పన్ను లాభం.. మరింత పడదాం | section 80c the key role in tax exemption | Sakshi
Sakshi News home page

పన్ను లాభం.. మరింత పడదాం

Published Sun, Sep 7 2014 12:16 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

పన్ను లాభం.. మరింత పడదాం - Sakshi

పన్ను లాభం.. మరింత పడదాం

పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ చాలా కీలకమైంది. అనేక పొదుపు పథకాలు, వ్యయాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోనే ఉండటంతో అనేక మంది అవకాశం ఉండి కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారు. పీఎఫ్, పీపీఎఫ్, బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణానికి చెల్లించే అసలు వంటి అనేక అంశాలన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి.

 ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి వినియోగించుకుంటే మరికొన్నింటిపై లభించే ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ చదువుల ట్యూషన్ ఫీజులే లక్షల్లో చేరుకున్న తరుణంలో 80సీ కింద వచ్చే ఇతర ప్రయోజనాలను వాడుకోలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి రూ.1.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో ఈ ఏడాది నుంచి మరింత పొదుపు చేయడం ద్వారా  పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ అదనపు ప్రయోజనాలను పొందడానికి ఇక కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది.

ఈ నేపథ్యంలో పెరిగిన సెక్షన్ 80సీ ప్రయోజనాలను గరిష్టంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో ఒకసారి పరిశీలిద్దాం..
 గృహ రుణం...
 కొత్తగా ఇంటి రుణం తీసుకునే వారికి, ఇప్పటికే తీసుకున్న వారికి సెక్షన్ 80సీ పరిమితి పెంపు అనేది పెద్ద ఊరటనే చెప్పొచ్చు. చెల్లించే ఈఎంఐలో వడ్డీకి కాకుండా అసలుకు చెల్లించే మొత్తాన్ని 80సీ కింద చూపి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. కిందటి ఏడాది వరకు ఈ మొత్తం లక్షగా ఉంటే ఈ ఏడాది నుంచి అదనంగా మరో రూ.50,000 చూపించుకోవచ్చు.

నిర్మాణ వ్యయంతో ఇంటి ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం గృహరుణదారులకు కలిసొచ్చే అంశం. అంతే కాదు చెల్లించే వడ్డీపై సెక్షన్ 24 కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి గృహ రుణం తీసుకున్న వారు అదనంగా లక్ష రూపాయలు ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.

 ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్
 స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్న సమయంలో సెక్షన్ 80సీ పరిమితి పెంచడం ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కి డిమాండ్ కలిసొచ్చింది. ఈ ఏడాది నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్)ల్లో ఇన్వెస్ట్ చేసిన లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య బాగా పెరుగుతున్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన రిస్క్‌కు సిద్ధపడి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని కావాలనుకునే వారు వీటికేసి చూడొచ్చు.

వీటిల్లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే పన్ను ఆదాచేసే పథకాలన్నింటిలోకి తక్కువ లాకిన్ పీరియడ్‌ను కలిగివుండటమే కాకుం డా, వచ్చే రాబడిపై ఎటువంటి పన్ను భారం ఉండకపోవడం. ఇన్వెస్ట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వైదొలగవచ్చు. ఇప్పటికే మార్కెట్ గరిష్టస్థాయిలో ఉన్నందున ఈ ఏడాదికి ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని ఒకేసారిగా కాకుండా వచ్చే 6 నెలల్లో కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా రిస్క్‌ను కొంత మేర తగ్గించుకోవచ్చు.

 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
 ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చాలా అనువైనది. ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ప్రస్తుతం ఈ పథకంపై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. కిందటి ఏడాది వరకు ఈ పథకంలో గరిష్టంగా లక్ష రూపాయల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగేవారు. ఇప్పుడు సెక్షన్ 80సీ పరిమితి పెంచడంతో ఆ మేరకు పీపీఎఫ్ పరిమితిని పెంచుతూ ఈ మధ్యనే కేంద్రం గెజిట్‌ను కూడా విడుదల చేసింది.

 ఫిక్స్‌డ్ డిపాజిట్లు
 ఐదేళ్ల కాలపరిమితి దాటిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పన్ను రాయితీలు లభిస్తాయి. వీటిల్లో కూడా గరిష్టంగా లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ద్రవ్యోల్బణం దిగొస్తుండటంతో ఇప్పటికే పలు బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను సుమారుగా ఒక శాతం తగ్గించేశాయి. రానున్న కాలంలో ఈ వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉండటంతో పన్ను మినహాయింపు కావాలనుకునే వారు సాధ్యమైనంత తొందరగా అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం ఉత్తమం.

 ఎన్‌పీఎస్
 కొత్త పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై కూడా సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. ఇతర పెన్షన్ పథకాలతో పోలిస్తే వీటిలో నిర్వహణా వ్యయం కూడా తక్కువే. పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేసేవారు వీటికేసి చూడొచ్చు. ఇవి కాకుండా సీనియర్ సిటిజన్ స్కీం, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా సెక్షన్ 80సీ కింద చూపించుకొని పన్ను మినహాయింపులు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement