
మాస్క్ ధరించడంతో సహా అన్ని ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది..
ముంబై: కొవిడ్ నిబంధన విషయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి ఏం కాదని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1, శుక్రవారం నుంచి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మాస్క్ ధరించకపోతే.. పెనాల్డీ విధించబోమని పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణంలో ఉందని, కాబట్టి, ఆంక్షల సడలింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 2005 యాక్ట్ ప్రకారం ఇంతకాలం అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తేసినట్లు పేర్కొంది. అయితే కరోనా ముప్పు ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు కాబట్టి ప్రజలంతా స్వచ్చందంగా మాస్క్‌లు ధరించాలని మాత్రం మహా సర్కార్ సూచించింది. బీఎంసీ కూడా మాస్క్ తప్పనిసరి కాదని, ఫైన్ విధించబోమని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి శనివారం నుంచి ఇది అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. ఒకరోజు ముందస్తుగానే ఈ ఆదేశాలను విడుదల చేసింది ప్రభుత్వం.
Maharashtra Government issues order withdrawing all COVID19 restrictions. pic.twitter.com/wTaKCPUa7G
— ANI (@ANI) April 1, 2022
కరోనా వైరస్ 2020లో ప్రపంచాన్ని కుదిపేయగా.. డబ్ల్యూహెచ్‌వో తో పాటు వైద్య నిపుణులంతా ముఖానికి మాస్క్ ధరించడం వల్లనే వైరస్ కట్టడి అవుతుందని సూచించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర, ప్రత్యేకించి ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించని వాళ్ల నుంచి కనిష్టంగా 200రూ. నుంచి.. గరిష్టంగా బాగానే ఫైన్ వసూల్ చేశారు అక్కడి అధికారులు.