ్గించడం జరుగుతుంది’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఐవో, ఈడీ ఎస్.నరేష్ తెలిపారు. స్వీప్ అకౌంట్లు ఇప్పుడు చాలా బ్యాంకులు స్వీప్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ రూ.10,000–25,000 మధ్య ఉంటుంది. ఇది బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉండొ చ్చు. నిర్ణీత బ్యాలెన్స్‌కు మించి అదనంగా ఉన్న బ్యాలెన్స్‌ను ఫిక్స్డ్ డిపాజిట్‌గా బ్యాంకు మారుస్తుంది. ఇదంతా ఆటోమేటిగ్గా జరిగిపోతుంటుంది. సేవింగ్స్ ఖాతాల్లో బ్యాలెన్స్‌పై వార్షికంగా 3.5 శాతం వడ్డీనే గిడుతుందని తెలిసిందే. అదే ఫిక్స్డ్ డిపాజిట్‌గా మార్చడం వల్ల అధిక వడ్డీ రేటు పొందే అవకాశం లభిస్తుంది. కస్టమర్ బ్యాంకుకు వెళ్లి తన సేవింగ్స్ బ్యాంకు ఖాతాను స్వీప్ అకౌంట్‌గా మార్చుకుంటే సరిపోతుంది. బీమా డిజైనర్ పాలసీలు వ్యక్తి వయసును బట్టి వివిధ దశల్లో బీమా కవరేజీ అవసరాలు మారిపోతుంటాయి. యువతీ, యువకులు వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతలు అధికమవుతాయి. అలాగే, వారికి పిల్లలు జన్మించిన తర్వాత బాధ్యతలు ఇంకాస్త పెరుగుతాయి. అందుకనే బీమా సంస్థలు వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. టర్మ్ ప్లాన్ లలో సమ్ అష్యూరెన్స్ నిర్ణీత కాలానికి (ఐదేళ్లు) ఒకసారి ఆటోమేటిగ్గా పెరిగిపోతుంది. సాధారణ టర్మ్ ప్లాన్ తీసుకుని, తమ అవసరాలకు అనుగుణంగా మళ్లీ అదనపు టర్మ్ ప్లాన్ తీసుకోవడం, అందుకోసం వైద్య పరీక్షలు తరహా ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయడం కంటే బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు ఈ తరహా పాలసీలు అనుకూలంగా ఉంటాయి. విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవడంతో పోలిస్తే, ఇలా ఉన్న ప్లాన్స్లోనే ఆటోమేటిగ్గా కవరేజీ పెరగడం వల్ల చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉండడం మరో సానుకూలత. పన్ను రాయితీలు.. ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదాయపన్ను రాయితీలు కూడా... వ్యక్తులు తమ ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపరిచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలుగానే చూడాల్సి ఉంటుంది. రాయితీల కోసమైనా వ్యక్తులు జీవిత బీమా, రిటైర్మెంట్ ప్లాన్లు, ఇతర పెట్టుబడి సాధనాల వంటి వాటిపైపు దృష్టి సారిస్తారని అంచనా. ఆర్థిక సంవత్సరం చివర్లో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలకు అర్హమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వేతన జీవులు పరుగులు పెట్టడం ఇదే తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఈటీఎఫ్ (సీపీఎస్ఈ ఈటీఎఫ్)లో పెట్టుబడులకూ ఇకపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం మరొకటి. ఇక విశ్రాంత జీవన అవసరాలను ముందుగానే గుర్తించి, రిటైర్మెంట్ పథకమైన ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయించేందుకు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయ రాయితీకి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50వేల పెట్టుబడికి సెక్షన్ 80సీసీడీ 1బీ కింద పూర్తి పన్ను ప్రోత్సాహకాలు ఉన్నాయి. తాజా బడ్జెట్లోనూ ఎన్పీఎస్ పథకానికి సంబంధించి రాయితీలను కల్పించారు. లైఫ్‌సైకిల్ ఫండ్ ఇక ఎన్పీఎస్ పథకంలోని లైఫ్‌సైకిల్ ఫండ్ కూడా ప్రోత్సాహకమే. ఎన్‌పీఎస్‌లో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు ఈక్విటీలు, కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్లో ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాన్ని క్లిష్టంగా చూస్తున్నారు. అదే లైఫ్ సైకిల్ ఫండ్ ఎంచుకుంటే, ఇన్వెస్టర్ వయసు ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయింపులు జరుగుతుంటాయి. వయసు పెరుగుతూ, రిటైర్మెంట్ సమీపిస్తుంటే, ఈక్విటీలకు వాటా తగ్గుతూ డెట్ విభాగాలకు పెరగడం ఇందులో చూడొచ్చు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అందుబాటు ధరల గృహాలకు (రూ.45 లక్షల వరకు) మరో ప్రోత్సాహకంగా, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రాయితీని మరో రూ.1.5 లక్షలు పెంచారు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ రూ.3.5 లక్షల వరకు ఆదాయపన్ను రాయితీ పొందొచ్చు. ఇది మొదటిసారి ఇంటి కొనుగోలుదారులకు ప్రోత్సాహకంగానే పనిచేస్తుందన్నారు దీపేష్ రాఘవ్. ప్రోత్సాహకాలతో జాగ్రత్త ► ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ ఆన్లైన్ లోనే, కొన్ని క్లిక్‌లతోనే పొందొచ్చనే ఆఫర్లను ప్రోత్సాహకాలుగా చూడొద్దు. ఇవి అధిక రుణ భారం పెంచే ప్రమాదం ఉంది. ► ప్రతీ నెలా మీ చేతికి అందే వేతనంలో ఇంటి రుణ ఈఎంఐ 50 శాతం మించకుండా చూసుకోవాలి. ► వినియోగ వస్తువులకు రుణాలను తీసుకోరాదన్న సూత్రానికి కట్టుబడి ఉండాలి. కేవలం ఇల్లు వంటి విలువైన ఆస్తి సమకూర్చుకునేందుకు రుణం తీసుకోవడం సమంజసం అవుతుంది. ► ఆకట్టుకునే బెనిఫిట్స్‌ను చూపించి సంప్రదాయ ఎండోమెంట్ బీమా పాలసీలను అంటగట్టే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. వీటిల్లో రాబడుల తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రత్యేకించి ఆయా సందర్భాల్లో రాబడులపై దృష్టి పెట్టాలి. ► మాల్స్‌కు వెళ్లినప్పుడు వారి మాయల్లో పడి ఏవి పడితే అవి కొనుగోలు చేయకుండా ఉండేందుకు గాను క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి ప్లాస్టిక్ మనీని తీసుకెళ్లొద్దు. కావల్సినంత నగదునే వెంట తీసుకెళ్లడం మంచిది. -
పన్ను లాభం.. మరింత పడదాం
పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ చాలా కీలకమైంది. అనేక పొదుపు పథకాలు, వ్యయాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోనే ఉండటంతో అనేక మంది అవకాశం ఉండి కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారు. పీఎఫ్, పీపీఎఫ్, బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణానికి చెల్లించే అసలు వంటి అనేక అంశాలన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి వినియోగించుకుంటే మరికొన్నింటిపై లభించే ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ చదువుల ట్యూషన్ ఫీజులే లక్షల్లో చేరుకున్న తరుణంలో 80సీ కింద వచ్చే ఇతర ప్రయోజనాలను వాడుకోలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి రూ.1.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో ఈ ఏడాది నుంచి మరింత పొదుపు చేయడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ అదనపు ప్రయోజనాలను పొందడానికి ఇక కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన సెక్షన్ 80సీ ప్రయోజనాలను గరిష్టంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో ఒకసారి పరిశీలిద్దాం.. గృహ రుణం... కొత్తగా ఇంటి రుణం తీసుకునే వారికి, ఇప్పటికే తీసుకున్న వారికి సెక్షన్ 80సీ పరిమితి పెంపు అనేది పెద్ద ఊరటనే చెప్పొచ్చు. చెల్లించే ఈఎంఐలో వడ్డీకి కాకుండా అసలుకు చెల్లించే మొత్తాన్ని 80సీ కింద చూపి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. కిందటి ఏడాది వరకు ఈ మొత్తం లక్షగా ఉంటే ఈ ఏడాది నుంచి అదనంగా మరో రూ.50,000 చూపించుకోవచ్చు. నిర్మాణ వ్యయంతో ఇంటి ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం గృహరుణదారులకు కలిసొచ్చే అంశం. అంతే కాదు చెల్లించే వడ్డీపై సెక్షన్ 24 కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి గృహ రుణం తీసుకున్న వారు అదనంగా లక్ష రూపాయలు ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్న సమయంలో సెక్షన్ 80సీ పరిమితి పెంచడం ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కి డిమాండ్ కలిసొచ్చింది. ఈ ఏడాది నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్ఎస్ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్)ల్లో ఇన్వెస్ట్ చేసిన లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య బాగా పెరుగుతున్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన రిస్క్‌కు సిద్ధపడి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని కావాలనుకునే వారు వీటికేసి చూడొచ్చు. వీటిల్లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే పన్ను ఆదాచేసే పథకాలన్నింటిలోకి తక్కువ లాకిన్ పీరియడ్‌ను కలిగివుండటమే కాకుం డా, వచ్చే రాబడిపై ఎటువంటి పన్ను భారం ఉండకపోవడం. ఇన్వెస్ట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వైదొలగవచ్చు. ఇప్పటికే మార్కెట్ గరిష్టస్థాయిలో ఉన్నందున ఈ ఏడాదికి ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని ఒకేసారిగా కాకుండా వచ్చే 6 నెలల్లో కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా రిస్క్‌ను కొంత మేర తగ్గించుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చాలా అనువైనది. ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనం. ప్రస్తుతం ఈ పథకంపై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. కిందటి ఏడాది వరకు ఈ పథకంలో గరిష్టంగా లక్ష రూపాయల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగేవారు. ఇప్పుడు సెక్షన్ 80సీ పరిమితి పెంచడంతో ఆ మేరకు పీపీఎఫ్ పరిమితిని పెంచుతూ ఈ మధ్యనే కేంద్రం గెజిట్‌ను కూడా విడుదల చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదేళ్ల కాలపరిమితి దాటిన ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్ను రాయితీలు లభిస్తాయి. వీటిల్లో కూడా గరిష్టంగా లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ద్రవ్యోల్బణం దిగొస్తుండటంతో ఇప్పటికే పలు బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను సుమారుగా ఒక శాతం తగ్గించేశాయి. రానున్న కాలంలో ఈ వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉండటంతో పన్ను మినహాయింపు కావాలనుకునే వారు సాధ్యమైనంత తొందరగా అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం ఉత్తమం. ఎన్పీఎస్ కొత్త పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై కూడా సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. ఇతర పెన్షన్ పథకాలతో పోలిస్తే వీటిలో నిర్వహణా వ్యయం కూడా తక్కువే. పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేసేవారు వీటికేసి చూడొచ్చు. ఇవి కాకుండా సీనియర్ సిటిజన్ స్కీం, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా సెక్షన్ 80సీ కింద చూపించుకొని పన్ను మినహాయింపులు పొందవచ్చు.