అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్‌రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా.
హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్‌టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
మారిన జీవనశైలి అలవాట్లతో...
పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు.
జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు.
రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి.
అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం
రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ప్రస్తుతం సోషల్‌లైఫ్‌లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో బర్త్‌డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్‌కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది.
ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment