securities market
-
కేఎస్‌బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్‌లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్‌బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్‌ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
సత్యం స్కాం: 14 ఏళ్ల నిషేధం ఉత్తర్వులు పక్కకి, రామలింగరాజుకు ఊరట
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో రామలింగరాజు తదితరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి నిషేధిస్తూ సెబీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ శాట్ పక్కన పెట్టింది. 14 ఏళ్ల వ్యవధిని నిర్దేశించడానికి ఏ కారణమూ చూపలేదని పేర్కొంది. అలాగే ఒక్కొక్కరూ అక్రమంగా ఎంతెంత లబ్ధి పొందారో వేర్వేరుగా లెక్కించాల్సిందని సూచించింది. దీనిపై నాలుగు నెలల్లో కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరాల్లోకి వెడితే .. ఖాతాల్లో అవకతవకలు బైటపడటంతో 2009లో సత్యం కంప్యూటర్స్ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రమోటర్లయిన రామలింగ రాజు, రామ రాజులతో పాటు పలువురిపై కేసులు దాఖలయ్యాయి. ఆరుగురిని సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి 14 ఏళ్లు నిషేధించడంతో పాటు భారీగా జరిమానా విధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2018లో రెండు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై వారు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా తాజా ఆదేశాలు వచ్చాయి. -
డీసీ ప్రమోటర్లకు సెబీ షాక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్) ప్రమోటర్లపై కొరడా ఝళిపించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలంపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. అంతేకాకుండా వివిధ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 8.2 కోట్లవరకూ జరిమానాలు సైతం విధించింది. అవకతవకలకు పాల్పడటం, వివిధ నిబంధనల ఉల్లంఘన, 2008–09 నుంచి 2011–12 వరకూ ఆర్థిక ఫలితాలలో రుణాలను తగ్గించి చూపడం తదితరాలపై సెబీ తాజా చర్యలు చేపట్టింది. వివరాలు ఇలా..: డీసీహెచ్‌ఎల్‌పై రూ. 4 కోట్లు, టి.వెంకట్రామ్రెడ్డి, టి.వినాయక్ రవి రెడ్డిలపై విడిగా రూ. 1.3 కోట్లు చొప్పున సెబీ జరిమానాలు విధించింది. ఇదేవిధంగా ఎన్.కృష్ణన్‌కు రూ. 20 లక్షలు, వి.శంకర్‌కు రూ. 10 లక్షలు చొప్పున ఫైన్ వేసింది. ఈ నలుగురినీ సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొంది. సెక్యూరిటీల మార్కెట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా సహచర కార్యకలాపాలూ చేపట్టకుండా ఆదేశాలు జారీ చేసింది. 2011 అక్టోబర్ నుంచి 2012 డిసెంబర్ మధ్య కాలంలో అక్రమ, తప్పుడు లావాదేవీల నిరోధ చట్ట నిబంధనలతోపాటు, ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించడంపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా సెబీ తాజా చర్యలు ప్రకటించింది. డీసీహెచ్ఎల్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, వైస్‌చైర్మన్ పీకే అయ్యర్ ఆర్థిక ఫలితాలలో అక్రమాలకు తెరతీసినట్లు సెబీ పేర్కొంది. లయబిలిటీలను తక్కువ చేసి చూపడంతోపాటు.. లాభాలను అధికం చేసి ప్రకటించినట్లు తెలియజేసింది. రిజర్వులు లేనప్పటికీ మార్కెట్ ధర కంటే అధిక విలువలో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది. తద్వారా ఇన్వెస్టర్లను మోసపుచ్చడం, షేర్లలో పెట్టుబడులకు ప్రేరేపించడం వంటివి చేసినట్లు తెలియజేసింది. వెంకట్రామ్రెడ్డి, రవి రెడ్డి, అయ్యర్ తమ వద్ద గల షేర్ల తనఖా తదితర వివరాల వెల్లడిలోనూ వైఫల్యం చెందినట్లు వివరించింది. -
ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక చార్టర్: సెబీ
న్యూఢిల్లీ: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడుల ప్రక్రియలో పారదర్శకతను మరింతగా పెంచే దిశగా ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక విధానాలపై (చార్టర్) కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఇన్వెస్టర్ల హక్కులు, బాధ్యతలతో పాటు వారి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు సెబీ 2020–21 వార్షిక నివేదికలో ఆయన వివరించారు. పెట్టుబడుల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు మరింత అవగాహన పెంచుకుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలా మదుపుదారులను ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడగలదని ఆయన తెలిపారు. గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజీ, సోషల్ స్టాక్ ఎక్సే్చంజీల ఏర్పాటు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు.. ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లాంటి వాటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం, పాసివ్ ఫండ్స్ అభివృద్ధి మొదలైన అంశాలపై సెబీ కసరత్తు చేస్తున్నట్లు త్యాగి పేర్కొన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సెక్యూరిటీల మార్కెట్ కీలకపాత్ర పోషిస్తోందనడానికి 2020–21లో మార్కెట్ పరిణామాలు, ధోరణులు నిదర్శనమని ఆయన తెలిపారు. 2021 మార్చి ఆఖరు నాటికి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 200 లక్షల కోట్ల స్థాయికి చేరిందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 103 శాతమని త్యాగి పేర్కొన్నారు. -
మహీంద్రా మాన్యులైఫ్ నుంచి కొత్త ఫండ్
మహీంద్రా మాన్యులైఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ తాజాగా ఫ్లెక్సి క్యాప్ యోజన పేరిట కొత్త ఫండ్ ఆఫర్‌ను (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలికంగా ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో చేసే పెట్టుబడుల వృద్ధిని ఆశించే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని సంస్థ ఎండీ, సీఈవో అశుతోష్ బిష్ణోయి తెలిపారు. జులై 30న ప్రారంభమైన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆగస్టు 13న ముగుస్తుందని చెప్పారు. తిరిగి ఆగస్టు 25 నుంచి విక్రయాలు, కొనుగోళ్లకు ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఫ్లెక్సి క్యాప్ యోజన ఫండ్ ద్వారా సమీకరించిన నిధుల్లో 65 శాతం భాగాన్ని ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు బిష్ణోయి పేర్కొన్నారు. ఇక మిగతా నిధులను రెపో, రివర్స్ రెపో వంటి డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో 35 శాతం దాకా, అలాగే రీట్స్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు), ఇన్విట్స్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు) యూనిట్లలో 10 శాతం దాకా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. ఈక్విటీల ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ స్థిరమైన రాబడులు అందించగలుగుతాయని పేర్కొన్నారు. -
లిక్కర్ కింగ్ మాల్యాపై నిషేధం
ముంబై : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్న విజయమాల్యాకు మరో షాక్ ఎదురుకాబోతుంది. దేశీయ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆయనపై నిషేధం విధించేందుకు సిద్దమవుతోంది. సెక్యురిటీస్ మార్కెట్ నుంచి ఆయన్ను తొలగించాలని సెబీ నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా త్వరలోనే మధ్యంతర ఉత్వర్వులు జారీచేయనుందని తెలుస్తోంది. మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు రెగ్యులేటరి విచారణలో తెలవడంతో ఈ కఠిన నిర్ణయానికి సెబీ మొగ్గుచూపింది. బ్యాంకులకు విజయ్ మాల్యా దాదాపు రూ. 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి యూకేకు పారిపోయిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి ఎనిమిది మందిని సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఇందులో ఐడీబీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ యోగేశ్ అగర్వాల్ కూడా ఉన్నారు.