సాక్షి, ముంబై: రెండున్నరేళ్ల తర్వాత కరోనా మహమ్మారి నుంచి ముంబై నగరం బయటపడింది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ క్రమేణా తగ్గుముఖం పడుతూ వస్తోంది. ప్రస్తుతం ముంబైలో 948 కరోనా బాధితులున్నారు. అందులో 93% బాధితులకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. అంతేగాకుండా ఒక్క యాక్టివ్ కేసు లేదు. ఏ రోగి ఆరోగ్యం ప్రమాదకరంగా లేదు. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఏకంగా రెండున్నరేళ్ల తర్వాత కరోనా వైరస్ నుంచి విముక్తి లభించడం కొంత ఊరటనిస్తోంది. రెండేళ్ల కిందట యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు అనేక దేశాల్లో కనిపించకుండా పోయింది.
అయినప్పటికీ కొన్ని దేశాలను ఇంకా భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. అనేకదేశాలు, నగరాలు, పట్టణాలకు ఇప్పటికీ కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభించలేదు. 2020 మార్చిలో కరోనా వైరస్ పడగవిప్పడంతో కేంద్రప్రభుత్వం దేశమంతటా లాక్‌డౌన్ అమలు చేసింది. అప్పటినుంచి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కార్పొరేషన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడంవల్లే కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చింది. ఫలితంగా నేడు దేశ ప్రజలందరు స్వేచ్ఛగా, మాస్క్ లేకుండా ధైర్యంగా తిరుగుతున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రధాన నగరాలలో అడపాదడపా కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి.
కానీ, ఆ కేసులు గతంతో పోలిస్తే అంత ప్రమాదకరంగా లేవు. దీంతో ప్రభుత్వ, కార్పొరేషన్‌కు చెందిన ఆరోగ్య శాఖలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రస్తుతం ముంబైలో ప్రతీరోజు 5–6 వేల వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో సుమారు 100–150 వరకు కరోనా సోకిన బాధితులు ఉంటున్నారు. కానీ, వారి పరిస్థితి నిలకడగానే ఉంటూ, ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని నివేదికలు చెబుతున్నాయి. నగరంలో ముఖ్యంగా బీఎంసీకి చెందిన ఈ–వార్డు భైకళ, సీ–వార్డు శ్యాండ్రస్ట్ రోడ్ ప్రాంతాలు కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందాయి. మిగతా వార్డుల్లో అక్కడక్కడా రోగులున్నప్పటికీ వారి పరిస్థితి నిలకడగానే ఉందని బీఎంసీ నివేదిక స్పష్టం చేసింది. దీన్నిబట్టి ఏకంగా రెండున్నరేళ్ల తర్వాత ముంబై కరోనా ప్రమాదం నుంచి బయటపడిందని స్పష్టమైతోంది.
కరోనా రోగుల గణాంకాలు...
►ఇప్పటివరకు గుర్తించిన మొత్తం రోగులు: 11,51,776.
►కరోనా నుంచి విముక్తి పొందిన వారి సంఖ్య: 11,31,091
►కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య: 11,937
►తాజా పెరిగిన కరోనా రోగులు: 00.11%.
Comments
Please login to add a commentAdd a comment