festival holidays
-
ఉద్యోగులకు ఆదివారం షాక్.. కలసిరాని 'సెలవు'
సాక్షి, అమరావతి: రాబోయే ఏడాదికిగాను ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు. కనుమ, శ్రీరామనవమి, బక్రీద్, గాంధీ జయంతి, ఈద్ మిలాద్‌నబీ, క్రిస్మస్ వంటి సాధారణ సెలవులు, మహాలయ అమావాస్య, నరక చతుర్థశి, యాజ్–దహుం–షరీఫ్ వంటి ఐచ్ఛిక సెలవులు ఆదివారమే రావడం ఉద్యోగులను నిరాశపరుస్తోంది. చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాద్‌నబి వంటి పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
పనిదినాల్లోనే పండుగలు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2021) పండుగల సెలవులు (సాధారణ సెలవులు) ఎక్కువగా ఆదివారం రాకపోవడంతో ఉద్యోగులకు సంతోషం కలిగిస్తోంది. అయితే, ఐచ్ఛిక సెలవులు మాత్రం నాలుగు ఆదివారాలు వచ్చాయి. సాధారణ సెలవుల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ మాత్రమే ఆదివారం వచ్చింది. మిగతా సెలవులన్నీ ఇతర వారాల్లోనే వచ్చాయి. వచ్చే ఏడాది సాధారణ సెలవులను, ఐచ్ఛిక సెలవులను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పండగ పూట టికేట్ల దోపిడీ
-
2020 ఏడాది సెలవుల వివరాలివే..
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సెలవుల వివరాలివే.. సందర్భం/పండుగ తేదీ వారం బోగి జనవరి 14 మంగళ సంక్రాంతి/పొంగల్ జనవరి 15 బుధ కనుమ జనవరి16 గురువారం మహాశివరాత్రి ఫిబ్రవరి 21 శుక్ర ఉగాది మార్చి 25 బుధ శ్రీరామ నవమి ఏప్రిల్ 02 గురు గుడ్‌ఫ్రైడే ఏప్రిల్ 10 శుక్ర అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14 మంగళ ఈదుల్ ఫితర్(రంజాన్) మే 25 సోమ ఈదుల్ అజా(బక్రీద్) ఆగస్టు 1 శని శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 11 మంగళ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 శని వినాయక చవితి ఆగస్టు 22 శని గాంధీ జయంతి అక్టోబర్ 02 శుక్ర దుర్గాష్టమి అక్టోబర్ 24 శని మిలాద్ ఉన్ నబీ అక్టోబర్ 30 శుక్ర క్రిస్మస్ డిసెంబర్ 25 శుక్ర ఆదివారం, రెండో శనివారంలో వచ్చే సెలవులు గణతంత్ర దినోత్సవం జనవరి 26 ఆది బాబు జగ్జీవన్ రాం జయంతి ఏప్రిల్ 5 ఆది మొహర్రం ఆగస్టు 30 ఆది విజయదశమి అక్టోబర్ 25 ఆది దీపావళి నవంబర్ 14 రెండో శని ఐచ్ఛిక సెలవులు పండుగ తేదీ వారం ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 బుధవారం హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహది జనవరి10 శుక్ర హజ్రత్ అలీ జయంతి మార్చి 9 సోమవారం హోలీ మార్చి 10 మంగళవారం షబ్-ఏ-మేరాజ్ మార్చి 23 సోమ మహవీర్ జయంతి ఏప్రిల్ 06 సోమ షబ్-ఏ-బరాత్ ఏప్రిల్ 09 గురు బుద్ధపూర్ణమి మే 07 గురు షహదత్ హజ్రత్ అలీ మే 14 గురు షబ్-ఏ-ఖదర్ మే 21 గురు జుమతుల్ విదా మే 22 శుక్ర రథయాత్ర జూన్ 23 మంగళ వరలక్ష్మీ వ్రతం జూలై 31 శుక్ర ఈద్-ఏ-గధీర్ ఆగస్టు 7 శుక్ర పార్శి కొత్త ఏడాది రోజు ఆగస్టు 20 గురువారం 9వ మొహర్రం ఆగస్టు 29 శని మహాలయ అమావాస్య సెప్టెంబర్17 గురువారం అర్బాయిన్ అక్టోబర్ 08 గురు యాజ్ దుహమ్ షరీష్ నవంబర్ 27 శుక్ర కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి నవంబర్30 సోమ క్రిస్మస్ ఈవ్ డిసెంబర్24 గురు బాక్సింగ్ డే డిసెంబర్26 శని ఆదివారం రానున్న ఐచ్ఛిక సెలవులు పండుగ తేదీ వారం బసవ జయంతి ఏప్రిల్ 26 ఆది -
తిరోగమనం!
స్పెషల్స్ ఫుల్.. రెగ్యులర్ డల్ బస్సులకూ అరకొర రద్దీ కానరాని ప్రయాణికుల కిటకిట విశాఖపట్నం: ఈ ఏడాది సంక్రాంతికి విచిత్ర పరిస్థితి నెలకొంది. నాలుగు రోజుల పండగ సెలవుల అనంతరం బస్సులు, రైళ్లు కిటకిటలాడతాయనుకున్న పరిస్థితికి భిన్న వాతారణం కనిపిస్తోంది. తిరుగు ప్రయాణంలో జనం అంతగా కనిపించడం లేదు. వాస్తవానికి ఏటా సంక్రాంతి పండగకు విశాఖకు వచ్చే వారు దాదాపు రెండున్నర లక్షల మంది, వెళ్లే వారు మాత్రం అంతకు రెట్టింపు ఉంటారని ఓ అంచనా. ఇందుకనుగుణంగానే ఇటు ఆర్టీసీ, అటు రైల్వే శాఖలు ప్రత్యేక బస్సులు, రైళ్లను నడుపుతోంది. ఈ ఏడాది కూడా అలాంటి ఏర్పాట్లే చేశాయి. గురు, శుక్ర, శని వారాలు పండగ దినాలు, ఆదివారం సెలవు రోజు. దీంతో సోమవారం నుంచి పిల్లలు బడులు, కాలేజీలు, ఉద్యోగుల కార్యాలయాలకు వెళ్తారన్న భావనతో ఆదివారం రద్దీ విపరీతంగా ఉంటుందని లెక్కలేశారు. ఆర్టీసీ ఈ సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 8 నుంచి హైదరాబాద్‌కు 115, రాజమండ్రి, కాకినాడలకు 20 చొప్పున, విజయవాడకు 15, శ్రీకాకుళం, పలాస, టెక్కలి, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలకు 40, పాలకొండ, రాజాంలకు 50 సర్వీసులను అదనంగా (50 శాతం అదనపు చార్జీతో) తిప్పుతోంది. వీటితో పాటు రెగ్యులర్ సర్వీసులనూ కొనసాగిస్తోంది. వీటికి ఎంతో డిమాండ్ ఉంటుందని భావించింది. కానీ సాదాసీదా డిమాండే తప్ప అనూహ్య రద్దీ కనిపించడం లేదు. ఆదివారం తిరుగు ప్రయాణంలో వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ 70 సర్వీసులను నడిపింది. ఇందులో 65 హైదరాబాద్‌కే కేటాయించింది. మిగిలిన వాటిలో 4 చెన్నైకి, ఒకటి బెంగుళూరుకు పంపింది. కానీ బస్ కాంప్లెక్స్‌ల్లో మోస్తరు జనమే కనిపించారు. ముందస్తు రిజర్వేషన్లు చేయించుకున్న వారి హడావుడే అధికంగా ఉంది. సోమవారం కూడా హైదరాబాద్‌కు 20 బస్సులను నడుపుతోంది. రైళ్లలో సాధారణ రద్దీ.. మరోవైపు రైళ్లలోనూ ఆదివారం ఊహించినంత రద్దీ కనబడలేదు. ఆదివారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కోసం ఒకింత జనం ఎగబడ్డారు. మధ్యాహ్నం రత్నాచల్, హౌరా-చెన్నై, హౌరా-ముంైబె , సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఖాళీగా ఉండడం విశేషం. మామూలు రోజుల్లోనే గోదావరి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ల కోసం ప్రయాణికులు చాంతాడంత క్యూలైన్లలో నిలబడతారు. కానీ ఆదివారం అలాంటి పరిస్థితే తలెత్తలేదు. రైల్వేశాఖ ముందస్తుగా వేసిన ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు చేయించుకున్న వారితో విశాఖ రైల్వేస్టేషన్ సందడి నెలకొంది. ఈ రైళ్లలో వెళ్లడానికి ప్రయాణికులు ఆసక్తి చూపారు. సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 26 వరకు విశాఖ మీదుగా వివిధ ప్రాంతాలకు 47 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సోమవారం విశాఖ నుంచి వెళ్లే వారి ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగా ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. -
పండక్కి ఊరెళ్లడంతో..సొత్తు చోరీ
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో ఓ ఇంటిలో దొంగలు చోరికి పాల్పడ్డారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీకు చెందిన గుర్రం కార్తీక్ సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి గురువారం సాయంత్రం ఊరెళ్లారు. ఆదివారం తిరిగి రాగా ఇంటిలోని వస్తువులు చిందరబందరంగా పడి ఉన్నాయి. చోరీ విషయాన్ని గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.59వేల నగదు చోరీకి గురైనట్టు బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
టైమ్ షేర్... చలో టూర్
రోజూ పేపర్లో.. టీవీల్లో.. బయట హోర్డింగ్స్‌లో ఎక్కడ చూసిన ‘చలో నిక్లో.. ఫ్యామిలీ సే ఎంజాయ్ కరో’ అనే ట్యాగ్‌లైన్‌తో ఇస్తున్న ఆతిథ్య సంస్థల ప్రకటనలు రమేశ్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రమేశ్‌కు ఎప్పటి నుంచో దూర ప్రాంతాలకు ఒకసారి పర్యటించాలన్నది కోరిక. ధరలు కూడా అందుబాటులోనే ఉన్నట్టు కనిపించటంతో ఓ సారి ట్రైచేస్తే పోలా... అనుకున్నాడు. పండుగ సెలవులు కలసి రావటంతో ఆతిథ్య సంస్థల వెబ్సైట్లోకి వెళ్లి చూస్తే దిమ్మ తిరిగిపోయింది. సాధారణ రోజుల్లో కంటే రెండింతల అధిక రేట్లున్నాయి మరి. ఎందుకని ఆరా తీస్తే... పండుగ సెలవులిచ్చేది రమేశ్ ఒక్కడికే కాదుగా!! అందరికీనూ!! శేఖర్‌ది మరో కథ. తనకు ఓ మంచి హాలిడే రిసార్ట్‌లో పాతికేళ్ల పాటు సభ్యత్వం ఉంది. ఏడాదిలో వారం రోజుల పాటు ఆ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న రిసార్ట్‌లలో ఎక్కడైనా ఒకచోట ఉండొచ్చు. అయితే గతేడాది వేసవి సెలవులు వచ్చినపుడు, ఈ ఏడాది పండుగ సెలవులు వచ్చినపుడు అక్కడికి వెళదామని ప్రయత్నించాడు. తను అడిగిన చోట రిసార్ట్ గదులు ఖాళీ లేవని, అన్నీ ముందే బుక్ అయిపోయాయని సమాధానం. రెండుసార్లు ప్రయత్నించగా... రెండుసార్లూ అదే సమాధానం. వాళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పిన తేదీల్లో ఇక్కడ శేఖర్‌కి సెలవుల్లేవు. తను సభ్యత్వం తీసుకునేటపుడే ఇవన్నీ ఆలోచించి ఉంటే బాగుండేదనుకున్నాడు మనసులో. కొత్త సంవత్సరం వచ్చింది! సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు. కుటుంబంతో కలసి సెలవులు సరదాగా గడపటానికి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాడు సురేశ్. కుటుంబంతో మాట్లాడి... ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకున్నాడు. ప్రయాణానికి టికెట్లు కూడా సంపాదించాడు. అక్కడ బస చేయడానికి ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. కాస్త మంచి హోటల్స్ అన్నీ... ముందే బుక్ అయిపోయాయి. ఖాళీగా ఉన్నవాటికి రేటింగ్స్ లేవు. యూజర్ల నుంచి ‘దీన్ని తీసుకోవటం శుద్ధ వేస్ట్’’ అంటూ కామెంట్లు కూడా ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక ముందుగా బుక్ చేయకుండానే బయలుదేరాడు. అక్కడ ఇబ్బందులు మామూలుగా లేవు. హాలిడే సీజన్ కావటంతో విపరీతమైన రద్దీ. అదీ కథ. ఇదంతా ఎందుకంటే... ఇపుడు టైమ్ షేర్ ప్రాపర్టీల హవా నడుస్తోంది. చాలామంది వీటిలో సభ్యత్వం తీసుకుని సెలవుల్ని ఎంజాయ్ చేయగులుగుతున్నా... కొందరికి సభ్యత్వం ఉండి కూడా సదరు కంపెనీల తీరు వల్ల ఆ అవకాశం దక్కటం లేదు. ఇక దేన్లోనూ సభ్యత్వం లేనివారిదైతే మరో గొడవ. సీజన్లో వెళదామంటే విపరీతమైన చార్జీలు. వీటన్నిటి నేపథ్యంలో నిర్దిష్ట కాల వ్యవధికి మన యాజమాన్యంలో ఉండే ఆస్తుల (టైమ్‌షేర్ ప్రాపర్టీలు) వల్ల లాభమేంటి? నష్టాలేంటి? అసలు టైమ్‌షేర్ ప్రాపర్టీలంటే ఏంటి? వీటి వివరాలు ఏమిటి? వీటిలో సభ్యత్వం తీసుకునేదెలా? ఇవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... * సభ్యత్వం తీసుకుంటే ఏటా ఫ్రీ హాలిడేస్ * తక్కువ ఖర్చుకే స్టార్ హోటల్ వసతులు * ఏటా తప్పనిసరిగా టూర్లకు వెళ్లేవారికి లాభమే * వాడకపోయినా వార్షిక నిర్వహణ రుసుం తప్పదు * ఆచితూచి ఎంచుకుంటేనే టైమ్‌షేర్‌తో లాభాలు * హైదరాబాద్‌లోనూ టైమ్‌షేర్ ప్రాపర్టీలు.. అసలు టైమ్‌షేర్ ప్రాపర్టీ అంటే..? పలు వేడుకలు లేదా పార్టీలు జరుపుకునేందుకు వీలు కల్పించే ఉమ్మడి స్థిరాస్తి. అంటే ఒక లగ్జరీ హోటల్ గది లేదా స్టూడియో రూమ్ కావచ్చు. రిసార్ట్‌లో గది, విల్లా... ఇలా ఏదైనా కావచ్చు. ఒక హోటల్లో ఉండే గదుల్ని పాతికేళ్లో, 30 ఏళ్లో శాశ్వతంగా ఏడాదికి 5 రోజుల చొప్పునో, 10 రోజుల చొప్పునో, వారం రోజుల చొప్పునో లీజు కిస్తారన్న మాట. ఇలా ఇచ్చినందుకు ఒకేసారి సభ్యత్వ రుసుము తీసుకోవటంతో పాటు ఏడాది కి కొంత నిర్వహణ రుసుం కూడా తీసుకుంటారు. ఆ హోటల్ మామూలుగానే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. కాకపోతే సభ్యులు బుక్ చేసుకున్నపుడు వారికి ప్రాధాన్యమివ్వటంతో పాటు... నిర్దిష్ట వ్యవధి పాటు వారికి ఉచితంగా బస కల్పిస్తారు. తీసుకునే సభ్యత్వాన్ని బట్టి కేవలం గది ఉచితంగా ఇవ్వటం, భోజన సదుపాయాలతో కలిపి ఇవ్వటం, ఇతరత్రా విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పించటం వంటివి ఉంటాయి. అలాగే రిసార్ట్లు కూడా. వీటిలో సభ్యులు కావటం వల్ల నిర్దేశిత సమయంలో... కుటుంబంతో కలసి అక్కడ హాయిగా గడపవచ్చన్న మాట. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో 40కి పైగా సంస్థలు... దేశంలో టైమ్‌షేర్ ప్రాపర్టీల కొనుగోలు, అమ్మకం, లీజు వంటి సేవలను రిసార్ట్ కండోమినియమ్స్ ఇంటర్నేషన్ (ఆర్సీఐ), రమదా హోటల్స్ అండ్ రిసార్ట్స్, క్లబ్ మహీంద్రా, కంట్రీ క్లబ్, స్టెర్లింగ్ హోలిడే రిసార్ట్స్ వంటి 40కి పైగా సంస్థలు అందిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ సభ్యత్వాన్ని నెలసరి వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేసే వీలును కూడా కల్పిస్తున్నాయి. వీటిలో 20 లక్షల మంది సభ్యులున్నారని, ఏటా కొత్తగా 15వేల మంది చేరుతున్నారని ఆల్ ఇండియా రిసార్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ఏఐఆర్డీఏ) చైర్మన్ రమేష్ రామనాథన్ చెప్పారు. ‘‘గడిచిన ఐదేళ్ల నుంచీ టైమ్ షేర్ ప్రాపర్టీల సంసృ్క తి పెరుగుతోంది. అందుకే మొత్తం పర్యాటకుల్లో టైమ్‌షేర్ సభ్యుల సంఖ్య కేవలం 0.069 శాతంగానే ఉంది. కాకపోతే 2006-15 మధ్య ఈ రంగం ఏటా 20 శాతం వృద్ధి రేటును కనబరుస్తూ వచ్చింది. ప్రాపర్టీ ఎంపిక, నిర్వహణలో పారదర్శకత, కస్టమర్ల సంతృప్తే ఇందుకు కారణం’’ అని వివరించారాయన. ఇదీ... టైమ్‌షేర్ ఆరంభం టైమ్‌షేర్ ప్రాపర్టీలు ఎలా మొదలయ్యాయనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ ఓ పరిశోధనా పత్రాన్ని తయా రు చేశారు. దాని ప్రకారం.. టైమ్‌షేర్ అనే హాలిడే ప్రణాళికను మొదట తీసుకొచ్చింది అమెరికా. 1968లో హోటల్ హవాయ్‌ని టైమ్‌షేర్ ప్రాపర్టీగా మార్చారు. 1970లో అమెరికాలో చమురు సంక్షోభం తలెత్తటంతో ప్రాపర్టీ నిర్వహణ భారంగా మారింది. దీంతో హవాయ్ కథ ముగిసింది. 1980 నుంచి నిర్మాణ రంగం ఊపందుకోవటంతో మళ్లీ టైమ్‌షేర్ ప్రాపర్టీలొచ్చాయి. వీటి ఆదరణ ఎలా ఉందంటే.. అప్పటివరకు అనిశ్చితిలో ఉన్న సెయింట్ థామస్, ఫోర్ట్ లాడర్డల్, పోర్టోరికో వంటివి కూడా టైమ్‌షేర్ ప్రాపర్టీలుగా మారిపోయాయి. ఇక మన దేశంలోకి తొలిసారిగా టైమ్‌షేర్ ప్రాపర్టీలను తీసుకొచ్చింది మాత్రం.. 1985లో వచ్చిన దాల్మియా రిసార్ట్స్. విదేశీ యాజమాన్యం, నిర్వహణ భారంతో పెద్దగా ఆదరణ పొందలేదు. ఆ తర్వాత... అంటే 1986లో ఆర్ సుబ్రమణియన్ చెన్నై కేంద్రంగా ప్రారంభించిన స్టెర్లింగ్ రిసార్ట్స్ విజయవంతమయింది. ఆ రోజుల్లోనే స్టెర్లింగ్‌కు దేశంలో 14 రిసార్ట్లు, 12 హాలిడే డెస్టినేషన్స్, లక్ష మంది సభ్యులు ఉండేవారు. నిజంగానే డబ్బులు ఆదా అవుతాయా! టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వంతో డబ్బులు ఆదా అవుతాయనేది సంస్థల మాట. అవి చెబుతున్న దాని ప్రకారం... సాధారణంగా ఫైవ్‌స్టార్ హోటల్లో వసతి కోసం రోజుకు కనీసం రూ.10-12 వేల మధ్య చెల్లించాలి. వారానికైతే రూ.70-85 వేలు ఉంటుంది. అదే టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వం ప్రారంభ ధర రూ.2-3 లక్షలుంటుంది. ఈ ప్రాపర్టీని ఏడాదికి వారం రోజుల చొప్పున 30 ఏళ్ల పాటు వినియోగించుకోవచ్చు. అంటే వారానికి రూ.10 వేలన్నమాటేగా. ఒకవేళ 30 ఏళ్లలో ఈ ధరలు భారీగా పెరిగినా... సభ్యులకు మాత్రం చివరిదాకా ఉచితంగానే వస్తుంది. జాగ్రత్త పడకుంటే నష్టమే...! * టైమ్‌షేర్ ప్రాపర్టీలతో నష్టాలున్నాయని చెప్పలేం గానీ... అన్ని రంగాల మాదిరిగానే దీనికీ నాణేనికి రెండో వైపు ఉంది. * అందుకే మంచి పేరున్న టైమ్‌షేర్ సంస్థ, బ్రాండ్‌కు ప్రాధాన్యమిచ్చే సంస్థల్లోనే సభ్యత్వం తీసుకోవాలి. ప్రాపర్టీలు బాగుంటే సరిపోదు. వాటి నిర్వహణ కూడా బాగుండాలి. క్లబ్‌ను ఎంచుకునే ముందు సంబంధిత సంస్థ గురించి మనకంటే ముందున్న కస్టమర్ల అభిప్రాయాలు, అనుభవాలు తెలుసుకోవాలి. * టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వానికయ్యే ఖర్చు సంగతి పక్కన పెడితే దాని నిర్వహణ కోసం ఒక్కో సభ్యుడు ఏటా కొంత సొమ్ము చెల్లించాలి. ఇది రూ.10-20 వేల మధ్య ఉండొచ్చు. అనివార్య కారణాల వల్ల సభ్యులు ఆ ఏడాది వినియోగించుకోకపోయినా నిర్వహణ రుసుము తప్పదు. దీనికి పరిష్కార మార్గంగా... సబ్‌స్క్రిప్షన్‌ను బంధువులు, స్నేహితులకు బహుమతిగా ఇచ్చే వీలును కల్పిస్తున్నా... వారు బయటి వారు కనక ఒక్కరికి రూ.1,100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. * ప్రాంతాలను ఎంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకిచ్చిన ప్యాకేజీలో 50 ప్రాంతాలుంటాయనుకుందాం. ఎన్నాళ్లయినా వాటిలోనే ఏదో ఒకటి ఎంచుకోవాలి. వేరే ప్రాంతానికి వెళదామనుకుంటే ఈ సభ్యత్వం పనికిరాదు. * కొన్ని సంస్థలు ఎప్పుడు బుక్ చేద్దామనుకున్నా... రద్దీగా ఉందని, మరో తేదీ చెప్పమని అడుగుతుంటాయి. ఆఖరికి ఆఫ్‌సీజన్‌లో అంటగడుతుంటాయి. అందుకే సంస్థ పనితీరు చూశాకే ఇలాంటివి ఎంచుకోవాలి. * మార్కెట్ ప్రతికూలంగా ఉన్నపుడో, ఆఫ్ సీజన్లోనో మీరు బుక్ చేస్తే తక్కువ ధరకు దొరికే అవకాశమున్నా... సభ్యులకు ఆ తగ్గింపు వర్తించదు. ఎందుకంటే వారు ముందే చెల్లించి ఉంటారు కనక. * ఇది పెట్టుబడి సాధనం కాదు. ఏటా కుటుంబంతో కలసి టూర్లకు తప్పకుండా వెళ్లేవారికే పనికొస్తుంది. * కొన్ని సంస్థలు దీన్ని కూడా ఒక పెట్టుబడి సాధనంగా చూపిం చి... మీ బదులు వేరేవారికి ఇచ్చుకోవచ్చని, డ బ్బులు ఆర్జించవచ్చని చెబుతుంటాయి. అలాంటివి నమ్మి మోసపోవద్దు. హైదరాబాద్‌లోనూ టైమ్‌షేర్ ప్రాంతాలు.. గోవా, మున్నార్, ఆగ్రా, మనాలి, సిమ్లా, బెంగళూరు, కూనూరు, కూర్గ్, చిలీ, డార్జిలింగ్, జోధ్‌పూర్, హైదరాబాద్ వంటి వందల ప్రాంతాల్లో టైమ్‌షేర్ ప్రాపర్టీలున్నాయి. హైదరాబాద్ వేదికగా మేడ్చల్, యాదాద్రి, చిలుకూరు బాలాజీ రోడ్ వంటి ప్రాంతాల్లో టైమ్‌షేర్ ప్రాపర్టీలున్నాయి. తమకు సొంతంగా 55 ప్రాపర్టీలున్నాయని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో 200 ప్రాపర్టీలతో ఒప్పందం ఉందని కంట్రీ క్లబ్ చెబుతోంది. క్లబ్ మహీంద్రాకు 40 ప్రాపర్టీలున్నాయి. క్లబ్ మహీంద్రా వివిధ పేర్లతో రూ.2.22 లక్షల నుంచి రూ.17.21 లక్షల విలువైన ప్యాకేజీలను విక్రయిస్తోంది. వీటి గడువు కూడా 5 నుంచి 30 ఏళ్ల వరకూ ఉంది. ప్రస్తుతం స్టెర్లింగ్ హాలిడేస్‌కు దేశ వ్యాప్తంగా 21 ప్రాంతాల్లోని 24 రిసార్టుల్లో 1,767 రూమ్స్ ఉన్నాయి. మన వాళ్లు ట్రావెల్ ప్రియులే...! * ఈ-ట్రావెల్ మార్కెటింగ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలో 36 శాతం మంది పర్యాటకులు ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ప్రయాణాలు చేస్తున్నారు. అది కూడా ఆతిథ్య సంస్థలందించే డీల్స్, డిస్కౌంట్స్ ఆధారంగానేనట!. * ట్రావెల్ సెర్చింజిన్ ‘స్కైస్కానర్’ సర్వే ప్రకారం... ప్రపంచంలోనే భారతీయ పర్యాటకులది మొదటి స్థానం. భారతీయుల్ని పరిశోధనాత్మక పర్యాటకులుగా వర్ణించిన ఈ సర్వే... 2015 జూన్ నాటికి ఇండియన్లు ఐర్లాండ్, స్వీడన్, గ్రీస్, జపాన్ వంటి 230 దేశాల్ని సందర్శించారని తెలిపింది. ‘‘భారతీయులకు ప్రయాణమనేది ఓ ఫ్యాషన్. ఏడాదిలో కనీసం మూడు సెలవుల రోజుల్ని టూర్‌కు వాడాలనిలక్ష్యంగా పెట్టుకుంటారు’’ అని ట్రిప్ అడ్వైజర్ సంస్థ కూడా చెబుతోంది. టైమ్‌షేర్‌తో లాభాలు ఇవీ... * తక్కువ ధరలో నాణ్యమైన హోటల్ గది, సేవలను పొందవచ్చు. * చాలా వరకు ప్రాపర్టీలు సిటీకి దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. కాలుష్యానికి దూరంగా.. వెకేషన్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. * సభ్యత్వ రుసుమును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా నెలవారీ వాయిదాల్లో చెల్లించే అవకాశం కూడా ఉంది. * ఏటా తప్పనిసరిగా ఏదో ఒక ప్రాంతానికి సెలవులు గడపటానికి వెళ్లేవారికీ, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నవారికీ ఇది అనుకూలం. * కొన్ని సంస్థలు బుకింగ్‌లో సభ్యులకు ప్రాధాన్యమిస్తుంటాయి. కనీసం నెల ముందో, 20 రోజుల ముందో బుక్ చేయాలనే నిబంధన పెట్టి... ఆ మేరకు బుక్ చేసినవారికి ఎంత రద్దీ సమయంలోనైనా గదులు కేటాయిస్తూ ఉంటాయి. -
ఆ‘పత్తి’ తీరేనా?
నేటి నుంచి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ప్రారంభంకానున్న కొనుగోళ్లు సెలవు రోజుల్లో మిల్లుల వద్దపత్తి కొనుగోళ్లు భారీగా తరలిరానున్న పత్తి కొనుగోళ్లు సాఫీగా జరగాలని రైతుల ఆకాంక్ష వరంగల్ సిటీ : వారం రోజుల పండుగ సెలవులు పూర్తయ్యూరుు. నేటి(సోమవారం) నుంచి వరంగల్ వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవనున్నారుు. ఇప్పటిదాకా కొనుగోళ్లు జరిగిన తీరు రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. యంత్రాలు, సామగ్రి, సిబ్బంది, అధికారులు ఇలా అందరూ అందుబాటులో ఉన్నా..పత్తి కొనుగోళ్లు కనీస అంచనాలను అందుకోవడం లేదు. దీంతో సీసీఐ సేవల పరిస్థితి అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయూరైంది. ఈనెల 1న సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 81వేల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రాగా, సీసీఐ అధికారులు కేవలం 676 క్వింటాళ్లే కొన్నారు. దీన్ని బట్టి కొనుగోళ్లలోని వైఫల్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. నేటి నుంచి జరిగే కొనుగోళ్లైనా సాఫీగా జరగాలని రైతులు కోరుకుంటున్నారు. పెద్దఎత్తున పత్తి మార్కెట్‌కు తరలిరానుంది. మార్కెట్‌కు లూజు పత్తి కాకుండా ప్రతిరోజూ కనీసం 40 నుంచి 60 వేల పైచిలుకు పత్తి బస్తాలు అమ్మకానికి రానున్నట్లు మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కావాలని ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్ల నుంచి తప్పుకున్నా, తక్కువ ధరతో కొనుగోళ్లు చేపట్టినా మళ్లీ గొడవలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. నామమాత్రంగా ‘సీసీఐ’ కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 84 సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ.4100 ధరకు పత్తి కొంటామని ప్రకటించింది. అరుునా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 10 సెంటర్లే ప్రారంభమయ్యాయి. వీటిలో నామమాత్రంగా నడుస్తున్నవి 6 సెంటర్లు. మిగతా 4 సెంటర్లను తూతూమంత్రంగా నడిపిస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రకటించే నిర్ణయూల అమలులో క్షేత్రస్థారుులో జరుగుతున్న వైఫల్యానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది. చెక్‌పోస్టుల్లో వసూళ్ల దందా.. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక..రోజుకు 15 నుంచి 20 లారీల పత్తి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇక సెలవురోజుల్లో పత్తి మిల్లుల వద్ద బ్రోకర్లు కొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, మామూళ్లకు అలవాటు పడిన సిబ్బంది పత్తి లోడ్లు తరలివెళ్లేందుకు సహకరిస్తున్నారు. ప్రతీ చెక్‌పోస్టు వద్ద రూ.2500 నుంచి రూ.3000 ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కమర్షియల్ ట్యాక్స్ రూపేణా వచ్చే ఆదాయం సైతం తగ్గిపోతోంది. కాగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పత్తికి క్వింటాలుకు రూ.4500 నుంచి రూ.4800 ధర పలుకుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారుు. అందుబాటులోకి మరిన్ని తేమ యంత్రాలు సెలవుల అనంతరం వరంగల్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున పత్తి రాానున్నదనే సమాచారంతో మార్కెట్ కార్యదర్శి మరో 5 తేమను కొలిచే యంత్రాలను తెప్పించారు. ఇప్పటికే తేమ శాతాన్ని కొలిచే 10 చిన్న మిషన్లు, 5 పెద్ద మిషన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి సీసీఐ పత్తి కొనుగోళ్లను భారీ ఎత్తున చేపడుతోందని, మార్కెట్లో ప్రత్యేకంగా 6 వే బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు సీసీఐ కోసం ప్రత్యేక పత్తి యార్డును ఏర్పాటు చేశారు. కానీ సీసీఐ మాత్రం అంచనాలకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లను చేపట్టడం లేదు. రైతులకు మద్దతు ధర అందించక తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ మార్కెట్లో.. శర్మ ఔట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్ల కోసం 2 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రధాన ఇన్చార్జి అధికారిగా ఆర్కే శర్మను నియమించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో మార్కెట్ వెనుకంజకు ఆయనే కారణమనే ఆరోపణలున్నారుు. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి కారణంగా పెద్ద ఎత్తున పత్తి నిల్వలు లారీలలో ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇక వరంగల్ మార్కెట్లో సీసీఐ ఇన్చార్జిగా సేవలందిస్తున్న శర్మ ప్రస్తుత పరిస్థితులను చూసి ఈ సారి లాభాలు గడించే అవకాశం లేదని నిర్ణయించుకొని సెలవు రోజుల్లో స్వయంగా వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో వరంగల్ మార్కెట్‌కు ఇన్చార్జి అధికారిగా ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదు. ఈ క్రమంలో సీసీఐ వరంగల్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు మరీ కష్టంగా మారారుు. -
రూ.100 కోట్లు తాగేశారు!
సిటీబ్యూరో: దసరా సెలవులకు గ్రేటర్ పరిధిలో మందు బాబులు మస్త్ మజా చేసుకున్నారు. మద్యం అమ్మకాలు చుక్కలను తాకాయి. గతఏడాదితో పోలిస్తే అమ్మకాలు రూ.25 కోట్ల మేర పెరిగినట్లు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్ పరిధిలోని 460 మద్యం దుకాణాలు, మరో 500 బార్లలో మద్యం అమ్మకాల జోరు పెరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారుల అంచనా. ఈ నెల 1 నుంచి 22 వరకు అమ్మకాలు చుక్కలను తాకినట్లు పేర్కొన్నాయి. సాధారణంగా గ్రేటర్లో రోజుకు రూ.10 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరుగుతుండగా దసరా సందర్భంగా సోమ, మంగళ, బుధ, గురువారాల్లో అమ్మకాలు సుమారు రూ.25 కోట్ల మేర ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే మొత్తంగా గ్రేటర్ పరిధిలో పండగ సెలవులకు మందుబాబులు రూ.100 కోట్ల మేర ‘తాగే’శారన్న మాట. గత ఏడాది ఈ సమయంలోఅమ్మకాలు రూ.75 కోట్లకు మించలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. గత 22 రోజులుగా 10 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు ఎకై ్సజ్ శాఖ లెక్కగట్టింది. ఐఎంఎల్ మద్యం 7 లక్షల కేసులు అమ్ముడుపోయినట్లు అంచనావేసింది. -
మాకు పండుగల్లేవా?
- కుటుంబసభ్యులతో సంతోషంగా గడపొద్దా అంటున్న ఉద్యోగులు - ప్రతి పండుగకు ప్రభుత్వ కార్యక్రమాల్లోనే గడపాల్సి వస్తోందని ఆవేదన సాక్షి, హైదరాబాద్: అమ్మకు ఆదివారం లేదా? అంటూ అప్పట్లో స్త్రీవాదులు సంధించిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేసింది. ఇప్పుడు.. మాకు పండుగల్లేవా? ఆరోజు మేము కుటుంబసభ్యులతో గడపొద్దా? అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి పండక్కీ తమతో ఏదోవిధమైన పని చేయిస్తోందని, తద్వారా ప్రభుత్వం ఏదో చేసేస్తోందనే భ్రమ ప్రజల్లో కల్పించడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉందని అంటున్నారు. ఏడాదిన్నరగా ఇదే తంతు! టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంగా ప్రతి పండుగకు ఏదో అధికారిక కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనాల్సిన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. గత సంక్రాంతి రోజున.. ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు పేరిట ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహించి ఉద్యోగులకు ఊపిరాడకుండా చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాదికీ అలాంటి పరిస్థితే కల్పించింది. ఇక డిసెంబర్లో వచ్చిన క్రిస్మస్ రోజునా ఇలానే చేసింది. ఇప్పుడు దసరా రోజున అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల ఉద్యోగులకు సెలవులు ఇప్పటికే రద్దు చేశారు. ఇక మిగతా 11 జిల్లాల ఉద్యోగులనూ ఆ రోజు బిజీగా ఉంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రజలకు సేవ చేయడానికి సెలవు రోజుల్లో పనిచేయడానికి సిద్ధమేనని, అయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ సేవలు ఉండాలని ఉద్యోగులు అంటున్నారు. తమ కుటుంబాల సంగతీ ఆలోచించాలంటున్నారు. -
కాలుష్యం తగ్గిందోచ్!
పండగ సెలవుల్లో సిటీ ఖాళీ 50 శాతం తగ్గిన కాలుష్యం 15,16 తేదీల్లో గణనీయంగా తగ్గిన కాలుష్య ఉద్గారాలు శబ్ద కాలుష్యమూ తగ్గుముఖం వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కకపోవడమే కారణం ట్రాఫిక్ జంఝాటం... వాయు కాలుష్యంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యే దుస్థితి.. భరించలేని శబ్దాల నుంచి నగర వాసికి రెండు రోజుల పాటు ఉపశమనం లభించింది. సంక్రాంతికి గ్రేటర్ నుంచి సుమారు 20 లక్షల మంది పల్లె బాట పట్టారు. వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కడం గణనీయంగా తగ్గింది. దీంతో గ్రేటర్లో వాయు, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఈ నెల 15,16 తేదీల్లో కాలుష్య నియంత్రణ మండలి బృందాలు పంజగుట్ట, జూ పార్క్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సనత్‌నగర్ ప్రాంతాల్లో వాయు కాలుష్య మోతాదును నమోదు చేశాయి. కాలుష్య కారకాలు సాధారణ రోజుల్లో కంటే ఈ తేదీల్లో కొన్ని చోట్ల సగానికి, మరి కొన్నిచోట్ల భారీగా తగ్గినట్లు పీసీబీ నివేదిక వెల్లడించింది. వరుస సెలవులతో మెజార్టీ సిటీజనులు వ్యక్తిగత వాహనాలను ఇళ్లలో పెట్టి... సొంత ఊళ్లకు వెళ్లడంతోకాలుష్యం గణనీయంగా తగ్గినట్లు పీసీబీ అధికారులు తెలిపారు. శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గడంతో నగర వాసులు ఉపశమనం పొందారు. గ్రేటర్‌లోని 6111 కి.మీ.ల రహదారులపై నిత్యం 40 లక్షల వాహనాలు (అన్ని రకాలు) రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇందులో సగం మాత్రమే రోడ్డెక్కడంతో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని పీసీబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ ధూళికణాల మోతాదు పంజగుట్టలో సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో 200 మైక్రోగ్రాములకు పైమాటే. ఈ నెల 15న కేవలం 85 మైక్రోగ్రాములే నమోదైంది. జూ పార్క్ వద్ద సాధారణ రోజుల్లో 220 మైక్రోగ్రాములు ఉంటుంది. కానీ 16న కేవలం 83 మైక్రోగ్రాములే నమోదైంది. సెంట్రల్ యూనివర్సిటీలో సాధారణం 103 మైక్రోగ్రాములు. ఈ నెల 16న 53 మైక్రోగ్రాములే ఉంది. సనత్‌నగర్‌లోనూ సాధారణంగా 212 మైక్రోగ్రాములు ఉంటుంది. కానీ ఈనెల 15న 106 మైక్రో గ్రాములు మాత్రమే నమోదైంది. సగానికి తగ్గిన శబ్ద కాలుష్యం సాధారణంగా 60 డెసిబుల్స్ శ్రావ్య అవధి దాటిన శబ్దాలు వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. నిత్యం వాహనాల రణగొణ ధ్వనులతో 80 డెసిబుల్స్ కన్నా అధిక శబ్దాలు వినే నగర జీవికి ఈ నెల 15,16 తేదీల్లో కాస్త ఉపశమనం లభిం చింది. అబిడ్స్ (వాణిజ్య ప్రాంతం)లో 71 డెసిబుల్స్, గచ్చిబౌలిలో 57, గడ్డపోతారం (పారిశ్రామికవాడ)లో 63.9, జీడిమెట్ల (పారిశ్రామికవాడ)లో 56, ప్యారడైజ్ (వాణిజ్య ప్రాం తం)లో 72, పంజగుట్ట (వాణిజ్య ప్రాంతం)లో 73.3, తార్నాక(నివాస)లో 54.2, జూ పార్క్(నిశ్శబ్ద) ప్రాంతంలో 52.3 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం నమోదైంది. దీంతో సిటీ జనులకు పండగ పూట ప్రశాంతంగా గడిపే అవకాశం దక్కింది. బెంజీన్ కల్తీ ఇంధనాల నుంచి వెలువడే క్యాన్సర్ కారక బెంజీన్ మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు మించరాదు. కానీ పంజగుట్టలో సాధారణ రోజుల్లో 5 మైక్రోగ్రాములకు పైబడే ఉంటుంది. పండగ రోజున మా త్రం 2.85 మైక్రోగ్రాములే ఉంది. జూపార్క్ వద్ద సాధార ణం 4.5 మైక్రోగ్రాములు కాగా... ఈ నెల 16న 4 మైక్రోగ్రాములకు పరిమితమైంది. సెంట్రల్ వర్సిటీ వద్ద సాధారణ రోజుల్లో 2.2 మైక్రోగ్రాములు. 16న 1 మైక్రోగ్రామ్ మాత్రమే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో 5.1 మైక్రోగ్రాములు కాగా... 16న 3.3 మైక్రోగ్రాములే ఉంది. కార్బన్ మోనాక్సైడ్ బ్రాంకైటిస్‌కు కారణమయ్యే కార్బన్ మోనాక్సైడ్ మోతా దు పంజగుట్టలో సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో 2.2 మైక్రోగ్రాములుగా నమోదవుతుంది. ఈ నెల 16న 1.53 మైక్రోగ్రాములుగా నమోదైంది. జూ పార్క్‌లో సాధారణం 2.20 మైక్రోగ్రాములు. పండగ వేళ 1.15కు తగ్గింది. సెంట్రల్ వర్సిటీ వద్ద సాధారణంగా 1.1 ఉంటుంది. ఈ నెల16న 0.46 మైక్రోగ్రాములకు పడిపోయింది. సనత్‌నగర్‌లో సాధారణంగా 1.19 మైక్రోగ్రాములు నమోదవుతుంది. ఈ నెల 16న 0.58కి తగ్గింది. నైట్రోజన్ డయాక్సైడ్ శ్వాస కోశ వ్యాధులకు కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో సాధారణ రోజుల్లో పంజగుట్టలో 120 మైక్రోగ్రాములు ఉంటుంది. పండగ రోజున 48 మైక్రోగ్రాములకు తగ్గింది. జూ పార్క్ వద్ద సాధారణం 121 మైక్రోగ్రాములు కాగా...15న 71 మైక్రోగ్రాములకే పరిమితమైంది. సెంట్రల్ వర్సిటీ వద్ద 101 మైక్రోగ్రాములకు ఈనెల 16న 80 మైక్రోగ్రాములే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో 120 మైక్రోగ్రాములు ఉంటుంది. 16న కేవలం 39 మైక్రోగ్రాములే నమోదైంది. 15, 16 తేదీల్లో కాలుష్య కారకాల మోతాదు... దుమ్ము, ధూళి కణాలు (పీఎం10): పంజగుట్టలో సాధారణ రోజుల్లో దుమ్ము, ధూళి కణాల (పీఎం10) మోతాదు క్యూబిక్ మీటరు గాలిలో 234 మైక్రోగ్రాములు ఉంటుంది. ఈ నెల 15,16 తేదీల్లో మాత్రం 121 మైక్రోగ్రాములే నమోదైంది. జూ పార్క్ వద్ద సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో ధూళి కణాల మోతాదు 320 మైక్రోగ్రాములు. ఈ నెల 16న కేవలం 164 మైక్రోగ్రాములే నమోదైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద సాధారణ రోజుల్లో 200 మైక్రోగ్రాముల పీఎం 10 నమోదవుతుంది. 16న కేవలం 99 మైక్రోగ్రాములే నమోదైంది. సనత్‌నగర్‌లో సాధారణ రోజుల్లో పీఎం10 మోతాదు 250 మైక్రోగ్రాములు. 15న మాత్రం 101 మైక్రోగ్రాములే నమోదైంది. -
పాపం పసిపాప
తిరుపతి క్రైం : ‘‘అత్తా.. ఊపిరి ఆడటంలేదు. పొగ.. మంటలు... ఎక్కడున్నావ్ అత్తా.. ప్లీజ్ కాపాడత్తా.. పాణం పోయేట్టుంది.. ప్లీజ్ తలుపు తీ అత్తా’’ అంటూ ఆ చిన్నారి చేసిన రోదనలు, ఆర్తనాదాలు ఎవరికీ వినపడలేదు. సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో ఇంట్లో కూర్చుని టీవీలో వచ్చే పోగో బొమ్మలు చూస్తూ కేరింతలు కొడుతున్న ఆరేళ్ల పసిపాపను షార్ట్ సర్క్యూట్ రూపంలో మృత్యువు కబళించింది. ఒల్లంతా కాలిపోయి ఊపిరి ఆడని స్థితిలో గంటపాటు మృత్యువుతో పోరాడిన ఆ చిట్టి తల్లి చివరకు కన్నుమూసింది. ‘‘నిన్ను బాగా చదివించి డాక్టర్‌ను చేస్తానని మీ అమ్మకు మాట ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను.. మీ అమ్మకు ఏం సమాధానం చెప్పేది.. లేమ్మా లాస్యా.. అత్తను వచ్చాను.. ఒక్కసారి చూడు తల్లి..’’ అంటూ లాస్య మృతదేహంపై పడి అత్త బోరున విలపించడం అందరినీ కంట తడిపెట్టించింది. అసలు ఏమి జరిగిందంటే... వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మునక్కాయలపల్లెకు చెందిన సుబ్బరాయుడు, వరలక్ష్మమ్మలకు లాస్య(6) ఒక్కతే కుమార్తె. అక్కడ మంచి పాఠశాలలు లేకపోవడంతో తిరుపతిలోని మేనత్త సుజాత దగ్గరకు ఏడాది క్రితం చిన్నారిని పంపించారు. బాగా చదివించాలని కోరారు. సుజాత లాస్యను స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. అల్లారుముద్దుగా చూసుకుంటోంది. శుక్రవారం నుంచి స్కూల్‌కు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. దీంతో లాస్య ఇంట్లోనే ఉంది. ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు సుజాత బయలుదేరింది. తనతోపాటు లాస్యను కూడా రమ్మని చెప్పింది. తాను టీవీ చూస్తానని చెప్పడంతో టీవీ ఆన్‌చేసి, లాస్యను లోపల పెట్టి బయట తాళం వేసుకుని సుజాత ప్రసూతి ఆసుపత్రికి వెళ్లింది. ఇంతలో ఇంట్లో షార్టు సర్క్యూట్ కావడంతో లాస్య ఉన్న గదిలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. మంటలు వ్యాపించాయి. దీంతో పాప దాదాపు గంటపాటు పొగ, మంటలకు ఉక్కిరిబిక్కిరై అరుపులు కేకలతో అల్లాడింది. చిన్నగది కావడం, తలుపులు వేసి ఉండటంతో లాస్య ఆర్తనాదాలు బయటికి వినిపించలేదు. సిలెండర్ లీకేజీ అనుకుని.. సుజాత ఇంటిలో నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు దగ్గరకు వెళ్లలేదు. ఇంట్లో సిలిండర్ లీకేజీతో మంటలు వ్యాపిస్తున్నాయని దగ్గరకు వెళితే ప్రమాదమని వారు భయపడ్డారు. పాప ఇంట్లో ఉన్న సంగతి వారికి తెలీదు. దాదాపు గంట తర్వాత పక్కనే ఉన్న బారులో నుంచి కొందరు వచ్చి ఇంటి తలుపులు పగుల కొట్టారు. అప్పటికే ఊపిరాడక స్పృహతప్పి పడిపోయిన లాస్యను వారు గమనించలేదు. ఇంట్లో కాలిపోయిన వస్తువులను మాత్రమే చూశారు. స్థానికులు ఈ విషయాన్ని సుజాతకు ఫోన్ ద్వారా తెలిపారు. ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చింది. అప్పటికే తలుపులు తెరిచి ఉండటంతో బిడ్డ బ్రతికే ఉంటుందనుకుంది. ఇంటి వెలుపల పాప కనిపించకపోవడంతో లాస్య లోపల ఉందంటూ ఆర్తనాదాలు చేసింది. స్థానికులు లోపల పరిశీలించి స్పృహతప్పి పడివున్న లాస్యను బయటకు తీసుకువచ్చారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే తుది శ్వాస విడిచింది. అయినా మమకారం తీరని ఆమె అత్త ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే లాస్య చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. బడి ఉన్నా... 5 నిమిషాలు ముందు గుర్తించినా... శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడం వల్ల లాస్యను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచాల్సి వచ్చిందని, బడి ఉన్నట్టయితే బిడ్డ బతికేదని సుజాత కన్నీరుమున్నీరుగా విలపించింది. తలుపులు పగులకొట్టిన వెంటనే బిడ్డను గుర్తించినా... ఐదు నిమిషాల ముందు తెలిసినా పాప ప్రాణం నిలిచేదని స్థానికులు, వైద్యులు తెలిపారు. దీనిపై వెస్టు సీఐ అంజుయాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెడికల్ కళాశాలకు తరలించారు.