Ajay Tyagi
-
SEBI Saa₹thi App: ఇన్వెస్టర్లకు అండగా సెబీ ‘సారథి’ యాప్..!
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ‘సారథి’ (Saa₹thi) పేరుతో మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా క్యాపిటల్ మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లకు అవగాహన పెంచేందుకు సులభరీతిలో తెరతీసింది. సెక్యూరిటీ మార్కెట్ల ప్రాథమిక అంశాలు, తదితరాలలో ఇన్వెస్టర్లకు మరింత అవగాహన కల్పించడంతోపాటు.. విజ్ఞానాన్ని అందించనున్నట్లు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి ఈ యాప్ విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరగడంతోపాటు, పెట్టుబడులు సైతం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యాప్ విడుదలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల మొబైల్ ఫోన్ల ద్వారా అత్యధిక శాతం ట్రేడింగ్ జరుగుతుండటంతో యాప్ రూపకల్పనకు తెరతీసినట్లు త్యాగి పేర్కొన్నారు. -
మూడేళ్లలో రెట్టింపైన డీమ్యాట్ ఖాతాలు
ముంబై: డీమ్యాట్ ఖాతాలు 2019 మార్చి నుంచి 2021 నాటికి రెట్టింపైనట్టు సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి చెప్పారు. 2019 మార్చి నాటికి 3.6 కోట్లుగా ఉన్న ఖాతాలు 2021 నవంబర్ నాటికి 7.7 కోట్లకు పెరిగినట్టు తెలిపారు. నిఫ్టీ ఇండెక్స్ ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్యాగి మాట్లాడారు. ‘‘అంతర్జాతీయంగా ఉన్న ధోరణుల మాదిరే భారత్‌లోనూ వ్యక్తిగత ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లలోకి రావడం గణనీయంగా పెరిగింది. 2019–20లో సగటున ప్రతీ నెలా 4 లక్షల చొప్పున డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. 2021లో ఇది ప్రతీ నెలా 20 లక్షలకు పెరిగింది. 2021 నవంబర్‌లో ఇది 29 లక్షలకు చేరుకుంది’’అని వివరించారు. చక్కగా రూపొందించిన ఇండెక్స్ మార్కెట్ పనితీరును అంచనా వేయడంతోపాటు, పెట్టుబడులకు పోర్ట్ఫోలి యో మాదిరిగా పనిచేస్తుందన్నారు. -
స్టాక్ మార్కెట్, ఇకపైనా టెక్ కంపెనీల ఐపీవోల జోరు
న్యూఢిల్లీ: ఇటీవల పబ్లిక్ ఇష్యూల బాట పట్టిన వృద్ధి ఆధారిత టెక్ కంపెనీలు ఇకపైనా మరింత జోరు చూపనున్నట్లు అజయ్ త్యాగి పేర్కొన్నారు. గత 18 నెలల్లో ఐపీవోల ద్వారా ఈ సంస్థలు రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ త్యాగి తెలియజేశారు. ఈ బాటలో ఇకపైన మరో రూ. 30,000 కోట్లు సమకూర్చుకునేందుకు వృద్ధి ఆధారిత టెక్ కంపెనీలు క్యూ కడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల దాఖలైన ప్రాస్పెక్టస్‌లు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. దేశీ స్టార్టప్ వ్యవస్థలో యూనికార్న్‌లుగా ఆవిర్భవిస్తున్న కంపెనీలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. బిలియన్ డాలర్(సుమారు రూ. 7,400 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థలో పుట్టుకొస్తున్న కొత్త తరం టెక్ కంపెనీలు స్టార్టప్ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పలు కంపెనీలు ప్రత్యేకతలు కలిగిన బిజినెస్ మోడళ్లపై దృష్టిపెడుతున్నాయని చెప్పారు. వెనువెంటనే లాభాలు అందుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేగవంత వృద్ధిని అందుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నాయని ప్రశంసించారు. పారిశ్రామిక సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో స్టార్టప్‌లకు సంబంధించి త్యాగి పలు విషయాలను ప్రస్తావించారు. ఈక్విటీకి దన్ను ఇటీవల విజయవంతమైన పబ్లిక్ ఆఫరింగ్స్‌కుతోడు మరిన్ని కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగనుండటంతో ఈక్విటీ మార్కెట్లు మరింత విస్తరించే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. టెక్ స్టార్టప్‌ల నుంచి తొలిసారిగా జొమాటో పబ్లిక్ ఇష్యూకి వచ్చి సక్సెస్ సాధించిన విషయం విదితమే. జొమాటో లిస్టింగ్‌తో టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు అనేకం సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో పేటీఎమ్, పాలసీబజార్, మొబిక్విక్, నైకా తదితరాలున్నాయి. కొద్ది కాలంగా ఐపీవో మార్కెట్లో బూమ్ నెలకొన్నట్లు త్యాగి పేర్కొన్నారు. దీంతో 2020–21లో ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ. 46,000 కోట్ల పెట్టుబడులు సమకూరిన విషయాన్ని ప్రస్తావించారు. అంతక్రితం ఏడాది సమీకరించిన రూ. 21,000 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) ఈ స్పీడ్ మరింత పెరగనుంది. తొలి ఐదు నెలల్లో(ఏప్రిల్–ఆగస్ట్)నే దాదాపు గతేడాది సమీకరించిన నిధులను అందుకోవడం గమనార్హం! వెరసి ప్రైమరీ మార్కెట్ చరిత్రలో అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్న ఏడాదిగా 2022 నిలిచే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. మరింత పెరగాలి.. ఐపీవోలకు నిర్ణయించే ధరల శ్రేణి అంశంలో సంస్కరణలు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు త్యాగి వెల్లడించారు. ప్రస్తుతం ఐపీవో మార్కెట్ ధర నిర్ణయంలో సెకండరీ మార్కెట్‌తోపోలిస్తే పారదర్శకత తక్కువేనని వ్యాఖ్యానించారు. భారీగా దాఖలయ్యే ఈ డాక్యుమెంట్లలో పలు టెక్నికల్ అంశాల ప్రస్తావన ఉంటుందని, రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని చదివి, అర్ధం చేసుకోవడం సవాలేనన్నారు. చదవండి: జొమాటో ప్రస్థానం.. పిజ్జా డెలివరీపై అసంతృప్తితో -
