Deccan Chronicle Holdings Limited
-
డీసీ ప్రమోటర్లకు సెబీ షాక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్) ప్రమోటర్లపై కొరడా ఝళిపించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలంపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. అంతేకాకుండా వివిధ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 8.2 కోట్లవరకూ జరిమానాలు సైతం విధించింది. అవకతవకలకు పాల్పడటం, వివిధ నిబంధనల ఉల్లంఘన, 2008–09 నుంచి 2011–12 వరకూ ఆర్థిక ఫలితాలలో రుణాలను తగ్గించి చూపడం తదితరాలపై సెబీ తాజా చర్యలు చేపట్టింది. వివరాలు ఇలా..: డీసీహెచ్‌ఎల్‌పై రూ. 4 కోట్లు, టి.వెంకట్రామ్రెడ్డి, టి.వినాయక్ రవి రెడ్డిలపై విడిగా రూ. 1.3 కోట్లు చొప్పున సెబీ జరిమానాలు విధించింది. ఇదేవిధంగా ఎన్.కృష్ణన్‌కు రూ. 20 లక్షలు, వి.శంకర్‌కు రూ. 10 లక్షలు చొప్పున ఫైన్ వేసింది. ఈ నలుగురినీ సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొంది. సెక్యూరిటీల మార్కెట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా సహచర కార్యకలాపాలూ చేపట్టకుండా ఆదేశాలు జారీ చేసింది. 2011 అక్టోబర్ నుంచి 2012 డిసెంబర్ మధ్య కాలంలో అక్రమ, తప్పుడు లావాదేవీల నిరోధ చట్ట నిబంధనలతోపాటు, ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించడంపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా సెబీ తాజా చర్యలు ప్రకటించింది. డీసీహెచ్ఎల్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, వైస్‌చైర్మన్ పీకే అయ్యర్ ఆర్థిక ఫలితాలలో అక్రమాలకు తెరతీసినట్లు సెబీ పేర్కొంది. లయబిలిటీలను తక్కువ చేసి చూపడంతోపాటు.. లాభాలను అధికం చేసి ప్రకటించినట్లు తెలియజేసింది. రిజర్వులు లేనప్పటికీ మార్కెట్ ధర కంటే అధిక విలువలో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది. తద్వారా ఇన్వెస్టర్లను మోసపుచ్చడం, షేర్లలో పెట్టుబడులకు ప్రేరేపించడం వంటివి చేసినట్లు తెలియజేసింది. వెంకట్రామ్రెడ్డి, రవి రెడ్డి, అయ్యర్ తమ వద్ద గల షేర్ల తనఖా తదితర వివరాల వెల్లడిలోనూ వైఫల్యం చెందినట్లు వివరించింది. -
శ్రేయి చేతికి డెక్కన్ క్రానికల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) విషయంలో శ్రేయి మల్టిపుల్ అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌కు చెందిన విజన్ ఇండియా ఫండ్ సమర్పించిన రూ.1,000 కోట్ల పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. శ్రేయి పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ(సీవోసీ) గతంలోనే 81.39% మెజారిటీతో ఆమోదం తెలియజేయగా, దీనికి తాజాగా ఎన్సీఎల్టీ కూడా ఓకే చెప్పింది. డీసీహెచ్ఎల్ నుంచి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.8,000 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నాయి. వీటిల్లో దాదాపు రూ.400 కోట్ల వరకు ఎక్స్పోజర్ కలిగిన కెనరా బ్యాంకు పరిష్కారం కోరుతూ ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తెలిసిందే. పరిష్కార ప్రణాళికకు చట్ట ప్రకారం అవసరమైన అన్ని రకాల అనుమతులను ఏడాదిలోగా పొందాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తన ఆదేశాల్లో పేర్కొంది. -
నవంబర్ 30 కల్లా ఖాళీ చేయండి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్, సరోజినీదేవి రోడ్డులోని డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి, ఇండియాబుల్స్‌కు స్వాధీనం చేయాలంటూ డెక్కన్ క్రానికల్ (డీసీ) యాజమాన్యాన్ని ఆదేశిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. సీఎంఎం కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ డీసీ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ భవనంలో డీసీ పత్రిక నిర్వహణ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలం టే ఇబ్బందులు ఎదురవుతాయన్న హైకోర్టు, ఖాళీ చేసేందుకు నవంబర్ 30 వరకు డీసీ యాజమాన్యానికి గడువునిచ్చింది. ఆలోపు భవనాన్ని ఖాళీ చేయకుండా భవనం స్వాధీనం నిమిత్తం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని ఇండియాబుల్స్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. భవనాన్ని తాకట్టుపెట్టి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి డీసీ యాజమాన్యం రూ.100 కోట్ల రుణం తీసుకుంది. అయితే ఈ అప్పును డీసీహెచ్ఎస్ యాజమాన్యం తిరిగి చెల్లించకపోవడంతో తాకట్టుపెట్టిన భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సీఎంఎం కోర్టు ఇండియాబుల్స్‌కు అనుమతిచ్చింది. దీనిని సవాలు చేస్తూ డీసీహెచ్ఎల్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో డీసీహెచ్ఎల్ దివాలా ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్ల సీఎంఎం కోర్టు ఆదేశాలు చెల్లవన్న డీసీ యాజమాన్యం వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్సీఎల్టీలో విచారణ డీసీహెచ్‌ఎల్‌పై జరుగుతోందని, ఇండియాబుల్స్‌కు తాకట్టుపెట్టిన భవనం వెంకట్రామిరెడ్డి పేరు మీద ఉందని, అందువల్ల ఎన్సీఎల్టీ ఉత్తర్వులు ఆ ఆస్తికి వర్తించవని ధర్మాసనం తెలిపింది. సర్ఫేసీ చట్టం కంపెనీలకే తప్ప వ్యవస్థాపకులకు కాదంది. -
ఎన్ఎస్ఈ నుంచి డీసీ హోల్డింగ్స్ డీలిస్టింగ్
న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ 19 కంపెనీలను తన ప్లాట్ ఫామ్ నుంచి వచ్చే నెలలో డీలిస్ట్ చేయనుంది. ఇలా తప్పనిసరిగా డీలిస్ట్ అయ్యే వాటిలో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్, కౌటన్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ తదితర కంపెనీలు ఉన్నాయి. సెబీ నిబంధనలను అనుసరించి వచ్చే నెల 12న 19 కంపెనీలను డీలిస్ట్ చేస్తున్నట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఈ జాబితాలో కోరల్ హబ్, ఎవినిక్స్ యాసెసరీస్ (ఎవినిక్స్ ఇండస్ట్రీస్), నూకెమ్ లిమిటెడ్, స్పాంకో లిమిటెడ్, పరేఖ్ ప్లాటినమ్, పసుపతి ఫ్యాబ్రిక్స్, పెర్ల్ ఇంజనీరింగ్ పాలీమర్స్, పోలార్ ఇండస్ట్రీస్, వికాష్ మెటల్ అండ్ పవర్, తక్షీల్ సొల్యూషన్స్, అంకుర్ డ్రగ్స్ అండ్ ఫార్మా, యాష్కో న్యూలబ్ ఇండస్ట్రీస్, క్రూ బీఓఎస్ ప్రొడక్ట్స్, ధనుష్ టెక్నాలజీస్, టెలీడేటా టెక్నాలజీ సొల్యూషన్స్, టెలీడేటా మెరైన్ సొల్యూషన్స్, ఐవోఎల్ నెట్‌కామ్ ఉన్నాయి. గతేడాది ఆగస్ట్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలోనూ ఎన్ఎస్ఈ 70 కంపెనీలను ఇలా డీలిస్ట్ చేసింది. -
4 వారాల్లో నిర్ణయించండి...
డీసీ చైర్మన్, ైవె స్ చైర్మన్ల పాస్‌పోర్టుల స్వాధీనంపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) చైర్మన్, వైస్ చైర్మన్లు టి.వెంకట్రామిరెడ్డి, టి.వినాయక్ రవిరెడ్డిల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకునే విషయంలో నాలుగు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీవో)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. రెలిగేర్ సంస్థ నుంచి డెక్కన్ క్రానికల్ దాదాపు రూ.260 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ మొత్తాల చెల్లింపు విషయంలో అటు రెలిగేర్‌కు, ఇటు డెక్కన్ క్రానికల్‌కు వివాదం నడుస్తోంది. దేశంలోని పలు కోర్టుల్లో డీసీహెచ్‌ఎల్‌పై కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి, వినాయక్వ్రిరెడ్డిలు విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలున్నాయని, అందువల్ల వారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకునేలా ఆర్‌పీవోను ఆదేశించాలని రెలిగేర్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పాస్‌పోర్ట్‌ల స్వాధీనం నిమిత్తం తాము ఏడాది క్రితం వినతిపత్రం ఇచ్చినా కూడా ఆర్పీవో ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి, రెలిగేర్ వినతిపత్రం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆర్‌పీవోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘డెక్కన్ క్రానికల్’కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్)కు హైకోర్టులో ఊరట లభించింది. డీసీహెచ్ఎల్ అనుబంధ సంస్థ ఫ్లయింగ్టన్ ఫ్రయిటర్స్ ఓ విమానాన్ని కుదువపెట్టి తీసుకున్న బ్యాంకు రుణంపై విమాన విలువకు సమాన పూచీకత్తు చెల్లించకపోతే ఎయిర్‌క్రాఫ్ట్‌ను వేలం వేయాల్సి ఉంటుందంటూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. విచారణను వాయిదా వేసింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి డీసీహెచ్ఎల్ రూ.500 కోట్లు రుణం తీసుకుంది. అలాగే డీసీహెచ్ఎల్ అనుబంధ సంస్థ ఫ్లయింగ్టన్ ఫ్రయిటర్స్ తన హాకర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కుదువపెట్టి 2007లో రూ.10 కోట్లు రుణం తీసుకుంది. రుణ చెల్లింపుల్లో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్‌కు సమానమైన మొత్తానికి పూచీకత్తును సమర్పించకపోతే ఎయిర్‌క్రాఫ్ట్‌ను అమ్మేయాల్సి వస్తుం దని డీఆర్టీ ఈ నెల 1న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.