
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్‌ఎల్) ప్రమోటర్లపై కొరడా ఝళిపించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలంపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. అంతేకాకుండా వివిధ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 8.2 కోట్లవరకూ జరిమానాలు సైతం విధించింది. అవకతవకలకు పాల్పడటం, వివిధ నిబంధనల ఉల్లంఘన, 2008–09 నుంచి 2011–12 వరకూ ఆర్థిక ఫలితాలలో రుణాలను తగ్గించి చూపడం తదితరాలపై సెబీ తాజా చర్యలు చేపట్టింది.
వివరాలు ఇలా..: డీసీహెచ్‌ఎల్‌పై రూ. 4 కోట్లు, టి.వెంకట్‌రామ్‌రెడ్డి, టి.వినాయక్ రవి రెడ్డిలపై విడిగా రూ. 1.3 కోట్లు చొప్పున సెబీ జరిమానాలు విధించింది. ఇదేవిధంగా ఎన్.కృష్ణన్‌కు రూ. 20 లక్షలు, వి.శంకర్‌కు రూ. 10 లక్షలు చొప్పున ఫైన్ వేసింది. ఈ నలుగురినీ సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొంది. సెక్యూరిటీల మార్కెట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా సహచర కార్యకలాపాలూ చేపట్టకుండా ఆదేశాలు జారీ చేసింది. 2011 అక్టోబర్ నుంచి 2012 డిసెంబర్ మధ్య కాలంలో అక్రమ, తప్పుడు లావాదేవీల నిరోధ చట్ట నిబంధనలతోపాటు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించడంపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా సెబీ తాజా చర్యలు ప్రకటించింది.
డీసీహెచ్‌ఎల్ చైర్మన్ వెంకట్‌రామ్ రెడ్డి, వైస్‌చైర్మన్ పీకే అయ్యర్ ఆర్థిక ఫలితాలలో అక్రమాలకు తెరతీసినట్లు సెబీ పేర్కొంది. లయబిలిటీలను తక్కువ చేసి చూపడంతోపాటు.. లాభాలను అధికం చేసి ప్రకటించినట్లు తెలియజేసింది. రిజర్వులు లేనప్పటికీ మార్కెట్ ధర కంటే అధిక విలువలో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది. తద్వారా ఇన్వెస్టర్లను మోసపుచ్చడం, షేర్లలో పెట్టుబడులకు ప్రేరేపించడం వంటివి చేసినట్లు తెలియజేసింది. వెంకట్‌రామ్‌రెడ్డి, రవి రెడ్డి, అయ్యర్ తమ వద్ద గల షేర్ల తనఖా తదితర వివరాల వెల్లడిలోనూ వైఫల్యం చెందినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment