సెబీ కొత్త చైర్మన్‌గా అజయ్ త్యాగి
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కొత్త చైర్మన్‌గా అజయ్ త్యాగి నియమితులయ్యారు. వచ్చే నెల 1న పదవీ విరమణ చేయనున్న యు.కె. సిన్హా స్థానంలో ఆయన ఎంపిక జరిగింది. 1984 బ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 58 సంవత్సరాల త్యాగి ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శి(ఇన్వెస్ట్‌మెంట్)గా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అథ్యక్షతన గల కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ త్యాగి ఎంపికకు ఆమోదం తెలిపింది.
ఐదేళ్లకు మించకుండా లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన త్యాగి ఆర్‌బీఐ డైరెక్టర్‌గా కొంత కాలం ఉన్నారు. సెబీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తికి నెలకు రూ.4.5 లక్షల వేతనం(కన్సాలిడేటెడ్ పే) లభిస్తుంది. ఇక 1976 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సిన్హా 2011, ఫిబ్రవరి 18న సెబీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.