ఇన్వెస్టర్ల ప్రయోజనం కోసమే టీప్లస్1
న్యూఢిల్లీ: టీప్లస్1 సెటిల్మెంట్ (ట్రేడ్ ప్లస్ వన్) అన్నది మార్కెట్లోని భాగస్వాములు అందరి ప్రయోజనం కోసమేనని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి అన్నారు. ట్రేడ్స్‌ను ముందుగా సెటిల్ చేయడం (విక్రయించిన వారికి నగదు చెల్లింపులు.. కొనుగోలు చేసిన వారికి షేర్ల జమ) అన్నది అందరికీ మంచి చేస్తుందన్నారు. టీప్లస్1 సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా అమలు చేసుకోవచ్చంటూ స్టాక్ ఎక్సేంజ్‌లకు సెబీ ఈ నెల ఆరంభంలో అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం టీప్లస్2 సెటిల్మెంట్ అమల్లో ఉంది. అంటే ట్రేడ్ (లావాదేవీ) జరిగిన తర్వాతి రెండు పనిదినాల్లో దాన్ని పరిష్కరిస్తారు. విక్రయించిన వారు నిధుల కోసం, కొనుగోలు చేసిన వారు షేర్ల జమ కోసం లావాదేవీ జరిగిన తర్వాతి రెండు రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. టీప్లస్1లో లావాదేవీ తర్వాతి పనిదినం రోజునే అవి ముగిసిపోతాయి. దీనివల్ల విక్రయించిన వారికి తొందరగా నిధులు జమ అవుతాయి. 2002 లో టీప్లస్5 సెటిల్మెంట్ నుంచి సెబీ టీప్లస్3కు తగ్గించగా.. 2003లో టీప్లస్2కు కుదించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో, చెల్లింపుల వ్యవస్థల్లో ఎన్నో సంస్కరణలు వచ్చిన దృష్ట్యా దీన్ని టీప్లస్1కు తీసుకురావాల్సిన అవసరం ఉందని అజయ్‌త్యాగి అభిప్రాయపడ్డారు. కొనుగోలు చేసిన వాటిని వేగంగా పొందే హక్కు ఇన్వెస్టర్లకు ఉందన్నారు. ఇన్వెస్టర్ల ఇష్టం.. రెండు ఎక్సేంజ్‌లు భిన్నమైన సెటిల్మెంట్ సైకిల్స్‌ను ఎంపిక చేసుకుంటే లిక్విడిటీ సమస్య ఏర్పడదా? అన్న ప్రశ్నకు.. లిక్విడిటీ నిలిచిపోయేందుకు ఇది దారితీయదని బదులిచ్చారు. లిక్విడిటీ, ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట ట్రేడ్ చేసుకోవచ్చని సూచించారు. సెబీ టీప్లస్1ను ఇప్పుడు ఐచ్ఛికంగానే ప్రవేశపెట్టినా.. సమీప కాలంలో తప్పనిసరి చేయాలన్న ప్రణాళికతో ఉంది. టీప్లస్1పై విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళనలను త్యాగి తోసిపుచ్చారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 1999 నుంచి డెరివేటివ్స్‌లో ట్రేడ్ చస్తున్నారని.. వీటికి ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే, ఐపీవోల్లో వారి పెట్టుబడులు సైతం ఏడు–ఎనిమిది రోజుల పాటు నిలిచిఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తక్కువ కాల వ్యవధితో కూడిన సెటిల్మెంట్ ప్రతీ ఒక్కరికీ అవసరమేనని చెప్పారు. నూతన పీక్ మార్జిన్ నిబంధనలు అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టినవేనని వివరణ ఇచ్చారు. ‘‘రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం పెరిగినందున.. అధిక మార్జిన్ నిబంధనలు ప్రశాంతను, అనుకోని సమస్యలకు దారితీయకుండా చూస్తాయి’’ అని పేర్కొన్నారు. పీక్మార్జిన్ నిబంధనల కింద బ్రోకర్లు ఇంట్రాడే ట్రేడ్స్‌కు సంబంధించి ఎక్కువ లెవరేజ్ (రుణ సర్దుబాటు) ఇవ్వడం ఇకమీదట కుదరదు. బాండ్ మార్కెట్లో సంస్కరణలు బాండ్ మార్కెట్ బలోపేతానికి సంస్కరణలు పరిశీలనలో ఉన్నాయని అజయ్‌త్యాగి తెలిపారు. మార్కెట్ మేకర్స్‌ను ఏర్పాటు చేయ డం ఇందులో ఒకటిగా పేర్కొన్నారు. మార్కెట్ మేకర్స్ అనేవి సంస్థలు. సెకండరీ మార్కెట్లో కార్పొరేట్ బాండ్ల కొనుగోలు, విక్రయ ధరల ను కోట్ చేస్తూ లిక్విడిటీ ఉండేలా చూస్తాయి. కార్పొరేట్ బాండ్లకు రెపో కోసం లిమిటెడ్ పర్పస్ క్లియరింగ్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా సంస్కరణల్లో ఒకటిగా త్యాగి తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్బాండ్ మార్కె ట్లో 97–98 శాతం ప్రవేటు ప్లెస్మెంట్ మార్గం లో జారీ చేస్తున్నవే ఉంటున్నాయి. ఈ బాండ్ల సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అంతగా ఉండ డం లేదు. మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఎక్కు వగా పాల్గొంటున్నాయి. దీంతో ‘‘మరిన్ని బాం డ్ల పబ్లిక్ ఇష్యూలు రావాలి. సెకండరీ మార్కె ట్లో మరిన్ని సంస్థలు పాల్గొనడం ద్వారా లిక్విడిటీ పెరగాల్సి ఉంది’’ అని త్యాగి వివరించారు. చదవండి: డిగ్రీలో ఫెయిల్, నెమ్మదస్తుడు.. కానీ లక్ష కోట్లకు అధిపతి -
ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక చార్టర్: సెబీ
న్యూఢిల్లీ: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడుల ప్రక్రియలో పారదర్శకతను మరింతగా పెంచే దిశగా ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక విధానాలపై (చార్టర్) కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఇన్వెస్టర్ల హక్కులు, బాధ్యతలతో పాటు వారి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు సెబీ 2020–21 వార్షిక నివేదికలో ఆయన వివరించారు. పెట్టుబడుల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు మరింత అవగాహన పెంచుకుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలా మదుపుదారులను ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడగలదని ఆయన తెలిపారు. గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజీ, సోషల్ స్టాక్ ఎక్సే్చంజీల ఏర్పాటు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు.. ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లాంటి వాటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం, పాసివ్ ఫండ్స్ అభివృద్ధి మొదలైన అంశాలపై సెబీ కసరత్తు చేస్తున్నట్లు త్యాగి పేర్కొన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సెక్యూరిటీల మార్కెట్ కీలకపాత్ర పోషిస్తోందనడానికి 2020–21లో మార్కెట్ పరిణామాలు, ధోరణులు నిదర్శనమని ఆయన తెలిపారు. 2021 మార్చి ఆఖరు నాటికి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 200 లక్షల కోట్ల స్థాయికి చేరిందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 103 శాతమని త్యాగి పేర్కొన్నారు. -
ప్లీజ్, మొక్కుబడిగా చేయొద్దు
న్యూఢిల్లీ: చాలా మటుకు కంపెనీలు ముఖ్యమైన వివరాల వెల్లడికి సంబంధించిన నిబంధనల స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ అజయ్ త్యాగి వ్యాఖ్యానించారు. దీన్ని మొక్కబడి వ్యవహారంగా పరిగణించవద్దంటూ సంస్థలకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన వార్షిక క్యాపిటల్ మార్కెట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు పేర్కొన్నారు. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలు తరచుగా జరిగే ఆర్థిక ఫలితాల్లాంటి అంశాలతో పాటు .. ఇతరత్రా పరిణామాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ‘ఈ రెండు విషయాలపైనా కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలి. వార్షిక నివేదికల్లాంటి వాటిల్లో నిర్దేశిత అంశాలూ పొందుపరుస్తున్నప్పటికీ.. చాలా సందర్భాల్లో ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్లుగా ఉంటోంది. ఇది ఆమోదయోగ్యం కాదు. అలాగే, చాలా కేసుల్లో మీడియాలో వార్తలు రావడం, వాటిపై వివరణ ఇవ్వాలంటూ కంపెనీలను స్టాక్ ఎక్సేంజీలను కోరడం, ఆ తర్వాత ఎప్పుడో కంపెనీలు సమాధానాలు ఇవ్వడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. కంపెనీలు తమ విధానాలను పునఃసమీక్షించుకోవాలి. నిబంధనలను కేవలం మొక్కుబడిగా కాకుండా వాటి వెనుక స్ఫూర్తిని అర్థం చేసుకుని పాటించాలి‘ అని త్యాగి పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలు, వార్షిక నివేదికలు, కార్పొరేట్ గవర్నెన్స్ నివేదికలకు సంబంధించిన పత్రాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి .. ప్రస్తుత పరిస్థితుల్లో షేర్‌హోల్డర్, బోర్డు సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించడం మంచిదేనని త్యాగి చెప్పారు. అయితే, బోర్డు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు గోప్యంగానే ఉంటున్నాయా, షేర్‌హోల్డర్ల సమావేశాల్లో వాటాదారుల గళానికి తగు ప్రాధాన్యమిస్తున్నారా లేదా అన్నవి తరచి చూసుకోవాల్సిన అంశాలని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, పారదర్శకతను నిరంతరం మెరుగుపర్చుకోవడం అన్నది కంపెనీలో అంతర్గతంగా రావాలని త్యాగి చెప్పారు. నిర్వహణ బాగున్న కంపెనీలపై ఇన్వెస్టర్లకు నమ్మకం ఏర్పడుతుందని, ఆయా సంస్థలకు దీర్ఘకాలంలో వాటి ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వీయ నిర్వహణను పరిశ్రమ సక్రమంగా పాటిస్తే నియంత్రణ సంస్థ ప్రతి సారి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉండదన్నారు. పబ్లిక్ ఇష్యూల నిబంధనల్లో సంస్కరణలు .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిబంధనల్లో .. ముఖ్యంగా బుక్ బిల్డింగ్, రేటు, ధర శ్రేణికి సంబంధించిన కొన్ని అంశాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడంపై సెబీ కసరత్తు చేస్తోందని త్యాగి తెలిపారు. గత కొన్నాళ్లుగా నిధుల సమీకరణ ధోరణులు మారాయని, సెబీ కూడా తదనుగుణంగా నిబంధనలకు సవరణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ నిబంధనల్లో పలు మార్పులు చేయడం, పెద్ద కంపెనీలు సులభంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు వీలు కల్పించేలా కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను సవరించడం మొదలైనవి గత రెండేళ్లలో చేసినట్లు త్యాగి చెప్పారు. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు, స్టార్టప్ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రమోటరు షేర్‌హోల్డింగ్ స్థానంలో నియంత్రణ వాటా కలిగిన షేర్‌హోల్డర్ల కాన్సెప్టును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికే చర్చాపత్రం విడుదల చేసినట్లు వెల్లడించారు. స్పాట్ మార్కెట్ ద్వారా పసిడి దిగుమతులు .. భవిష్యత్తులో పసిడిని ఎక్సే్చంజ్ వ్యవస్థ (ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్–ఈజీఆర్) ద్వారా దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సెబీ హోల్ టైమ్ సభ్యుడు జి. మహాలింగం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టర్కీ, చైనా వంటి దేశాల్లో ఈ విధానాన్ని పాటిస్తున్నారని ఆయన తెలిపారు. 995 స్వచ్ఛతకు మించిన బంగారం ఎక్సే్చంజ్ వ్యవస్థ ద్వారానే వచ్చేలా చూడాలని, దీంతో అది ఆర్థిక సాధనంగా మారుతుందని మహాలింగం చెప్పారు. ప్రస్తుతం భారత్ ఏటా 35 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోందని, ఎక్సే్చంజ్ మార్కెట్ వ్యవస్థలోకి మళ్లించడం వల్ల కరెంటు అకౌంటు లోటుపరమైన భారం తగ్గుతుందని తెలిపారు. -
సెక్యూరిటీ మార్కెట్లపై రిటైల్ ఇన్వెస్టర్ల ముద్ర
న్యూఢిల్లీ: సెక్యూరిటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం 2020 ఏప్రిల్ నుంచి పెరిగినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఎన్ఐఎస్ఎమ్ రెండో వార్షిక ‘క్యాపిటల్ మార్కెట్స్’ సదస్సులో భాగంగా త్యాగి మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ప్రతీ నెలా 24.5 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమైనట్టు చెప్పారు. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉండడం, నగదు లభ్యత తగినంత ఉండడం ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. కానీ, అదే సమయంలో ఇన్వెస్టర్లకు ఆయన ఒక హెచ్చరిక చేశారు. వడ్డీ రేట్లు తిరిగి పెరగడం మొదలై, నగదు లభ్యత తగ్గితే అది మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందన్నారు. మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తునే చూస్తుంటాయన్న ఆయన.. ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తు వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వస్తున్నవిగా పేర్కొన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి 4.1 కోట్లుగా ఉన్న మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య.. ఆర్థిక సంవత్సరం చివరికి 5.5 కోట్లకు పెరగడం గమనార్హం. అంటే 34.7 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. ఈ లెక్కన గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నెలా సగటున 12 లక్షల చొప్పున కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరుచుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20)లో ప్రతీ నెలా సగటున ప్రారంభమైన కొత్త డీమ్యాట్ ఖాతాలు 4.2 లక్షల చొప్పున ఉన్నాయి. మరింత వేగం.. ‘‘ఈ ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరింత వేగాన్ని అందుకుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతీ నెలా 24.5 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ టర్నోవర్ 2019–20లో రూ.96.6 లక్షల కోట్లుగా ఉంటే.. 2020–21లో రూ.164.4 లక్షల కోట్లకు పెరిగింది. 70.2 శాతం అధికమైంది. ట్రేడ్లలో ఎక్కువ భాగం మొబైల్స్, ఇంటర్నెట్ ఆధారిత వేదికల నుంచే నమోదు కావడం రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరిగినదానికి సంకేతం’’ అని అజయ్ త్యాగి వివరించారు. రీట్, ఇన్విట్, ఈఎస్జీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు త్యాగి చెప్పారు. కరోనా కల్లోలిత సంవత్సరంలోనూ (2020–21) క్యాపిటల్ మార్కెట్ల నుంచి కంపెనీలు రూ.10.12 లక్షల కోట్లను సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ.9.96 లక్షల కోట్ల కంటే స్వల్పంగా పెరిగింది. నూతన దశకం ‘‘బలమైన వృద్ధికితోడు మన మార్కెట్లు కొత్త యుగంలోకి అడుగు పెట్టాయి. పలు నూతన తరం టెక్ కంపెనీలు దేశీయంగా లిస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మరే ఇతర మార్కెట్‌తో చూసినా కానీ మన మార్కెట్లు నిధుల సమీకరణ విషయంలో ఆకర్షణీయంగా ఉన్నాయి’’ అని త్యాగి పేర్కొన్నారు. క్యాపిటల్ మార్కెట్ల బలోపేతానికి, మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా సెబీ ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. -
ఫండ్స్‌పై ఆటోమేషన్ నిఘా
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన తనిఖీ, నిఘా వ్యవహారాల కోసం ఆటోమేషన్ ప్రాజెక్టును అమలు చేయనుంది. దీనివల్ల నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడంలో జాప్యాన్ని నివారించొచ్చని సెబీ చీఫ్ అజయ్‌త్యాగి అభిప్రాయపడ్డారు. నిఘా, దర్యాప్తు బాధ్యతలకు సంబంధించి భారీ సాంకేతిక టెక్నాలజీని అమలు చేయబోతున్నట్టు 2019–20 వార్షిక నివేదికలో పేర్కొన్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలోనూ నియంత్రణపరమైన కార్యాచరణ పటిష్టానికి పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవసరమైతే మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్నట్టు త్యాగి చెప్పారు. సమస్యలు నిజమే: ఎన్పీసీఐ నూతన వ్యవస్థ అమలు కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడుల సమయంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నట్టు వచ్చిన వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అంగీకరించింది. ‘‘ఇటీవలే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ సదుపాయాలను విస్తరించే లక్ష్యంతో నూతన వ్యవస్థకు మారిపోవడం జరిగింది. ఇది ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసినది. ఆ సమయంలో సెటిల్మెంట్ ఆలస్యం కావడం వంటి ఆరంభ సమస్యలను ఎదుర్కొన్నాము. కానీ, అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీలు నిధులు జమ అయిన రోజు నుంచే అమల్లోకి వస్తాయన్న నియంత్రణపరమైన నిబంధనల అమలు (ఫిబ్రవరి 1నుంచి) కూడా జరిగింది. సాంకేతిక సమస్యలు వస్తే ఇన్వెస్టర్లకు పరిహారం కాగా సాంకేతిక సమస్యల కారణంగా నష్టపోయే ఇన్వెస్టర్లకు పరిహారం లభించే విధంగా సెబీ కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది. -
అనిశ్చితిలో ఇంకా ఏం చేద్దాం!
న్యూఢిల్లీ: కోవిడ్–19 ప్రతికూలతల నేపథ్యంలో గురువారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) దృష్టి సారించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. కరోనా వైరస్ సంక్షోభం దేశంలో ప్రారంభమైన తర్వాత కౌన్సిల్ సమావేశం ఇదే తొలిసారి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ 22వ కౌన్సిల్ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చీఫ్ అజయ్ త్యాగి, ఐఆర్డీఏఐ చైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్ ఎంఎస్ సాహూ, పీఎఫ్‌ఆర్‌డీఏఐ చైర్మన్ సుప్రీతం బందోపాధ్యాయ పాల్గొన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషన్ పాండే, ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి దేబాషిస్ పాండా సహా ఆర్థికశాఖ పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ భేటీలో ఉన్నారు. సమావేశానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశంలో ద్రవ్యలభ్యత పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు మరిన్ని తీసుకోవాలని, ఫైనాన్షియల్ సెక్టార్లో మూలధన అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చాలని ఎఫ్ఎస్డీసీ భావించింది. ► మార్కెట్ ఒడిదుడుకులు, దేశీయంగా ఆర్థిక వనరుల సమీకరణ, అంతర్జాతీయ పెట్టుబడులు వంటి కీలక అంశాలపై సమావేశం చర్చించింది. ► కోవిడ్–19 గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థ స్థిరత్వానికి ముప్పును తెచ్చిపెట్టిందనీ, రికవరీ ఎప్పుడన్నది సైతం ఇప్పుడే చెప్పడం కష్టమని పేర్కొంది. -
కార్వీ తరహా మోసాలకు చెక్
ముంబై: భవిష్యత్తులో కార్వీ తరహా మోసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ చీఫ్ అజయ్ త్యాగి చెప్పారు. క్లయింట్లకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర విలువైన సెక్యూరిటీలను దుర్వినియోగం చేసిన విషయమై కార్వీ బ్రోకింగ్ సర్వీసెస్‌పై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నెల 14 నాటికి కార్వీ సంస్థ చెల్లించాల్సిన బకాయిలు రూ.1,189 కోట్లుగా ఉన్నాయని త్యాగి పేర్కొన్నారు. ఈ విషయమై కార్వీకి నోటీసులు జారీ చేశామని వివరించారు. తమ కంపెనీల్లో ఒక దాంట్లో వాటా విక్రయ ప్రయత్నాలు చేస్తున్నామని, అది పూర్తవ్వగానే ఈ బకాయిలను చెల్లిస్తామని, మార్చి కల్లా అన్ని బకాయిలను చెల్లిస్తామని కార్వీ వెల్లడించిందని వివరించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన సెబీ బోర్డ్ సమావేశ వివరాలను ఆయన వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సెబీ బోర్డ్ ఆమోదించింది. సంతృప్తికరంగానే... ఈ నెలలోనే సెబీ చైర్మన్‌గా అజయ్ త్యాగి మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. తన హయాంలో పారదర్శకంగా, సంప్రదింపుల పద్ధతిలోనే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించామని, అధికారం చెలాయించడానికి ప్రయత్నించలేదని అజయ్ త్యాగి పేర్కొన్నారు. తన హయాం సంతృప్తికరంగానే గడిచిందని తెలిపారు. సోమవారం జరిగిన సెబీ బోర్డ్ కీలక నిర్ణయాలు ఇవీ..., ►కంపెనీల్లో చైర్మన్, ఎమ్డీ పోస్ట్‌ల విభజన విషయంలో పలు ఆచరణాత్మక, పరిపాలనా పరమైన సమస్యలున్నాయి. అందుకే ఈ పోస్ట్‌ల విభజనకు గడువును మరో రెండేళ్లు (2020, ఏప్రిల్ వరకూ) పొడిగించారు. ►స్మాల్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌ల పునః వర్గీకరణపై మరింత కసరత్తు జరుగుతోంది. త్వరలోనే మార్గదర్శకాలను వెల్లడించనున్నది. ►ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం మదుపు సలహాదారుల(ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల) అర్హతలను మరింత కఠినతరం చేయనున్నది. ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఫీజులపై గరిష్ట పరిమితిని నిర్దేశించనున్నది. -
చేయకూడనివన్నీ చేసింది..
ముంబై/హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ ఎన్నడూ అనుమతించని కార్యకలాపాలన్నింటినీ కార్వీ సాగించిందని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి లావాదేవీలు జరపరాదంటూ విస్పష్టమైన సర్క్యులర్ జూన్‌లోనే ఇచ్చాం. అయితే గతంలో కూడా వీటికి అనుమతి లేదు. కార్వీ మాత్రం ప్రాథమికంగా అనుమతించని పనులన్నీ చేసింది. నిబంధనల్లో ప్రత్యేకంగా లేదు కాబట్టి క్లయింట్ల షేర్లను సొంతానికి వాడేసుకుంటామంటే కుదరదు’ అని త్యాగి స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన ఆసియా రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్వీ గతంలోనూ ఇలాంటివి చేసిందని చెప్పిన త్యాగి... గతంలో తమ ఆడిట్లలో వీటిని ఎందుకు బయటపెట్టలేకపోయామన్నది మాత్రం చెప్పలేదు. ఎన్ఎస్ఈ, సెబీతో బ్యాంకర్ల చర్చలు.. కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఖాతాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేసేందుకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంస్థను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నియమించినట్లు సమాచారం. మరోవైపు, కార్వీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఆందోళన పెరుగుతోంది. సెబీ ఉత్తర్వుల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల ప్రస్తావన కూడా ఉండటంతో దీనిపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత, కార్వీకి చెందిన కంపెనీలేమైనా డిఫాల్ట్ అయ్యే అవకాశాలున్నా యా అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు ఎన్ఎస్ఈ, సెబీతో అవి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి కార్వీ సుమారు రూ. 600 కోట్ల మేర నిధులు తీసుకున్నట్లు తెలియవచ్చింది. అంతా సర్దుకుంటుంది కీలక ఉద్యోగులకు కార్వీ చీఫ్ లేఖ ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడగలమని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. తనఖాలో ఉన్న షేర్లను త్వరలోనే విడిపిస్తామని, క్లయింట్లకు కూడా చెల్లింపులు జరిపేస్తామని పేర్కొంటూ సంస్థ కీలక ఉద్యోగులకు బుధవారం ఆయనో లేఖ రాసినట్లు తెలిసింది. గరిష్ఠంగా రెండు వారాల్లో చెల్లింపులు పూర్తిచేస్తామని కొద్దిరోజులుగా చెబుతున్న ఆయన... ఈ లేఖలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
డిఫాల్ట్ నిబంధనలు మరింత కఠినం
ముంబై: రుణ చెల్లింపుల్లో వైఫల్యానికి సంబంధించిన వెల్లడి నిబంధనలను మార్కెట్ నియం త్రణ సంస్థ సెబీ కఠినతరం చేసింది. రైట్స్ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని 55 రోజుల నుంచి 31 రోజులకు కుదించింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్(పీఎమ్ఎస్)కు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. ఈ మేరకు సెబీ బోర్డ్ బుధవారం తీసుకున్న నిర్ణయాల వివరాలను సెబీ చైర్మన్ అజయ్ త్యాగి వెల్లడించారు. వివరాలు.... డిఫాల్ట్ 30 రోజులకు మించితే.... స్టాక్ మార్కెట్లో లిస్టైన ఏదైనా కంపెనీ రుణ చెల్లింపుల్లో విఫలమై 30 రోజులు దాటితే, 24 గంటల్లోనే ఈ విషయాన్ని స్టాక్ ఎక్సే్చంజ్‌లకు వెల్లడించాల్సి ఉంటుంది. రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలకు సంబంధించిన సమాచారం వాటాదారులకు, ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవడం కోసమే సెబీ ఈ నిబంధనను తెచ్చింది. ఈ కొత్త వెల్లడి నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. రైట్స్ ఇష్యూ కాలం 31 రోజులకు కుదింపు.... రైట్స్ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని సెబీ తగ్గించింది. ఈ ప్రక్రియ గతంలో 55 రోజుల్లో పూర్తయ్యేది. దీనిని 31 రోజులకు తగ్గించింది. అలాగే రైట్స్ ఇష్యూకు దరఖాస్తు చేసే అన్ని కేటగిరీల ఇన్వెస్టర్లు ఆస్బా (అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్)విధానంలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. పీఎమ్ఎస్ కనీస పెట్టుబడి పెంపు.. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్(పీఎమ్ఎస్) నుంచి రిటైల్ ఇన్వెస్టర్లను దూరం చేయడమే లక్ష్యంగా పీఎమ్ఎస్ కనీస పెట్టుబడి పరిమితిని సెబీ పెంచింది. గతంలో రూ.25 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.50 లక్షలకు పెంచింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజర్ల నెట్‌వర్త్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. ఈ నెట్‌వర్త్‌ను చేరుకోవడానికి పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు మూడేళ్ల గడువును ఇచ్చింది. ఈ తాజా నిబంధనల కారణంగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెరుగుతాయని నిపుణుల అంచనా. వ్యాపార బాధ్యత నివేదిక... మార్కెట్లో లిస్టైన టాప్ 1,000 కంపెనీలు వార్షిక వ్యాపార బాధ్యత నివేదికను సెబీకి సమర్పించాలి. వాటాదారులతో సంబంధాలు, పర్యావరణ సంబంధిత అంశాలతో కూడిన ఈ నివేదికను ఈ కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాప్ 500 కంపెనీలకే వర్తించే ఈ నిబంధన ఇప్పుడు టాప్ 1000 కంపెనీలకు వర్తించనున్నది. -
నందన్ నీలేకనికి అజయ్ త్యాగి కౌంటర్
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని వ్యాఖ్యలపై సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగి ఆసక్తికరమైన కౌంటర్ ఇచ్చారు. ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశం తరువాత సెబీ చైర్మన్ అజయ్ త్యాగి స్పందించారు. ప్రదానంగా ‘దేవుడు కూడా ఇన్ఫోసిస్ నెంబర్లను మార్చలేడు’ అన్ని నీలేకని వ్యాఖ్యాలపై స్పందించాలని అడిగినపుడు ఈ విషయాన్ని దేవుడిని అడగాలి లేదా అతడిని (నిలేకని)అడగాలి ఇందులోతాను చెప్పేదేమీలేదంటూ వ్యాఖ్యానించారు. నవంబర్ 5 న జరిగిన కంపెనీ వార్షిక విశ్లేషకుల సమావేశంలో నందన్ నిలేకని మాట్లాడుతూ కంపెనీ సొంత దర్యాప్తులో విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదును బలపరిచే ఆధారాలు లభించలేదన్నారు. అంతేకాదు దేవుడు కూడా ఇన్ఫోసిస్ నెంబర్లను మార్చలేడని పేర్కొన్నసంగతి తెలిసిందే. కాగా ఇన్ఫోసిస్ స్వల్ప కాలంలో లాభాలు, ఆదాయాలు పెంచుకోడానికి అనైతిక పద్ధతులను అనుసరిస్తోందని, కంపెనీలో ‘నైతికమైన ఉద్యోగులు’గా తమను తాము పిలుచుకునే ఓ గ్రూప్, కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నిరంజన్ రాయ్‌కు వ్యతిరేకంగా కంపెనీ బోర్డుకు, యుఎస్ సెక్యురిటీస్, ఎక్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ-సెక్)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై యుఎస్ సెక్, సెబీ దర్యాప్తును ప్రారంభించాయి. -
మన మార్కెట్లలోనే అస్థిరతలు తక్కువ
కోల్‌కతా: అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లలో ఈ ఏడాది నెలకొన్న అస్థిరతలు మరికొంత కాలం పాటు కొనసాగొచ్చని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, చమురు ధరల్లో అస్థిరతలు, వాణిజ్య వివాదాలు పెరగడం, ఇరాన్‌పై ఆంక్షలు వంటి అంశాలను అస్థిరతలకు కారణాలుగా త్యాగి ఉదహరించారు. భారత మార్కెట్లు కూడా ఈ అంశాల కారణంగా ప్రభావితం అయ్యాయన్నారు. ఐఐఎం కలకత్తా నిర్వహించిన భారత 8వ ఆర్థిక సదస్సులో త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన మార్కెట్లతోను, వర్ధమాన మార్కెట్లతోను పోలిస్తే అస్థిరతలు మన దగ్గరే తక్కువగా ఉన్నట్టు చెప్పారు. భారత ఈక్విటీ మార్కెట్లో డిసెంబర్ మధ్య నాటికి ఆస్థిరతలు 12 శాతం వరకు ఉంటే, ఇదే కాలంలో బ్రిటన్‌లో 12 శాతం, అమెరికాలో 16 శాతం, చైనాలో 19 శాతం, జపాన్‌లో 17 శాతం, దక్షిణ కొరియాలో 14 శాతం, హాంగ్‌కాంగ్‌లో 19 శాతం, బ్రెజిల్లో 21 శాతంగా ఉన్నట్టు త్యాగి తెలిపారు. డౌ జోన్స్ ఈ ఏడాది సున్నా రిటర్నులు ఇస్తే, నిఫ్టీ రాబడులు 5.8 శాతంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు నిధుల లభ్యత సమస్య నెలకొందని, అయితే ఆర్బీఐ చేపట్టిన చర్యలతో ఈ పరిస్థితి మెరుగుపడిందని చెప్పారాయన. -
ఇక మూడు రోజుల్లోనే లిస్టింగ్
ముంబై: మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మంగళవారం జరిగిన బోర్డ్ సమావేశంలో పలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సంబంధించిన సవరించిన కొత్త కేవైసీ (నో యువర్ కస్టమర్)నిబంధనలకు ఆమోదం తెలిపామని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి వెల్లడించారు. ఐపీఓకు వచ్చిన కంపెనీలు స్టాక మార్కెట్లో లిస్టయ్యే సమయాన్ని తగ్గించామని, అలాగే మ్యూచువల్ ఫండ్ చార్జీలను కూడా తగ్గించామని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్ మొత్తం వ్యయాలు 2.25 శాతానికి మించకుండా పరిమితిని విధించామని. ఫలితంగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వ్యక్తుల ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్‌ను విశ్లేషించే అధికారాలు సెబీకి ఇవ్వాలని త్వరలో ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. సెబీ ఆమోదం తెలిపిన కొన్ని ముఖ్య నిర్ణయాలు. ♦ ఐపీఓ ముగిసిన తర్వాత ఆరు రోజులకు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యేవి. ఇప్పడు ఈ సమయాన్ని మూడు రోజులకు కుదింపు ♦ ఐపీఓలలో షేర్లు కొనుగోలు చేసే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) పేరుతో ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ♦ కొన్ని షరతులకు లోబడి కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి. ♦ దేశీయ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి నమోదు చేసుకోవడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఒకటే దరఖాస్తు సమర్పిస్తే చాలు. ♦ కావాలని రుణాలు ఎగవేసిన వాళ్లు, ఆర్థిక నేరగాళ్లు సెటిల్మెంట్ ప్రక్రియలో పాల్గొనలేరు. ♦ ఆర్థిక నేరగాళ్లు ఓపెన్ ఆఫర్లను ప్రకటించలేరు. ♦ స్టాక్ మార్కెట్లో లిస్టైన దిగ్గజ కంపెనీలు తమ దీర్ఘకాలిక రుణావసరాల్లో కనీసం 25 శాతం వరకూ కార్పొరేట్ బాండ్ల ద్వారానే సమీకరించాలి. ♦ లిస్టైన కంపెనీల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను ఆయా కంపెనీలు సవివరంగా ఒక జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. కొచర్ సమస్య పరిష్కారంపై చర్చ... ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచర్ భర్తకు సంబంధించిన వ్యాపార లాదేవీల విషయమై తమ షోకాజు నోటీసుకు బ్యాంకు స్పందించిందని సెబీ చీఫ్ తెలిపారు. అంగీకారం ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు బ్యాంకు అనుమతి కోరిం దన్నారు. కొచర్ భర్త దీపక్ కొచర్ వీడియోకాన్ గ్రూపుతో కొన్నేళ్లుగా ఎన్నో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నట్టు సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ప్రయోజన వివాదం కింద లిస్టింగ్ నిబం ధనలు పాటించకపోవడంపై సెబీ షోకాజు నోటీసు జారీ చేసింది. తమ వైపు నుంచి నియంత్రణపరమైన వైఫల్యం ఏదీ లేదని ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు చందా కొచర్ షోకాజు నోటీసులకు బదులిచ్చారు. ట్రేడింగ్ వేళల పెంపుపై అనిశ్చితి... స్టాక్ ఎక్సే్చంజ్‌ల ట్రేడింగ్ వేళల పెంపు సాకా రం కావడానికి మరికొంత కాలం పట్టేట్లు ఉంది. ట్రేడింగ్ వేళల పెంపు విషయమై స్టాక్ ఎక్సే్చంజ్‌లు ఎలాంటి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు రాకపోవడంతో ఈ పెంపు మరికొంత కాలం వాయిదా పడే అవకాశాలున్నాయి. షెడ్యూల్ప్రకారమైతే, వచ్చే నెల ఒకటి నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను రాత్రి 11.55 వరకూ కొనసాగించాలని సెబీ ఆలోచన. -
సెబీ చైర్మన్‌గా అజయ్ త్యాగి బాధ్యతలు
ముంబై: క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ చైర్మన్‌గా సీనియర ఐఏఎస్ అధికారి అజయ్ త్యాగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) తొమ్మిదవ చైర్మన్‌గా త్యాగి వ్యవహరించనున్నారు. ఆరేళ్ల పాటు చైర్మన్‌గా పనిచేసిన యు.కె. సిన్హా స్థానంలో త్యాగి వచ్చారు. 58 సంవత్సరాల త్యాగి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్, 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి త్యాగి ఆర్థిక మంత్రిత్వ శాఖలో గతంలో క్యాపిటల్ మార్కెట్ విభాగాన్ని నిర్వహించారు. ఆయన కేంద్రంలో పలు బాధ్యతలు నిర్వహించారు. పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖకు సంయుక్త కార్యదర్శిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేసారు. పెట్రోలియమ్, నేచురల్ గ్యాస్, ఉక్కు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల్లో పలు హోదాల్లో ఆయన కార్యకలాపాలు నిర్వర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన త్యాగి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఇక యూకే సిన్హా సెబీ చైర్మన్‌గా ఆరేళ్ల పాటు పనిచేశారు. అధిక కాలం సెబీ చైర్మన్‌గా పనిచేసిన వాళ్లలో సిన్హా రెండో వ్యక్తి. డి. ఆర్ . మెహతా1995 నుంచి 2002 వరకూ ఏడేళ్ల పాటు సెబీ చైర్మన్‌గా వ్యవహరించారు. సిన్హాకు ముందు సి. బి. భవే. ఎం. దామోదరన్, జి.ఎన్. బాజ్‌పాయ్‌లు మూడేళ్ల చొప్పున సెబీ చైర్మన్‌గా పనిచేశారు. -
సెబీ ఛైర్మన్‌పై ప్రభుత్వ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ : క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ సెబీ ఛైర్మన్ పదవికాలంపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తదుపరి సెబీ చీఫ్ అజయ్ త్యాగి (58)పదవీకాలంలో కోత పెట్టింది. సాదారణంగా అయిదేళ్లు ఉండే సెబీ ఛైర్మన్ పదవీకాలానికి భిన్నంగా త్యాగిపదవీకాలంలో రెండేళ్లను తగ్గించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంవెనక కారణాలను మాత్రం వెల్లడించలేదు. సెబీ చీప్‌గా త్యాగి పేరును ప్రకించిన వారం తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో సెబీ చీఫ్‌గా త్యాగి మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన త్యాగి, అర్థశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ 1984 బ్యాచ్ ఐఎఎస్ కేడర్ కు చెందిన ఈయన ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (పెట్టుబడి) గా పనిచేస్తున్నారు. అలాగే స్వల్పం కాలం పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో సభ్యుడుగా కూడా ఉన్నారు. త్వరలోనే ఆయన సెబీ చీఫ్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఫిబ్రవరి 10న త్యాగి నియామకానికి ఆమోదం తెలిపింది. యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2011 ఫిబ్రవరి 18న నియమితుడైన ప్రస్తుత చీఫ్ యుకె సిన్హా పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగించడంతో ఆరు సంవత్సరాలకు పైగాపదవిలో కొనసాగారు. అంతేకాదు డి.ఆర్. మెహతా (1995 -2002) తర్వాత ఎక్కువ కాలంలో సెబీ చీఫ్ పదివిలో వున్న రెండవ వ్యక్తిగా నమోదయ్యారు. యుకె సిన్హా పదవీకాలం మార్చి 1,2017 న ముగియనుంది. కాగా సెబీ, స్టాక్ ఎక్సేంజ్ లనునియంత్రించడంతోపాటు, వేల లిస్టెడ్ కంపెనీలు, బ్రోకర్లు సహా వివిధ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐలు ,రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను సెబీ పర్యవేక్షిస్తుంది. -
సెబీ కొత్త చైర్మన్‌గా అజయ్ త్యాగి
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కొత్త చైర్మన్‌గా అజయ్ త్యాగి నియమితులయ్యారు. వచ్చే నెల 1న పదవీ విరమణ చేయనున్న యు.కె. సిన్హా స్థానంలో ఆయన ఎంపిక జరిగింది. 1984 బ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 58 సంవత్సరాల త్యాగి ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శి(ఇన్వెస్ట్మెంట్)గా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అథ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ త్యాగి ఎంపికకు ఆమోదం తెలిపింది. ఐదేళ్లకు మించకుండా లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన త్యాగి ఆర్బీఐ డైరెక్టర్‌గా కొంత కాలం ఉన్నారు. సెబీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తికి నెలకు రూ.4.5 లక్షల వేతనం(కన్సాలిడేటెడ్ పే) లభిస్తుంది. ఇక 1976 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సిన్హా 2011, ఫిబ్రవరి 18న సెబీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
ఎగిసే మార్కెట్లలో.. ఆచితూచి పెట్టుబడి
మార్కెట్లు ఒక్కసారిగా ఎగిసేటప్పుడు.. పెట్టుబడి అవకాశాలు కోల్పోతామేమో అన్న ఆందోళనతో తొందరపడొద్దని ఇన్వెస్టర్లకు సూచించారు యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ అజయ్ త్యాగి. షేర్లు కొనుగోలు చేసేందుకు మధ్య మధ్యలో వచ్చే కరెక్షన్లను ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు.. మార్కెట్లు కాస్త గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు భారీ మొత్తాలు ఇన్వెస్ట్ చేస్తుంటారని, మార్కెట్లు ఏమాత్రం కరెక్షన్కు లోనైనా ఇన్వెస్ట్ చేయడానికి జంకుతుంటారని త్యాగి తెలిపారు. అయితే ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడైనా సరే ఒక 5-10 శాతం మేర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయన్నది ఇన్వెస్టర్లు గుర్తెరిగి వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇటీవలి ర్యాలీలో కొన్ని షేర్లను చూస్తే.. పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) నిష్పత్తికి దాదాపు ఇరవై రెట్లు అధిక స్థాయికి చేరాయని, మార్కెట్లు ఈ స్థాయిలో పెరిగినప్పుడు అకస్మాత్తుగా కరెక్షన్లకు లోనవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని త్యాగి పేర్కొన్నారు. ఇక, బ్యాంకుల విషయానికొస్తే... మొండిబకాయిలు మొదలైన వాటి నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)పై ప్రతికూల ధోరణే ఉందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు నిధులు సమీకరించి.. వృద్ధికి వినియోగించుకోనుండగా.. పీఎస్‌బీలు తాము సమీకరించే నిధులను ఖాతాల ప్రక్షాళనకు ఉపయోగించుకోవాల్సి రావొచ్చని త్యాగి తెలిపారు.