హైదరాబాద్‌లో మితిమీరిన శబ్ద కాలుష్యం  | Noise pollution In hyderabad roads | Sakshi

హైదరాబాద్‌లో మితిమీరిన శబ్ద కాలుష్యం

Apr 7 2025 10:30 AM | Updated on Apr 7 2025 10:50 AM

Noise pollution In hyderabad roads

మోటారు హారన్‌ మోతలతో చెవులకు చిల్లు  

నగరంలో మితిమీరిన శబ్ద కాలుష్యం 

గచ్చిబౌలి– జీడిమెట్ల– ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో.. 

వాహనాలకు స్పెషల్‌ సైలెన్సర్లు బిగిస్తున్న యజమానులు  

కొన్ని హాట్‌ స్పాట్లలో 110 డెసిబుల్స్‌ నమోదు  

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వాహనాల మోత దడ పుట్టిస్తోంది. అవసరం లేకున్నా మోగిస్తున్న హారన్‌లతో రహదారులు దద్దరిల్లిపోతున్నాయి. గచ్చిబౌలి, జీడిమెట్ల, ఉప్పల్, ఫలక్‌నుమా, హుస్సేన్‌సాగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో శబ్దాలు నమోదవుతున్నాయి. కొన్ని హాట్‌ స్పాట్‌లలో 110 డెసిబుల్స్‌ నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావం వినికిడి శక్తి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య.. 
కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం.. నగరంలో వివిధ ప్రాంతాలను బట్టి శబ్ద తీవ్రత 45 నుంచి గరిష్టంగా 65 డెసిబుల్స్‌ మధ్య ఉండాలి. అయితే.. జూబ్లీహిల్స్, అబిడ్స్, తార్నాక, గచి్చబౌలి, జూపార్క్, ఫలక్‌నుమా, ఉప్పల్, హుస్సేన్‌సాగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, గడ్డపోతారం తదితర ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో 100 డెసిబుల్స్‌ మించిపోతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గచి్చ»ౌలి– ఉప్పల్‌ దారిలో మధ్యాహ్నం 3.30  నుంచి రాత్రి 8 గంటల మధ్య 110 డీబీ శబ్దం నమోదవుతోంది. మోటారు వాహన చట్టం ప్రకారం అనవసరంగా హారన్‌ మోగించడం నిషేధం.  

సిటీ పరిధిలో మోటారు సైకిల్, కారు, ఆటో, బస్సు, లారీ, ఇతర ప్రైవేటు వాహనాలకు భారీ శబ్దాలు వచ్చే హారన్, సైలెన్సర్లు బిగిస్తున్నారు.  పోలీసులు అప్పుడప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌లో మోటారు సైకిళ్ల సైలెన్సర్లపై చలానాలు విధిస్తున్నారు. మిగతా హెవీ వెహికిల్స్‌పై మాత్రం దృష్టి పెట్టడం లేదు. నగరం నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్‌ బస్సులు భారీ శబ్దాలు వచ్చే హారన్‌లతో సాయంత్రం వేళల్లో మోత మోగిస్తున్నాయి. గతంలో ఒక దఫా ఆర్టీసీ బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు తదుపరి తనిఖీలను మాత్రం విస్మరించారు.   

ఆటోమేటిక్‌ చలానా సిస్టం.. 
నగరంలో శబ్ద కాలుష్యాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ట్రాఫిక్‌ పోలీసులు 2020లో సిగ్నళ్ల వద్ద అకౌస్టిక్‌ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఫలితంగా సిగ్నల్‌ దగ్గర పరిమితికి మించి ఎవరైనా హారన్‌ మోగించినా, ఇంకా ఏ ఇతర కారణాలతోనైనా నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ శబ్దం చేస్తే ఈ మీటర్‌ ఆటోమేటిక్‌గా ఫొటో తీసి, చలానా వేస్తుంది. అప్పట్లో కోవిడ్‌ ప్రభావంతో ఇది ప్రతిపాదనలకే పరిమితమైంది.  

కర్ణభేరి పగిలితే కష్టమే..  
పరిమితికి మించి శబ్దం చేయడం వల్ల వినికిడి లోపం వస్తుంది. 20 డీబీ వకు సేఫ్‌. నగరంలో సుమారు 70 డీబీ నమోదవుతోంది. ఇది కొంత ప్రమాదకరమే. కళ్లు తిరగడం, ట్యూమర్‌ వంటివి వచ్చే అవకాశం ఉంది. పనిలో ఏకాగ్రత దెబ్బ తింటుంది. చెవిలోని కర్ణభేరి పగిలితే మళ్లీ దాన్ని పునరుద్ధరించలేం. 
– భూపేందర్‌ రాథోడ్, ప్రొఫెసర్, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ, గాంధీ ఆసుపత్రి

హారన్‌ను వీడితే 50 శాతం ధ్వని కాలుష్యం తగ్గుతుంది.. 
2017 మోటారు వెహికిల్‌ చట్టం ప్రకారం ప్రమాదమనిపిస్తే తప్ప డ్రైవర్‌ హారన్‌ మోగించరాదు. దీన్ని ఎవరూ పాటించడంలేదు. హారన్‌కు బదులు బ్రేక్‌ వినియోగించాలి. హారన్‌ వినియోగించకపోతే సుమారు 50 శాతం సమస్య పరిష్కారమవుతుంది. 
– నరేష్‌ రాఘవన్, రహదారి భద్రత నిపుణులు


 

గూబ గుయ్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement