పాపం పసిపాప | Sadly diaper | Sakshi
Sakshi News home page

పాపం పసిపాప

Published Sat, Jan 10 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

పాపం పసిపాప

పాపం పసిపాప

తిరుపతి క్రైం : ‘‘అత్తా.. ఊపిరి ఆడటంలేదు. పొగ.. మంటలు... ఎక్కడున్నావ్ అత్తా.. ప్లీజ్ కాపాడత్తా.. పాణం పోయేట్టుంది.. ప్లీజ్ తలుపు తీ అత్తా’’ అంటూ ఆ చిన్నారి చేసిన రోదనలు, ఆర్తనాదాలు ఎవరికీ వినపడలేదు. సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో ఇంట్లో కూర్చుని టీవీలో వచ్చే పోగో బొమ్మలు చూస్తూ కేరింతలు కొడుతున్న ఆరేళ్ల పసిపాపను షార్ట్ సర్క్యూట్ రూపంలో మృత్యువు కబళించింది.

ఒల్లంతా కాలిపోయి ఊపిరి ఆడని స్థితిలో గంటపాటు మృత్యువుతో పోరాడిన ఆ చిట్టి తల్లి చివరకు కన్నుమూసింది. ‘‘నిన్ను బాగా చదివించి డాక్టర్‌ను చేస్తానని మీ అమ్మకు మాట ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను.. మీ అమ్మకు ఏం సమాధానం చెప్పేది.. లేమ్మా లాస్యా.. అత్తను వచ్చాను.. ఒక్కసారి చూడు తల్లి..’’ అంటూ లాస్య మృతదేహంపై పడి అత్త బోరున విలపించడం అందరినీ కంట తడిపెట్టించింది.
 
అసలు ఏమి జరిగిందంటే...
వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేట మునక్కాయలపల్లెకు చెందిన సుబ్బరాయుడు, వరలక్ష్మమ్మలకు లాస్య(6) ఒక్కతే కుమార్తె. అక్కడ మంచి పాఠశాలలు లేకపోవడంతో తిరుపతిలోని మేనత్త సుజాత దగ్గరకు ఏడాది క్రితం చిన్నారిని పంపించారు. బాగా చదివించాలని కోరారు. సుజాత లాస్యను స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. అల్లారుముద్దుగా చూసుకుంటోంది. శుక్రవారం నుంచి స్కూల్‌కు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.

దీంతో లాస్య ఇంట్లోనే ఉంది. ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు సుజాత బయలుదేరింది. తనతోపాటు లాస్యను కూడా రమ్మని చెప్పింది. తాను టీవీ చూస్తానని చెప్పడంతో టీవీ ఆన్‌చేసి, లాస్యను లోపల పెట్టి బయట తాళం వేసుకుని సుజాత ప్రసూతి ఆసుపత్రికి వెళ్లింది. ఇంతలో ఇంట్లో షార్టు సర్క్యూట్ కావడంతో లాస్య  ఉన్న గదిలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. మంటలు వ్యాపించాయి. దీంతో పాప దాదాపు గంటపాటు పొగ, మంటలకు ఉక్కిరిబిక్కిరై అరుపులు కేకలతో అల్లాడింది. చిన్నగది కావడం, తలుపులు వేసి ఉండటంతో లాస్య ఆర్తనాదాలు బయటికి వినిపించలేదు.
 
సిలెండర్ లీకేజీ అనుకుని..
సుజాత ఇంటిలో నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు దగ్గరకు వెళ్లలేదు. ఇంట్లో సిలిండర్ లీకేజీతో మంటలు వ్యాపిస్తున్నాయని దగ్గరకు వెళితే ప్రమాదమని వారు భయపడ్డారు. పాప ఇంట్లో ఉన్న సంగతి వారికి తెలీదు. దాదాపు గంట తర్వాత పక్కనే ఉన్న బారులో నుంచి కొందరు వచ్చి ఇంటి తలుపులు పగుల కొట్టారు. అప్పటికే ఊపిరాడక స్పృహతప్పి పడిపోయిన లాస్యను వారు గమనించలేదు. ఇంట్లో కాలిపోయిన వస్తువులను మాత్రమే చూశారు. స్థానికులు ఈ విషయాన్ని సుజాతకు ఫోన్ ద్వారా తెలిపారు.

ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చింది. అప్పటికే తలుపులు తెరిచి ఉండటంతో బిడ్డ బ్రతికే ఉంటుందనుకుంది. ఇంటి వెలుపల పాప కనిపించకపోవడంతో లాస్య లోపల ఉందంటూ ఆర్తనాదాలు చేసింది. స్థానికులు లోపల పరిశీలించి స్పృహతప్పి పడివున్న లాస్యను బయటకు తీసుకువచ్చారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే తుది శ్వాస విడిచింది. అయినా మమకారం తీరని ఆమె అత్త ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే లాస్య చనిపోయిందని డాక్టర్లు చెప్పారు.
 
బడి ఉన్నా... 5 నిమిషాలు ముందు గుర్తించినా...

శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడం వల్ల లాస్యను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచాల్సి వచ్చిందని, బడి ఉన్నట్టయితే బిడ్డ బతికేదని సుజాత కన్నీరుమున్నీరుగా విలపించింది. తలుపులు పగులకొట్టిన వెంటనే బిడ్డను గుర్తించినా... ఐదు నిమిషాల ముందు తెలిసినా పాప ప్రాణం నిలిచేదని స్థానికులు, వైద్యులు తెలిపారు. దీనిపై వెస్టు సీఐ అంజుయాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెడికల్ కళాశాలకు తరలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement