ఒక్క దెబ్బకు రెండు పిట్టలు | Equity-based savings schemes | Sakshi
Sakshi News home page

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

Published Mon, Apr 17 2017 1:36 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు - Sakshi

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలతో రెండు విధాలా మేలు  
పన్ను ప్రయోజనాలు  
దీర్ఘకాలికంగా అధిక రాబడులు  

సేఫ్‌ గేమ్‌ తగదు...
ఇన్వెస్ట్‌ చేయడమంటే.. ఏదో ఒక సాధనంలో పెట్టుబడి పెట్టేయడం కాదు. సరైన సాధనాన్ని ఎంచుకోవాలి. రిస్కును తగ్గించుకునేందుకు చాలా మంది యువత కూడా తక్కువ రిస్కుండే ఫిక్సిడ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్లు వంటి వాటిలో అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. దీనివల్ల అధిక రాబడులు దక్కించుకునే అవకాశాలను కోల్పోతారు. రిటైర్మెంట్‌ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ మార్కెట్స్‌ వంటి సాధనాలే సరైనవి. ఉదాహరణకు వార్షిక ప్రాతిపదికన పీపీఎఫ్‌ పదిహేనేళ్ల కాలానికి 8.3 శాతం రాబడులే అందించగా..  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అదే వ్యవధిలో 14.7 శాతం రాబడినిచ్చింది.

పన్ను ప్రయోజనాలూ ముఖ్యమే..
మనం పెట్టే పెట్టుబడులు మన సంపద పెరుగుదలకు ఉపయోగపడటంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా అందించేలా చూసుకోవాలి.  ఏడాదికి రూ.1.5 లక్షలు సరిగ్గా ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా గణనీయంగా పన్ను మినహాయింపులు పొందవచ్చన్నది చాలా మందికి తెలీదు (గరిష్ట ట్యాక్స్‌ రేటు 34.61 శాతంగాను, సెక్షన్‌ 80సీ కింద లభించే పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే). ట్యాక్స్‌ పేయర్లు పన్ను పోటును తగ్గించుకునేందుకు ప్రభుత్వం.. పీపీఎఫ్, జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) పోస్టాఫీస్‌ డిపాజిట్, అయిదేళ్ల బ్యాంకు డిపాజిట్, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీము (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మొదలైన సాధనాలెన్నో అందుబాటులో ఉంచింది. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం కాకుండా రిస్కులు, రివార్డులు బేరీజు వేసుకుని చూసుకోవాలి. ఇక్కడే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఉపయోగపడుతుంది.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ .. మిగతావాటితో పోటీ...
ముందుగా.. గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసేందుకు పన్ను ఆదా ప్రయోజనాలు కల్పించే సాధనాల మధ్య కొన్ని వ్యత్యాసాలు పరిశీలిద్దాం (అదనంగా రూ. 50,000 దాకా మినహాయింపుని అందించే ఎన్‌పీఎస్‌ కలపకుండా). ఉదాహరణకు మీరు ప్రతీ సంవత్సరం రూ. 1.5 లక్షలు చొప్పున రెండు దశాబ్దాలు ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. అంటే అప్పటికి మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం రూ. 30 లక్షలకు చేరుతుంది.

 వేల్యూరీసెర్చ్‌ సంస్థ అంచనాల ప్రకారం గడిచిన ఇరవై ఏళ్లుగా పీపీఎఫ్‌లో ఇంత మొత్తం ఇన్వెస్ట్‌ చేసి ఉంటే 2015 నాటి గణాంకాల ప్రకారం 9.59 శాతం రాబడి తో రూ. 82.14 లక్షలు అయ్యేది. ఇది చాలా పెద్ద మొత్తమే! కానీ వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇదే స్థాయి రాబడులు కొనసాగకపోవచ్చు.  అదే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ వార్షిక సగటు రాబడులను పరిగణనలోకి తీసుకుంటే...

 మీరు ఇన్వెస్ట్‌ చేసిన రూ. 30 లక్షలు.. ఏకంగా 2.74 కోట్లయ్యేది. ఇది పీపీఎఫ్‌కి మూడు రెట్లు అధికం. అంటే 19.81 శాతం రాబడి అన్నమాట. గడిచిన ఇరవై ఏళ్ల వ్యవధిలో స్టాక్‌ మార్కెట్‌ రెండు సంక్షోభాలు ఎదుర్కొన్న తర్వాత కూడా ఈ స్థాయి రాబడులు అందుకోగలగడం గమనార్హం. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే కోటీశ్వరులు కావడంతో పాటు పన్నులు కూడా ఆదా చేసుకుని ఉండేవారని చెప్పవచ్చు.

లాకిన్‌ వ్యవధి ప్రయోజనాలు..
పెట్టే పెట్టుబడులపై రాబడులతో పాటు లాకిన్‌ వ్యవధి చూసుకోవడమూ ముఖ్య మే. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్లు మొదలైన వాటికి లాకిన్‌ వ్యవధి అయిదేళ్లుగా ఉండగా, ఎన్‌ఎస్‌సీకి 6 ఏళ్లు, పీపీఎఫ్‌కు 15 ఏళ్లు (ఆరేళ్ల తర్వాత పాక్షిక విత్‌డ్రాయల్‌ సదుపాయం ఉంది)గా ఉంది. అదే ఈఎల్‌ఎస్‌ఎస్‌కయితే యూనిట్ల కేటాయింపు తేదీ నుంచి మూడేళ్ల వ్యవధి మాత్రమే.

అయితే, ఈ వ్యవధి ముగియగానే రిస్కు పెరిగిపోతుందేమోనని డబ్బు అవసరం లేకపోయినా.. చాలా మంది ఇన్వెస్టర్లు తమ యూనిట్స్‌ను అమ్మేస్తుంటారు. మళ్లీ ఆ డబ్బును తీసుకెళ్లి ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్‌ చేయాల్సిందే కదా! కాబట్టి లాకిన్‌ వ్యవధి అయిపోయినా డబ్బు నిజంగానే అవసరం అయ్యేంత వరకూ.. ఈఎల్‌ఎస్‌ఎస్‌ నిధులను అందులోనే ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

ఎప్పుడు.. ఎంత మొత్తంతో మొదలుపెట్టాలి..
చాలా మంది జనవరి–మార్చి మధ్య పన్ను లెక్కలేసుకోవడం మొదలుపెడతారు. పన్ను పోటును తప్పించే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల కోసం హడావుడి పడుతుంటారు. ఇలా ఏడాది చివర్న ఎకాయెకిన రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు పరుగులు తీయకుండా .. ప్రతి నెలా కొంత కొంతగా.. అంటే రూ. 12,500 చొప్పున ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ వెడితే, చివరికి రూ. 1.5 లక్షల టార్గెట్‌ సులువుగా చేరుకోవచ్చు.

దీనివల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఆఖరి 2–3 నెలల్లో ఆర్థిక ఒత్తిడులు తగ్గించుకోగలగడం మొదటిది. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోగలగడం రెండోది. ఇక మూడోదేమిటంటే.. ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఫండ్‌ యూనిట్స్‌ను వేర్వేరు రేట్లలో కొనుక్కోవచ్చు. మార్కెట్‌ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు దక్కించుకోవచ్చు. తద్వారా లాభాలను మరింతగా పొందే అవకాశం దక్కించుకోవచ్చు. క్లుప్తంగా రెండు పిట్టలను ఒకే దెబ్బతో తెచ్చిపెట్టగలిగే సాధనం ఈఎల్‌ఎస్‌ఎస్‌.

 ఇటు పన్నుపరంగాను, అటు పెట్టుబడిపరంగాను ప్రయోజనాలు కల్పిస్తుంది. పైపెచ్చు ఒకటి కొంటే మూడు ఫ్రీ డిస్కౌంటు ఆఫర్‌లాగా కూడా పనిచేస్తుంది. పన్ను పరిధిలోకి వచ్చే రూ. 1.5 లక్షల మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. ఇక ఈ పెట్టుబడిపై డివిడెండు రూపంలో వచ్చే ఆదాయానికి, పూర్తి మొత్తంపై వచ్చే రాబడికి కూడా మినహా యింపు ఉంటుంది. ఇలా సిస్టమాటిక్‌ పద్ధతిలో పన్ను మినహాయింపు పొం దేందుకు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌తో భవిష్యత్‌లో సంపదను కూడా పెంచుకోవచ్చు.

 రిటైర్మెంట్‌ తర్వాత అవసరాలకు తగినన్ని ఆర్థిక వనరులు లేకపోవడమనేది పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న వారికి ఆందోళనకరమే. ఇలాంటి సమస్య రాకూడదంటే... యుక్తవయసు నుంచే సరైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలను ఎంచుకోవటమొక్కటే తగిన మార్గం. సదరు సాధనం పన్ను ప్రయోజనాలతో పాటు అటు అధిక రాబడులు సైతం ఇవ్వగలగాలి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీము (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఈ కోవకి చెందినదే. ఈ అంశాలను మరింతగా  రిశీలిస్తే...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement