Noise pollution
-
మోత మోగిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఈ ఏడాది వాయు కాలుష్యంకంటే శబ్దకాలుష్యం అధికంగా నమోదైంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, మరికొన్ని చోట్ల శబ్ద స్థాయిలు గతం కంటే అధికంగా నమోదయ్యాయి. దీపావళి రోజు నమోదైన వాయు, శబ్ద నాణ్యతలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదిక విడుదల చేసింది. గత ఏడాది దీపావళి పండుగ రోజుతో పోల్చితే ఈ ఏడాది శబ్ద కాలుష్య స్థాయిలు ఎక్కువ రికార్డయ్యాయి.ముఖ్యంగా హైదరాబాద్‌లో పండుగ రోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా పటాకులు కాల్చటంతో కమర్షియల్, నివాస, సెన్సిటివ్ (ఆసుపత్రులు, స్కూళ్లు, జూ పార్కు ఇతర సున్నిత ప్రాంతాలు) ప్రదేశాల్లో శబ్ద స్థాయిలు (డెసిబుల్స్) అధికంగా నమోదయ్యాయి. ఐతే పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే ప్రామాణిక స్థాయిల కంటే తక్కువగా శబ్ద స్థాయిలు నమోదయ్యాయి. మిగతా మూడు కేటగిరీల్లో మాత్రం శబ్ద కాలుష్యం అధికంగా రికార్డ్ కావడం గమనార్హం.వాయునాణ్యత కాస్త మెరుగు..గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దీపావళి రోజు వాయు నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది. ముఖ్యంగా పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (పీఎం 2.5–అతి సూక్ష్మ ధూళి కణాలు) ఈ ఏడాది తగ్గింది. ఇది గత ఏడాది దీపావళి రోజు 119 పాయింట్లు నమోదుకాగా, ఈ ఏడాది 84 పాయింట్లు రికార్డయ్యింది. పీఎం 10 (సూక్ష్మ ధూళికణాలు) గత ఏడాది 188 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 184 పాయింట్లుగా రికార్డయింది. పీఎం 2.5 వాయు కాలుష్య స్థాయిలు గత ఏడాది మామూలు రోజుల్లో 35 పాయింట్లుగా ఉండగా, ఈ ఏడాది 44 పాయింట్లుగా ఉంది. సాథారణ రోజుల్లో గత ఏడాది 85 పాయింట్లుగా ఉన్న పీఎం 10 సాంద్రత, ఈ ఏడాది 111 పాయింట్లుగా నమోదైంది. ఇతర కాలుష్యాలూ ఎక్కువే..ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వంటి వాయు కాలుష్య కారకం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా రికార్డయింది. సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యకారకం కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత ఎక్కువగానే నమోదైంది. గత ఏడాది దీపావళి సందర్భంగా నైట్రోజన్ ఆక్సైడ్ 30.6 పాయింట్లు నమోదుకాగా.. ఈ ఏడాది 40 పాయింట్లుగా నమోదైంది. గత ఏడాది దీపావళి సమయంలో 12 పాయింట్లు ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది 14 పాయింట్లుగా రికార్డయింది. 2023లో మామూలు రోజుల్లో 6.2 పాయింట్లుగా ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది సాధారణ రోజుల్లో 12 పాయింట్లుగా అంటే రెండింతలుగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ గత ఏడాది మామూలు రోజుల్లో 23.4 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 32.6 పాయింట్లుగా నమోదైంది. దీనిని బట్టి దీపావళి నాడే కాకుండా మామూలు రోజుల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రదేశాల్లో ధూళి కణాలు, కలుషిత వాయువులు, శబ్ద స్థాయిలను టీపీసీబీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది. దీపావళి సందర్భంగా పర్యావరణ పరిస్థితి పర్యవేక్షణ అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 7 దాకా కొనసాగిస్తున్నారు. -
చెవుల్లో రీసౌండ్
ఓవైపు వాహనాల రొద.. హారన్ల మోత. మరోవైపు భవన నిర్మాణ చప్పుళ్లు, డీజేలు, లౌడ్‌స్పీకర్ల హోరు.. వెరసి రోజురోజుకూ భాగ్యనగరంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) గణాంకాల ప్రకారం నగరంలో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాలు ఉండాల్సి ఉంది.కానీ పరిమితికి మించి 10 నుంచి 20 డెసిబెల్స్ శబ్ద తీవ్రత అధికంగా నమోదవుతోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్న నగరవాసులను కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ఉదాహరణకు..⇒ రెసిడెన్షియల్ జోన్ అయిన జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్‌లో పగలు 68.71 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది. ⇒ పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగ ర్లో ఉదయం 66.40 డెసిబెల్స్‌గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది.⇒ వాణిజ్య ప్రాంతమైన జేఎన్టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది.కారణాలు అనేకం..⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం⇒ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాల మోత⇒ 15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు.⇒ నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల నుంచి లౌడ్ స్పీకర్లు, డీజేల హోరు.⇒ నివాస ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు⇒ భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం.⇒ పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం.శబ్ద కాలుష్యంతో చుట్టుముట్టే అనారోగ్యాలు ఇవే..⇒ పరిమితికి మించి శబ్దాల విడుదలతో గుండె స్పందనల్లో భారీగా హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు.⇒ తలనొప్పి, చికాకుతోపాటు నిద్రలేమి, అలసట⇒ గుండెజబ్బులు, చెవుడు కూడా రావచ్చు.⇒ పిల్లల్లో కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతినే ప్రమాదం. వృద్ధులకు వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం.⇒ మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం.⇒ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.ప్రభుత్వ విభాగాలు విఫలం..నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్ పోలీసులు, రవాణా, మున్సిపల్ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్ హారన్లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి. -
పబ్బుల తీరు మారేనా?
హైదరాబాద్ (బంజారాహిల్స్): తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్న రీతిలో లైసెన్స్‌లు జారీ చేసి ఎక్సైజ్ శాఖ చేతులు దులుపుకుంది. అక్రమ నిర్మాణలైనా.. నివాసిత ప్రాంతంలోనైనా మా వాటాలు అందితే చాలు ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేసి జీహెచ్ఎంసీ పక్కకు తొలగింది. జనం ఫిర్యాదులు చేస్తున్నా సరే పెట్టీ కేసులు వేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి మమ అనిపిస్తున్నారు. పోలీసులు. నివాసిత ప్రాంతాల్లో పబ్‌లలో అర్ధరాత్రి శబ్దకాలుష్యంతో నరకాన్ని చూస్తున్న సీనియర్ సిటిజన్లు పోలీసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ నెట్టుకొచ్చారు. అయినా సరే గత 12 సంవత్సరాలుగా పబ్‌ల వల్ల న్యూసెన్స్ పెరగడమే కానీ తగ్గుముఖం పట్టలేదు. అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు, మరో వైపు లా ఆండ్ ఆర్డర్ పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో ఇక లాభం లేదనుకున్న బాధిత నివాసితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీళ్లందరినీ నమ్ముకుంటే ఏ మాత్రం ఉపయోగం లేదని భావించిన సూర్యదేవర వెంకట రమణ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గతేడాది నవంబర్‌లో శాస్త్రీయ ఆధారాలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు పబ్‌లపై కొరడా ఝులిపించింది. ఇష్టానుసారంగా సౌండ్ పెట్టుకుంటామంటే కుదరదని అందుకు తగిన గడువును నిర్దేశించి హైకోర్టు మార్గదర్శకాలు రాగానే చర్యలకు పోలీసులు శ్రీకారం చుట్టేందుకు యతి్నస్తున్నారు. ఫిర్యాదు చేసినా స్పందన కరువు.. ► జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 28, బంజారాహిల్స్ పరిధిలో నాలుగు, పంజగుట్ట పోలీస్ పరిధిలో నాలుగు పబ్‌లు ఉన్నాయి. ► ప్రతిరోజూ ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్యంతో పాటు ఇతరత్రా న్యూసెన్స్‌తో నివాసితులు నరకాన్ని చవి చూస్తున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని స్రవంతి నగర్లో ఉన్న టాట్‌పబ్‌కు జీరో పార్కింగ్ ఉంది, అర్ధరాత్రి మందుబాబులు తూలుతు మద్యం మత్తులో స్థానిక నివాసాల్లోకి చొచ్చుకెళ్తున్నారు. అక్కడే వాంతులు, మలమూత్ర విసర్జనలు చేస్తుండటంతో అటుగా రాకపోకలు సాగిస్తున్న మహిళలకు ఇబ్బందిగా మారింది. ► ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకునేవారు. దీంతో స్రవంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున బి.సుభారెడ్డి జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ తరఫున సూర్యదేవర వెంకటరమణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి స్పందించి తగిన ఆదేశాలు జారీ చేశారు. నివాసిత ప్రాంతాల్లోనే.. ► పబ్‌లు నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు. ఎక్సైజ్ అధికారుల పుణ్యమా అని ఇళ్లల్లోనే పబ్‌లు కొనసాగుతున్నాయి. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 56లోని ఫర్జీ, అబ్జార్బ్ పబ్‌లు పూర్తిగా నివాసాల మధ్యనే ఉన్నాయి. టాట్ పబ్ స్రవంతినగర్‌లో ఉంది. ► అమ్నేయా లాంజ్‌బార్, బ్రాడ్వే, మాకోబ్రూ, హాట్కప్ డరి్టమారి్టని ఇలా పబ్‌లన్నీ నివాసిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ► ప్రతిరోజూ స్థానికుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా జరిమానాలు చెల్లిస్తూ జారుకుంటున్నారు. ► జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 36, 45లలో మాత్రమే కమర్షియల్ వ్యాపారాలు జరగాల్సి ఉండగా మిగతా అన్ని చోట్లా నివాసిత ప్రాంతాల్లోనే పబ్‌లు కొనసాగుతున్నాయి. నార్మల్ బార్‌కు ఇచ్చినట్లుగానే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా పబ్ పేరుతో లైసెన్స్ ఇవ్వడం లేదు. నార్మల్ బార్ లైసెన్స్ 2(బి) ప్రకారమే ఈ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. దీంతో ఇష్టానుసారంగా పబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పొలిటికల్ రీ సౌండ్
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేస్తున్న డిమాండ్ దేశవ్యాప్తంగా రీ సౌండ్ ఇస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ఆపేయాలన్న ఆయన డిమాండ్‌తో క్రమంగా ఒక్కో పార్టీ గొంతు కలుపుతూ వస్తోంది. అసలు దేశంలో లౌడ్ స్పీకర్లపై ఉన్న నిబంధనలేమిటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? శబ్ద కాలుష్యంతో నష్టమెంత? మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్‌పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్ఎస్ డిమాండ్‌కు మద్దతిచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. లౌడ్ స్పీకర్‌పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే చర్చ సాగుతోంది. శబ్ద కాలుష్యమంటే? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది. అమల్లో ఉన్న నిబంధనలేమిటి? బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు. శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీం స్పష్టం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గూబ గుయ్యిమంటోంది!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పట్టణం ఇప్పుడు ప్రపంచ పటంపై ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎందుకో తెలుసా? అక్కడ పరిమితికి మించి రెండు రెట్లు అధికంగా శబ్ద కాలుష్యం ఉన్నట్లు తేలింది! ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన శబ్ద తీవ్రత కేవలం 55 డెసిబుల్స్(డీబీ) కాగా మొరాదాబాద్‌లో ఇది ఏకంగా 114 ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 119 డెసిబుల్స్‌తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. మొరాదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో 83 డీబీ, కోల్‌కతాలో 89 డీబీ శబ్దం కాలుష్యం ఉన్నట్లు ఐరాస పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో శబ్ద కాలుష్యం తీవ్రతను వెల్లడిస్తూ తాజాగా ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ నివేదికను విడుదల చేశారు. న్యూయార్క్, బ్యాంకాక్ హాంకాంగ్ వంటి నగరాలు జాబితాలో ఉన్నాయి. భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం బెడద దక్షిణాసియాలోనే అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లో పరిమితికి మించి నమోదవుతోంది. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శబ్ద తీవ్రత నివాస ప్రాంతాల్లో 55 డీబీ, వాణిజ్య ప్రాంతాల్లో 70 డీబీ దాకా ఉండొచ్చు. అంతకు మించిన శబ్దాన్ని ఎక్కువ సేపు వింటే వినికిడి శక్తి పోయే ప్రమాదముంది. శబ్ద కాలుష్యం మనుషుల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. న్యూయార్క్‌లో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించే వారిలో ప్రతి 10 మందిలో 9 మంది శబ్ద కాలుష్యానికి గురవుతున్నారని నివేదిక వెల్లడించింది. ‘‘హాంకాంగ్‌లో ప్రతి ఐదుగురిలో ఇద్దరిది ఇదే పరిస్థితి. యూరప్‌లో అతిపెద్ద నగరాల పౌరుల్లో సగం మంది శబ్ద కాలుష్య బాధితులే’’ అని స్పష్టం చేసింది. ట్రాఫిక్ రణగొణ ధ్వనుల కారణంగా కొన్ని సిటీల్లో పక్షులు తమ కూత సమయాన్ని కూడా మార్చుకుంటున్నట్లు నిపుణులు గుర్తించారు. -
పగలు, రాత్రి తేడా లేదు.. మోత మోగిపోతోంది
సాక్షి, హైదరాబాద్: నగరంలో ధ్వని కాలుష్యం పెరుగుతోంది. పగలు, రాత్రి తేడా లేదు. మోత మోగిపోతోంది. నివాస, వాణిజ్య ప్రాంతాలు, ఆసుపత్రులు, పార్కులు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో సైతం శబ్దాలు పెరుగుతున్నాయి. ఇది వాహనాలకే పరిమితం కాలేదు. హైదరాబాద్ విస్తరిస్తున్నది. నిర్మాణ రంగం పెరిగింది. వాహనాలు, నిర్మాణ కార్యకలాపాలు, ఇతరత్రా రూపాల్లో వెలువడుతున్న ధ్వనులతో వివిధ వర్గాల వారికి రోజువారీ సమస్యలు తప్పడం లేదు. ఇక పండుగలు, ఇతర వేడుకల సమయాల్లో ఇది శృతి మించుతోంది. ఈ శబ్దాలతో వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా శబ్దాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగి, ఒకేస్థాయిలో కొనసాగుతుండడంతో గుండె కొట్టుకునే వేగం పెరగడం, అధిక రక్తపోటు సమస్యలకు దారితీస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. 65 డెసిబుల్స్‌కు పైబడి ధ్వనులు పెరిగితే గుండెజబ్బులు, వినికిడి కోల్పోవడం, నిస్సత్తువ ఆవరించడం, నిద్రలేమి, తలనొప్పి, మానసికంగా, శారీరంగా కుంగుబాటు వంటి వాటికి దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాదిగా ఇదే పరిస్థితి... దాదాపు ఏడాది కాలంగా కొంచెం హెచ్చుతగ్గుదలలతో ధ్వని కాలుష్యం, శబ్దాలు ఒకేవిధమైన స్థాయిలో కొనసాగుతున్నట్టుగా తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలి (టీపీసీబీ) అధికారిక గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమౌతోంది. హైదరాబాద్ మహానగరంలోని నివాస, వాణిజ్య, సున్నిత–నిశ్శబ్ద (ఆసుపత్రులు, పార్కులు, ఇతర ప్రదేశాలు) ప్రాంతాలలో ఉదయం, రాత్రి రెండు సమయాల్లోనూ నిర్ణీత పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరీకరణ ఉచ్ఛస్థాయికి చేరుకోవడం, వివిధ రకాల వాహనాల రద్దీ బాగా పెరగడం, నిర్మాణరంగ కార్యకలాపాలు క్రమంగా పెరుగుదల, తదితరాల కారణంగా ఈ ధ్వనులు పెరుగుతున్నట్టు, శాస్త్రీయ పద్ధతుల్లో వీటి నివారణ, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పగటి పూటతో పాటు రాత్రి సమయాల్లోనూ పరిమితులకు మించి అధిక శబ్దాలతో నిద్రకు అంతరాయం ఏర్పడి పరోక్షంగా ఇతర సమస్యలకు దారితీస్తుంది. అయోమయం, మానసిక ఒత్తిళ్లు, ఆదుర్ధా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి వచ్చే అవకాశాలుంటాయి. శబ్దకాలుష్యానికి ఎక్కువ కాలం పాటు గురైతే చాలామందిలో యాంగ్జయిటీ, నిద్రలేమి కారణంగా పొద్దునే లేవలేకపోవడం, రోజంతా చేసే పనులపై సరిగా దృష్టి సారించక పోవడం వంటివి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపి పనితీరుకు నష్టం కలిగి వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురౌతాయి. నిద్రలేమి, ఆదుర్దా, ఒత్తిళ్లు, ఆయాసం, ఇతర సమస్యలు జతకూడి కుటుంబసంబంధాలపైనా దీని పరోక్ష ప్రభావం పడుతుంది. – డా.వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆసుపత్రి -
వామ్మో.. ‘మోత’ మోగిస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాలోని పలు ప్రాంతాల్లో ధ్వని, వాయు కాలుష్య సమస్యలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో శబ్దాల సమస్య మితిమీరుతుంటే, కొన్ని జిల్లాలు, పట్టణాల్లో వాయు నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌లో గతంలో ఉన్న వాయు కాలుష్య సమస్య కొంత తగ్గుముఖం పట్టగా జిల్లాలు, ముఖ్య పట్టణాల్లో వాయు నాణ్యత తక్కువగా నమోదవుతోంది. వేసవిలో సెకండ్‌వేవ్ సందర్భంగా లాక్డౌన్ అమలు, తర్వాత వర్షాకాలం నేపథ్యంలో హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తగ్గిందని, చలికాలం వచ్చేటప్పటికి మళ్లీ కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) గత 3 నెలల (మే, జూన్, జూలై) వెల్లడించిన గణాంకాలను విశ్లేషిస్తే ఈ విషయమే స్పష్టమవుతోంది. శబ్ద ప్రమాణాలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత శబ్ద ప్రమాణాల ప్రకారం వివిధ ›ప్రాంతాల వారీగా పగలు, రాత్రి సమయాల్లో వెలువడే ధ్వనులు కింద సూచించిన మేర ఆయా స్థాయిలు పగటిపూట (ఉదయం 6 నుంచి రాత్రి 10 లోపు), రాత్రి సమయాల్లో (రాత్రి 10 నుంచి ఉదయం 6 లోపు) డెసిబుల్స్ లోబడి ఉండాలి. ఇవీ సీపీసీబీ వాయు నాణ్యతా ప్రమాణాలు.. సీపీసీబీ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను బట్టి వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 0–50 పాయింట్ల మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగా ఉన్నట్లు, ఈ పరిమితిలో ఉంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నం కావు. ► 50–100 పాయింట్ల మధ్యలో ఏక్యూఐ ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలున్న వారికి గాలి పీల్చుకోవడంలో, ఇతరత్రా సమస్యలు ఎదురవుతాయి. ► 101–200 పాయింట్ల మధ్యలో ఏక్యూఐ ఉంటే ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్థమా, గుండె సంబంధిత జబ్బులున్న వారికి గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ► వాయు నాణ్యత మరింత తగ్గి 200 పాయింట్ల ఏక్యూఐని మించిన గాలిని దీర్ఘకాలం పాటు పీలిస్తే అనారోగ్యం, శ్వాసకోశ సంబంధిత, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై తీవ్ర ›ప్రభావం పడుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత 3 నెలల్లో వాయు నాణ్యతా ప్రమాణాలు ఇలా (ఎక్యూఐ పాయింట్లలో) మల్టీ హారన్స్ వల్లే.. హైదరాబాద్‌లో శబ్దకాలుష్యం క్రమంగా పెరుగుతోంది. వివిధ రకాల వాహనాలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, వివిధ అభివృద్ధి పనులు, ఇతర రూపాల్లో రోజువారీ కార్యక్రమాల్లో ప్రమాణాలకు మించి పెరుగుతున్న ధ్వనులు ఈ పరిస్థితికి కారణం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వివిధ నిర్దేశిత ప్రాంతాల్లో నిర్ణీత ప్రమాణాల కంటే శబ్దాలు ఎక్కువగా నమోదు కావడానికి మల్టీహారన్స్ వినియోగం ప్రధాన కారణంగా గుర్తించాం. అంతర్రాష్ట్ర బస్సు, లారీ సర్వీసులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా మల్టీ హారన్స్ వినియోగంతో ఈ సమస్య పెరుగుతోంది. దీని నియంత్రణకు పోలీసు, రవాణా శాఖలు తగిన చర్యలు చేపడుతున్నాయి. – టీపీసీబీ ధ్వని, కాలుష్య నియంత్రణ అధికారులు వినికిడి శక్తికి ప్రమాదం.. ప్రజల ఆరోగ్యం, వారి వివిధ అవయవాలు, శరీర భాగాలపై వాయు, నీరు, ధ్వని ఇతర రూపాల్లోని కాలుష్యాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె ఇతర ముఖ్యమైన భాగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. శబ్ద కాలుష్యం వినికిడి, ఇతర మానసిక సమస్యలకు దారితీస్తోంది. రోజూ 8 గంటల పాటు 85 డెసిబుల్స్ ఉన్న ధ్వనికి గురైతే వినికిడి సమస్యలు మరింత పెరుగుతాయి. 90కు మించి డెసిబుల్స్‌తో వెలువడే శబ్దాలకు చెవులు, 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలకు కర్ణ భేరి దెబ్బతిని, వినికిడి శక్తి కోల్పోతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, రాజకీయ పార్టీల ప్రచారాల్లో మోగించే డీజే సౌండ్లు అనేక అనర్థాలకు కారణమవుతు న్నా యి. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. – డా.ఎం.మోహన్‌రెడ్డి, చీఫ్ ఈఎన్టీ స్పెషలిస్ట్, నోవా హాస్పిటల్ -
నోరెక్కువ బైకులు.. యువతకు క్రేజ్.. ప్రజలు బేజారు!
వైల్డ్బోర్, కాక్టైల్ షార్మర్, డాల్ఫిన్, మెగాఫోన్, టెయిల్ గన్నర్.. ఈ పేర్లు ఏంటో తెలుసా? బైక్‌లకు అమర్చే సైలెన్సర్లు. ధర అధికం.. వచ్చే శబ్దం కర్ణ కఠోరం.. ఆరోగ్యానికి హానికరం.. వీటి వాడకం చట్ట విరుద్ధం.. పట్టుబడితే అపరాధం... తీరు మారకుంటే శిక్ష ఖాయం. సరికొత్త సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దానికి యువత ఆకర్షితులవుతున్నారు. విభిన్నశబ్దంతో రోడ్డెక్కి, చుట్టుపక్కలవారి గుండెల్లో అలజడి రేపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు అర్బన్: ఈ మధ్య రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లుపడే శబ్దంతో వెళుతున్న ద్విచక్రవాహనాలు ఎక్కువయ్యాయి. ఇందులో యమహా నుంచి బుల్లెట్, కేటీఎం వంటి రేస్ బైక్‌లున్నాయి. కంపెనీ నుంచి కొనేప్పుడు వాహనాలకు ఉన్న సైలెన్సర్లు(పొగ గొట్టాలు) తొలగించి, ఆ స్థానంలో వారికి నచ్చిన శబ్దాన్ని వెలువరించే గొట్టాలను అమర్చుతున్నారు. ఈ బైక్‌లు చేసే శబ్దంతో రోడ్లపై వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. అడవి పంది తరహాలో శబ్దం చేస్తే, వైల్డ్బోర్ ఎగ్జాస్ట్. తుపాకీలా గిర్రున తిరుగుతూ శబ్దం వెలువరిస్తే ‘టెయిల్ గన్నర్’. ఇవే కాదు.. బ్యారెల్, గ్రీసెస్, మెగాఫోన్, కాక్టైల్ షార్మర్, ఇండోరి, పంజాబీ, డాల్ఫిన్, ఆర్ఆర్ఓ వంటి స్పేర్ పార్ట్స్ పేరిట సైలెన్సర్లు చేస్తున్న అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఒక్కో సైలెన్సర్ ధర రూ.10వేల నుంచి రూ.23వేలకు పైనే. వీటిని అమర్చేందుకు మెకానిక్ రూ.3వేల వరకు వసూలు చేస్తుండడం గమనార్హం. వింటున్నారా..? బుల్లెట్ దర్జాకు ప్రతీక.. కేటీఎం బైక్ కుర్రకారు క్రేజ్. పాతబడ్డ యమహా ఆర్ఎక్స్–100 వాహనాలకు రంగులద్ది రోడ్లపై తిప్పుతున్నారు. ఈ వాహనాల సైలెన్సర్లలో కొద్దిపాటి మార్పు చేస్తే అది వెలువరిచే శబ్దం ప్రత్యేకం. ఎదుటివారి ఇబ్బందులు పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతుండటం రోత పుట్టిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ప్రతి మోటారు వాహనం నిర్ణీత డెసిబెల్స్ శబ్దాన్ని వెలువరించేలా సైలెన్సర్‌ను తీర్చిదిద్దుతారు. అలాంటి డిజైన్లకే రవాణా శాఖ అనుమతిస్తుంది. మనిషి సాధారణంగా 60 డెసిబెల్స్ శబ్దం వరకు వినగలడు. అంతకు మించిన శబ్దం వింటే కర్ణభేరిపై ప్రభావం చూపి వినికిడి లోపం ఏర్పడుతుంది. చట్టంలో ఏముంది..? ఒక వాహనం నిర్ణీత డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం సృష్టిస్తే అది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం. నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనంపై ఎంవీఐ యాక్టు 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణాశాఖ అధికారులు కేసు నమోదు చేయవచ్చు. సంబంధిత వాహనచోదకుడికి రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తారు. మళ్లీ రెండోసారి శబ్ద కాలుష్యానికి కారణమైతే రూ.2వేల వరకు జరిమానా విధిస్తారు. మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు పెట్టవచ్చు. కొందరు కంపెనీ సైలెన్సర్లు తీసేస్తుంటే, మరికొందరు ఫిల్టర్లను తీసేస్తున్నారు. దీని వల్ల శబ్ద తీవ్రత పెరుగుతోంది. మార్పు మొదలు.. ఈ పరిణామాలను అడ్డుకునే దిశగా చిత్తూరు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇటీవల నగరంలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు దాదాపు 120 వరకు వాహనాలను సీజ్ చేశారు. వాహన యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి, మెకానిక్ ద్వారా సైలెన్సర్లను మార్పుచేసిన తరువాత వాహనాలను అప్పగించారు. గతంలో ఈ తరహా చర్యలు చేపట్టిన తిరుపతి పోలీసులు కొద్దిరోజుల తరువాత దాన్ని విస్మరించారు. ఫలితంగా ద్విచక్ర వాహన ఆకతాయిల శబ్దాలు మళ్లీ మామూలైపోయాయి. శబ్దం పెరిగేకొద్దీ ఇబ్బందే.. మనం వింటున్న శబ్ద తీవ్రత పెరిగే కొద్దీ జబ్బులు ఖాయమంటున్నారు వైద్యనిపుణులు. ∙100 డెసిబెల్స్ దాటితే : గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ∙120 డెసిబెల్స్ దాటితే : చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది. ∙110 డెసిబెల్స్ దాటితే : చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది. ∙160 డెసిబెల్స్ దాటితే : చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతిని పాక్షిక వైకల్యం ఏర్పడుతుంది. ∙190 డెసిబెల్స్ దాటితే : కర్ణభేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. వినికిడి లోపం.. మానసిక రోగాలు శబ్ద తరంగాలు చెవి సామ ర్థ్యం కంటే ఎక్కువ వింటే శారీరక, మానసిక వ్యాధులు వస్తాయి. చెవిలోని నరాలు దెబ్బతిని వినికిడి వ్యవస్థకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఫలితంగా శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. దీంతో పాటు మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. – పాల్‌రవికుమార్, చెవి వైద్య నిపుణులు, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి చట్టరీత్యా చర్యలు ఎక్కువగా 18 ఏళ్లలోపు మగపిల్లలు వాడుతుండడంతో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చకుండా తల్లిదండ్రులు ఇంటి నుంచే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మెకానిక్‌లు ఇష్టానుసారంగా సైలెన్సర్లను మార్పు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం. – ఎన్.సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ, చిత్తూరు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఢిల్లీలో శబ్దాలు చేస్తే రూ. లక్ష జరిమానా
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇకపై ఎవరైనా శబ్ద కాలుష్యానికి పాల్పడితే రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ముందుగా అనుమతి లేకుండా పెళ్లిళ్లు, పండుగల్లో బాణాసంచా పేల్చినా, లౌడ్ స్పీకర్లు, డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్స్ వాడితే విధించే జరిమానాలను సవరించినట్టుగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) వెల్లడించింది. ఈ కొత్త నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సవరించిన జరిమానాల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటి వేళల్లో 55 డెసిబల్, రాత్రి వేళల్లో 45 డెసిబల్ శబ్దాలకు మాత్రమే అనుమతి ఉంది. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధి వరకు సైలెంట్ జోన్లగా ప్రకటించారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడితే మొదటిసారి రూ. 20 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే రూ. 40 వేలు, అంతకంటే ఎక్కువగా నిబంధనల్ని ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తారని డీపీసీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు. 1,000 కేవీఏకి మించి డీజీ సెట్స్ వినియోగిస్తే రూ.లక్ష, 62.5 నుంచి 1,000 కేవీ మధ్య డీజీ సెట్స్ వాడితే రూ. 25 వేలు, 62.5 కేవీఏ వరకు డీజీ సెట్స్‌పై రూ.10 వేలు జరిమానా విధించాలని నిబంధనల్ని సవరించారు. -
వినికిడి సమస్యలు లేని ఏపీనే లక్ష్యం
సాక్షి, అమరావతి: వినికిడి లోపాలు, ఇతర సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వైఎస్సార్ కంటి వెలుగు తరహాలోనే చెముడుతో బాధపడేవారిని వీలైనంత త్వరగా చిన్న వయసులోనే గుర్తించి.. వారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేస్తే ఫలితం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు అంచెల్లో వినికిడి లోపాలు ఉన్నవారిని గుర్తించాలని సర్కార్ ప్రణాళికను సిద్ధం చేసింది. పుట్టిన శిశువుతోపాటు తల్లికీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో వినికిడి లోపాలేమైనా ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత పిల్లలకు ఒకటో నెల, మూడో నెల, ఆరో నెల రాగానే ఆస్పత్రుల్లోనే స్క్రీనింగ్ నిర్వహించి వినికిడి లోపాలుంటే చికిత్స చేస్తారు. అలాగే రెండేళ్లలోపు పిల్లలు, స్కూల్ బయట ఉన్న పిల్లలు, 50 ఏళ్లు పైబడినవారిలో ఈ లోపాలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపడతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్సీ డాక్టర్లతో 104 సంచార వైద్య వాహనాల ద్వారా స్క్రీనింగ్‌ను నిర్వహిస్తారు. పీహెచ్‌సీలు, 104 వాహనాల్లో వినికిడి లోపాలను గుర్తించే పరికరాలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 104 వాహనాల్లో వినికిడి లోపాలను గుర్తించే పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్ల పై నుంచి 18 ఏళ్లలోపు వారికి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి పరీక్షలు చేస్తారు. చెముడుతో బాధపడేవారిని గుర్తించి.. అవసరమైనవారికి ఆపరేషన్లు చేయిస్తారు. అంతేకాకుండా వారికి కావాల్సిన పరికరాలను కూడా అందిస్తారు. గ్రామీణ, పట్టణ పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 74 ప్రభుత్వ ఆస్పత్రులు గుర్తింపు.. అలాగే శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారిలో కూడా వినికిడి లోపాలుంటాయని, అలాంటి వారిని కూడా గుర్తించి చికిత్సలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా శబ్ద కాలుష్యం ఉన్న పరిశ్రమల్లో పనిచేసేవారు, ట్రాఫిక్ పోలీసులు, డ్రైవర్లు, రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివసించే వారిలో వినికిడి లోపాలను గుర్తించనున్నారు. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయడంతోపాటు, ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించనున్నారు. వినికిడి లోపాలున్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేందుకు 74 ప్రభుత్వ ఆస్పత్రులను గుర్తించారు. ఇందుకోసం ఈఎన్టీ సర్జన్లు, వైద్య సిబ్బంది నియామకంతోపాటు స్క్రీనింగ్ పరికరాలను సమకూర్చుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికను రూపొందించింది. -
ముంబైలో తగ్గిన దీపావళి సప్పుడు
సాక్షి, ముంబై: దీపావళి రోజున ముంబైలో శబ్ద కాలుష్యం తక్కువ స్థాయిలో నమోదైంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టాడానికి నగరంలో పటాకులు, బాణసంచా బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బాణాసంచా కాల్చేందుకు బాంబే హైకోర్టు అనుమతులు ఇచ్చింది. అటు బృహణ్ ముంబై చర్యలు, ఇటు హైకోర్టు సూచనలతో దీపావళి నాడు శబ్ద కాలుష్యం అత్యల్ప స్థాయిలో నమోదైందని ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీవో తెలిపింది. ఎన్జీఓ వ్యవస్థాపకురాలు సుమైరా అబ్దులాలి ఆదివారం ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. ‘దీపావళి రోజున ముంబై నగరంలో అత్యల్ప స్థాయిలో శబ్ద కాలుష్యం నమోదైంది. బాణాసంచా కాల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను అమలుచేయడం, జనాల్లో అవగాహన రావడంతోనే ఇది సాధ్యమైంది. చదవండి: ఢిల్లీకి కాలుష్యం కాటు దీపావళి సందర్భంగా ఈ ఏడాది నమోదైన ధ్వని తీవ్రత గత 15 ఏళ్లలో కనిష్ట స్థాయిలో ఉంది. నగరంలోని సైలెన్స్ జోన్ శివాజీ పార్క్ మైదానంలో రాత్రి 10 గంటలకు వరకు పటాకులను పేల్చడానికి ఇచ్చిన గడువులో 105.5 డెసిబెల్ నమోదైంది. ముంబైలో గరిష్టంగా ధ్వని తీవ్రత 2019 లో 112.3 డెసిబెల్స్, 2018 లో 114.1 డెసిబెల్స్, 2017 లో 117.8 డెసిబెల్స్ నమోదైంది. అయితే, శివాజీ పార్క్ వద్ద చాలా మంది ప్రజలు మాస్కులు ధరించకుండానే పండగ జరుపుకోవడం ఆందోళన కలిగిస్తోంది’అని పేర్కొన్నారు. ఏదేమైనా ముంబై నగరం మొత్తంలో ధ్వని తీవ్రతను కచ్చితంగా లెక్కకట్టడం సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. -
‘సైకిల్స్ ఫర్ చేంజ్’
సాక్షి, హైదరాబాద్ : నగరాల్లో పెరిగిపోతున్న వాయు, ధ్వని కాలుష్యాలను అరికట్టడం, పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజల ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపర్చడం, జీవన ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘సైకిల్స్ ఫర్ చేంజ్’ చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 141 నగరాల్లో సైకిల్ వినియోగంపై ప్రజలను చైతన్యవంతులను చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మూడు నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. ఈ మూడు నగరాల్లో మొదటి దశలో భాగంగా సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయా నగరాల్లో సైకిళ్లు అద్దెకు ఇవ్వడం, ఒకచోట ఉన్న సైకిల్‌ను మరోచోటకు తీసుకువెళ్లి నిర్దేశిత ప్రదేశంలో వదిలివెళ్లే అవకాశం కల్పించడంలాంటి వెసులుబాట్లు కల్పిస్తారు. ప్రజలు సొంతంగా ఉపయోగించుకునే వాటితో పాటు, దాతల ద్వారా సేకరించే సైకిళ్లను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. 21లోగా దరఖాస్తు చేసుకోవాలి.. ‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో భాగస్వామ్యమయ్యేందుకు ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దశలో ఎంపిక చేసిన నగరాలను వడపోసిన తర్వాత రెండో దశకు వెళ్తామని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా చేపట్టే ఈ కార్యక్రమాలను భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, స్మార్ట్ మిషన్‌లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించింది. సైక్లింగ్ ఫ్రెండ్లీ నగరాలను రూపొందించడం ద్వారా ప్రజల జీవన విధానాల్లో, ఆర్థిక ప్రమాణాల్లో పెద్దఎత్తున మార్పులు తీసుకురావచ్చని, కరోనా నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత నగరాల్లో 50–65 శాతం సైక్లింగ్ పెరిగిందని, వ్యక్తిగత రవాణా సౌకర్యం కింద సైక్లింగ్ ఉత్తమ మార్గమమని తెలిపింది. పాశ్చాత్య దేశాల్లో ప్రధాన నగరాల స్ఫూర్తితో సైక్లింగ్‌జోన్ల ఏర్పాటు, ప్రజల్లో అవగాహన కోసం వర్క్‌షాప్‌ల నిర్వహణలాంటి కార్యక్రమాలు ఈ చాలెంజ్‌లో భాగంగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. గొప్ప అవకాశం: బి.వినోద్‌కుమార్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం నగర ప్రజలు తమ జీవనశైలిని మార్చుకునేందుకు మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సైక్లింగ్ వల్ల కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్యా తగ్గుతుంది. వీధులు శుభ్రంగా, సురక్షితంగా ఉంటాయి. శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. -
శబ్ద కాలుష్యంతో హైబీపీ, కేన్సర్!
సాక్షి, హైదరాబాద్ : పెద్ద పెద్ద శబ్దాలు, వాటితో ఏర్పడే శబ్ద కాలుష్యం వల్ల హైబీపీ, కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పెద్ద శబ్దాలు, ఎయిర్‌పోర్టుల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ అప్పుడు వచ్చే ధ్వని వంటివి జన్యువుల (కేన్సర్ సంబంధిత డీఎన్ఏల్లో) మార్పులకు కారణం కావొచ్చు. ఈ శబ్దాలు, వాయు కాలుష్యం మనుషుల్లో అధిక రక్తపోటు (హైబీపీ), కేన్సర్ కారక కణతులు ఏర్పడటానికి, అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. పెద్ద శబ్దాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనేది తెలుసుకునేందుకు ఎలుకలపై జర్మనీలోని ‘యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆఫ్ మెయింజ్’ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి. కేవలం 4రోజు లు కూడా విమానాల శబ్దాలను ఎలుకలు తట్టుకోలేకపోయాయని, వాటిలో హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతో పా టు వాటి కేన్సర్ అభివృద్ధికి కారణమయ్యే డీఎన్ఏ డ్యామేజీకి దారితీసినట్టుగా గుర్తించారు. ‘మా అధ్యయనం ద్వారా వెల్లడైన సమాచారం లోతైన విశ్లేషణకు ఉపయోగపడతాయి’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన మథాయాస్ ఉల్జే వెల్లడించారు. ఈ పరిశోధన పత్రాలను ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు. చదవండి: కుక్కలకు భయపడి.. చిరుత చెట్టెక్కింది! -
అనుకోకుండా ఒకరోజు...
సాక్షి, హైదరాబాద్: నగరంలో బయటకొచ్చి రోడ్డుపై ప్రయాణించాలంటే హైదరాబాదీయులకు నిత్యం నరకమే. ఓవైపు సుమారు 50 లక్షలకుపైగా వాహనాల రాకపోకల రణగొణధ్వనులతో స్థాయికి మించి శబ్ద కాలుష్యం, మరోవైపు ఆ వాహనాల నుంచి వెలువడే దట్టమైన పొగ ఊపిరి సలపని పరిస్థితి, అధిక ధూళి కణాలతో కళ్లు మండేంత వాయు కాలుష్యం. కానీ, దసరా పండుగ రోజు మాత్రం నగరవాసులకు ఈ ఇక్కట్లు తప్పాయి. స్వచ్ఛమైన గాలితో ఊపిరి తీసుకున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే దసరా పండుగ రోజు నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో శబ్ద, వాయు కాలుష్యం 40 నుంచి 50% మేర తగ్గడంతో నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెలువరించిన తాజా కాలుష్య నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పీసీబీ ప్రమాణాల మేరకు ఘనపుమీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలో పలు రద్దీ కూడళ్లలో సాధారణ రోజుల్లో 90 నుంచి 110 మైక్రోగ్రాముల మేర నమోదవుతుంది. దసరా రోజున నగరంలో 60 నుంచి 70 మైక్రోగ్రాముల లోపలే ధూళికాలుష్యం నమోదవడం విశేషం. ఇక శబ్దకాలుష్యం పీసీబీ ప్రమాణాల మేరకు 55 డెసిబుల్స్ దాటకూడదు. కానీ సిటీలో పలు ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో వాహనాల హారన్ల మోతతో 90 నుంచి 100 డెసిబుల్స్ మేర శబ్దకాలుష్యం నమోదవుతుండటంతో నగరవాసుల గూబగుయ్ మంటుంది. కానీ దసరా రోజు పలు ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం 50 నుంచి 60 డెసిబుల్స్ మాత్రమే నమోదవడంతో నగరవాసులు కాలుష్య విముక్తి పొంది పండగ చేసుకోవడం విశేషం. శబ్ద, వాయుకాలుష్యం తగ్గడానికి కారణాలివే గ్రేటర్ జనాభా కోటి మార్కును దాటింది. సిటీలో సుమారు పదివేల కిలోమీటర్ల ప్రధాన రహదారులపై నిత్యం రాకపోకలు సాగించే అరకోటి వాహనాల్లో పండుగ రోజు సగం వాహనాలు కూడా రోడ్డెక్కలేదు. దీంతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు పీసీబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మెజార్టీ నగరవాసులు పల్లెబాట పట్టడం, సిటీలో ఉన్న వారు సైతం ఇంటికే పరిమితమై ఇంటిల్లిపాదీ కలసి పండగ చేసుకోవడం కూడా కాలుష్యం తగ్గేందుకు కారణమైనట్లు చెబుతుండటం విశేషం. -
చెవిమోతలో గ్రేటర్ ఫైవ్
సాక్షి, హైదరాబాద్ : అబ్బా.. సౌండ్ పొల్యూషన్.. రోడ్డెక్కితే రోజూ మనం అనుకునేది ఇదే.. డొక్కు వాహనాల శబ్దాలు, నిర్మాణ సంబంధ యంత్రాల రణగొణ ధ్వనులు, పరిశ్రమల్లోని భారీ యంత్ర పరికరాల చప్పుళ్లు, ట్రాఫిక్జాంలో హారన్ల మోతలు.. ఇలా రకరకాల కారణాలతో మొత్తమ్మీద సిటీ గూబ గుయ్యిమంటోంది. ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాలు అన్న తేడా లేదు.. అన్నింటా బ్యాండ్ బాజాయే.. నిజానికి ప్రతి దానికీ ఒక లిమిట్ ఉండాలి. అలాగే ఈ శబ్ద కాలుష్యానికి కూడా.. వాస్తవానికి ఆ పరిమితి ఎంత? నగరంలో దాన్ని మించి ఎంత ఉంది అన్న లెక్కలను పరిశీలిస్తే.. నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబుల్స్, వాణిజ్య ప్రాంతాల్లో 65, పారిశ్రామిక ప్రాంతాల్లో, 75 డెసిబుల్స్ శబ్ద అవధిని మించరాదు. నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 45, వాణిజ్య ప్రాంతాల్లో 55, పారిశ్రామిక ప్రాంతాల్లో 70 డెసిబుల్స్ మించరాదు. కానీ గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం 70 నుంచి 90 డెసిబుల్స్..రాత్రి వేళల్లో సరాసరిన 65–75 డెసిబుల్స్ మేర శబ్దాలు వెలువడుతున్నాయి. ఇక దేశంలోని పరిస్థితి లెక్కేస్తే.. లక్నో తొలిస్థానంలో నిలవగా..రెండో స్థానంలో కోల్‌కతా, మూడోస్థానంలో ఢిల్లీ, నాలుగో స్థానంలో ముంబై, ఐదో స్థానంలో గ్రేటర్ హైదరాబాద్‌లు నిలిచినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక వెల్లడించింది. గ్రేటర్లో వివిధ ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిస్థితి ఇదీ.. (డెసిబుల్స్‌లో) -
‘ఇలాంటి లెటర్ వస్తే అలసటంతా ఎగిరిపోతుంది’
ముంబై : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఓ లెటర్ తెగ వైరలవుతోంది. ‘అలసటగా గడిచిన ఒకనాటి సాయంకాలం మీ మెయిల్‌కి ఇలాంటి ఒక లెటర్ వస్తే.. మీ అలసట పూర్తిగా మాయమవుతుంది. నేను కూడా తనలానే ఉన్నతమైన.. ప్రశాంతమైన ప్రపంచం గురించి ఆలోచించే వారికోసమే పని చేస్తుంటాను’ అనే క్యాప్షన్‌తో ఓ లెటర్ని ట్వీట్ చేశారు ఈ బిజినెస్ టైకూన్. ఈ లెటర్ని ముంబైకి చెందిన పదకొండేళ్ల మహికా మిశ్రా తన స్వహస్తాలతో రాసి ఆనంద్ మహీంద్రాకు మెయిల్ చేసింది. లేఖలో ‘నాకు కార్లు, బైక్స్, లాంగ్‌డ్రైవ్ అంటే చాలా ఇష్టం. కానీ అవి పర్యావరణానికి ఎంత హానీ చేస్తాయో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. ఇవి శక్తిని దుర్వినియోగం చేసి.. వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. దీన్ని నివారించడం కోసం మీకో ఐడియా ఇస్తున్నాను. అదేంటంటే 10 నిమిషాల వ్యవధిలో కేవలం 5 సార్లు మాత్రమే హారన్ రావాలి.. అది కూడా మూడు సెకన్ల పాటే మోగాలి. ఇలా చేస్తే వాయు కాలుష్యం తగ్గడమే కాక మన రోడ్లు కూడా చాలా ప్రశాంతంగా మారతాయి. ఇక మీదట మీ కంపెనీలో కార్లు తయారు చేసేటప్పుడు నా ఐడియాను వినియోగించుకుంటే చాలా సంతోషిస్తాను. దాంతో పాటు వాతావరణాన్ని పాడు చేయని ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తే చూడాలని కోరుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొంది. At the end of a tiring day, when you see something like this in the mail..the weariness vanishes...I know I’m working for people like her, who want a better—and quieter world! 😊 pic.twitter.com/lXsGLcrqlf — anand mahindra (@anandmahindra) April 3, 2019 ప్రస్తుతం ఈ లెటర్ వైరలవ్వడమే కాక నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. ఏడో తరగతి విద్యార్థిని నుంచి చాలా గొప్ప ఐడియా వచ్చింది.. ఉత్తమ ప్రపంచాన్ని కోరుకునే తనలాంటి వారిని ప్రోత్సాహించండి అంటూ మహికాను అభినందిస్తున్నారు నెటిజన్లు. -
శబ్ధ కాలుష్యం ఆపలేదని బ్రేకప్..
సాక్షి, పాట్నా : చిన్న కారణాలకే పెళ్లిళ్లు పెటాకులవుతున్న రోజుల్లో బీహార్‌లో ఓ మహిళ విడాకులకు సిద్ధపడిన కారణం వింటే ఎవరైనా విస్తుపోతారు. ఇంటి చుట్టుపక్కల శబ్ధకాలుష్యాన్ని నివారించడంలో విఫలమయ్యాడని భర్తకు విడాకులు ఇవ్వాలని స్నేహ సింగ్ అనే మహిళ నిర్ణయించుకుంది. హజీపూర్, రోడ్‌నెంబర్ 3లోని ఆమె నివాసం పొరుగునే ప్రార్ధనా మందిరాల నుంచి లౌడ్‌స్పీకర్లతో సమస్యలు ఎదురవడంతో స్నేహ సింగ్ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. స్ధానికులకు అసౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతోనే మతం పేరిట కొందరు ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అధికారుల తీరుతో విసుగెత్తిన స్నేహ ప్రదాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్‌లకు లేఖలు రాశారు. వీటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో భర్త రాకేష్ సింగ్ నుంచి విడాకుల కోసం ఆమె డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట స్నేహ, రాకేష్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. తనకు అవసరమైన భద్రతను కల్పించలేని వ్యక్తితో తాను కలిసి జీవించలేనని ఆమె తేల్చిచెప్పారు. దివ్యాంగుడైన రాకేష్ గతంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు కావడం గమనార్హం. శబ్ధ కాలుష్యంపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, పొరుగు వారితో తలపడే పరిస్థితిలో తాను లేనని రాకేష్ నిరాసక్తత వ్యక్తం చేశాడు. మరోవైపు స్నేహను ఒప్పించేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. దుండగులు వారి ఇంటిపై రాళ్లు విసురుతున్నారని పోలీసుల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘బ్యాండ్’ పడుతోంది...
రాజధానిలో బారాత్లపై ఆంక్షలు - శబ్ద కాలుష్యం కలిగిస్తే ఊచలే - సాదాసీదాగా రాత్రి 10లోపే ముగించాలి - డప్పు కళాకారులకు సంకటం హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి పెళ్లి సందర్భంగా సీతాఫల్మండి చౌరస్తా నుంచి డప్పువాయిద్యాలతో బారాత్ తీసేందుకు సిద్ధ మయ్యారు. డప్పు మోగకముందే పోలీసులొచ్చారు. డప్పు కళాకారులను హెచ్చరించడంతో వధూవరుల ను రోడ్డుపైనే వదిలేసి∙వారు ఉడాయించారు. మరు సటి రోజు సదరు యువకుడు పోలీసుల అనుమతి తీసుకొని సాదాసీదాగా బారాత్ చేసుకోవాల్సి వచ్చిం ది. అదీ ఇతరులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి 10 గంటల్లోపే.. ఇలాంటి పరిస్థితులు సీతాఫల్మండి లోనే కాదు నగరంలోని బారాత్ నిర్వాహకులందరికీ ప్రాణ సంకటంగా మారింది. పోలీసులొచ్చాక చూద్దాం అని డప్పు మోగిస్తే కేసులు నమోదు చేస్తు న్నారు. పేరుకు పెట్టీ కేసులే అయినా 2–4 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నిషేధాజ్ఞలు పెళ్లి సందడిపై ప్రభావం చూపుతున్నాయి. డీజేలపై కొంతకాలం నుంచే ఆంక్షలుండగా తాజాగా డప్పు కళాకారులకూ పోలీసు నిబంధనలు ప్రాణ సంకటంగా మారాయి. బారాత్ బాజా మోగిందో కటకటాల పాలవడం ఖాయమైపోతోంది. అట్టహాసం సంగతి పక్కన పెట్టి నాలుగు డప్పులు మోగించి నా పోలీసులు న్యూ సెన్స్, శబ్ద కాలుష్యం కేసులు నమోదు చేస్తున్నారు. బారాత్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. దీంతో పోలీసు పర్మిషన్ లేనిదే వాయించేది లేదంటున్నారు. ఉత్తర మండలంలో 300 మంది.. వివాహాలు చేసుకునే వారి గుండెల్లో తాజాగా సిటీ పోలీస్ యాక్టు 49 మోగుతోంది. పోలీసుల అనుమతి లేకుండా బారాత్‌లు, ఫంక్షన్ ప్యాలెస్‌లలో ఎక్కువ శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఉత్తర మం డలం పరిధిలోని 11 పోలీస్స్టేషన్ల పరిధిలో 300 మం దిపై పెట్టీ కేసులు నమోదయ్యాయి. వీరంతా 2–5 రోజులు జైలు శిక్ష అనుభవించారు. దీంతో పోలీసుల అనుమతి కోసం ఏసీపీ కార్యాలయం చుట్టూ తిరగటం కన్నా బారాత్, సౌండ్స్ లేకపోవడమే మంచిదని కొందరు మిన్నకుంటున్నారు. పోలీసులు అంటున్నారిలా.. నాలుగు డప్పులు పెట్టి నలుగురితో ఊరే గింపు తీసినా అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీ సులు అంటున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగిం చకుండా రాత్రి 10 లోపే బారాత్ ముగిస్తామనే షర తులకు ఒప్పుకుని వారు నివసించే ప్రాంతంలోని ఏసీపీ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవా లంటున్నారు. ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడం లేదని, ప్రజలు ఫిర్యాదు చేస్తేనే బాధ్యులను అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్నారు. -
మసీదుతో శబ్ద కాలుష్యం!
న్యూఢిల్లీ: ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) ఆరో తరగతి పుస్తకంలో శబ్ద కాలుష్యంపై ఇచ్చిన పాఠంలో ‘మసీదు’ ఫొటోను ప్రచురించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీఎస్ఈ ఆరో తరగతి సైన్స్ పుస్తకంలో శబ్ద కాలుష్యంపై ఓ పాఠం ఉంది. అందులో కాలుష్యానికి కారకాలుగా రైలు, కారు, విమానంతో పాటు మసీదు పేరు పేర్కొంది. దీనికి మసీదు ముందు ప్రార్థన చేస్తున్న వ్యక్తుల ఫొటోను ముద్రించింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచురణకర్త హేమంత్ గుప్తా స్పందిస్తూ.. తప్పు భావనతో తాము మసీదు ఫొటోను ప్రచురించలేదని.. ఇది ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని పేర్కొన్నారు. అలాగే వెంటనే పుస్తకంలోని 202 పేజీలోంచి ఫొటోను తొలగిస్తామని తెలిపారు. -
శబ్దకాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం
ముంబై: నగరంలో నానాటికీ అధికమవుతోన్న శబ్దకాలుష్యాన్ని నివారించేవిషయంలో నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారంటూ మహారష్ట్ర ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శబ్ధకాలుష్య నియంత్రణకు గతంలో తాను ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదని అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ అభయ్ ఓకా.. ఇందుకు సంబంధిచి బాధ్యులైన అధికారులను గుర్తించి జులై 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. -
చెవికి చిల్లు
- నగరంలో పెరిగిపోతున్న వాహనాలు - భారీగా శబ్దకాలుష్యం - హై ఫ్రీక్వెన్సీ లాస్, వెర్టిగో సమస్యతో బాధపడుతున్న నగరవాసులు లబ్బీపేట : నగరాన్ని మాయదారి జబ్బులు పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికే కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న సిటీవాసులు రణగొనధ్వనులతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. శబ్దకాలుష్యం కారణంగా నగరంలో 15శాతం మంది ైెహ ఫ్రీక్వెన్సీ లాస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. వాహనాల ఎయిర్ హారన్ల నుంచి వచ్చే అత్యధిక డెసిబుల్స్ సౌండ్‌తోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీనిని తొలిదశలో గుర్తించలేక కొంతమంది తీవ్రమైన వినికిడి లోపానికి గురవుతున్నారు. నగరంలోని పదిశాతం మందిలో చిన్నప్పుడు సరదాగా కొట్టుకోవడం, క్రీడలు, ప్రమాదాల్లో గాయాల కారణంగా, మరో పదిశాతం మంది వెర్టిగో (కళ్లు తిరగడం) వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. హై ఫ్రీక్వెన్సీ లాస్‌కు కారణాలివే.. మనిషి సాధారణంగా 80 డెసిబుల్స్ శబ్దం మాత్రమే వినగలుగుతాడు. అంతకు మంచి శబ్దం వింటే సమస్యలు తలెత్తుతాయి. నగరంలోని వాహనాల ఎయిర్ హారన్లు 120 డెసిబుల్స్ ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కుర్రకారు వాడే బైక్‌ల వింత హారన్లు కూడా అధిక డెసిబుల్స్ శబ్దాన్ని విడుదల చేస్తున్నాయి. ఇలాంటి ఎయిర్ హారన్ల శబ్దాలు, వాహనాల రణగొన ధ్వనులు నిత్యం వినడం వల్ల చిన్నారుల్లో సైతం హై ఫ్రీక్వెన్సీ లాస్ సమస్య ఉత్పన్నమవుతోందని వైద్యులు చెబుతున్నారు. శబ్ద కాలుష్య నివారణతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. మాట బాగానే వినిపిస్తున్నప్పటికీ ఎదుటి వారు చెప్పేది సరిగా అర్థం కాకపోవడం, విద్యార్థులైతే క్లాసులో టీచర్ చెప్పే పాఠాలు అర్థం కాకపోవడం వంటివి జరుగుతాయి. చెవుల్లో సైరన్ మోగినట్లు ఉండటం, కళ్లు తిరగడం, తరచూ చెవినొప్పి, దిబ్బెడ పడినట్లు అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే ఈఎన్టీ వైద్య నిపుణుడిని తప్పక సంప్రదించాలి. ఐదేళ్లలో అంతా మారిపోయింది ఐదేళ్ల కిందట ఈ సమస్యలో 8-10 శాతం మంది ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం 15శాతం మంది హై ఫ్రీక్వెన్సీ లాస్‌తో బాధ పడుతుండగా, వారిలో చిన్నారులు ఐదుశాతం మంది ఉన్నారు. మూడేళ్లలో వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్డు, జంక్షన్లలో ఒక్కో సమయంలో 150 డెసిబుల్స్ శబ్దం వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్ల కిందట నగరంలోని రోడ్లపై వంద డెసిబుల్స్ శబ్దం మాత్రమే ఉండేది. ఇంత శబ్దం కలిగిన హారన్లు వాడటం నిషేధం అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు. సెల్ఫోన్లో రోజుకు గంటకు పైగా మాట్లాడే వారిలో సైతం ఈ సమస్య వస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన నగరంలో మూడు లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. 35వేల వరకు కార్లు ఉన్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మోటర్ బైక్‌లు, ఇతర ద్విచక్ర వాహనాలు 80 డెసిబుల్స్‌కు మించి హారన్ వినియోగించరాదు. కార్లు అయితే 82 డెసిబుల్స్, లారీలు, ఇతర భారీ వాహనాలు అయితే 85 నుంచి 92 డెసిబుల్స్ వరకు మాత్రమే వినియోగించాలి. అంతకుమించి వినియోగిస్తే చట్టరీత్యా నేరమైనా ఎవరూ పట్టించు కోవట్లేదని కచ్చితంగా తెలుస్తోంది. ఆడియోగ్రామ్తో నిర్ధారణ నగరవాసులు ఎక్కువగా హై ఫ్రీక్వె న్సీ లాస్, వెర్టిగో వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. హై ఫ్రీక్వెన్సీ లాస్ సమస్యను ఆడియోగ్రామ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తాం. ఈ పరీక్షలో ఆడియోగ్రామ్ 2000 కంటే తక్కువ ఉంటే హై ఫ్రీక్వెన్సీ లాస్‌గా గుర్తిస్తాం. దీనికి ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేదు. చికిత్స పొందితే సరిపోతుంది. ఇటీవల కాలంలో పిల్లల్లో సైతం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాహనాలు, ఎయిర్ హారన్లు, కంపెనీల్లో పెద్దపెద్ద శబ్దాలు వంటివి ఈ సమస్యకు కారణంగా చెప్పవచ్చు. -
గూబ గుయ్
భాగ్యనగరిలో పెరుగుతున్న శబ్ద కాలుష్యం దేశంలో గ్రేటర్‌ది రెండో స్థానం వినికిడి సమస్యలకు దారి తీస్తున్న వైనం బంజారాహిల్స్: శబ్ద కాలుష్యం... ప్రస్తుతం గ్రేటర్ సిటిజన్లను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఇదొకటి. నిత్యం ఎడతెరిపి లేకుండా హోరెత్తించే రణగొణ ధ్వనులు నగరజీవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటు వాహనాల శబ్దం... ఆపైన హారన్ల హోరు... జనం చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) విడుదల చేసిన జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక శబ్ద కాలుష్యం నమోదయ్యే ఎనిమిది మహా నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల నగరంలో శబ్ద కాలుష్యంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి వీరన్న ఈ వివరాలు వెల్లడించారు. ఈ జాబితాలో చెన్నై మొదటి స్థానంలో నిలవగా... తరువాత స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. చెన్నైకి... భాగ్యనగరికి మధ్య తేడా కూడా స్వల్పంగానే ఉండడం గమనార్హం. 2011లో ఫిబ్రవరి-జూన్ నెలల మధ్య హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ముంబయి, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, కోల్కత్తా తదితర నగరాల్లో శబ్ద కాలుష్యంపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. సాధారణంగా మనిషి వినే శబ్దం అవధి 52-72 డెసిబుల్స్ మధ్య ఉండాలి. ఈ పరిమితికి మించితే దాన్ని శబ్ద కాలుష్యంగా పేర్కొంటారు. దీంతో అనేక నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సీపీసీబీ నివేదిక ప్రకారం చెన్నైలో అత్యధికంగా సగటున 107 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం నమోదు కాగా... హైదరాబాద్‌లో 103 డెసిబుల్స్ ఉంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే అబిడ్స్, ప్యారడైజ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, పంజగుట్ట, చార్మినార్, జూపార్క్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. నష్టాలివే... వినికిడి అవధిని దాటి వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. ఇది స్థాయి మించితే చెవిలో రింగు రింగుమంటూ శబ్దాలు వినిపిస్తాయి. దీర్ఘకాలం ఈ శబ్దాలను విన్న వారికి శాశ్వత వినికిడి లోపం సంభవిస్తుంది. నిద్రలేమి, అలసట, రక్తనాళ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. రక్తపోటు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. చేసే పని మీద ఆసక్తి కోల్పోతారు. నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి లాంటివి 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరి బద్దలయ్యే ప్రమాదం ఉంటుంది. 90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు తాత్కాలిక, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు శాశ్వతంగా చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. అత్యధిక ధ్వనులు చిన్నపిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. నియంత్రణ ఇలా... కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం నిత్యం ఎనిమిది గంటల పాటు 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి. {sాఫిక్ రద్దీలో బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి. -
కాలుష్యం తగ్గిందోచ్!
పండగ సెలవుల్లో సిటీ ఖాళీ 50 శాతం తగ్గిన కాలుష్యం 15,16 తేదీల్లో గణనీయంగా తగ్గిన కాలుష్య ఉద్గారాలు శబ్ద కాలుష్యమూ తగ్గుముఖం వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కకపోవడమే కారణం ట్రాఫిక్ జంఝాటం... వాయు కాలుష్యంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యే దుస్థితి.. భరించలేని శబ్దాల నుంచి నగర వాసికి రెండు రోజుల పాటు ఉపశమనం లభించింది. సంక్రాంతికి గ్రేటర్ నుంచి సుమారు 20 లక్షల మంది పల్లె బాట పట్టారు. వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కడం గణనీయంగా తగ్గింది. దీంతో గ్రేటర్లో వాయు, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఈ నెల 15,16 తేదీల్లో కాలుష్య నియంత్రణ మండలి బృందాలు పంజగుట్ట, జూ పార్క్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్‌నగర్ ప్రాంతాల్లో వాయు కాలుష్య మోతాదును నమోదు చేశాయి. కాలుష్య కారకాలు సాధారణ రోజుల్లో కంటే ఈ తేదీల్లో కొన్ని చోట్ల సగానికి, మరి కొన్నిచోట్ల భారీగా తగ్గినట్లు పీసీబీ నివేదిక వెల్లడించింది. వరుస సెలవులతో మెజార్టీ సిటీజనులు వ్యక్తిగత వాహనాలను ఇళ్లలో పెట్టి... సొంత ఊళ్లకు వెళ్లడంతోకాలుష్యం గణనీయంగా తగ్గినట్లు పీసీబీ అధికారులు తెలిపారు. శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గడంతో నగర వాసులు ఉపశమనం పొందారు. గ్రేటర్‌లోని 6111 కి.మీ.ల రహదారులపై నిత్యం 40 లక్షల వాహనాలు (అన్ని రకాలు) రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇందులో సగం మాత్రమే రోడ్డెక్కడంతో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని పీసీబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ ధూళికణాల మోతాదు పంజగుట్టలో సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో 200 మైక్రోగ్రాములకు పైమాటే. ఈ నెల 15న కేవలం 85 మైక్రోగ్రాములే నమోదైంది. జూ పార్క్ వద్ద సాధారణ రోజుల్లో 220 మైక్రోగ్రాములు ఉంటుంది. కానీ 16న కేవలం 83 మైక్రోగ్రాములే నమోదైంది. సెంట్రల్ యూనివర్సిటీలో సాధారణం 103 మైక్రోగ్రాములు. ఈ నెల 16న 53 మైక్రోగ్రాములే ఉంది. సనత్‌నగర్‌లోనూ సాధారణంగా 212 మైక్రోగ్రాములు ఉంటుంది. కానీ ఈనెల 15న 106 మైక్రో గ్రాములు మాత్రమే నమోదైంది. సగానికి తగ్గిన శబ్ద కాలుష్యం సాధారణంగా 60 డెసిబుల్స్ శ్రావ్య అవధి దాటిన శబ్దాలు వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. నిత్యం వాహనాల రణగొణ ధ్వనులతో 80 డెసిబుల్స్ కన్నా అధిక శబ్దాలు వినే నగర జీవికి ఈ నెల 15,16 తేదీల్లో కాస్త ఉపశమనం లభిం చింది. అబిడ్స్ (వాణిజ్య ప్రాంతం)లో 71 డెసిబుల్స్, గచ్చిబౌలిలో 57, గడ్డపోతారం (పారిశ్రామికవాడ)లో 63.9, జీడిమెట్ల (పారిశ్రామికవాడ)లో 56, ప్యారడైజ్ (వాణిజ్య ప్రాం తం)లో 72, పంజగుట్ట (వాణిజ్య ప్రాంతం)లో 73.3, తార్నాక(నివాస)లో 54.2, జూ పార్క్(నిశ్శబ్ద) ప్రాంతంలో 52.3 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం నమోదైంది. దీంతో సిటీ జనులకు పండగ పూట ప్రశాంతంగా గడిపే అవకాశం దక్కింది. బెంజీన్ కల్తీ ఇంధనాల నుంచి వెలువడే క్యాన్సర్ కారక బెంజీన్ మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు మించరాదు. కానీ పంజగుట్టలో సాధారణ రోజుల్లో 5 మైక్రోగ్రాములకు పైబడే ఉంటుంది. పండగ రోజున మా త్రం 2.85 మైక్రోగ్రాములే ఉంది. జూపార్క్ వద్ద సాధార ణం 4.5 మైక్రోగ్రాములు కాగా... ఈ నెల 16న 4 మైక్రోగ్రాములకు పరిమితమైంది. సెంట్రల్ వర్సిటీ వద్ద సాధారణ రోజుల్లో 2.2 మైక్రోగ్రాములు. 16న 1 మైక్రోగ్రామ్ మాత్రమే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో 5.1 మైక్రోగ్రాములు కాగా... 16న 3.3 మైక్రోగ్రాములే ఉంది. కార్బన్ మోనాక్సైడ్ బ్రాంకైటిస్‌కు కారణమయ్యే కార్బన్ మోనాక్సైడ్ మోతా దు పంజగుట్టలో సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో 2.2 మైక్రోగ్రాములుగా నమోదవుతుంది. ఈ నెల 16న 1.53 మైక్రోగ్రాములుగా నమోదైంది. జూ పార్క్‌లో సాధారణం 2.20 మైక్రోగ్రాములు. పండగ వేళ 1.15కు తగ్గింది. సెంట్రల్ వర్సిటీ వద్ద సాధారణంగా 1.1 ఉంటుంది. ఈ నెల16న 0.46 మైక్రోగ్రాములకు పడిపోయింది. సనత్‌నగర్‌లో సాధారణంగా 1.19 మైక్రోగ్రాములు నమోదవుతుంది. ఈ నెల 16న 0.58కి తగ్గింది. నైట్రోజన్ డయాక్సైడ్ శ్వాస కోశ వ్యాధులకు కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో సాధారణ రోజుల్లో పంజగుట్టలో 120 మైక్రోగ్రాములు ఉంటుంది. పండగ రోజున 48 మైక్రోగ్రాములకు తగ్గింది. జూ పార్క్ వద్ద సాధారణం 121 మైక్రోగ్రాములు కాగా...15న 71 మైక్రోగ్రాములకే పరిమితమైంది. సెంట్రల్ వర్సిటీ వద్ద 101 మైక్రోగ్రాములకు ఈనెల 16న 80 మైక్రోగ్రాములే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో 120 మైక్రోగ్రాములు ఉంటుంది. 16న కేవలం 39 మైక్రోగ్రాములే నమోదైంది. 15, 16 తేదీల్లో కాలుష్య కారకాల మోతాదు... దుమ్ము, ధూళి కణాలు (పీఎం10): పంజగుట్టలో సాధారణ రోజుల్లో దుమ్ము, ధూళి కణాల (పీఎం10) మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో 234 మైక్రోగ్రాములు ఉంటుంది. ఈ నెల 15,16 తేదీల్లో మాత్రం 121 మైక్రోగ్రాములే నమోదైంది. జూ పార్క్ వద్ద సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో ధూళి కణాల మోతాదు 320 మైక్రోగ్రాములు. ఈ నెల 16న కేవలం 164 మైక్రోగ్రాములే నమోదైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద సాధారణ రోజుల్లో 200 మైక్రోగ్రాముల పీఎం 10 నమోదవుతుంది. 16న కేవలం 99 మైక్రోగ్రాములే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో పీఎం10 మోతాదు 250 మైక్రోగ్రాములు. 15న మాత్రం 101 మైక్రోగ్రాములే నమోదైంది. -
ధనాధన్..
దీపావళికి గ్రేటర్లో పెరిగిన శబ్ద కాలుష్యం అత్యధికంగా ప్రగతినగర్‌లో 85 డెసిబుళ్లు నమోదు వివరాలు సేకరించిన పీసీబీ వాయు కాలుష్యంలో మనది మూడో స్థానం సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగ ర్: దీపావళి ఢాం..ఢాం శబ్దాలు సిటీజనుల గూబ గుయ్మనిపించాయి. గత ఏడాదితో పోలిస్తే మహానగరంలో శబ్ద కాలుష్య స్థాయి నాలుగు డెసిబుళ్లు అధికంగా నమోదైంది. నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో దీపావళి రోజున వెలువడిన శబ్ద కాలుష్య ప్రమాణాలను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) శుక్రవారం విడుదల చేసింది. అబిడ్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, తార్నాక, ప్యారడైజ్, జీడిమెట్ల, జూ పార్క్, పంజగుట్ట, జూబ్లీహిల్స్, ప్రగతినగర్, ఉప్పల్ ప్రాంతాల్లో కంటిన్యూ యాంబియంట్ సౌండ్ మెజర్మెంట్ పరికరాల ద్వారా దీపావళి రోజున (గురువారం) సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 6 గంటల వరకు ధ్వని కాలుష్య ప్రమాణాలను నమోదు చేశారు. నివాస ప్రాంతాల్లోనే టపాసుల మోతతో ఎక్కువ శబ్దాలు వెలువడినట్లుగా పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగర శివారుల్లోని ప్రగతినగర్ (కూకట్పల్లి జేఎన్టీయూ ఎదురుగా)లో అత్యధికంగా 85.5 డెసిబుళ్ల ధ్వని కాలుష్యం నమోదైంది. అబిడ్స్‌లోనూ ఈసారి బాణసంచా పేలుళ్లు 82 డెసిబుళ్ల శబ్దంతో శ్రుతిమించాయి. సాధారణంగా 55 డెసిబుళ్ల కంటే అధిక శబ్దాలు వింటే మనుషులు వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో టపాసుల మోతతో శబ్ద కాలుష్యం అంతకంటే అధికంగా నమోదైంది. ఉప్పల్‌లో 77.6 డెసిబుళ్లు, ప్యారడైజ్, పంజగుట్ట, కూకట్‌పల్లిలో 69 డెసిబుళ్లు, జీడిమెట్లలో 60, జూ పార్క్‌లో 56, తార్నాక, జూబ్లీహిల్స్‌లో 53, గచ్చిబౌలిలో 52 డెసిబుళ్లశబ్ద కాలుష్యం నమోదైంది. గత ఏడాది దీపావళి రోజున గ్రేటర్ పరిధిలో సగటున 71 డెసిబుళ్ల ధ్వని కాలుష్యం నమోదు కాగా.. ఈసారి 75 డెసిబుళ్లకు చేరుకుంది. అంటే నాలుగు డెసిబుళ్లు పెరిగిందన్నమాట. వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో పేలని టపాసులు పీసీబీ గణాంకాలను బట్టి చూస్తే వాణిజ్య ప్రాంతాల్లో దీపావళి టపాసుల మోత అంతగా లేదని తేలింది. అబిడ్స్ మినహా మిగిలిన వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో శబ్ద కాలుష్య ప్రమాణాలు మోస్తరుగానే నమోదయ్యాయి. ప్యారడైజ్ ప్రాంతంలో గత ఏడాది సగటున 82 డెసిబుల్స్ నమోదు కాగా, ఈసారి 69కి తగ్గింది. పంజగుట్ట చౌరస్తాలో సైతం శబ్ద కాలుష్యం తక్కువగానే నమోదైనట్లు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన ఉప్పల్‌లో రెండు డెసిబుల్స్ తగ్గింది. గత ఏడాది సగటున 79 డెసిబుల్స్ ఉండగా, ఈ ఏడాది 77.6కు తగ్గింది. నిశ్శబ్ద జోన్లలోనూ మోత నిశ్శబ్ద మండలం (సెలైంట్ జోన్)గా పరిగణించే గచ్చిబౌలి, జూ పార్క్ ప్రాంతాల్లో సాధారణంగా ధ్వని కాలుష్యం రాత్రి వేళల్లో 40 డెసిబుళ్లు మించరాదు. దీపావళి రోజున జూ పార్క్ వద్ద 56, గచ్చిబౌలిలో 52 డెసిబుళ్ల శబ్ద కాలుష్యం నమోదవడం గమనార్హం. ఈ మోతతో జూ పార్క్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న వన్యమృగాల జీవనశైలిలో పెనుమార్పులు వచ్చే ప్రమాదం ఉందని వెటర్నరీ వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. మనది మూడో స్థానం మెట్రో నగరాలతో పోలిస్తే వాయు కాలుష్యంలో గ్రేటర్ నగరం మూడో స్థానంలో నిలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సాధారణ రోజులతో పోలిస్తే తొమ్మిది రెట్లు పెరిగిందని వాతావరణ శాఖ అంచనా. బాణసంచా పేలుళ్లతో నైట్రోజన్ డై ఆక్సైడ్,సల్ఫర్ డైఆక్సైడ్ వాయువులు గాలిలో విపరీతంగా కలిసిపోయాయి. ఊపిరితిత్తులకు పొగబెట్టే ఈ కాలుష్య కారకాలు ఒక క్యూబిక్ మీటరు గాలిలో సుమారు 531 మైక్రోగ్రాములకు చేరడం గమనార్హం. చెన్నైలో క్యూబిక్ మీటరు గాలిలో కాలుష్య కారకాలు 320 మైక్రోగ్రాములు, గ్రేటర్లో క్యూబిక్ మీటరు గాలిలో 302 మైక్రోగ్రాములు, బెంగళూరులో 239 మైక్రోగ్రాములకు చేరినట్లు అంచనా వేస్తున్నాయి. వాయు కాలుష్య కారకాల వారీగా పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపాయి. -
చెవి తట్టుకోలేదు
* టపాసుల మోతతో అనర్ధం * ప్రజల్లో అవగాహన పెరగాలి * గ్రెటర్‌లో పెరుగుతున్న శబ్దకాలుష్యం * కర్ణభేరికి ప్రమాదం సనత్‌నగర్: దీపావళి.... వెలుగు దివ్వెల పండుగ.. ఆకాశంలో రంగుల హరివిల్లులను ఆవిష్కరించే కాంతుల పండుగ..చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందడోలికల్లో మునిగిపోయే పండుగ..ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. వాయు, శబ్దకాలుష్యంతో ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు శాస్త్రవేత్తలు. ప్రధానంగా శబ్దకాలుష్యం ఎన్నో అనర్ధాలకు కారణమవుతోంది. కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. గ్రేటర్ పరిధిలో కొన్నేళ్లుగా టపాసుల మోతతో వెలువడే శబ్దాల రికార్డులను విశ్లేషిస్తే ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి. 2006లో రియల్ఎస్టేట్ బూమ్ పుణ్యమా అని నగరంలో టపాసుల మోత మోగింది. ఆ తరువాత క్రమేపీ 2011 వరకు చప్పుళ్లు తగ్గుముఖం పట్టాయి. తిరిగి రెండేళ్లుగా భారీ శబ్దం వెలువడే టపాసుల పేలుళ్లతో శబ్ద కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. 2006-11 వరకు దీపావళి పండుగ వేళల్లో వాయు కాలుష్య స్థాయి విపరీతంగా పెరిగినట్లు పీసీబీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 2012, 2013 సంవత్సరాల్లో దీపావళి సీజన్లో కాలుష్య స్థాయి అనూహ్యంగా పెరిగింది. నిర్దేశిత డెసిబల్స్ కంటే రెట్టింపు స్థాయిలో ధ్వని కాలుష్య ప్రమాణాలు నమోదయ్యాయి. ఈ తీవ్రత ఆరోగ్యానికి చేటు అంటున్నారు పీసీబీ శాస్త్రవేత్తలు. ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన పెరిగితేనే తప్ప శబ్ద కాలుష్యాన్ని నివారించలేమంటున్నారు నిపుణులు శబ్ద కాలుష్యం వల్ల కలిగే అనర్ధాలివే.. ► ఏకధాటిగా వెలువడే అధిక శబ్దాల కారణంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ప్రమాదకరం. ► చిన్న పిల్లల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. చెవిటి వారిగా మారే అవకాశం కూడా ఉంది. ► అధిక రక్తపోటు, తలనొప్పి బాధితులకు చికాకు కలిగిస్తుంది. ► గాలిలో దట్టమైన పొగ వెలువడడం ద్వారా వృద్ధులు, చిన్న పిల్లల్లో శ్వాస కష్టమవుతుంది. ► బ్రాంకైటిస్, సైనసైటిస్, న్యూమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. ► పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు వంటివి భారీ శబ్దాలకు బెదిరిపోతాయి. వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ► పక్షులకు ఎంతో హానికరం. ఒక్కోసారి అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తలు.. ► ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు తక్కువ స్థాయిలో ధ్వనులు వెలువరించే టపాసులను కాల్చి...సాయంత్రం వెలుగులు ఇచ్చే టపాసులకు ప్రాధాన్యం ఇవ్వాలి ► దీపావళి ధ్వని కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. శబ్ద కాలుష్యం వల్ల కలిగే నష్టాలను తెలియపరచాలని టీఎస్‌పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్ పేర్కొన్నారు.