న్యూఢిల్లీ: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడుల ప్రక్రియలో పారదర్శకతను మరింతగా పెంచే దిశగా ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక విధానాలపై (చార్టర్) కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఇన్వెస్టర్ల హక్కులు, బాధ్యతలతో పాటు వారి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు సెబీ 2020–21 వార్షిక నివేదికలో ఆయన వివరించారు. పెట్టుబడుల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు మరింత అవగాహన పెంచుకుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలా మదుపుదారులను ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడగలదని ఆయన తెలిపారు.
గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజీ, సోషల్ స్టాక్ ఎక్సే్చంజీల ఏర్పాటు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు.. ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల్లాంటి వాటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం, పాసివ్ ఫండ్స్ అభివృద్ధి మొదలైన అంశాలపై సెబీ కసరత్తు చేస్తున్నట్లు త్యాగి పేర్కొన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సెక్యూరిటీల మార్కెట్ కీలకపాత్ర పోషిస్తోందనడానికి 2020–21లో మార్కెట్ పరిణామాలు, ధోరణులు నిదర్శనమని ఆయన తెలిపారు. 2021 మార్చి ఆఖరు నాటికి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 200 లక్షల కోట్ల స్థాయికి చేరిందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 103 శాతమని త్యాగి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment