
రోజురోజుకు పరిమితికి మించి పెరగడంతో చిక్కులు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ చుట్టుపక్కల వివిధ రూపాల్లో కాలుష్యాల వ్యాప్తి పెరుగుతోంది. వాయు, ధ్వని, నీరు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు మనుషుల ఆరోగ్యాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. తమకు తెలియకుండానే ఈ కాలుష్యాల బారినపడిన వారిలో శ్వాస, వినికిడి, మానసిక ఇతర సమస్యలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ వాయు, ధ్వని, ఇతర కాలుష్యాల స్థాయిలు గణనీయంగా విస్తరిస్తున్నాయి.
కొంతకాలంగా హైదరాబాద్, ఇతర ముఖ్య నగరాలు, పట్టణాల్లో వాయునాణ్యత క్షీణిస్తోంది. అంతేస్థాయిలో శబ్దకాలుష్యాలు కూడా క్రమంగా ఎక్కువగా రికార్డవుతున్నాయి. చాలాప్రాంతాల్లో వాయునాణ్యత స్థాయి తగ్గడానికి పట్టణీకరణ పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. భవన నిర్మాణాలతోపాటు వ్యక్తిగత వాహనాల వినియోగం విపరీతంగా పెరగడం.. గాలిలో కాలుష్యం పెరుగుదలతోపాటు శబ్దకాలుష్యం కూడా పెరుగుతున్నట్టుగా అంచనా వేస్తున్నా రు.
రాష్ట్రవ్యాప్తంగా లారీలు, బస్సులు, పలురకాల రవాణా, వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా బాగా పెరగడంతో రణగొణ ధ్వనులు మోతాదులకు మించి వెలువడుతున్నాయి. నగరం, చుట్టుపక్కల జనాభా సాంద్రత పెరుగుదల, దానికి తగ్గట్టు గా అన్నిరకాల వాహనాల మితిమీరిన వినియోగం వాయు, శబ్ద కాలుష్యాలు పెరగడానికి కారణమవుతోంది.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) ద్వారా ఈ నెల 1–9 తేదీల మధ్య నగరంలోని వివిధ ప్రాంతాల్లో్ల నమోదైన గణాంకాలను బట్టి చూస్తే పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది.
పెద్ద ధ్వనులను నియంత్రించాలి
వివిధ రూపాల్లో కాలుష్యాల వ్యాప్తి ప్రజల ఆరోగ్యాలపై, వివిధ శరీర భాగాలపై ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు. శబ్ద కాలుష్యంతో వినికిడి మానసిక రుగ్మతలతోపాటు ఇతర సమస్యలకు కారణమవుతోంది. ప్రతిరోజు 8 గంటలకు మించి 75 డెసిబుల్స్ వరకు శబ్దాలకు గురైతే వినికిడి, ఇతర సమస్యలు తలెత్తుతాయి.
ఈ శబ్దాల స్థాయి కంటే 5 డెసిబుల్స్ సౌండ్ పెరిగినా రోజూ 4 గంటలే భరించగలరు. అంతకు మించి వెలువడే శబ్దాలతో చెవులు దెబ్బతింటాయి. 100కు పైగా డెసిబుల్స్ సౌండ్‌కు అరగంటలోనే కర్ణభేరి దెబ్బతిని వినికిడి శక్తి కోల్పోతారు. ముఖ్యంగా డీజే సౌండ్స్, పెద్దశబ్దాలు చేసే వాహనాల హారన్లు, ఇతర ధ్వనులను నియంత్రించాల్సిన అవసరముంది.
వీటి వల్ల శాశ్వతంగా చెవుల్లో గుయ్యిమనే మోత మోగే సమస్యలు ఎదురుకావొ చ్చు. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. ఐటీ నిపణులు తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటం, ఇయర్ ఫోన్ల వినియోగంతో రేడియేషన్ పెరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వినికిడి, ఇతర సమస్యలతో మా దగ్గర కు వస్తున్న పేషెంట్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. – డాక్టర్ మోహన్‌రెడ్డి, చీఫ్ ఈఎన్‌టీ స్పెషలిస్ట్, నోవా ఆస్పత్రి

Comments
Please login to add a commentAdd a comment