సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్, సరోజినీదేవి రోడ్డులోని డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి, ఇండియాబుల్స్‌కు స్వాధీనం చేయాలంటూ డెక్కన్ క్రానికల్ (డీసీ) యాజమాన్యాన్ని ఆదేశిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. సీఎంఎం కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ డీసీ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ భవనంలో డీసీ పత్రిక నిర్వహణ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలం టే ఇబ్బందులు ఎదురవుతాయన్న హైకోర్టు, ఖాళీ చేసేందుకు నవంబర్ 30 వరకు డీసీ యాజమాన్యానికి గడువునిచ్చింది. ఆలోపు భవనాన్ని ఖాళీ చేయకుండా భవనం స్వాధీనం నిమిత్తం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని ఇండియాబుల్స్‌కు హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. భవనాన్ని తాకట్టుపెట్టి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి డీసీ యాజమాన్యం రూ.100 కోట్ల రుణం తీసుకుంది. అయితే ఈ అప్పును డీసీహెచ్‌ఎస్ యాజమాన్యం తిరిగి చెల్లించకపోవడంతో తాకట్టుపెట్టిన భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సీఎంఎం కోర్టు ఇండియాబుల్స్‌కు అనుమతిచ్చింది. దీనిని సవాలు చేస్తూ డీసీహెచ్‌ఎల్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో డీసీహెచ్‌ఎల్ దివాలా ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్ల సీఎంఎం కోర్టు ఆదేశాలు చెల్లవన్న డీసీ యాజమాన్యం వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్‌సీఎల్‌టీలో విచారణ డీసీహెచ్‌ఎల్‌పై జరుగుతోందని, ఇండియాబుల్స్‌కు తాకట్టుపెట్టిన భవనం వెంకట్రామిరెడ్డి పేరు మీద ఉందని, అందువల్ల ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు ఆ ఆస్తికి వర్తించవని ధర్మాసనం తెలిపింది. సర్ఫేసీ చట్టం కంపెనీలకే తప్ప వ్యవస్థాపకులకు కాదంది.
నవంబర్ 30 కల్లా ఖాళీ చేయండి
Published Tue, Oct 30 2018 1:18 AM | Last Updated on Tue, Oct 30 2018 1:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment