2023–24లో 35 శాతం జూమ్
వార్షికంగా రూ. 14 లక్షల కోట్ల
జమ 17.78 కోట్లకు ఫోలియోల సంఖ్య
న్యూఢిల్లీ: దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో 35% జంప్ చేశాయి. రూ. 53.4 లక్షల కోట్లను తాకాయి. వార్షికంగా రూ. 14 లక్షల కోట్లమేర ఎగశాయి. ఇందుకు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, లాభాల పరుగు తీస్తున్న ఈక్విటీ మార్కెట్లు ప్రభావం చూపాయి. వెరసి 2020–21 ఏడాది(41 శాతం వృద్ధి) తదుపరి గరిష్టస్థాయిలో ఎంఎఫ్ ఆస్తులు బలపడినట్లు వార్షిక నివేదికలో ఫండ్స్ దేశీ అసోసియేషన్(యాంఫి) వెల్లడించింది. ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) పురోగతి.. ఫండ్స్ పరిశ్రమలో పెరుగుతున్న ఇన్వెస్టర్లను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా మార్చి చివరికల్లా ఫోలియోల సంఖ్య 17.78 కోట్లను తాకింది. ఇది సరికొత్త రికార్డు కాగా.. ఇన్వెస్టర్ల బేస్ 4.46 కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో మహిళల వాటా 23 శాతంకావడం గమనార్హం!
సిప్ దన్ను
క్రమబద్ధ పెట్టుబడుల(సిప్) పథకాలను ఇన్వెస్టర్లు ఆదరిస్తుండటంతో వీటి సంఖ్య బలపడుతోంది. దీంతో నెలవారీ నికర పెట్టుబడులు మార్చిలో రూ. 19,300 కోట్లకు చేరాయి. పూర్తి ఏడాదిలో సిప్ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్ల నికర పెట్టుబడులు లభించాయి. ఇది ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని పట్టిచూపుతోంది. అంతేకాకుండా క్రమశిక్షణతోకూడిన పెట్టుబడులను ప్రతిబింబిస్తోంది. దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు గతేడాది మైలురాయివంటిదని యాంఫి నివేదిక పేర్కొంది. ఏయూఎం చెప్పుకోదగ్గవిధంగా రూ. 14 లక్షల కోట్లమేర పెరిగి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 53.4 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది.
2022–23లో ఫండ్స్ ఏయూఎం విలువ రూ. 39.42 లక్షల కోట్లుమాత్రమేనని ప్రస్తావించింది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఆధారిత పథకాలు తదితరాలలో ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. పరిశ్రమ ఆస్తుల్లో వీటి వాటా 58 శాతంకాగా.. ఫోలియో సంఖ్యలో 80 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ఎంఎఫ్‌ల ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో పెరుగుతున్న కుటుంబ మదుపును ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది.
ఈక్విటీకే ఓటు
గతేడాది పెట్టుబడుల్లో ఈక్విటీ ఆధారిత పథకాలు 55 శాతం వృద్ధిని అందుకుని ఆస్తులలో రూ. 23.5 లక్షల కోట్లకు చేరాయి. ఇందుకు పెట్టుబడులతోపాటు.. మార్క్‌టు మార్కెట్(ఎంటుఎం) లాభాలు సహకరించాయి. అయితే మరోవైపు రుణ పథకాల ఫండ్స్ 7 శాతమే బలపడ్డాయి. ఏయూఎంలో రూ. 12.62 లక్షల కోట్లకు చేరాయి. అయినప్పటికీ అంతక్రితం రెండేళ్లలో ఆస్తులు తగ్గుతూ వచ్చిన అంశంతో పోలిస్తే మెరుగేనని నివేదిక తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment