దీపావళికి దద్దరిల్లిన హైదరాబాద్
గాలి కంటే శబ్ద కాలుష్యమే అధికం
గత ఏడాది దీపావళికంటే ఎక్కువ శబ్దం
కాలుష్య నియంత్రణ మండలి నివేదికలో వెల్లడి
సాధారణ సమయంలో పెరుగుతున్న ఆక్సైడ్‌లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఈ ఏడాది వాయు కాలుష్యంకంటే శబ్దకాలుష్యం అధికంగా నమోదైంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, మరికొన్ని చోట్ల శబ్ద స్థాయిలు గతం కంటే అధికంగా నమోదయ్యాయి. దీపావళి రోజు నమోదైన వాయు, శబ్ద నాణ్యతలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదిక విడుదల చేసింది. గత ఏడాది దీపావళి పండుగ రోజుతో పోల్చితే ఈ ఏడాది శబ్ద కాలుష్య స్థాయిలు ఎక్కువ రికార్డయ్యాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లో పండుగ రోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా పటాకులు కాల్చటంతో కమర్షియల్, నివాస, సెన్సిటివ్ (ఆసుపత్రులు, స్కూళ్లు, జూ పార్కు ఇతర సున్నిత ప్రాంతాలు) ప్రదేశాల్లో శబ్ద స్థాయిలు (డెసిబుల్స్) అధికంగా నమోదయ్యాయి. ఐతే పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే ప్రామాణిక స్థాయిల కంటే తక్కువగా శబ్ద స్థాయిలు నమోదయ్యాయి. మిగతా మూడు కేటగిరీల్లో మాత్రం శబ్ద కాలుష్యం అధికంగా రికార్డ్ కావడం గమనార్హం.
వాయునాణ్యత కాస్త మెరుగు..
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దీపావళి రోజు వాయు నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది. ముఖ్యంగా పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (పీఎం 2.5–అతి సూక్ష్మ ధూళి కణాలు) ఈ ఏడాది తగ్గింది. ఇది గత ఏడాది దీపావళి రోజు 119 పాయింట్లు నమోదుకాగా, ఈ ఏడాది 84 పాయింట్లు రికార్డయ్యింది. పీఎం 10 (సూక్ష్మ ధూళికణాలు) గత ఏడాది 188 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 184 పాయింట్లుగా రికార్డయింది. పీఎం 2.5 వాయు కాలుష్య స్థాయిలు గత ఏడాది మామూలు రోజుల్లో 35 పాయింట్లుగా ఉండగా, ఈ ఏడాది 44 పాయింట్లుగా ఉంది. సాథారణ రోజుల్లో గత ఏడాది 85 పాయింట్లుగా ఉన్న పీఎం 10 సాంద్రత, ఈ ఏడాది 111 పాయింట్లుగా నమోదైంది.
ఇతర కాలుష్యాలూ ఎక్కువే..
ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వంటి వాయు కాలుష్య కారకం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా రికార్డయింది. సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యకారకం కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత ఎక్కువగానే నమోదైంది. గత ఏడాది దీపావళి సందర్భంగా నైట్రోజన్ ఆక్సైడ్ 30.6 పాయింట్లు నమోదుకాగా.. ఈ ఏడాది 40 పాయింట్లుగా నమోదైంది. గత ఏడాది దీపావళి సమయంలో 12 పాయింట్లు ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది 14 పాయింట్లుగా రికార్డయింది. 2023లో మామూలు రోజుల్లో 6.2 పాయింట్లుగా ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది సాధారణ రోజుల్లో 12 పాయింట్లుగా అంటే రెండింతలుగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ గత ఏడాది మామూలు రోజుల్లో 23.4 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 32.6 పాయింట్లుగా నమోదైంది. దీనిని బట్టి దీపావళి నాడే కాకుండా మామూలు రోజుల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రదేశాల్లో ధూళి కణాలు, కలుషిత వాయువులు, శబ్ద స్థాయిలను టీపీసీబీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది. దీపావళి సందర్భంగా పర్యావరణ పరిస్థితి పర్యవేక్షణ అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 7 దాకా కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment