న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పట్టణం ఇప్పుడు ప్రపంచ పటంపై ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎందుకో తెలుసా? అక్కడ పరిమితికి మించి రెండు రెట్లు అధికంగా శబ్ద కాలుష్యం ఉన్నట్లు తేలింది! ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన శబ్ద తీవ్రత కేవలం 55 డెసిబుల్స్(డీబీ) కాగా మొరాదాబాద్‌లో ఇది ఏకంగా 114 ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 119 డెసిబుల్స్‌తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.
మొరాదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో 83 డీబీ, కోల్‌కతాలో 89 డీబీ శబ్దం కాలుష్యం ఉన్నట్లు ఐరాస పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో శబ్ద కాలుష్యం తీవ్రతను వెల్లడిస్తూ తాజాగా ఐరాస ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్స్ నివేదికను విడుదల చేశారు. న్యూయార్క్, బ్యాంకాక్ హాంకాంగ్ వంటి నగరాలు జాబితాలో ఉన్నాయి.
భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం
శబ్ద కాలుష్యం బెడద దక్షిణాసియాలోనే అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లో పరిమితికి మించి నమోదవుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం శబ్ద తీవ్రత నివాస ప్రాంతాల్లో 55 డీబీ, వాణిజ్య ప్రాంతాల్లో 70 డీబీ దాకా ఉండొచ్చు. అంతకు మించిన శబ్దాన్ని ఎక్కువ సేపు వింటే వినికిడి శక్తి పోయే ప్రమాదముంది. శబ్ద కాలుష్యం మనుషుల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
న్యూయార్క్‌లో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించే వారిలో ప్రతి 10 మందిలో 9 మంది శబ్ద కాలుష్యానికి గురవుతున్నారని నివేదిక వెల్లడించింది. ‘‘హాంకాంగ్‌లో ప్రతి ఐదుగురిలో ఇద్దరిది ఇదే పరిస్థితి. యూరప్‌లో అతిపెద్ద నగరాల పౌరుల్లో సగం మంది శబ్ద కాలుష్య బాధితులే’’ అని స్పష్టం చేసింది. ట్రాఫిక్ రణగొణ ధ్వనుల కారణంగా కొన్ని సిటీల్లో పక్షులు తమ కూత సమయాన్ని కూడా మార్చుకుంటున్నట్లు నిపుణులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment