సాక్షి, ముంబై: దీపావళి రోజున ముంబైలో శబ్ద కాలుష్యం తక్కువ స్థాయిలో నమోదైంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టాడానికి నగరంలో పటాకులు, బాణసంచా బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బాణాసంచా కాల్చేందుకు బాంబే హైకోర్టు అనుమతులు ఇచ్చింది. అటు బృహణ్ ముంబై చర్యలు, ఇటు హైకోర్టు సూచనలతో దీపావళి నాడు శబ్ద కాలుష్యం అత్యల్ప స్థాయిలో నమోదైందని ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీవో తెలిపింది. ఎన్‌జీఓ వ్యవస్థాపకురాలు సుమైరా అబ్దులాలి ఆదివారం ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. ‘దీపావళి రోజున ముంబై నగరంలో అత్యల్ప స్థాయిలో శబ్ద కాలుష్యం నమోదైంది. బాణాసంచా కాల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను అమలుచేయడం, జనాల్లో అవగాహన రావడంతోనే ఇది సాధ్యమైంది. చదవండి: ఢిల్లీకి కాలుష్యం కాటు
దీపావళి సందర్భంగా ఈ ఏడాది నమోదైన ధ్వని తీవ్రత గత 15 ఏళ్లలో కనిష్ట స్థాయిలో ఉంది. నగరంలోని సైలెన్స్ జోన్ శివాజీ పార్క్ మైదానంలో రాత్రి 10 గంటలకు వరకు పటాకులను పేల్చడానికి ఇచ్చిన గడువులో 105.5 డెసిబెల్ నమోదైంది. ముంబైలో గరిష్టంగా ధ్వని తీవ్రత 2019 లో 112.3 డెసిబెల్స్, 2018 లో 114.1 డెసిబెల్స్, 2017 లో 117.8 డెసిబెల్స్ నమోదైంది. అయితే, శివాజీ పార్క్ వద్ద చాలా మంది ప్రజలు మాస్కులు ధరించకుండానే పండగ జరుపుకోవడం ఆందోళన కలిగిస్తోంది’అని పేర్కొన్నారు. ఏదేమైనా ముంబై నగరం మొత్తంలో ధ్వని తీవ్రతను కచ్చితంగా లెక్కకట్టడం సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment