వైల్డ్‌బోర్, కాక్‌టైల్ షార్మర్, డాల్ఫిన్, మెగాఫోన్, టెయిల్ గన్నర్.. ఈ పేర్లు ఏంటో తెలుసా? బైక్‌లకు అమర్చే సైలెన్సర్లు. ధర అధికం.. వచ్చే శబ్దం కర్ణ కఠోరం.. ఆరోగ్యానికి హానికరం.. వీటి వాడకం చట్ట విరుద్ధం.. పట్టుబడితే అపరాధం... తీరు మారకుంటే శిక్ష ఖాయం. సరికొత్త సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దానికి యువత ఆకర్షితులవుతున్నారు. విభిన్నశబ్దంతో రోడ్డెక్కి, చుట్టుపక్కలవారి గుండెల్లో అలజడి రేపుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
చిత్తూరు అర్బన్: ఈ మధ్య రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లుపడే శబ్దంతో వెళుతున్న ద్విచక్రవాహనాలు ఎక్కువయ్యాయి. ఇందులో యమహా నుంచి బుల్లెట్, కేటీఎం వంటి రేస్ బైక్‌లున్నాయి. కంపెనీ నుంచి కొనేప్పుడు వాహనాలకు ఉన్న సైలెన్సర్లు(పొగ గొట్టాలు) తొలగించి, ఆ స్థానంలో వారికి నచ్చిన శబ్దాన్ని వెలువరించే గొట్టాలను అమర్చుతున్నారు. ఈ బైక్‌లు చేసే శబ్దంతో రోడ్లపై వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు.
అడవి పంది తరహాలో శబ్దం చేస్తే, వైల్డ్‌బోర్ ఎగ్జాస్ట్. తుపాకీలా గిర్రున తిరుగుతూ శబ్దం వెలువరిస్తే ‘టెయిల్ గన్నర్’. ఇవే కాదు.. బ్యారెల్, గ్రీసెస్, మెగాఫోన్, కాక్‌టైల్ షార్మర్, ఇండోరి, పంజాబీ, డాల్ఫిన్, ఆర్‌ఆర్‌ఓ వంటి స్పేర్ పార్ట్స్ పేరిట సైలెన్సర్లు చేస్తున్న అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఒక్కో సైలెన్సర్ ధర రూ.10వేల నుంచి రూ.23వేలకు పైనే. వీటిని అమర్చేందుకు మెకానిక్ రూ.3వేల వరకు వసూలు చేస్తుండడం గమనార్హం.
వింటున్నారా..?
బుల్లెట్ దర్జాకు ప్రతీక.. కేటీఎం బైక్ కుర్రకారు క్రేజ్. పాతబడ్డ యమహా ఆర్‌ఎక్స్–100 వాహనాలకు రంగులద్ది రోడ్లపై తిప్పుతున్నారు. ఈ వాహనాల సైలెన్సర్లలో కొద్దిపాటి మార్పు చేస్తే అది వెలువరిచే శబ్దం ప్రత్యేకం. ఎదుటివారి ఇబ్బందులు పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతుండటం రోత పుట్టిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా ప్రతి మోటారు వాహనం నిర్ణీత డెసిబెల్స్ శబ్దాన్ని వెలువరించేలా సైలెన్సర్‌ను తీర్చిదిద్దుతారు. అలాంటి డిజైన్లకే రవాణా శాఖ అనుమతిస్తుంది. మనిషి సాధారణంగా 60 డెసిబెల్స్ శబ్దం వరకు వినగలడు. అంతకు మించిన శబ్దం వింటే కర్ణభేరిపై ప్రభావం చూపి వినికిడి లోపం ఏర్పడుతుంది.
చట్టంలో ఏముంది..?
ఒక వాహనం నిర్ణీత డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం సృష్టిస్తే అది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం. నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనంపై ఎంవీఐ యాక్టు 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణాశాఖ అధికారులు కేసు నమోదు చేయవచ్చు. సంబంధిత వాహనచోదకుడికి రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తారు. మళ్లీ రెండోసారి శబ్ద కాలుష్యానికి కారణమైతే రూ.2వేల వరకు జరిమానా విధిస్తారు. మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు పెట్టవచ్చు. కొందరు కంపెనీ సైలెన్సర్లు తీసేస్తుంటే, మరికొందరు ఫిల్టర్లను తీసేస్తున్నారు. దీని వల్ల శబ్ద తీవ్రత పెరుగుతోంది.
మార్పు మొదలు..
ఈ పరిణామాలను అడ్డుకునే దిశగా చిత్తూరు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇటీవల నగరంలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు దాదాపు 120 వరకు వాహనాలను సీజ్ చేశారు. వాహన యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి, మెకానిక్ ద్వారా సైలెన్సర్లను మార్పుచేసిన తరువాత వాహనాలను అప్పగించారు. గతంలో ఈ తరహా చర్యలు చేపట్టిన తిరుపతి పోలీసులు కొద్దిరోజుల తరువాత దాన్ని విస్మరించారు. ఫలితంగా ద్విచక్ర వాహన ఆకతాయిల శబ్దాలు మళ్లీ మామూలైపోయాయి.
శబ్దం పెరిగేకొద్దీ ఇబ్బందే..
మనం వింటున్న శబ్ద తీవ్రత పెరిగే కొద్దీ జబ్బులు ఖాయమంటున్నారు వైద్యనిపుణులు.
∙100 డెసిబెల్స్ దాటితే : గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది
∙120 డెసిబెల్స్ దాటితే : చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది.
∙110 డెసిబెల్స్ దాటితే : చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది.
∙160 డెసిబెల్స్ దాటితే : చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతిని పాక్షిక వైకల్యం
ఏర్పడుతుంది.
∙190 డెసిబెల్స్ దాటితే : కర్ణభేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపు స్థితికి తీసుకురావడం చాలా కష్టం.
వినికిడి లోపం.. మానసిక రోగాలు
శబ్ద తరంగాలు చెవి సామ ర్థ్యం కంటే ఎక్కువ వింటే శారీరక, మానసిక వ్యాధులు వస్తాయి. చెవిలోని నరాలు దెబ్బతిని వినికిడి వ్యవస్థకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఫలితంగా శాశ్వతంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. దీంతో పాటు మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది.
– పాల్‌రవికుమార్, చెవి వైద్య నిపుణులు, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి
చట్టరీత్యా చర్యలు
ఎక్కువగా 18 ఏళ్లలోపు మగపిల్లలు వాడుతుండడంతో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చకుండా తల్లిదండ్రులు ఇంటి నుంచే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మెకానిక్‌లు ఇష్టానుసారంగా సైలెన్సర్లను మార్పు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం.
– ఎన్.సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment