హైదరాబాదీలను బెంబేలెత్తిస్తున్న శబ్ద కాలుష్యం
78 డెసిబెల్స్‌తో దేశంలోనే ఐదో స్థానంలో భాగ్యనగరం
నివాస ప్రాంతాల్లోనే ఎక్కువగా వినిపిస్తున్న రణగొణ ధ్వనులు
పరిమితికి మించి 10–20 డెసిబెల్స్ అధికంగా నమోదవుతున్న శబ్ద తీవ్రత
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడి
వాహనాలు, డీజేలు, అనవసర హారన్లే ప్రధాన కారణం
అధిక శబ్దాలతో పిల్లలు, వృద్ధుల్లో వినికిడి సమస్యలు.. పెద్దల్లో బీపీ, గుండె జబ్బులకు చాన్స్
ఓవైపు వాహనాల రొద.. హారన్ల మోత. మరోవైపు భవన నిర్మాణ చప్పుళ్లు, డీజేలు, లౌడ్‌స్పీకర్ల హోరు.. వెరసి రోజురోజుకూ భాగ్యనగరంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) గణాంకాల ప్రకారం నగరంలో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాలు ఉండాల్సి ఉంది.
కానీ పరిమితికి మించి 10 నుంచి 20 డెసిబెల్స్ శబ్ద తీవ్రత అధికంగా నమోదవుతోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్న నగరవాసులను కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్
ఉదాహరణకు..
⇒ రెసిడెన్షియల్ జోన్ అయిన జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్‌లో పగలు 68.71 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది.
⇒ పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగ ర్‌లో ఉదయం 66.40 డెసిబెల్స్‌గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది.
⇒ వాణిజ్య ప్రాంతమైన జేఎన్‌టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది.
కారణాలు అనేకం..
⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం
⇒ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాల మోత
⇒ 15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు.
⇒ నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల నుంచి లౌడ్ స్పీకర్లు, డీజేల హోరు.
⇒ నివాస ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు
⇒ భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్‌లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం.
⇒ పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం.
శబ్ద కాలుష్యంతో చుట్టుముట్టే అనారోగ్యాలు ఇవే..
⇒ పరిమితికి మించి శబ్దాల విడుదలతో గుండె స్పందనల్లో భారీగా హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు.
⇒ తలనొప్పి, చికాకుతోపాటు నిద్రలేమి, అలసట
⇒ గుండెజబ్బులు, చెవుడు కూడా రావచ్చు.
⇒ పిల్లల్లో కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతినే ప్రమాదం. వృద్ధులకు వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం.
⇒ మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం.
⇒ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ విభాగాలు విఫలం..
నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్ పోలీసులు, రవాణా, మున్సిపల్ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్ హారన్‌లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment