ఎన్‌ఎస్‌ఈలో కొత్త రికార్డ్
ఎఫ్‌పీఐ పెట్టుబడులు డౌన్
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్ కంపెనీలలో ఎంఎఫ్‌ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది.
ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్‌ఐసీకి 280 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్‌తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.
విదేశీ ఇన్వెస్ట్‌మెంట్.. 11ఏళ్ల కనిష్టం
2024 మార్చికల్లా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్‌కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్‌పీఐల హోల్డింగ్(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్‌పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు.
Comments
Please login to add a commentAdd a comment