టైమ్ షేర్... చలో టూర్ | Time share... chalo ture | Sakshi
Sakshi News home page

టైమ్ షేర్... చలో టూర్

Published Mon, Jan 4 2016 3:05 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

టైమ్ షేర్... చలో టూర్ - Sakshi

టైమ్ షేర్... చలో టూర్

రోజూ పేపర్లో.. టీవీల్లో.. బయట హోర్డింగ్స్‌లో ఎక్కడ చూసిన ‘చలో నిక్లో.. ఫ్యామిలీ సే ఎంజాయ్ కరో’ అనే ట్యాగ్‌లైన్‌తో ఇస్తున్న ఆతిథ్య సంస్థల ప్రకటనలు రమేశ్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రమేశ్‌కు ఎప్పటి నుంచో దూర ప్రాంతాలకు ఒకసారి పర్యటించాలన్నది కోరిక. ధరలు కూడా అందుబాటులోనే ఉన్నట్టు కనిపించటంతో ఓ సారి ట్రైచేస్తే పోలా... అనుకున్నాడు. పండుగ సెలవులు కలసి రావటంతో ఆతిథ్య సంస్థల వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే దిమ్మ తిరిగిపోయింది. సాధారణ రోజుల్లో కంటే రెండింతల అధిక రేట్లున్నాయి మరి.  ఎందుకని ఆరా తీస్తే... పండుగ సెలవులిచ్చేది రమేశ్ ఒక్కడికే కాదుగా!! అందరికీనూ!!
 
శేఖర్‌ది మరో కథ. తనకు ఓ మంచి హాలిడే రిసార్ట్‌లో పాతికేళ్ల పాటు సభ్యత్వం ఉంది. ఏడాదిలో వారం రోజుల పాటు ఆ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న రిసార్ట్‌లలో ఎక్కడైనా ఒకచోట ఉండొచ్చు. అయితే గతేడాది వేసవి సెలవులు వచ్చినపుడు, ఈ ఏడాది పండుగ సెలవులు వచ్చినపుడు అక్కడికి వెళదామని ప్రయత్నించాడు. తను అడిగిన చోట రిసార్ట్ గదులు ఖాళీ లేవని, అన్నీ ముందే బుక్ అయిపోయాయని సమాధానం. రెండుసార్లు ప్రయత్నించగా... రెండుసార్లూ అదే సమాధానం. వాళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పిన తేదీల్లో ఇక్కడ శేఖర్‌కి సెలవుల్లేవు. తను సభ్యత్వం తీసుకునేటపుడే ఇవన్నీ ఆలోచించి ఉంటే బాగుండేదనుకున్నాడు మనసులో.
 
కొత్త సంవత్సరం వచ్చింది! సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు. కుటుంబంతో కలసి సెలవులు సరదాగా గడపటానికి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాడు సురేశ్. కుటుంబంతో మాట్లాడి... ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకున్నాడు. ప్రయాణానికి టికెట్లు కూడా సంపాదించాడు. అక్కడ బస చేయడానికి ఆన్‌లైన్లో సెర్చ్ చేశాడు. కాస్త మంచి హోటల్స్ అన్నీ... ముందే బుక్ అయిపోయాయి. ఖాళీగా ఉన్నవాటికి రేటింగ్స్ లేవు. యూజర్ల నుంచి ‘దీన్ని తీసుకోవటం శుద్ధ వేస్ట్’’ అంటూ కామెంట్లు కూడా ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక ముందుగా బుక్ చేయకుండానే బయలుదేరాడు. అక్కడ ఇబ్బందులు మామూలుగా లేవు. హాలిడే సీజన్ కావటంతో విపరీతమైన రద్దీ. అదీ కథ.
 
ఇదంతా ఎందుకంటే... ఇపుడు టైమ్ షేర్ ప్రాపర్టీల హవా నడుస్తోంది. చాలామంది వీటిలో సభ్యత్వం తీసుకుని సెలవుల్ని ఎంజాయ్ చేయగులుగుతున్నా... కొందరికి సభ్యత్వం ఉండి కూడా సదరు కంపెనీల తీరు వల్ల ఆ అవకాశం దక్కటం లేదు. ఇక దేన్లోనూ సభ్యత్వం లేనివారిదైతే మరో గొడవ. సీజన్లో వెళదామంటే విపరీతమైన చార్జీలు. వీటన్నిటి నేపథ్యంలో నిర్దిష్ట కాల వ్యవధికి మన యాజమాన్యంలో ఉండే ఆస్తుల (టైమ్‌షేర్ ప్రాపర్టీలు) వల్ల లాభమేంటి? నష్టాలేంటి? అసలు టైమ్‌షేర్ ప్రాపర్టీలంటే ఏంటి? వీటి వివరాలు ఏమిటి? వీటిలో సభ్యత్వం తీసుకునేదెలా? ఇవన్నీ వివరించేదే ఈ  ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం...

 
* సభ్యత్వం తీసుకుంటే ఏటా ఫ్రీ హాలిడేస్
* తక్కువ ఖర్చుకే స్టార్ హోటల్ వసతులు
* ఏటా తప్పనిసరిగా టూర్లకు వెళ్లేవారికి లాభమే
* వాడకపోయినా వార్షిక నిర్వహణ రుసుం తప్పదు
* ఆచితూచి ఎంచుకుంటేనే టైమ్‌షేర్‌తో లాభాలు
* హైదరాబాద్‌లోనూ టైమ్‌షేర్ ప్రాపర్టీలు..

 
అసలు టైమ్‌షేర్ ప్రాపర్టీ అంటే..? పలు వేడుకలు లేదా పార్టీలు జరుపుకునేందుకు వీలు కల్పించే ఉమ్మడి స్థిరాస్తి. అంటే ఒక లగ్జరీ హోటల్ గది లేదా స్టూడియో రూమ్ కావచ్చు. రిసార్ట్‌లో గది, విల్లా... ఇలా ఏదైనా కావచ్చు. ఒక హోటల్‌లో ఉండే గదుల్ని పాతికేళ్లో, 30 ఏళ్లో శాశ్వతంగా ఏడాదికి 5 రోజుల చొప్పునో, 10 రోజుల చొప్పునో, వారం రోజుల చొప్పునో లీజు కిస్తారన్న మాట. ఇలా ఇచ్చినందుకు ఒకేసారి సభ్యత్వ రుసుము తీసుకోవటంతో పాటు ఏడాది కి కొంత నిర్వహణ రుసుం కూడా తీసుకుంటారు.

ఆ హోటల్ మామూలుగానే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. కాకపోతే సభ్యులు బుక్ చేసుకున్నపుడు వారికి ప్రాధాన్యమివ్వటంతో పాటు... నిర్దిష్ట వ్యవధి పాటు వారికి ఉచితంగా బస కల్పిస్తారు. తీసుకునే సభ్యత్వాన్ని బట్టి కేవలం గది ఉచితంగా ఇవ్వటం, భోజన సదుపాయాలతో కలిపి ఇవ్వటం, ఇతరత్రా విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పించటం వంటివి ఉంటాయి. అలాగే రిసార్ట్‌లు కూడా. వీటిలో సభ్యులు కావటం వల్ల నిర్దేశిత సమయంలో... కుటుంబంతో కలసి అక్కడ హాయిగా గడపవచ్చన్న మాట.
 - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
 
40కి పైగా సంస్థలు...
దేశంలో టైమ్‌షేర్ ప్రాపర్టీల కొనుగోలు, అమ్మకం, లీజు వంటి సేవలను రిసార్ట్ కండోమినియమ్స్ ఇంటర్నేషన్ (ఆర్‌సీఐ), రమదా హోటల్స్ అండ్ రిసార్ట్స్, క్లబ్ మహీంద్రా, కంట్రీ క్లబ్, స్టెర్లింగ్ హోలిడే రిసార్ట్స్ వంటి 40కి పైగా సంస్థలు అందిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ సభ్యత్వాన్ని నెలసరి వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేసే వీలును కూడా కల్పిస్తున్నాయి. వీటిలో 20 లక్షల మంది సభ్యులున్నారని, ఏటా కొత్తగా 15వేల మంది చేరుతున్నారని ఆల్ ఇండియా రిసార్ట్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఆర్‌డీఏ) చైర్మన్ రమేష్ రామనాథన్  చెప్పారు.

‘‘గడిచిన ఐదేళ్ల నుంచీ టైమ్ షేర్ ప్రాపర్టీల సంసృ్క తి పెరుగుతోంది. అందుకే మొత్తం పర్యాటకుల్లో టైమ్‌షేర్ సభ్యుల సంఖ్య కేవలం 0.069 శాతంగానే ఉంది. కాకపోతే 2006-15 మధ్య ఈ రంగం ఏటా 20 శాతం వృద్ధి రేటును కనబరుస్తూ వచ్చింది. ప్రాపర్టీ ఎంపిక, నిర్వహణలో పారదర్శకత, కస్టమర్ల సంతృప్తే ఇందుకు కారణం’’ అని వివరించారాయన.
 
ఇదీ... టైమ్‌షేర్ ఆరంభం
టైమ్‌షేర్ ప్రాపర్టీలు ఎలా మొదలయ్యాయనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ ఓ పరిశోధనా పత్రాన్ని తయా రు చేశారు. దాని ప్రకారం.. టైమ్‌షేర్ అనే హాలిడే ప్రణాళికను మొదట తీసుకొచ్చింది అమెరికా. 1968లో హోటల్ హవాయ్‌ని టైమ్‌షేర్ ప్రాపర్టీగా మార్చారు. 1970లో అమెరికాలో చమురు సంక్షోభం తలెత్తటంతో ప్రాపర్టీ నిర్వహణ భారంగా మారింది. దీంతో హవాయ్ కథ ముగిసింది.

1980 నుంచి నిర్మాణ రంగం ఊపందుకోవటంతో మళ్లీ టైమ్‌షేర్ ప్రాపర్టీలొచ్చాయి. వీటి ఆదరణ ఎలా ఉందంటే.. అప్పటివరకు అనిశ్చితిలో ఉన్న సెయింట్ థామస్, ఫోర్ట్ లాడర్డల్, పోర్టోరికో వంటివి కూడా టైమ్‌షేర్ ప్రాపర్టీలుగా మారిపోయాయి. ఇక మన దేశంలోకి తొలిసారిగా టైమ్‌షేర్ ప్రాపర్టీలను తీసుకొచ్చింది మాత్రం.. 1985లో వచ్చిన దాల్మియా రిసార్ట్స్. విదేశీ యాజమాన్యం, నిర్వహణ భారంతో పెద్దగా ఆదరణ పొందలేదు. ఆ తర్వాత... అంటే 1986లో ఆర్ సుబ్రమణియన్ చెన్నై కేంద్రంగా ప్రారంభించిన స్టెర్లింగ్ రిసార్ట్స్ విజయవంతమయింది. ఆ రోజుల్లోనే స్టెర్లింగ్‌కు దేశంలో 14 రిసార్ట్‌లు, 12 హాలిడే డెస్టినేషన్స్, లక్ష మంది సభ్యులు ఉండేవారు.
 
నిజంగానే డబ్బులు ఆదా అవుతాయా!
టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వంతో డబ్బులు ఆదా అవుతాయనేది సంస్థల మాట. అవి చెబుతున్న దాని  ప్రకారం... సాధారణంగా ఫైవ్‌స్టార్ హోటల్‌లో వసతి కోసం రోజుకు కనీసం రూ.10-12 వేల మధ్య చెల్లించాలి. వారానికైతే రూ.70-85 వేలు ఉంటుంది. అదే టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వం ప్రారంభ ధర రూ.2-3 లక్షలుంటుంది. ఈ ప్రాపర్టీని ఏడాదికి వారం రోజుల చొప్పున 30 ఏళ్ల పాటు వినియోగించుకోవచ్చు. అంటే వారానికి రూ.10 వేలన్నమాటేగా. ఒకవేళ 30 ఏళ్లలో ఈ ధరలు భారీగా పెరిగినా... సభ్యులకు మాత్రం చివరిదాకా ఉచితంగానే వస్తుంది.
 
జాగ్రత్త పడకుంటే నష్టమే...!
* టైమ్‌షేర్ ప్రాపర్టీలతో నష్టాలున్నాయని చెప్పలేం గానీ... అన్ని రంగాల మాదిరిగానే దీనికీ నాణేనికి రెండో వైపు ఉంది.
* అందుకే మంచి పేరున్న టైమ్‌షేర్ సంస్థ, బ్రాండ్‌కు ప్రాధాన్యమిచ్చే సంస్థల్లోనే సభ్యత్వం తీసుకోవాలి. ప్రాపర్టీలు బాగుంటే సరిపోదు. వాటి నిర్వహణ కూడా బాగుండాలి. క్లబ్‌ను ఎంచుకునే ముందు సంబంధిత సంస్థ గురించి మనకంటే ముందున్న కస్టమర్ల అభిప్రాయాలు, అనుభవాలు తెలుసుకోవాలి.
* టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వానికయ్యే ఖర్చు సంగతి పక్కన పెడితే దాని నిర్వహణ కోసం ఒక్కో సభ్యుడు ఏటా కొంత సొమ్ము చెల్లించాలి. ఇది రూ.10-20 వేల మధ్య ఉండొచ్చు. అనివార్య కారణాల వల్ల సభ్యులు ఆ ఏడాది వినియోగించుకోకపోయినా నిర్వహణ రుసుము తప్పదు. దీనికి పరిష్కార మార్గంగా... సబ్‌స్క్రిప్షన్‌ను బంధువులు, స్నేహితులకు బహుమతిగా ఇచ్చే వీలును కల్పిస్తున్నా... వారు బయటి వారు కనక ఒక్కరికి రూ.1,100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
* ప్రాంతాలను ఎంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకిచ్చిన ప్యాకేజీలో 50 ప్రాంతాలుంటాయనుకుందాం. ఎన్నాళ్లయినా వాటిలోనే ఏదో ఒకటి ఎంచుకోవాలి. వేరే ప్రాంతానికి వెళదామనుకుంటే ఈ సభ్యత్వం పనికిరాదు.
* కొన్ని సంస్థలు ఎప్పుడు బుక్ చేద్దామనుకున్నా... రద్దీగా ఉందని, మరో తేదీ చెప్పమని అడుగుతుంటాయి. ఆఖరికి ఆఫ్‌సీజన్లో అంటగడుతుంటాయి. అందుకే సంస్థ పనితీరు చూశాకే ఇలాంటివి ఎంచుకోవాలి.
* మార్కెట్ ప్రతికూలంగా ఉన్నపుడో, ఆఫ్ సీజన్లోనో మీరు బుక్ చేస్తే తక్కువ ధరకు దొరికే అవకాశమున్నా... సభ్యులకు ఆ తగ్గింపు వర్తించదు. ఎందుకంటే వారు ముందే చెల్లించి ఉంటారు కనక.
* ఇది పెట్టుబడి సాధనం కాదు. ఏటా కుటుంబంతో కలసి టూర్లకు తప్పకుండా వెళ్లేవారికే పనికొస్తుంది.
* కొన్ని సంస్థలు దీన్ని కూడా ఒక పెట్టుబడి  సాధనంగా చూపిం చి... మీ బదులు వేరేవారికి ఇచ్చుకోవచ్చని, డ బ్బులు ఆర్జించవచ్చని చెబుతుంటాయి. అలాంటివి నమ్మి మోసపోవద్దు.
 
హైదరాబాద్‌లోనూ టైమ్‌షేర్ ప్రాంతాలు..
గోవా, మున్నార్, ఆగ్రా, మనాలి, సిమ్లా, బెంగళూరు, కూనూరు, కూర్గ్, చిలీ, డార్జిలింగ్, జోధ్‌పూర్, హైదరాబాద్ వంటి వందల ప్రాంతాల్లో టైమ్‌షేర్ ప్రాపర్టీలున్నాయి.  హైదరాబాద్ వేదికగా మేడ్చల్, యాదాద్రి, చిలుకూరు బాలాజీ రోడ్ వంటి ప్రాంతాల్లో టైమ్‌షేర్ ప్రాపర్టీలున్నాయి. తమకు సొంతంగా 55 ప్రాపర్టీలున్నాయని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో 200 ప్రాపర్టీలతో ఒప్పందం ఉందని కంట్రీ క్లబ్ చెబుతోంది. క్లబ్ మహీంద్రాకు 40 ప్రాపర్టీలున్నాయి. క్లబ్ మహీంద్రా వివిధ పేర్లతో రూ.2.22 లక్షల నుంచి రూ.17.21 లక్షల విలువైన ప్యాకేజీలను విక్రయిస్తోంది. వీటి గడువు కూడా 5 నుంచి 30 ఏళ్ల వరకూ ఉంది. ప్రస్తుతం స్టెర్లింగ్ హాలిడేస్‌కు దేశ వ్యాప్తంగా 21 ప్రాంతాల్లోని 24 రిసార్టుల్లో 1,767 రూమ్స్ ఉన్నాయి.
 
మన వాళ్లు ట్రావెల్ ప్రియులే...!
* ఈ-ట్రావెల్ మార్కెటింగ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలో 36 శాతం మంది పర్యాటకులు ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ప్రయాణాలు చేస్తున్నారు. అది కూడా ఆతిథ్య సంస్థలందించే డీల్స్, డిస్కౌంట్స్ ఆధారంగానేనట!.
* ట్రావెల్ సెర్చింజిన్ ‘స్కైస్కానర్’ సర్వే ప్రకారం... ప్రపంచంలోనే భారతీయ పర్యాటకులది మొదటి స్థానం. భారతీయుల్ని పరిశోధనాత్మక పర్యాటకులుగా వర్ణించిన ఈ సర్వే... 2015 జూన్ నాటికి ఇండియన్లు ఐర్లాండ్, స్వీడన్, గ్రీస్, జపాన్ వంటి 230 దేశాల్ని సందర్శించారని తెలిపింది. ‘‘భారతీయులకు ప్రయాణమనేది ఓ ఫ్యాషన్. ఏడాదిలో కనీసం మూడు సెలవుల రోజుల్ని టూర్‌కు వాడాలనిలక్ష్యంగా పెట్టుకుంటారు’’ అని ట్రిప్ అడ్వైజర్ సంస్థ కూడా చెబుతోంది.
 
టైమ్‌షేర్‌తో లాభాలు ఇవీ...
* తక్కువ ధరలో నాణ్యమైన హోటల్ గది, సేవలను పొందవచ్చు.
* చాలా వరకు ప్రాపర్టీలు సిటీకి దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. కాలుష్యానికి దూరంగా.. వెకేషన్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
* సభ్యత్వ రుసుమును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా నెలవారీ వాయిదాల్లో చెల్లించే అవకాశం కూడా ఉంది.
* ఏటా తప్పనిసరిగా ఏదో ఒక ప్రాంతానికి సెలవులు గడపటానికి వెళ్లేవారికీ, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నవారికీ ఇది అనుకూలం.
* కొన్ని సంస్థలు బుకింగ్‌లో సభ్యులకు ప్రాధాన్యమిస్తుంటాయి. కనీసం నెల ముందో, 20 రోజుల ముందో బుక్ చేయాలనే నిబంధన పెట్టి... ఆ మేరకు బుక్ చేసినవారికి ఎంత రద్దీ సమయంలోనైనా గదులు కేటాయిస్తూ ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement