సాక్షి, ముంబై : కాలుష్యపు కోరల్లో చిక్కుకుని నగరం విలవిల్లాడుతోంది. ముఖ్యంగా విపరీతంగా పెరిగిన ధ్వని కాలుష్యం వల్ల చెవుడు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో తేరుకున్న మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నగరంలో కీలకమైన 1,200 చోట్ల ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏ కంపెనీ బీఎంసీకి దొరకడం లేదు. పరిపాలన విభాగం ఆందోళనలో పడిపోయింది. రోజురోజుకూ అనేక రకాల కాలుష్యాలతోపాటు ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
సెలైన్స్ జోన్‌లోనూ యథాతథం
నగరంలో విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులున్న ప్రాంతాలను రెండు సంవత్సరాల కిందట హై కోర్టు ‘సెలైన్స్ జోన్’ గా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో పరిస్థితులు యథాతథంగా ఉన్నాయి. కొన్ని సార్వజనిక ఉత్సవాలను నియంత్రించారు. వాహనాల నుంచి వెలువడే ధ్వని కాలుష్యం ఏ మాత్రం తగ్గలేదు. నియమాల ప్రకారం సెలైన్స్ జోన్ ప్రకటించిన ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి. అందుకు నగరంలో అధ్యయనం చేయగా 1,200 చోట్ల ధ్వని కాలుష్యన్ని కచ్చితంగా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ఉపాయాన్ని ఆలోచించేందుకు సలహాదారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రకాశ్ పాటిల్ చెప్పారు. రెండు సార్లు టెండర్లను ఆహ్వానించినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆసక్తి కనబర్చ లేదు.
ఎమ్మెమ్మార్డీయే ఆధ్వర్యంలో..
ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) కొద్ది రోజుల కిందట పవయి. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసరాల్లో ధ్వని కాలుష్య నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసింది. అప్పట్లో ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులున్న ప్రాంతాల్లో వేగ నియంత్రణ (స్పీడ్ బ్రేకర్స్) ఏర్పాటు చేసింది. వీటివల్ల కొంత శాతమే నియంత్రించగలిగారు. పూర్తగా అరికట్టేందుకు బీఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ నగరంలో ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పెరిగిన వాహనాల సంఖ్య
నగరంలో విపరీతంగా పెరిగిపోయిన వాహనాల సంఖ్యవల్ల ధ్వని కాలుష్యం కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అస్పత్రులున్న చోట వాహనాలకు అనుమతివ్వక పోవడం, కొన్ని కీలకమైన రహదారులపై భారీ వాహనాలకు నిషేధించడం, నో హార్న్ జోన్‌గా ప్రకటించడం లాంటి ప్రయత్నాలు చేసింది. అవికూడా అనుకున్నంతమేర ఫలితాలివ్వలేకపోయాయి. త్వరలో నియమించనున్న సలహదారుల కమిటీ సూచనల ప్రకారం స్వయంగా ఆ ప్రాజెక్టు చేపట్టాలని యోచిస్తున్నట్లు పాటిల్ చెప్పారు.
అరికట్టేదెలా?
Published Thu, Jul 10 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement
Advertisement