న్యూఢిల్లీ: ఆధిపత్య దుర్వినియోగ ఆరోపణలకు సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విధించిన జరిమానాలపై తీసుకోతగిన తదుపరి చర్యలను పరిశీలిస్తున్నామని టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. యూజర్లు, డెవలపర్లకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే స్టోర్‌కి సంబంధించి తాము అందిస్తున్న టెక్నాలజీ, భద్రత మొదలైనవి భారతీయ యాప్ డెవలపర్లకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని తెలిపింది. సీసీఐ పెనాల్టీ విధించడమనేది భారత వినియోగదారులు, వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది.
సీసీఐ ఆదేశాలపై నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో గూగుల్ అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంది. వారం రోజుల వ్యవధిలో రెండు కేసుల్లో గూగుల్‌కు సీసీఐ దాదాపు రూ. 2,274 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి అసమంజస నిబంధనల విషయంలో రూ. 1,338 కోట్లు పెనాల్టీ కట్టాలంటూ గత వారంలో ఆదేశించింది. యాప్ డెవలపర్లు ప్లే స్టోర్‌లో థర్డ్ పార్టీ బిల్లింగ్‌ను ఉపయోగించుకోనివ్వకుండా చేస్తోందన్న ఆరోపణలపై ఈ మంగళవారం మరో రూ. 936 కోట్ల జరిమానా విధించింది. ఇవి కాకుండా దేశీయంగా న్యూస్ కంటెంట్, స్మార్ట్ టీవీ మార్కెట్‌లో అసమంజస వ్యాపార విధానాలు పాటిస్తోందన్న ఆరోపణలకు సంబంధించి గూగుల్ మరో విచారణ ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment