- నగరంలో పెరిగిపోతున్న వాహనాలు
- భారీగా శబ్దకాలుష్యం
- హై ఫ్రీక్వెన్సీ లాస్, వెర్టిగో సమస్యతో బాధపడుతున్న నగరవాసులు
లబ్బీపేట : నగరాన్ని మాయదారి జబ్బులు పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికే కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న సిటీవాసులు రణగొనధ్వనులతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. శబ్దకాలుష్యం కారణంగా నగరంలో 15శాతం మంది ైెహ ఫ్రీక్వెన్సీ లాస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. వాహనాల ఎయిర్ హారన్ల నుంచి వచ్చే అత్యధిక డెసిబుల్స్ సౌండ్‌తోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీనిని తొలిదశలో గుర్తించలేక కొంతమంది తీవ్రమైన వినికిడి లోపానికి గురవుతున్నారు. నగరంలోని పదిశాతం మందిలో చిన్నప్పుడు సరదాగా కొట్టుకోవడం, క్రీడలు, ప్రమాదాల్లో గాయాల కారణంగా, మరో పదిశాతం మంది వెర్టిగో (కళ్లు తిరగడం) వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
హై ఫ్రీక్వెన్సీ లాస్‌కు కారణాలివే..
మనిషి సాధారణంగా 80 డెసిబుల్స్ శబ్దం మాత్రమే వినగలుగుతాడు. అంతకు మంచి శబ్దం వింటే సమస్యలు తలెత్తుతాయి. నగరంలోని వాహనాల ఎయిర్ హారన్లు 120 డెసిబుల్స్ ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కుర్రకారు వాడే బైక్‌ల వింత హారన్లు కూడా అధిక డెసిబుల్స్ శబ్దాన్ని విడుదల చేస్తున్నాయి. ఇలాంటి ఎయిర్ హారన్ల శబ్దాలు, వాహనాల రణగొన ధ్వనులు నిత్యం వినడం వల్ల చిన్నారుల్లో సైతం హై ఫ్రీక్వెన్సీ లాస్ సమస్య ఉత్పన్నమవుతోందని వైద్యులు చెబుతున్నారు. శబ్ద కాలుష్య నివారణతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. మాట బాగానే వినిపిస్తున్నప్పటికీ ఎదుటి వారు చెప్పేది సరిగా అర్థం కాకపోవడం, విద్యార్థులైతే క్లాసులో టీచర్ చెప్పే పాఠాలు అర్థం కాకపోవడం వంటివి జరుగుతాయి. చెవుల్లో సైరన్ మోగినట్లు ఉండటం, కళ్లు తిరగడం, తరచూ చెవినొప్పి, దిబ్బెడ పడినట్లు అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే ఈఎన్‌టీ వైద్య నిపుణుడిని తప్పక సంప్రదించాలి.
ఐదేళ్లలో అంతా మారిపోయింది
ఐదేళ్ల కిందట ఈ సమస్యలో 8-10 శాతం మంది ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం 15శాతం మంది హై ఫ్రీక్వెన్సీ లాస్‌తో బాధ పడుతుండగా, వారిలో చిన్నారులు ఐదుశాతం మంది ఉన్నారు. మూడేళ్లలో వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్డు, జంక్షన్లలో ఒక్కో సమయంలో 150 డెసిబుల్స్ శబ్దం వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్ల కిందట నగరంలోని రోడ్లపై వంద డెసిబుల్స్ శబ్దం మాత్రమే ఉండేది. ఇంత శబ్దం కలిగిన హారన్లు వాడటం నిషేధం అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు. సెల్‌ఫోన్‌లో రోజుకు గంటకు పైగా మాట్లాడే వారిలో సైతం ఈ సమస్య వస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనల ఉల్లంఘన
నగరంలో మూడు లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. 35వేల వరకు కార్లు ఉన్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మోటర్ బైక్‌లు, ఇతర ద్విచక్ర వాహనాలు 80 డెసిబుల్స్‌కు మించి హారన్ వినియోగించరాదు. కార్లు అయితే 82 డెసిబుల్స్, లారీలు, ఇతర భారీ వాహనాలు అయితే 85 నుంచి 92 డెసిబుల్స్ వరకు మాత్రమే వినియోగించాలి. అంతకుమించి వినియోగిస్తే చట్టరీత్యా నేరమైనా ఎవరూ పట్టించు కోవట్లేదని కచ్చితంగా తెలుస్తోంది.
ఆడియోగ్రామ్‌తో నిర్ధారణ
నగరవాసులు ఎక్కువగా హై ఫ్రీక్వె న్సీ లాస్, వెర్టిగో వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. హై ఫ్రీక్వెన్సీ లాస్ సమస్యను ఆడియోగ్రామ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తాం. ఈ పరీక్షలో ఆడియోగ్రామ్ 2000 కంటే తక్కువ ఉంటే హై ఫ్రీక్వెన్సీ లాస్‌గా గుర్తిస్తాం. దీనికి ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేదు. చికిత్స పొందితే సరిపోతుంది. ఇటీవల కాలంలో పిల్లల్లో సైతం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాహనాలు, ఎయిర్ హారన్లు, కంపెనీల్లో పెద్దపెద్ద శబ్దాలు వంటివి ఈ సమస్యకు కారణంగా చెప్పవచ్చు.
చెవికి చిల్లు
Published Mon, May 18 2015 4:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement