న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇకపై ఎవరైనా శబ్ద కాలుష్యానికి పాల్పడితే రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ముందుగా అనుమతి లేకుండా పెళ్లిళ్లు, పండుగల్లో బాణాసంచా పేల్చినా, లౌడ్ స్పీకర్లు, డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్స్ వాడితే విధించే జరిమానాలను సవరించినట్టుగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) వెల్లడించింది. ఈ కొత్త నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సవరించిన జరిమానాల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటి వేళల్లో 55 డెసిబల్, రాత్రి వేళల్లో 45 డెసిబల్ శబ్దాలకు మాత్రమే అనుమతి ఉంది.
పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధి వరకు సైలెంట్ జోన్లగా ప్రకటించారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడితే మొదటిసారి రూ. 20 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే రూ. 40 వేలు, అంతకంటే ఎక్కువగా నిబంధనల్ని ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తారని డీపీసీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు. 1,000 కేవీఏకి మించి డీజీ సెట్స్ వినియోగిస్తే రూ.లక్ష, 62.5 నుంచి 1,000 కేవీ మధ్య డీజీ సెట్స్ వాడితే రూ. 25 వేలు, 62.5 కేవీఏ వరకు డీజీ సెట్స్‌పై రూ.10 వేలు జరిమానా విధించాలని నిబంధనల్ని సవరించారు.
Comments
Please login to add a commentAdd a comment