గతంలో ఎప్పుడో చేసి ఉన్నారా?
కేవైసీ స్థితిని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే
వ్యాలిడేటెడ్ అని ఉండాలి
లేదంటే తిరిగి సమర్పించాల్సిన అవసరం
ఆధార్ సాయంతో సుస్పష్ట కేవైసీ
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? గతంలో ఎప్పుడో కేవైసీ (నో యువర్ కస్టమర్) చేసి ఉన్నారా..? అయితే ఒక్కసారి మీరు మీ కేవైసీ స్థితిని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు మరో విడత కేవైసీ అప్‌డేట్ చేసుకోవాల్సిన తరుణం వచి్చంది. ఇందుకు విధించిన ఏప్రిల్ 1 గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తున్న పథకాలు కాకుండా.. కొత్త వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఉన్న ఏకైక పరిష్కారం కేవైసీని అప్‌డేట్ చేసుకోవడమే. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి తిరిగి కేవైసీ చేసే విషయంలో గందరగోళం నెలకొంది. కొంత మంది ఇన్వెస్టర్లు మినహా చాలా మందిలో దీనిపై స్పష్టత లేదు. కేవైసీ చేసేందుకు ప్రయత్నించకపోవడం, ఏ డాక్యుమెంట్లు కావాలో అవగాహన లేకపోవడమే ఈ అయోమయానికి కారణమని ఎడెల్‌వీజ్ మ్యూచువల్ ఫండ్, ఇన్వెస్టర్ సర్వీసెస్ హెడ్ అబ్దుల్లా చౌదరి అంటున్నారు. మ్యూచు వల్ ఫండ్స్ సంస్థల వెబ్‌సైట్ నుంచే ఆన్‌లైన్‌లో సులభంగా కేవైసీని మరోసారి చేసుకోవచ్చని తెలిపారు.
చెక్ చేసుకోవాల్సిందే..
ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తిరిగి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా..? అంటే లేదన్నదే సమాధానం. అసలు ఎవరు కేవైసీ ప్రక్రియను తిరిగి నిర్వహించుకోవాలో తెలుసుకోవాలంటే.. ఆన్‌లైన్‌లో తమ కేవైసీ స్థితిని ఒకసారి పరిశీలించుకుంటే కానీ తెలియదు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు సీవీఎల్‌ను కేవైసీ కోసం ఉపయోగిస్తుంటారు. కనుక సీవీఎల్‌కేఆర్‌ఏ డాట్ కామ్ సైట్‌కు వెళ్లాలి. లేదంటే ఎన్‌డీఎంఎల్ కేఆర్‌ఏ, క్యామ్స్ (సీఏఎంఎస్) కేఆర్‌ఏ లేదా కార్వీ కేఆర్‌ఏ ద్వారా తమ కేవైసీ స్థితిని తెలుసుకోవచ్చు. సీవీఎల్‌కేఆర్‌ఏ పోర్టల్‌కు వెళ్లి పైన కనిపించే మెనూ ఆప్షన్లలో కేవైసీ ఇంక్వైరీ సెలక్ట్ చేసుకోవాలి.
తర్వాత వచ్చే విండోలో పాన్ నంబర్ నమోదు చేయాలి. ఐ యామ్ హ్యూమన్ పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేసి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ కేవైసీ స్థితి అక్కడ కనిపిస్తుంది. కేవైసీ వ్యాలిడేటెడ్.. అని ఉంటే తిరిగి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. దీనర్థం మీరు అప్పటికే సమర్పించిన కేవైసీ ఆధార్ ఆధారితమైనది. మొబైల్, ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అయి ఉన్నట్టు. కనుక అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. మళ్లీ కేవైసీ అవసరం లేదు.
కేవైసీ రిజిస్టర్డ్.. అని ఉంటే మీరు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ (ఓవీడీ) ఆధారంగా కేవైసీ చేసినట్టు. అంటే ఆ సమయంలో ఆధార్ ధ్రువీకరణ చేయలేదు. మొబైల్, ఈ మెయిల్ ధ్రువీరణ చేసినట్టు. అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిని వెనక్కి తీసుకోవచ్చు. కానీ, ఇప్పటి వరకు పెట్టుబడులు లేని కొత్త సంస్థల పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉండదు.
ఆన్ హోల్డ్.. మొదట సమర్పించిన కేవైసీ ఓవీడీ ఆధారితం కాదని దీనర్థం. లేదంటే ఈ మెయిల్, మొబైల్ నంబర్ మనుగడలో లేవని అర్థం. ఈ స్థితి చూపిస్తుంటే, అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణకు అనుమతి లేదని తెలుసుకోవాలి. వీరు తాజాగా కేవైసీ సమర్పించాలి. రిజెక్టెడ్ ఆన్ హోల్డ్ 10–15 రోజుల పాటు ఉన్న తర్వాత రిజెక్టెడ్‌గా మారుతుంది. వీరు కూడా అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు నిర్వహించలేరు. అంటే తాజాగా ఇన్వెస్ట్ చేయలేరు. అప్పటికే ఉన్న పెట్టుబడులు వెనక్కి తీసుకోలేరు. తాజాగా కేవైసీ సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ కేవైసీ వ్యాలిడేటెడ్ అనే స్థితి ఉన్న వారు మినహా మిగిలిన ప్రతి ఒక్కరూ ఆధార్ ఆధారితంగా తాజా కేవైసీ సమర్పించడం మంచిది.
ఎన్‌డీఎంఎల్ కేఆర్‌ఏ అయితే..
పాన్ నంబర్ నమోదు చేసి, క్యాపెచా కోడ్ తర్వాత సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో మీరు చేయాల్సినది ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎన్‌డీఎంఎల్ కేఆర్‌ఏ వద్ద కేవైసీ నమోదు చేయని వారు ఇక్కడ కేవైసీ చేయడానికి వీలు పడదు. అదే సీవీఎల్–కేఆర్‌ఏలో అయితే మీ వివరాలు సమర్పించిన అనంతరం.. కేవైసీ ఎక్కడ నమోదై ఉన్నది కూడా చూపిస్తుంది.
అంటే సీవీఎల్ కేఆర్‌ఏ/ఎన్‌డీఎంఎల్ కేఆర్‌ఏ/డాటెక్స్ కేఆర్‌ఏ/క్యామ్స్ కేఆర్‌ఏ/ కార్వీ కేఆర్‌ఏ వీటిల్లో ఎక్కడ నమోదైతే కేవైసీ స్టేటస్ కాలమ్‌లో అక్కడ వివరాలు కనిపిస్తాయి. మీ కేవైసీ ఎక్కడ నమోదై ఉందన్న విషయం ఇక్కడ తెలుస్తుంది. లేదంటే మీ పెట్టుబడులు కలిగిన ఫండ్ హౌస్ (ఏఎంసీ) పోర్టల్‌కు వెళ్లి కూడా తెలుసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థ లేదా సెబీ నమోదిత ఆర్‌టీఏ (రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్) హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు.
కేవైసీ అప్‌డేట్
కేవైసీ స్థితి తెలుసుకున్న తర్వాత ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్‌కు అయినా వెళ్లి కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీని సమర్పించొచ్చు. ఇలా ఒకసారి కేవైసీ అప్‌డేట్ అయితే అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల పెట్టుబడుల్లోనూ అదే ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు ఎడెల్‌వీజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే, సంస్థ పోర్టల్‌కు వెళ్లి తమ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.
ప్రొఫైల్ సెక్షన్‌లో కేవైసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ‘రిజిస్టర్డ్’ లేదా ‘ఆన్‌హోల్డ్’ చూపిస్తుంటే ఎం–ఆధార్ లేదా డిజిలాకర్ ఖాతా నుంచి ఈ–ఆధార్ సమర్పించొచ్చు. దీంతో యూఐడీఏఐ ద్వారా వచ్చే ఓటీపీని సమర్పించిన అనంతరం కేవైసీ వ్యాలిడేట్ అవుతుంది. కేవైసీ రిజిస్టర్డ్ అనే స్థితితో ఉన్న వారు మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే, తాజాగా కేవైసీ సమర్పించేంత వరకు సాధ్యపడదు.
అప్పటి వరకు పెట్టుబడులు లేని మరో సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. అప్పుడు ఆయా సంస్థ కేవైసీని పరిశీలిస్తుంది. వ్యాలిడేటెడ్ అని ఉంటేనే వారు ఆమోదిస్తారు. రిజిస్టర్డ్ అని ఉంటే మాత్రం కేవైసీ సమర్పించాలి. నేరుగా వెళ్లి ఫిజికల్ కేవైసీ సమర్పించే వారు ఆధార్ కాపీపై క్యూఆర్ కోడ్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. లేకపోతే దాన్ని సిస్టమ్ రీడ్ చేయలేదు. అలాంటప్పుడు అది వ్యాలిడేట్ కాదు. ఎప్పుడో ఆధార్ తీసుకున్న వారి డాక్యుమెంట్‌పై క్యూఆర్ కోడ్ మసకగా మారుతుండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
మరి ఎన్‌ఆర్‌ఐల పరిస్థితి?
భారతీయులతో పోలిస్తే ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) కేవైసీ అంత సులభం కాదు. ఇతర దేశాల్లో నివసిస్తూ, భారత మొబైల్ నంబర్ కలిగి లేని వారు.. ఆధార్ ఆధారిత ఓటీపీ స్వీకరణ, నమోదు చేయలేరు. దీంతో ఎన్‌ఆర్‌ఐల కేవైసీ స్థితి ‘రిజిస్టర్డ్’గానే కొనసాగొచ్చు. దీంతో అప్పటికే పెట్టుబడులు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో ఇకమీదటా పెట్టుబడులను ఎన్‌ఆర్‌ఐలు కొనసాగించుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో జారీ అయిన మొబైల్ నంబర్ కలిగి ఉంటే, ఆన్‌లైన్‌లో ఆధార్ ఆధారితంగా కేవైసీని సమర్పించి, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. లేదంటే వీరు కొత్త సంస్థలో పెట్టుబడులు పెట్టాల్సిన ప్రతి సందర్భంలోనూ అధికారికంగా చెల్లుబాటయ్యే ఇతర డాక్యుమెంట్ల సాయంతో కేవైసీ సమర్పించడమే మార్గం.
తిరిగి కేవైసీ.. ఏ డాక్యుమెంట్?
అధికారికంగా చెల్లుబాటయ్యే ఏ డాక్యుమెంట్ (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కార్డ్) సాయంతో తిరిగి కేవైసీ చేసుకోవచ్చు. కానీ, భవిష్యత్తులో మరోసారి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆధార్ సాయంతో కేవైసీ వ్యాలిడేట్ చేసుకోవడమే అత్యుత్తమం. ఇతర డాక్యుమెంట్‌తో కేవైసీ చేస్తే కనుక, కొత్త మ్యూచువల్ ఫండ్ సంస్థ పథకంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి మళ్లీ కేవైసీ సమర్పించాల్సి వస్తుంది. అదే ఆధార్‌తో చేస్తే ఈ ఇబ్బంది ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment