
స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న పెట్టుబడులను విక్రయించి, ఉత్తర బెంగళూరులో ఫ్లాట్ కొనాలన్నది నా ఆలోచన. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇది మంచి ఆప్షన్ అవుతుందా? లేదంటే మరో ఐదేళ్లపాటు ఈ పెట్టుబడులు కొనసాగించిన అనంతరం ఫ్లాట్ కొనుగోలు చేసుకోవాలా? ఈ రెండింటిలో ఏది మెరుగైన ఆప్షన్? – శంకర్ కృష్ణమూర్తి
ఈ విషయంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఎంత మేర లాభపడొచ్చు? దీని ద్వారా వచ్చే అద్దె ఆదాయం ఏ మేరకు ఉంటుంది? ఇవన్నీ పరిశీలించాలి. ఫ్లాట్‌పై పెట్టుబడి విలువకు వృద్ధి ఉండి, 4–6 శాతం మేర అద్దె రాబడి వచ్చేట్టు అయితే ఇప్పుడే స్టాక్స్ విక్రయించి కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విక్రయించేంత వరకు ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదు. కనుక పెట్టుబడి వృద్ధి, రిస్క్, పెట్టుబడి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అద్దె ఇంట్లో ఉంటూ, సొంత అవసరాల కోసం ఇల్లు కొనుగోలు చేస్తున్నట్టు అయితే ఇప్పుడు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అలాంటప్పుడు తక్కువ రాబడి వచ్చినా ఫర్వాలేదు.
మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం/పెట్టుబడులు) 30 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా లార్జ్‌క్యాప్ ఫండ్‌లో పెట్టుబడికి బదులు ఒకే మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఎందుకు పెట్టకూడదు? దీనివల్ల రీబ్యాలన్స్ చేయాల్సిన అవసరం తప్పుతుందిగా? – రాఘేవేంద్ర సోరబ్
మిడ్‌క్యాప్ ఫండ్‌లో అంతర్గతంగా ఉండే అస్థిరతల పట్ల సౌకర్యంగా ఉండేట్టు అయితే ఇన్వెస్ట్ చేయడం మంచి వ్యూహమే అవుతుంది. మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు నిబంధనల పరంగా కొంత వెసులుబాటు ఉంది. అవి తమ నిర్వహణ ఆస్తుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్ కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 35 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ లేదా స్మాల్‌క్యాప్‌లో ఎక్కడైనా, ఎంత మేరకు అయినా కేటాయింపులు చేసుకోవచ్చు. ఇది ఫండ్ మేనేజర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు 35 శాతం పెట్టుబడులను వివిధ విభాగాల మధ్య మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అయితే, చాలా మిడ్‌క్యాప్ ఫండ్స్ లార్జ్‌క్యాప్‌కు చాలా తక్కువగా అంటే.. సగటున 12 శాతం మేర కేటాయింపులు చేస్తున్నాయి. ఇవి ఎక్కువ శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయిస్తుంటాయి.
ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?
మిడ్‌క్యాప్ ఫండ్ ఆస్తుల సైజు చిన్నగా ఉంటే అప్పుడు ఫండ్ మేనేజర్ లార్జ్‌క్యాప్ ఎక్స్‌పోజర్ బదులు నూరు శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్ కోసమే కేటాయించడం సరైన విధానం అవుతుంది. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ వ్యాప్తంగా వైవిధ్యమైన పెట్టుబడులను మీరు కోరుకుంటుంటే అప్పుడు మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం కాబోదు. మల్టీక్యాప్ ఫండ్స్ అయితే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతుంటాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌కు ఏ మార్కెట్ క్యాప్ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ వీటికి ఉంటుంది. అయినప్పటికీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ 80 శాతం వరకు లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయిస్తుంటాయి.
ధీరేంద్ర కుమార్, వ్యాల్యూ రీసెర్చ్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment