కాలుష్యం తగ్గిందోచ్! | Reduced pollution | Sakshi
Sakshi News home page

కాలుష్యం తగ్గిందోచ్!

Published Tue, Jan 20 2015 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

కాలుష్యం తగ్గిందోచ్!

కాలుష్యం తగ్గిందోచ్!

పండగ సెలవుల్లో సిటీ ఖాళీ 50 శాతం తగ్గిన కాలుష్యం 15,16 తేదీల్లో గణనీయంగా తగ్గిన కాలుష్య ఉద్గారాలు శబ్ద కాలుష్యమూ తగ్గుముఖం వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కకపోవడమే కారణం

ట్రాఫిక్ జంఝాటం... వాయు కాలుష్యంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యే దుస్థితి.. భరించలేని శబ్దాల నుంచి నగర వాసికి రెండు రోజుల పాటు ఉపశమనం లభించింది. సంక్రాంతికి గ్రేటర్ నుంచి సుమారు 20 లక్షల మంది పల్లె బాట పట్టారు. వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కడం గణనీయంగా తగ్గింది. దీంతో గ్రేటర్‌లో వాయు, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఈ నెల 15,16 తేదీల్లో కాలుష్య నియంత్రణ మండలి బృందాలు పంజగుట్ట, జూ పార్క్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్‌నగర్ ప్రాంతాల్లో వాయు కాలుష్య మోతాదును నమోదు   చేశాయి. కాలుష్య కారకాలు సాధారణ రోజుల్లో కంటే ఈ తేదీల్లో కొన్ని చోట్ల సగానికి, మరి కొన్నిచోట్ల భారీగా తగ్గినట్లు పీసీబీ నివేదిక వెల్లడించింది. వరుస సెలవులతో మెజార్టీ సిటీజనులు వ్యక్తిగత వాహనాలను ఇళ్లలో పెట్టి... సొంత ఊళ్లకు వెళ్లడంతోకాలుష్యం గణనీయంగా తగ్గినట్లు పీసీబీ అధికారులు తెలిపారు. శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గడంతో నగర వాసులు ఉపశమనం పొందారు. గ్రేటర్‌లోని 6111 కి.మీ.ల రహదారులపై నిత్యం 40 లక్షల వాహనాలు (అన్ని రకాలు) రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇందులో సగం మాత్రమే రోడ్డెక్కడంతో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని పీసీబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 
సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5)

ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ ధూళికణాల మోతాదు పంజగుట్టలో సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో 200 మైక్రోగ్రాములకు పైమాటే. ఈ నెల 15న కేవలం 85 మైక్రోగ్రాములే నమోదైంది. జూ పార్క్ వద్ద సాధారణ రోజుల్లో 220 మైక్రోగ్రాములు ఉంటుంది. కానీ 16న కేవలం 83 మైక్రోగ్రాములే నమోదైంది. సెంట్రల్ యూనివర్సిటీలో సాధారణం 103 మైక్రోగ్రాములు. ఈ నెల 16న 53 మైక్రోగ్రాములే ఉంది. సనత్‌నగర్‌లోనూ సాధారణంగా 212 మైక్రోగ్రాములు ఉంటుంది. కానీ ఈనెల 15న  106 మైక్రో గ్రాములు మాత్రమే నమోదైంది.

సగానికి తగ్గిన శబ్ద కాలుష్యం

సాధారణంగా 60 డెసిబుల్స్ శ్రావ్య అవధి దాటిన శబ్దాలు వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. నిత్యం వాహనాల రణగొణ ధ్వనులతో 80 డెసిబుల్స్ కన్నా అధిక శబ్దాలు వినే నగర జీవికి ఈ నెల 15,16 తేదీల్లో కాస్త ఉపశమనం లభిం చింది. అబిడ్స్ (వాణిజ్య ప్రాంతం)లో 71 డెసిబుల్స్, గచ్చిబౌలిలో 57, గడ్డపోతారం (పారిశ్రామికవాడ)లో 63.9, జీడిమెట్ల (పారిశ్రామికవాడ)లో 56, ప్యారడైజ్ (వాణిజ్య ప్రాం తం)లో 72, పంజగుట్ట (వాణిజ్య ప్రాంతం)లో 73.3, తార్నాక(నివాస)లో 54.2, జూ పార్క్(నిశ్శబ్ద) ప్రాంతంలో 52.3 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం నమోదైంది. దీంతో సిటీ జనులకు పండగ పూట ప్రశాంతంగా గడిపే అవకాశం దక్కింది.
 
బెంజీన్

 
కల్తీ ఇంధనాల నుంచి వెలువడే క్యాన్సర్ కారక బెంజీన్ మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు మించరాదు. కానీ పంజగుట్టలో సాధారణ రోజుల్లో 5 మైక్రోగ్రాములకు పైబడే ఉంటుంది. పండగ రోజున మా త్రం 2.85 మైక్రోగ్రాములే ఉంది. జూపార్క్ వద్ద సాధార ణం 4.5 మైక్రోగ్రాములు కాగా... ఈ నెల 16న 4 మైక్రోగ్రాములకు పరిమితమైంది. సెంట్రల్ వర్సిటీ వద్ద సాధారణ రోజుల్లో 2.2 మైక్రోగ్రాములు. 16న 1 మైక్రోగ్రామ్ మాత్రమే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో 5.1 మైక్రోగ్రాములు కాగా... 16న  3.3 మైక్రోగ్రాములే ఉంది.
 
కార్బన్ మోనాక్సైడ్
 
బ్రాంకైటిస్‌కు కారణమయ్యే కార్బన్ మోనాక్సైడ్ మోతా దు పంజగుట్టలో సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో 2.2 మైక్రోగ్రాములుగా నమోదవుతుంది. ఈ నెల 16న 1.53 మైక్రోగ్రాములుగా నమోదైంది. జూ పార్క్‌లో సాధారణం 2.20 మైక్రోగ్రాములు.  పండగ వేళ 1.15కు తగ్గింది. సెంట్రల్ వర్సిటీ వద్ద సాధారణంగా 1.1 ఉంటుంది. ఈ నెల16న 0.46 మైక్రోగ్రాములకు పడిపోయింది. సనత్‌నగర్‌లో సాధారణంగా 1.19 మైక్రోగ్రాములు నమోదవుతుంది. ఈ నెల 16న 0.58కి తగ్గింది.
 
నైట్రోజన్ డయాక్సైడ్
 
శ్వాస కోశ వ్యాధులకు కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో సాధారణ రోజుల్లో పంజగుట్టలో 120 మైక్రోగ్రాములు ఉంటుంది. పండగ రోజున 48 మైక్రోగ్రాములకు తగ్గింది. జూ పార్క్ వద్ద సాధారణం 121 మైక్రోగ్రాములు కాగా...15న 71 మైక్రోగ్రాములకే పరిమితమైంది. సెంట్రల్ వర్సిటీ వద్ద 101 మైక్రోగ్రాములకు ఈనెల 16న 80 మైక్రోగ్రాములే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో 120 మైక్రోగ్రాములు ఉంటుంది. 16న కేవలం 39 మైక్రోగ్రాములే నమోదైంది.
 
15, 16 తేదీల్లో కాలుష్య కారకాల మోతాదు...
దుమ్ము, ధూళి కణాలు (పీఎం10):

పంజగుట్టలో సాధారణ రోజుల్లో దుమ్ము, ధూళి కణాల (పీఎం10) మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో 234 మైక్రోగ్రాములు ఉంటుంది. ఈ నెల 15,16 తేదీల్లో మాత్రం 121 మైక్రోగ్రాములే నమోదైంది. జూ పార్క్ వద్ద సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో ధూళి కణాల మోతాదు 320 మైక్రోగ్రాములు. ఈ నెల 16న కేవలం 164 మైక్రోగ్రాములే నమోదైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద సాధారణ రోజుల్లో 200 మైక్రోగ్రాముల పీఎం 10 నమోదవుతుంది. 16న కేవలం 99 మైక్రోగ్రాములే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో పీఎం10 మోతాదు 250 మైక్రోగ్రాములు. 15న మాత్రం 101 మైక్రోగ్రాములే నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement