న్యూఢిల్లీ: సెక్యూరిటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం 2020 ఏప్రిల్ నుంచి పెరిగినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఎన్‌ఐఎస్‌ఎమ్ రెండో వార్షిక ‘క్యాపిటల్ మార్కెట్స్’ సదస్సులో భాగంగా త్యాగి మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతీ నెలా 24.5 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమైనట్టు చెప్పారు. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉండడం, నగదు లభ్యత తగినంత ఉండడం ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. కానీ, అదే సమయంలో ఇన్వెస్టర్లకు ఆయన ఒక హెచ్చరిక చేశారు. వడ్డీ రేట్లు తిరిగి పెరగడం మొదలై, నగదు లభ్యత తగ్గితే అది మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందన్నారు.
మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తునే చూస్తుంటాయన్న ఆయన.. ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తు వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వస్తున్నవిగా పేర్కొన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి 4.1 కోట్లుగా ఉన్న మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య.. ఆర్థిక సంవత్సరం చివరికి 5.5 కోట్లకు పెరగడం గమనార్హం. అంటే 34.7 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. ఈ లెక్కన గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెలా సగటున 12 లక్షల చొప్పున కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20)లో ప్రతీ నెలా సగటున ప్రారంభమైన కొత్త డీమ్యాట్ ఖాతాలు 4.2 లక్షల చొప్పున ఉన్నాయి.
మరింత వేగం..
‘‘ఈ ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరింత వేగాన్ని అందుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతీ నెలా 24.5 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ టర్నోవర్ 2019–20లో రూ.96.6 లక్షల కోట్లుగా ఉంటే.. 2020–21లో రూ.164.4 లక్షల కోట్లకు పెరిగింది. 70.2 శాతం అధికమైంది. ట్రేడ్లలో ఎక్కువ భాగం మొబైల్స్, ఇంటర్నెట్ ఆధారిత వేదికల నుంచే నమోదు కావడం రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరిగినదానికి సంకేతం’’ అని అజయ్ త్యాగి వివరించారు. రీట్, ఇన్విట్, ఈఎస్‌జీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు త్యాగి చెప్పారు. కరోనా కల్లోలిత సంవత్సరంలోనూ (2020–21) క్యాపిటల్ మార్కెట్ల నుంచి కంపెనీలు రూ.10.12 లక్షల కోట్లను సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ.9.96 లక్షల కోట్ల కంటే స్వల్పంగా పెరిగింది.
నూతన దశకం
‘‘బలమైన వృద్ధికితోడు మన మార్కెట్లు కొత్త యుగంలోకి అడుగు పెట్టాయి. పలు నూతన తరం టెక్ కంపెనీలు దేశీయంగా లిస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మరే ఇతర మార్కెట్‌తో చూసినా కానీ మన మార్కెట్లు నిధుల సమీకరణ విషయంలో ఆకర్షణీయంగా ఉన్నాయి’’ అని త్యాగి పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్ల బలోపేతానికి, మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా సెబీ ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment