fine rule
-
అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా
న్యూఢిల్లీ: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించి కార్పొరేట్ రుణాలకు ఆమోదం తెలిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా విధించింది. అలాగే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్‌కి రూ. 15 లక్షల ఫైన్ విధించింది. 45 రోజుల్లోగా ఇద్దరూ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీతో పాటు మరో 24 మంది సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా సెబీ ఆగస్టులో నిషేధం విధించింది. తాజాగా సోమవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, జనరల్ పర్పస్ కార్పొరేట్ రణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దంటూ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ బోర్డు సభ్యుడైన అన్మోల్ అంబానీ వాటిని పట్టించుకోకుండా ఎక్యురా ప్రొడక్షన్స్ అనే సంస్థకు రూ. 20 కోట్ల లోన్‌కి ఆమోదముద్ర వేశారని ఆరోపణలు ఉన్నాయి. -
ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
న్యూయార్క్: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్ ఎం.మెర్చాన్ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్‌నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే. -
సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్ !
భద్రాద్రి: ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్ పోలీసులు జరిమానా విధించిన ఘటన గురువారం వెలుగు చూసింది. పాల్వంచ మండలం నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో ట్రాక్టర్ వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ రూ.వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా స్టీరింగ్ ఉన్న ప్రతీ వాహనం డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనల మేరకు సీట్ బెల్టు పెట్టుకోవాల్సిందేనని చెప్పడం గమనార్హం. -
ట్రంప్‌కు 3 వేల కోట్ల జరిమానా
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండోసారి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్న ఆయనకు కొత్త కష్టాలు వచి్చపడుతున్నాయి. తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ట్రంప్‌కు శుక్రవారం 364 మిలియన్ డాలర్ల (రూ.3,020 కోట్లు) జరిమానా విధించింది. తన ఆదాయం, ఆస్తుల విలువను వాస్తవ విలువ కంటే కాగితాలపై అధికంగా చూపించి, బ్యాంకులు, బీమా సంస్థల నుంచి చౌకగా రుణాలు, బీమా పొందడంతోపాటు ఇతరత్రా ఆర్థికంగా లాభపడినట్లు ట్రంప్‌పై ఆరోపణలు వచ్చాయి. బ్యాంకులు, బీమా సంస్థలను మోసగించినట్లు కేసు నమోదైంది. న్యూయార్క్ అటారీ్న, జనరల్ డెమొక్రటిక్ పార్టీ నేత జేమ్స్ కోర్టులో దావా వేశారు. దీనిపై న్యాయస్థానం రెండున్నర నెలలపాటు విచారణ జరిపింది. ట్రంప్‌పై వచి్చన అభియోగాలు నిజమేనని తేలి్చంది. ట్రంప్ నిర్వాకం వల్ల బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోయినట్లు గుర్తించింది. ఈ కేసులో ట్రంప్‌నకు 355 మిలియన్ డాలర్లు, ఆయన ఇద్దరు కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు 4 మిలియన్ డాలర్ల చొప్పున, ట్రంప్ మాజీ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌కు ఒక మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అంటే ట్రంప్ మొత్తం 364 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన డైరెక్టర్ లేదా ఆఫీసర్‌గా ఉండకూడదని న్యాయమూర్తి ఆదేశించారు. ఇది సివిల్ కేసు కావడంతో ట్రంప్‌కు జైలు శిక్ష విధించడం లేదని స్పష్టం చేశారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని ట్రంప్ తరఫు న్యాయవాదులు చెప్పారు. -
US Court: ఆమెకు రూ.692 కోట్లు చెల్లించండి
న్యూయార్క్: పాత్రికేయురాలు, రచయిత్రి ఇ.జీన్ కరోల్‌కు పరువు నష్టం కలిగించినందుకు జరిమానాగా ఆమెకు దాదాపు రూ.692 కోట్లు(8.33 కోట్ల డాలర్లు) చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికా కోర్టు శనివారం ఆదేశించింది. 1996లో మాన్హాటన్లోని బెర్గ్‌డోర్ఫ్ గుడ్‌మ్యాన్ అవెన్యూ షాపింగ్‌మాల్ ట్రయల్రూమ్లో ట్రంప్ తనను రేప్ చేశారంటూ కరోల్ కేసు వేసింది. లైంగికదాడి జరిగిందని నిర్ధారించిన కోర్టు, ఆమెకు 41.56 కోట్లు చెల్లించాలంటూ 2023 మే లో ట్రంప్‌ను ఆదేశించింది. తనపై లైంగికదాడి వివరాలను న్యూయార్క్ మేగజైన్ వ్యాసంలో, తర్వాత పుస్తకంలో కరోల్ పేర్కొన్నారు. రచనల అమ్మకాలు పెంచుకునేందుకు అసత్యాలు రాస్తున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇవి తన పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ ఆమె మరో దావా వేశారు. ఈ కేసు తుది తీర్పును మన్హాటన్ ఫెడరల్ కోర్టు శనివారం వెలువరించింది. కరోల్‌కు 1.83 కోట్ల డాలర్ల పరిహారంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు హెచ్చరికగా మరో 6.5 కోట్ల డాలర్లు ఇవ్వాలని ట్రంప్‌ను ఆదేశించింది. పై కోర్టుకు వెళతా: ట్రంప్ కోర్టు తీర్పు హాస్యాస్పదమని ట్రంప్ దుయ్యబట్టారు. ‘‘న్యాయ వ్యవస్థ చేయి దాటి పోయింది. ప్రభుత్వం దాన్నో ఆయుధంగా వాడుతోంది. పై కోర్టుకు వెళతా’ అని తీర్పు తర్వాత వ్యాఖ్యానించారు. గురువారం ఈ కేసు విచారణ మధ్యలోనే ట్రంప్ కోర్టులో నుంచి లేచి బయటికొచ్చారు. దీనిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ లాయర్ వైఖరిని సైతం బాగా తప్పుబట్టారు. సరిగా ప్రవర్తించకుంటే మీరు జైలుకెళ్తారని లాయర్‌ను తీవ్రంగా మందలించారు కూడా. -
ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు జరిమానా
ముంబై: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు రన్‌వే పక్కనే నేలపై కూర్చుని భోజనంచేసిన ఘటనలో ఇండిగో విమానయాన సంస్థ, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఆగ్రహం వ్యక్తంచేసి జరిమానా విధించాయి. ప్రయాణికుల అసౌకర్యానికి కారణమైన ఇండిగో సంస్థపై రూ.1.5 కోట్ల జరిమానా, ముంబై ఎయిర్‌పోర్ట్‌పై రూ.90 లక్షల జరిమానా విధించాయి. ఒక పౌరవిమానయాన సంస్థపై ఇంతటి భారీ జరిమానా పడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారికావడం గమనార్హం. జనవరి 15వ తేదీన గోవా నుంచి బయల్దేరిన విమానం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగమంచు కారణంగా ఢిల్లీకి బదులు ముంబైలో దిగింది. చాలాసేపు విమానంలోనే వేచి ఉన్న ప్రయాణికులు విసిగిపోయి కిందకు దిగొచ్చి రన్‌వే పక్కనే కూర్చుని భోజనాలు చేశారు. ఈ ఘటనను పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. బీసీఏఎస్ అడిగేదాకా ఈ విషయంలో ఇండిగో వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. రన్‌వేపై ప్రయాణికుల కదలికలను నియంత్రించకుండా ముంబై ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఆక్షేపించింది. -
ఐదు పేజీల తీర్పుపై... 60 పేజీల సారాంశమా!
న్యూఢిల్లీ: ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఐదు పేజీల తీర్పును సవాలు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు రూపంలో సుప్రీంకోర్టులో ఏకంగా 60 పేజీల సినాప్సిస్ (సారాంశం) సమర్పించాడో వ్యక్తి! దీనిపై విస్మయం వ్యక్తం చేయడం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం వంతయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పిటిషన్‌దారుకు రూ.25 వేల జరిమానా కూడా విధించింది! ఆ మొత్తాన్ని ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆరోగ్య కారణాలతో అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి సుదీర్ఘ దరఖాస్తులపై సుప్రీంకోర్టు గతేడాది అసహనం వ్యక్తం చేసింది. వాటిలో పేజీల సంఖ్యపై తక్షణం పరిమితి విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వకపోతే రోజుకు రూ. 5 వేల పరిహారం
న్యూఢిల్లీ: రుణం పూర్తి చెల్లింపుల తర్వాత రుణానికి సంబంధించి తనఖాగా ఉంచిన ఒరిజినల్ స్థిర లేదా చర ఆస్తి పత్రాలు అన్నింటినీ రుణగ్రహీతకు 30 రోజుల లోపు తిరిగి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు స్పష్టం చేసింది. ఏదైనా ఆలస్యం జరిగితే రోజుకు రూ. 5 వేలు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన చార్జీలను అన్నింటినీ నిర్దేశిత 30 రోజుల్లో తీసివేయాలని కూడా ఒక నోటిఫికేషన్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ తరహా పలు ఫిర్యాదుల నమోదు నేపథ్యంలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ తాజా ఆదేశాలు ఇచి్చంది. డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వడంలో నెల రోజులు దాటితే ఈ జాప్యానికి స్పష్టమైన కారణాలను రుణగ్రహీతకు తెలియజేయాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి సంబంధించిన విధివిధానాల వివరాలను బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థలు తమ తమ వెబ్సైట్లో ఉంచాలని సూచించింది. నష్టం జరిగితే.. మరో 30 రోజులు ఒరిజినల్ చర లేదా స్థిర ఆస్తి పత్రాలు కనబడకుండా పోవడం లేదా ఏదైనా నష్టం జరిగితే అటువంటి పత్రాల డూప్లికేట్ లేదా సరి్టఫైడ్ కాపీలను పొందడంలో రుణగ్రహీతకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పూర్తిగా సహాయపడాలని కూడా ఆర్బీఐ నిర్దేశించింది. ఇందుకు మరో 30 రోజుల సమయాన్ని తీసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాతే (60 రోజుల తర్వాత) జాప్యానికి రోజుకు రూ.5 వేల పరిహారం నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. కాగా, ఈ పరిహారం... ఇతర ఏదైనా (వర్తించే) చట్టం ప్రకారం ఏదైనా ఇతర పరిహారం పొందేందుకు రుణగ్రహీత కు ఉండే హక్కులకు ఎటువంటి భంగం కలిగించబోదని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం. 2023 డిసెంబరు 1 తర్వాత ఒరిజినల్ చర లేదా స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ తాజా ఆదేశాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది. -
అంబానీ సోదరులకు శాట్‌లో ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులపై సెబీ విధించిన రూ.25 కోట్ల జరిమానా ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సెబీ ఆదేశాలను అంబానీ సోదరులు అప్పీల్ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. షేర్లను గణనీయంగా కొనుగోలు చేయడం, స్వా«దీనం చేసుకోవడం (ఎస్‌ఏఎస్‌టీ) నిబంధనలను అప్పీలుదారు ఉల్లంఘించలేదని నిర్ధారిస్తూ, దీంతో సెబీ విధించిన జరిమానా ఆదేశాలు చెల్లుబాటు కావని శాట్ తేల్చింది. సెబీ ఆదేశాల మేరకు ఇప్పటికే అంబానీ సోదరులు, ఇతర సంస్థలు రూ.25 కోట్లను డిపాజిట్ చేయగా, వాటిని తిరిగి ఇచ్చేయాలని శాట్ ఆదేశించింది. 2000కు ముందు కేసు.. 2000కు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కేసు ఇది. కంపెనీలో 5 శాతానికి పైగా వాటాలను (మొత్తం 6.83 శాతం) ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ (పీఏసీలు)లతో కొనుగోలు చేసినా కానీ, ఆ సమాచారాన్ని వెల్లడించలేదంటూ సెబీ తప్పుబట్టింది. ఈ కేసులో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, ఇతర సంస్థలు నిబంధనలు పాటించలేదని 2021 ఏప్రిల్‌లో జరిమానా విధిస్తూ, ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సెబీ డిస్క్లోజర్ నిబంధనల కింద 5 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేస్తే ఆ సమాచారాన్ని వెల్లడించడం తప్పనిసరి. -
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
కిశోర్ బియానీకి సెబీ జరిమానా
న్యూఢిల్లీ: సెబీ తాజాగా ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన సంస్థలు, వ్యక్తులకు విడిగా రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించింది. వీటిని 45 రోజుల్లోగా చెల్లించాలంటూ ఆదేశించింది. కిశోర్ బియానీ, ఫ్యూచర్ కార్పొరేట్ రీసోర్సెస్(ఎఫ్‌సీఆర్‌ఎల్)సహా 14 సంస్థ లు, వ్యక్తులపై సెబీ జరిమానా విధించింది. ప్రాగ్జిస్ హోమ్ రిటైల్‌లో ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా పెరిగిన నేపథ్యంలో వాటాదారుల(పబ్లిక్)కు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంది. అయితే ప్రాగ్జిస్ హోమ్ రిటైల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించకపోవడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. తప్పనిసరిగా మార్పిడయ్యే 3,180 డిబెంచర్ల(సీసీడీలు)ను ఈక్విటీగా మార్చడంతో 2020 ఫిబ్రవరి 11కల్లా ప్రాగ్జిస్లో ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా 5.71 శాతం పెరిగింది. తద్వారా ప్రాగ్జిస్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఎఫ్‌సీఆర్‌ఎల్ వాటా 47.43% నుంచి 53.13 శాతానికి బలపడింది. అయితే ఎస్‌ఏఎస్‌టీ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించకపోవడంతో సంబంధిత 15 సంస్థలు, వ్యక్తులకు సెబీ జరిమానా విధించింది. -
కేఎస్‌బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్‌లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్‌బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్‌ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
IPL 2023: కోహ్లి మ్యాచ్ ఫీజులో కోత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ కోహ్లిపై జరిమానా విధించారు. సోమవారం చెన్నైతో జరిగిన పోరులో ప్రత్యర్థి బ్యాటర్ శివమ్ దూబే అవుటైనపుడు కోహ్లి సంబరం అతిగా అనిపించడంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. కోహ్లి తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టారు. నియమావళిలోని ఆర్టికల్ 2.2 లెవెల్ 1 అతిక్రమణలో రిఫరీదే తుది నిర్ణయం అవుతుంది. -
ఆ దేశంలో ఆంగ్లంలో మాట్లాడితే రూ. 82 లక్షలు జరిమానా!
ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా రాజ్యమేలుతున్న సంగతి తెలుసిందే. ఈ తరుణంలో ఒక దేశం మాత్రం ఆ భాషను ఉపయోగించడానికి వీలు లేదంటూ హుకూం జారీ చేసింది. అందుకోసం ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. పొరపాటున కూడా కమ్యూనికేట్ చేసేటప్పుడూ ఇంగ్లీష్ పదాలు దొర్లినా పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తానని కూడా పేర్కొంది. ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్ చేసిన తొలిదేశం కూడా అదే కాబోలు!. వివరాల్లో కెళ్తే.. ఇటాలీ ప్రధాన మంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏఇటాలియన్ అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడూ .. విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ప్రవేశ పెట్టారు. దీనికి ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు. ఆంగ్ల పదాలు లేదా ఆంగోమానియాను లక్ష్యంగా చేసకుని మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఈ ఆంగ్ల భాష ఇటాలియన్ భాషను కించపరుస్తున్నట్లు పేర్కొంది. బ్రిటన్ నిష్రమణతో బ్రెగ్జిట్‌గా పేరుగాంచిన యూరోపియన్ యూనిన్ కారణంగా ఆ పరిస్థితి దారుణంగా దిగజారిందని పేర్కొంది. అంతేగాదు ఆ బిల్లు..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదవిని కలిగి ఉన్నవారెవరైనా వ్రాతపూర్వకంనూ, కమ్యూనికేషన్ పరంగానూ ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఉద్యోగా స్థానాల్లో, వ్యాపార సంబంధ డాక్యుమెంట్లలోనూ, అధికారిక పత్రాలలోనూ కూడా ఆంగ్లంలో పేర్లను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఆఖరికి ఇటాలియన్ భాష రాని విదేశీయులతో కమ్యూనికేట్ చేసే కార్యాలయ్యాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది. ఆర్టికల్ 2 ప్రకారం.. జాతీయ భూభాగంలో ప్రజా వస్తువుల, సేవలు వినియోగం కోసం ఇటాలియన్‌ని ప్రాథమిక భాషగా ఉపయోగించాలిని ఆ ముసాయిదా బిల్లులో స్పష్టం చేసింది. అంతేగాదు దీన్ని అతిక్రమిస్తే రూ. 4 లక్షల నుంచి దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధిస్తాని బిల్లులో పేర్కొంది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చలు జరిపిన తదనంతరం పూర్తి స్తాయిలో అమలు చేయనుంది ఇటలీ. (చదవండి: లొంగిపోనున్న ట్రంప్..ఫుల్ బంధోబస్తుకు ప్లాన్) -
అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
ప్రయాగ్‌రాజ్(యూపీ): 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్–రాజకీయ నేత అతీక్ అహ్మద్, మరో ఇద్దరికి కఠిన జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తలా రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. అతీక్‌పై నమోదైన 100కు పైగా కేసుల్లో శిక్ష పడిన మొట్టమొదటి కేసు ఇదే. ఇదే కేసులో అతీక్ సోదరుడు ఖాలిద్ అజీం అలియాస్ అష్రఫ్, మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పుపై హైకోర్టుకు వెళతామని అతీక్ పోలీస్ వ్యాన్ నుంచి విలేకరులతో అన్నాడు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు ముగ్గురినీ వేర్వేరు వ్యాన్లలో నైని జైలుకు తరలించారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు హత్య కేసులో అహ్మద్ తదితరులు నిందితులు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను అతీక్ కిడ్నాప్ చేసి, బెదిరించాడు. ఈ కేసులో అతీక్ జైలుపాలయ్యాడు. -
మైసూర్ కాఫీపై సెబీ జరిమానా
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్(ఎంఏసీఈఎల్)పై రూ. కోటి జరిమానా విధించింది. రూ. 3,535 కోట్ల నిధులను అక్రమ బదిలీ చేసేందుకు ప్రయివేట్ రంగ కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీడీఈఎల్)ను ప్రేరేపించిన కేసులో ఫైన్ వేసింది. 45 రోజుల్లోగా జరిమానాను చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఈ రెండు సంస్థలూ దివంగత వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ, ఆయన కుటుంబ సభ్యుల అజమాయిషీలో ఉన్న కంపెనీలు కాగా.. సీడీఈఎల్ అనుబంధ సంస్థల నుంచి నిధుల అక్రమ బదిలీకి ఎంఏసీఈఎల్ సహకరించినట్లు సెబీ పేర్కొంది. తద్వారా సెబీ చట్టం, పీఎఫ్‌యూటీపీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలియజేసింది. -
పనిలో ఫైర్ బ్రాండ్.. ముక్కు పిండి మరీ రూ.కోటి వసూలు చేసింది!
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తూ సస్పెండ్ అవుతుంటే, మరి కొందరు నిబద్ధతతో పని చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోసలిన్ అరోకియా మేరీ తన పని తీరుతో అందరి మన్ననలు పొందుతోంది. ఇటీవల ఆమె రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రశంసలు అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. రోసలిన్ అరోకియా మేరీ.. ఆమె తన విధుల్లో ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఆమె చేతికి చిక్కితే ఇక వారి పని అయినట్టే, ముక్కు పిండి మరీ వారి నుంచి జరిమానా వసూలు చేస్తుంది. ఇలా టికెట్ లేని ప్రయాణికులు, నిబంధనలు పాటించని ప్యాసింజర్ల నుంచి రోసలిన్ రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేసింది. పనిలో నిజాయతీగా ఖచ్చితత్వం ప్రదర్శిస్తూ తోటి ఉద్యోగులకు ఆదర్శంగా మారిన ఈ మహిళా టికెట్ ఇన్ స్పెక్టర్ కు కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రశంసలు దక్కాయి. ‘‘విధుల నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ.. భారతీయ రైల్వేలో రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టికెట్ చెకింగ్ ఉద్యోగి’’ అని తెలిపింది. ఈ పోస్ట్ ఆన్లైన్లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది, ఎందుకంటే టికెట్ తనిఖీ సిబ్బందిలో ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన మొదటి మహిళ ఆమె గుర్తింపు పొందింది. ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తున్న మేరీకి నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్‌పై ఆర్బీఐ రూ. 2.27 కోట్ల జరిమానా
ముంబై: రికవరీ ఏజెంట్లకు సంబంధించిన నిబంధనలను పాటించనందుకుగాను ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్‌పై 2.27 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. 2018–19 నుండి 2021–22 ఆర్థిక సంవత్సరానికి మధ్య కాలానికి సంబంధించి ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది. వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను, పలు సహకార బ్యాంకులపై కూడా సెంట్రల్ బ్యాంక్ జరిమానా విధించింది. వీటిలో లోక్‌మంగల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (షోలాపూర్), జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాడిట్ (రైసెన్) స్మృతి నాగ్రిక్ సహకారి బ్యాంక్ (మర్యాదిత్, మందసౌర్) రాయగఢ్ సహకరి బ్యాంక్ (ముంబై) నోబుల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (నోయిడా), ఇంపీరియల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (జలంధర్) ఉన్నాయి. -
రైల్వే చరిత్రలో రికార్డు..పెనాల్టీల రూపంలో రూ.9.62 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది మంది రైల్వే తనిఖీ సిబ్బంది ఏకంగా రూ.9.62 కోట్లు వసూలు చేశారు. సగటున ఒక్కొక్కరూ రూ.కోటిని మించి వసూలు చేశారన్నమాట. టికెట్ లేకుండా ప్రయాణించేవారు, ముందస్తు బుకింగ్ లేకుండా సామగ్రి తరలించేవారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయటంలో తొమ్మిది మంది టికెట్ తనిఖీ సిబ్బంది చురుగ్గా వ్యవహరించి పెద్దమొత్తంలో పెనాలీ్టలు వసూలు చేశారు. ఇలా ఒక అధికారి రూ.కోటికిపైగా పెనాల్టీ వసూలు చేయటం రైల్వే చరిత్రలోనే తొలిసారి కావటం విశేషం. సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఈ ఘనత సాధించారు. సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ నటరాజన్ 12,689 మంది ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.9.16 కోట్లు వసూలు చేయటం విశేషం. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
డెలాయిట్‌కు చైనా మొట్టికాయ
బీజింగ్: ప్రముఖ అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ టచే తోమట్సుపై చైనా చర్యలు తీసుకుంది. చైనా ప్రభుత్వరంగ ‘చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ’కి సంబంధించి ఆడిట్ సరిగ్గా చేయనందుకు డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై 30.8 మిలియన్ డాల ర్లు (రూ.252 కోట్లు) జరిమానా విధించింది. అవినీతి ఆరోపణలపై చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ హెడ్ లాయ్ షియోమీని చైనా 2021లో ఉరితీయడం ఈ సందర్భంగా గమనార్హం. పెట్టుబడులు పెట్టేందు కు, నిర్మాణ కాంట్రాక్టులు, ఉద్యోగాలకు సంబంధించి లంచాలు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2014–19 మధ్య ఆడిట్, ఇతర పనుల్లో తప్పులకు గాను డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై మూడు నెలల పాటు సస్పెన్షన్‌ను కూడా గతంలో విధించింది. హురాంగ్ సంస్థపై 1.16 లక్షల డాలర్లు, ఆడిట్లో లోపాలకు గాను 13 మంది ఉద్యో గులపై 36,000 డాలర్ల జరిమానా విధించింది. హురాంగ్ ఆస్తులు, నిబంధనల అమలు, నిర్వహణ కార్యకలాపాలపై ఆడిటర్‌గా డెలాయిట్ తగినంత దృష్టి సారించడంలో విఫలమైనట్టు చైనా నియంత్రణ సంస్థలు తేల్చాయి. -
పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!
గాంధీనగర్: పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలను కట్టడి చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా, ఏ అధికార హోదాలో ఉన్నవారైనా సరే ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించేలా కొత్త రూల్ తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లు 'ది గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)- 2023'ను గుజరాత్ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఈ ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం గమనార్హం. ఈ కొత్త రూల్ ప్రకారం పేపర్ లీక్ వ్యహారంతో సంబంధం ఉన్న వారు, దోషులను రెండేళ్ల పాటు ఎలాంటి పోటీ పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తారు. అలాగే ఏదైనా సంస్థ పేపర్ లీక్‌కు పాల్పడితే జీవితకాలం నిషేధిస్తారు. అవసరమైతే వారి అస్తులను విక్రయించి పరీక్ష ఖర్చులను వసూలు చేస్తారు. అయితే ఈ నిబంధనలు పోటీ పరీక్షలకు మాత్రమే వర్తిస్తాయి. 10, 12వ తరగతి, యూనివర్సిటీ పరీక్షలకు వర్తించవు. పేపర్ లీక్ అయిన కారణంగా ఈ ఏడాది జనవరిలో పంచాయత్ జూనియర్ క్లర్క్ రిక్రూట్మెంట్ పరీక్షను గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రశ్నాపత్రాల ముద్రణకు ఇంఛార్జ్‌గా ఉన్న హైదరాబాద్ వాసి జీత్ నాయక్ సహా 15 మందిని నిందితులుగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. చదవండి: రణరంగంగా అమృత్సర్.. బారికేడ్లు తోసుకుని తల్వార్లతో పోలీస్ స్టేషన్‌కు! -
ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ
ప్రయాణికులను ఎక్కించుకోకుండా టేకాఫ్ అయ్యిన మరో ఎయిర్‌లైన్‌కు డీజీసీఏ భారీ పెనాల్టీ విధించి గట్టి షాక్ ఇచ్చింది. ఎయిర ఇండియా మూత్ర విసర్జన ఘటనలో సీరియస్ అయ్యినా డీజీసీఏ సదరు ఎయిర్‌లైన్‌కు గట్టిగా జరిమానా విధించిన షాకింగ్ ఘటన మరువక మునుపే మరో ఎయిర్‌లైన్‌కి పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది డీజీసీఏ. ఈ మేరకు జనవరి 9న ఉదయం 6.30కి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జీ8, 116 గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సదరు ఎయిర్‌లైన్‌కి నోటీసులు పంపి వివరణ ఇవ్వమని కోరింది. ఐతే సదరు ఎయిర్‌లైన్ ప్రయాణికులను ఎక్కించే విషయంలో టెర్మినల్ కో ఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బందికి మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని వివరించింది. దీంతో డీసీజీఏ ప్రయాణికులను ఎక్కించుకోవడంలో బహుళ తప్పిదాలు ఉన్నాయంటూ రూ. 10 లక్షలు జరిమాన విధించింది. ఇదిలా ఉండగా గోఫస్ట్ ఎయిర్‌లైన్ ఈ అనుకోని పర్యవేక్షణ ఘటనకు ఇబ్బందిపడ్డ నాటి ప్రయాణికులకు క్షమాపణల చెప్పింది, పైగా బాధిత ప్రయాణికులకు వచ్చే ఏడాదిలోపు భారత్‌లో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక ఉచిత టిక్కెట్‌ను కూడా అందించింది. ఈ ఘటన జరిగినప్పుడూ ఫ్లైట్‌లో ఉన్న సిబ్బందిని కూడా తొలగించారు. (చదవండి: పాక్‌కు భారత్ నోటీసులు..సింధు జలాల ఒప్పందం మార్చకుందామా!) -
Urination Case: ఎయిరిండియాకు భారీ షాక్
న్యూఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్).. ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చింది. ఘటనకుగానూ శుక్రవారం రూ.30 లక్షల పెనాల్టీ ఎయిర్ ఇండియాకు విధించింది. అంతేకాదు.. ఆ సమయంలో విమానంలో ఉన్న పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్‌కు రూ.3 లక్షల ఫైన్ విధించింది. ఘటన సమయంలో సరైన స్పందన లేకపోవడం, పైగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లాంటి పరిణామాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. గతేడాది నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు శంకర్ మిశ్రా. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దుమారం చెలరేగింది. అప్పటికప్పుడు పార్టీల మధ్య రాజీ కుదరిందనుకుని ఈ వ్యవహారాన్ని వదిలేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించుకుంది. అయితే.. వృద్ధురాలి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని తీవ్రంగా గాలించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎయిరిండియా నిందితుడు శంకర్ మిశ్రాను నాలుగు నెలలపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడినందుకు.. తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు శంకర్ అరెస్ట్ కాగా, సాక్ష్యులను బెదిరించడం.. తారుమారు చేసే అవకాశం ఉండడంతో బెయిల్‌కు నిరాకరించింది కోర్టు. -
డిజిటల్ వినియోగానికి ఎదురుదెబ్బ: గూగుల్
న్యూఢిల్లీ: గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) తమకు జరిమానా విధించడంపై టెక్ దిగ్గజం గూగుల్ స్పందించింది. కనెక్టివిటీకి అడ్డంకులను తొలగించే దిశగా సురక్షితమైన స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేవాల్సిన దశలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం వల్ల దేశీయంగా డిజిటల్ వినియోగం వేగవంతం కాకుండా విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విషయంలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ రూ. 1,338 కోట్లు, ప్లే స్టోర్‌కి సంబంధించి అనుచిత విధానాలపై మరో రూ. 936 కోట్ల మొత్తాన్ని సీసీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. చదవండి: ఇంకోసారి, వందల మంది ఉద్యోగుల్ని తొలగించిన ఓలా! -
’గూగుల్’ కేసులో తాత్కాలిక స్టేకు ఎన్సీఎల్ఏటీ నిరాకరణ
న్యూఢిల్లీ: ప్లే స్టోర్ విధానాలపై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించిన కేసులో ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించిన టెక్ దిగ్గజం గూగుల్‌కు ఊరట దక్కలేదు. దీనిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. సీసీఐ విధించిన రూ. 936 కోట్లలో పది శాతాన్ని వచ్చే నాలుగు వారాల్లోగా రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. ప్లే స్టోర్ విధానాల్లో గూగుల్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విషయంలో ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం వాదనలు విననుంది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విషయంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ రూ. 1,337 కోట్లు జరిమానా విధించగా, దానిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు ఎన్సీఎల్ఏటీ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనూ 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటూ ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు కేసులకు సంబంధించి గూగుల్‌కు సీసీఐ మొత్తం రూ. 2,200 కోట్ల మేర జరిమానా విధించింది. చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న బీఓబీ!