ఫండ్స్ ద్వారా పెట్టుబడులు బెస్ట్!
రిటైల్ ఇన్వెస్టర్లకు సెబీ చైర్మన్ సలహా
న్యూఢిల్లీ: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ యూకే సిన్హా రిటైల్ ఇన్వెస్టర్లకు కీలక సూచన చేశారు. చిన్న ఇన్వెస్టర్లు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓ)లో ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టకపోతే తాను ఆందోళన చెందబోనని పేర్కొన్న ఆయన, ఆయా రిటైల్ ఇన్వెస్టర్లు పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వ్యవస్థల ద్వారా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. బుధవారం నాడు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ ప్లాట్‌ఫామ్ 5నాన్స్‌డాట్‌కామ్ ‘ఆర్థిక శక్తి వైపు భారత్ అడుగులు’ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సెబీ చీఫ్ తాజా వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
చిన్న ఇన్వెస్టర్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ముఖ్యం. ఇందుకుగాను వారు తగిన మార్కెట్ పరిజ్ఞానం వుంటే తప్ప ప్రైమరీ మార్కెట్‌లోకికానీ లేదా సెకండరీ మార్కెట్‌లోకిగానీ ప్రత్యక్షంగా ప్రవేశించకుండా ఉండడమే మంచిది. వారు ఇతర మార్గాల్లో (మ్యూచువల్, పెన్షన్ ఫండ్ల వంటివి) మార్కెట్ పెట్టుబడులు పెట్టడం మంచిదని భావిస్తున్నా.
విశ్వాసం, సరళతరం, వెసులుబాటు అలాగే పెట్టుబడుల్లో ఆర్థిక రంగానికి సంబంధించి అవగాహన (విద్య) పెంపు వంటి అంశాలు మార్కెట్‌లోకి మరింతమంది రావడానికి దోహదపడుతుందని భావిస్తున్నా.
ప్రపంచంలోనే ఉన్నత స్థాయి నిఘా విభాగాన్ని సెబీ కలిగిఉంది. ప్రతిరోజూ ఇన్వెస్టర్ల అప్రమత్తతకు అలర్ట్స్ జారీ చేయడం జరుగుతుంది. తమ దృష్టికి వచ్చిన అవకతవకల విషయంలో స్వయంగా విచారణసైతం నిర్వహించగల నిఘా వ్యవస్థ సెబీ సొంతం. ఈ పటిష్ట యంత్రాగం వల్ల స్టాక్ మార్కెట్‌ను దుర్వినియోగం చేసిన దాదాపు 900 కంపెనీలను సెబీ నిషేధించింది. పన్నులు ఎగ్గొడ్డానికి మార్కెట్‌ను వినియోగించుకున్న కేసుల్లో స్వయంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
ఇన్వెస్టర్ల వెసులుబాటుకు నో యువర్ క్లెయింట్ నిబంధనలను సెబీ సరళతరం చేసింది. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఏకైక కేవైసీ వ్యవస్థను నెలకొల్పడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏలతో చర్చలు జరుపుతోంది. ఇది త్వరలో కార్యరూపం దాల్చుతుందన్న విశ్వాసం ఉంది.