సాక్షి, హైదరాబాద్: నగరంలో ధ్వని కాలుష్యం పెరుగుతోంది. పగలు, రాత్రి తేడా లేదు. మోత మోగిపోతోంది. నివాస, వాణిజ్య ప్రాంతాలు, ఆసుపత్రులు, పార్కులు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో సైతం శబ్దాలు పెరుగుతున్నాయి. ఇది వాహనాలకే పరిమితం కాలేదు. హైదరాబాద్ విస్తరిస్తున్నది. నిర్మాణ రంగం పెరిగింది. వాహనాలు, నిర్మాణ కార్యకలాపాలు, ఇతరత్రా రూపాల్లో వెలువడుతున్న ధ్వనులతో వివిధ వర్గాల వారికి రోజువారీ సమస్యలు తప్పడం లేదు.
ఇక పండుగలు, ఇతర వేడుకల సమయాల్లో ఇది శృతి మించుతోంది. ఈ శబ్దాలతో వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా శబ్దాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగి, ఒకేస్థాయిలో కొనసాగుతుండడంతో గుండె కొట్టుకునే వేగం పెరగడం, అధిక రక్తపోటు సమస్యలకు దారితీస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. 65 డెసిబుల్స్‌కు పైబడి ధ్వనులు పెరిగితే గుండెజబ్బులు, వినికిడి కోల్పోవడం, నిస్సత్తువ ఆవరించడం, నిద్రలేమి, తలనొప్పి, మానసికంగా, శారీరంగా కుంగుబాటు వంటి వాటికి దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏడాదిగా ఇదే పరిస్థితి...
దాదాపు ఏడాది కాలంగా కొంచెం హెచ్చుతగ్గుదలలతో ధ్వని కాలుష్యం, శబ్దాలు ఒకేవిధమైన స్థాయిలో కొనసాగుతున్నట్టుగా తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలి (టీపీసీబీ) అధికారిక గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమౌతోంది. హైదరాబాద్ మహానగరంలోని నివాస, వాణిజ్య, సున్నిత–నిశ్శబ్ద (ఆసుపత్రులు, పార్కులు, ఇతర ప్రదేశాలు) ప్రాంతాలలో ఉదయం, రాత్రి రెండు సమయాల్లోనూ నిర్ణీత పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరీకరణ ఉచ్ఛస్థాయికి చేరుకోవడం, వివిధ రకాల వాహనాల రద్దీ బాగా పెరగడం, నిర్మాణరంగ కార్యకలాపాలు క్రమంగా పెరుగుదల, తదితరాల కారణంగా ఈ ధ్వనులు పెరుగుతున్నట్టు, శాస్త్రీయ పద్ధతుల్లో వీటి నివారణ, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పగటి పూటతో పాటు రాత్రి సమయాల్లోనూ పరిమితులకు మించి అధిక శబ్దాలతో నిద్రకు అంతరాయం ఏర్పడి పరోక్షంగా ఇతర సమస్యలకు దారితీస్తుంది. అయోమయం, మానసిక ఒత్తిళ్లు, ఆదుర్ధా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి వచ్చే అవకాశాలుంటాయి. శబ్దకాలుష్యానికి ఎక్కువ కాలం పాటు గురైతే చాలామందిలో యాంగ్జయిటీ, నిద్రలేమి కారణంగా పొద్దునే లేవలేకపోవడం, రోజంతా చేసే పనులపై సరిగా దృష్టి సారించక పోవడం వంటివి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపి పనితీరుకు నష్టం కలిగి వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురౌతాయి. నిద్రలేమి, ఆదుర్దా, ఒత్తిళ్లు, ఆయాసం, ఇతర సమస్యలు జతకూడి కుటుంబసంబంధాలపైనా దీని పరోక్ష ప్రభావం పడుతుంది.
– డా.వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ, స్లీప్
డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment