విండ్సర్ ప్యాలెస్‌లో దొంగలు పడ్డారు
దర్జాగా ట్రక్కు, స్కూటర్ ఎత్తుకెళ్లారు
నెల రోజుల తర్వాత వెలుగులోకి
బ్రిటన్‌లో రాజు గారింట్లో దొంగలు పడ్డారు! రాజు చార్లెస్–3 దంపతులకు చెందిన విండ్సర్ రాజప్రాసాదంలో ఒక పికప్ ట్రక్కును, బైకును ఎత్తుకెళ్లారు. గత అక్టోబర్ 13న అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఉదంతాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ సన్ తాజాగా బయటపెట్టింది. ‘‘ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆరడుగుల ఫెన్స్‌ను దూకి మరీ ప్యాలెస్ లోనికి పవ్రేశించారు. దొంగిలించిన ట్రక్కుతోనే సెక్యూరిటీ గేట్‌ను బద్దలు కొట్టి మరీ దర్జాగా ఉడాయించారు’’ అని తెలిపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాసాదంలోకి దొంగలు సులువుగా ప్రవేశించడమే గాక సెక్యూరిటీ సిబ్బంది కన్నుగప్పి ఏకంగా వాహనాలనే ఎత్తుకుపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రాసాదం పరిధిలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయతి్నస్తే వెంటనే అలారం మోగుతుంది. చోరీ జరిగిన రోజు అలారం, ఇతర రక్షణ వ్యవస్థలన్నీ ఏమయ్యాయన్నది అంతుచిక్కడం లేదు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లండన్‌కు పాతిక మైళ్ల దూరంలో బెర్క్‌షైర్‌లో ఉండే విండ్సర్ క్యాజిల్‌లో రాజ దంపతులు వారానికి రెండు రోజులు బస చేస్తారు. యువరాజు విలియం, కేట్ దంపతులు కూడా తమ పిల్లలతో కలిసి దాని ఆవరణలోని అడెలైడ్ కాటేజీలోనే నివాసముంటారు.
చోరీ జరిగినప్పుడు రాజ దంపతులు భవనంలో లేకున్నా విలియం దంపతులు తమ కాటేజీలోనే ఉన్నట్టు సమాచారం. దొంగలు బద్దలు కొట్టుకుని ఉడాయించిన గేటు గుండానే రాజ దంపతులు రాకపోకలు సాగుతాయని చెబుతున్నారు. ఈ ఉదంతంపై స్పందించేందుకు బకింగ్‌హాం ప్యాలెస్ నిరాకరించింది. బ్రిటన్ రాజ దంపతులతో పాటు రాజ కుటుంబీకులకు సొంత పోలీసు భద్రతా వ్యవస్థ ఉంటుంది. వారి భద్రతపై ఏటా కోట్లాది రూపాయలు వెచి్చస్తారు.
గతంలో ఎలిజబెత్‌పై హత్యాయత్నం
విండ్సర్ క్యాజిల్‌లో భద్రతా లోపాలు తలెత్తడం ఇది తొలిసారేమీ కాదు. 2021లో ఈ ప్రాసాదంలోనే రాణి ఎలిజబెత్–2పై హత్యా యత్నం జరిగింది. ఒక సాయుధుడు క్రిస్మస్ రోజు ఏకంగా ఫెన్సింగ్ దూకి లోనికి చొరబడ్డాడు. సునాయాసంగా రాణిని సమీపించాడు. అతన్ని చూసి భయంతో ఆమె చాలాసేపు కేకలు వేసినట్టు చెబుతారు. చివరికి భద్రతా సిబ్బంది దుండగున్ని బంధించడంతో ముప్పు తప్పింది. అప్పట్లో రాణి విండ్సర్‌లోనే నివాసముండేవారు. సాయుధుడు అంత సులువుగా రాణి సమీపం దాకా వెళ్లగలగడం, పైగా ఆ సమయంలో దగ్గర్లో భద్రతా సిబ్బంది లేకపోవడం అప్పట్లో చాలా అనుమానాలకు తావిచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment