57 ఏళ్ల తర్వాత రికార్డులు కోరలేరు | No Land records after 57 years High Court | Sakshi
Sakshi News home page

57 ఏళ్ల తర్వాత రికార్డులు కోరలేరు

Published Tue, Sep 17 2024 11:24 AM | Last Updated on Tue, Sep 17 2024 11:24 AM

No Land records after 57 years High Court

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు 57 ఏళ్ల తర్వాత భూరికార్డులు కోరలేరని మ్యుటేషన్‌ వివాదం అప్పీల్‌లో హైకోర్టు స్పష్టం చేసింది. చట్టంలో కాలవ్యవధి పేర్కొననప్పటికీ కక్షిదారులు సహేతుకమైన వ్యవధిలోనే అధికారులను సంప్రదించాలని తేల్చిచెప్పింది. 57 ఏళ్ల తర్వాత రికార్డుల్లో నమోదుకు దరఖాస్తు సమరి్పంచినందున అప్పీలుదారు సవరణకు అర్హుడు కాదని చెప్పింది. సింగిల్‌ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది.

 కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండాయ్‌పల్లిలోని 64.30 ఎకరాల భూమి తమదేనంటూ బూరుగుపల్లికి చెందిన హనుమంతరావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన తల్లి 1963లో ఆ భూమిని కొనుగోలు చేసిందని, మ్యుటేషన్‌ కోసం తహసీల్దార్‌ను సంప్రదించిందన్నారు. అయితే మొత్తం భూమిలోని 4.23 ఎకరాలు ఆమె పేరు మీద లేదంటూ మ్యుటేషన్‌కు నిరాకరించారని.. ఈ క్రమంలోనే భూమి, పట్టాదార్‌ పాస్‌బుక్‌లో తెలంగాణ హక్కుల చట్టం–2020 అమల్లోకి వచ్చిందని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ (ప్రత్యేక ట్రిబ్యునల్‌)కు అప్పీల్‌ చేసుకోగా.. దీన్ని కొట్టివేశారన్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. 

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. 1963లో భూమి కొనుగోలు చేసి 2019లో మ్యుటేషన్‌కు అధికారులను సంప్రదించడాన్ని తప్పుబట్టి పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై హనుమంతరావు అప్పీల్‌ దాఖలు చేయగా.. ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విని అప్పీల్‌ను కొట్టివేసింది. అయితే, అప్పీలుదారు, అతని తల్లి చట్టప్రకారం సివిల్‌ కోర్టును ఆశ్రయించవచ్చంటూ స్వేచ్ఛనిచి్చంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement