retail investors
-
రిస్క్ లు తెలుసుకోకుండానే ఎఫ్‌అండ్‌వోలోకి
న్యూఢిల్లీ: సత్వర లాభాలపై ఆశలు, స్పెక్యులేటివ్ ధోరణులే రిటైల్ ఇన్వెస్టర్లను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు రిస్క్ ల గురించి ఆలోచించకుండా ట్రేడింగ్‌లోకి దూకి, చేతులు కాల్చుకుంటున్నారు. అలా జరగకుండా ఎఫ్‌అండ్‌వోపై పూర్తి అవగాహన పెంచుకుని, రిస్క్ లను ఎలా ఎదుర్కొనాలనేది తెలుసుకుని మాత్రమే ఇందులోకి అడుగుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ లతో కూడుకున్న ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తుండటంపై కొన్నాళ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ మాధవిపురి బచ్ తదితరులు ఈ సాధనం విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచించారు. అయినప్పటికీ ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ భారీగా పెరుగుతూనే ఉంది. 2019లో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్ నెలవారీ టర్నోవరు 8,740 లక్షల కోట్లుగా ఉండేది. ఇది 2024 మార్చి నాటికి ఏకంగా రూ. 217 లక్షల కోట్లకు ఎగిసింది. సెబీ అధ్యయనం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో వ్యక్తిగత ట్రేడర్లలో 89 శాతం మంది నష్టపోయారు. నష్టాలు సగటున రూ. 1.1 లక్షలుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ అనేది హెడ్జింగ్, స్పెక్యులేషన్ కోసం ఉపయోగకరంగా ఉంటుందని, కానీ అధిక స్థాయిలో మార్జిన్లు అవసరమవుతాయి కాబట్టి రిస్క్ లు కూడా ఎక్కువగా ఉంటాయని ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఫైయర్స్ సహ–వ్యవస్థాపకుడు తేజస్ ఖోడే చెప్పారు. వీటి వల్ల చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఈ సాధనాలు, వాటిలో ఉండే రిసు్కల గురించి రిటైల్ ఇన్వెస్టర్లు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయడం మంచిదని సూచించారు. ‘ఈ సాధనాలకు అవసరమైన పెట్టుబడి తక్కువగానే ఉండటం, వివిధ సూచీల్లో వీక్లీ ఎక్స్‌పైరీలు కూడా అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్ లు కూడా పెరిగాయి‘ అని ఆనంద్ రాఠీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా చెప్పారు. -
ఎఫ్‌అండ్‌వోతో జర జాగ్రత్త
ముంబై: రిస్క్ లతో కూడుకున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో దీనిపై తగిన విధంగా పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో భవిష్యత్తులో మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంటు, కుటుంబాల పొదుపునకు సవాళ్లు తలెత్తగలవని ఆమె హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆ నిధులకు రక్షణ కల్పించడం తమ లక్ష్యమని బీఎస్ఈ నిర్వహించిన వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్ కారణంగా ప్రతి పది మంది రిటైల్ ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారన్న సెబీ అధ్యయనం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఎంఎఫ్ ఆస్తులు రూ. 53.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం(2023–24) లో 35% జంప్ చేశాయి. రూ. 53.4 లక్షల కోట్లను తాకాయి. వార్షికంగా రూ. 14 లక్షల కోట్లమేర ఎగశాయి. ఇందుకు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, లాభాల పరుగు తీస్తున్న ఈక్విటీ మార్కెట్లు ప్రభావం చూపాయి. వెరసి 2020–21 ఏడాది(41 శాతం వృద్ధి) తదుపరి గరిష్టస్థాయిలో ఎంఎఫ్ ఆస్తులు బలపడినట్లు వార్షిక నివేదికలో ఫండ్స్ దేశీ అసోసియేషన్(యాంఫి) వెల్లడించింది. ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) పురోగతి.. ఫండ్స్ పరిశ్రమలో పెరుగుతున్న ఇన్వెస్టర్లను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా మార్చి చివరికల్లా ఫోలియోల సంఖ్య 17.78 కోట్లను తాకింది. ఇది సరికొత్త రికార్డు కాగా.. ఇన్వెస్టర్ల బేస్ 4.46 కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో మహిళల వాటా 23 శాతంకావడం గమనార్హం! సిప్ దన్ను క్రమబద్ధ పెట్టుబడుల(సిప్) పథకాలను ఇన్వెస్టర్లు ఆదరిస్తుండటంతో వీటి సంఖ్య బలపడుతోంది. దీంతో నెలవారీ నికర పెట్టుబడులు మార్చిలో రూ. 19,300 కోట్లకు చేరాయి. పూర్తి ఏడాదిలో సిప్ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్ల నికర పెట్టుబడులు లభించాయి. ఇది ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని పట్టిచూపుతోంది. అంతేకాకుండా క్రమశిక్షణతోకూడిన పెట్టుబడులను ప్రతిబింబిస్తోంది. దేశీ ఎంఎఫ్ పరిశ్రమకు గతేడాది మైలురాయివంటిదని యాంఫి నివేదిక పేర్కొంది. ఏయూఎం చెప్పుకోదగ్గవిధంగా రూ. 14 లక్షల కోట్లమేర పెరిగి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 53.4 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది. 2022–23లో ఫండ్స్ ఏయూఎం విలువ రూ. 39.42 లక్షల కోట్లుమాత్రమేనని ప్రస్తావించింది. ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్ ఆధారిత పథకాలు తదితరాలలో ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. పరిశ్రమ ఆస్తుల్లో వీటి వాటా 58 శాతంకాగా.. ఫోలియో సంఖ్యలో 80 శాతాన్ని ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ఎంఎఫ్‌ల ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో పెరుగుతున్న కుటుంబ మదుపును ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేసింది. ఈక్విటీకే ఓటు గతేడాది పెట్టుబడుల్లో ఈక్విటీ ఆధారిత పథకాలు 55 శాతం వృద్ధిని అందుకుని ఆస్తులలో రూ. 23.5 లక్షల కోట్లకు చేరాయి. ఇందుకు పెట్టుబడులతోపాటు.. మార్క్‌టు మార్కెట్(ఎంటుఎం) లాభాలు సహకరించాయి. అయితే మరోవైపు రుణ పథకాల ఫండ్స్ 7 శాతమే బలపడ్డాయి. ఏయూఎంలో రూ. 12.62 లక్షల కోట్లకు చేరాయి. అయినప్పటికీ అంతక్రితం రెండేళ్లలో ఆస్తులు తగ్గుతూ వచ్చిన అంశంతో పోలిస్తే మెరుగేనని నివేదిక తెలియజేసింది. -
Stress Test: మీ పెట్టుబడులకు రక్షణ ఉందా?
రిటైల్ ఇన్వెస్టర్లకు చిన్న కంపెనీలంటే చెప్పలేనంత ఆకర్షణ. అందుకే నేరుగా స్టాక్స్‌లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్మాల్, మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే, దీర్ఘకాలంలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల్లో అధిక రాబడులు వారిని ఆకట్టుకుంటున్నాయి. కానీ, పెద్ద కంపెనీలతో పోలిస్తే వీటిల్లో రిస్క్ పాళ్లు అధికం. ఈ రిస్‌్కను రిటైల్ ఇన్వెస్టర్లలో అధిక శాతం మంది పట్టించుకోవడం లేదు. ఫలితం మార్కెట్ దిద్దుబాట్లలో తప్పటడుగుల కారణంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ రిస్క్‌ను ఇన్వెస్టర్లు అర్థం చేసుకునేందుకు తీసుకొచి్చందే స్ట్రెస్ టెస్ట్. గడిచిన మూడేళ్ల డేటాను గమనించినట్టయితే స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. ఒక్క 2023 సంత్సరంలోనే మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.23,000 కోట్లు వస్తే.. చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్ పథకాలు రూ.41,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 2022లోనూ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.20,500 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.19,795 కోట్ల చొప్పున వచ్చాయి. కానీ, అస్థిరతలు తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ పథకాల నుంచి 2023లో ఇన్వెస్టర్లు రూ.3,000 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. మూడేళ్ల కాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏటా 24 శాతం చొప్పున రాబడిని ఇవ్వగా, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఏటా 22 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించాయి. ఈ స్థాయి రాబడిని చూసి ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులను ఈ పథకాల్లోకి కుమ్మరిస్తున్నారు. వచ్చే పెట్టుబడుల ప్రవాహానికి తగ్గట్టు ఫండ్స్ సంస్థలు చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఆ మేరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కలసి స్టాక్స్ వ్యాల్యూషన్లు ఓ బుడగ మాదిరి తయారవుతున్నట్టు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆందోళన చెందింది. ఫలితంగా కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో ఉండే రిస్క్ నుంచి ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణకు కార్యాచరణ రూపొందించుకోవాలని, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులను నియంత్రించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అన్ని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు సంబంధించి ‘స్ట్రెస్ టెస్ట్’ నిర్వహించాలని ఫండ్స్ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రకటిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడం అవసరం. ఏమిటీ ఈ స్ట్రెస్ టెస్ట్? పైకి ఎలాంటి అనారోగ్య సమస్యలూ కనిపించకపోవచ్చు. మరి అనూహ్యంగా హార్ట్ ఎటాక్‌తో చిన్న వయసులోనే కొందరు ఎందుకు మరణిస్తున్నట్టు? గుండె సామర్థ్యాన్ని, సమీప కాలంలో వచ్చే ముప్పును తెలుసుకునేందుకు వైద్యులు థ్రెడ్ మిల్ టెస్ట్ (టీఎంటీ) నిర్వహిస్తుంటారు. మెషిన్‌పై శ్రమతో నడస్తున్న సమయంలో గుండె స్పందనలు ఎలా ఉన్నాయనే దాని ఆధారంగా భవిష్యత్ రిస్‌్కలను వైద్యులు అంచనా వేస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన స్ట్రెస్ టెస్ట్ కూడా ఇదే మాదిరి అనుకోవచ్చు. 2020 కరోనా సమయంలో స్టాక్ మారెŠక్ క్రాష్ గుర్తుండే ఉంటుంది. ఈ తరహా పతనాల్లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ నిర్వహణలోని పెట్టుబడుల (ఏయూఎం)ను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తాయి? రిస్‌్కను ఎలా ఎదుర్కొంటాయి? ఇన్వెస్టర్ల ప్రయోజనాలను ఎంత మేరకు కాపాడగలవు? ఇన్వెస్టర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తే తిరిగిచ్చే సామర్థ్యం ఫండ్స్ సంస్థలకు ఉంటుందా? ఇత్యాది అంశాలన్నీ తెలుసుకోవడానికి ఈ స్ట్రెస్ టెస్ట్ ఉపకరిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఇది కొత్తగా విని ఉండొచ్చేమో..! కానీ ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాంక్‌లకు సంబంధించి లిక్విడిటీ స్ట్రెస్ టెస్ట్‌ను నిర్వహిస్తుంటుంది. బ్యాంకుల్లో నగదు లభ్యత ఎలా ఉంది? కొరతను ఎదుర్కొంటున్నాయా? అన్నది ఆర్బీఐ మదింపు చేస్తుంటుంది. దీని అవసరం..? బాండ్ల మార్కెట్లలో మాదిరే ప్రతికూల సమయాల్లో స్మాల్, మిడ్‌క్యాప్ పథకాలకు సంబంధించి కూడా లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంటుంది. ఒక మోస్తరు ఆస్తులను (పెట్టుబడులు/ఏయూఎం) నిర్వహిస్తున్నంత వరకు ఈ లిక్విడిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్‌కు పెద్ద సమస్య కాబోదు. కానీ, గడిచిన ఏడాది రెండేళ్లలో స్మాల్, మిడ్‌క్యాప్ పథకాల్లోకి వస్తున్న భారీ పెట్టుబడులు లిక్విడిటీ పరంగా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 ఫిబ్రవరి నాటికి అన్ని స్మాల్‌క్యాప్ ఫండ్స్ నిర్వహణలోని ఏయూఎం రూ.2.49 లక్షల కోట్లకు చేరితే, మిడ్‌క్యాప్ ఫండ్స్ ఏయూఎం రూ.2.95 లక్షల కోట్లకు చేరుకోవడాన్ని ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఈ విభాగాల్లోని పెద్ద పథకాలు ఒక్కో దాని నిర్వహణలోని ఆస్తులు రూ.25,000–60,000 కోట్లకు చేరాయంటే ఏ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రూ.60,000 కోట్ల ఆస్తులు నిర్వహించే పథకం ఒక శాతం (రూ.600 కోట్లు) మేర స్టాక్స్‌ను విక్రయించినా దాన్ని మార్కెట్ సర్దుబాటు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో (తక్కువ వ్యాల్యూమ్ ట్రేడ్ అయ్యేవి) ఈ రిస్క్ ఇంకా ఎక్కువ. కొద్ది అమ్మకాలకే స్టాక్ ధరలు నేలచూపులు చూస్తాయి. దీంతో ఆయా పథకాల యూనిట్ నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) అదే స్థాయిలో పడిపోతుంది. స్ట్రెస్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు? పథకాల పోర్ట్‌ఫోలియోలో 50, 25 శాతం మేర స్టాక్స్‌ను విక్రయించేందుకు వీలుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మేనేజర్లు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తమ స్టాక్స్‌కు సంబంధించి గడిచిన మూడు నెలల్లో సగటు ట్రేడింగ్ వ్యాల్యూమ్ను పరిశీలిస్తారు. లిక్విడిటీ (వ్యాల్యూ మ్) చాలా తక్కువగా ఉన్న దిగువ స్థాయి 20 శాతం స్టాక్స్‌ను మినహాయిస్తారు. మిగిలిన స్టాక్స్ వాల్యూమ్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొనే సమయంలో ఏ మేరకు పెరుగుతుందన్నది ఊహాత్మక గణాంకాల ఆధారంగా అంచనా వేస్తా రు. ఈ గణాంకాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ (హోల్డింగ్స్)ను ఎన్ని రోజుల్లో విక్రయించగలమనే అంచనాకు వస్తాయి. ఒక పథకం తన పెట్టబడుల్లో 25 శాతాన్ని, 50 శాతాన్ని ఎన్ని రోజుల్లో విక్రయించగలదన్నది దీని ద్వారా తెలుస్తుంది. సెబీ ఆదేశాల ప్రకారం ఫండ్స్ ప్రతి నెలా ఈ విధమైన స్ట్రెస్ టెస్ట్ నిర్వహించి, ఫలితాలను తర్వాతి 15 రోజుల్లోపు ఆన్లైన్ పోర్టల్‌పై వెల్లడించాలి. ఆయా పథకాల్లో పెట్టుబడులు పెట్టిన టాప్–10 ఇన్వెస్టర్ల వివరాలను కూడా ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. వర్రీ అక్కర్లేదు.. ఒక పథకం తన నిర్వహణ పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 60 రోజుల సమయం పడుతుందని వెల్లడించిన సందర్భాల్లో.. ఇన్వెస్టర్ల ఉపసంహరణ క్లెయిమ్‌లు ఒకే సారి ఎక్కువ మొత్తంలో వస్తే ఆమోదిస్తుందా? అన్న సందేహం అక్కర్లేదు. ఈ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు అన్నీ కూడా వాస్తవంగా మార్కెట్లో విక్రయించి, వెల్లడించిన డేటా కాదు. మార్కెట్ పతనాల్లో ఎన్ని రోజుల్లో విక్రయించగలమో ఊహాత్మకంగా వేసిన అంచనాలే. ఆయా సమయంలో ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్‌్కల గురించి తెలుసుకునేందుకు ఈ డేటా ఇన్వెస్టర్లకు సాయంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడుల్లో 25 శాతం నుంచి 50 శాతం మేర ఉపసంహరణ ఒత్తిళ్లు రావడం అన్నది చాలా అరుదుగానే ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు 10 శాతం మించవు. దీనికంటే కూడా మార్కెట్లు పడడం మొదలైన తర్వాత ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడం మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కానీ అప్పటికే చేసిన ఫండ్స్ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అరుదు. నష్టభయమే దీనికి కారణం. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) లిక్విడిటీ రిస్క్ విషయంలో తగిన సన్నద్దంగానే ఉంటాయి. అందుకే స్మాల్‌క్యాప్ అయినా, మిడ్‌క్యాప్ అయినా పెట్టుబడుల్లో 35 శాతం వరకు తీసుకెళ్లి లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఎదురైతే ముందుగా లార్జ్‌క్యాప్ పెట్టుబడులనే నగదుగా మార్చుకుంటాయి. దీనికి తోడు పథకంలో కొంత మేర నగదు నిల్వలు కూడా ఉంటాయి. వీటికి అదనంగా పథకం మొత్తం పెట్టుబడుల విలువలో 20 శాతం మేర రుణం తీసుకుని స్వల్పకాల అమ్మకాల ఒత్తిడిని అధిగమించేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి. విశ్లేషణకు కీలక డేటా స్ట్రెస్ టెస్ట్ డేటాతో ఇన్వెస్టర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన పథకాల్లో ఉండే రిస్క్ ఎంతన్నది తెలుస్తుంది. ఎన్ని రోజుల్లో పెట్టుబడులను ఫండ్ మేనేజర్లు నగదుగా మార్చుకుంటున్నారన్నది ఇందులో కీలకమైన అంశం. ఇప్పటి వరకు విడుదలైన స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను ఒక్కసారి తప్పకుండా గమనించాలి. స్మాల్‌క్యాప్ పథకాలు తమ పెట్టుబడుల్లో 50 శాతాన్ని విక్రయించి నగదుగా మార్చుకునేందుకు సగటున 22 నుంచి 60 రోజులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే 25 శాతం పెట్టుబడులను విక్రయించేందుకు 11–30 రోజుల సమయం పడుతోంది. మొత్తం ఒకే రోజు విక్రయించేందుకు ఇక్కడ అవకాశాలు పరిమితం. ఎందుకంటే ఆయా స్టాక్స్‌లో లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) చాలా తక్కువగా ఉంటుందన్న అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల వద్ద నగదు నిల్వలు 4.5 శాతం నుంచి 11 శాతం మధ్య ఉన్నాయి. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి ఎదురైతే తొలుత ఈ నగదు నిల్వలతో ఫండ్స్ గట్టెక్కగలవు. అప్పటికీ రిడెంప్షన్ (ఉపసంహరణ) ఒత్తిడి ఆగకపోతే పెట్టుబడులను విక్రయించాల్సి వస్తుంది. ఆయా పథకంలో కేవలం కొద్ది మంది ఇన్వెస్టర్లే ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉన్నారా? లేదా అన్నది తెలుస్తుంది. ఉదాహరణకు ఒక పథకం నిర్వహణలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని అనుకుందాం. కేవలం ఐదు, పది మంది ఇన్వెస్టర్లకు సంబంధించే రూ.500 కోట్ల పెట్టుబడులు ఉంటే, అది రిస్‌్కకు దారితీస్తుంది. ఆ స్థాయిలో పెట్టుబడులు కలిగి ఉన్నవారు స్మార్ట్ ఇన్వెస్టర్ల కిందకే వస్తారు. మార్కెట్ పతనం మొదలైన వెంటనే, ముందుగా వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ప్రయతి్నస్తే పథకం ఎన్ఏవీ దారుణంగా పడిపోతుంది. ఇది మిగిలిన ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను గణనీ యంగా ప్రభావితం చేస్తుంది. అయితే, తాజా స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను గమనిస్తే ఈ రిస్క్ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. ఒక పథకం పెట్టుబడుల విలు వలలో టాప్–10 ఇన్వెస్టర్లకు సంబంధించి పెట్టుబడుల విలువ 0.61–2.1 శాతం మించి లేదు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు అయినప్పటికీ లార్జ్‌క్యాప్ కంపెనీలకు సైతం చెప్పుకోతగ్గ మేర కేటాయింపులు చేసిన పథకాల్లో లిక్విడిటీ రిస్క్ చాలా తక్కువ. ఎందుకంటే లార్జ్‌క్యాప్‌లో లిక్విడిటీ సమస్య ఉండదు. కావాలంటే ఒకే రోజు మొత్తం పెట్టుబడులను విక్రయించుకోగలవు. ఇక స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ ఫండ్స్ లిక్విడిటీ మెరుగ్గా ఉంది. స్మాల్‌క్యాప్ పథకాలతో పోలిస్తే సగం వ్యవధిలోనే మిడ్‌క్యాప్ ఫండ్స్ తమ పెట్టుబడులను విక్రయించుకోగలవని స్ట్రెస్ టెస్ట్ డేటా తెలియజేస్తోంది. కాకపోతే మిడ్‌క్యాప్ పథకాల్లో టాప్–10 ఇన్వెస్టర్లకు సంబంధించిన పెట్టుబడులు 1.3–4.9 శాతం మధ్య ఉన్నాయి. అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉన్నట్టు. అవసరమైతే డేటా విశ్లేషణకు నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. సంక్షోభాల్లో ఎలా..? తీవ్ర ప్రపంచ ప్రతికూల పరిణామాల్లో మార్కెట్లు కుప్పకూలితే, ఫండ్స్ పథకాలు లిక్విడిటీ రిస్‌్కను గట్టెక్కుతాయా? అంటే అవుననే చెప్పుకోవాలి. కానీ, వాస్తవ పరిస్థితుల్లో ఫలితాలు ఇలానే ఉండాలని లేదు. అప్పుడు ఇన్వెస్టర్లు ఎలా ప్రతిస్పందిస్తారు..? ప్రతికూల పరిణామాలు స్వల్ప కాలమా? లేక దీర్ఘకాలమా? తదితర అంశాలు అప్పటి వాస్తవ లిక్విడిటీ రిస్‌్కను ప్రభావితం చేస్తాయి. ఎలాంటి ప్రతికూల పరిణామాలు అయినా సరే తమ పెట్టుబడులను వెనక్కి ఇవ్వాలని ఇన్వెస్టర్లు కోరితే.. ఫండ్స్ సంస్థలు తప్పకుండా అనుసరించాల్సిందే. నష్టానికి అయినా అవి అమ్మి చెల్లింపులు చేస్తాయి. మార్గం ఏంటి? స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్ లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంతేకానీ, పెట్టుబడుల ఉపసంహరణకు ఇది సంకేతం కాదు. రిస్‌్కలను అర్థం చేసుకోలేని వారు, ఎన్ఏవీలు గణనీయంగా పడిపోయినప్పుడు ఓపిక పట్టలేని వారు ఈ తరహా పెట్టబడులను తగ్గించుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను స్వల్పకాలిక ఆటుపోట్లను చూసి విక్రయించుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. అంత రిస్క్ వద్దనుకుంటే లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. ఒకేసారి ఒక పథకం నుంచి 25–50 శాతం పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం సాధారణంగా జరగదు. కనుక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవీ ఉదాహరణలు ► రూ.46,000 కోట్ల పెట్టుబడులను నిర్వహించే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్.. తన పెట్టుబడుల్లో 50 శాతాన్ని నగదుగా మార్చుకునేందుకు 27 రోజులు, 25 శాతం పెట్టుబడుల విక్రయానికి 13 రోజులు పడుతుందని స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ► రూ.17,193 కోట్ల పెట్టుబడులను నిర్వహించే క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ తన పెట్టుబడుల్లో 50 శాతం విక్రయించేందుకు 22 రోజులు, 25 శాతాన్ని విక్రయించేందుకు 11 రోజులు తీసుకుంటుందని తెలిపింది. ► రూ.25,500 కోట్లు నిర్వహించే ఎస్బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ 50 శాతం పెట్టుబడుల విక్రయానికి 60 రోజులు పడుతుందని వెల్లడించింది. ► క్వాంట్ మిడ్‌క్యాప్ ఫండ్ 100% పెట్టుబడుల విక్రయానికి 10 రోజులు, 25% పెట్టుబడుల అమ్మకానికి 5 రోజులు చాలని ప్రకటించింది. ► అదే యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ 50 % పెట్టుబడులను 12 రోజుల్లో, 25% పెట్టుబడులను 6 రోజుల్లో నగదుగా మార్చుకోగలనని పేర్కొంది. -
క్రెడో బ్రాండ్స్ @ రూ. 266–280
మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్స్, 1,807 టచ్‌పాయింట్స్‌సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది. -
బ్రోకింగ్ స్టాక్స్ మారథాన్
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలోఈక్విటీల వైపు వస్తుండడంతో బ్రోకింగ్ స్టాక్స్ గడిచిన కొన్నేళ్లలో మంచి రాబడులు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా కరోనా సమయంలో వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్లో కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు అడుగులు వేసేలా చేశాయని చెప్పుకోవాలి. దీంతో ట్రేడింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. కరోనా వైరస్ సమసిపోయి, ఇంటి నుంచే పని విధానం కూడా కనుమరుగు అవుతున్నప్పటికీ, మరోవైపు ఈక్విటీ మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ట్రేడింగ్ పరిమాణం గణనీయంగా నమోదవుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏంజెల్ వన్, 5పైసా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, చాయిస్ ఇంటర్నేషనల్ స్టాక్స్ ర్యాలీ రిటైల్ ఇన్వెస్టర్ల జోరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. ఏంజెల్ వన్ స్టాక్ ఏడాది కాలంలో 90 శాతం రాబడులను ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ 77 శాతం పెరిగింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సైతం 21 శాతం రాబడిని ఇచి్చంది. లిస్టెడ్ బ్రోకరేజీ సంస్థల విలువ వృద్ధి వెనుక రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రధానంగా చెప్పుకోవాలని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ భవీక్ పాటిల్ తెలిపారు. డీమ్యాట్ ఖాతాల్లో భారీ వృద్ధి కరోనా తర్వాత డీమ్యాట్ ఖాతాల్లో గణనీయ వృద్ధి కనిపించింది. అంతేకాదు భవిష్యత్తులోనూ వీటి పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది బ్రోకరేజీ పరిశ్రమకు అనుకూలమని, టెక్నాలజీలో వచి్చన పురోగతి నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థలు మరింత మంది క్లయింట్లకు సేవలు అందించగలవని స్టాక్స్‌బాక్స్ సీఈవో వంశీ కృష్ట పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో కనిపించిన నిరంతరాయ ర్యాలీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించినట్టు చెప్పారు. అక్టోబర్ చివరి నాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 13.22 కోట్లకు చేరింది. వీటిల్లో అధిక శాతం గడిచిన 11 నెలల కాలంలో ప్రారంభమైనవే కావడం గమనించొచ్చు. ఒకవైపు స్టాక్ మార్కెట్ ర్యాలీకితోడు, మరోవైపు ఐపీవోల బంపర్ లిస్టింగ్ మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాలూ అనుకూలమే సెపె్టంబర్ త్రైమాసికంలో బ్రోకరేజీ కంపెనీలు మంచి సానుకూలతలను చూసినట్టు ఎం.స్టాక్ (మిరే అస్సెట్) రిటైల్ స్ట్రాటజీ హెడ్ ధర్మేంద్ర లోహర్ చెప్పారు. సూచీలు సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకోవడం, ఐపీవో ఇష్యూలు పెరగడాన్ని ప్రస్తావించారు. ‘‘సంప్రదాయ, బ్యాంక్ బ్రోకర్లు ఎక్కువగా లబ్ధి పొందారు. ఎందుకంటే వీరి ఆదాయం ప్రధానంగా ఈక్విటీల నుంచే ఉంటుంది. ఇది ఆయా సంస్థల లాభాలు, ఆదాయం వృద్ధికి దారితీశాయి’’అని ధర్మేంద్ర లోహర్ తెలిపారు. ‘‘కరోనా తర్వాత డీమ్యాట్ ఖాతాలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం కూడా పెరిగింది. దీంతో గడిచిన కొన్నేళ్లలో బ్రోకరేజీ సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది’’అని స్టాక్స్‌బాక్స్ కృష్ణ చెప్పారు. ఏంజెల్ వన్ సెపె్టంబర్ త్రైమాసికంలో 42 శాతం అధికంగా రూ.305 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. ఒకే త్రైమాసికంలో అత్యధికంగా 21 లక్షల మంది క్లయింట్లకు పెంచుకుంది. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లాభం సైతం 52 శాతం పెరిగింది. -
మీ ఫండ్‌కు మీరే మేనేజర్..?
మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల వైపు అడుగులు వేసే రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. అన్ని సాధనాల్లోకెల్లా ఈక్విటీలు దీర్ఘకాలంలో స్థిరమైన, మెరుగైన రాబడులు ఇవ్వడమే ఈ ఆకర్షణకు కారణం. ఈక్విటీల్లో పెట్టుబడులు ఎంత సులభమో, ఆచరణలో అంత కష్టం. నిపుణులైన ఫండ్ మేనేజర్లను కాదని, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించే వారు, ప్రాథమిక విషయాల గురించి, రిస్క్ గురించి తప్పకుండా తెలుసుకుని తీరాలి. లేదంటే అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. తమ పెట్టుబడులకు తామే ఫండ్ మేనేజర్ పాత్ర పోషిస్తామనుకునే వారు, ఈక్విటీలో తలపండిన వారెన్ బఫెట్, ఫిలిప్ ఫిషర్, చార్లీ ముంగర్ చెప్పిన సూత్రాలు పాటించడం అనుసరణీయం. కంపెనీ గురించి, చేస్తున్న వ్యాపారం గురించి, పని చేస్తున్న రంగం, యాజమాన్య దక్షత, పోటీ సామర్థ్యాలు, నిధుల బలాలు ఇలా ఎన్నో అంశాలను చూసి వడపోయాలి. ఆపై మిగిలిన కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేసుకోవడం వల్ల రక్షణ ఎక్కువగా ఉంటుంది. నేరుగా పెట్టుబడులు పెట్టే ప్రతి ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన అంశాల సమాహారమే ఈ కథనం... వ్యాపార నమూనా అర్థమైందా? ఒక కంపెనీ షేర్లు కొంటున్నామంటే.. సదరు వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్టు. ఒక షేరును రూ.20లో కొని, అది రూ.100కు చేరితే నాలుగింతలు లాభం వస్తుందన్న అవాస్తవ అంచనాలు వేసుకుని ఓ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారంటే? అనుసరించే బాట సరిగ్గా లేదని తెలుసుకోవాలి. ఎంపిక చేసుకునే కంపెనీకి ఆదాయం ఎలా వస్తోంది? కంపెనీ సేవలు లేదా ఉత్పత్తులు ఏంటన్నవి అర్థం చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉండాల్సిందే. కంపెనీ ఉత్పత్తులు లేదా సేవల గురించి తెలియనప్పుడు, భవిష్యత్తులో ఆ కంపెనీ వ్యాపారం ఎలా సాగుతుందో ఎలా తెలుస్తుంది? అటువంటప్పుడు పెట్టే పెట్టుబడి ఎలా వృద్ధి చెందుతుంది? ఒక కంపెనీ గురించి అర్థం కాకకపోయినా లేదా ఉత్పత్తులు, సేవలు ఆకర్షణీయంగా అనిపించకపోయినా, ఆ కంపెనీకి దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారం అర్థం చేసుకునేందుకు ఎంత సులభంగా ఉంటే, అంత ఆకర్షణీయమైనదిగా భావించొచ్చు. యాజమాన్య దక్షత గుడ్ బిజినెస్ ఇన్ రాంగ్ హ్యాండ్స్.. రాంగ్ బిజినెస్ ఇన్ గుడ్ హ్యాండ్స్.. ఈ రెండింటిలో రెండోదే ఉత్తమం. సమర్థత లేని వ్యక్తుల చేతుల్లో మంచి వ్యాపారం ఉన్నా దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లలేరు. అదే మంచి వ్యాపార దక్షత కలిగిన వ్యక్తులు యాజమాన్య స్థానంలో ఉంటే, చెత్త వ్యాపారాన్ని సైతం మంచిగా వృద్ధి చేయగలరు. పెట్టుబడులు పెట్టే కంపెనీకి సమర్థులైన, ప్రతిభావంతులైన, భవిష్యత్తు ప్రణాళికలు, పోటీతత్వంపై స్పష్టమైన అవగాహన, టెక్నాలజీ పట్ల ఆసక్తి కలిగిన ప్రమోటర్లు ఉండాలి. ఆ కంపెనీ యాజమాన్యం పనితీరు గురించి సాధ్యమైనంత లోతుగా తెలుసుకోవాలి. వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నడిచేవి, కుటుంబ కంపెనీలు సగటున ఏటా 3 శాతం అధిక పనితీరు చూపిస్తున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ప్రమోటర్లతో సంబంధం లేకుండా నిపుణుల ఆధ్వర్యంలో గొప్పగా పనిచేసే హెచ్డీఎఫ్సీ గ్రూప్, ఎల్అండ్టీ గ్రూప్, ఐటీసీ గ్రూప్ కూడా ఉన్నాయి. మరొక ముఖ్యమైన అంశం.. ప్రతి కంపెనీ కూడా ఒక్కో రంగంలో విశేషమైన అనుభవం కలిగి ఉంటుంది. ఆయా రంగంలో వచ్చే మార్పులు, సవాళ్లకు అనుగుణంగా తన వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలా ఓ రంగానికే కట్టుబడి గొప్పగా రాణిస్తున్న కంపెనీలను పెట్టుబడులకు పరిశీలించొచ్చు. కంపెనీల మేనేజ్మెంట్ వ్యాపారంపైనే దృష్టి పెట్టాలి కానీ, వాటాదారుల విలువపై కాదు. కంపెనీ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తుంటే సహజంగానే వాటాల విలువ ఇతోధికం అవుతుంది. వ్యాపారం కాకుండా వాటాల విలువను పెంచడంపై దృష్టి సారించే యాజమాన్యాల వైఖరి, దీర్ఘకాలంలో వాటాదారులకు మేలు చేయకపోవచ్చు. కొన్ని కంపెనీలు చేస్తున్న వ్యాపారంపై దృష్టి తగ్గించి, మార్కెట్లో వచ్చే కొత్త వ్యాపార అవకాశాల్లోకి ప్రవేశిస్తుంటాయి. వాటాల విలువ పెరుగుతుందని అలా వ్యవహరిస్తుంటాయి. దీనివల్ల నిజానికి వ్యాపార విధానం గాడి తప్పుతుంది. కొత్త వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున రుణాలు సమీకరిస్తుంటాయి. ఇది కూడా వాటాదారుల విలువకు ప్రతికూలం అవుతుంది. భవిష్యత్ నాయకత్వం? ఒక గొప్ప ప్రమోటర్‌ను చూసి కళ్లు మూసుకుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చని అనుభవజు్ఞలైన ఇన్వెస్టర్లు చెబుతుంటారు. నిజమే అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆ గొప్ప ప్రమోటర్ ఏదో ఒకరోజు వయసు మళ్లో లేకుంటే ఆకస్మికంగా కాలం చేస్తే పరిస్థితి ఏమిటి? కంపెనీ సంక్షోభంలో పడిపోకుండా, ఆ తర్వాత నుంచి సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఉన్నారో లేదో చూడాలి. ప్రమోటర్ కాకపోయినా కంపెనీలను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఎల్అండ్టీ ఏఎం నాయక్ వంటి నిపుణులు ఎందరో ఉంటారు. అలాంటి నిపుణుల చేతికి నాయకత్వం వెళితే నిశి్చంతగా ఉండొచ్చు. పనిచేస్తున్న రంగం కంపెనీ ఏ రంగంలో పనిచేస్తుందన్నది మరో ముఖ్యమైన అంశం. ఉదాహరణకు మెటల్స్ తీసుకుంటే వాటి ధరలు అంతర్జాతీయంగా వివిధ దేశాల వినియోగం, ఆరి్థక పరిస్థితులకు అనుగుణంగా తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తుంటాయి. స్థిరమైన రాబడి కోరుకునే వారు మెటల్స్‌కు దూరంగా ఉండాల్సిందే. అదే ఐటీ రంగం తీసుకుంటే అస్థిరతలు తక్కువ. ఎక్కువ కాలాల్లో స్థిరమైన వృద్ధిని ఏటా నమోదు చేస్తుంటాయి. అలాగే బాగా వృద్ధికి అవకాశం ఉన్న రంగాలను ఎంపిక చేసుకుంటే, ఎక్కువ కాంపౌండింగ్‌కు అవకాశం ఉంటుంది. పోటీతత్వం ఎంపిక చేసుకునే కంపెనీకి గట్టి పోటీనిచ్చే సామర్థ్యాలున్నాయా? సదరు కంపెనీకి వ్యాపార పరంగా బలాలు ఉండే పెట్టుబడులకు రక్షణ ఉన్నట్టుగా భావించొచ్చు. దీన్నే మోట్ అని పిలుస్తారు. దీన్ని ఎలా తెలుసుకోవచ్చు? అంటే.. కంపెనీకి వ్యాపారంలో స్థూల మార్జిన్లు గరిష్ట స్థాయిలోనే దీర్ఘకాలం పాటు కొనసాగుతుంటే, ఆ కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి డిమాండ్ ఉన్నట్టుగా భావించొచ్చు. ఉదాహరణకు యాపిల్ స్థూల మార్జిన్లు 44 శాతానికి పైనే. ఆయా వ్యాపారంలో కొన్ని కంపెనీలే పనిచేస్తుండడం, కొత్త కంపెనీల ప్రవేశం అంత సులభం కాకపోవడం వంటివి అనుకూలతలు. దీనివల్ల ఉన్న కంపెనీలకు ప్రైసింగ్ పవర్ (ధరలను నిర్ణయించే శక్తి) ఉంటుంది. కనీసం లాభాల మార్జిన్ 10 శాతానికి పైన ఉండేలా చూసుకోవాలి. స్వల్ప మార్జిన్‌తో నడిచే కంపెనీలు ఎప్పుడైనా నష్టాల్లోకి జారిపోవచ్చు. పోటీ సంస్థల కంటే మీరు పెట్టుబడి పెట్టే కంపెనీ లాభాల మార్జిన్ ఎక్కువగా ఉండాలి. ఈ మార్జిన్‌ను ఏటేటా పెంచుకోవడం లేదంటే అదే స్థాయిలో కొనసాగించడం అవసరం. ఏటేటా క్షీణిస్తూ ఉంటే, బలం క్షీణిస్తున్నట్టుగా చూడొచ్చు. కంపెనీ నిలబడుతుందా? కంపెనీ రిస్క్‌లను కూడా చూడాలి. కంపెనీకి బలాలు ఉన్నాయని ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవి అలాగే కొనసాగుతున్నాయా? అని కనిపెట్టుకుని ఉండాలి. టెలికం రంగంలో ఏం జరిగిందో చూశారు కదా..? జియో రావడంతో ఎయిర్టెల్, వొడాఐడియా మినహా అన్నీ మూట సర్దేసుకోవాల్సి వచ్చింది. వొడాఐడియా కూడా ఆరి్థక సంక్షోభంతో కొనసాగుతోంది. ఇలాంటి విపత్తు ఏ రంగంలో అయినా ఉండొచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందే కంపెనీకి వచ్చే రిస్‌్కల గురించి కూడా అవగాహన ఉండాలి. ఎయిర్టెల్ కంపెనీకి నెట్వర్క్ విస్తరణ పరంగా కాస్త మెరుగైన సామర్థ్యాలు ఉన్నాయి. దీనికితోడు మారుతున్న మార్కెట్ పరిణామాలకు తగ్గట్టు ఎయిర్టెల్ ప్రణాళికలు రచించి, అమలు చేసుకుంటూ వెళ్లింది. అందుకే జియోకు గట్టి పోటీదారుగా నిలిచింది. ముఖ్యంగా కంపెనీకి దీర్ఘకాలిక విజన్ (భవిష్యత్ ప్రణాళిక) ఉండాలి. అలాంటి కంపెనీలు దీర్ఘకాలంలో సవాళ్లను దీటుగా ఎదుర్కొని, వాటాదారులకు విలువను సమకూర్చగలవు. బలమైన బ్యాలన్స్ షీట్ ఎంపిక చేసుకునే కంపెనీకి ఆరి్థక బలాలు తప్పకుండా ఉండాలి. కంపెనీకి దాదాపు రుణ భారం లేకుండా ఉంటే మంచిది. ఒకవేళ రుణాలు ఉన్నా కానీ, ఆ మొత్తం ఈక్విటీతో పోలిస్తే నూరు శాతం మించకుండా చూసుకోవాలి. రుణభారం ఎక్కువైతే కంపెనీ సంపాదించినదంతా వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. అప్పుడు కంపెనీ వృద్ధి ప్రణాళికల కోసం అప్పు మీద అప్పు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి బ్యాలన్స్ షీటు కంపెనీలకు దూరంగా ఉండాలి. రుణరహిత కంపెనీలు, ఆదాయం ఏటా కనీసం 10–15 శాతం, నికర లాభం ఏటా 15–20 శాతం వృద్ధి చెందే కంపెనీల్లో పెట్టుబడికి రక్షణ, వృద్ధికి అవకాశం ఉంటుంది. ఓ కంపెనీ షేరు ధర దీర్ఘకాలంలో లాభాలనే అనుసరిస్తుంటుంది. డివిడెండ్ చెల్లించేవి అయితే అదనపు ప్లస్‌గా చూడొచ్చు. పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యం మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగు ణంగా ఉత్పత్తులు, సేవల్లోనూ నవ్యత అవసరం. అందుకే కంపెనీలు పరిశోధనపై పెద్ద మొత్తంలో వెచి్చస్తుంటాయి. ఓ కంపెనీ పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యాలకు నిదర్శనం, ఆ కంపెనీ ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు ఉండడం. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు, సేవలను మార్కెట్ చేస్తుండడం. ఇలాంటి బలాలు ఉంటే, దీర్ఘకాలంలో ఆ కంపెనీ ఎంత పోటీ ఉన్నా నిలదొక్కుకుని, రాణిస్తుంది. ఇందుకు ఒక నిదర్శనం గూగుల్, యాపిల్. ఇవి పరిశోధనపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటాయి. ఉత్పత్తులు, సేవలపై పేటెంట్ ఉంటే, వ్యాపారంలో అ ధిక లాభాల మార్జిన్లకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే ఉన్న పేటెంట్ల గడువు ముగుస్తుంటే, అది లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగులతో సంబంధాలు కంపెనీలో పని విలువలు కూడా వాటాదారులకు విలువను తెచ్చి పెట్టే అంశాల్లో ఒకటి. మెరుగైన పని విధానం ఉన్న కంపెనీలు దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి విలువను సమకూరుస్తాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కంపెనీ ఉద్యోగుల విషయంలో సముచితంగా వ్యవహరిస్తుంటే, మెరుగైన పని వాతావరణం ఉన్నప్పుడు వారు మరింత ఉత్పాదకత దిశగా పనిచేయగలరు. వాటాల విలువ పలుచన అవుతోందా? కంపెనీల మూలధనం పెరుగుతూ వెళుతోందా? ఏ రూపంలో అయినా కానీయండి, దీనివల్ల అప్పటికే కంపెనీలో ఉన్న వాటాల విలువ పలుచనవుతుంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల మూలధనం స్థిరంగా ఉండాలి. షేర్ల బైబ్యాక్ రూపంలో ఈక్విటీ తగ్గుతుంటే ఇంకా మంచిది. దీనివల్ల వాటాదారుల విలువ ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతుంది. బ్యాంక్ స్టాక్స్‌కు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వొచ్చు. ఎందుకంటే బ్యాంకులకు నిధులే వ్యాపార వస్తువు. కనుక అవి తాజా ఈక్విటీ జారీ ద్వారా ఎప్పటికప్పుడు నిధులు సమీకరిస్తూ, వ్యాపార విస్తరణపై వెచి్చస్తుంటాయి. ఇవి కూడా గమనించాలి.. ► టెక్నాలజీ పరంగా కంపెనీ ముందుండాలి. కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహా్వనించాలి. లేదంటే అస్తిత్వ ముప్పు ఏర్పడొచ్చు. ► కొన్ని రంగాల్లో చిన్న కంపెనీల కంటే పెద్ద కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడమే మంచిది. ఉదాహరణకు టైర్ల రంగంలో చిన్న కంపెనీని ఎంపిక చేసుకోవడం కంటే ఎంఆర్ఎఫ్ వంటి పెద్ద కంపెనీలే దీర్ఘకాలంలో రాణించేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ► ఓ కంపెనీ షేరు గణనీయంగా పడిపోయిందని ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఆ షేరు ఏ కారణాల వల్ల పడిపోయిందన్నది ముందుగా తెలుసుకోవాలి. జెట్ ఎయిర్వేస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, యస్ బ్యాంక్ ఇలాంటి కేసులను అధ్యయనం చేయాలి. పడిపోతున్న షేరును కొనుగోలు చేయడం, పడిపోతున్న కత్తిని పట్టుకోవడంగా నిపుణులు చెబుతుంటారు. ► కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) దీర్ఘకాలంలో పెద్దగా వృద్ధి లేకుండా అక్కడక్కడే చలిస్తుంటే.. దీనికి బదులు ఏటేటా ఆర్‌వోఈ వృద్ధి చెందే కంపెనీలే మెరుగైన రాబడులను ఇవ్వగలవు. ► సిమెంట్, మెటల్స్, షుగర్, ఆటోమొబైల్ ఇవన్నీ సైక్లికల్ కంపెనీలు. కొన్నేళ్ల కాలంలోనే ఎన్నో రెట్ల రాబడులు ఇచి్చన తర్వాత, మళ్లీ ర్యాలీ చేయడానికి కొన్నేళ్ల సమయం తీసుకుంటాయి. ఇలాంటి కంపెనీల్లో అధిక వేల్యుయేషన్ల వద్ద ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అంశాలను గమనించాలి. ► వాటాల పరంగా లిక్విడిటీ మెరుగ్గా ఉండాలి. అంటే ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాప్ చెప్పుకోదగినంతగా ఉండాలి. లిక్విడిటీ తక్కువగా ఉంటే, మార్కెట్ కరెక్షన్లలో అమ్ముకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడికే షేరు ధర భారీగా పతనం చెందుతుంది. దీంతో భారీ నష్టాలు ఎదురవుతాయి. కంపెనీ షేరు ధరను కాకుండా, అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ► కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా ఉండాలి. కంపెనీ వ్యవహారాలు పారదర్శకంగా ఉన్నప్పుడే, మార్కెట్ ఆ కంపెనీకి మెరుగైన విలువను కడుతుంది. ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులతో ముందుకు వస్తాయి. కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా లేని కంపెనీలకు దూరంగా ఉంటాయి. సత్యం కంప్యూటర్స్, బ్రైట్‌కామ్ గ్రూప్, ఈకేఐ ఎనర్జీ వంటి కంపెనీల కేసులను ఇందుకు అధ్యయనం చేయొచ్చు. ► ప్రమోటర్ల వాటా కంపెనీలో ఎంత ఉందన్నది కూడా చూడాలి. కనీసం 20 శాతంపైన ఉంటే మంచిది. పైగా ప్రమోటర్లు తమకున్న వాటాలను తనఖా పెట్టారా? తనఖా పెట్టిన మొత్తం వారి వాటాల్లో 50 శాతం మించితే అటువంటి వాటికి దూరంగా ఉండాలి. స్కటిల్బట్ మెథడ్ ప్రకారం.. ఓ కంపెనీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉంటే, ముందు ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగించుకునే వారిని కలసి మాట్లాడాలి. అలాగే, ఆ కంపెనీ పోటీదారులు, ఉద్యోగులతో మాట్లాడిన తర్వా త ఓ నిర్ణయానికి రావాలి. – ఫిలిప్ ఎ. ఫిషర్ -
ఐకియో లైటింగ్‌కు యాంకర్ నిధులు
న్యూఢిల్లీ: లెడ్ లైటింగ్ సొల్యూషన్ల కంపెనీ ఐకియో లైటింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభంకానుంది. 8న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 270–285కాగా.. సోమవారం(5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 182 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 285 ధరలో 16 ఫండ్స్‌కు 63.84 లక్షల షేర్లను కేటాయించింది. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో సొసైటీ జనరాలి, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, గోల్డ్‌మన్ శాక్స్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ తదితరాలున్నాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ మొత్తం రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 90 లక్షల షేర్లను ప్రమోటర్లు హర్దీప్ సింగ్, సుర్మీత్ కౌర్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 606 కోట్లకుపైగా సమకూర్చుకోవాలని చూస్తోంది. అనుబంధ సంస్థకు నిధులు ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 212 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంటు కోసం ఐకియో లైటింగ్ వెచ్చించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 52 ఈక్విటీ షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ నాలుగు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ప్రధానంగా లెడ్ లైటింగ్ డిజైన్, అభివృద్ధి, తయారీ, ప్రొడక్టుల సరఫరా చేపడుతోంది. 2021–22లో ఆదాయం 55 శాతం జంప్‌చేసి రూ. 332 కోట్లకు చేరింది. నికర లాభం 75 శాతం వృద్ధితో రూ. 50.5 కోట్లను తాకింది. -
మ్యూచువల్ ఫండ్స్‌కు రిటైలర్ల ‘జోష్’
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు అండగా నిలుస్తున్నారు. ఫండ్స్ నిర్వహణలోని రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2023 జనవరి నాటికి రూ.23.4 లక్షల కోట్లకు చేరాయి. 2022 జనవరి నాటికి ఉన్న రూ.21.40 లక్షల కోట్లతో పోలిస్తే 9.3 శాతం వృద్ధి చెందాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) తాజా గణాంకాలను విడుదల చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సంస్థల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు ఏడాది కాలంలో రూ.17.49 లక్షల కోట్ల నుంచి, 2023 జనవరి చివరికి రూ.17.42 లక్షల కోట్లకు తగ్గాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడుల్లో వృద్ధి, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సిప్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ప్రతి నెలా రూ.13,000 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వస్తుండడం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో సిప్ ద్వారా ఫండ్స్‌లోకి రూ.13,856 కోట్ల పెట్టుబడులు రాగా, 2022 డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు రావడం గమనించాలి. మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జనవరి చివరికి రూ.40.80 లక్షల కోట్లకు చేరింది. 2022 జనవరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. -
PRE-BUDGET 2023: గోల్డ్ ఈటీఎఫ్‌లకు ప్రోత్సాహమివ్వండి
న్యూఢిల్లీ: ఫండ్స్ ద్వారా పసిడిలో పెట్టుబడులు పెట్టేలా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు తగు చర్యలు ప్రకటించాలని కేంద్రాన్ని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోరింది. ఇందుకోసం గోల్డ్ ఈటీఎఫ్‌లపై పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 2023–24 బడ్జెట్‌కు సంబంధించి ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ ఈ మేరకు తమ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. వీటి ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌లు, అలాగే తమ నిధుల్లో 90 శాతానికి మించి పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)పై ప్రస్తుతం 20 శాతంగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ను ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రత్యామ్నాయంగా, ఎల్టీసీజీ ట్యాక్సేషన్ ప్రయోజనాలు పొందేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఒక్క ఏడాదికి అయినా తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి పసిడి పథకాలకు పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే, ఆర్థికంగా అంతగా సమర్ధమంతం కాని భౌతిక పసిడికి ప్రత్యామ్నాయ సాధనంగా వాటికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భౌతిక రూపంలోని బంగారంలో పెట్టుబడులు తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది‘ అని యాంఫీ పేర్కొంది. బ్రిటన్ తదితర దేశాల్లో ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నట్లు వివరించింది. ఆయా దేశాల్లో పెట్టుబడియేతర బంగారంపై 20 శాతం వ్యాట్ (వేల్యూ యాడెడ్ ట్యాక్స్) విధిస్తుండగా బంగారంలో పెట్టుబడులపై మాత్రం ఉండటం లేదని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇతరత్రా పసిడి పెట్టుబడుల సాధనాల తరహాలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. మరిన్ని ప్రతిపాదనలు.. ► ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లను కూ డా ఈక్విటీ ఆధారిత ఫండ్స్ పరిధిలోకి చేర్చాలి. ► లిస్టెడ్ డెట్ సాధనాలు, డెట్ మ్యుచువల్ ఫండ్స్‌పై పన్నులు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► అలాగే ఇంట్రా–స్కీమ్ మార్పులను (ఒకే మ్యుచువల్ ఫండ్ స్కీమ్ అంతర్గతంగా వివిధ ప్లాన్లు/ఆప్షన్లలోకి పెట్టుబడులను మార్చుకోవడం) ’ట్రాన్స్ఫర్’ కింద పరిగణించరాదు. ఇలాంటి లావాదేవీలకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి మినహాయింపునివ్వాలి. ► ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల (ఈఎల్ఎస్ఎస్) తరహాలోనే చౌకైన, తక్కువ రిస్కులతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండే డెట్ ఆధారిత పొదుపు పథకాలను (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ► ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్‌డీల తరహాలోనే అయిదేళ్ల లాకిన్ వ్యవధితో డీఎల్ఎస్ఎస్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు వర్తింపచేయాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఎల్ఎస్ఎస్ల్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటున్నాయి. ► ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను రిజిస్టర్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీ) బదలాయించేందుకు బీమా కంపెనీలన్నింటినీ అనుమతించాలి. అలాగే బీమా కంపెనీలకు ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడానికి ఏఎంసీలకు కూడా అనుమతినివ్వాలి. ► పింఛన్లకు సంబంధించి ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ పథకాలను ప్రవేశపెట్టేందుకు మ్యుచువల్ ఫండ్స్‌కు అనుమతినివ్వాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఇచ్చే పన్ను ప్రయోజనాలను వీటికి కూడా వర్తింపచేయాలి. బడ్జెట్ సెషన్లో డేటా బిల్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందగలదని భావిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. బిల్లు ముసాయిదాలోని నిబంధనలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఉగ్రవాద, సైబర్ ముప్పులతో పాటు అంతర్జాతీయంగా యుద్ధ విధానాలు మారుతుండటాన్ని పరిగణనలోకి తీసుకునే నిబంధనల రూపకల్పన జరిగిందని మంత్రి చెప్పారు. బిల్లులో ప్రతిపాదించిన పర్యవేక్షణ సంస్థ డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిపై వ్యక్తమవుతున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. రిజర్వ్ బ్యాంక్, సెబీ వంటి నియంత్రణ సంస్థల తరహాలోనే దీనికి కూడా సంపూర్ణ స్వతంత్రత ఉంటుందని పేర్కొన్నారు. -
ESG: పెట్టుబడి.. పదికాలాలు పచ్చగా!
అసలు పెట్టుబడి ఉద్దేశం రాబడే కదా..? ఈ రాబడి కాంక్షే ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటుంది. కానీ, నేడు భూ మండలం వాతావరణ మార్పులు అనే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వనరుల వినియోగం గరిష్ట స్థాయికి చేరి, కాలుష్యం అసాధారణ స్థాయికి చేరిపోయిన తరుణంలో.. పర్యావరణంపై మమకారంతో పుట్టుకొచ్చిందే ఈఎస్జీ (ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్) విధానం. తాము పెట్టుబడి కోసం ఎంపిక చేసుకుంటున్న కంపెనీ.. పర్యావరణాన్ని ఏ రకంగా చూస్తోందన్నది ఇన్వెస్టర్‌కు కీలకం అవుతుంది. అంటే పర్యావరణానికి తన ఉత్పత్తులు, తయారీ, సేవల ద్వారా హాని కలిగించకూడదు. తన ఉద్యోగులు, భాగస్వాములతో ఎలా వ్యవహరిస్తుందన్నది ‘సోషల్’. ఇక కంపెనీ నిర్వహణ తీరుకు అద్దం పట్టేదే గవర్నెన్స్. ఈ మూడింటిలో పాస్ మార్కులు పొందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ఈఎస్జీ ఇన్వెస్టింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పాపులర్ అవుతున్న ఈ విధానం పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. కనుక ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తితో ఉన్న ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో సమగ్రంగా వివరించే కథనమిది... ప్రపంచవ్యాప్తంగా ఈఎస్జీ పెట్టుబడులు 2020 నాటికే 35 ట్రిలియన్ డాలర్లు (రూ. 2800 లక్షల కోట్లు) దాటాయంటే దీని ప్రాధాన్యం ఏ మేరకో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ తరహా పర్యావరణ అనుకూల పెట్టుబడి విధానం కొత్తదేమీ కాదు. కాకపోతే దీని రూపం మారింది. గ్రీన్ ఇన్వెస్టింగ్, సామాజిక బాధ్యతా పెట్టుబడి విధానం, సుస్థిర పెట్టుబడి అన్నవి ఈఎస్జీని పోలినవే. ఈ తరహా పెట్టుబడులన్నింటినీ ఏకం చేసింది ఈఎస్జీ. ఇప్పుడు ఈఎస్జీ అనుకూలం. ఈఎస్జీ వ్యతిరేకం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంపెనీలను చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రత్యేకంగా ఈఎస్జీ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడులు భిన్నం.. కంపెనీలు ఏ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయనే దానికంటే.. ఏ విధంగా లాభాలను పొందుతున్నాయన్నది ఈఎస్జీ విధానంలో కీలకం. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, వీలైతే మేలు చేస్తూ, చక్కని లాభాలను పోగేస్తున్న కంపెనీలకు ఈ విధానంలో మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం గత రెండు సంవత్సరాల్లోనే సుమారు 32 బిలియన్ డాలర్లు (రూ.2.56 లక్షల కోట్లు) ఈఎస్జీ ఆధారిత యూఎస్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులుగా వెళ్లాయి. ముందే చెప్పుకున్నట్టు ఈ పెట్టుబడికి సామాజిక స్పృహ ఎక్కువ. కనుక రాబడుల విషయంలో కొంత రాజీ పడక తప్పదు. ఎంఎస్సీఐ వరల్డ్ ఈఎస్జీ ఇండెక్స్ రాబడులను పరిశీలిస్తే.. గత 10 ఏళ్లలో రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సార్వత్రిక నిబంధనలు, ప్రమాణాలు ఈఎస్‌జీకి లేవు. అలాగే ఏకీకృత నిర్వచనం, విధానం కూడా లేవు. అసలు ఈఎస్జీ పేరుతో మూలసూత్రాలకు విరుద్ధంగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ఈఎస్జీ ఈక్విటీ ఫండ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత చమురు ధరల పెరుగుదలతో షెల్, రెప్సోల్ కంపెనీల్లో పెట్టుబడులు పెంచుకున్నాయి. కాగా, పెట్టుబడులపై భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫండ్స్ మేనేజర్ల పెట్టుబడుల విధానాలకు, ఈఎస్జీ సూత్రాలు ఏ విధంగా సరిపోలుతున్నాయో వెల్లడించేలా త్వరలో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. అలాగే, సెబీ సైతం ఫండ్స్ ఈఎస్జీ పథకాలకు సంబంధించి వెల్లడించాల్సిన సమాచారం విషయమై విస్తృతమైన సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేయడం గమనించదగిన అంశం. కొంచెం జాగ్రత్త అవసరం.. ఈఎస్జీ స్టాక్స్‌కు మార్కెట్ కొంచెం ప్రీమియం వ్యాల్యూషన్ ఇస్తుంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఈఎస్జీ థీమ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయి. తమ ఉత్పత్తులు పర్యావరణం అనుకూలమని తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణలను అరికట్టేందుకు నూతన పర్యావరణ నిబంధనలను కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. దీని కింద కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాలుష్య విడుదలకు సంబంధించి మరింత సమాచారం, వివరాలను వెల్లడించాలి. ఈఎస్జీ రేటింగ్ కోసం థర్డ్ పార్టీ సంస్థలపైనే కంపెనీలు ఆధారపడాల్సి వస్తోంది. సార్వత్రిక బెంచ్ మార్క్ లేదా పద్ధతి అనేది ఈఎస్జీ రేటింగ్‌లకు అమల్లో లేదు. కేంద్ర నూతన నిబంధనలు, సెబీ సంప్రదింపుల పత్రం తర్వాత విడు దల చేసే మార్గదర్శకాలతో ఈఎస్జీ థీమ్ మరింత పటిష్టం కానుంది. పెట్టుబడులకు ముందు ఆయా అంశాలపై అవగాహన అవసరం. ఈఎస్జీ స్కోర్ ఎలా? ఎన్విరాన్మెంట్ కంపెనీ కార్యకలాపాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు? గతంలో ఇలాంటి లక్ష్యాలను ఏ మేరకు సాధించింది? ఏ మేరకు ఇంధనాన్ని వినియోగిస్తోంది? పునరుత్పాదక ఇంధన వనరులను ఏర్పాటు చేసుకుందా? నీటి వినియోగం, కాలుష్యం విడుదల, వ్యర్థాల నిర్వహణ ఇలాంటి అంశాలన్నీ ఈఎస్జీ స్కోర్‌కు ముందు థర్డ్ పార్టీ సంస్థలు చూస్తాయి. సోషల్ ఉద్యోగులతో కంపెనీకి ఉన్న అనుబంధం, వారి భద్రతకు, ఆరోగ్యానికి తీసుకున్న చర్యలు, సమాజంతో ఉన్న సంబంధాలు, భాగస్వాములతో సంబంధాలను అధ్యయనం చేస్తారు. భాగస్వాములు, ఉద్యోగులు అందరినీ ఏకరీతిన చూసేందుకు వీలుగా కంపెనీలు అమలు చేస్తున్న విధానాలు, పద్ధతులను పరిశీలించడం జరుగుతుంది. నాణ్యత, సైబర్ సెక్యూరిటీ, డేటా భద్రత చర్యలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. గవర్నెన్స్ కంపెనీ బోర్డు నిర్మాణం ఎలా ఉంది? నిపుణులు, మహిళలకు చోటు కల్పించారా? బోర్డు కమిటీల ఏర్పాటు, బోర్డు పనితీరు, అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, స్టాట్యుటరీ ఆడిటర్లు, ఆడిట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌ను కూడా పరిశీలిస్తారు. దేశీయంగా... ఇంకా ఆరంభ దశలోనే దేశీయంగా ఈఎస్జీ థీమ్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఈఎస్జీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం రిస్క్‌తో కూడుకున్నదే. ఎందుకంటే ఇది లోతైన అంశం. విస్తృత సమాచారాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఎస్ఈఎస్ (స్టేక్ హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్) తదితర కొన్ని ఉచిత వేదికలు ఈఎస్జీ కంపెనీలకు సంబంధించి ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. ఇతర సంస్థల నుంచి ఈఎస్జీ కంపెనీల వివరాలు పొందాలంటే కొంత చెల్లించుకోవాల్సి వస్తుంది. నేరుగా కంటే మ్యూచువల్ ఫండ్స్ రూట్ నయం. ప్రస్తుతం 10 వరకు ఈఎస్జీ ఆధారిత థీమాటిక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎనిమిది పథకాలు గత రెండేళ్లలో ప్రారంభమైనవే ఉన్నాయి. రెండు పథకాలు ప్యాసివ్‌గా (ఇండెక్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవి) పనిచేస్తున్నాయి. ఒక పథకం దీర్ఘకాలం నుంచి ఉన్నా కానీ, ఆరంభంలో ఈఎస్జీ పథకంగా లేదు. దీర్ఘకాలంలో వ్యాపార పరంగా నిలదొక్కుకోగలవా? ఈఎస్‌జీలో ఏ అంశాల పరంగా కంపెనీ మెరుగ్గా ఉంది? వాటిని ఇక ముందూ కొనసాగించగలదా? భవిష్యత్తు వృద్ధి అవకాశాలు ఇలాంటి అంశాలను సాధారణ ఇన్వెస్టర్ కంటే మ్యూచువల్ ఫండ్స్ పరిశోధన బృందాలు మెరుగ్గా అంచనా వేయగలవు. ఇక ఈఎస్‌జీలో రెండు అంశాల్లో టిక్ మార్క్‌లు పడినా ఆయా కంపెనీలను సైతం ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎందుకంటే పర్యావరణం, సోషల్, గవర్నెన్స్ మూడింటిలోనూ సరితూగే కంపెనీలు కొన్నే ఉంటున్నాయి. అలాంటప్పుడు అదనపు పెట్టుబడుల సర్దుబాటుకు వీలుగా రెండు అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిని కూడా ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. 2022 అక్టోబర్ 1 నుంచి బిజినెస్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ సస్టెయిన్‌బిలిటీ రిపోర్ట్ (బీఆర్ఎస్ఆర్)ను విడుదల చేసే కంపెనీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న పెట్టుబడులకు 2023 సెప్టెంబర్ 30 వరకు సెబీ వెసులుబాటు కల్పించింది. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో (పీఎంఎస్) ఎస్బీఐ ఈఎస్జీ పోర్ట్‌ఫోలియో, అవెండస్ ఈఎస్జీ ఫండ్స్ పీఎంఎస్, వైట్ ఓక్ ఇండియా పయనీర్స్ ఈక్విటీ ఈఎస్జీ తదితర సంస్థల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలంలోనే రాబడులు..? ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే నిఫ్టీ 100 ఈఎస్జీ ఇండెక్స్ పనితీరే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. గత పదేళ్ల కాలంలో వార్షికంగా 15.25 శాతం కాంపౌండెడ్ రాబడిని ఈ సూచీ ఇచ్చింది. నిఫ్టీ 100 రాబడి కంటే ఇది ఒక శాతం ఎక్కువ. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రాబడులు మిశ్రమంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడులు మైనస్ 9 శాతం నుంచి ప్లస్ 27 శాతం మధ్య ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో మాత్రం సానుకూల పనితీరు చూపించాయి. ఏడు పథకాలు ఏడాది కాలంలో నష్టాలను ఇవ్వడం గమనించాలి. సెక్టోరల్ ఫండ్స్.. ఫార్మా (12 శాతం డౌన్), ఐటీ (15 శాతం డౌన్) కంటే ఈఎస్జీ ఫండ్స్ కాస్త నయమనే చెప్పుకోవాలి. మార్కెట్లో ఒక్కో సైకిల్లో కొన్ని రంగాల షేర్లు ర్యాలీ చేయడం, కొన్ని ప్రతికూల రాబడులను ఇవ్వడం సాధారణంగా ఉండే పరిణామమే. ఈఎస్జీ పథకాలు రాబడులను ఇవ్వాలంటే పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలన్నది మర్చిపోవద్దు. పోర్ట్‌ఫోలియో భిన్నమేమీ కాదు.. ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ముందుగా ఈఎస్జీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను పరిశీలించడం, అధ్యయనం చేయడం ద్వారా కొన్ని అంశాలను అయినా తెలుసుకునే వీలుంటుంది. ఈఎస్జీ ప్యారామీటర్లకు తూగే దేశీ స్టాక్స్ 200 వరకు, ఇంటర్నేషనల్ స్టాక్స్ 40 వరకు ఉంటాయి. ఇవన్నీ థీమ్యాటిక్ ఫండ్స్ కిందకు వస్తాయి. కనుక మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని ఈఎస్జీ కంపెనీల్లోనే అవి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం కూడా ఈఎస్జీ థీమ్‌కు పూర్తి వ్యతిరేకంగా ఉండకూడదని సెబీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పోర్ట్‌ఫోలియోల్లో కనిపించే స్టాక్సే ఈఎస్జీ పథకాల్లోనూ కనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఐటీ రంగ కంపెనీలు ఎక్కువ శాతం ఈఎస్జీ పథకాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఇవి పర్యావరణానికి హాని చేయకపోవడం, ప్రజల జీవనాన్ని సౌకర్యవంతం, మెరుగు చేయడం కోసం పనిచేస్తుంటాయి. కనుక వీటికి ఎక్కువ పథకాలు ఓటేస్తున్నాయి. 80 శాతం ఈఎస్జీ పథకాల్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ప్రముఖ స్టాక్స్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని ఈఎస్జీ పథకాల్లోనూ టాప్–10 హోల్డింగ్స్‌లో 4 నుంచి 9 వరకు అవే కంపెనీలు దర్శనమిస్తాయి. పీఎంఎస్, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో సాధారణంగా కనిపించే ఇతర స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌యూఎల్ ఉన్నాయి. -
మీదైన స్టయిల్ ఉండాల్సిందే..
టీనేజీలోనే స్టాక్స్‌లో పెట్టుబడి ప్రారంభం. 30 ఏళ్ల అనుభవం. రూ.800 కోట్లకు పైగా నెట్‌వర్త్. ఇది ప్రముఖ ఇన్వెస్టర్, కేడియా సెక్యూరిటీస్ అధినేత విజయ్ కేడియా ఈక్విటీ ప్రస్థానం. ఆయన పట్టిందల్లా బంగారం కాలేదు. కానీ, ఈక్విటీల్లో రాబడులు ఒడిసి పట్టడం ఎలాగన్నది ఆయనకు తెలుసు. స్టాక్స్ ఎలా ఎంచుకోవాలో తెలుసు. ఎంపిక చేసుకున్నది బెడిసి కొడితే తదుపరి ఏ అడుగు తీసుకోవాలో తెలుసు. అయినా సరే.. గత అనుభవాలు, గత విజయాలకు దోహదపడిన సూత్రాల ఆధారంగా ఒక స్టాక్‌లో పెట్టుబడి పెడితే.. రేపు అది 100 శాతం సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదంటారు. ఈక్విటీల్లో అటువంటి రిస్క్ఎప్పుడూ ఉంటుందన్నది ఆయన స్వీయ అనుభవం. అవును ఈక్విటీలంటే అంతే. ‘ఇన్నేళ్ల అనుభవం, ఇంత సంపద సృష్టి తర్వాత కూడా.. ‘నేను భయస్తుడిని. సామాన్యుడిని. అభద్రతా భావం ఉన్నవాడిని‘ అని తన గురించి కేడియా చెప్పుకోవడం వెనుక అంతరాన్ని అర్థం చేసుకోవాలి. ఒక పెట్టుబడి సక్సెస్ ఇచ్చిందని ‘అంతా నాకే తెలుసు’ అనుకుంటే కష్టం. అనుభవం, అధ్యయనం, విశ్లేషణ, విజ్ఞానం అన్నింటినీ జోడించి జాగ్రత్తగా వెళితే ఈక్విటీ ప్రయాణం సక్సెస్‌ను ఇస్తుంది. విజయ్ కేడియా తరహా ఇన్వెస్టర్ల విజయానికి దోహదం చేసిన అంశాలను తెలుసుకోవడం వల్ల మన అవగాహన మరికొంత విస్తృతమవుతుంది. ∙ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, డాలీఖన్నా, విజయ్ కేడియా.. ఇలాంటి బడా ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు చాలా మందే మన మార్కెట్లో ఉన్నారు. వీరంతా ఈక్విటీల్లో నిలిచి గెలిచినవారు. నష్టాలను పాఠాలుగా చేసుకుని, అనుభవంతో సంపద సృష్టించుకున్నారు. వీరిని గమనిస్తే కొన్ని లక్షణాలు ఒకే రీతిలో కనిపిస్తాయి. కనీసం మూడు దశాబ్దాలకు పైగా అనుభవం, మార్కెట్ల ఎత్తు పల్లాలను చూసి, వాటికి ఎదురీది, అనిశ్చితుల్లో ఏమి చేయాలో తెలిసిన వారు. ఇలా విజయవంతమైన బడా ఇన్వెస్టర్లలో కేడియా సెక్యూరిటీస్ అధినేత విజయ్ కేడియా కూడా ఒకరు. ఆయన ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెట్టుబడులు, తాను అనుసరించే సూత్రాలు తదితర సమాచారాన్ని పంచుకున్నారు. ఈక్విటీ ప్రయాణం చేసే, కొత్తగా ఈక్విటీల్లోకి వచ్చే రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ సమాచారం ఎంతో కొంత మార్గదర్శనం చేస్తుంది. అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు.. నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు చాలా మందే ఉన్నారు. స్టాక్స్ ఎంపికలో చేసే పొరపాట్లతో ఎక్కువ మంది నష్టపోతుంటారు. ఏ ప్రయాణం అయినా కొన్ని అవరోధాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడంపైనే గమ్యస్థానం చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. కనుక ఒకటి రెండు నష్టాలు ఇచ్చాయని కుదేలు కాకూడదు. ఆ అనుభవంతో తదుపరి పెట్టుబడుల్లో ఫెయిల్యూర్ అవకాశాలను తగ్గించుకోవాలి. విజయ్ కేడియా తన సక్సెస్ రేటు 50 శాతమే అని చెప్పారు. మరి ఆయనకేమైనా తక్కువ అనుభవం ఉందా..? 19 ఏళ్లకే ఈక్విటీ జర్నీ మొదలు పెట్టి, 30 ఏళ్లకు పైగా మార్కెట్‌తో కలసి నడుస్తున్న వ్యక్తి. రిటైల్ ఇన్వెస్టర్‌గా మనం ఎంపిక చేసుకునే ప్రతీ స్టాక్ మల్టీబ్యాగర్ కావాలని భావిస్తాం. దీంతో కళ్ల ముందు స్వల్ప వ్యవధిలోనే రెండు మూడు రెట్లు పెరిగిన స్టాక్‌ను చూసి ఆకర్షితులవుతాం. రిస్క్ తీసుకుని అధిక ధర వద్ద కొనుగోలు చేస్తాం. కానీ, వాటిని ఎక్కువ కాలం పాటు అట్టి పెట్టుకుంటామా..? లేదు. అసలు ఏ అంశాలను చూసి ఇన్వెస్ట్ చేశామన్నది ప్రశ్నించుకోము. అన్నీ మర్చిపోయి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తాం. ఎంపిక చేసుకునే 10 స్టాక్స్‌లో ఒకటి లేదా రెండు మాత్రమే మల్టీబ్యాగర్లు అవుతాయన్నది విజయ్ కేడియా అనుభవసారం. వైవిధ్యం.. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోను గమనిస్తే 90 శాతం ఈక్విటీల్లోనే ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఇక డెట్ సాధనాల్లో సున్నా. 8 శాతాన్ని రియల్ ఎస్టేట్‌పై పెట్టారు. మరో 2 శాతాన్ని బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టారు. పెట్టుబడులు అన్నీ ఒకే చోట పెట్టుకూడదన్నది ప్రాథమిక సూత్రం. ఎందుకంటే ఒకే విభాగంలో పెట్టినప్పుడు.. ఏదైనా సంక్షోభం వచ్చి ఆయా విభాగంపై ప్రభావం పడితే..? అదే సమయంలో పెట్టుబడులు వెనక్కి తీసుకోవాల్సి వస్తే..? అందుకుని ఈ రిస్క్‌ను తగ్గించుకునేందుకు కచ్చితంగా ఈక్విటీలతోపాటు డెట్, బంగారం ఇతర సాధనాలకు కేటాయించుకోవాలి. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోలో డెట్‌కు చోటు ఎందుకు లేదు...? అన్న సందేహం రావచ్చు. రాబడి, రిస్క్ కోణంలో ఆయనకు నచ్చని విభాగం అది. ‘‘నేను డెట్‌లో పెట్టుబడులు పెట్టను. నేను ఏవైనా షేర్లను విక్రయించాల్సి వస్తే ఆ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో 10–30 రోజుల కాలానికి ఉంచుతాను. నగదు రూపంలో ఉంటే నాకు నిద్ర పట్టదు’’ అని విజయ్‌కేడియా చెప్పారు. డెట్ ఆయనకు ఉద్వేగాన్ని ఇవ్వదట. పైగా రిస్క్ తీసుకోవడానికే తాను ఇష్టపడతానని చెప్పారు. అందుకే 90 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించారు. అదే సమయంలో 10 శాతాన్ని ఇతర సాధనాలకు కేటాయించడాన్ని గమనించాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. పెట్టుబడి విధానం స్నేహితుడో, సహచర ఉద్యోగి చెప్పాడనో.. లేదంటే అనలిస్ట్ సూచించాడనో బ్లైండ్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడికి సంబంధించి ఒక విధానం ఉండాలి. దీన్నే స్టయిల్ అనో, మరొకటో అనుకోవచ్చు. ఎంత రాబడి ఆశిస్తున్నారు, ఎంత కాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించగలరు? లేదంటే వారసులకు ఇవ్వడం కోసం స్టాక్స్‌ను పోగు చేస్తున్నారా..? ఏటా ఆయా కంపెనీల నుంచి ఎంత వృద్ధి ఆశిస్తున్నారు..? ఆయా కంపెనీలనే ఎందుకు ఇష్టపడుతున్నారు..? నష్టం వస్తే వెంటనే అమ్మేస్తారా..? లేదంటే దీర్ఘకాలం పాటు ఓపిక పడతారా..? ఇలా ఎన్నో అంశాలను ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే స్టాక్స్ ఎంపిక ఉంటుంది. విజయ్ కేడియా స్టాక్స్ ఎంపికకు ‘స్మైల్’ (టఝజీ ్ఛ) అనే సూత్రాన్ని అనుసరిస్తారు. ఎంపిక చేసుకునే కంపెనీ చిన్నది అయి ఉండాలి. కంపెనీకి ఆయా వ్యాపారంలో మధ్యస్థ అనుభవం అయినా ఉండాలి. కంపెనీకి ఎంతో ఎత్తుకు ఎదగాలన్న బలమైన ఆకాంక్షలు ఉండాలి. దీనికి తగ్గట్టు మార్కెట్ అవకాశాలు అపారంగా ఉండాలి. వీటికి టిక్ పడితే ఆయన ఆ స్టాక్‌లో పెట్టుబడి పెట్టేస్తారు. అందుకే విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియోలో స్మాల్‌క్యాప్ స్టాక్స్, మిడ్‌క్యాప్ స్టాక్స్ కనిపిస్తాయి. తాను పెట్టుబడి పెట్టినప్పుడు చిన్నగా ఉండి.. ఆ తర్వాత మల్టీబ్యాగర్ రిటర్నులతో లార్జ్ క్యాప్‌గా మారిందనుకోండి. అప్పుడు విజయ్ కేడియా మళ్లీ స్మాల్‌క్యాప్ జెమ్స్ అన్వేషణలో పడతారు. తాను అనుకున్న క్వాలిటీలతో కంపెనీ కనిపించిందనుకోండి.. వెంటనే అందులోకి పెట్టుబడి బదిలీ చేస్తారు. ‘‘నేను స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో ఆసక్తికరమైన కంపెనీ ఉందేమో చూస్తున్నాను. అవకాశం గుర్తిస్తే వెంటనే అందులోకి పెట్టుబడులు మార్చేస్తా’’అని చెప్పారు. స్వల్ప కాలం ఫలితం ఇవ్వదు మన చుట్టూ ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లను గమనిస్తే.. ఒక్కటి గుర్తించొచ్చు. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వెంటనే పెరిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కొనుగోలు ధర నుంచి కిందకు పడిపోతే వారిలో ఆందోళన మొదలవుతుంది. నష్టాల్లోనే ఆ కంపెనీ కొంత కాలం పాటు కొనసాగితే ఇక ఉండబట్టలేక ఎంతో కొంతకు అమ్మేస్తారు. అందుకే పెట్టుబడికి ముందు అధ్యయనం అవసరం. కంపెనీ వ్యాపారం, పనితీరు తదితర అంశాల ఆధారంగానే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. స్టాక్ ధరను చూసి కాదు. ఇలా చేస్తే కనుక అది తప్పుడు మార్గమే అవుతుంది. పైగా, ఈక్విటీ పెట్టుబడికి స్వల్పకాలం ఫలితమివ్వదు. దీర్ఘకాలమే రాబడులకు మార్గం అవుతుంది. విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియో గడిచిన ఏడాది కాలంలో రూపాయి లాభాన్ని ఇవ్వలేదు. గత ఏడాది కాలంలో ఆయనకు తేజాస్ నెట్వర్క్స్ షేరు మంచి రాబడినిచ్చింది. అదే సమయంలో అంబికా కాటన్ మిల్స్ ఫలితమివ్వలేదు. ‘‘నేను రాబడులను ఏటా చూసుకోను. నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ మంచి రాబడినిచ్చినవే. 2020లో నేను కొన్న కొన్ని స్టాక్స్ అయితే 10 రెట్లు పెరిగాయి. కానీ 2021 మే నుంచి మార్కెట్ పరిస్థితుల వల్ల స్టాక్స్ ఏ మాత్రం వృద్ధి లేకుండా అక్కడే ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి’’అని విజయ్ కేడియా తెలిపారు. రియల్ ఎస్టేట్ కూడా అంతే.. రియల్ ఎస్టేట్ రాబడులను కూడా కేడియా ఎప్పటికప్పుడు పరిశీలించుకోరు. ‘‘రియల్ ఎస్టేట్ పెట్టుబడి అన్నది దీర్ఘకాలం పాటు అంటే 10–40 ఏళ్ల కోసం. నేను అయితే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిని సందర్భోచితంగా చేస్తుంటాను’’అని ఆయన చెప్పారు. పైగా రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఒక ప్లాట్ కొనుగోలు చేయడం కాదు. దానిపై రాబడి వచ్చేలా చూసుకుంటారు. నెలవారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టే రెండు గోదాములు ఆయన రియల్టీ పెట్టుబడిలో భాగం. కేవలం స్టాక్ మార్కెట్ రాబడినే ఆయన నమ్ముకోరు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కోసం ఆయన రియల్ ఎస్టేట్‌లో 8% పెట్టుబడులు పెట్టారు. భవిష్యత్తు పెట్టుబడి ఆలోచనలు.. ఈక్విటీలకు పెట్టుబడులు పెంచుకునేందుకు విజయ్ కేడియా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకానీ, మార్కెట్లలో అస్థిరతలు ఉన్నాయని చెప్పి పెట్టుబడులను కొంత విక్రయించి నగదు నిల్వలు పెంచుకోవాలని అనుకోవడం లేదు. 2022 స్తబ్ధుగా ఉండడం వల్ల భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ల పతనాలను చూసి భయంతో విక్రయాలు చేస్తుంటారు. నిజానికి ఈ తరహా అనిశ్చితులు పెట్టుబడులు పెంచుకునేందుకు అను కూలం. ఈక్విటీ పెట్టుబడులను భౌగోళికంగా భిన్న ప్రాంతాల మధ్య వైవిధ్యీకరించుకోవాలని చెబుతుంటారు. కానీ, విజయ్ కేడియా ఈక్విటీ పెట్టుబడులు అన్నీ కూడా మన మార్కెట్లలోనే ఉన్నాయి. కాకపోతే గూగుల్ (ఆల్ఫాబెట్)లో మొదటిసారి ఆయన ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మినహా అమెరికా మార్కెట్లో మరే ఇతర టెక్నాలజీ షేరులో ఇన్వెస్ట్ చేయాలని ఆయన అనుకోవడం లేదు. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి 2,50,000 డాలర్లను విదేశాలకు పంపుకోవచ్చు. తన పెట్టుబడులకు ఈ పరిమితి సరిపోతుందని, తన పోర్ట్‌ఫోలియోపై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని కేడియా వివరించారు. అంతెందుకు హైనెట్వర్త్ ఇన్వెస్టర్లలో చాలా మందికి విదేశీ పెట్టుబడులు లేవనే చెప్పుకోవాలి. వారంతా మన ఈక్విటీలు, రియల్ ఎస్టేట్, బంగారంపైనే ఎక్కువగా పెట్టుబడులు కలిగి ఉన్నారు. అత్యవసర నిధి అత్యవసర నిధి ఎవరికైనా ఉండాల్సిందే. అవసర సమయంలో రుణం కోసం పరుగెత్తే విధంగా ఉండకూడదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను కూడా తాకకూడదు. అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా నిధిని లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకోవాలి. విజయ్ కేడియా అయితే అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోలేదు. దీన్ని కూడా ఆయన పెట్టుబడి మార్గంగా మలుచుకున్నారు. కంపెనీల నుంచి డివిడెండ్లు, గోదాముల రూపంలో రెంటల్ ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆయనకు తగినన్ని ఆదాయ మార్గాలున్నాయి. రిషికేశ్, గోవా, కేరళలో ఆయనకు యోగా, వెల్నెస్ కేంద్రాలు మూడున్నాయి. -
పెట్టుబడుల్లో ‘రిటైల్’ దూకుడు
ముంబై: ఈ క్యాలండర్ ఏడాది(2021) ప్రైమరీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల హవా నడిచింది. పబ్లిక్ ఇష్యూలకు సగటున 14.36 లక్షల దరఖాస్తులు లభించగా.. గతేడాది(2020)లో ఇవి 12.77 లక్షలుగా నమోదయ్యాయి. ఇక అంతక్రితం అంటే 2019లో సగటున రిటైలర్ల నుంచి 4.05 లక్షల దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. ఐపీవోలలో గ్లెన్‌మార్క్ లైఫ్‌సైన్స్ 33.95 లక్షల అప్లికేషన్లతో అగ్రస్థానం వహించగా.. దేవయాని ఇంటర్నేషనల్‌కు 32.67 లక్షలు, లేటెంట్ వ్యూ ఎనలిటిక్స్‌కు 31.87 లక్షల బిడ్స్ వచ్చాయి. పబ్లిక్ ఇష్యూకి వచ్చిన కంపెనీలలో సిగాచీ ఇండస్ట్రీస్ ఏకంగా 270 శాతం లాభంతో లిస్ట్‌కాగా.. పరస్ డిఫెన్స్ 185 శాతం, లేటెంట్ వ్యూ 148 శాతం ప్రీమియంతో తొలి రోజు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎస్ఎంఈ) ఇష్యూలు సైతం రెట్టింపై 55ను తాకాయి. వీటి విలువ రూ. 727 కోట్లుకాగా.. 2020లో 27 ఎస్ఎంఈలు ఐపీవోల ద్వారా కేవలం రూ. 159 కోట్లు సమీకరించాయి. ప్రైమ్‌డేటా బేస్ నివేదిక పొందుపరచిన వివరాలివి. ఇతర వివరాలు ఇలా.. పేటీఎమ్ జోరు ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్లో పేటీఎమ్ బ్రాండ్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ పెట్టుబడుల సమీకరణలో ఆధిపత్యం వహించింది. ఐపీవో ద్వారా రూ. 18,300 కోట్లు అందుకుంది. ఈ బాటలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో రూ. 9,300 కోట్లు సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో సగటు ఇష్యూ పరిమాణం రూ. 1,884 కోట్లకు చేరింది. 59 ఇష్యూలను విశ్లేషిస్తే 36 కంపెనీలకు 10 రెట్లుకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. వీటిలో ఆరు ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి 100 రెట్లు స్పందన లభించడం విశేషం! ఇక 8 ఇష్యూలు 3 రెట్లు, మరో 15 కంపెనీల ఆఫర్లకు 1–3 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. ఈక్విటీ నిధుల హవా ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలలో కొత్తతరం టెక్నాలజీ కంపెనీలు ఆధిపత్యం వహించినట్లు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు. నష్టాలలో ఉన్నప్పటికీ పలు స్టార్టప్‌లు విజయవంతంగా నిధులను సమీకరించినట్లు తెలియజేశారు. ఇందుకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా మద్దతు లభించినట్లు వివరించారు. దీంతో పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో భారీ లాభాలతో లిస్టయినట్లు ప్రస్తావించారు. మొత్తంమీద కంపెనీలు ఈక్విటీ(ఐపీవోలు, ఆఫర్ ఫర్ సేల్) మార్గంలో 2020లో సమకూర్చుకున్న రూ. 1,76,914 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రూ. 2 లక్షల కోట్లకు మించిన పెట్టుబడులను అందుకున్నాయని వెల్లడించారు. నిధుల సమీకరణ రికార్డ్ ఈ ఏడాది దేశీయంగా కంపెనీలు సమీకరించిన నిధులు రూ. 2 లక్షల కోట్లను దాటేశాయ్. వీటిలో 51 శాతం అంటే రూ. 1,03,621 కోట్లు తాజా పెట్టుబడులుకాగా..మరో రూ. 98,388 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమకూర్చుకున్నాయి. వెరసి ఈ ఏడాది కార్పొరేట్లు రూ. 2,02,009 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు నివేదిక తెలియజేసింది. ప్రధానంగా ప్రైమరీ మార్కెట్ ద్వారా ఇప్పటివరకూ 63 కంపెనీలు రూ. 1,18,704 కోట్లు అందుకున్నాయి. గతేడాది అంటే 2020లో 15 ఐపీవోల ద్వారా కంపెనీలు కేవలం రూ. 26,613 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే ఈ ఏడాది ప్రధాన పబ్లిక్ ఇష్యూల ద్వారా 4.5 రెట్లు అధికంగా పెట్టుబడులు ప్రవహించాయని ప్రైమ్‌డేటా బేస్ తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం 2017లో ప్రైమరీ మార్కెట్లో నమోదైన రూ. 68,827 కోట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోగా.. లక్ష కోట్లను దాటడం ద్వారా ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు తెరతీసింది. కాగా.. గత వారం ఇష్యూలను సైతం చేరిస్తే 65 కంపెనీలు రూ. 1.35 లక్షల కోట్ల(15.3 బిలియన్ డాలర్లు)ను సమీకరించినట్లవుతుందని బ్రోకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా క్యాపిటల్ ముందురోజు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
చిన్న పెట్టుబడి.. చిగురించేనా..?
‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’.. కాదని ఎవరూ అనరు. చిన్నారుల పట్ల ఎంతో శ్రద్ధ, సంరక్షణ, ముద్దు చూపిస్తాం. వారు భవిష్యత్ తరాలకు ప్రతిరూపాలు. అందుకే ఆ మాత్రం కేరింగ్ ఉంటుంది. అలాగే, విరామం అన్నది లేకుండా కష్టపడి సంపాదించుకుని, మిగుల్చుకున్న కొద్ది మొత్తంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే ముందు శ్రద్ధ అవసరం లేదా..? కచ్చితంగా ఉండాలి. చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే విషయంలోనూ ఇన్వెస్టర్లకు అంతే శ్రద్ధ, పరిశీలన, జాగ్రత్త అవసరం. పెద్ద కంపెనీలతో పోలిస్తే.. ఒక నిర్ధేశిత కాలంలో చిన్న కంపెనీలు అధిక రాబడులు ఇస్తాయన్నది కాదనలేని నిజం. 2020 ఏప్రిల్ నుంచి చూసుకుంటే లార్జ్‌క్యాప్ కంపెనీలు నూరు శాతం వరకు రాబడులను ఇవ్వగా.. మిడ్‌క్యాప్ కంపెనీలు రెండు రెట్లు, అంతకంటే ఎక్కువ, స్మాల్‌క్యాప్‌లో ఐదు రెట్లు, పది రెట్ల లాభాలను కురిపించిన స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి చిన్న కంపెనీలంటే అంత ఆకర్షణ. కార్పొరేట్ ప్రపంచంలో ఎస్ఎంఈలు అంటే చాలా చిన్న కంపెనీలని అర్థం చేసుకోవాలి. పెద్ద కంపెనీలతో పోలిస్తే వేగంగా ఎదిగే సామర్థ్యం వీటికి సహజంగానే ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేని సమయాల్లో ఇవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే.. ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక పెద్ద కంపెనీ డివిడెండ్ ఆపేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక చిన్న కంపెనీ ఏకంగా మూతపడిపోవచ్చు. అందుకే ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బీఎస్ఈ ‘ఎస్ఎంఈ’, ఎన్ఎస్ఈ ‘ఎమర్జ్’ ప్లాట్‌ఫామ్‌లు ఎస్ఎంఈల కోసం ఉద్దేశించినవి. ఇక్కడ సుమారు 380 స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్ విలువ రూ.25,600 కోట్లు. ఒక మిడ్‌క్యాప్ కంపెనీ మార్కెట్ విలువకు సమానం. మార్కెట్ విలువ విషయంలో నక్కకి, నాగలోకానికి అన్నట్టు ఈ కంపెనీల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,000 కోట్లుగా ఉంటే, మరొక కంపెనీ మార్కెట్ విలువ కేవలం కోటి రూపాయలే. ఈ కంపెనీలన్నింటి టర్నోవర్ 2021 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లు. లాభం రూ.280 కోట్లుగానే ఉంది. ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో ఒక వారంలో నమోదు చేసిన లాభంతో ఇది సమానం. కరోనా సంవత్సరంలో ఈ కంపెనీల రుణ భారం రూ.6,000 కోట్ల నుంచి రూ.6,500 కోట్లకు పెరిగింది. ప్రతీ నాలుగు కంపెనీల్లో ఒకటి నష్టాలను నమోదు చేసింది. ఇంత చిన్నవి కావడం, ఆర్థిక బలం తక్కువగా ఉండడం వల్ల సంక్షోభాల ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వాటిని ఎదుర్కొనే శక్తి కొన్నింటికే ఉంటుంది. ... ఇక లాభాలను పరిశీలిస్తే.. సగటు లాభాల మార్జిన్ ఎస్ఎంఈలకు ఒక శాతంగానే ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇది సగటున 10 శాతం, మిడ్‌క్యాప్ కంపెనీలకు 5 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 3.4 శాతం చొప్పున ఉంది. వ్యాపార విస్తరణ అవకాశాలు, సరైన వ్యాపార నమూనాలు వీటికి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అర్థం చేసుకోవచ్చు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌వోసీఈ) ఎస్ఎంఈ స్టాక్స్‌కు 8.5 శాతంగా ఉంటే, రిటర్న్ ఆన్ నెట్‌వర్త్ (ఆర్వోఎన్డబ్ల్యూ) 6.5 శాతం చొప్పున ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీలకు 12–16 శాతం మధ్య, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 11–16 శాతం మధ్య ఈ రేషియోలు ఉన్నాయి. పైగా చాలా వరకు ఎస్ఎంఈ కంపెనీలు టెక్నాలజీ, వినూత్న వ్యాపారాల్లోనివి కావు. ఇప్పటికే వేలాది కంపెనీలు పనిచేస్తున్న సంప్రదాయ వ్యాపారంలోనివే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఈ కంపెనీల వ్యాపారానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. తమ కంటే పెద్ద కంపెనీలతో పోటీపడేంత సామర్థ్యం తక్కువ వాటికే ఉంటుంది. రాళ్లలో రత్నాన్ని గుర్తించినప్పుడే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు రాలతాయి. ఇందుకోసం లోతైన అధ్యయనం కావాల్సిందే. ఇబ్బందులు రాకుండా ఉండాలంటే... చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎస్ఎంఈ)ల కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ల గురించి వినే ఉంటారు. ఈ విభాగంలో ఐపీవోల గురించి తెలిసింది తక్కువే. ఇటీవలి కాలంలో ఈ విభాగంలోనూ చాలా కంపెనీలు ఐపీవోల ద్వారా లిస్ట్ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు స్వల్పకాలంలోనే కాసులు కురిపిస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్లు ఇటువైపు చూస్తున్నారు. కొన్ని భారీ రాబడులను తెచ్చిపెడుతున్నది నిజమే. కానీ, నష్టాలు ఇచ్చేవీ ఉంటాయి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే ముందు.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి, పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తగిన రక్షణ చర్యలతో ప్రయాణం ఆరంభిస్తే.. మధ్యలో ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదురొడ్డగలరు. అనుకున్నట్టుగానే లక్ష్యాన్ని చేరుకోగలరు. అధ్యయనం చేస్తే లాభాలే.. అన్నింటినీ పరిశీలించి సరైన కంపెనీని ఎంపిక చేసుకుంటే లాభాలు ఖాయమనడానికి ఉదాహరణగా బీఈడబ్ల్యూ ఇంజనీరింగ్, ప్రివెస్ట్ డెన్‌ప్రో, ఓమ్ని పొటెంట్, ఫోకస్ బిజినెస్ సొల్యూషన్స్ లిస్టింగ్ నాడే 50–125 శాతం మధ్య లాభాలను ఇచ్చాయి. 2021లో 45 ఎస్ఎంఈ ఐపీవో లు రాగా ఇందులో లిస్టింగ్ రోజు 17 కంపెనీలు లాభాలను ఇవ్వలేకపోయాయి. కానీ, ఈకేఐ ఎనర్జీ, రంగోలి ట్రేడ్‌కామ్, నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్, బీఈడబ్ల్యూ ఇంజనీరింగ్, ప్రోమ్యా క్స్ పవర్ అండ్ ప్లాటినమోన్ బిజినెస్ 100 శాతం నుంచి 5,000 శాతానికి పైనే రాబడులను ఇచ్చాయి. 48 ఐపీవోల్లో 24 కంపెనీలు ఇప్పటికీ ఇష్యూ ధరకు దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. విలువ, లభ్యత బుల్ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగానే ఉంటాయి. ఆ సమయంలో కంపెనీల స్టాక్ వ్యాల్యూషన్లు గరిష్టాలకు చేరడం సహజం. ఎస్ఎంఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే వారు బుల్ ర్యాలీల్లో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో ఇతర కంపెనీలకు సంబంధించి ఒక్క షేరును అయినా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, ఎస్ఎంఈ స్టాక్స్‌లో ఇది సాధ్యం కాదు. ఉదాహరణకు ఈకేఐ ఎనర్జీ స్టాక్‌నే తీసుకోండి. నెల క్రితం వరకు 1200 లాట్ సైజుగా ఉండేది. అప్పుడు ఒక్కో షేరు ధర రూ.3,000కుపైమాటే. అంటే రూ.36 లక్షలు పెడితేనే ఒక లాట్‌ను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఆ తర్వాత లాట్‌సైజ్ 50కు తగ్గింది. ప్రస్తుతం ధర రూ.5,800గా ఉండడంతో 50 షేర్లను కొనుగోలు చేయాలంటే పెట్టుబడిగా సుమారు రూ.3లక్షలు కావాల్సిందే. సాధారణ కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు ఒక్క లాట్ కోసం రూ.15వేల పెట్టుబడి చాలు. కానీ, ఎస్ఎంఈ ఐపీవోలో పాల్గొనాలంటే సుమారు రూ.1.20 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. పీఈ రేషియో ఆధారంగా ఎస్ఎంఈ స్టాక్స్ ఎంపిక కాకుండా, ఇతర వ్యాల్యూషన్ అంశాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంటర్ప్రైజ్ వ్యాల్యూ(ఈవీ) టు ఎబిట్డా, ప్రైస్ టు బుక్ వ్యాల్యూ, అమ్మకాలతో పోలిస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ ఏ మేరకు ఉంది.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి ఆధారంగా దిగ్గజ కంపెనీలతో పోలిస్తే ఈ చిన్న కంపెనీలు చౌకగా ఉన్నాయా లేక ఖరీదుగా ట్రేడవుతున్నాయా అన్న అవగాహనకు రావచ్చు. ఎస్ఎంఈ విభాగంలోని క్వాలిటీ ఫార్మా ఏకంగా 55 పీఈలో ట్రేడవుతోంది. అంటే ఫార్మాలో దిగ్గజాలైన దివిస్, గ్లాండ్ ఫార్మా, జీఎస్కే ఫార్మా, అబ్బాట్ ఇండియా, నాట్కో కంపెనీల పీఈ వ్యాల్యూషన్లలో ఈ కంపెనీ ఉంది. ఎస్ఎంఈ విభాగంలోని బ్రోకరేజీ స్టాక్ ఈస్ట్ ఇండియా సెక్యూరిటీస్ అయితే 7 పీఈలోనే చౌకగా అందుబాటులో ఉంది. బ్రోకరేజీలో దిగ్గజాలదే ఎప్పుడూ మార్కెట్ ఆధిపత్యం ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలకు పోర్ట్‌ఫోలియోలో ప్రాధాన్యం ఇస్తారు. ఆటుపోట్లు అధికం పెద్ద కంపెనీలు అయితే మార్కెట్ల పతనాల్లో నష్టాల పరంగా రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలు ఎక్కువగా అస్థిరతలకు లోనవుతుంటాయి. ఎస్ఎంఈ విభాగంలో అయితే ఆటుపోట్లు మరింత అధికం. 2020 మార్చి సమయంలో ఈ విభాగంలోని ప్రతీ మూడు కంపెనీల్లో రెండు 25 శాతానికి పైనే నష్టపోయాయి. ఎస్ఎంఈ స్టాక్స్‌లో లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. దీంతో ప్రతికూల సమయాల్లో, మార్కెట్ అస్థిరతల్లో విక్రయించుకోవడం కష్టంగా మారొచ్చు. ముఖ్యంగా డౌన్సర్క్యూట్లోకి వెళితే మరింత నష్టాలకు విక్రయించుకోవాల్సి రావచ్చు. చిన్న కంపెనీలు కావడంతో అందుబాటులో (ప్రీ ఫ్లోట్) షేర్లు కూడా పరిమితంగానే ఉంటుంటాయి. దీంతో ఒక సర్కిల్ ఆపరేటర్ల ఆధిపత్యంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల వల్ల కొంత కొనుగోలు మద్దతు రాగానే ధరలు అప్పర్ సర్క్యూట్‌కు వెళ్లడం.. కొంచెం విక్రయాల ఒత్తిడికే డౌన్ సర్క్యూట్‌ను చూడడం కనిపిస్తుంది. ఇది వ్యయాలను పెంచుతుంది. పైగా అన్ని స్టాక్స్ రోజువారీగా ట్రేడ్ అవుతాయని అనుకోవద్దు. బీఎస్ఈ ఎస్ఎంఈ విభాగంలో 201 స్టాక్స్‌కు గాను 90 స్టాక్స్‌లోనే రోజువారీగా ట్రేడింగ్ నమోదవుతుంటుంది. బీఎస్ఈలో ఎస్ఎంఈ షేర్లు ‘ఎం’ గ్రూపు కింద ట్రేడవుతుంటాయి. ఎస్ఎంఈలోని 21 కంపెనీలు గత 12 నెలల్లో రెట్టింపునకు పైగా పెరిగాయంటే.. సత్తానా లేక డిమాం డ్ వల్లనా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కవరేజీ తక్కువ ఎస్ఎంఈ కంపెనీలకు బ్రోకరేజీ సంస్థలు, విశ్లేషకుల కవరేజీ అన్నది ఏదో ఒకటి రెండు కంపెనీలు మినహా దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. దీంతో ఆయా కంపెనీలు, వాటి వ్యాపార వ్యూహా లు, భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలు, పోటీతత్వం, యాజమాన్యం సామర్థ్యం గురించి తెలుసుకునే అవకాశాలు ఉండవు. ఇదే పెద్ద ప్రతికూలత. అయితే, బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లు కొన్ని ఎస్ఎంఈ స్టాక్స్‌కు సంబం ధించి పరిశోధన నివేదికలను అందుబాటు లో ఉంచుతున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందు ఈ నివేదికలను చదివి కంపెనీల గురించి తెలుసుకోవాలి. కంపెనీల సామర్థ్యాలు తెలియనప్పుడు కేవలం డిమాండే ఆయా స్టాక్స్ ధరలను నిర్ణయిస్తుంటుంది. కనుక కవరేజీ ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకోవడం కాస్తంత సురక్షితం. దీనివల్ల ఆయా కంపెనీల గురించి ఎక్కువ మందికి సమాచారం వెళుతుంది. పెట్టుబడులూ వస్తాయి. చిన్న కంపెనీలకు మద్దతుగా.. పెద్ద కంపెనీలకు నిధుల సమీకరణ పెద్ద కష్టమైన పని కాదు. కానీ, అతి చిన్నవైన కంపెనీలకు నిధులను రాబట్టుకోవడం ఎంతో కష్టం. వీటికి మద్దతుగా నిలిచేందుకే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశాయి. మెయిన్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే ఎస్ఎంఈ విభాగంలోని కంపెనీలకు నిబంధనల పరంగా కొంత వెసులుబాటూ ఉంది. ఇతర కంపెనీలకు మాదిరిగా ఎస్ఎంఈల ఐపీవోలకు సెబీ అను మతి అక్కర్లేదు. ఎక్సే్ఛంజ్లే అబ్జర్వేషన్ లెటర్‌ను మంజూరు చేస్తాయి. మెయిన్ ప్లాట్‌ఫామ్‌ల్లోని కంపెనీలు ప్రతీ మూడు నెలలకోసారి ఖాతాలను ఆడిటింగ్ చేయించుకోవాలి. ఎస్ఎంఈలకు ఇది ఆరు నెలలుగా అమలవుతుంది. సత్తా ఉన్న కంపెనీలు చిన్నవైనా సరే నిధుల సమీకరణతో మరింత ఎదిగేందుకు అనుకూలమైన వేదికలుగా ఇవి ఉపయోగపడతాయి. కనుక ఈ వేదికలు పెట్టుబడులకే కానీ, ట్రేడింగ్‌కు అనుకూలంగా ఉండదు. -
బాండ్లలోకి.. సేఫ్ రూట్
పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించుకోవాలి. రాబడులు కూడా స్థిరంగా ఉండాలి. ఇలా కోరుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు.. ప్రభుత్వ బాండ్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది. స్టాక్ బ్రోకర్ ద్వారా ‘ఎన్ఎస్ఈ గోబిడ్’ ఖాతా తెరిచి ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్బీఐ తీసుకొచ్చిన రిటైల్ డైరెక్ట్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్డీజీ) అకౌంట్ రూపంలో అయినా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయవచ్చన్నది చూద్దాం.. స్టాక్ మార్కెట్ మాదిరే ప్రభుత్వ బాండ్లకు సంబంధించి కూడా ప్రైమరీ, సెకండరీ మార్కెట్లు ఉన్నాయి. ఈక్విటీ ప్రైమరీ మార్కెట్లో వివిధ కంపెనీల ప్రమోటర్లు ఐపీవో రూపంలో (ప్రైమరీ మార్కెట్) షేర్లను ఆఫర్ చేస్తారు. ప్రభుత్వ బాండ్ల ప్రైమరీ మార్కెట్లో సర్కారు తరఫున ఆర్బీఐ బాండ్లను ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను కాలానుగుణంగా ఆర్బీఐ వేలం నిర్వహిస్తుంటుంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్స్ తదితర ఇనిస్టిట్యూషన్స్ ఇందులో పాల్గొని కొనుగోలు చేస్తుంటాయి. ఈ రూపంలో ప్రభుత్వానికి నిధులు సమకూరుతుంటాయి. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం సంస్థాగత ఇన్వెస్టర్ల మాదిరే ప్రభుత్వ సెక్యూరిటీలను (జీసెక్‌లు) వేలంలో పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ కాంపిటీటివ్ బిడ్ల రూపంలో ప్రత్యేక కోటా (5 శాతం) కింద పాల్గొని కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. భారత ప్రభుత్వ ట్రెజరీ బిల్లులు (టీ బిల్స్), డేటెడ్ సెక్యూరిటీలు (జీసెక్‌లు), ప్రభుత్వ బంగారం బాండ్లు (ఎస్‌జీబీలు), రాష్ట్రాభివృద్ధి రుణాలు (ఎస్డీఎల్) తదితర సెక్యూరిటీలు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజుల కోసం రుణాలు తీసుకోవాలని భావించినప్పుడు టీ బిల్లులను జారీ చేస్తుంది. డేటెడ్ జీసెక్‌లు, ఎస్డీఎల్ను ఏడాది నుంచి 40 ఏళ్ల కాల వ్యవధుల కోసం ఆర్బీఐ ఇష్యూ చేస్తుంటుంది. ఐపీవోలు ఎప్పుడైనా రావచ్చు. కానీ, ప్రభుత్వ సెక్యూరిటీల వేలం అలా ఉండదు. ఆర్బీఐ దీన్ని కేలండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తుంటుంది. కనుక కొనుగోళ్లకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. డేటెడ్ సెక్యూరిటీల విషయంలో ఆరు నెలల ముందుగా ఆర్బీఐ వేలం కేలండర్(షెడ్యూల్)ను ప్రకటిస్తుంది. ఆర్బీఐ పోర్టల్ నుంచి ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ► ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయిన తర్వాత ప్రస్తుతానికి వేలంలో ఉన్న సెక్యూరిటీల వివరాలు కనిపిస్తాయి. టీ బిల్లులను ముఖ విలువ (ఫేస్‌వ్యాల్యూ) కంటే తక్కువకే ఆఫర్ చేస్తారు. ఉదాహరణకు 182 రోజుల టీబిల్లు (రూ.100 ముఖ విలువ)ను రూ.98కి వేలం వేస్తారనుకుంటే.. అప్పుడు మీకు లభించే రాబడి రేటు 1.09 శాతం అవుతుంది. జీసెక్ల వేలం ఈల్డ్ ఆధారితంగానూ ఉండొచ్చు. లేదా ధరల ఆధారితంగానూ ఉండొచ్చు. నూతన జీసెక్‌లు సాధారణంగా ఈల్డ్ ఆధారితంగానే ఉంటాయి. కూపన్ రేటు ఆధారంగా బిడ్ వేసుకోవచ్చు. వేలం పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన తక్కువ కూపన్రేటును కటాఫ్ ఈల్డ్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. దాంతో ఆ రేటే బాండ్‌పై లభించే వడ్డీ రేటు అవుతుంది. ధరల ఆధారిత వేలాన్ని కూడా ఆర్బీఐ నిర్వహిస్తుంటుంది. పాత తేదీలతో కూడిన జీసెక్‌లను తిరిగి జారీ చేసే సందర్భాల్లో ఇలా చేస్తుంది. పోటీతో కూడిన బిడ్డింగ్‌లో కటాఫ్ ఈల్డ్ కంటే తక్కువకు కోట్ చేసిన లేదా కటాఫ్ ప్రైస్ కంటే ఎక్కువకు కోట్ చేసిన ఇనిస్టిట్యూషన్లకు కేటాయింపులు చేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు.. ఇనిస్టిట్యూషన్లు నిర్ణయించిన కటాఫ్ ఈల్డ్/ధరల వద్ద కోట్ బిడ్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో సగటు రేటు ఆధారంగా బాండ్ల కేటాయింపు ఉంటుంది. సగటు రేటు కటాఫ్ రేటు కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ విలువ కంటే కొంచెం ఎక్కువకు జీసెక్‌లను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. సెకండరీ మార్కెట్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐఎల్) నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–వోఎం) ప్లాట్‌ఫామ్‌పై ప్రభుత్వ బాండ్లలో సెకండరీ ట్రేడింగ్ కొనసాగుతుంటుంది. టెలిఫోన్ ఆర్డర్లు కూడా ఇక్కడే నమోదవుతాయి. కనుక తాజా మార్కెట్ ఆక్షన్ కోసం, ధరలు, లిక్విడిటీ సమాచారం కోసం ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆర్డీజీ ఖాతా సాయంతో సెకండరీ మార్కెట్లోనూ పాల్గొనవచ్చు. ఎన్డీఎస్–వోఎం రెండు విభాగాలను.. ‘రెగ్యులర్ మార్కెట్’, ‘ఆడ్ లాట్స్ విభాగం’ను ఆఫర్ చేస్తుంది. రెగ్యులర్ మార్కెట్లో ఒక లాట్ సైజ్ రూ.5కోట్లు. రూ.5కోట్లకంటే తక్కువ విలువ ట్రేడ్స్ కోసం ఆడ్లాట్స్ విభాగం పనిచేస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఇక్కడే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు చేసుకోవాల్సిన ప్రభుత్వ సెక్యూరిటీల ప్రత్యక్ష ధరలను మార్కెట్ వేళల్లో https:// www. ccilindia. com/ OMHome. aspx పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వాటి కూపన్ రేటు, సంవత్సరం వారీగా ట్రేడవుతుంటాయి. ఉదాహరణకు పదేళ్ల ప్రభుత్వ బాండ్ 0610 ఎ 2031 ఈ పేరుతో ట్రేడవుతుంది. ఇందులో 6.10 అన్నది కూపన్ రేటు. జీసెక్ 2031 అన్నది మెచ్యూరిటీ సంవత్సరాన్ని తెలియజేస్తుంది. ఫిక్స్డ్ రేటు బాండ్లు కూడా వాటి కూపన్రేటుతోనే ట్రేడవుతాయి. ఫ్లోటింగ్ రేటు బాండ్లు ఎఫ్ఆర్బీ పేరుతో ఉంటాయి. టీబిల్లులు మెచ్యూరిటీ సంవత్సరంతో ఉంటాయి. ఉదాహరణకు 091 ఈఖీఆ17022022 అన్నది.. 91 రోజుల ట్రెజరీ బిల్లు.. 2022 ఫిబ్రవరి 17న మెచ్యూరిటీ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎన్డీఎస్–వోఎం హోమ్‌పేజీలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న అన్ని సెక్యూరిటీలు కనిపిస్తాయి. ఏ ధర వద్ద ప్రారంభమైంది, కనిష్ట, గరిష్ట ధరలు కూడా ఉంటాయి. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఆర్బీఐ వద్ద ప్రారంభించే ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా) కాల్ చేయడం లేదా, ఈమెయిల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవు. దేశీయంగా సేవింగ్స్ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబరుతో రిటైల్ ఇన్వెస్టర్లు నమోదు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు .. సెటిల్మెంట్ రోజున ఆర్డీజీ ఖాతాలోకి జమవుతాయి. కాలవ్యవధి బాండ్ నుంచి పొందే రాబడులపై కాలవ్యవధి ఎంతో ప్రభావం చూపిస్తుంది. 91 రోజుల టీబిల్లు లేదా 20ఏళ్ల జీసెక్‌లలో దేనిని కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ఎలా వస్తారు? ఈ విషయంలో మీ ఆర్థిక లక్ష్యానికి ఎంత కాలం ఉందన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. మూడు నెలల్లో ఖర్చుల కోసం అయితే 91 రోజుల టీబిల్లు తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే అప్పుడు 20ఏళ్ల జీసెక్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు మరో ప్రాధాన్య అంశం అవుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతుంటే, అప్పటికే మార్కెట్లో ఉన్న పాత బాండ్ల రేట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే కొనుగోలుదారులు అధిక కూపన్ రేటును ఆఫర్ చేస్తున్న తాజా బాండ్ల వైపు మొగ్గు చూపిస్తారు. ఎంపిక చేసుకునే బాండ్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటే కనుక రేట్ల పెరుగుదల సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. స్టాక్ సూచీల మాదిరే బాండ్ల రేట్లు కూడా మారుతుండడం సహజం. గడిచిన 20ఏళ్లలో ఆర్బీఐ రెపోరేటు 4–8 శాతం మధ్య కదలాడింది. పదేళ్ల జీసెక్ 5.8–9.1 శాతం మధ్య ట్రేడ్ అయింది. మనం ఇప్పుడు కనిష్ట రేట్ల వద్ద ఉన్నాం. కనుక దీర్ఘకాలంతో కూడిన వాటితో పోలిస్తే స్వల్పకాల బాండ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక కాలవ్యవధిని పెంచుకుంటున్నామంటే రేట్ల పరంగా కొంచెం రిస్క్ తీసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. కనుక కొంచెం అదనపు రేటు కోసం దీర్ఘకాలం సెక్యూరిటీని ఎంపిక చేసుకోవడం కాకుండా.. మీ లక్ష్యానికి సరిపడే కాలవ్యవధిపై ఉన్న బాండ్‌కే పరిమితం కావడం మంచిది. సెక్యూరిటీ టీబిల్లు, జీసెక్‌లను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. వీటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్)పై రేటు సాధారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కనుక వీటి ఎంపిక విషయమై తగిన అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మార్గం అనుకూలం. లిక్విడిటీ ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అన్నది.. షేర్లలో మాదిరి భారీగా ఉండదు. ముఖ్యంగా ఆడ్లాట్ విభాగంలో ఈ పరిస్థితి ఉంటుంది. కనుక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసుకునే వారు కాలవ్యవధి వరకు వేచి ఉండేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి. ఒకవేళ గడువుకు ముందే వాటిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎన్డీఎస్–వోఎంలో ఆయా బాండ్‌కు సంబంధించి మొత్తం ఎన్ని ట్రేడయ్యాయి అన్నది చూసుకోవాలి. ఇటీవలే ఇష్యూ అయిన 10ఏళ్లు, 5ఏళ్లు, 3ఏళ్ల జీసెక్‌లలో ట్రేడ్ వ్యాల్యూమ్ 70–80 శాతంగా ఉంది. దీర్ఘకాల జీసెక్లతో పోలిస్తే టీబిల్లులు, ఎస్డీఎల్లలో వ్యాల్యూమ్ తక్కువగా ఉంటుంది. ఈ లిక్విడిటీ అన్నది పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటుంది. ఈ అంశాలకు ప్రాధాన్యం.. ప్రభుత్వ సెక్యూరిటీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు.. -
చిన్న ఇన్వెస్టర్లకూ ప్రభుత్వ బాండ్లు!!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. అంతే కాదు, బ్యాంకింగ్ సేవా లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన రెండు స్కీములను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ వీటిలో ఉన్నాయి. దేశీయంగా పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచడానికి, సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం నిధులు సమీకరించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ‘‘మధ్య తరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు మొదలైన వర్గాల వారంతా తమ పొదుపు మొత్తాలను నేరుగా, సురక్షితంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీలకు కచ్చితమైన సెటిల్మెంట్ హామీ ఉంటుంది కాబట్టి చిన్న ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుంది’’ అని మోదీ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింతగా ప్రభావం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ విధానాలు కూడా తోడ్పడ్డాయని ఆయన తెలిపారు. సమష్టి కృషితో ఎకానమీ రికవరీ: ఆర్థిక మంత్రి కోవిడ్–19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఇటు ఆర్థిక శాఖ అటు ఆర్బీఐ కలిసికట్టుగా పనిచేయడం వల్ల, వేగంగా కోలుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రిటైల్ డైరెక్ట్ స్కీముతో బాండ్ల మార్కెట్ మరింతగా విస్తరించగలదని ఆమె తెలిపారు. మరోవైపు, తమ సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలను గణనీయంగా ఉపయోగించుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్.. ఈ స్కీముతో వ్యక్తిగత రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లు, రాష్ట్రాల అభివృద్ధి రుణాలకు సంబంధించిన బాండ్లు మొదలైన వాటిని నేరుగా కొనుగోలు చేయొచ్చు. ఇతర ఇన్వెస్టర్లకు గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు. ఇందుకోసం ఆర్బీఐ వద్ద ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లు ఆయా ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. ఎన్డీఎస్–ఓఎం అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ బాండ్ల జారీ, సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి బడా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఒకే అంబుడ్స్‌మన్.. సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021 కింద, రిజర్వ్ బ్యాంక్ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలపై కస్టమర్లు ఒకే చోట ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్‌మన్ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018, అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021ను రూపొందించారు. రూ. 50 కోట్ల పైగా డిపాజిట్ పరిమాణం ఉన్న షెడ్యుల్యేతర సహకార బ్యాంకులనూ దీనిలోకి చేర్చారు. ఫిర్యాదులపై ఆయా ఆర్థిక సంస్థలు 30 రోజుల్లోగా సంతృప్తికరమైన పరిష్కారం చూపకపోతే, కస్టమర్లు సమగ్ర అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. -
కంపెనీల్లో మోసాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయ్
ముంబై: ఇటీవల ఓవైపు ఈక్విటీలలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుంటే.. మరోపక్క కంపెనీలలో మోసాలు సైతం అధికంగా బయటపడుతున్నట్లు సెబీ అధికారి ఎస్కే మొహంతీ పేర్కొన్నారు. ఇది ప్రమాదకర ట్రెండ్ అంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ మొహంతీ వ్యాఖ్యానించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో భాగంగా ప్రసంగిస్తూ వీటికి చెక్ పెట్టవలసిన అవసరమున్నదని స్పష్టం చేశారు. క్రోల్ పాయింట్స్ నిర్వహించిన ఒక సర్వేను ప్రస్తావిస్తూ ఈ ఏడాది 65 శాతం కంపెనీలలో మోసాలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో 1.5 కోట్లమంది కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు ప్రవేశించినట్లు తెలియజేశారు. రిటైలర్లు పెట్టుబడుల కొనసాగింపులో సహనంతో వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే మోసాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు చాలా చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. దీంతో ఇన్వెస్టర్లలో చైతన్యం, అవగాహన, విజ్ఞానం వంటి అంశాలను పెంపొందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. మోసాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయడంతోపాటు, పెట్టుబడుల విలువనూ దెబ్బతీస్తాయని మొహంతీ వివరించారు. షేర్ల ధరలపై ప్రభావం చూపగల సమాచారాన్ని పొందడం ద్వారా కొంతమంది తమకు సంబంధించిన వ్యక్తులు లబ్ది పొందేందుకు సహకరిస్తుంటారని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు ఇకముందు మరింత పెరిగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. అయితే మోసాలకు పాల్పడేవారికి చెక్ పెట్టే బాటలో సెబీ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగానే సాధారణ దర్యాప్తు విభాగం నుంచి గతేడాది కార్పొరేట్ మోసాల పరిశోధన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐబీ వెంచర్స్‌కు జరిమానా ఇండియాబుల్స్ వెంచర్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఒక సంస్థతోపాటు.. కంపెనీ సీఈవోసహా నలుగురికి సెబీ జరిమానా విధించింది. కంపెనీ షేర్లకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల కేసు సెటిల్మెంట్ చార్జీల కింద రూ. 5 కోట్ల జరిమానా చెల్లించమంటూ ఆదేశించింది. సెటిల్మెంట్కు దరఖాస్తు చేసుకున్నవారిలో కంపెనీ సీఈవో దివ్యేష్ బి.షాతోపాటు మరో ముగ్గురు బంధువులున్నారు. అంతేకాకుండా విక్రమ్ ఎల్ దేశాయ్ హెచ్‌యూఎఫ్ సైతం దరఖాస్తు చేసింది. 2018 ఏప్రిల్ 2–23 మధ్య కంపెనీ ఆర్థిక ఫలితాలు, డివిడెండ్ అంశంలో సమాచారాన్ని దుర్వినియోగ పరచినట్లు దర్యాప్తు వెల్లడించింది. సెలిబ్రస్ కమోడిటీస్‌కు షాక్ జాతీయ స్పాట్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈఎల్)లో చట్ట విరుద్ధంగా కాంట్రాక్టులు చేపట్టేందుకు క్లయింట్లను అనుమతించిన కేసులో సెలిబ్రస్ కమోడిటీస్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. కాంట్రాక్టులను అనుమతించడంలో నిబంధనలకు నీళ్లొదిలి అవకతవకలకు పాల్పడటంతో రిజిస్ట్రేషన్ రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్ఎస్ఈలో సభ్యత్వం కలిగిన బ్రోకింగ్ సంస్థ సెలిబ్రస్ కమోడిటీస్ పెయిర్డ్ కాంట్రాక్టుల నిర్వహణకు అనుమతులు పొందింది. -
పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా, ఐపీవోలు ఖుషీ
ముంబై: కొద్ది నెలలుగా దూకుడు చూపుతున్న ప్రైమరీ మార్కెట్‌కు ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు దన్నునిస్తున్నారు. దీంతో పలు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీవోలు చేపట్టేం దుకు సెబీ వద్ద క్యూ కడుతున్నాయి. మరోపక్క లిస్టింగ్‌లోనూ భారీ లాభాలను సాధిస్తుండటంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తొలిసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే రిటైల్ ఇన్వెస్టర్లు లక్షల సంఖ్యలో జత కలుస్తున్నారు. ఇది ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో రిటైలర్ల వాటా సరికొత్త గరిష్టాన్ని తాకేందుకు దోహదం చేసింది. జూన్ చివరికల్లా మార్కెట్ల చరిత్రలోనే తొలిసారి రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతానికి ఎగసింది. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 16.18 లక్షల కోట్లు! 40 కొత్త లిస్టింగ్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను సాధించాయి. తద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో పలు ఇష్యూలకు 100 రెట్లు, ఆపై సబ్స్క్రిప్షన్ లభించడం విశేషం. మరిన్ని కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇకపైనా ప్రైమరీ మార్కెట్ మరింత జోరు చూపనుంది. వెరసి మరో రూ. 75,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందువల్లనే ఇటీవల ఒక బులెటిన్‌లో ఆర్బీఐ.. 2021ను ఐపీవో నామసంవత్సరంగా పేర్కొన్నట్లు తెలియజేశారు. చదవండి : దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్ మార్చిలో మహాజోరు ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం 2020 మార్చిలో 3 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచారు. ఈ బాటలో 2021 జూన్ చివరికల్లా వీటి సంఖ్య 8 కోట్లకు చేరింది. గతేడాది మార్చిలో 35 శాతం పతనమైన మార్కెట్ తదుపరి బౌన్స్‌బ్యాక్‌ను సాధించింది. ఈ జనవరిలో 50,000 పాయింట్ల మైలురాయికి చేరిన సెన్సెక్స్ సరికొత్త చరిత్రను లిఖిస్తూ తాజాగా ఇంట్రాడేలో 56,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. రిటైల్ స్పీడ్ ఇటీవలే లిస్టయిన దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోకు రిటైలర్ల నుంచి 40 రెట్లు, క్రిస్నా డయాగ్నోస్టిక్స్‌కు 42 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఈ బాటలో చిన్న ఇష్యూ అయిన తత్వ చింతన్‌కు మరింత అధికంగా 59 రెట్లు ఎక్కువగా బిడ్స్ లభించాయి. అయితే క్లీన్ సైన్స్ టెక్నాలజీకి 9 రెట్లు, భారీ ఇష్యూ జొమాటోకు 7.5 రెట్లు అధికంగా మాత్రమే రిటైలర్లు దరఖాస్తు చేయడం గమనార్హం! ప్రీమియంతో.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి డైరెక్టుగా ప్రవేశిస్తున్నట్లు ట్రస్ట్‌ప్లస్ వెల్త్ సీఈవో సమీర్ కౌల్ తెలియజేశారు. ఇందువల్లనే ఇటీవల పలు ఐపీవోలు భారీగా సక్సెస్ అవుతున్నట్లు వివరించారు. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ ఇష్యూకి 3.9 మిలియన్ దరఖాస్తులు లభించాయి. దీంతో గతంలో 4.2 మిలియన్లతో రికార్డు నెలకొల్పిన రిలయన్స్ పవర్ తదుపరి నిలిచింది. అయితే ఆర్‌పవర్‌కు రిటైల్ విభాగంలో 83 రెట్లు స్పందన లభించగా.. గ్లెన్‌మార్క్ 15 రెట్లు మాత్రమే సాధించింది. భారీ లిక్విడిటీ పరిస్థితులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఈక్విటీ బ్రోకింగ్ హెడ్ అరుణ్ జైన్ తెలియజేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం కారణంగా పలు కంపెనీలు భారీ లాభాలతో లిస్టవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా తత్వ చింతన్, జొమా టో, జీఆర్ ఇన్ఫ్రా 97–78 శాతం మధ్య ప్రీమియంతో లిస్టయిన విషయాన్ని ప్రస్తావించారు. -
సెక్యూరిటీ మార్కెట్లపై రిటైల్ ఇన్వెస్టర్ల ముద్ర
న్యూఢిల్లీ: సెక్యూరిటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం 2020 ఏప్రిల్ నుంచి పెరిగినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఎన్ఐఎస్ఎమ్ రెండో వార్షిక ‘క్యాపిటల్ మార్కెట్స్’ సదస్సులో భాగంగా త్యాగి మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతీ నెలా 24.5 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమైనట్టు చెప్పారు. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉండడం, నగదు లభ్యత తగినంత ఉండడం ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. కానీ, అదే సమయంలో ఇన్వెస్టర్లకు ఆయన ఒక హెచ్చరిక చేశారు. వడ్డీ రేట్లు తిరిగి పెరగడం మొదలై, నగదు లభ్యత తగ్గితే అది మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందన్నారు. మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తునే చూస్తుంటాయన్న ఆయన.. ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తు వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వస్తున్నవిగా పేర్కొన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి 4.1 కోట్లుగా ఉన్న మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య.. ఆర్థిక సంవత్సరం చివరికి 5.5 కోట్లకు పెరగడం గమనార్హం. అంటే 34.7 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. ఈ లెక్కన గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెలా సగటున 12 లక్షల చొప్పున కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20)లో ప్రతీ నెలా సగటున ప్రారంభమైన కొత్త డీమ్యాట్ ఖాతాలు 4.2 లక్షల చొప్పున ఉన్నాయి. మరింత వేగం.. ‘‘ఈ ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరింత వేగాన్ని అందుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతీ నెలా 24.5 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ టర్నోవర్ 2019–20లో రూ.96.6 లక్షల కోట్లుగా ఉంటే.. 2020–21లో రూ.164.4 లక్షల కోట్లకు పెరిగింది. 70.2 శాతం అధికమైంది. ట్రేడ్లలో ఎక్కువ భాగం మొబైల్స్, ఇంటర్నెట్ ఆధారిత వేదికల నుంచే నమోదు కావడం రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరిగినదానికి సంకేతం’’ అని అజయ్ త్యాగి వివరించారు. రీట్, ఇన్విట్, ఈఎస్జీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు త్యాగి చెప్పారు. కరోనా కల్లోలిత సంవత్సరంలోనూ (2020–21) క్యాపిటల్ మార్కెట్ల నుంచి కంపెనీలు రూ.10.12 లక్షల కోట్లను సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ.9.96 లక్షల కోట్ల కంటే స్వల్పంగా పెరిగింది. నూతన దశకం ‘‘బలమైన వృద్ధికితోడు మన మార్కెట్లు కొత్త యుగంలోకి అడుగు పెట్టాయి. పలు నూతన తరం టెక్ కంపెనీలు దేశీయంగా లిస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మరే ఇతర మార్కెట్‌తో చూసినా కానీ మన మార్కెట్లు నిధుల సమీకరణ విషయంలో ఆకర్షణీయంగా ఉన్నాయి’’ అని త్యాగి పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్ల బలోపేతానికి, మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా సెబీ ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. -
పబ్లిక్ ఇష్యూలకు రిటైలర్ల క్యూ
కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో గతేడాది మార్చిలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఆపై కోవిడ్–19 కట్టడిలో భాగంగా ప్రజలను అధిక సంఖ్యలో గుమిగూడవద్దంటూ హెచ్చరించింది. అయితే ఇదే సమయంలో దేశీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు క్యూ కట్టడం విశేషం! ఇందుకు వీలుగా పలువురు ఇన్వెస్టర్లు కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచేందుకు ఆసక్తి చూపుతూ వచ్చారు. తద్వారా పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల్ల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది! ఇతర వివరాలు చూద్దాం.. ముంబై: గత కేలండర్ ఏడాది(2020) సెప్టెంబర్ నుంచి చూస్తే పబ్లిక్ ఇష్యూలకు రిటైల్ ఇన్వెస్టర్లు సగటున 1.3 మిలియన్ అప్లికేషన్లు దాఖలు చేశారు. అయితే కోవిడ్–19కు ముందు ఈ సంఖ్య 0.5 మిలియన్లుగా మాత్రమే నమోదైంది. ప్రైమరీ మార్కెట్లను పరిశీలించే ప్రైమ్ డేటాబేస్ అందించిన వివరాలివి. ఇందుకు ప్రధానంగా కరోనా వైరస్ ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనే బాటలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయడం ప్రభావం చూపింది. ఎలాగంటే స్టిములస్ల కారణంగా ఒక్కసారిగా లిక్విడిటీ పెరిగిపోయింది. చౌకగా లభిస్తున్న ఈ నిధులు స్టాక్స్, బంగారం తదితరాల్లోకి ప్రవహించడం అధికమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరగా.. పసిడి సైతం సరికొత్త రికార్డులను అందుకుంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించేందుకు పలు కంపెనీలు క్యూకట్టాయి. మార్కెట్లో నెలకొన్న బుల్‌ట్రెండ్, లిక్విడిటీ ప్రభావంతో ఐపీవోలకు వచ్చిన కంపెనీల షేర్లు భారీ లాభాలతో లిస్ట్‌కావడం దీనికి జత కలిసింది. వెరసి రిటైల్ ఇన్వెస్టర్లను ప్రైమరీ మార్కెట్లు భారీగా ఆకర్షిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఖాతాల జోరు గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా 10 మిలియన్ డీమ్యాట్ ఖాతాలను తెరిచినట్లు ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. లాక్డౌన్ సమయంలో నెలకు సగటున 1 మిలియన్ డీమ్యాట్ ఖాతాలు జమ అయినట్లు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఈ సందర్భంగా వెల్లడించింది. డీమ్యాట్ ఖాతాలను సులభంగా తెరవడంతోపాటు.. అలవోకగా ఐపీవోలకు దరఖాస్తు చేసే వీలుండటంతో రిటైలర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు జిరోధా బ్రోకింగ్ నిపుణులు పేర్కొన్నారు. పలు ఐపీవోలు భారీ సక్సెస్‌ను సాధించడం, కొత్త కంపెనీలు లిస్టింగ్ రోజే సగటున 40 శాతం లాభాలు ఆర్జించడం వంటి అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కొత్త తరం రిటైలర్లు పెట్టుబడులకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో లిస్టింగ్‌లోనే లాభాల ట్రెండ్ మరింత ఊపందుకున్నట్లు తెలియజేశారు. ప్రైమరీ మార్కెట్లు కళకళలాడితే.. కొత్తగా రిటైల్ ఇన్వెస్టర్లు పుట్టుకొస్తారని వివరించారు. నిజానికి మార్కెట్లలో కొనసాగుతున్న ఇన్వెస్టర్లు సైతం కుటుంబ సభ్యుల పేరుతో కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచేందుకు ఆసక్తి చూపుతారని జిరోధా నిపుణులు ప్రస్తావించారు. ఇటీవల పలు ఇష్యూలకు దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో షేర్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్లు తెలియజేశారు. ఇటీవలి ట్రెండ్ ప్రకారం చూస్తే పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేసిన ప్రతీ 30 మందిలో ఒక్కరికి మాత్రమే షేర్ల కేటాయింపునకు వీలున్నట్లు వివరించారు. పలు కంపెనీలు దేశీయంగా ఇటు సెన్సెక్స్, నిఫ్టీ కొత్త శిఖరాలను తాకగా.. అటు యూఎస్ మార్కెట్లు సైతం రోజుకో కొత్త గరిష్టానికి చేరుతూ వచ్చాయి. సెకండరీ మార్కెట్లో నెలకొన్న బుల్‌ట్రెండ్ ప్రభావంతో పలు కంపెనీలు బంపర్ లిస్టింగ్‌లను సాధిస్తూ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా లిస్టింగ్ తదుపరి సైతం పలు కంపెనీల షేర్లు ర్యాలీ బాటలో సాగడం కూడా రిటైలర్లను ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు. తాజా ఉదాహరణ చూస్తే.. ఎంటార్ టెక్నాలజీస్ ఇష్యూ ధర రూ. 575తో పోలిస్తే రూ. 1,055 వద్ద లిస్టయ్యింది. తొలి రోజు ఏకంగా 87 శాతం లాభంతో రూ. 1,078 వద్ద ముగిసింది. కాగా. ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న బలమైన సెంటిమెంటు నేపథ్యంలో ఈ వారం క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇం డస్ట్రీస్, కల్యాణ్ జ్యువెల్లర్స్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. వీటితోపాటు వారాంతాన ప్రారంభమై మంగళవారం ముగిసిన అనుపమ్ రసాయన్ ఐపీవో సైతం 44 రెట్లు అధికంగా బిడ్స్‌ను ఆకట్టుకుంది. ఈ 5 కంపెనీలూ ఐపీవోల ద్వారా వారంలో రూ. 4,524కోట్లను సమీకరించనుండటం గమనార్హం. గతేడాది మొదట్లో తలెత్తిన కోవిడ్–19 ప్రభావం 2021కల్లా చాలావరకూ ఉపశమించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూలకు రిటైల్ ఇన్వె స్టర్ల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్న ట్లు తెలియజేశాయి. ఇటీవలి ఐపీవోలలో రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉన్నదంటే.. దరఖాస్తుల తీరిలా(మిలియన్లలో) కంపెనీ పేరు అప్లికేషన్లు ఇండిగో పెయింట్స్ 2.59 మజ్గావ్ డాక్ 2.36 బెక్టర్స్ ఫుడ్ 2.20 రైల్‌టెల్ కార్ప్ 2.07 బర్గర్ కింగ్ 1.97 . -
ఐపీఓ జోష్ భద్రం బాస్!
గడిచిన పది నెలలుగా స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీ చేస్తుండడం.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్‌కు జోష్‌నిస్తోంది. కొత్త కొత్త కంపెనీలు బుల్ మార్కెట్ అండతో, భారీగా నిధులు సమీకరించుకునేందుకు... స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయ్యేందుకు ఐపీవో బాట పడుతున్నాయి. లిస్టింగ్‌తోనే రెట్టింపునకు పైగా లాభాలు కురిపిస్తుండడంతో (కొన్ని ఇష్యూలు) రిటైల్ ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ, ప్రతీ ఐపీవో లాభాలు కురిపిస్తుందన్న ఆశతో వెళితే చేతులు కాలే ప్రమాదం ఉందని గత అనుభవాలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తగిన అధ్యయనం తర్వాతే ఐపీవోల్లో పాల్గొనడం ద్వారా ఆశించిన లాభాలను కళ్ల చూడగలరని అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్లకు బుట్టెడు లాభాలను పంచినవే కాదు.. పెట్టుబడిని ఆసాంతం హరించేసిన ఇష్యూలు కూడా ఉన్నాయి. కనుక ఐపీవో మార్కెట్లో చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయడంపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... 2020 రెండో అర్ధభాగంలో 14 ఐపీవోలు ప్రజల నుంచి సుమారు రూ.16,272 కోట్లను సమీకరించాయి. ఇక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఐదు ఐపీవోలు మార్కెట్‌ను పలకరించాయి. మరెన్నో సంస్థలు త్వరలో ఐపీవోలకు వచ్చేందుకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తుండగా.. ఇంకొన్ని సంస్థలు ఐపీవో ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఐపీవోల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత వేలంవెర్రిగా ఉన్నారంటే.. ఇటీవలే ముగిసిన నురేకా ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటాకు ఏకంగా 166 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. కానీ, అన్ని ఐపీవోలు ఇన్వెస్టర్లకు రాబడులు కురిపిస్తాయన్న గ్యారంటీ లేదనే విషయాన్ని ఎక్కువ మంది పట్టించుకోవడం లేదు. 2015 నుంచి 2021 జనవరి వరకు 142 ఐపీవోలు ప్రజల నుంచి నిధులు సమీకరించగా.. అందులో 55 స్టాక్స్ ఇప్పటికీ వాటి ఐపీవో జారీ ధర కంటే తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అయితే, ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఎన్నో రెట్లు వృద్ధి చేసిన ఇష్యూలు కూడా ఉన్నాయి. అందుకే ఆణిముత్యాల్లాంటి ఐపీవోలను ఇన్వెస్టర్లు గుర్తించగలగాలి. అప్పుడే వారి కష్టార్జితాన్ని కరిగిపోకుండా చూసు కోవచ్చు. 49 ఇష్యూలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు అంతకు మించి వృద్ధి చేశాయి. వాటిల్లో ఐఆర్సీటీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సీడీఎస్ఎల్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్‌మొబైల్ ఉన్నాయి. ముఖ్యంగా డిక్సన్ టెక్, అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్), ఐఆర్సీటీసీ అయితే వాటి ఐపీవో ధరలతో పోలిస్తే.. ఐదింతల కంటే ఎక్కువే ఇప్పటి వరకు పెరిగాయి. మరి ఇన్వెస్టర్ల పెట్టుబడులను కరిగించేసిన వాటిల్లో ఆర్టెల్ కమ్యూనికేషన్స్, యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ తదితర కంపెనీలు కూడా ఉన్నాయని మర్చిపోవద్దు. ఈ రెండూ 2015లో ఐపీవో ముగించుకోగా, నాటి నుంచి నేటి వరకు ఇన్వెస్టర్ల పెట్టుబడులను 95 శాతం తుడిచిపెట్టేశాయి. ఇక మన్‌పసంద్ బెవరేజెస్ తదితర కొన్ని కంపెనీలు ట్రేడింగ్ నుంచి కనుమరుగైపోయాయి. కారణం కార్పొ రేట్ గవర్నెన్స్ అంశాలే. అందుకే మెరుగైన ఇష్యూలను గుర్తించగలిగితేనే ఇన్వెస్టర్లు ఆశించిన లక్ష్యాలను చేరుకోగలరు. అనుకరించడం తెలియాలి.. ఇటీవలి బర్గర్ కింగ్, ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూలకు సంస్థాగత ఇన్వెస్టర్లు (ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు), అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల (హెచ్ఎన్ఐ) నుంచి అధిక స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లూ వీరికేమీ తీసిపోలేదు లేండి. కానీ, తెలివిగా మసలుకోకపోతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా పరిస్థితి మారుతుంది. ఎందుకంటే ఇనిస్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐల స్పందన ఆధారంగా ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు.. వారికి మాదిరే ఆయా కౌంటర్ల నుంచి ఎప్పుడు బయటపడాలన్నది తప్పకుండా తెలిసి ఉండాలి. ఉదాహరణకు.. 2017లో వచ్చిన కెపాసిట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఐపీవోను చెప్పుకోవాలి. నాడు ఈ ఐపీవో 130 రెట్లు అధికంగా స్పందన అందుకుంది. క్యూఐబీ, ఎఫ్ఐఐల కోటా 52 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. ఇష్యూ ధరపై 37 శాతం అధిక స్థాయిలో లిస్ట్ అయింది. కానీ, మూడు నెలల్లోనే ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులు తమ వాటాలను సగం మేర తగ్గించేసుకున్నారు. దీనికి రియల్ ఎస్టేట్ పరిస్థితులు కూడా కారణం. 2017 సెప్టెంబర్ నాటికి 26.9 శాతంగా ఉన్న వాటా.. అదే ఏడాది డిసెంబర్ చివరికి 13.2 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ స్టాక్ 30 శాతానికి పైగా నష్టపోయింది. ఇప్పటికీ ఈ స్టాక్ ధర నాటి ఐపీవో ధరతో పోలిస్తే 13 శాతం తక్కువలోనే ట్రేడవుతోంది. హడ్కో ఇష్యూ కూడా ఇదే పాఠం చెబుతోంది. హడ్కో ఐపీవోకు ఇనిస్టిట్యూషనల్ (క్యూఐబీ) విభాగం నుంచి 50 రెట్ల కంటే అధిక స్పందన వచ్చింది. లిస్టింగ్ రోజే స్టాక్ ధర 20% లాభపడడంతో ఇనిస్టిట్యూషన్స్ లాభాల స్వీకరణ చేశాయి. కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం హడ్కో మరింత రాబడులు ఇస్తుందని కొనసాగగా.. ఐపీవో ధరతో పోలిస్తే ఇప్పటికీ షేరు ధర దిగువనే ట్రేడవుతోంది. బర్గర్ కింగ్ ఐపీవోలోనూ పెద్ద ఎత్తున పాల్గొన్న హెచ్ఎన్ఐలు, క్యూఐబీలు లిస్టింగ్ తర్వాత కొంతమేర లాభాలను తీసుకున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నియంత్రణ అంశాల ప్రభావం ప్రభుత్వం ఆదేశాలు, నియంత్రణ సంస్థల ఆదేశాలూ కొన్ని కంపెనీల భవిష్యత్తును మార్చేయగలవు. వీటి పట్ల కూడా ఇన్వెస్టర్లు అవగాహనతో ఉండాలి. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల పరంగా బ్యాంకుల స్టాక్స్ కదలికలు ఉంటుంటాయి. 2015లో ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు లైసెన్స్‌లను 10 ఎన్‌బీఎఫ్‌సీలకు జారీ చేసినప్పుడు.. రూ.500 కోట్ల నికర విలువ సంతరించుకున్న మూడేళ్లలోగా పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలన్న నిబంధన విధించింది. ఈ ఆదేశాల కారణంగానే గడిచిన ఐదేళ్లలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోలకు రావాల్సి వచ్చింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గతేడాది ఐపీవోకు ముగించుకుంది. ఈ తరహా నిబంధన మాతృ సంస్థ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్ షేర్లపై ప్రభావం చూపించింది. బంధన్ బ్యాంకు కూడా ఆర్బీఐ ఆదేశాల కారణంగా ప్రభావితమైనదే. ప్రమోటర్ల వాటాలను నిబంధనల మేరకు తగ్గించుకోవాల్సి రావడం స్టాక్ ధరలపై ప్రభావం పడేలా చేసింది. లిస్ట్ అయిన ఏడాదిలోనే ప్రమోటర్లు తమ వాటాలను 40%కి తగ్గించుకోవాల్సి వచ్చింది. తమ వాటాలు తగ్గించుకునేందుకు అదనపు సమయం ఇవ్వాలని బంధన్ బ్యాంకు ప్రమోటర్లు కోరగా, ఆర్బీఐ తిరస్కరించడంతోపాటు జరిమానాలను విధించి, బ్యాంకు శాఖల విస్తరణపై కొంత కాలం పాటు ఆంక్షలను కూడా అమలు చేసింది. కనుక విధానపరమైన నిర్ణయాల ప్రభావం స్టాక్స్‌పై ఉంటుందని అర్థం చేసుకోవాలి. కనుక ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేసిన వారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి కంపెనీ మూలాలు, స్టాక్స్ విలువలు వచ్చిన ప్రతీ నూతన ఇష్యూకు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకోవడం కాకుండా.. ఆ కంపెనీ బలా, బలాలు, విలువను తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2017 బుల్ మార్కెట్ సమయంలో ప్రతాప్ స్నాక్స్ ఐపీవోకు వచ్చింది. 2016–17 ఆర్థిక సంవత్సరం లాభాలతో పోలిస్తే ఇష్యూ ధరను 200 రెట్లు అధిక స్థాయిల వద్ద నిర్ణయించింది. లిస్టింగ్ రోజు అయితే 25 శాతం లాభం ఇచ్చింది కానీ, ఏడాది కాలంలో స్టాక్ ధర నికరంగా 12.6 శాతం తక్కువకు పడిపోయింది. ఇప్పటికీ ఈ షేరు ధర నాటి ఇష్యూ ధరతో పోలిస్తే 29 శాతం తక్కువకు లభిస్తోంది. అంటే మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను ఈ కంపెనీ ప్రమోటర్లు క్యాష్ చేసుకోవడంలో సఫలమైనట్టు తెలుస్తోంది. 2016 మేలో వచ్చిన పరాగ్ మిల్క్ ఫుడ్ ఐపీవో కూడా మరో ఉదాహరణ. 2015–16 సంవత్సరపు లాభాల కంటే ఒక్కో షేరును 44 రెట్ల అధిక విలువకు కంపెనీ ఆఫర్ చేసింది. కానీ, లిస్టింగ్ రోజు 15% లాభాలను చూపించిన ఈ షేరు.. తర్వాతి సంవత్సరంలో పతనమైంది. ఎందుకంటే కంపెనీ లాభాలు 2016–17లో 80% క్షీణించడమే కారణం. నాడు ఐపీవోలో షేర్లను పొంది, అలాగే కొనసాగి ఉంటే ఇప్పటికి పెట్టుబడి నికరంగా 50% తగ్గిపోయి ఉంటుంది. ఆర్బీఎల్ బ్యాంకు కూడా ఇందుకేమీ తీసిపోలేదు. గతేడాది కరోనా తర్వాత ఎన్పీఏలు పెరిగిపోతాయంటూ బ్యాంకు యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు, రుణ ఆస్తుల నాణ్యత, వసూళ్ల సామర్థ్యాలు క్షీణించడం వల్ల షేరు ధర ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి భారీగా పతనమైంది. తర్వాత కోలుకున్నప్పటికీ.. ఐపీవో ధర కంటే ఇంకా దిగువనే ట్రేడవుతోంది. కనుక కంపెనీల ఆర్థిక మూలాలు, అంతకుముందు కొన్నేళ్లలో వాటి పనితీరు, మేనేజ్మెంట్ సామర్థ్యం, రంగం, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, పనితీరులో పురోగతి వీటన్నింటినీ చూసి ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. షేర్ల ఎంపికే లాభాలను నిర్ణయించగలవని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి. పరిస్థితులు మారిపోనూవచ్చు.. ఆయా రంగాల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పుల కారణంగా కంపెనీల లాభాలు దూసుకుపోవచ్చు. అందుకే కంపెనీ వ్యాపార మూలాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మోదీ సర్కారు మొదటి విడతలో మౌలిక రంగ కంపెనీల్లో జోరు కనిపించింది. భారత్ మాల, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఇందుకు మద్దతునిచ్చాయి. దీంతో 2015–17 కాలంలో ఇన్ఫ్రా కంపెనీల ఐపీవోల్లో కదలికలు పెరిగాయి. అదే సమయంలో వచ్చిన కెపాసిట్ ఇన్ఫ్రా ఇష్యూ అయితే భారీ స్పందనను దక్కించుకుంది. 2015లో పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, 2016లో దిలీప్‌బిల్డ్‌కాన్ పబ్లిక్ ఇష్యూలకు వచ్చి జారీ ధరతో పోలిస్తే రెట్టింపునకు పైగా ఇన్వెస్టర్లకు లాభాలను తినిపించాయి. కానీ, ఇప్పుడు చూస్తే.. వాటిల్లో కెపాసిట్ ఇన్ఫ్రా, సద్బావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, భారత్ రోడ్ నెట్వర్క్, పవర్‌మెక్ కంపెనీలు ఐపీవో ధర కంటే 13–84 శాతం తక్కువలో కోట్ అవుతున్నాయి. 2020లో చైనా వ్యతిరేక సెంటిమెంట్ కూడా కెమికల్, ఫార్మా కంపెనీలకు బాగా కలిసొచ్చింది. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్, రోసారి బయోటెక్ సంస్థల ఐపీవోలకు మంచి స్పందన రావడమే కాకుండా, లిస్టింగ్‌తో గణనీయంగా లాభపడ్డాయి కూడా. కాకపోతే ఈ తరహా ధోరణలు స్వల్పకాలమా.. లేక దీర్ఘకాలం పాటు కొనసాగుతాయా అన్న అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. -
డీమ్యాట్ ఖాతాల జోరు
స్టాక్ మార్కెట్ రోజు రోజుకూ కొత్త శిఖరాలకు ఎగబాకుతుండటంతో షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్లకు మోజు, క్రేజు పెరుగుతోంది. అక్టోబర్‌లో కొత్తగా పదిలక్షలకు పైగా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. నెలకు పది లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు ఆరంభం కావడం ఇది వరుసగా ఐదో నెల. సెప్టెంబర్‌లో రికార్డ్ స్థాయిలో కొత్తగా 13 లక్షల డీమ్యాట్ ఖాతాలు జత అయ్యాయి. దీంతో అక్టోబర్ చివరినాటికి మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.76 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు జత కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు అరకోటి డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. గత దశాబ్దకాలంలో ఇదే అత్యధికం. కొత్తగా మొదలైన డీమ్యాట్ ఖాతాల్లో 90 శాతానికి పైగా యువజనులవే ఉండటం విశేషం. వరంలా వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనడానికి కేంద్రం లాక్‌డౌన్‌నును విధించడం తెలిసిందే. దీంతో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇచ్చాయి. దీంతో పలువురు ఇంటివద్దే ఉండిపోవడంతో స్టాక్ మార్కెట్లో ఓ చేయి వేసి చూద్దామనే భావన పెరిగిపోయింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల లావాదేవీలు పెరిగాయి. మరోవైపు కరోనా కల్లోలం నుంచి స్టాక్ మార్కెట్ త్వరగానే కోలుకుంది. మార్చిలో కనిష్ట స్థాయి పతనం నుంచి చూస్తే దాదాపు 77 శాతం ఎగసింది. కొత్త ఇన్వెస్టర్ల జోరుతో మొబైల్ ట్రేడింగ్ కూడా బాగా పెరిగింది. మొత్తం ట్రేడింగ్ లావాదేవీల్లో మొబైల్ ట్రేడింగ్ లావాదేవీలు ఈ నవంబర్‌లో 18.5 శాతానికి పెరిగాయి. ఇది రికార్డ్ స్థాయి. మరింత ముందుకే తయారీ, సేవల రంగాల గణాంకాలు క్రమక్రమంగా పుంజుకోవడం, కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాలు అంచనాలను మించడం, కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సానుకూల వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం.. ఈ కారణాలన్నింటి వల్ల స్టాక్‌మార్కెట్ జోరుగా పెరిగింది. రానున్న నెలల్లో కూడా మార్కెట్ జోరు మరింతగా పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, ప్రభుత్వ, ఆర్బీఐ చర్యలు తదితర అంశాలు దీనికి కారణం. మార్కెట్ జోరు ఇలానే కొనసాగితే డీమ్యాట్ ఖాతాలు మరింతగా పెరుగుతాయని అంచనా. అమెరికాలో ఆ దేశ జనాభాతో పోల్చితే కనీసం 10% గా డీమ్యాట్ ఖాతాలుంటాయని, భారత్‌లో అర శాతం కూడా లేవని నిపుణులంటున్నారు. ఐదోరోజూ అదే పరుగు 13,900 పైన నిఫ్టీ ముగింపు ∙సెన్సెక్స్ లాభం 259 పాయింట్లు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో మార్కెట్ ఐదోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 259 పాయింట్లను ఆర్జించి 47,613 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 13,933 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, దేశీయ ఈక్విటీల్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సూచీల ర్యాలీకి మద్దతుగా నిలిచాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంజీసీ షేర్లు లాభపడ్డాయి. మెటల్, ఫార్మా, ఆటో, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 47,715 వద్ద, నిఫ్టీ 13,968 వద్ద కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేశాయి. బ్రెగ్జిట్ ఒప్పందం, యూఎస్ ఉద్దీపన ప్యాకేజీ అనుమతుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. రూపాయి విలువ 7 పైసలు బలపడి 73.42 వద్ద స్థిరపడింది. మార్కెట్ ప్రభావితం చేయగల అంతర్జాతీయ అంశాలేవీ లేకపోవడంతో త్వరలో విడుదల కానున్న కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, స్టాక్ ఆధారిత అప్డేట్స్పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. రూ.లక్ష కోట్ల క్లబ్‌లోకి బజాజ్ ఆటో... ఆటో దిగ్గజ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.లక్ష కోట్లను తాకింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటోమొబైల్ సంస్థగా బజాజ్ ఆటో రికార్డును సృష్టించింది. ఇంతకుముందు మారుతి సుజికీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. షేరు అరశాతం లాభంతో రూ.3,431 వద్ద స్థిరపడింది. -
బర్గర్ కింగ్ ఐపీవో.. స్పందన సూపర్
ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇష్యూ చివరి రోజుకి దాదాపు 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. రిటైల్ విభాగంలో 68 రెట్లు అధికంగా స్పందన లభించింది. సంపన్నవర్గాల(హెచ్ఎన్ఐలు) నుంచి ఏకంగా 354 రెట్లు ఎక్కువగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి సైతం 87 రెట్లు దరఖాస్తులు వచ్చినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. వెరసి 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. శుక్రవారానికల్లా మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఐపీవో ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
బర్గర్ కింగ్ ఐపీవోకు రిటైలర్ల క్యూ
న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ నేడు ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 59-60కాగా.. రెండో రోజు గురువారానికల్లా 9.4 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 38 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించడం గమనార్హం! ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. వెరసి 7.44 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. గురువారం(3) వరకూ దాదాపు 70 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. ఐపీవో నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూకి ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
లాక్డౌన్లో మొబైల్స్‌పై జోరుగా స్టాక్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు మరింత మంది ఈక్విటీ మార్కెట్లలోకి ప్రవేశించి.. మొబైల్స్‌పై ట్రేడింగ్‌కు ఆసక్తి చూపించినట్టు బ్రోకరేజీ సంస్థలు వెల్లడించాయి. రానున్న కాలంలోనూ స్మార్ట్ఫోన్ల ద్వారా ట్రేడింగ్ మరింత పుంజుకుంటుందని అవి అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్ల నుంచి వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సమాచారం తెలుసుకోవడంతోపాటు, పెట్టుబడులకు సంబంధించి వెంటనే నిర్ణయాన్ని అమలు చేసేందుకు సౌలభ్యం ఉంటుందని పేర్కొన్నాయి. ‘‘వినియోగం పరంగా సౌకర్యంగా ఉండడం వల్ల లాక్డౌన్ సమయంలో డెస్క్‌టాప్ నుంచి మొబైల్ పరికరాలపైకి చెప్పుకోతగిన స్థాయిలో ట్రేడింగ్ కార్యకలాపాలు బదిలీ అయ్యాయి’’ అని ఫైయర్స్ సీఈవో తేజాస్ కొడాయ్ తెలిపారు. ప్రధానంగా మొదటిసారి ఇన్వెస్టర్లు, మిలీనియల్స్ నుంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. మొబైల్ యాప్‌పై ట్రేడింగ్‌లో చెప్పుకోతగినంత పెరుగుదల నెలకొన్నట్టు షేర్‌ఖాన్ సీఈవో జైదీప్ అరోరా తెలిపారు. 2020 జనవరి–జూలై మధ్య ఆన్లైన్ ట్రేడింగ్ అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 47 శాతం పెరిగిందని.. షేర్‌ఖాన్ యాప్ నుంచి ఆర్డర్ల సంఖ్యలో 91 శాతం వృద్ధి ఉన్నట్టు ఆయన చెప్పారు. ఆధునిక టెక్నాలజీ, వినియోగానికి సౌకర్యంగా ఉండడం వల్ల మొబైల్ యాప్స్‌పై ట్రేడింగ్ విస్తృతం అవుతున్నట్టు అప్‌స్టాక్స్ సీఈవో రవికుమార్ వెల్లడించారు.