Profit Plus
-
భవిష్యత్తు బాగుండాలంటే..?
‘ఈ రోజు గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం..?’ ఇలా అనుకుంటే అది భద్రతకు హామీనివ్వదు. రేపటి కోసం కొంత పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులోనూ నిశ్చితంగా ఉంటామని అర్థం చేసుకునే వారు కొందరే. కష్టపడి తెచ్చిందంతా ఖర్చు పెడుతూ.. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉండడం కుటుంబానికి ఏ మాత్రం భరోసానీయదు. చాలా మంది పొదుపును వాయిదా వేసుకుంటూ వెళతారు. ఆర్థిక ఇబ్బంది, అత్యవసర పరిస్థితి రానంత వరకు ఇదంతా సాఫీగానే అనిపిస్తుంది. కరోనా రాక ముందు వరకు చాలా మంది ఆరోగ్య బీమాను, అత్యవసర నిధిని నిర్లక్ష్యం చేసిన వారే. ఈ తరహా వ్యక్తుల్లో కొంత మందికి కనువిప్పు కలిగింది. ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు’ అని కాకుండా.. ఎవరి భవిష్యత్తు కోసం వారే రక్షణాత్మకంగా వ్యవహరించాలి. భవిష్యత్తు కోసం ఎందుకు పొదుపు, మదుపులు అవసరమో అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. జీవితం అంటే ఎప్పుడూ ఒకే తీరున, సాఫీగా సాగిపోదు. కొన్ని ఇబ్బందులు సర్వ సాధారణం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. కరోనా నియంత్రణకు 2020 మార్చి చివరి నుంచి నెలరోజులకుపైగా లాక్డౌన్లను విధించడం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలు కావచ్చు. భవిష్యత్తులో ఏ రోజు ఎలా ఉంటుందన్నది మన చేతుల్లో లేని అంశం. కాకపోతే ఏది వచ్చినా ఎదుర్కోగల సన్నద్ధతే మన చేతుల్లో ఉంటుంది. తగినంత పొదుపు ఉంటే, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సాయం కోసం అర్థించాల్సిన అవస్థ తప్పుతుంది. అందుకే పొదుపు, మదుపులను వాయిదా వేయవద్దు. ఆదాయం ఆగిపోతుంది.. సంపాదన బండి ఏదో ఒకరోజు (రిటైర్మెంట్) ఆగిపోతుందని తెలిసిందే. కానీ, సంపాదన ఆగిపోయిన తర్వాతి రోజు నుంచి జీవితం ఎలా? ఈ విషయాన్ని తెలిసినా కానీ, చాలా మంది దాటవేస్తుంటారు. ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత కదా, చూసుకోవచ్చులే.. అనుకుంటూ రిటైర్మెంట్ ప్రణాళికను ఎక్కువ మంది వాయిదా వేస్తుంటారు. కానీ, ముందు నుంచే పొదుపు చేస్తే కాంపౌండింగ్‌తో తక్కువ మొత్తం అయినా పెద్ద నిధిగా సమకూరుతుంది. అదే 40–45 తర్వాత మొదలు పెడితే, ఉన్న కొద్ది కాలంలో ఎంత వెనుకేయగలరు?.. 60 ఏళ్ల తర్వాతి జీవించి ఉన్నంత కాలం అవసరాలను ఆ మొత్తం తీర్చగలదా? అని ఆలోచించాలి. ప్రశాంతత కోసం.. భద్రత, ప్రశాంతత ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత నిధి దగ్గర ఉంటే.. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండొచ్చు. ఆఫీసులో కొంత మంది ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్త మీ చెవిన పడితే, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయని తెలిస్తే.? ఇవన్నీ చిన్నవే అయినా ఎంతో కొంత ఆందోళనకు గురి చేసేవే. దేనిని అయినా టేక్ ఇట్ ఈజీ పాలసీగా ఎప్పుడు తీసుకుంటాం? తగినంత ఆర్థిక స్తోమత ఉన్నప్పుడే కదా! బ్యాంకులో బ్యాలన్స్ లేకుండా, సాగిపోయే వారికి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే ? కష్టకాలం మొదలవుతుంది. కావాల్సినంత పొదుపు చేయలేని వారిపై అంతర్లీనంగా ఒత్తిడి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక పొదుపు, మదుపు అవసరాన్ని గుర్తించాలి. అపరాధ భావం ఎందుకు? చాలా మంది ముందుచూపు, ప్రణాళికలేమితో పొదుపును నిర్లక్ష్యం చేస్తుంటారు. అవగాహన ఉన్నా కానీ, పొదుపు చేయలేని వారు కూడా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు అవసరానికి సరిపడా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతుంటారు. కానీ, దీని వెనుక కారణం.. వారు పిసినారులని కాదు. తగినంత సంపద లేకపోవడమే. దీంతో వెళ్లిన ప్రతి చోటా పాకెట్ నుంచి ఖర్చు చేసేందుకు ధైర్యం చాలదు. కానీ, ఇది వారిపై, వారి జీవిత భాగస్వామి, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని గుర్తించాలి. చక్కని ఆర్థిక జీవనం అంటే.. తగినంత పొదుపు చేయడమే కాదు.. అవసరానికి సరిపడా, వివేకంగా ఖర్చు చేయడం కూడా. కనుక పొదుపును నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చును పూర్తిగా బంధించేయకూడదు. వారసత్వం విషయంలో... తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు అందరికీ లభిస్తాయన్న గ్యారంటీ ఉండదు. తమ పిల్లలకు భూమి/ఇల్లు రూపంలో ఆస్తిని ఇవ్వాలని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. తల్లిదండ్రుల నుంచి చెప్పుకోతగ్గ ఆస్తులు లభిస్తే.. వాటిని మెరుగ్గా నిర్వహించే ప్రణాళిక ఉండాలి. వారసత్వ ఆస్తుల్లేని వారు, తమ పిల్లలకు ఆస్తులను సమకూర్చిపెట్టాలని భావిస్తే.. ఇది అదనపు ప్రణాళిక అవుతుంది. ఇందుకోసం పెద్ద మొత్తమే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆస్తుల విషయంలోనూ ప్రణాళికాయుతంగా నడుచుకోవాలి. పెద్ద లక్ష్యాలు జీవితంలో ఎన్నో కీలకమైన లక్ష్యాలు ఎదురవుతాయి. వీటిల్లో కొన్ని తప్పించుకునేవి కావు. పిల్లల విద్యా ఖర్చు, వివాహాలు, ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్, పర్యటనలు ఇలా ఎన్నో ఉంటాయి. భవిష్యత్తు కోసం తగినంత కూడబెట్టలేకపోతే, రుణాలపై ఆధారపడితే చివరికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? అందుకని జీవితాన్ని చేయి దాటిపోనీయకుండా, భవిష్యత్తు పట్ల ముందు చూపుతో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఆర్థిక స్వేచ్ఛ వేతనంపై ఇక ఆధారపడని రోజు ఒకటి జీవితంలో వస్తుంది. అప్పటికి కనీస అవసరాలకు సరిపడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేంత నిధిని సమకూర్చుకోవాలి. దీన్నే ఆర్థిక స్వాతంత్య్రంగా చెబుతారు. మీ అవసరాలకు వేరేవారిపై ఆధారపడకపోవడం. ఆర్జన ఆరంభించిన తొలినాళ్లలో ఎక్కువ మంది వద్ద ఎటువంటి నిధి (వారసత్వంగా ఉంటే తప్ప) ఉండదు. కనుక 100 శాతం వేతనంపైనే జీవనం ఆధారపడి ఉంటుంది. అయితే, కాలక్రమేణా బుట్టలోకి సంపద చేరాలి. అప్పుడే అవసరానికి కావాల్సినంత తీసుకోగలరు. ఒక వ్యక్తికి కుటుంబ ఖర్చులు నెలవారీగా రూ.40,000 అవుతున్నాయని అనుకుంటే.. 12 నెలలకు సరిపడా రూ.4.8 లక్షలు కనీసం అతని వద్ద ఉండాలి. రూ.48 లక్షలు ఉంటే 8–10 ఏళ్ల అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకని జీవితంలో కోరుకున్న దశ నుంచి కనీస అవసరాలను తీర్చుకునేందుకు సరిపడా నిధి ఏర్పడాలి. అందుకోసం ఆర్జన మొదలైన వెంటనే పొదుపు, మదుపు ప్రయాణాన్ని ఆరంభించాలి. దాంతో చాలా వేగంగా (50 ఏళ్లకే) ఆర్థిక స్వాతంత్య్ర స్థితిని చేరుకుంటారు. పురోగతి జీవితానికి పురోగతి కీలకమైనది. ఉద్యోగం ఆరంభంలో బ్యాంకు బ్యాలన్స్ జీరోగా ఉన్నా.. 5–10 ఏళ్ల సర్వీసు తర్వాత తగినంత కనిపించాలి. అది పురోగతికి చిహ్నంలా మరింత ప్రేరణనిస్తుంది. ఉత్సాహంతో పనిచేసేందుకు సరిపడా బూస్ట్‌నిస్తుంది. పదేళ్ల కెరీర్ తర్వాత కూడా బ్యాంకు ఖాతా వెక్కిరిస్తోందంటే.. అది పురోగతికి చిహ్నం కాబోదు. నికర విలువ పెరగడం లేదంటే ‘ధనిక బానిస’ అనే అనుకోవాల్సి వస్తుంది. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు ఉన్నంతలో ఎంతో కొంత ఆదా చేసుకోవడమే ఆచరణ కావాలి. ప్రతి నెలా రూ.5,000 సిప్ ఆరంభించి 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, 12 శాతం రాబడి రేటు ప్రకారం రూ.1.76 కోట్లు సమకూరుతుంది. 30 ఏళ్లలో మీరు చేసిన పెట్టుబడి రూ.18 లక్షలే. కానీ, వచ్చిన రాబడి రూ.1.58 కోట్లు. మెరుగైన మార్గం.. చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా లేకపోవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉండొచ్చు. వెనుక కావాల్సినంత నిధితో బ్యాకప్ ప్రణాళిక లేకపోతే ఆలోచన వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన ఆదాయం, జీవనం కోసం ఉద్యోగం మారాలనుకుంటే కనీసం 2–3 ఏళ్లపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చినా.. జీవనానికి ఇబ్బంది ఎదురుకాకూడదు. మీ వద్ద నిధి ఉంటే, ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కనుక విజయంలోనూ ‘వెల్త్’ పాత్ర ఉంటుంది. రుణ ఊబిలోకి వెళ్లొద్దు.. రుణం తీసుకోవడం ఒక్కసారి మొదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని స్టాప్ చేయడం కష్టమే. ముందు ఇది చిన్నగానే మొదలు కావచ్చు. కొన్నేళ్లకు నియంత్రించలేనంత స్థాయికి చేరిపోతుంది. చివరికి బయట పడలేనంత ఊబిగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకనే క్రెడిట్ కార్డు అయినా, వ్యక్తిగత రుణం తీసుకుంటున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. రుణం తీసుకుంటున్నారంటే.. తగినంత పొదుపు లేకపోవడం వల్లే. పొదుపు లేకుండా రుణం బాటపడితే.. తిరిగి అప్పుల భారం నుంచి బయటకు వచ్చి, పొదుపు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి రావచ్చు. కొందరికి అది అసాధ్యం కావచ్చు. కనుక డెట్‌కు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుసరించాల్సిన ప్రణాళిక ► మెరుగైన జీవనం కోసమే ప్రణాళికాయుత ఆర్థిక జీవనం. ఇందులో ముందుగా తన కుటుంబ రక్షణ కోసం సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ► 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధిని అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అవసరమైన వెంటనే తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ► ప్రతీ నెలా ఇంటికి తీసుకెళ్లే వేతనం (సంపాదన) నుంచి 20–40 శాతాన్ని ఈక్విటీల్లోకి మళ్లించాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► పెట్టుబడుల్లో అస్థిరతలు తగ్గించేందుకు వీలుగా కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పటికే ఈపీఎఫ్ రూపంలో చేస్తున్న డెట్ భాగాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ► ఎండోమెంట్, మనీబ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమాను, పెట్టుబడిని కలపొద్దు. -
టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి చాలదా..?
జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ సాధనం ఎంతో కీలకమైనది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ ఎక్కువ మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. కొందరికి ఒకటికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఉంటే సరైనది.. రెండుంటే ప్రతికూలమని చెప్పడానికి లేదు. ఏ ప్రయోజనాలను ఆశించి ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకున్నామనే స్పష్టత అయితే ఉండాలి. వాస్తవానికి ఎక్కువ ప్లాన్లను కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, ఎన్ని ఉన్నా.. కవరేజీ తగినంత ఉండడం కీలకమని గుర్తుంచుకోవాలి. ఒకటికి మించిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ఉండే లాభ, నష్టాలపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది దీర్ఘకాలానికి తీసుకోతగిన బీమా సాధనం. పాలసీదారు ఏదేనీ కారణంతో మరణించినట్టయితే.. ఆ వ్యక్తిపై ఆధారపడినవారు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునే సాధనం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. సరైన బీమా రక్షణతో తీసుకోవడమూ అంతే కీలకం. పాలసీదారు లేని పరిస్థితుల్లో కుటుంబ అవసరాలు, బాధ్యతలు, స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలన్నింటినీ బీమా పరిహారం తీర్చేదిగా ఉండాలి. పాలసీ తీసుకునే సమయంలో ఎంత మొత్తంకావాలన్నది నిర్ణయించుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. దీంతో ఎక్కువ మంది అవసరానికంటే తక్కువ మొత్తానికే కవరేజీతో సరిపెట్టుకుంటుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మాదిరిగా లైఫ్ ఇన్సూరెన్స్‌కు టాపప్ సదుపాయం ఉండదు. కనుక ఒక్కసారి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిస్థితుల్లో కవరేజీ చాలదని గుర్తించినట్టయితే అదనంగా మరొక టర్మ్ ప్లాన్‌ను జోడించుకోవడం మినహా మరో మార్గం లేదు. ఒకటికి మించి టర్మ్ ప్లాన్లను తీసుకోవడం మన దేశంలో చట్టబద్ధమే. ఎన్నో రకాల ప్రయోజనాలు వాటితో వస్తాయి. గరిష్ట కవరేజీ, భిన్నమైన ప్రయోజనాలు ఆయా ప్లాన్లతో ఏర్పాటు చేసుకోవచ్చు. రెండో టర్మ్ ప్లాన్ తీసుకోవాలని భావించినట్టయితే.. నేరుగా బీమా కంపెనీ నుంచి తీసుకోవడం మంచిది. వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ప్లాన్లలో భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలు, మినహాయింపలు, జోడింపులు ఉంటాయి. కనుక వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్ ఉండడం ఒక విధంగా లాభదాయకమే. కాకపోతే మొదటి పాలసీ తర్వాత నుంచి ఎన్ని పాలసీలు తీసుకున్నా కానీ, అంతకుముందు బీమా పాలసీల గురించి తప్పకుండా ప్రపోజల్ పత్రంలో పేర్కొనాలి. ఈ సమాచారంతోనే కంపెనీలు రిస్క్‌ను మదింపు వేసుకుని, తమ నిర్ణయాన్ని తెలియజేయగలవు. అప్పటి వరకు ఉన్న ప్లాన్ల వివరాలను దాచి పెడితే భవిష్యత్తులో క్లెయిమ్‌ల సమయంలో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అందువల్ల గత ప్లాన్ల వివరాలు దాచిపెట్టవద్దు. వయసు ఆధారంగా.. వయసు ఆధారంగా బీమా కవరేజీని నేడు బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు 18–35 ఏళ్ల వయసు వారు వార్షికాదాయానికి గరిష్టంగా 25 రెట్ల బీమా కవరేజీకి అర్హులు. 36–40 ఏళ్ల వయసు వారు వార్షిక ఆదాయానికి 20 రెట్లు.. 41–50 ఏళ్ల గ్రూపులో ఉన్న వారు వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు కవరేజీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క పాలసీ అయినా, ఒకటికి మించి టర్మ్ ప్లాన్లు అయినా వార్షిక ఆదాయ రుజువును చూపించాల్సిందే. ఎక్కువ ప్లాన్లు ఎందుకు? ఒకటి చాలక ఇంకొకటి తీసుకుంటున్నారా..? లేక వేరే ప్రయోజనాల కోసం ఒకటికి మించి ప్లాన్లను తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా పాలసీదారులు సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క ప్లాన్‌లో తగినంత కవరేజీ తీసుకుంటే అయ్యే ప్రీమియంతో పోలిస్తే.. అంతే కవరేజీని ఒకటికి మించి ప్లాన్ల రూపంలో తీసుకోవాలంటే కాస్త అధిక ప్రీమియం భరించాల్సి రావచ్చు. అయినప్పటికీ ఒకటికి మించి ప్లాన్లతో ఉంటే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే అదే మంత భారం అనిపించదు. ఒకటికి మించిన ప్లాన్లను వేర్వేరు సంస్థల నుంచి తీసుకోవడం వల్ల.. బీమా కవరేజీలో వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఉదాహరణకు శాంతన్ అనే వ్యక్తి తనకు రూ.కోటి బీమా రక్షణ అవసరమని భావించాడనుకుంటే.. రూ.కోటి కవరేజీతో ఒక సంస్థ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడనుకోండి. క్లెయిమ్ సమయంలో వివాదం లేదా సమస్య ఏర్పడి సకాలంలో పరిహారం అందకపోతే అతడి కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌ను ఒకటికి మించిన పాలసీల పరిధిలో వేర్వేరుగా తీసుకుంటే.. అప్పుడు కనీసం ఒక సంస్థ నుంచి అయినా సకాలంలో పరిహారం లభిస్తుంది. ఇది మరణించిన వ్యక్తి కుటుంబానికి ఉపశమనాన్నిస్తుంది. అలాగే, శాంతన్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటే.. రూ.కోటి కవరేజీకి బీమా కంపెనీలు అంగీకరించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లోనూ ఒకటికి మించిన సంస్థల నుంచి తక్కువ మొత్తాలతో బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. అలా గరిష్ట కవరేజీకి అవకాశం లభిస్తుంది. రుణ భారం అప్పటికే ఒక టర్మ్ ప్లాన్ ఉన్నా కానీ, మరొక పాలసీ తీసుకోవాల్సిన ప్రత్యేక సందర్భాలు కూడా ఉంటాయి. మొదటి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాతి కాలంలో.. ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటే కచ్చితంగా అదనపు కవరేజీ అవసరం ఏర్పడుతుంది. రుణానికి సమాన స్థాయిలో కవరేజీతో మరొక ప్లాన్‌ను తీసుకోవాలి. గృహ రుణం, వ్యాపారం కోసం రుణాలను తీసుకుంటే, వెంటనే ఆ రుణ భారానికి సమాన స్థాయిలో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అలా కాకుండా అప్పటికే ఒక బీమా ప్లాన్ ఉందిలేనని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ముందు తీసుకున్న టర్మ్ ప్లాన్ కుటుంబ అవసరాల కోసమని గుర్తు పెట్టుకోవాలి. రుణాలకు ప్రత్యేకమైన కవరేజీ లేకపోతే.. అప్పుడు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న టర్మ్ ప్లాన్.. పాలసీదారు మరణించిన తర్వాత రుణ భారాలను చెల్లించడానికి కరిగిపోవచ్చు. ముఖ్యంగా టర్మ్ ప్లాన్ కవరేజీ ‘హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ’ (హెచ్ఎల్వీ)ను మించి ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తి ఆదాయం, పొదుపు, బాధ్యతలన్నింటినీ కలిపితే వచ్చేదే హెచ్ఎల్వీ. దీనిని బట్టి ప్లాన్ ప్రణాళిక ఉంటే సరిపోతుంది. భారం దించుకోవచ్చు.. అలాగే ఎక్కువ టర్మ్ ప్లాన్లను కలిగి ఉంటే.. 50 వసంతాలను దాటి, తమపై బాధ్యతలు తగ్గిపోతున్న తరుణంలో ఒకటి, రెండు టర్మ్ ప్లాన్లను నిలిపివేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం భరించలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక ప్లాన్‌ను అయినా సరెండర్ చేయడం ద్వారా కొంత భారాన్ని దించుకోవచ్చు. అలా కాకుండా అధిక కవరేజీతో ఒక్కటే ప్లాన్ ఉంటే రక్షణ కోసం కచ్చితంగా దాన్ని కొనసాగించుకోక తప్పదు. మరోవైపు బీమా పరిశ్రమ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. పాలసీల పరంగా భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలతో కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. పాలసీదారులకు భిన్నమైన సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఉత్పత్తులతో పోలిస్తే.. 5–10–20 ఏళ్ల క్రితం ప్లాన్లు చాలా సాధారణంగానే ఉండేవి. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లలో జీవిత భాగస్వామి (గృహిణులకు సైతం)కి సైతం కవరేజీని తీసుకునే అవకాశం ఉంది. అలాగే, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ రైడర్, ప్రమాద మరణం, ప్రమాద వైకల్యం, చిన్నారుల భవిష్యత్తు ప్రయోజనాలను రైడర్ రూపంలో చాలా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీదారు తన ఆర్థిక, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్ కవరేజీలను ఎంపిక చేసుకోవాలి. -
విదేశాల్లో పెట్టుబడులు.. ఇప్పుడెంతో ఈజీ !
ఉదయం నిద్ర లేవడం మొదలు.. రాత్రి తిరిగి విశ్రమించే వరకూ ముఖ్యమైన ముచ్చట్లు ‘ఫేస్బుక్’ పేజీలోకి ఎక్కాల్సిందే. ప్రతీ ప్రత్యేక జ్ఞాపకాన్ని బంధు మిత్రులు, సన్నిహితులతో షేర్ చేసుకోవాల్సిందే. తాజా వార్తా, విశేషాల సమాచారం కోసం ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేయాల్సిందే..! ఇక గ్రోసరీ నుంచి కావాల్సిన స్మార్ట్ ఫోన్ వరకు అమెజాన్‌లో ఆర్డర్ చేసేవారూ మన చుట్టూ చాలా మందే ఉన్నారు. సమాచారం ఏది తెలుసుకోవాలన్నా.. గూగుల్‌లో (ఆల్ఫాబెట్) వెతికేయడం, ఆండ్రాయిడ్ ఓఎస్, గూగుల్ క్రోమ్, గూగుల్ పే, గూగుల్ ఫొటోస్ ఇవన్నీ కూడా జీవనంలో భాగమైనవే. చేతిలో యాపిల్ ఫోన్ ఉంటే ఆ ఆనందమే వేరు..! ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు. వీటి అవసరం లేకుండా ఆధునిక తరం రోజు గడవదంటే అతిశయోక్తి కానే కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వెనకేసుకోవాలన్న ఆలోచన భారత ఇన్వెస్టర్లలో క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంతో.. ఈ సేవలు అందించేందుకు ఎన్ఎస్ఈ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఎస్ఈ అందిస్తున్న ఈ సేవల సమాచారమే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం.. త్వరలోనే ఎన్ఎస్ఈ సేవలు భారతీయ ఇన్వెస్టర్లు అమెరికాలో లిస్ట్ అయిన స్టాక్స్ కొనుగోలు, విక్రయాలు చేసుకునేందుకు వీలుగా అవసరమైన వేదికను ఏర్పాటు చేయాలని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ)కి చెందిన ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక మేరకు పనులు పూర్తయితే త్వరలోనే ఫ్యాంగ్ స్టాక్స్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్), మైక్రోసాఫ్ట్, టెస్లా తదితర ఎన్నో స్టాక్స్‌లో లావాదేవీలు సులభతరం కానున్నాయి. సెబీ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కేవైసీని పూర్తి చేసిన (కస్టమర్ గుర్తింపు వివరాల ధ్రువీకరణ) కస్టమర్లు యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి దేశీయ బ్రోకరేజీ సంస్థలు కొన్ని యూఎస్ స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నాయి. కానీ, స్థానికంగా ఒక ఎక్సే్ఛంజ్ ప్లాట్‌ఫామ్ లేదు. ఆ లోటును ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ భర్తీ చేయనుంది. ప్రత్యేక ఖాతా అక్కర్లేదు! సుమారు 40 దేశీయ బ్రోకరేజీ సంస్థలు గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ/గిఫ్టి సిటీ)లో కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నాయి. విదేశీ స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే ఇన్వెస్టర్లు గిఫ్ట్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్రోకర్ల వద్ద ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. అయితే, ఎన్ఎస్ఈ నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఇప్పటికే కేవైసీ వివరాలు సమర్పించి ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా కలిగిన వారు యూఎస్ స్టాక్స్‌లో పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా అనుమతి పొందే ప్రయత్నం చేస్తోంది. ఇది ఫలిస్తే.. ఇన్వెస్టర్లు ప్రస్తుత తమ ట్రేడింగ్ ఖాతా నుంచే దేశీయ స్టాక్స్ మాదిరే.. యూఎస్ స్టాక్స్‌లోనూ కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. ఇందుకోసం తమ సమ్మతి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒక పత్రం సమర్పిస్తే సరిపోతుంది. గిఫ్ట్‌సిటీ అన్నది అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ప్రాంతం. మరిన్ని విదేశీ స్టాక్స్కూ అవకాశం మనదేశంలోని రెండు డిపాజిటరీ సంస్థలైన సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ కూడా గిఫ్ట్ సిటీలో అనుబంధ సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేశాయి. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనే కొత్త ఇన్వెస్టర్లకు ఈ డిపాజిటరీల నుంచి డీమ్యాట్ ఖాతాలను బ్రోకరేజీ సంస్థలు ఆఫర్ చేయనున్నాయి. ప్రారంభంలో యూఎస్ స్టాక్స్‌లో లావాదేవీలకే పరిమితమైనప్పటికీ.. తర్వాత ఇతర విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడులకు అవకాశం అందుబాటులోకి రానుంది. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు తమ బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. గిఫ్ట్ సిటీలోని బ్రోకర్ వద్ద తన ఖాతాకు నిధులు బదిలీ చేయాలని కోరాల్సి ఉంటుంది. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక ఏడాదిలో 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.85కోట్లు) విదేశాలకు పంపుకోవచ్చు. స్టాక్స్, మ్యచువల్ ఫండ్స్ యూనిట్ల కొనుగోలు, ఈటీఎఫ్‌ల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. కాకపోతే ఎల్ఆర్ఎస్ కింద పంపుకునే నిధులతో విదేశీ డెరివేటివ్ సాధనంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఖాతాదారు కోరిక మేరకు బ్యాంకు ఎల్ఆర్ఎస్ పరిమితిని పరిశీలించిన తర్వాత గిఫ్ట్ సిటీలో బ్రోకర్ ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంది. ప్రస్తుత తమ బ్యాంకు శాఖ నుంచే ఈ సేవలను పొందొచ్చు. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఇందుకోసం తెరవాల్సిన అవసరం ఉండదు. తొలుత టాప్–50కే పరిమితం నిధుల బదిలీ అనంతరం విదేశీ స్టాక్స్‌లో క్రయ, విక్రయాలు నిర్వహించుకోవచ్చు. తొలుత యూఎస్‌కు చెందిన టాప్–50 స్టాక్స్‌లో లావాదేవీలకు ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ అనుమతించనుంది. తర్వాత మరిన్ని స్టాక్స్‌లో లావాదేవీలకు అవకాశం కల్పించాలన్నది ఎన్ఎస్ఈ ప్రణాళిక. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ప్రత్యేకంగా అంతర్జాతీయ బ్రోకరేజీలను నియమించుకోనుంది. ఈ బ్రోకర్లు అమెరికా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో షేర్లను కొనుగోలు చేసి, డిపాజిటరీ రిసీప్ట్ (సర్టిఫికెట్ ఆఫ్ ఓనర్షిప్)ను గిఫ్ట్‌సిటీలోని ఇన్వెస్టర్లకు కేటాయించనున్నాయి. మన దేశంలో పాక్షిక షేర్లకు అవకాశం లేదు. కనీసం ఒక షేరును లావాదేవీగా నిర్వహించాల్సిందే. కానీ, అమెరికాలో పాక్షిక షేర్లను కూడా సొంతం చేసుకోవచ్చు. 3 డాలర్లు, 6 డాలర్ల డినామినేషన్లో పాక్షిక షేర్లను పొందే అవకాశం గిఫ్ట్ సిటీ ఇన్వెస్టర్లకు ఉంటుంది. ఉదాహరణకు యాపిల్ ఒక షేరు సుమారు 149 డాలర్ల వద్ద ఉంది. ఒక్క షేరు కొనుగోలుకు పెట్టుబడి రూ.11వేలపై మాటే. ఇంత ఇన్వెస్ట్ చేయలేని వారు పాక్షిక షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. లావాదేవీలకు ఎన్ఎస్ఈ క్లియరింగ్ కార్పొరేషన్ హామీదారుగా ఉంటుంది. టీప్లస్3 సెటిల్మెంట్ అమలవుతుంది. లావాదేవీ నమోదైన రోజు కాకుండా తర్వాతి మూడవ పనిదినం ముగింపు నాటికి షేర్లు డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ బ్రోకర్ల నుంచి సేవలు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జియోజిత్, మోతీ లాల్ ఓస్వాల్, యాక్సిస్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మ్యాటర్ట్రస్ట్, విన్వెస్టా, వెస్టెడ్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఇప్పటికే యూఎస్ స్టాక్స్ లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇం దుకోసం ఈ సంస్థలు అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థలతో భాగస్వామ్యాలను కూడా కుదుర్చుకున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ స్టాక్స్, బాండ్లు, రీట్, ట్రెజరీ బాండ్లలోనూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఒక్క డాలర్ నుంచి పెట్టుబడులకు ఇవి అనుమతిస్తున్నాయి. వేగంగా, సులభంగా ఖాతా తెరిచే సేవలను ఇవి అందిస్తున్నాయి. పన్ను ఇక్కడే చెల్లించాలి.. విదేశీ స్టాక్స్‌లో లాభాలపై దేశీయంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే స్థానిక స్టాక్స్‌లోని లాభాలపై పన్నుతో పోలిస్తే భిన్నమైన రేట్లు అమల్లో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ తదితర చాలా దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆర్జించిన ఈక్విటీ (స్టాక్స్,ఫండ్స్) లాభాలపై మూలధన లాభాల పన్ను లేదు. డివిడెండ్లు, వడ్డీ రాబడి కూడా పన్ను రహితమే. కానీ, ఆయా లాభాలు, ఆదాయంపై ఇక్కడ పన్ను చెల్లించాలి. విదేశీ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయిన షేరు లేదా ఫండ్‌లో రెండేళ్ల తర్వాత పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభంగా చట్టం పరిగణిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించగా మిగిలిన లాభంపై 20%పన్ను చెల్లించాలి. దేశీయ స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్ష (ఒక ఆర్థిక సంవత్సరంలో) పై పన్ను లేదు. కానీ, విదేశీ మూలధన లాభాలకు ఇది వర్తించదు. విదేశీ స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను రెండేళ్లలోపే విక్రయించినట్టయితే.. లాభాన్ని తమ ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి. అప్పుడు తమకు వర్తించే శ్లాబు రేటు కింద పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. విదేశీ పెట్టుబడుల వివరాలను (విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయం) ఎప్పటికప్పుడు ఐటీఆర్‌లో విధిగా పేర్కొనాల్సిందే. స్టాక్స్ కొనుగోలు క్రమం ఇదీ ► డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు. ఇప్పటి వరకు డీమ్యాట్ ఖాతా లేని వారు గిఫ్ట్ సిటీ కేంద్రంగా పనిచేస్తున్న బ్రోకర్ల వద్ద ఖాతా తెరవాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ► ఆర్బీఐ ఎల్ఆర్ఎస్ కింద బ్యాంకు నుంచి గిఫ్ట్ సిటీలోని ఖాతాకు ఒక ఏడాదిలో 2.5లక్షల డాలర్లను పంపుకోవచ్చు. ► యూఎస్ స్టాక్స్‌లో పాక్షిక వాటాలనూ సొంతం చేసుకోవచ్చు. తొలుత యూఎస్ టాప్–50 స్టాక్స్ అందుబాటులో ఉండనున్నాయి. ► ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ క్లియరింగ్ కార్పొరేషన్ ఈ లావాదేవీల సెటిల్మెంట్ను చూస్తుంది. -
రాబడా.. రక్షణా.. మీ ‘పాలసీ’ ఏంటి?
ఆర్జించే ప్రతీ వ్యక్తికి జీవిత బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఊహించనిది చోటు చేసుకుంటే ఆ కుటుంబం కష్టాల్లోకి వెళ్లకుండా.. బీమా పరిహారం అండగా నిలుస్తుంది. బీమాకు అర్థం ఇదే. మనలో చాలా మంది తమకూ బీమా పాలసీ ఉందిలేనన్న భరోసాతో ఉంటుంటారు. పరిశీలించి చూస్తే కానీ తెలియదు వాస్తవంగా వారికి ఉన్న రక్షణ ఏపాటిదో. అందుకే జీవిత బీమా ప్లాన్లలో అసలు ఎన్నెన్ని రకాలున్నాయి? వాటిల్లో ఉండే ప్రయోజనాలపై అవగాహన అవసరం. ఆ వివరాలు అందించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. రెండే రకాలు.. స్థూలంగా పరిశీలిస్తే.. జీవిత బీమా పాలసీలు రెండు రకాలే. ఒక్కటి అచ్చమైన రక్షణనిచ్చేది (ప్రొటెక్షన్ ప్లాన్/టర్మ్ ప్లాన్). రెండో రకం.. ఎంతో కొంత బీమా రక్షణనిస్తూనే పెట్టుబడులు, రాబడుల ప్రయోజనాలతో కలిసి ఉండేవి. ప్రొటెక్షన్/టర్మ్ ప్లాన్లు అన్నవి పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారం చెల్లిస్తాయి. బీమా, పెట్టుబడి ప్రయోజనాలతో ఉండే ఎండోమెంట్/మనీబ్యాక్ ప్లాన్లలో అలా కాదు. పాలసీదారు మరణించిన సందర్భంలో, కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉన్న సందర్భంలోనూ ప్రయోజనం లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అర్థం చేసుకునేందుకు ఎంతో సులువైన ఉత్పత్తి టర్మ్ ఇన్సూరెన్స్. వీటినే ప్రొటెక్షన్ ప్లాన్లు అంటుంటారు. మరణ ప్రమాదానికి రక్షణనిస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు ఎటువంటి కారణంతో అయిన పాలసీదారు మరణానికి గురైతే నామినీకి బీమా సంస్థ పరిహారం చెల్లిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్లు 85 సంవత్సరాల వరకు కవరేజినిస్తాయి. 99 సంవత్సరాల వరకు కవరేజీతో కేవలం కొన్ని బీమా సంస్థలు ప్లాన్లను అందిస్తున్నాయి. పాలసీ కాల వ్యవధిలో మరణించినట్టయితేనే ఈ ప్లాన్లలో పరిహారం చెల్లింపు ఉంటుంది. కాల వ్యవధి తర్వాత ఎటువంటి ప్రయోజనం అందదు. అందుకే ఈ ప్లాన్లపై ప్రీమియం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కువ బీమా కవరేజీ తక్కువ ప్రీమియానికే టర్మ్ ప్లాన్లలో లభిస్తుంది. అంతేకాదు మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియం పాలసీ కాల వ్యవధి ముగిసేవరకు స్థిరంగా ఉంటుంది. ప్రీమియం పెరగడం ఉండదు. కాకపోతే పాలసీ ప్రీమియంలో భాగంగా ఉండే వస్తు సేవల పన్నును (జీఎస్టీ) ప్రభుత్వం సవరించినట్టయితే ఆ మేరకు ప్రీమియంలో మార్పులు ఉంటాయి. టర్మ్ ప్లాన్లు ఇవి.. ప్రొటెక్షన్ ప్లాన్లలో మళ్లీ వివిధ రకాలు ఏంటి? అని సందేహపడుతున్నారా.. వివిధ వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారిని ఆకర్షించేందుకు బీమా సంస్థలు ప్లాన్లలో సదుపాయాలను జోడిస్తుంటాయి. ► రెగ్యులర్ ప్లాన్: ఇది అచ్చమైన టర్మ్ ప్లాన్. 30 ఏళ్ల వ్యక్తి తనకు 70 ఏళ్లు వచ్చే వరకు అంటే 40 ఏళ్ల కాలానికి రూ.కోటి బీమా రక్షణను తీసుకుంటే వార్షిక ప్రీమియం సుమారు రూ.11,210 చెల్లిస్తే చాలు. వివిధ బీమా సంస్థల మధ్య ఈ ప్రీమియంలో వ్యత్యాసం ఉంటుంది. అంతేకాదు, పాలసీదారుల జీవనశైలి, ఆరోగ్య సమస్యలు కూడా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. ► రిటర్న్ ఆఫ్ ప్రీమియం: టర్మ్ ప్లాన్లే కానీ, పాలసీ కాలవ్యవధి ముగిసిన తర్వాత అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం వెనక్కి వస్తుంది. జీవించి ఉంటే రూపాయి కూడా వెనక్కి రాని పాలసీలు ఎందుకు? అని భావించే వారికోసం రూపొందించిన పాలసీలు ఇవి. అందుకే ప్రీమియం వెనక్కి రాని టర్మ్ప్లాన్లతో పోలిస్తే.. వెనక్కి వచ్చే ప్లాన్ల ప్రీమియం 50–100 శాతం అధికంగా ఉంటుంది. ఇలా ఈ అదనపు ప్రీమియాన్ని బీమా సంస్థలు తీసుకెళ్లి పెట్టుబడులుగా పెడతాయి. అలా ప్రీమియంను వెనక్కిచ్చేస్తాయి. ఈ ప్లాన్‌ను 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.18,000 స్థాయిలో ఉంటుంది. ► పరిహారం చెల్లింపుల్లో ఆప్షన్లు: టర్మ్ ప్లాన్లలో మరణ పరిహారాన్ని చెల్లించే విషయంలో పలు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో పరిహారాన్ని ఒకేసారి చెల్లించేయకుండా.. ముందు ఎంపిక చేసుకున్న మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన భాగాన్ని ప్రతీ నెలా ఇంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించే విధంగా ఉంటుంది. ఉదాహరణకు రూ.50లక్షల ప్లాన్‌లో.. పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ రూ.10–20 లక్షలను ఒకే విడతగా ఇస్తుంది. మిగిలిన రూ.40–30 లక్షలను 10 నుంచి 20 ఏళ్ల కాలానికి ప్రతీ నెలా చెల్లించే విధంగా పాలసీల నిర్మాణం ఉంటుంది. దీనివల్ల బాధిత కుటుంబ నెలవారీ అవసరాలకు ఆదాయం ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. ఒకే విడత భారీ పరిహారాన్ని అందుకుంటే దాన్ని తీసుకెళ్లి పెట్టుబడిగా పెట్టుకుని, ప్రతీ నెలా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అటువంటి వారు ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ► సింగిల్ ప్రీమియం: కొందరు ఏటా ప్రీమియం చెల్లించేందుకు సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఇటువంటి వారు ఒకే విడతగా ప్రీమియం చెల్లించేందుకు వీలు కల్పించేవే సింగిల్ ప్రీమియం ప్లాన్లు. ఇందులో ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. కాకపోతే ఒకే విడత కనుక ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్లు 85 ఏళ్ల వరకు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.కోటి కవరేజీని ఎంపిక చేసుకుంటే సింగిల్ ప్రీమియం కింద రూ.1.8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ► కవరేజీ పెరుగుతూ.. తరుగుతూ: ద్రవ్యోల్బణం, బాధ్యతలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్‌లో వివిధ దశల్లో కవరేజీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్ కూడా ఉంటుంది. అదే విధంగా కవరేజీ తగ్గుతూ వెళ్లే ఆప్షన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కవరేజీ పెరుగుతూ వెళ్లే ఆప్షన్ ఎంపిక చేసుకుంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ, కవరేజీ పెరిగిన ప్రతీసారి ప్రీమియం పెరగడం ఉండదు. వివిధ దశల్లో పెరిగే బాధ్యతలకు అనుగుణంగా పెరిగే కవరేజీ ఉపయోగకరంగా ఉంటుంది. ► హోల్‌లైఫ్: హోల్‌లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు 99–100 ఏళ్ల కాల వ్యవధితో ఉంటాయి. పాలసీదారు 99–100 ఏళ్లలోపు మరణించినట్టయితే పరిహారాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. నూరేళ్లు జీవించి ఉంటే.. అప్పుడు పాలసీదారుకు ఏక మొత్తంలో ప్రయోజనాన్ని బీమా సంస్థ చెల్లించేస్తుంది. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి హోల్‌లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో రూ.కోటి కవరేజీకి వార్షిక ప్రీమియం సుమారుగా రూ.15,000 వరకు ఉంటుంది. తమ తర్వాత పిల్లలకు ఎంతో కొంత మొత్తం నగదు ప్రయోజనం లభించాలన్న అభిలాష ఉంటే తప్ప.. వీటి అవసరం పెద్దగా ఉండదు. పిల్లలు జీవితంలో స్థిరపడి, తమ రుణ బాధ్యతలు పూర్తిగా ముగిసే కాలం వరకు జీవిత బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► లిమిటెడ్ ప్రీమియం పీరియడ్: పాలసీ కాల వ్యవధి ఎంత కాలం ఉన్నా కానీ, కొన్నేళ్లే ప్రీమియం చెల్లించే ఆప్షన్లు కూడా ఉంటున్నాయి. 5, 10, 15, 20 ఏళ్ల పాటే ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే 60 ఏళ్ల కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించే విధంగా ప్లాన్‌ను తీసుకోవచ్చు. ► ఎవరికి: మీపై ఆధారపడిన వారు ఉంటే, రుణ బాధ్యతలు ఉన్నట్టయితే టర్మ్ప్లాన్ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. వార్షికాదాయానికి 10–20 రెట్ల వరకు కవరేజీ ఉండాలన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రుణ బాధ్యతలు దీనికి అదనం. ఒకవేళ రిటైర్ అయిన వారు, తమపై ఎవరూ ఆధారపడి లేని వారికి జీవిత బీమా అవసరం ఉండదు. సంప్రదాయ బీమా ప్లాన్లు ఇవి జీవిత బీమా, పెట్టుబడి కలగలసిన ప్లాన్లు. చెల్లించే ప్రీమియం పరంగా చూస్తే బీమా రక్షణ స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే రాబడులను ఇవ్వాలి కనుక తీసుకునే ప్రీమియంలో కొంత కవరేజీకి మినహాయించి మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులకు బీమా కంపెనీలు మళ్లిస్తాయి. ► ఎండోమెంట్ ప్లాన్: పాలసీదారు మరణించిన సందర్భాల్లో నామినీకి మరణ పరిహారం, బోనస్‌తోపాటు చెల్లింపులు ఉంటాయి. ఏటా కొంత చొప్పున బీమా సంస్థలు సమ్ అష్యూర్డ్‌పై బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. పెట్టుబడిపై రాబడుల ఆధారంగా ఈ బోనస్ ఎంతన్నది ఉంటుంది. దీంతో పాలసీదారు మరణించేనాటికి జమ అయిన బోనస్‌తోపాటు బీమా మొత్తాన్ని చెల్లించే విధంగా ఒప్పందం ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే కాల వ్యవధి ముగిసిన తర్వాత బోనస్‌తోపాటు, ముందుగా ఇచ్చిన హామీ మేరకు ఇతర ప్రయోజనాలను కంపెనీ చెల్లిస్తుంది. కనుక మరణించినా, జీవించినా కానీ ఈ ప్లాన్లలో ప్రయోజనం అందుతుంది. ఎక్కువ మందిని ఆకర్షించేది ఇదే. అందుకే, సరిపడా కవరేజీ తీసుకుంటున్నామా? అన్నది ప్రశ్నించుకోకుండా ఎక్కువ మంది ఎండోమెంట్ ప్లాన్ల వైపు మొగ్గు చూపుతుంటారు. రూ.10లక్షల కవరేజీతో ఎండోమెంట్ ప్లాన్ తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ కోసం ఏటా ప్రీమియం రూ.50,000–60,000వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ల కాలవ్యవధికి పదేళ్లపాటే ప్రీమియం చెల్లించే ఆప్షన్లో వార్షిక ప్రీమియం రూ.లక్ష వరకు ఉంటుంది. ► మనీబ్యాక్ ప్లాన్లు: పేరులోనే ఉన్నట్టు పాలసీ కాల వ్యవధిలోపు నిర్ణీత కాలానికోసారి చొప్పున నగదు ప్రయోజనాన్ని బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. బోనస్‌ను పాలసీదారు మరణించిన సందర్భంలో లేదా కాలవ్యవధి చివర్లో చెల్లిస్తుంది. ఎండోమెంట్ ప్లాన్‌లో జీవించి ఉంటే చివర్లో కొంచెం పెద్ద మొత్తాన్నే అందుకోవచ్చు. మనీబ్యాక్ ప్లాన్‌లో ఐదేళ్లకు ఒకసారి ఎంతో కొంత బీమా సంస్థ చెల్లిస్తుంటుంది కనుక చివర్లో లభించేది కొద్ది మొత్తమే అని అర్థం చేసుకోవాలి. పిల్లల విద్యావసరాల కోసం మధ్య మధ్యలో కొంత చొప్పున నగదు ప్రయోజనం రావాలని కోరుకునే వారు మనీబ్యాక్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.10లక్షల కవరేజీని 20 ఏళ్ల కాలానికి ఎంపిక చేసుకుంటే వార్షికంగా రూ.1.20లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. ► ఎవరికి: మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను అమలు చేయలేని వారు, ఇతర పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోలేని వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ రాబడి, రక్షణనిచ్చే ఈ ప్లాన్లు బీమా రక్షణ కోణం నుంచి చూస్తే అనుకూలమైనవి కావు. పన్ను ఆదా పరంగా చూసినా అంత ఆకర్షణీయమైన సాధనం కాదని తెలుసుకోవాలి. ► యులిప్‌లు: బీమా, పెట్టుబడి ఆధారిత ప్లాన్లే ఇవి కూడా. కాకపోతే ఈక్విటీ పెట్టుబడులకు యులిప్‌లు అవకాశం కల్పిస్తాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లు అన్నవి కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. యులిప్‌లలో ఈక్విటీ, డెట్ రెండింటినీ ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీకి అవకాశం ఉంటుంది కనుక దీర్ఘకాలంలో ఎండోమెంట్ ప్లాన్లతో పోలిస్తే కాస్త మెరుగైన రాబడులకు యులిప్‌లలో అవకాశం ఉంటుంది. యులిప్‌లలో కనీసం ఐదేళ్ల వరకు ప్రీమియం చెల్లించి.. ఆ తర్వాత ఆపేసినా నష్టం ఉండదు. కాల వ్యవధి వరకు బీమా కవరేజీ కొనసాగుతుంది. ఇందులో కూడా ప్రీమియం చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ప్రీమియంలో ఎక్కువ భాగం పెట్టుబడులకు వెళుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి యులిప్‌ను ఎంపిక చేసుకుంటే రూ.10 లక్షల కవరేజీ కోసం వార్షికంగా రూ.లక్ష ప్రీమియంగా చెల్లించుకోవాలి. మధ్యలో విరమించుకోకుండా పాలసీ కాలవ్యవధి వరకు కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఎండోమెంట్ ప్లాన్ బదులు యులిప్‌లను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. యులిప్‌లలో పూర్తిగా ఈక్విటీ పెట్టుబడుల ఆప్షన్‌ను లేదంటే ఈక్విటీ, డెట్ కలయికతో ప్లాన్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు ఈక్విటీ మార్కెట్లు బాగా పెరిగిపోయాయని భావించినట్టయితే ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. అదే విధంగా ఈక్విటీ మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో డెట్ భాగం నుంచి పూర్తిగా ఈక్విటీకి మళ్లిపోయే విధంగా ఇందులో స్వేచ్ఛ ఉంటుంది. మొత్తానికి తమకు ఏదైనా వాటిల్లితే తమ కుటుంబానికి ఎంత అవసరమో ఆ మేరకు బీమా కవరేజీ తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం టర్మ్ ప్లాన్‌ను తీసుకుని, వెసులుబాటు మేరకు పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్, నేరుగా స్టాక్స్, ఇతర సాధనాలను పరిశీలించొచ్చు. ఈ దశలో అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. -
రిటర్నుల దాఖలుకు మార్గాలివే..
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు మరో రెండు వారాల వ్యవధే మిగిలి ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు వాస్తవానికి జూలైతోనే ముగియాలి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూతలతల నేపథ్యంలో గడువు కాస్తా డిసెంబర్ ఆఖరు వరకు పెరిగింది. దీంతో రిటర్నులను ఇప్పటి వరకు చేయని వారు.. డిసెంబర్ 31 నాటికి సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్ వేదికలతోపాటు, ఆఫ్లైన్లోనూ రిటర్నుల దాఖలులో సాయపడేవారు ఉన్నారు. పన్ను అంశాల పట్ల మీకు అవగాహన ఉంటే స్వయంగా ఈ పనిని చేసుకోవచ్చు. లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను ఆశ్రయించొచ్చు. ఆ వివరాలను ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన ఉండి, పన్ను విషయాలు కూడా తెలిసిన వారు అయితే నేరుగా ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ (incometaxindiaefiling. gov. in) కు వెళ్లి రిటర్నులు ఫైల్ చేయవచ్చు. ఈ పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాన్ నంబరే యూజర్ ఐడీ అవుతుంది. పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం.. తిరిగి లాగిన్ అయి రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. ఈ సేవ కోసం ఆదాయపన్ను శాఖ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు. మీ ఆదాయ వివరాలు సమగ్రంగా సిద్ధం చేసుకుంటే రిటర్నుల దాఖలు పెద్ద కష్టమేమీ కాదు. ఐటీ పోర్టల్‌లో ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. ఫామ్ 26ఏఎస్, ఈపే సెల్ఫ్ అసెస్మెంట్, ఈ వెరిఫై లింక్‌లు కూడా అక్కడే ఉంటాయి. ఫామ్ 26ఏఎస్‌లో టీడీఎస్, టీసీఎస్ వివరాలు ఉంటాయి. గతంలో దాఖలు చేసిన రిటర్నులను, వాటి పురోగతి తీరును, అవుట్‌స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్ (కట్టాల్సిన పన్ను బకాయిలు ఉంటే), రిఫండ్ అభ్యర్థన దాఖలు పురోగతి, ఐటీఆర్ 5 రసీదు వివరాలు కూడా అక్కడే లభిస్తాయి. దాఖలు సమయాన్ని తగ్గించేందుకు వీలుగా పన్ను లెక్కలను కూడా కొన్నింటిని ఆటోమేటెడ్ చేశారు. పాన్ డేటాబేస్ ఆధారంగా గతంలోని ఐటీఆర్‌లు, ఫామ్ 26ఏఎస్ ఆధారంగా ముందుగానే కొన్ని వివరాలు నింపిన రిటర్నులు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గత కొన్నేళ్ల కాలంలో కొన్ని అదనపు సౌకర్యాలను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. భద్రతా కోణంలో లాగిన్‌కు రెండో దశ అథెంటికేషన్‌ను ‘ఈ ఫైలింగ్ వాల్ట్’ రూపంలో ప్రవేశపెట్టింది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో కాకుండా.. మరింత భద్రత కోసం నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత ఓటీపీ రూపంలోనూ లాగిన్ కావొచ్చు. మధ్యవర్తుల సాయం.. స్వయంగా రిటర్నులు దాఖలు చేసుకునేంత అవగాహన లేని వారు లేదా అంత తీరిక లేని వారు మధ్యవర్తుల సాయం తీసుకోవచ్చు. ఇందు కోసం ఎన్నో వెబ్ పోర్టళ్లు (వెబ్‌సైట్స్) అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టళ్లు మీ నుంచి అవసరమైన సమాచారం అంతా తీసుకుని, పన్ను చెల్లింపు బాధ్యతలను మదింపు చేసిన అనంతరం మీ తరఫున రిటర్నులను ఆదాయపన్ను పోర్టల్ వేదికపై దాఖలు చేస్తాయి. కొన్ని పోర్టళ్లు ఉచితంగానూ ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. రూ.5లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ‘ట్యాక్స్‌స్మైల్’ పోర్టల్ ఉచితంగా రిటర్నుల ఫైలింగ్ సేవను అందిస్తోంది. అదే విధంగా క్లియర్‌ట్యాక్స్ పోర్టల్ కూడా కొందరికి ఇటువంటి సేవను ఆఫర్ చేస్తోంది. ఒకటికి మించిన మార్గాల్లో ఆదాయం కలిగి ఉండి లేదా విదేశీ ఆదాయం ఉండుంటే నిపుణుల సేవలను రిటర్నుల ఫైలింగ్ కోసం తీసుకోక తప్పదు. ఈ విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) సేవలను వినియోగించుకోవచ్చు. ఒక వ్యక్తికి ఉన్న ఆదాయ వనరుల ఆధారంగా రిటర్నుల దాఖలుకు వెబ్ పోర్టళ్లు ఫీజులను నిర్ణయిస్తున్నాయి. అందించే సేవల ఆధారంగా రూ.699 నుంచి రూ.7,999 వరకు ఫీజుల కింద ట్యాక్స్‌స్పానర్ అనే సంస్థ తీసుకుంటోంది. రిటర్నుల దాఖలే కాకుండా పలు పోర్టళ్లు విలువ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. ఐటీఆర్ దాఖలు తర్వాత వాటిల్లోని తప్పొప్పులను సరిచేసుకోవడం, డిమాండ్ నోటీసులకు స్పందించడం తదితర అంశాల్లో నిపుణుల సేవలను కూడా వీటి నుంచి పొందొచ్చు. పన్ను నిపుణులు లేదా సీఏలతో తమ సందేహాలను తీర్చుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు వాల్ట్ సేవను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. రిటర్నుల దాఖలుతోపాటు ఈ సేవలను కూడా పొందే విధంగా ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. టీఆర్పీలు ప్రభుత్వం నియమించిన పన్ను దాఖలు సన్నాహకుల (టీఆర్పీలు) సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మీకు సమీపంలో ఉన్న టీఆర్పీల వివరాలను ఇన్కమ్ట్యాక్స్ఇండియా డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్‌లో ‘ట్యాక్స్‌పేయర్ సర్వీసెస్’ ట్యాబ్ నుంచి పొందొచ్చు. టీఆర్పీలు మొదటి ఏడాది రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులపై 3% సర్వీసు చార్జీ కింద తీసుకుంటారు. అదే వ్యక్తి రెండో ఏడాది రిటర్నుల దాఖలు సేవను కోరుకుంటే 2%, తర్వాతి ఏడాది ఒక శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ట చార్జీ రూ.1,000. ఒకవేళ ఏదేనీ సంవత్సరం ఈ చార్జీ రూ.250 కూడా మించకపోతే అప్పుడు టీఆర్పీలు కనీస చార్జీ తీసుకునేందుకు అర్హులు. కాకపోతే వీరి సేవలు పన్ను రిటర్నుల దాఖలు వరకే అని గుర్తుంచుకోవాలి. ఆన్లైన్ పోర్టళ్ల మాదిరి ఏడాది పొడవునా సేవలు, విలువ ఆధారిత సేవలు వీరి నుంచి లభించవు. గడువు దాటొద్దు.. కరోనా కారణంగా 2019–20 ఆర్థిక సంవత్సరం రిటర్నుల దాఖలు గడువును జూలై నుంచి తొలుత నవంబర్ ఆఖరుకు, ఆ తర్వాత డిసెంబర్ 31కు కేంద్రం పొడిగించింది. ఈ గడువులోపు రిటర్నులను దాఖలు చేయకపోతే.. ఆ తర్వాత వడ్డీ చార్జీలు, పెనాల్టీలను చెల్లించుకోవాలి. రిఫండ్లు కూడా ఆలస్యమవుతాయి. గతంలో పెనాల్టీలు విధించడం అన్నది పన్ను అధికారుల విచక్షణపైనే ఆధారపడగా, ఇప్పుడైతే అది చట్ట ప్రకారం అమలవుతోంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 234 ఎఫ్ కింద.. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు, ఆలోపు ఉంటే డిసెంబర్ 31 తర్వాత రిటర్నుల దాఖలుకు రూ.1,000 పెనాల్టీ చార్జీగా చెల్లించాలి. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు మించి ఉంటే ఈ పెనాల్టీ రూ.10,000. గడువు లోపు రిటర్నులు దాఖలు చేయకుండా, ఆలస్యంగా రిటర్నులు వేసి పన్ను చెల్లించినట్టయితే ఆ మొత్తంపై వడ్డీ కూడా వసూలు చేయాలని సెక్షన్ 234ఏ చెబుతోంది. ఆలస్యమైన ప్రతీ నెలకు ఒక శాతం చొప్పున వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది కూడా పన్ను బాధ్యత రూ.లక్ష వరకు ఉన్న వారికే. ఒకవేళ రూ.లక్షకు మించి పన్ను చెల్లించాల్సి ఉండి, డిసెంబర్ 31 తర్వాత రిటర్నులు వేసినట్టయితే.. అప్పుడు 2020 జూలై 31 తర్వాతి నుంచి రిటర్నులు వేసే నాటి వరకు ఈ మేరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటర్నులు వేయాల్సిందే..! కనీస మినహాయింపు పరిధిలో ఆదాయం ఉన్న వారు (60ఏళ్లలోపు వ్యక్తులకు రూ.2.5 లక్షలు) రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. కానీ, ఏదేనీ ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను వర్తించే స్థాయిలో ఆదా యం లభిస్తే ఆ ఏడాదికి రిటర్నులు వేస్తే సరిపోయేది. అయితే, ఇక మీదట పన్ను వర్తించే ఆదాయ పరిధిలో లేకపోయినా కానీ.. నిర్దేశిత లావాదేవీలలో ఏవైనా నిర్వహించినట్టయితే తప్పకుండా రిటర్నులు వేయాలి. డిపాజిట్లు రూ.కోటికి మించి చేసినా (ఒకటి లేదా అంతకుమించిన కరెంటు ఖాతాలలో), విదేశీ పర్యటన కోసం రూ.2లక్షలపైన ఖర్చు పెట్టినా, ఒక ఏడాదిలో విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటినా తమ ఆదాయంతో సంబంధం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. ఎవరు ఏ రిటర్నులు వేయాలి? ఐటీఆర్–1: రూ.20 లక్షల ఆదాయం మించని వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక్క వేతనం లేదా ఇంటిపై ఆదాయం లేదా వడ్డీ ఆదాయం, లేదా వ్యవసాయంపై ఆదాయం రూ.5,000 వరకు ఉన్న వారు, లేదా ఇవన్నీ కలిగిన వారు ఐటీఆర్–1 ఫైల్ చేయాలి. ఐటీఆర్–2: ఐటీఆర్–1 పరిధిలోని వారు కాకుండా.. ఒక వ్యక్తి కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటే లేదా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నమోదు కాని కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఐటీఆర్–2 దాఖలు చేయాలి. అలాగే, క్రితం ఆర్థిక సంవత్సరాల్లోని మూలధన లాభాలను చూపించుకునేట్టు అయితే లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నష్టాలను తర్వాతి సంవత్సరాలకు కొనసాగించుకోవాలనుకుంటే, ఇతర వనరుల ద్వారా ఆదాయం వచ్చిన వారు కూడా ఇదే రిటర్న్ వేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆర్జించి ఉంటే ఐటీఆర్–3ను ఫైల్ చేయాలి. ఐటీఆర్–4: భారతీయ నివాసితులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు (ఎల్ఎల్పీ కాకుండా) వ్యాపారం, వృత్తి రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉంటే ఐటీఆర్–4 వేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5/6/7: నిర్దేశిత వ్యక్తులు, ఎల్ఎల్పీలు, సంస్థలు, కంపెనీలకు ఇవి వర్తిస్తాయి. -
ట్రేడింగ్ ఆదాయంపై పన్ను చెల్లించాలా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఆదాయాన్ని చూపించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. అయితే, ఈ విషయమై స్పష్టమైన అవగాహన తక్కువ మందిలోనే ఉంటుందని చెప్పుకోవాలి. నేటి తరం యువతలో చాలా మంది ట్రేడింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. అత్యాధునిక ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్లు అందుబాటు, మొబైల్ నుంచే అన్ని రకాల సేవలు, విస్తృతమైన సమాచారం ఇవన్నీ ఇందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మరి ట్రేడింగ్‌ను ఓ ప్రొఫెషన్‌గా ఎంచుకున్నవారు ఇందుకు సంబంధించిన పన్ను బాధ్యతలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆ వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. ఇంట్రాడే ట్రేడింగ్ (ఒకే రోజు కొని, విక్రయించడం) ద్వారా వచ్చే లాభ/నష్టాలను వ్యాపార ఆదాయంగా చట్టం పరిగణిస్తుంది. బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా వచ్చిన లాభాలుగా (పీజీబీపీ) వీటిని చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్‌గా వేరు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్‌పై వచ్చే లాభ, నష్టాలను స్పెక్యులేటివ్‌గా పరిగణించాలి. అదే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ద్వారా వచ్చే లాభ, నష్టాలు నాన్ స్పెక్యులేటివ్ అవుతాయి. పీజీబీపీ కింద స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ లాభాలన్నవి మీ పన్ను వర్తించే ఆదాయానికే కలుస్తాయి. మీ ఆదాయం ఏ శ్లాబు పరిధిలో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి. మినహాయింపులు అయితే, వ్యాపార ఆదాయం కింద చూపించే స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ లాభాల నుంచి, మీకు అయిన ఖర్చులను మినహాయించుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్రోకర్ల కమీషన్, డీమ్యాట్ చార్జీలు, ఇంటర్నెట్ ఖర్చులు ఇవన్నీ కూడా ట్రేడింగ్ కోసం చేసిన ఖర్చులే అవుతాయి. కనుక మొత్తం లాభాల్లో ఈ ఖర్చులను మినహాయించుకున్న తర్వాతే మిగిలిన ట్రేడింగ్ ఆదాయాన్ని పేర్కొంటే సరిపోతుంది. అయితే, నష్టాలు వస్తే మాత్రం స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ ఆదాయంపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. ఎఫ్‌అండ్‌వో నుంచి నాన్ స్పెక్యులేటివ్ రూపంలో నష్టం వచ్చిందనుకుంటే... ఈ నష్టాన్ని సంబంధిత వ్యక్తి వేతనం మినహా ఇతర ప్రధాన ఆదాయం నుంచి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికీ నష్టం మిగిలిపోతే దాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల కోసం బదలాయించుకోవచ్చు. తద్వారా తర్వాతి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడైనా చూపించుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు వార్షికాదాయం రూ.6 లక్షలు అనుకోండి, అలాగే, అద్దె రూపంలో మరో రూ.2 లక్షలు వచ్చిందనుకోండి.. వీటికి అదనంగా ఎఫ్అండ్వోలోనూ వేలుపెట్టి రూ.3 లక్షలు నష్టపోయారనుకుందాం. అప్పుడు మీ ఆదాయం రూ.6 లక్షలే. వాస్తవంగా వేతనం రూపంలో రూ.6 లక్షలు, అద్దె రూపంలో రూ.2 లక్షలు కలిపితే ఆదాయం రూ.8 లక్షలు. కానీ అద్దె ఆదాయం రూ.2 లక్షల్లో, నష్టం రూ.2 లక్షలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఇతర ఆదాయం రూ.2 లక్షలే ఉండడంతో రూ.3 లక్షల నష్టం వచ్చినా కానీ, కేవలం రూ.2 లక్షలు మినహాయించుకోవడం జరిగింది. మిగిలిన రూ.లక్ష నష్టాన్ని తదుపరి ఏడాదికి బదిలీ చేసుకోవచ్చు. ఇక ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ స్పెక్యులేటివ్ కిందకు వస్తుంది కనుక.. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నష్టం వస్తే దాన్ని కేవలం స్పెక్యులేటివ్ ఆదాయం నుంచే మినహాయించుకునేందుకు వీలుంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన స్పెక్యులేటివ్ నష్టాన్ని, అదే సంవత్సరం స్పెక్యులేటివ్ ఆదాయం కింద సర్దుబాటుకు వీలు పడకపోతే, తదుపరి 4 ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడైనా దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే స్పెక్యులేటివ్ నష్టాలను, స్పెక్యులేటివ్ ఆదాయం నుంచే సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. నాన్ స్పెక్యులేటివ్(ఎఫ్‌అండ్‌వో) ఆదాయం నుంచి స్పెక్యులేటి వ్ నష్టాలను మినహాయించుకోవడానికి కుదరదు. ఆడిటింగ్ అవసరమే... స్టాక్ ట్రేడింగ్ ఆదాయం వ్యాపార ఆదాయం అవుతుంది కనుక ఆదాయపన్ను చట్టం ప్రకారం ఆడిట్ తప్పనిసరి. ఆదాయపన్ను చట్టం ప్రకారం వ్యాపార ఆదాయం రూ.కోటి దాటితే ఆడిట్ తప్పనిసరి అవుతుంది. ట్రేడింగ్ రూపంలో వచ్చిన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలంటే, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవాలా? అని చాలా మంది పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు ఎదుర్కొనే సందేహం. ఈ విషయమై క్లియర్‌ట్యాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా స్పందిస్తూ... ఒక వ్యక్తి వార్షిక టర్నోవర్ రూ.కోటి దాటకపోతే కనుక నష్టాలను మినహాయించి చూపించుకునేందుకు, తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకునేందుకు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు. అయితే, తమకు ఇంత ఆదాయం వస్తుందంటూ స్వచ్ఛందంగా పన్ను చెల్లించే ‘ప్రిజంప్టివ్ ట్యాక్స్ స్కీమ్’ కింద రిటర్నులు దాఖలు చేసే వారికి ట్యాక్స్ ఆడిట్ నిబంధనలు వేరుగా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద టర్నోవర్‌లో 6/8 శాతం కంటే తక్కువ లాభం (ట్రేడింగ్ రూపంలో) ఉందని చూపిస్తే మాత్రం ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అవుతుంది. అదే సమయంలో ఇతర మార్గాలు అయిన.. వేతనం, అద్దె ఆదాయం, వ్యాపార రూపంలో ఆదాయం కనీస పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు మించి ఉన్నా కానీ ఆడిటింగ్ అవసరం అవుతుంది. ఉదాహరణకు.. ఓ వ్యక్తి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ పథకం కింద తనకు ట్రేడింగ్‌పై నష్టం వచ్చినట్టు చూపించారనుకోండి... అదే సమయంలో ఆ వ్యక్తి మొత్తం ఆదాయం (వేతనం సహా) రూ.2.5 లక్షలు మించి ఉంటే ట్యాక్స్ ఆడిట్ అవసరం అవుతుంది. టర్నోవర్ అంటే... టర్నోవర్ అంటే ఏమిటీ..? అన్న సందేహం వస్తే... ఉదాహరణకు ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ సెటిల్మెంట్లో పేయింగ్ అవుట్/పేయింగ్ ఇన్ తేడాయే టర్నోవర్ అవుతుంది. అంటే రూ.5 లక్షలు కొనుగోలు చేసి, రూ.4 లక్షలకు అమ్మితే, మిగిలిన రూ.లక్ష టర్నోవర్ అవుతుంది. అదే ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్ అయితే, నికర లాభం, నష్టం, ఆప్షన్లపై ప్రీమియం టర్నోవర్ కిందకు వస్తాయి. ఉదాహరణకు ఓ కాంట్రాక్టును రూ.5,00,000కు కొనుగోలు చేసి, దాన్ని రూ.5,50,000కు విక్రయించారని అనుకుంటే... అప్పుడు లాభం రూ.50,000 వచ్చినట్టు అవుతుంది. ఇదే టర్నోవర్ అవుతుంది. అదే ఆప్షన్ కాంట్రాక్టులో ఫలానా కంపెనీ లాట్ (1,000 షేర్లు)ను రూ.200కు కొనుగోలు చేసి రూ.180కు అమ్మారనుకోండి. ఈ కేసులో రూ.20,000 నష్టంతోపాటు, ట్రేడర్‌కు నికరంగా లభించే ప్రీమియం రూ.1,80,000 కూడా టర్నోవర్ కిందకు వస్తుంది. ఈ రెండు కేసులను కలిపి చూస్తే, ఫ్యూచర్ కాంట్రాక్టులో నికర లాభం రూ.50,000తోపాటు, ఆప్షన్ కాంట్రాక్టులో మొత్తం రూ.2 లక్షలు కలిపి టర్నోవర్ రూ.2,50,000 అవుతుంది. -
ఈ ఆర్థిక అలవాట్లకు దూరం..!
జీవన ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనుకుంటే అందుకు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపించేవి అయి ఉంటాయి. ఓ ఇన్వెస్టర్‌గా వాటిని దూరం పెట్టడం ద్వారా మీ ప్రయాణం సాఫీగా కొనసాగేలా చూసుకోవచ్చు. ఎక్కువ పొదుపు, తక్కువ ఖర్చు, అనవసర రుణాలకు దూరంగా ఉండడం అన్నవి మంచి అలవాట్లు. ఈ అలవాట్లు వ్యక్తిని ఆరి్థకంగా సౌకర్యంగా ఉంచుతాయి. ఆర్థికపరమైన విజ్ఞానం ఉన్నవారు సైతం కొన్ని తప్పిదాల వల్ల ఆరి్థకంగా ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆర్థికంగా దూరంగా ఉంచాల్సిన అలవాట్లపై అవగాహన కలి్పంచడమే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచి అలవాటే. కానీ, షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించే వారు చాలా మందే ఉన్నారు. అయితే, వీరిలో తగినంత పరిశోధన, అధ్యయనం చేసి ఇన్వెస్ట్ చేసే వారు చాలా చాలా తక్కువ. ఇటీవలి మార్కెట్ పతనం చాలా మంది చిన్న ఇన్వెస్టర్లను కుదిపేసిందనే చెప్పుకోవాలి. చాలా స్టాక్స్ ఇటీవలి బడ్జెట్ తర్వాత నూతన 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్ ఏడాది క్రితం రూ.600పైన పలికింది. ప్రస్తుత ధర రూ.48.65. అంటే దాదాపు 92 శాతం మేర విలువ తుడిచిపెట్టుకుపోయింది. కానీ, ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఈ స్థాయి నష్టాలేమీ లేవు. స్టాక్ మార్కెట్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ కూడా క్షీణించడం సహజమే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో వైవిధ్యాన్ని పాటించడం వల్ల నష్టాలు పరిమితంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ చెత్త పనితీరు చూపించిన పథకాలు కూడా... బీఎస్ఈ 100లోని ఎక్కువగా నష్టపోయిన షేర్ల కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, కొంత మేర మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. ఫండ్స్‌లో ఆయనకు సగటు రాబడులు 8 శాతంగా ఉంటే, స్టాక్స్‌లో ఆయన నష్టాలు భారీగా పేరుకుపోయాయి. 50 శాతంపైన నష్టాల పాలయ్యాడు. అందుకే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ఎంతో అవగాహన, అధ్యయనం, విస్తృత పరిజ్ఞానం అవసరం. ఈ విషయాన్నే చాలా మంది ఇన్వెస్టర్లు విస్మరిస్తుంటారు. ఎంచుకునే కంపెనీల విషయంలో తాము సొంతంగా అధ్యయనం చేసి నిర్ధారించుకోలేని వారు, నిపుణుల సలహాలను పొందొచ్చు. లేదంటే మంచి ట్రాక్ రికార్డు కలిగిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం నయం. అధ్యయనం లేకుండా ముందడుగు మన దేశంలో చిగురిస్తున్న స్టార్టప్‌లలో 90 శాతానికి పైగా ప్రారంభించిన ఐదేళ్లలోపే మూతపడుతున్నాయని ఐబీఎం నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది. సావన్ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి 2011లో ఓ వెంచర్‌ను ఆరంభించాడు. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. క్రమంగా దాన్ని విస్తరించాలన్నది ప్రణాళిక. కానీ న్యాయపరమైన, నియంత్రణపరమైన అవరోధాలతో 2014లోనే దాన్ని ఆపేయాల్సి వచి్చంది. అయితే, ఇది అతడి జీవన ప్రణాళికలపైనా పడింది. వ్యాపారంలో నష్టపోవడమే కాకుండా, ఇంటి రుణం, పర్సనల్ లోన్, పిల్లల విద్య అవసరాల కోసం చేస్తున్న పెట్టుబడుల ప్రణాళికలకు విఘాతం కలిగింది. తిరిగి మరలా ఉద్యోగంలో చేరేందుకు ఏడాది సమయం పట్టింది. తన సొంత కాళ్లపై నిలబడాలని చాలా మందికి ఉండొచ్చు. తానో ఎంట్రప్రెన్యూర్‌గా మారాలన్న అభిలాష ఉండొచ్చు. కానీ, ఆ దిశగా అడుగులు వేసేందుకు సమగ్ర సన్నద్ధత అవసరం. ఇలా సొంత ప్రయత్నాలు ఆరంభించడానికి ముందుగానే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలి. పన్ను ఆదా కోసం బీమా మన దేశంలో ఏటా కోట్లాది రూపాయలను అవసరం లేని బీమా ప్లాన్లపై వెచి్చస్తున్న విషయం తెలుసా..? బీమాలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు, జీవితానికి బీమా రక్షణ, గడువు తీరిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను లేకపోవడం... ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ట్రిపుల్ బెనిఫిట్. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల్లో పన్ను ఆదా ఒక్క ప్రయోజనం తప్పించి... నిజానికి సరిపడా బీమా రక్షణను అవి ఇవ్వలేవు. అంతేకాదు సరైన రాబడులను కూడా ఇవ్వవు. మీరు చెల్లించే ప్రీమియంలో సగ భాగం బీమా రక్షణ ఖర్చులకే పోతుంది. మిగిలిన పెట్టుబడులపై వచ్చే రాబడి చూసుకుంటే మొత్తంమీద రాబడి రేటు 5 శాతం దాటదు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన యులిప్‌లు రాబడుల విషయంలో కొంచెం మెరుగైనవే. కానీ వీటిల్లో చార్జీలు, ఫీజులు, రాబడుల విషయంలో పారదర్శకత తక్కువ. బీమా పాలసీల్లో ప్రధానమైనది దురదృష్టవశాత్తూ మరణం చోటు చేసుకుంటే, ఆ కుటుంబ ఆర్థిక అవసరాను గట్టె క్కించేది అయి ఉండాలి. కానీ, సంప్రదాయ పాలసీల్లో ఇదే ఆఖరు ప్రాధాన్యంగా ఉంటుందన్న నిజాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఎక్కువ మంది చూస్తున్నది పన్ను ఆదానే. ఇదే పాలసీలను మార్కెట్ చేసే వారికి ఆయుధంగా మారుతోంది. 63 ఏళ్ల రాజారావు ఓ పెన్షనర్. మూడేళ్ల క్రితం ఆయనొక యులిప్ పాలసీ తీసుకున్నారు. రాజారావు పదవీ విరమణ డబ్బులు ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయిన వెంటనే, బ్యాంకు ఉద్యోగి ఆయనకు యులిప్ పాలసీ అంటగడ్డాడు. దీనివల్ల పన్ను ఆదా చేసుకోవచ్చన్న బ్యాంకు ఉద్యోగి మాటలను నమ్మి యులిప్ పాలసీని రాజారావు తీసుకున్నాడు. మూడేళ్లలో ఇందులో రూ.4.5 లక్షలు పెడితే, మూడేళ్ల తర్వాత ఆయన పెట్టుబడి విలువ రూ.4 లక్షలుగానే కనిపిస్తోంది. ఫండ్ విలువ కోలుకునే వరకూ వేచి చూడాలని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారంటూ రాజారావు పేర్కొన్నారు. నిజానికి సీనియర్ సిటిజన్ అయిన రాజారావుకు యులిప్ పాలసీ అవసరమే లేదు. ఎందుకంటే మార్కెట్ లింక్డ్ పాలసీ అది. దీనికి బదులు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనుకూలం. వైవిధ్యం ఎక్కువైతే... పెట్టుబడులకు వైవిధ్యం అన్నది ప్రాణం అవుతుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ నూరు శాతం ఉంటుంది. కానీ, ఈ పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య డెవర్సిఫై చేయడం వల్ల రిస్‌్కను వేరు చేసినట్టు అవుతుంది. కానీ, వైవిధ్యం శ్రుతిమించకూడదు. ఆప్పుడే ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రిస్క్ తగ్గించుకోవాలని లెక్కకు మించిన చోట ఇన్వెస్ట్ చేయడం అనుకున్న ప్రయోజనాలను ఇవ్వదు. మోడల్ పోర్ట్‌ఫోలియో అంటే... వివిధ రంగాలకు చెందిన స్టాక్స్ 15–20 మించకుండా చూసుకోవడం. ఇది రిస్‌్కను తగ్గిస్తుంది. ఈ వైవిధ్యం పెట్టుబడుల రిస్‌్కను ఎన్నో సెక్యూరిటీల మధ్య పంచుతుంది. అలా అని పదుల సంఖ్యలో చాంతాడంత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ ఇంకా తగ్గుతుందని అనుకుంటే అది నిజం కాబోదు. ఇదే సూత్రం మ్యూచువల్ ఫండ్స్‌కూ అమలవుతుంది. సెక్టార్ ఫండ్స్ (థీమ్యాటిక్) మినహా మిగిలిన ఈక్విటీ ఫండ్స్‌లో వైవిధ్యం అన్నది సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్లు, భిన్న రంగాలకు చెందిన కంపెనీలను, అలాగే స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలను పోర్ట్‌ఫోలియో కోసం ఎంచుకుంటారు. కనుక తమ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ఫండ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అధిక సంఖ్యలో పథకాలను ఎంచుకున్నారనుకోండి... ఆయా పథకాలు ఒకే తరహా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తగ్గకపోగా, పెరుగుతుంది. నెలకు రూ.5,000–20,000 మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే మహా అయితే నాలుగు పథకాలు సరిపోతాయి. 40 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కోసం, 30 శాతం మల్టీక్యాప్ పథకాలకు, 20 శాతం మిడ్‌క్యాప్, 10 శాతం స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు పుణెకు చెందిన సౌమ్య మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం హాబీగా పెట్టుకుంది. అది కూడా మంచి పనితీరు చూపించే పథకాల్లోనే. కానీ, ఒక ఏడాది మంచి పనితీరు చూపించిన పథకం మరుసటి ఏడాది కూడా టాప్‌లోనే ఉండాలని లేదు కదా. దాంతో సౌమ్య పోర్ట్‌ఫోలియోలో పథకాల సంఖ్య 30కు చేరుకుంది. దీంతో కొన్నింటిని తగ్గించుకుందామనుకున్నా... వేటిని తీసేయాలన్న సందిగ్ధం ఆమెను వేధిస్తోంది. ఒకటి రెండు పథకాలను అదనంగా ఎంచుకున్నా ఫర్వాలేదు కానీ, మరీ ఎక్కువ కాకుండా చూసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అయితే, షేర్ల మాదిరిగా ఫండ్స్ పథకాలు ఎక్కువైపోతే నష్టాలు వస్తాయనేమీ లేదు. ఎందుకుంటే ఫండ్స్ ఎప్పుడూ నిపుణుల నిర్వహణలోనే కొనసాగుతుంటాయి. కాకపోతే రాబడుల రేటే ప్రభావితం అవుతుంది. ఎందుకంటే వాటిని పర్యవేక్షించడం కష్టమవుతుంది. అత్యవసరాలు... జీవనశైలి ఖర్చులన్నవి నేడు బాగా పెరిగిపోయాయి. అంతేకాదు ఖర్చు చేసేందుకు ఎన్నో ఆకర్షణలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే జీవితానికి కనీస అవసరాలన్నవి గతంతో పోలిస్తే అధికమయ్యాయి. రిటైర్మెంట్ అవసరాల కోసం తాము చేస్తున్న పొదుపు, మదుపులను వృద్ధాప్యంలో వైద్య అవసరాల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సిగ్నా నిర్వహించిన సర్వేలో ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పడం గమనార్హం. 40 శాతం మంది తాము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు తెలిపారు. ముంబైకి చెందిన కీర్తి నెల ఆదాయంలో వ్రస్తాలు, ఆహారం, ప్రయాణ అవసరాలకే 75 శాతం ఖర్చవుతోంది. దీంతో ఆమె పొదుపు చేసేందుకు మిగులుతున్నది కొద్ది మొత్తంగానే ఉంటోంది. అంతేకాదు, తగినంత పొదుపు లేకపోవడం వల్ల ఆమె కంటి సర్జరీని వాయిదా వేసుకోవాల్సి వచి్చంది. ఆలస్యంగా వాస్తవాన్ని గ్రహించిన కీర్తి, ప్రతి నెలా సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ఆరంభించింది. అంతేకాదు హెల్త్ ప్లాన్ తీసుకోవడం, అత్యవసరాల కోసం ఓ నిధిని సమకూర్చుకోవడం కూడా ఆమె ముందున్న అవసరాలు. చాలా మంది అత్యవసర నిధి అవసరాన్ని పట్టించుకోరు. అవసరం వచ్చినప్పుడే వాస్తవాన్ని గుర్తిస్తుంటారు. కనుక ఆర్జించే ప్రతీ వ్యక్తి కూడా 6–8 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. కనీసం రూ.5 లక్షలకు అయినా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పెరిగే అవసరాలకు అనుగుణంగా కవరేజీని టాపప్ ద్వారా పెంచుకోవాలి. అంతేకాదు కుటుంబానికి ఆధారంగా ఉండేవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం 10–15 రెట్ల మేర టర్మ్ బీమా ప్లాన్ కూడా తీసుకోవాలి. -
ఇన్వెస్టర్లూ... ఇలా చేయొద్దు!!
‘‘గత ఏడాది కాలంలో మార్కెట్లు 20 శాతం ర్యాలీ చేశాయి. కానీ, నేను ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ పథకం మాత్రం నష్టాలనే చూపిస్తోంది’’ ఇదీ... ఢిల్లీకి చెందిన తరుణ్ ఆవేదన. మరి తరుణ్ విషయంలో ఏమై ఉంటుందని పరిశీలిస్తే... అతడు 2017 జులై నుంచి ప్రతి నెలా ఓ లార్జ్‌క్యాప్ పథకంలో రూ.10,000, ఓ మిడ్‌క్యాప్ పథకంలో రూ.10,000 చొప్పున సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. లార్జ్ క్యాప్ పథకంలో సగటున స్వల్ప రాబడులే ఉన్నాయి. కానీ, ఇదే సమయంలో మిడ్‌క్యాప్ పథకంలో ఎక్కువ నష్టాలొచ్చాయి. దీంతో మొత్తం మీద వరుణ్ పెట్టుబడులపై నష్టాలే కనిపిస్తున్నాయి. ఏడాది, ఏడాదిన్నర కిందట సిప్ విధానంలో పెట్టుబడులు ప్రారంభించిన చిన్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మందిది ఇదే పరిస్థితి. ప్రారంభంలో వీరు ఎంచుకున్న పథకాల పనితీరు బాగానే ఉంది. కానీ, గత ఆరు నెలలుగా మాత్రం పని తీరు ఆశాజనకంగా లేదు. బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే పనితీరులో వెనుకబడే ఉన్నాయి. కాకపోతే, ఇన్వెస్టర్లు చేసే కొన్ని పొరపాట్లు సైతం నష్టాలకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు. వాటి వివరాలే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... కొన్ని నెలలుగా మార్కెట్ల ర్యాలీని గమనిస్తే... రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్, ఐటీసీ వంటి షేర్లు మాత్రమే అసాధారణ రాబడులను ఇచ్చాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్ అన్నవి వైవిధ్యంతోనూ ఉంటాయి. ఇండెక్స్ స్టాక్స్‌తో పాటు, బయటి స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అయితే, సూచీలో అధిక వెయిటేజీ కలిగిన ఈ స్టాక్స్ ర్యాలీ కారణంగా... సూచీలోని స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఇండెక్స్ ఫండ్స్ పనితీరులో ముందు నిలిచాయి. దీంతో పెట్టుబడులను లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి, తక్కువ చార్జీలు, అధిక రాబడులు కనిపిస్తున్న ఇండెక్స్ ఫండ్స్‌లోకి మార్చుకోవాలని భావించడం సరికాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘స్థిరమైన పనితీరు విషయంలో ఇండెక్స్ ఫండ్స్... యాక్టివ్ ఫండ్స్‌తో పోటీ పడే పరిస్థితి ఇంకా దేశీయ మార్కెట్లలో రాలేదు. కాబట్టి మంచి పోర్ట్‌ఫోలియోతో కూడిన యాక్టివ్ ఫండ్స్ మరికొన్నేళ్లు చక్కని పనితీరు చూపించగలవు’’ అని స్క్రిప్‌బాక్స్ సీవోవో సంజీవ్ తెలియజేశారు. సిప్‌లు నిలిపివేయడం సరికాదు... గత కొన్ని నెలల్లో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ పెద్ద మొత్తంలో నష్టాల పాలయ్యాయి. గడిచిన ఏడాది కాలంలో సిప్ విధానంలో ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు తమ పెట్టుబడులపై ప్రస్తుతం నష్టాలనే చవిచూస్తున్నారు. దీంతో తమ పెట్టుబడులను నిలిపివేస్తున్నారు. కానీ, ఇది తెలివైన చర్య కాదన్నది నిపుణుల మాట. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై గతంతో పోలిస్తే తక్కువ ఎన్‌ఏవీకే ఎక్కువ యూనిట్లను సొంతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని వారు సూచిస్తున్నారు. కొంత కాలానికి సిప్ ద్వారా పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తాయని పేర్కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసే వారు దాన్ని ఆపకుండా, కొనసాగించడమే మెరుగైన విధానం అన్నది నిపుణుల మాట. డెట్ ఫండ్స్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లకు... నాలుగు సంవత్సరాల విరామం తర్వాత వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభమయ్యాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్‌పై ఈల్డ్ 8 శాతానికి చేరింది. దీంతో డెట్ ఫండ్స్ రాబడులపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక బాండ్ ఫండ్స్‌పై ఈ ప్రభావం ఉంది. ఇతర కేటగిరీల బాండ్ ఫండ్స్ రాబడులు 3–4 శాతం మధ్యే ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయి. చాలా బ్యాంకులు మూడేళ్ల కాలానికి డిపాజిట్లపై 7–7.5 శాతం మధ్య వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అధిక వడ్డీ రేటును చూసి కొంత మంది ఇన్వెస్టర్లు బాండ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన చేయవచ్చు. కానీ, నిపుణులు మాత్రం ఇలా చేయవద్దని సూచిస్తున్నారు. బ్యాంకు డిపాజిట్లు నమ్మకమైన రాబడులను ఇస్తున్నాగానీ, వాటిపై పన్ను ప్రయోజనాలుండవు. బ్యాంకు డిపాజిట్లపై ఆర్జించే ఆదాయం అంతా కూడా సంబంధిత వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారు ఏ శ్లాబ్ పరిధిలోకి వస్తే ఆ ప్రకారం పన్ను పడుతుంది. దీనికి బదులు ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ లేదా లో డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. బాండ్ ఫండ్స్ పన్ను పరంగా మరింత సమర్థనీయమైనవి. మూడేళ్లకుపైగా వీటిని కొనసాగిస్తే... ఇండెక్సేషన్ ప్రయోజనంతో పాటు రాబడులపై 20 శాతమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. స్వల్పకాల లక్ష్యాల కోసం సిప్!... కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు గడిచిన రెండు, మూడేళ్ల కాలంలో మంచి రాబడులు ఇవ్వడాన్ని చూసి కొందరు ఇన్వెస్టర్లు ఆయా పథకాల్లో సిప్‌లు మొదలు పెడుతుంటారు. స్వల్ప కాలిక లక్ష్యాల కోసం, సత్వర రాబడుల కోసం ఆశించకుండా ఈ మార్గాన్ని ఆశ్రయించడం సరైనదే. ఎందుకంటే కొన్ని స్టాక్స్ విలువలు చారిత్రక గరిష్ట స్థాయిలకు చేరినందున స్వల్ప కాలంలో రాబడులు ఉండకపోవచ్చు. సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే వారు కనీసం ఐదేళ్ల కాలం పాటు కొనసాగేందుకు సిద్ధపడాలని నిపుణుల సూచన. డివిడెండ్ కోసం ఫండ్స్... కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు క్రమం తప్పకుండా ఆదాయం కోసమని కొన్ని రకాల పథకాలను తీసుకొస్తుంటాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి డివిడెండ్ ఆదాయం అన్నది, తమ సొంత పెట్టుబడుల నుంచి చెల్లించేదన్న విషయాన్ని గమనించాలి. ఇక ఈ డివిడెండ్‌పై ఇటీవలే 10 శాతం పన్ను అమల్లోకి వచ్చింది. కనుక డివిడెండ్ ఆదాయం అన్నది పన్ను పరంగా లాభసాటి కాదు. కనుక డివిడెండ్ చెల్లింపులను క్రమం తప్పకుండా ఆదాయం కింద పరిగణించే వారు మరోసారి పునరాలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మిగుల నిధుల నుంచే ఈ డివిడెండ్ చెల్లింపులు చేయడం జరుగుతుంది. కనుక క్రమం తప్పకుండా, కచ్చితమైన డివిడెండ్ చెల్లింపులకు ఎటువంటి హామీ ఉండదని తెలుసుకోవాలి. స్టాక్స్ పట్ల అతి విశ్వాసం వద్దు స్టాక్ మార్కెట్లో అతివిశ్వాసం ప్రమాదకరం. అతి విశ్వాసం, లెక్కచేయని తనం ఉన్న వారితో పోలిస్తే తక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన వారే స్టాక్ మార్కెట్లో తక్కువ తప్పిదాలు చేస్తుంటారు. పోర్ట్‌ఫోలియోకు రక్షణ కల్పించుకునేందుకు ఈక్విటీ, డెట్‌కు మధ్య శాతం వారీగా సమతూకం పాటించడమే ఉత్తమ మార్గం. అలాగే, రాబడుల ఆధారంగా... నిర్ణయించుకున్న శాతానికంటే విలువ తగ్గిన విభాగంలోకి పెట్టుబడులను పెంచుకోవడం చేస్తుండాలి’’ అని వ్యాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ తెలిపారు. -
సొంతిల్లు పెద్ద కోరికగా ఉండిపోకూడదు!
మిలీనియల్స్!! అంటే దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉన్న ఆర్జనపరులైన యువత. మరి వీరికి పొదుపు, ఇన్వెస్ట్మెంట్, ఖర్చులకు సంబంధించిన సూత్రాలపై అవగాహన ఏ మేరకుంది? దీనికి సమాధానం కాస్త ఆశ్చర్యకరమే. ఎందుకంటే తమకన్నా ముందు పుట్టిన వారికన్నా ఈ ‘జనరేషన్–వై’ వ్యక్తులు కాస్త తెలివైనవారు. వీరికి ఇల్లు కొనుగోలు అన్నది చాలా పెద్ద కోరిక. కానీ దానికన్నా అద్దె ఇంట్లో ఉండటానికే ప్రాధాన్యమిస్తారు. అయితే ఇంత తెలివైన వారు కూడా ఆర్థిక మోసాలకు తేలిగ్గా బుక్ అయిపోతుంటారన్నది పీపీఎఫ్ఏఎస్ మ్యూచ్‌వల్ ఫండ్ మార్కెటింగ్ హెడ్ జయంత్పాయ్ అభిప్రాయం. వీరు ఇతర తరాలైన ‘జనరేషన్ ఎక్స్’, ‘జనరేషన్ జెడ్’ కన్నా భిన్నమైన వారన్నది అర్థ యంత్ర సీఈఓ నితిన్ వ్యాకరణం మాట. మరి ఈ మిలీనియల్స్ ఆర్థిక విషయాల్లో ఎలా ఉంటున్నారు? ఏ విషయాల్లో మారాల్సి ఉంది? ఆ వివరాల సమాహారమే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం స్వల్పకాల లక్ష్యాలు... ఖర్చులూ అధికం ‘‘మిలీనియల్స్ దీర్ఘకాల లక్ష్యాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. చాలా కాలం పాటు వారు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. తక్కువ బాధ్యతలతో అధికంగా ఖర్చు పెట్టే రకం. కనుక వీరిది స్వల్పకాలిక దృష్టి’’ అని నితిన్ వ్యాకరణం పేర్కొన్నారు. కానీ, వీరి కంటే ముందు తరం వారు అయిన జనరేషన్ ఎక్స్ సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచే దీర్ఘకాలిక లక్ష్యాలైన ఇల్లు, పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్నారు. జనరేషన్ వై మాత్రం వీటిని తర్వాత అంటూ వాయిదా వేస్తున్నారు. పొదుపు కంటే కారు, విహార యాత్రలకు వెళ్లటం, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల కోసం ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారట. దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఇల్లు అన్నది మిలీనియల్స్‌కు (జనరేషన్ వై) అతిపెద్ద కోరికగా ఉందని బ్యాంక్ బజార్ సర్వే ‘యాస్పిరేషన్ ఇండెక్స్ 2018’లో వెల్లడైంది. 25–35 మధ్య వయసున్న 1,551 మంందిపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వీరిలో చాలా మంది అద్దె ఇళ్లలో నివసించేందుకే ఇష్టపడుతున్నారు. సొంతింటి కోసం రుణాలు తీసుకుంటే ఉద్యోగానికి కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. కాకపోతే తమ ఆకాంక్షల కోణంలో ఇలా ఒకే చోట ఉండిపోవాలని వారు అనుకోవడం లేదట. ‘‘నేను, నా శ్రీమతి ఇద్దరం ఉద్యోగాల్లో ఫ్రెషర్లమే. ఒకే ఉద్యోగానికి అతుక్కుపోవాలని అనుకోవడం లేదు’’ అని బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల హర్షవర్ధన్ పేర్కొనడం గమనార్హం. మిలీనియల్స్‌కు రిటైర్మెంట్ గురించి అవగాహన ఉన్నా... ఆర్థిక ప్రణాళిక విషయంలో దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చాలా మంది మిలీనియల్స్ దీర్ఘకాలిక లక్ష్యాలకు పొదుపును వాయిదా వేస్తున్న వారే. కానీ, ఇది సరికాదని, తమ ఆదాయంలో కనీసం 10 శాతాన్ని అయినా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఫండ్స్, పాలసీల్లో పెట్టుబడులు... ఇక పెట్టుబడుల విషయానికొస్తే మిలీనియల్స్ తెలిసీ, తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు వద్దంటున్నా వీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే, అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవడం లేదా సంప్రదాయ బీమా పాలసీలను కూడా తీసుకుంటున్నారని జయంత్ పాయ్ చెప్పారు. ఉదాహరణకు అహ్మదాబాద్‌కు చెందిన దివ్య (29) ఈక్విటీల్లో 30 శాతం ఇన్వెస్ట్ చేస్తుండగా, డెట్‌లో 70 శాతం పెట్టుబడులు పెడుతోంది. నిజానికి చిన్న వయసులో ఉన్న దివ్య ఈక్విటీలకు మరింత కేటాయించుకోవడం సరైనదిగా నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చంతా ప్రయాణాలు, గ్యాడ్జెట్లకే... మిలీనియల్స్ ప్రయాణాలు, గ్యాడ్జెట్లు, వస్త్రాలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు వీరికి ముఖ్యమైన వ్యాపకంగా ఉంటున్నాయి. వీరి ఆదాయంలో ఎక్కువ భాగం దీనికే కేటాయిస్తున్నారు కూడా. ఈ విధంగా సెలవుల్లో సరదాలనేవి ‘జనరేషన్ ఎక్స్’ మాత్రం నిష్ప్రయోజనకరమైనవిగా భావిస్తుండటం గమనించాల్సిన అంశం. అసలు ఈ మిలీనియల్స్ ప్రయాణాలపై ఎందుకంతగా వెచ్చిస్తున్నారంటే... ఖర్చు చేసేందుకు చేతిలో అధిక ఆదాయం ఉండడంతోపాటు, అదే సమయంలో బాధ్యతలు తక్కువగా ఉండడమే. సులభంగా రుణాలు పొందగలిగే అవకాశం, చేతిలో క్రెడిట్ కార్డులు వీరికి ఖర్చు విషయంలో కొండంత ధైర్యాన్నిస్తున్నాయి. కానీ, ఇది పూర్తిగా మంచిది కాదని, రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని పాయ్ హెచ్చరించారు. సంప్రదాయ పాలసీలతోనే ‘బీమా’ జనరేషన్ ఎక్స్ వారు సంప్రదాయ బీమా పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కాకపోతే వీటిని రక్షణ కోసం కాకుండా వీటిని తమ జీవిత లక్ష్యాల కోసం తీసుకోవడం కొంచెం ఆశ్చర్యకరమే. జీవితానికి తగినంత రక్షణ లేకపోగా, అదే సమయంలో వీటితో రాబడులు కూడా తక్కువే ఉంటున్నాయి. ఇక మిలీనియల్స్ టర్మ్ పాలసీలను ఎంచుకునేందుకు సిద్ధంగానే ఉన్నారని పాయ్ పేర్కొన్నారు. కానీ వీరిలో ఇప్పటికీ టర్మ్ పాలసీలపై తగినంత అవగాహన లేదని, సమాచార వినిమయం విషయంలో ఫండమెంటల్‌గా వారిలో మార్పు వస్తే తప్ప సంప్రదాయ, యులిప్ పాలసీలను కొనుగోలు చేసే తప్పిదాలను కొనసాగిస్తూనే ఉంటారని నితిన్ అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ ‘జనరేషన్ వై’గా పిలిచే మిలీనియన్స్కు టెక్నాలజీపై చక్కని అవగాహన ఉంది. స్మార్ట్ఫోన్లను వినియోగిస్తూ వీరు అన్ని రకాల లావాదేవీలను ఆన్లైన్లోనే కానిచ్చేస్తున్నారు. జనరేషన్ ఎక్స్ మాత్రం అంతగా టెక్నాలజీ తెలిసిన వారు కాదు. ఉద్యోగాలు మారటం ఎక్కువే... గత దశాబ్దకాలంలో ఉద్యోగాల స్వరూపంలో ఎంతో మార్పు వచ్చింది. మిలీనియల్స్ ఉద్యోగాల విషయంలో కొత్త ధోరణులకు అలవాటు పడేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఇంటర్నెట్ ఉద్యోగాలు అధికం కావడంతో వాటికి నిర్ణీత పని ప్రదేశం, పనిగంటలతో సంబంధం లేకుండా పోయిందని నితిన్ వ్యాకరణం పేర్కొన్నారు. దీంతో పని పరిస్థితులను బట్టి 30 ఏళ్లకే రెండు మూడు ఉగ్యోగాలు మారిపోతున్నారు. కానీ, వారి తల్లిదండ్రులైతే తమ జీవిత కాలం మొత్తంలోనే రెండు మూడు ఉద్యోగాలు పరిమితం కావడం గమనార్హం. మారుతున్న ధోరణులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని వ్యాకరణం సూచించారు. ఎవరీ మిలీనియల్స్? వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్ జనరేషన్. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో... అంటే 1946–1964 మధ్య జననాల రేటు బాగా ఎక్కువగా ఉండడంతో అప్పుడు పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్’ జనరేషన్గా పిలుస్తున్నారు. ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్ ఎక్స్. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్ వై. అంటే మిలీనియల్స్. ఆర్జనపరులైన వీరి సంఖ్య దేశంలో 44 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఆ తరవాత పుట్టిన ‘జనరేషన్ జెడ్’ ఇపుడిపుడే ఉద్యోగాల్లోకి... సంపాదనలోకి వస్తున్నారు. -
ఎక్కువ వడ్డీ... ఎక్కువ భద్రత!
దేశంలో అత్యధిక జనాభాది అయితే స్వయం ఉపాధి... లేకుంటే ప్రయివేటు ఉద్యోగమే. అందుకే ఇక్కడ వృద్ధాప్యంలో సామాజిక భద్రతనేది చాలా పెద్ద సమస్య. అప్పటిదాకా కొంత సొమ్ము దాచుకున్నా... దానిపై నెలనెలా ఎంతో కొంత సొమ్ము చేతికి వస్తుండాలి. అది కూడా స్థిరంగా ఉండి... ఎలాంటి ఆందోళనకూ తావివ్వని రీతిలో ఉండాలి. రిస్క్ తీసుకోలేరు కనక... ఒకవైపు పెట్టుబడికి భద్రత, మరోవంక మెరుగైన రాబడి అవసరం. అందుకనే ఇపుడు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను (ఎస్సీఎస్ఎస్) మంచి ఆప్షన్‌గా సూచిస్తున్నారు నిపుణులు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం.. సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మూడు నెలలకోసారి వడ్డీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రభుత్వం 2004లో ప్రవేశపెట్టింది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ ఆదాయాన్ని అందించడం ద్వారా సీనియర్ సిటిజన్ల అవసరాలకు నిధులివ్వటమే ఈ పథకం వెనక అసలు ఉద్దేశం. వడ్డీ తీసుకోకుండా వదిలేస్తే దానిపై మరింత రాబడి పొందే అవకాశం దీన్లో లేదు. మూడు నెలలకోసారి వడ్డీ తీసుకోవాల్సిందే. త్రైమాసికానికి ఎంత చెల్లిస్తారనేది డిపాజిట్ మొత్తం, వడ్డీ రేటు ఆధారంగా ప్రారంభంలోనే ఖరారు చేస్తారు. ప్రారంభించటం ఎలా..? రిటైర్మెంట్ సమయంలో వచ్చిన నిధుల్ని ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే గరిష్టంగా రూ.15 లక్షల వరకే డిపాజిట్ చేసే అవకాశముంది. ఏ పోస్టాఫీసుకు వెళ్లినా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. లేదా ప్రభుత్వరంగ బ్యాంకులైన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, బ్యాంకు ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లో ఎంపిక చేసిన శాఖల్లోనూ ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరుచుకోవచ్చు. ప్రయివేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకూ దీన్ని ఆఫర్ చేస్తోంది.దీనికోసం ముందుగా సేవింగ్స్ ఖాతాను తెరవాలి. తర్వాత దరఖాస్తు పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, గుర్తింపు ధ్రువీకరణ పత్రం (ఒరిజినల్), చిరునామా ధ్రువీకరణకు ఆధార్, పాస్ పోర్ట్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వీటిలో ఏదో ఒకటి తీసుకెళ్లాలి. పాన్‌కార్డు లేనివారు చట్టంలోని నిబంధనల మేరకు ఫామ్ 60 లేదా 61ను డిక్లరేషన్‌గా ఇవ్వాలి. ఎవరైనా ప్రారంభించొచ్చా? 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లు అందరూ ఈ పథకంలో చేరటానికి అర్హులే. ఉద్యోగం నుంచి ముందే రిటైర్ అయిన వారు 55 ఏళ్లకే ఇందులో చేరొచ్చు. రక్షణ రంగంలో పనిచేసి ఎక్స్ సర్వీస్ హోదా కలిగిన వారు 50 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టుకునేందుకు అవకాశం ఉంది. పన్ను ప్రయోజనాలివీ... ఆదాయపన్ను చట్టం (ఐటీ) లోని సెక్షన్ 80సీ కింద ఎస్సీఎస్ఎస్లో చేసే డిపాజిట్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీకి ఆదాయపన్ను వర్తిస్తుంది. కాగా ఈ వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు దాటితేనే పన్ను. రూ.50,000 దాటినా టీడీఎస్ మినహాయించకూడదంటే ఫామ్ 15హెచ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎస్సీఎస్ఎస్ – ఫిక్స్డ్ డిపాజిట్ ♦ సాధారణ ఐదేళ్ల టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటుతో పోలిస్తే ఎస్సీఎస్ఎస్లో వడ్డీ రేటు సుమారు ఒక శాతం ఎక్కువ. ఉదాహరణకు ఎస్బీఐ 3–5 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఎస్సీఎస్ఎస్ పథకంలోని 8. 3 శాతం వడ్డీ రేటుతో పోల్చి చూస్తే 1.3%తక్కువ. ♦ రెగ్యులర్ టర్మ్ డిపాజిట్లో లాకిన్ పీరియడ్ ఉండకపోవటం మంచిదే. పైగా వీటిపై వడ్డీని మెచ్యూరిటీ సమయంలో తీసుకునేందుకు క్యుములేటివ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎస్సీఎస్ఎస్లో ఇది లేదు. రెగ్యులర్‌గా ఆదాయం అవసరం లేదనుకునే వారికి, వడ్డీ కాస్త తక్కువైనా ఫర్వాలేదనుకునే వారికి టర్మ్ డిపాజిట్లే మార్గం. కానీ, సీనియర్ సిటిజన్లకు ఎప్పటికప్పుడు ఆదాయాన్నిచ్చే పథకాల అవసరమే ఎక్కువ. అందుకుని వారికి ఎస్సీఎస్ఎస్ పథకం అనువుగా ఉంటుంది. వడ్డీ రేటు ఎంతంటే... కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి మూడు నెలలకోసారి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను నోటిఫై చేస్తుంది. 2018–19 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్–జూన్) ఈ పథకంలో వడ్డీ రేటు 8.3 శాతంగా ఉంది. ప్రతీ త్రైమాసికానికి ఓ సారి వడ్డీ చెల్లిస్తారు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. పెట్టుబడి పెట్టే సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటే ఐదేళ్ల వరకు వర్తిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్. అంటే ఐదేళ్లలోపు అవసరం ఏర్పడినా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోలేరు. తర్వాత పెట్టుబడులను కొనసాగించాలని భావిస్తే మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. పొడిగించుకోకపోతే, ఐదేళ్లు కూడా ముగిసిపోతే ఆ డిపాజిట్ కాల వ్యవధి తీరిపోయినట్టే. ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. ఐదేళ్ల డిపాజిట్ గడువు ముగిసిన వెంటనే విత్ డ్రా చేసుకోకుండా కొన్ని రోజుల తర్వాత తీసుకున్నారనుకోండి. అప్పుడు ఆ కాల వ్యవధిపై అమల్లో ఉన్న వడ్డీ రేటును చెల్లిస్తారు. ఏడాది తర్వాత ముందస్తు ఉపసంహరణను 1.5 శాతం పెనాల్టీపై అనుమతిస్తారు. రెండేళ్ల తర్వాత అయితే 1 శాతం నష్టపోవాలి. -
'ఫండ్లు' అమ్మితే జాగ్రత్త సుమా!
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల తాజా పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మార్కెట్లు గరిష్ఠ స్థాయిలకు చేరుతుండటంతో ఈ పెట్టుబడుల ప్రవాహం ఆగటం లేదు. ఫండ్స్ నిర్వహణలో ఉన్న పెట్టుబడుల విలువ ఏకంగా రూ.20 లక్షల కోట్లను దాటేసింది. మరి ఈ సమయంలో ఫండ్స్‌లో ఉన్న మీ పెట్టుబడులను వెనక్కి తీసుకుని రిస్క్ తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? లేదంటే ఏదైనా నిర్ణీత లక్ష్యం కోసం పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారా? మరి రిడెంప్షన్ ఆన్లైన్లో చేస్తారా? ఆఫ్‌లైన్‌లోనా!!. ఈ మొత్తం చేతికి ఎలా అందుతుంది? ఆన్లైన్లోనే సులభంగా రిడెంప్షన్ చేసుకోవటం ఎలా? అందుకు ఉన్న అవకాశాలేంటి? ఈ వివరాలే మన ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... ప్రణాళికే ప్రాతిపదిక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే (రిడెంప్షన్) ముందు మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరాయి కనుక, రిస్క్ తగ్గించుకోవాలి కనక ఆ పనిచేస్తున్నారా? లేక ఏదైనా అత్యవసరం పడి అందుకోసం ఫండ్స్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారా? అన్న స్పష్టత కావాలి. వాస్తవానికి మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరాయన్న ఆలోచనతో పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం సరికాదన్నది నిపుణుల మాట. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నిర్ణయించిన ప్రణాళిక మేరకే అది జరగాలన్నది వారి సూచన. మార్కెట్లు పెరిగాయని విక్రయిస్తే భవిష్యత్తులో అవి ఇంకా పెరిగిన పక్షంలో అనవసరంగా తప్పు చేశామేమో అని భావించొచ్చు. అందుకే ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే దీన్ని కొనసాగించాలి. ఆఫ్‌లైన్/ ఆన్లైన్ తేడాలివీ... మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రిడీమ్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ స్టేట్మెంట్లో కొన్ని వివరాలను పరిశీలించడం అవసరం. ఫండ్ పథకం పేరు, ఫోలియో నంబర్, ఎన్ని యూనిట్లు ఉన్నాయనేది చూడటం ముఖ్యం. అప్పుడు యూనిట్ల మార్కెట్ విలువ ఎంతో తెలుస్తుంది. దాంతో ఎంత మేర పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లో ఉపసంహరించుకోవచ్చు. అలా చేయాలంటే అందుకు ఆన్లైన్లోనే కొనుగోలు చేసి ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. ఏజెంట్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొనుగోలు చేసినా గానీ ఫండ్ వెబ్సైట్ లేదా రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్లైన్లో రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫండ్లలో పెట్టుబడులుంటే... ఒకటికి మించిన మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పథకాల్లో పెట్టుబడులు ఉండి, వాటిని ఏక కాలంలో వెనక్కి తీసుకోవాలనుకుంటే ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏ) అయిన క్యామ్స్, కార్వీ కంప్యూటర్ షేర్ కార్యాలయాలకు వెళ్లడం వల్ల ఒకేసారి రిడీమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక రిజిస్ట్రార్ అన్ని ఫండ్ సంస్థలకూ సేవల ఏజెంట్‌గా లేరు. కనుక ముందుగానే ఆర్టీఏ ఎవరన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో అయితే ఏ ప్లాట్‌ఫామ్ నుంచి కొనుగోలు చేశారో, సులభంగా అదే వేదికగా విక్రయించుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పటికీ సదరు సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్ ఖాతాను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా రిడెంప్షన్ చేసుకునే సౌకర్యం ఉంది. పాన్ నంబర్, ఫోలియో నంబర్, ఈ మెయిల్ వివరాలు ఇవ్వడం ద్వారా ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాగిన్ అయ్యి, ఏ పథకంలో పెట్టుబడులున్నాయో దాన్ని సెలక్ట్ చేసుకుని రిడీమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎన్ని యూనిట్లు విక్రయించాలనుకుంటున్నదీ అప్పుడే తెలియజేయాలి. యాప్ ద్వారా రిడెంప్షన్‌కు గాను ఆర్టీఏలు మైక్యామ్స్, కేట్రాక్ను అందుబాటులోకి తెచ్చాయి. ఇన్స్టంట్ రిడెంప్షన్... తక్షణ ఉపసంహరణ సదుపాయం లిక్విడ్ ఫండ్స్‌కు వర్తిస్తుంది. ఎందుకంటే లిక్విడ్ ఫండ్ అన్నది బ్యాంకు ఖాతా మాదిరిగా పనిచేయాలన్నది ఉద్దేశం. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొన్ని పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇన్స్టంట్ రిడెంప్షన్ సదుపాయాన్ని కల్పించాయి. ఉదాహరణకు రిలయన్స్ మనీ మేనేజర్ ఫండ్, డీఎస్పీ బ్లాక్ రాక్ మనీ మేనేజర్ ఫండ్ పథకాలు. ఈ పథకాలకు బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకుంటే చాలు... బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్‌ను లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవచ్చు. రిలయన్స్ మనీ మేనేజర్ ఫండ్‌లో అయితే రిడెంప్షన్ చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే డబ్బులు తిరిగి ఖాతాలోకి వచ్చి చేరతాయి. అర్ధరాత్రి అయినా సరే జాప్యం ఉండదు. మొత్తం పెట్టుబడుల్లో 95 శాతం, గరిష్టంగా రూ.2 లక్షల వరకే ఈ విధంగా రెడీమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎన్ని రోజుల్లో నగదు వస్తుంది? లిక్విడ్ లేదా డెట్ ఫండ్స్ యూనిట్లు రిడీమ్ చేసుకుంటే ఒకటి, రెండు రోజుల్లోనే నగదు బ్యాంకు ఖాతాకు చేరుతుంది. ఇందుకు గాను ఇన్వెస్టర్ తన బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు లేకపోతే చెక్ ఇంటికొస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే మూడు నుంచి నాలుగు రోజులు తీసుకుంటుంది. అయితే, మొబైల్ నంబర్, ఈ మెయిల్ తదితర వివరాలు తాజావే ఉన్నాయా అన్నది చూసుకోవాలి. ఎందుకంటే రిడెంప్షన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మొబైల్, ఈమెయిల్‌కు వస్తుంది. ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మూలధన లాభాల పన్ను ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ పథకాలైతే ఏడాది దాటిన వాటిపై పన్ను లేదు. కానీ, ఆ ఆదాయాన్ని వార్షిక ఆదాయంలో కలిపి పన్ను పరిధిలో ఉంటే చెల్లించాల్సి ఉంటుంది. పని దినాల్లోనే రిడెంప్షన్... మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ పథకాల యూనిట్లను మార్కెట్ల సెలవు దినాల్లో కాకుండా పని దినాల్లో ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) యూనిట్లకు మాత్రం మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకు మీరు 10,000 ఏక మొత్తంలో పెట్టుబడి పెడితే ఆ తేదీ నుంచి సరిగ్గా మూడేళ్ల తర్వాత వెనక్కి తీసేసుకోవచ్చు. అదే సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కు మూడేళ్లు పూర్తి కావాలి. సాధారణ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులైతే ఇలాంటి లాకిన్ పీరియడ్ ఏదీ ఉండదు. ఫండ్స్‌లో పెట్టుబడులు యూనిట్ల రూపంలో ఉంటాయి. మీ ఖాతాలో ఉన్న యూనిట్లను ఒక్కో యూనిట్ మార్కె ట్ విలువ (ఎన్ఏవీ)తో లెక్కిస్తే మొత్తం విలువ ఎంతన్నది తెలుస్తుంది. దీన్ని బట్టి మీకు ఎంత అవసరమో ఆ మేరకే యూనిట్లను విక్రయించుకోవచ్చు. కటాఫ్ సమయం తెలుసా? కటాఫ్ సమయం గురించి కూడా తెలుసుకోవాలి. ఏ సమయంలో దరఖాస్తు చేశారన్నది ఇందుకు కీలకం. ఇందుకు సంబంధించి ఈక్విటీ, డెట్, లిక్విడ్ ఫండ్స్‌కు నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలను చాలా సంస్థలు కటాఫ్‌గా పేర్కొంటున్నాయి. అంటే ఆ సమయంలోపు దరఖాస్తు చేస్తే ఆ రోజు ఎన్ఏవీ వర్తిస్తుంది. ఆఫ్‌లైన్‌లో అయితే ట్రాన్సాక్షన్ ఫామ్‌ను ఫండ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని దేశవ్యాప్తంగా సదరు సంస్థకున్న సేవా కేంద్రాల్లో ఎక్కడైనా సమర్పించొచ్చు. స్టాక్స్ మాదిరిగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లు ముగిసిన తర్వాత ఒకేసారి జరుగుతుంది. గడువు తీరితే ఎగ్జిట్ లోడ్ ఉండదు... ప్రతి మ్యూచువల్ ఫండ్ పథకంలోనూ పెట్టుబడులకు నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది. ఆ లోపు విక్రయిస్తే ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. దాన్ని యూనిట్ల ఎన్ఏవీలో మినహాయించి కోత వేస్తారు. సాధారణంగా ఈక్విటీ పథకాలకు ఎగ్జిట్ లోడ్ ఏడాది కాలం ఉంటుంది. ఎందుకంటే లిక్విడ్, డెట్ పథకాలతో పోల్చి చూస్తే ఈక్విటీ పథకాలన్నవి దీర్ఘకాలానికి ఉద్దేశించినవి. కారణం ఈక్విటీ మార్కెట్లలో ఊగిసలాట ఎక్కువ. అందుకే పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసేసుకుండా నిరుత్సాహపరిచేందుకు గాను ఎగ్జిట్ లోడ్‌ను నిర్ణయించారు. ఏడాదిలోపు విక్రయంపై ఇది ఒక శాతంగా ఉంది. లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌పై ఎగ్జిట్ లోడ్ లేదు. ఈక్విటీ పథకాలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను కూడా వర్తిస్తుంది. సిప్ రూపంలో చేసే పెట్టుబడులయితే, ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కు నిర్ణీత కాలం ఎగ్జిట్ లోడ్ అమలవుతుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 1న రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే మరుసటి ఏడాది అదే తేదీన రిడీమ్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉండదు. అందుకే సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టిన వారు కొంతమేరే యూనిట్లను విక్రయించదలిస్తే ముందు కొన్న వాటిని రిడీమ్ చేసుకోవాలి. -
ఇలాగైతే పెట్టు‘బడి’లో ఫస్ట్‌క్లాస్!
⇒ లక్ష్యంలో స్పష్టత.. పెట్టుబడుల్లో వైవిధ్యత ⇒ క్రమానుగతంగా పనితీరు మదింపు ⇒ పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు ⇒ ఆర్జన ప్రారంభమైనప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ ⇒ అవసరం మేరకు నిపుణుల సేవలు ఇన్వెస్ట్మెంట్ అంటే...? పెట్టుబడులు పెట్టడమేగా అని చాలా మంది అనుకోవచ్చు. ఇటుక, ఇసుక, సిమెంటు ఉంటే ఇల్లు రెడీ అయిపోతుందా...? దానికి కొలతలు, కార్మికులు, నిపుణులు, ఇంజనీర్లు ఇలా ఎంతో మంది నిపుణులు... ఎన్నో రకాల మెటీరియల్ కలిస్తే కానీ అందమైన ఇల్లు నిర్మాణం సాధ్యం కాదు. ఇన్వెస్ట్మెంట్ సంపదగా మారాలంటే ఇలానే ఎన్నో అంశాలుంటాయి. ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, సమయానుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకుంటూ, సరైన దిశలో పెట్టుబడులను కొనసాగించడం ద్వారానే జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఇన్వెస్ట్మెంట్ నిపుణులు చెబుతున్న ఆ కిటుకులే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. లక్ష్యం కావాలి దేనికైనా లక్ష్యం అన్నది ఒకటుండాలి. అందులో ఇన్వెస్ట్‌మెంట్‌కు తప్పనిసరి. లక్ష్యం లేకుంటే ఎంత కాలం మదుపు చేయాలి, ఎంత మొత్తం చేయాలన్న స్పష్టత ఉండదు. లక్ష్యం భవిష్యత్తు అవసరాలే అయితే ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా అధిక రాబడులను అందుకోవచ్చు. అదే స్వల్ప కాల అవసరాలు అయితే స్థిరమైన రాబడులను ఇచ్చే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా మదుపు కొనసాగనప్పుడు అవసరాలకు తగిన నిధి సమకూరడం కష్టతరమవుతుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. ముందు నుంచే... పెట్టుబడులు అన్నవి ఆర్జనతోపాటే ప్రారంభం కావాలి. ఎంత ముందుగా మొదలైతే అవసరాలకు కావాల్సిన నిధిని అంత సులభంగా సమకూర్చుకోవచ్చు. అదే సమయంలో ఆర్థిక ప్రణాళికల విషయంలో పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇన్వెస్ట్మెంట్ విజయవంతం అవుతుంది. పెట్టుబడులు అవసరాలను తీర్చేలా ఉండాలి. అవసరమైనప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకునే వెసులుబాటూ ఉండాలి. అధిక రిస్క్ పనికిరాదు. వేచి ఉండడం సరికాదు... పెట్టుబడి పెట్టేందుకు సమయం కోసం వేచి చూడకూడదు. క్రమానుగతంగా పెట్టుబడి పెడుతూ వెళ్లడమే ఇన్వెస్టర్‌గా చేయాల్సింది. మార్కెట్ దిగువ స్థాయికి వచ్చినప్పుడే పెట్టుబడి పెట్టాలని కాచుక్కూర్చుంటే... అది ఎప్పుడు వస్తుంది...? ఏ స్థాయిలో స్థిరపడుతుందన్నది? గుర్తించలేకపోవచ్చు. గుర్తించేలోపే తిరిగి ధరలు పెరిగిపోవచ్చు. అదే సమయంలో గరిష్ట స్థాయిలోనే విక్రయించాలనుకోవడం కూడా అవగాహన రాహిత్యమే అవుతుంది. ఎందుకంటే ఇది గరిష్ట స్థాయి అని గుర్తించడం అన్ని వేళలా సాధ్యం కాదు? అందుకే క్రమానుగతంగా విక్రయించడం మొదలు పెట్టాలి. దీర్ఘకాల పనితీరు ఆధారంగా... చక్కని పనితీరున్న వాటిల్లోనే పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన సరైనదే. కానీ, ఇందుకు గతేడాది కాలంలో అత్యుత్తమ పనితీరు చూపిన వాటిని ఎంచుకోకుండా ఐదేళ్లు, పదేళ్లు ఇలా దీర్ఘకాల పనితీరును పెట్టుబడులకు ప్రాథమిక సూత్రంగా తీసుకోవాలి. అప్పుడే నమ్మకమైన రాబడులకు అవకాశం ఉంటుంది. ఒక్క అంశానికే పరిమితం కారాదు పెట్టుబడికి షేర్ లేదా మ్యూచువల్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఎంపిక ఏదైనా కానీయండి. కేవలం ఏదో ఒక అంశానికి పరిమితమై ఫలానా దానిలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవడం తప్పటడుగే అవుతుంది. ఉదాహరణకు అధిక వడ్డీ రేటు వస్తుందని కంపెనీ డిబెంచర్ కొనుగోలు చేశారనుకుందాం. కానీ, అవసరమైనప్పడు నగదుగా మార్చుకునే సౌలభ్యత తక్కువగా ఉంటుంది. పైగా డిబెంచర్ చెల్లింపుల్లో కంపెనీలు విఫలమయ్యే పరిస్థితీ రావచ్చు. రాబడి హెచ్చుగా ఉంటుందని షేర్లో మదుపు చేశారనుకుందాం. దాని పనితీరు మార్కెట్ ఆటుపోట్లు, కంపెనీ యాజమాన్యం నిర్వహణ ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే కాల వ్యవధి, ఆశిస్తున్న రాబడి, రిస్క్ సామర్థ్యం ఇలా ఎన్నో అంశాలనూ పరిశీలించిన తర్వాతే తగిన సాధనాలను ఎంచుకోవాలి. డైవర్సిఫికేషన్ అవసరమే కానీ... పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకటే అస్సెట్ క్లాస్‌లో పెట్టరాదు. చాలా మందికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం అలవాటు. ఇందులో 6–7 శాతం మించి రాబడులు రావు. పెట్టుబడంతా తీసుకెళ్లి డెట్ మార్కెట్లో పెడితే, ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లలో ఉన్న అవకాశాల ప్రయోజనాలను అందుకోలేరు. అందుకే పెట్టుబడుల్లో వైవిధ్యం (డైవర్సిఫికేషన్) అవసరం. అది కూడా అవసరమైనంతే. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, ఇలా లెక్కకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయనుకోండి. అప్పుడు డైవర్సిఫికేషన్ ఎక్కువైనట్టే. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో కొంత పెట్టుబడులు పెట్టి, అదే సమయంలో బ్లూచిప్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోనూ పెట్టుబడి పెడితే అది డూప్లికేషన్ అవుతుంది. ఇలా లేకుండా చూసుకోవాలి. పెట్టుబడులకు వైవిధ్యం అవసరం కదా అని ఎక్కువ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే... వాటి పనితీ రును ట్రాక్ చేయడం కష్టతరమవుతుంది. ఇక పెట్టుబడుల్లో భిన్నత్వం అన్నది ప్రతీ విభాగంలోనూ ఉండాలి. ఉదాహరణకు ఈక్విటీల్లో పెట్టుబడులన్నవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఇలా అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ తరహా డైవర్సిఫైడ్ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. సమీక్ష... మార్పులు లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడమే కాదు... వాటిని మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. మీ పెట్టుబడులపై తగిన ప్రతిఫలం వస్తోందా..? అన్నది పరిశీలించుకోవాలి. అవసరమైతే తగిన మార్పులు, చేర్పులు చేసుకోవడం, వైదొలగడం వంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే లక్ష్యాలు రిస్క్‌లో పడతాయి. ఉదాహరణకు ఈక్విటీ, డెట్, కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. కొంతకాలానికి అధిక రాబడుల కారణంగా మీ మొత్తం ఆస్తుల విలువ ఈక్విటీల్లోనే అధిక స్థాయికి చేరిందనుకోండి. అప్పుడు రిస్క్ స్థాయి ఎక్కువైనట్టే. అప్పుడు కొంత ఈక్విటీ నుంచి డెట్ సాధనాలకు మళ్లించడం ద్వారా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో రిస్క్ తగ్గించుకోవడమే కాకుండా రాబడుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలుంటుంది. అదే సమయంలో రాబడుల విషయంలో పేలవ పనితీరుతో ఉన్న వాటిని వదిలించుకునేందుకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మీకు కష్టం అనుకుంటే ఆర్థిక సలహాదారుల సేవలు పొందాలి. నిర్లక్ష్యం తగదు పెట్టుబడుల విషయంలో శ్రద్ధ లేకపోవడం చాలా మందిలో కనిపించే అంశం. కొంత మంది తమ పొదుపు నిధులను నిర్లక్ష్యంగా తక్కువ రాబడులిచ్చే సేవింగ్స్ ఖాతాల్లోనే ఉంచేస్తుంటారు. మీ దగ్గర ఒక నెల అవసరాలకే నగదు రూపంలో ఉండాలి. పెట్టుబడులను ఎప్పుడూ వాయిదా వేయరాదు. దీనివల్ల పొదుపు సంపదగా మారడం కలే అవుతుంది. కష్టార్జితం అవసరాలను తీర్చలేని పరిస్థితి ఏర్పడవచ్చు. సరైన పెట్టుబడి సాధనాల గురించి తెలుసుకుని ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ద్వారా పొదుపు నిధులను పెట్టుబడులకు మళ్లించే ఏర్పాటు చేసుకోవాలి. అవసరానికి తీసుకున్నా... దీర్ఘకాల అవసరాల కోసం కొనసాగుతున్న పెట్టుబడులు మధ్య మధ్యలో అనూహ్యంగా ఎదురయ్యే అవసరాలకు బలి కాకుండా చూసుకోవాలి. అనుకోకుండా వచ్చే అవసరాలను అధిగమించేందుకు కొందరు ప్రావిడెంట్ ఫండ్ నుంచి రుణం తీసుకోవడం, బీమా పాలసీపై రుణం పొందడం చేస్తుంటారు. అత్యవసరమైతే ఇలా తీసుకోవడం కొంత వరకు సరైనదే. కానీ, ఇలా తీసుకున్న వాటిని వీలైనంత వెంటనే తిరిగి చెల్లించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అసలు ఆ పెట్టుబడి ఏ ఉద్దేశంతో అయితే మొదలు పెట్టామో అది దెబ్బతింటుంది. కొంతమంది తమ పెట్టుబడే కదా, నిదానంగా తీర్చేయవచ్చులే అనుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ పెట్టుబడిపై వచ్చే రాబడి తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీ రూపంలో ఆవిరైపోతుంది. అందుకే స్వల్పకాలిక అవసరాలకు కూడా కొంత నిధిని ప్లాన్ చేసుకోవడం అవసరం. ఇక భావోద్వేగాలు పెట్టుబడులను శాసించకుండా జాగ్రత్తపడాలి. పెట్టుబడుల మళ్లింపు లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడంతోపాటు చివర్లో ముందు నుంచే వాటిని ఉపసంహరించుకోవాలి. ఉదాహరణకు పిల్లల వివాహం కోసం పెట్టుబడి పెడుతున్నారనుకుందాం. వివాహం నిశ్చయమైన తర్వాత వాటిని ఉపసంహరించుకుంటామంటే ఆ సమయంలో స్టాక్ మార్కెట్లు క్షీణతలో ఉండొచ్చు. దీనివల్ల రాబడుల ప్రతిఫలాన్ని కొంత నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఓ ఏడాది ముందు నుంచే నెలనెలా కొంత చొప్పున ఉపసంహరించుకుంటూ షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్‌కు మళ్లించాలి. దానివల్ల చివరి నిమిషంలో ఆటుపోట్ల ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. -
బుట్టలో పడతారు... జాగ్రత్త..!
ఇపుడు నడుస్తున్నది అతి తెలివైన వాళ్ల ప్రపంచం. ఎదుటి వాళ్లను బురిడీ కొట్టించడానికి కొత్తకొత్త ఎత్తులతో ముందుకొస్తున్న వాళ్ల ప్రపంచం. అమాయకంగా ఉంటే బుక్కయిపోవటం ఖాయం. అయితే... ‘నేను చాలా ఇంటలిజెంట్. ఎవరి ఆటలూ నా దగ్గర సాగవు’ అన్న అతి ధీమా కూడా పనికిరాదు. తెలివిగా ఉండటంతో పాటు... ప్రతిక్షణం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం అవసరం. లేకుంటే మనకు తెలియకుండానే మోసగాళ్లు మనల్ని బుక్ చేసేస్తారు. నేరంలో పాత్రధారులను చేస్తారు. మన పేరిట నిధులు కొల్లగొడతారు. ఇలా మోసపోయిన పలువురి వ్యవహారాలు అధ్యయనం చేసిన అనంతరం వాటిని ‘సాక్షి’కి వెల్లడించారు కోటక్ ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న గణేష్ అయ్యర్. ఇతరులు మోసపోకూడదన్న ఉద్దేశంతో ఆ కేస్ స్టడీల వివరాలు చెబుతూ... తగిన జాగ్రత్తలు కూడా సూచించారాయన. అదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... కేవైసీ పత్రాలతో అజాగ్రత్త పనికిరాదు.. ≈ ఎవరికిస్తున్నామో వాటిపై రాయటం అవసరం ≈ ఎందుకిస్తున్నామో కూడా రాసి సంతకం చేయాలి ≈ అజాగ్రత్తగా వ్యవహరిస్తే నేరాల్లో ఇరుక్కోవచ్చు ≈ ‘సాక్షి’తో కోటక్ లైఫ్ అధికారి గణేష్ అయ్యర్ నేరం చేయకపోయినా ఇరుక్కున్నాడు.. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం రాజేష్ దరఖాస్తు చేసుకున్నాడు. నో యువర్ కస్టమర్ (కేవైసీ) పత్రాలుగా తన డ్రైవింగ్ లెసైన్స్, పాన్ కార్డు కాపీలను రిప్రజెంటేటివ్‌కు అందించాడు. అలాగే కొన్ని పాస్‌పోర్టు సైజు ఫొటోలను కూడా ఇచ్చాడు. సాధారణంగా ఎక్కువ మంది ఇదే విధంగా చేస్తుం టారు. కానీ, అవగాహనలేమి కారణంగా రాజీవ్ ఇక్కడే అడ్డంగా దొరికిపోయాడు. ఆ నక్కజిత్తుల రిప్రజెంటేటివ్ ఏం చేశాడంటే... ఒక ఫొటో కాపీని కంపెనీకి పంపించి మిగిఫొటో కాపీల ఆధారంగా ఓ సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ సిమ్ కార్డును సంఘ వ్యతిరేక చర్యలకు వినియోగించాడు. దర్యాప్తులో భాగంగా ఆ విషయాలను గుర్తించిన పోలీసులు... ఓ రోజు ఉన్నట్టుండి రాజీవ్‌ను అరెస్ట్ చేశారు. సొమ్మొకడిది.. సోకొకడిది మహమ్మద్ ఖాన్ వీసా కోసం ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్ బిల్లు, పాన్ కార్డు కాపీలను ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఖాన్‌కు డబ్బులతో పని పడింది. రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, రుణం ఇవ్వలేమంటూ దరఖాస్తును బ్యాంకు తిరస్కరించింది. ఎందుకని ప్రశ్నిస్తే... ‘తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విఫలమయ్యారు’ అని బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది. అసలు తాను రూపాయి కూడా రుణమే తీసుకోనప్పుడు చెల్లించలేదన్న సమస్య ఎందుకొస్తుందని ప్రశ్నించాడు ఖాన్. అదంతా తమకు తెలియదని, సిబిల్ రికార్డుల్లో అలాగే ఉందని బ్యాంకు చెప్పటంతో నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే... వీసా కోసం ఇచ్చిన కాపీలు దుర్వినియోగమయ్యాయి. ఖాన్ పేరుతో వేరొకరు క్రెడిట్ కార్డు తీసుకుని లిమిట్ మేరకు అంతా డ్రా చేసుకున్నారు. ఆ భారం ఇప్పుడు ఖాన్‌పై పడింది. ఊహకైనా అందుతుందా..? రణవీర్‌సింగ్ ఓ రోజు డీమ్యాట్ ఖాతా తెరవటానికని ఏజెంటుకు పాన్ కార్డు, విద్యుత్ బిల్లుల కాపీలను ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత రణవీర్‌సింగ్ ఇంటికి ఓ బ్యాంకు నుంచి కలెక్షన్ ఏజెంట్లు వచ్చారు. ‘రుణం తీరుస్తావా, లేదా?’ అంటూ ప్రశ్నించేసరికి అతడు తెల్లబోయాడు. ‘ఎవరని పొరబడుతున్నారు...? నా పేరు రణవీర్‌సింగ్’ అని చెప్పాడు. అవును... రణవీర్‌సింగ్ దగ్గరకే వచ్చాము. ఓ రుణాన్ని మరొకరితో కలసి (కో బారోవర్) తీసుకున్నారుగా? అంటూ ఏజెంట్లు చెప్పడంతో అతడిలో కంగారు మొదలైంది. వారి దగ్గరున్న పత్రాలను చూసి బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకున్నాడు. నిజానికి అతడు ఎలాంటి రుణం తీసుకోలేదు. ఏజెంటుకు ఇచ్చిన పత్రాలను మోసగాళ్లు వాడేసుకున్నారు. రణవీర్‌సింగ్‌ను సహ దరఖాస్తుదారుడిగా పేర్కొంటూ బ్యాంకు నుంచి రుణం కాజేశారు. ట్రావెల్ టికెట్ కొంటే... ఐటీ నోటీసొచ్చింది! గౌరవ్‌షా ఓ రోజు ట్రావెల్ టికెట్ కోసం పాన్ కార్డు కాపీనిచ్చాడు. అందులో షా పాన్ నంబరుతో పాటు అతని పూర్తి వివరాలున్నాయి. అదే మోసగాళ్లకు వరమైంది. ఓ ఏడాదిన్నర తర్వాత ఆదాయపన్ను (ఐటీ) శాఖ నుంచి అతడికి నోటీసు వచ్చింది. ‘మీ ఆదాయం, ఆస్తుల వివరాలను పూర్తిగా అందజేయండి’ అన్నది అందులోని సారాంశం. ఎందుకయ్యా...? అంటే గౌరవ్‌షా పాన్ కార్డు కాపీని ఉపయోగించి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వేరొకరు నగదు రూపంలో కొనుగోలు చేశారు. పన్ను ఎగ్గొట్టేందుకు గౌరవ్ పాన్ కార్డు కాపీని వాడుకున్నారు. ‘నేను కాదు బాబోయ్’ అని గౌరవ్ మొరపెట్టుకున్నా... నగదు రూపంలో జరిగిన కొనుగోళ్లలో అసలు వ్యక్తిని కనిపెట్టడం కష్టమని తేల్చేశారు. చివరకు గౌరవ్ బాధితుడిగా మిగిలిపోయాడు. ఇలా కూడా జరుగుతుందా! రవి ఓ చిన్న కూరగాయల విక్రేత. కొన్నాళ్ల కిందట అతడు ఏదో పని నిమిత్తం రిప్రజెంటేటివ్‌కు ఆధార్ కార్డు కాపీని అందజేశాడు. దురదృష్టవశాత్తూ 11 నెలల తర్వాత ఓ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో వెల్లడైన విషయాలతో పోలీసులే నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. రవి షిండే ఇచ్చిన ఆధార్ కాపీతో అతడి పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రూ.10 లక్షల జీవిత బీమా పాలసీ చొప్పున మొత్తం 14 కంపెనీల నుంచి రూ.1.40 కోట్ల మేర బీమా కవరేజీ తీసుకున్నారు. నామినీగా రవి భార్యను పేర్కొని ఆమె ఓటర్ ఐడీని ఫోర్జరీ చేసి వాడుకున్నారు. రూ.1.40 కోట్ల బీమాను కొట్టేయడానికి పథకం ప్రకారం రవిని ట్రక్‌తో ఢీకొట్టి చంపేశారు. తెలియకుండానే బాధితులయ్యారు..! పైన చెప్పిన వాళ్లెవరికీ తాము ఒక నేరంలో భాగస్వాములమవుతున్నామని తెలీదు. అంతా అవసరం కోసం ధ్రువపత్రాలను సమర్పించిన వారే. తెలియకుండా ఇరుక్కున్న వారే. వీటిని వినియోగించే విషయంలో కొంచెం అవగాహనతో, జాగ్రత్తతో వ్యవహరించి ఉంటే కొందరైనా తప్పించుకుని ఉండేవారు. మరి ఈ మోసగాళ్ల వలకు చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని సూచనలివిగో... * అవసరం లేకుండా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, విద్యుత్ బిల్లు, ఫోన్ బిల్లు, బ్యాంకు స్టేట్మెంట్ వంటి కేవైసీ పత్రాలను ఎవరికీ ఇవ్వకూడదు. * తగిన అవసరం కోసం నిబంధనల మేరకు ఇవ్వాల్సి వస్తే... ఒరిజినల్స్ కాకుండా జిరాక్స్ కాపీ మాత్రమే ఇవ్వాలి. ఆ జిరాక్స్ కాపీపై ఎవరికిస్తున్నామో? ఎందుకిస్తున్నామో? సదరు ధ్రువపత్రంపై రాయాలి. * ఇది ఈ ఒక్కసారి వినియోగానికి ఉద్దేశించినది మాత్రమే... అని సదరు జిరాక్స్ కాపీలపై స్పష్టంగా రాయాలి. ఎలా అంటే... ఉదాహరణకు బీమా పాలసీ కోసం కంపెనీకి ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నారనుకోండి. జిరాక్స్ కాపీపై ‘ఈ కాపీని బీమా కోసం గాను ఏబీసీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నాను. ఇది ఈ ఒక్కసారి వినియోగానికి మాత్రమే’ అని రాయాలి. అక్కడే సంతకం కూడా చేయాలి. * మీకు సంబంధం లేకపోయినా ఏదో ఒక విషయమై తరచుగా కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తుంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరు పంపిస్తున్నారు..? ఎందుకు..? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ పత్రాలను ఆధారంగా చేసుకుని వేరెవరైనా లావాదేవీలు నిర్వహించి ఉండవచ్చు. * పాన్ నంబర్, క్రెడిట్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, బీమా పాలసీ నంబర్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దు. ఈ వివరాలు కోరుతూ వచ్చే మెయిల్స్, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను నమ్మవద్దు. * మీ బీమా పాలసీపై ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామంటూ వేసే వలలో చిక్కుకోవద్దు. ఈ విధమైన సమాచారంతో వచ్చే కాల్స్, మెయిల్స్, ఎస్ఎంఎస్లను పట్టించుకోవద్దు. - గణేష్ అయ్యర్ -
వడ్డీ తక్కువే... మరి చార్జీలో..!
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతామంటూ బ్రిటన్ నిర్ణయం తీసుకోవటం స్టాక్ మార్కెట్లకు శరాఘాతమే. కరెన్సీలతో పాటు క్రూడ్ వంటి కమోడిటీలకూ గడ్డుకాలమే. కాకపోతే ఇలాంటి అనిశ్చితిలో అందరూ చక్కని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా భావించేది బంగారమే. ఈ నేపథ్యంలోనే దూసుకుపోతున్న పసిడి, ఈ ఏడాది చివరకు మరింతగా పెరగవచ్చనేది అంచనా. ఆభరణాలుగా, పొదుపు సాధనంగా, ద్రవ్యోల్బణాన్ని కాచుకునే రక్షణ కవచంగా, అవసరమైతే రుణం రూపంలో ఆదుకునే మిత్రునిగా ఇలా బంగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం మామూలుది కాదు. ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో 10% భారతీయుల ఇళ్లలోనే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, పిల్లల చదువులు, సాగు కోసం పెట్టుబడి, ఇల్లు కొనుగోలు... అవసరం ఏదైనా వారికి ముందుగా కనిపించేది బంగారమే. కాకపోతే బంగారంపై రుణాల విషయంలో చాలామందికి అంతంతమాత్రం అవగాహనే ఉంది. ఈ విషయంలో తెలుసుకోవాల్సిన వాస్తవాలెన్నో ఉన్నాయి. అవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం.. గోల్డ్‌లోన్ తీసుకునే ముందు అవగాహన అవసరం ⇒ వడ్డీ రేటు తక్కువే కానీ... దానికి సవాలక్ష కండిషన్లు ⇒ ప్రాసెసింగ్ నుంచి ఆలస్యానికి, ప్రీపేమెంట్కూ చార్జీలు ⇒ ఇవన్నీ కలిపితే పర్సనల్‌లోన్ కన్నా ఎక్కువే వడ్డీరేటు ⇒ బంగారం విలువ తగ్గితే మరింత హామీ కావాలంటూ ఒత్తిళ్లు ⇒ ఇవన్నీ భరించేబదులు విక్రయించటమే బెటరంటున్న నిపుణులు మన అవసరం... వారికి వ్యాపారం బంగారం రుణాల్లో ఎక్కువ శాతం రూ.30 వేల నుంచి రూ.50వేల లోపు తీసుకునేవే ఎక్కువ. తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగా లభించే బంగారం రుణాలవైపు ఆకర్షితులవుతుంటారు. వాటిపై వడ్డీ, ఇతర చార్జీల రూపంలో పడే భారం గురించి వారికి తెలిసింది తక్కువే. పైగా, అత్యవసరాల్లో ఎక్కడా అప్పు దొరకని పరిస్థితుల్లోనే మరో మార్గం లేక బంగారాన్ని కుదువపెడుతుంటారు. దీంతో బంగారంపై రుణాలు ఎన్బీఎఫ్సీ కంపెనీలకు మంచి వ్యాపార వనరుగా మారింది. బంగారం రుణాల్లో 75 శాతం అవ్యవస్థీకృత రంగం (వ్యక్తులు సొంతంగా నడిపేది)లోనే ఉన్నాయి. మిగిలిన 25 శాతం మార్కెట్ వాటా ఎన్బీఎఫ్సీ, బ్యాంకుల చేతిలో ఉంది. బంగారంపై రుణం చిటికెలో పని! మిగిలిన రుణాలతో పోలిస్తే బంగారంపై రుణం తేలిగ్గా లభిస్తుంది. వీధిలో ఉన్న వడ్డీ వ్యాపారి అయినా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ అయినా... విలువైన బంగారాన్ని కుదువపెడితే కళ్లకద్దుకుని రుణాలిచ్చేస్తారు. సామాన్యులను ఎక్కువగా ఆకర్షించే విషయమిదే. ఆదాయ వివరాలు, పే స్లిప్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. క్రెడిట్ స్కోర్‌తో పనిలేదు. కుదువపెట్టే నాటికి మార్కెట్లో ఉన్న బంగారం విలువలో 75 శాతం లేదా అంతకంటే తక్కువ రుణాన్ని మంజూరు చేస్తారు. అయితే బంగారం ధర ఉన్నట్టుండి 25 శాతం వరకు పడిపోతేనే సమస్య ఎదురవుతుంది. కానీ, బంగారం ధరలు తక్కువ వ్యవధిలో ఇంత మేర పడిపోయిన సందర్భాలు చరిత్రలో చాలా తక్కువేనని చెప్పాలి. ఒకవేళ ఆ స్థాయిలో పడిపోతుంటే రుణదాత వెంటనే అప్రమత్తమై... వెంటనే రుణాన్ని కొంతమేర తీర్చివేయాలని లేదా మరికొంత మొత్తం బంగారాన్ని హామీగా సమర్పించాలని రుణగ్రహీతను కోరతారు. చెప్పేది వేరు... చేసేది వేరు చాలా వరకు ఎన్బీఎఫ్సీలు బంగారం విలువపై 75 శాతం వరకు రుణాలిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తుంటాయి. కానీ, రుణం కోసం వెళ్లినప్పుడే అసలు విషయం తెలుస్తుంది. బంగారాన్ని చూశాక గానీ రుణం ఎంతన్నది తేల్చవు. తాకట్టు పెట్టాలనుకునే బంగారం స్వచ్ఛత, విలువ పరీక్షించిన తర్వాతే ఎంత రుణం ఇచ్చేదీ చెబుతాయి. బంగారు ఆభరణాల విలువను లెక్కించడంలో అనుసరించే విధానం కూడా గోప్యమేనని స్వయంగా రిజర్వ్ బ్యాంకు బృందమే గుర్తించింది. రుణ పత్రాలు, రుణాల జారీ విషయంలో పాటించే విధానం కూడా సంస్థను బట్టి మారుతుంటుంది. రుణగ్రహీతకు తాకట్టు పత్రం, రుణ ఒప్పంద పత్రాన్ని ఇస్తున్నాయి. కానీ, వాటిలో ఆభరణాల వివరాలు, ఎన్ని గ్రాములు, మదించిన విలువ వంటివి వేయటం లేదు. వార్షిక వడ్డీ రేటు వివరాలను కూడా పేర్కొనడం లేదు. రుణం కాల వ్యవధి ఎంత? గడువులోపు చెల్లించడంలో విఫలమైతే వేలం విషయంలో అనుసరించే విధానమేంటి? ఇతర చార్జీలేమైనా ఉన్నాయా? ఇలాంటి వివరాలు ఎన్బీఎఫ్సీ సంస్థలు జారీ చేసిన పత్రాల్లో ఉండటం లేదని ఆర్బీఐ బృందం తేల్చింది. అలాగే, రుణగ్రహీత చెల్లింపుల విషయంలో విఫలమైతే హామీగా ఉంచిన బంగారు ఆభరణాలను వేలం వేసే ముందు ఆ విషయాన్ని కచ్చితంగా తెలియజేయాలి. కానీ, కంపెనీలు ఈ నిబంధనను పాటించ డం లేదు. రుణగ్రహీతకు చెప్పకుండా వేలం ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. వేలం వేసే రోజు మార్కెట్ విలువ ఎక్కువగా ఉండి... ఆ వేలం ద్వారా అధిక మొత్తం సమకూరితే రుణం, దానిపై వడ్డీ పోను మిగిలిన నగదును రుణ గ్రహీతకు తిరిగి చెల్లించడం లేదని కూడా ఆర్బీఐ గుర్తించింది. వడ్డీ నెలనెలా... అసలు చివర్లో నెలనెలా వడ్డీ చెల్లిస్తూ గడువు తీరిన తర్వాత అసలు మొత్తాన్ని చెల్లించేసి తనఖా పెట్టిన బంగారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. బంగారంపై రుణాలిచ్చే బ్యాం కులు లేదా ఎన్బీఎఫ్సీలు ఈ విధానాన్నే ఎక్కువగా పాటిస్తుంటాయి. వడ్డీతోపాటు అసలు కలిపి ఒకేసారి చెల్లించే అవకాశమూ ఉంది. రెండో ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం వడ్డీపై వడ్డీ జమకూడి చెల్లించాల్సిన మొత్తం బాగా పెరిగిపోతుంది. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం వడ్డీ ఎంత...!? ప్రకటనలను చూస్తే బంగారు రుణాలపై వడ్డీ చాలా తక్కువే అనిపిస్తుంది. కానీ, నిజానికి ఈ వడ్డీ ఎక్కువే. ఎందుకంటే వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీ, విలువ మదింపు చార్జీలు వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపితే వడ్డీ ఎక్కువే అవుతుంది. పైగా నెలవారీ వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే సంస్థలు విధించే జరిమానా భారీగా ఉంటుంది. రుణాన్ని ముందుగా తీర్చేసినా చార్జీలు తప్పవు. మార్కెట్లో ఉన్న రెండు ప్రముఖ రుణ సంస్థల వడ్డీ రేటును పరిశీలిస్తే... 12 నుంచి 24 శాతం వరకూ ఉన్నట్టు వెల్లడయింది. రుణం తీసుకునే కస్టమర్, తాకట్టు పెట్టే ఆభరణాలు, రుణ మొత్తం, వ్యవధిని బట్టి ఈ వడ్డీరేటు మారిపోతుంది. వాస్తవంలో గరిష్ట వడ్డీ ధర 24 శాతాన్ని దాటిపోయి 30% వరకూ ఉన్న సందర్భాలూ లేకపోలేదు. ఎన్బీఎఫ్ఎసీల మొత్తం బంగారం రుణాల్లో కేవలం 2 శాతమే 12% వడ్డీకి ఇస్తున్నవని వెల్లడయింది. మిగిలిన రుణాలపై వడ్డీ రేటు 24-26% మధ్యనే ఉంటోంది. రుణం తీసుకోవాలా? బంగారం విక్రయించాలా? ఒక గోల్డ్‌లోన్ సంస్థ ఇస్తున్న బంగారు రుణాలపై వడ్డీ నెలకు 2 శాతం. బంగారం మార్కెట్ విలువపై రుణం రేషియో (ఎల్టీవీ) కూడా 70 శాతం వరకే ఉంది. రుణం కాల వ్యవధి మూడు నెలలే. ప్రతి త్రైమాసికం చివర్లో వడ్డీ మొత్తం చెల్లిస్తే మరో మూడు నెలలకు రుణం పొడిగిస్తుంటారు. అసలు చెల్లించే వరకు ఇలా రుణం కాల వ్యవధి కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ బంగారం విలువ తగ్గి, ఎల్టీవీ రేషియో కూడా తగ్గితే అదనంగా బంగారాన్ని హామీగా ఉంచాలని సంస్థ నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయి. చార్జీలన్నీ చెల్లించి, ఇలాంటి ఇబ్బందులు పడేకంటే కొన్నిసార్లు బంగారాన్ని విక్రయించడమే లాభసాటిగా కనిపిస్తుంది. అయితే, బంగారం ధరలు పెరిగేటపుడు ఈ ఆప్షన్ అంత మంచిదికాదు. సెంటిమెంటుతో చిక్కు.. భారతీయులకు, ముఖ్యంగా స్త్రీలకు ఆభరణాలతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. తండ్రి తన పుట్టిన రోజున ప్రేమగా బహూకరించిన హారం, పెళ్లి నిశ్చితార్థం రోజున కాబోయే వరుడు చేతి వేలికి తొడిగిన ఉంగరం, పెళ్లి సందర్భంగా నాన్న చేయించిన బంగారు గాజులు, వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాళి ఇలా ప్రతీ దానికీ ఓ చెరగని జ్ఞాపకం ఉంటుంది. అయితే, మంగళసూత్రం వంటి వాటిని మినహాయిస్తే మిగిలిన వాటి విషయంలో సెంటిమెంటును పక్కన పెడితేనే లాభమన్న విషయాన్ని తెలుసుకోవాలి. పైగా అమ్మడం వల్ల తర్వాత కావాలంటే కొత్త ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు. విక్రయించే ముందు వాటిని ఫొటో తీసి పెట్టుకుంటే అవే డిజైన్లతో ఆభరణాలను చేయించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పసిడి... మెరుపు తగ్గదు! న్యూయార్క్/ముంబై: స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులు ఉన్నా... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పసిడి ధర తగ్గే పరిస్థితి లేదని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని వారి అంచనా. బ్రెగ్జిట్ నేపథ్యంలో మూడేళ్ల గరిష్ట స్థాయికి (జూన్ 23వ తేదీన ఔన్స్‌కు 1,355 డాలర్లు) ఎగసిన ధరలు మున్ముందూ ఇదే ధోరణిని కొనసాగిస్తాయన్నది వారి అంచనా. క్లుప్తంగా పరిశీలిస్తే... * గోల్డ్ రిఫైనరీస్ జాతీయ సంఘం అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ రిఫైనరీస్ అండ్ మింట్స్ సెక్రటరీ జేమ్స్ ఈ అంశంపై మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ధర అంతర్జాతీయ ప్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా)కు 1,400 డాలర్లకు చేరడం ఖాయమని పేర్కొన్నారు. * దేశీయంగా రూపాయి బలహీనత, పసిడి ధర భారీ పెరుగుదలకు కారణం అయ్యే అవకాశం ఉందని ట్రెజరీ అండ్ బ్యాంక్‌నోట్స్ సెంట్రల్ డెరైక్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ హరిప్రసాద్ అంచనావేశారు. * కనీసం ఆరు నెలలు, గరిష్టంగా 18 నెలలు పసిడి మెరుపు కొనసాగే అవకాశం ఉందని ఏవీపీ సిస్టమ్యాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ హెచ్ బీరేంద్రకుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు. పసిడి 1,509 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడిన ఆయన, ఇదే జరిగితే కనిష్ట స్థాయి నుంచి 61.8 శాతం బలపడినట్లు (రిట్రేస్‌మెంట్) అవుతుందని, ఈ స్థాయిని దాటితే తిరిగి పసిడి తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరే అవకాశం ఉంటుందని అన్నారు. వారంలో వెండి మెరుపులు: అంతర్జాతీయంగా ఔన్స్ 25 డాలర్లు ఎగసి 1,344 డాలర్లకు చేరింది. ముం బైలో శుక్రవారం శుక్రవారంతో ముగిసిన సమీక్ష వారంలో కొంత నెమ్మ దించింది. 99.9 స్వచ్ఛత ధర రూ.10 నష్టపోయి, 30.905 వద్ద ముగిసింది. అయి తే వెండి భారీగా కేజీకి రూ.2,150 ఎగసి రూ.45,080కి చేరింది. -
ఔషధంలా వాడితే మంచిదే!
ఓవర్ డ్రాఫ్ట్... వెంకట్ మొబైల్‌కు తన బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ‘మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి క్రమం తప్పకుండా ఆరు నెలలుగా వేతనం మీ ఖాతాలో జమ అవుతోందా? అయితే... ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం కోసం మా బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించండి.’ ఇదీ ఆ మెసేజ్ సారాంశం. దీంతో వెంకట్ ఆలోచించటం మొదలెట్టాడు. చివరకు తన ఆఫీసులో ఆర్థికాంశాలపై అవగాహన ఉన్న స్నేహితుడు రామును దీని గురించి అడిగాడు. రాము ఏం చెప్పాడనేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేకం... ఉద్యోగులకైతే వేతనాన్ని బట్టే ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఆస్తులు, ఎఫ్డీలు, బీమా పాలసీలు తనఖా పెట్టి కూడా మిగిలిన రుణాలతో పోల్చితే వడ్డీ రేటు తక్కువే విత్‌డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ కనక ఉత్తమం ఈ రుణంతో రిస్కు చేస్తే మాత్రం ఇబ్బందులే!! వినియోగించుకున్న డబ్బుపైనే వడ్డీ... ఉదాహరణకు మీకు రూ.6 లక్షలు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని మంజూరు చేశారనుకుందాం. ఆ మేరకు డబ్బు మొత్తాన్ని మీ చేతికివ్వటం జరగదు. అలాగని వారి దగ్గరే ఉంచుకోరు కూడా. ఇది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే... రూ.6 లక్షలనేది మీ రుణ పరిమితి. అక్కడి వరకూ మీరు ఉపయోగించుకోవచ్చన్న మాట. అందులో మీరు ఎంత వినియోగించుకున్నారో.. అంత మొత్తానికే వడ్డీరేటు పడుతుంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాతిపదికనే వడ్డీని కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక్కసారే కాకుండా.. మీ అవసరాన్ని బట్టి కావాల్సినప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ.. అంతే మొత్తానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఇక్కడ లభిస్తుంది. అత్యవసర సమయాల్లో... మనలో ప్రతి ఒక్కరికీ ఒకో సమయంలో డబ్బు అవసరం పడుతుంది. సిద్ధంగా ఉంటే సరే. లేదంటే ఎక్కడన్నా... అప్పు పుడుతుందా? అని చూస్తాం. క్రెడిట్ కార్డు వాడాలా..! దానిపై లిమిట్ అయిపోతే రుణం తీసుకోవాలా? లేకపోతే బ్యాంక్‌లో పర్సనల్ లోన్ దొరుకుతుందా? ఇవన్నీ చూస్తాం. ఇంత చేసినా మనకు కావాల్సిన మొత్తానికి కొంత అటు, ఇటు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం గురించి తెలిసిన వారికి ఈ దారి కొండంత అండలా కనిపిస్తుంది. చాలా మందికి దీని గురించి తెలియకపోవడమే ఇక్కడ సమస్య. తనఖాతో తక్కువ వడ్డీపైనే... మీకు వస్తున్న వేతనం ప్రాతిపదికగా... లేదా మీరేదైనా ఆస్తిని తనఖా పెట్టిన సందర్భంలో స్వల్పకాలానికి బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుంది. మిగిలిన వివిధ రకాల రుణాలతో పోలిస్తే దీని వడ్డీ రేటు తక్కువే ఉంటుంది. గృహం, జీవిత బీమా పాలసీ, బ్యాంక్ స్థిర డిపాజిట్లు, షేర్లు, బాండ్లు వంటి వాటిని ఆస్తులుగా ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ మీరు తనఖాగా బ్యాంకు దగ్గర ఏం పెట్టారన్న విషయంపైనే వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. వడ్డీలు ఎలా ఉంటాయి...? ఆస్తిని తనఖా పెట్టి తీసుకున్న రుణమైతే వడ్డీరేటు సంవత్సరానికి 12 నుంచి 14 శాతం వరకూ ఉంది. ఒకవేళ స్థిర డిపాజిట్లను తనఖాగా పెట్టారనుకుందాం. ఇందులో 70 శాతం వరకూ రుణంగా లభిస్తుంది. గృహ తనఖాపై విధించే వడ్డీరేటుకన్నా... తక్కువ వడ్డీరేటు ఉంటుంది. స్థిర డిపాజిట్ పథకంపై చెల్లించే వడ్డీరేటుకన్నా ఒకశాతం వడ్డీని మాత్రమే బ్యాంకు అదనంగా వసూలు చేస్తుంది. అంటే మీకు స్థిర డిపాజిట్‌పై వచ్చే వడ్డీ 9 శాతం అయితే మీ నుంచి వసూలు చేసేది 10 శాతం ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్ వాడుకునే ముందు ఇవి గుర్తుంచుకోండి... * ఓవర్‌డ్రాఫ్ట్ కేవలం అత్యవసరాలకు ఉద్దేశించిన ఒక సౌలభ్యం. * ఈ రుణంతో తీవ్ర ఒడిదుడుకులతో కూడిన స్టాక్స్, కమోడిటీల్లో పెట్టుబడులు పెట్టొద్దు. * మీ ఓవర్‌డ్రాఫ్ట్‌పై వడ్డీని సకాలంలో సక్రమంగా చెల్లించండి. * సకాలంలో ఓవర్‌డ్రాఫ్ట్ మొత్తాన్ని బ్యాంకుకు జమ చేసేయండి. * ఒకవేళ మీరు చెల్లించలేకపోతే... మీరు తనఖాగా ఉంచిన ఆస్తిని బ్యాంక్ లిక్విడేట్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. * మరిన్ని అంశాలను స్పష్టంగా మీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌ను అడిగి తెలుసుకోండి. రుణ మంజూరు ఎలా...? ఉదాహరణకు మీరు మీ ఇంటిని తనఖాగా ఉంచి ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకుంటున్నారనుకోండి. ఆస్తి విలువ రూ.10 లక్షలు అనుకుందాం. ఇందులో 50 నుంచి 60 శాతం వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది. ఒకవేళ మీరు గనక అదే బ్యాంకులో రుణం తీసుకుని ఉంటే... దానిని తిరిగి సరిగా చెల్లించారా లేదా? మీ పునఃచెల్లింపుల సామర్థ్యం ఎంత? వంటి అంశాలను కూడా బ్యాంక్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆయా అంశాల ప్రాతిపదిన ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఇస్తుంది. ఉద్యోగికి వేతనం విషయంలోనూ ఇలాంటి అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగులకైతే వేతనాన్ని బట్టే... ఇక మీరు వేతన జీవి అనుకోండి. మీ నెలవారీ వేతనంపై బ్యాంకు తాత్కాలిక ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యాన్ని కల్పిస్తుంది. మీకు నెలకు రూ.50వేలు వేతనం ఉంటే రూ.25 వేల వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్నిచ్చే అవకాశముంది. మీ అవసరం, గతంలో మీ రుణ చెల్లింపు సామర్థ్యం... అదే ఖాతాలో మీరు పని చేస్తున్న సంస్థ నుంచి వేతన జమ... వంటి అంశాలపై కూడా ఈ పరిమితి ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్కన్నా తక్కువ రుణ రేటుకు ఓవర్‌డ్రాఫ్ట్ దొరుకుతుందనేది గమనార్హం. ఓవర్‌డ్రాఫ్ట్‌కు చేయాల్సిందేంటి? మీకు ఎంత వేగంగా రుణం మంజూరవుతుందనేది మీరు తనఖా పెట్టే ఆస్తిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆస్తిని తనఖాగా ఉంచితే... దానికి విలువ కట్టడం, దాన్ని వెరిఫై చేయటం వంటివి ఆలస్యమవుతాయి కనక కొంత సమయం పడుతుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ల వంటివైతే వెంటనే మంజూరవుతుంది. ఈ రుణాల ఫీజుల విషయానికొస్తే 0.5 శాతం నుంచి రూ.25,000 వరకూ ఉంటాయి. మీరు పెట్టిన తనఖా ప్రాతిపదికన ఓవర్‌డ్రాఫ్ట్ పునః చెల్లింపు గడువు ఆధారపడి ఉంటుంది. దీనిని బ్యాంక్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. -
విద్యార్థుల మైండ్‌సెట్ మారుతోంది..
‘సాక్షి’ ఇంటర్వ్యూ: అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ సీఈవో నీరజ్ సక్సేనా... ♦ విద్యా రుణాలకు డిమాండ్ పెరుగుతోంది ♦ ఈసారి రూ. 800 కోట్ల రుణాలివ్వాలనేది లక్ష్యం ♦ విద్యా సంస్థల మౌలిక సదుపాయాలకూ రుణాలు ♦ కోర్సుల భవితను చూసి రుణాలిస్తాం కనక డిఫాల్ట్‌లు తక్కువే ♦ మా మొత్తం రుణాల్లో ఎన్పీఏల శాతం 0.05 ♦ రెండేళ్లలోనే బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు నమోదు చేశాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చదువుకోసం రుణం తీసుకోవటమంటే ఒకప్పుడు విచిత్రం. ఇపుడు సాధారణం. ఇలా ఉన్నత విద్య విషయంలో దృక్పథాలు మారుతుండటంతో విద్యా రుణాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యారంగంపై పూర్తి అవగాహనతో, విద్యార్థుల అవసరాలకు తగిన రుణాల్ని అందిస్తోంది అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్. చదువుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా... మౌలిక సదుపాయాలు మెరుగు పరచుకునేందుకు విద్యా సంస్థలకు కూడా రుణాలిస్తోంది ఈ సంస్థ. విద్యా రుణాల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ఈ సంస్థ తాజా పరిస్థితులకు తగ్గట్టు ఎలా మారుతోందనే విషయమై సంస్థ సీఈఓ నీరజ్ సక్సేనా ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధితో మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... దేశీయంగా విద్యా రుణాల మార్కెట్ ఎంత? ప్రస్తుతం దేశీయంగా విద్యా రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 60,000 కోట్ల పైనే ఉంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులదే ప్రధాన వాటా. ప్రస్తుతం ఉన్నత విద్య విషయంలో దృక్పథం మారుతోంది. చదువు కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యతను పిల్లలే స్వీకరించాలని, దాన్ని వారు గుర్తెరిగి వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుకుంటుకున్నారు. ఇలా మారుతున్న ధోరణి, డిమాండు తదితరాల వల్ల విద్యారుణాల మార్కెట్ మరింత పెరిగే అవకాశముంది. ఏటా 2.5 లక్షల మంది పైగా విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. దేశీయంగా వివిధ కోర్సుల్లో 2 కోట్ల మంది పైగా విద్యార్థులు ఉన్నారు. దేశ, విదేశీ వర్సిటీ ల్లో పెరుగుతున్న ఫీజులు, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల విద్యా రుణాల డిమాండు పెరుగుతోంది. మా విషయానికొస్తే 2013లో కార్యకలాపాలు ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 31 నాటికి 4000 మంది విద్యార్థులకు రూ.450 కోట్ల రుణాలిచ్చాం. కళాశాలల విస్తరణ కోసం రూ.80 కోట్ల ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా రుణాలిచ్చాం. ఈ రంగంలో బ్యాంకులున్నాయి కదా! మరి మీ ప్రత్యేకతలేంటి? మేం ఉన్నత విద్యా రంగాన్ని పూర్తిగా అధ్యయనం చేశాం. విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు వారి నేపథ్యం, ప్రమాణాలు, స్కోరు అన్నీ విశ్లేషిస్తాం. వారు ఎంచుకోబోయే కళాశాల రేటింగ్ బట్టి రుణ నిబంధనలుంటాయి. కోర్సులు, వర్సిటీలను విశ్లేషించి, రేటింగ్ నిర్ణయించడానికి మా దగ్గర ప్రత్యేక టీమ్ ఉంది. సాధారణంగా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఫీజులు చెల్లించేందుకు అడ్మిషన్‌కు ముందే తమ ఆర్థిక స్థోమతను చూపించుకోవాలి. ఇది గుర్తించే.. మేం అడ్మిషన్‌కు ముందే రుణాన్ని మంజూరు చేస్తున్నాం. ఈ లె టర్ను చూపించుకుని ఆయా విద్యార్థులు అడ్మిషన్ నిర్ధారించుకోవచ్చు. అంతేకాదు సందర్భాన్ని బట్టి మార్జిన్ మనీ, డౌన్‌పేమెంట్ లేకుండా కూడా మా దగ్గర లోన్ పొందవచ్చు. దేశీయంగా విద్యాభ్యాసానికి సగటున రూ. 10 లక్షలు, విదేశీ విద్యకు రూ. 25 లక్షల దాకా రుణం అవసరమవుతోంది. కోర్సు, విద్యార్థి నేపథ్యం, పూచీకత్తు, క్రెడిట్ హిస్టరీ మొదలైన వాటిని బట్టి వడ్డీ రేటు 11-14% మేర ఉంటోంది. క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేకపోయినా, కోర్సులు.. వర్సిటీలకూ సరైన అనుమతులు లేకపోయినా, కుటుంబ బాధ్యతలు మరీ ఎక్కువగా ఉన్నా రుణ మంజూరుపై ప్రభావం చూపవచ్చు. ఒకేషనల్ కోర్సులకు కూడా రుణాలిస్తున్నారా? మేనేజ్మెంట్, మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రెగ్యులర్ కోర్సులకు విద్యా రుణం పొందడం సులభమే. కొత్త తరం కోర్సులైన ఫిలిం మేకింగ్, ఫొటోగ్రఫీ, ప్యాషన్ డిజైనింగ్ మొదలైన వాటికి కాస్త కష్టమే అయినప్పటికీ... మేం వీటికి కూడా రుణాలిస్తున్నాం. ప్రస్తుతం కొన్ని ఒకేషనల్ కోర్సులకు రుణాలిస్తున్నాం. ఎగవేత రిస్కులు అందరిలానే మీకూ ఉంటాయా? విద్యార్థి కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం దొరక్క రుణం తిరిగి కట్టలేకపోవడమే ఈ రంగానికెదురయ్యే ప్రధాన సమస్య. దీనికోసం మేం భవిష్యత్‌లో ఎకానమీ స్థితిగతులు, ఆయా కోర్సుల ఉపాధి అవకాశాలను ముందే అధ్యయనం చేస్తున్నాం. అలాగే క్రెడిట్ హిస్టరీపై రుణం తీసుకునే వారిలో అవగాహన కల్పిస్తాం. ఇక కోర్సు చదివే కాలంలో పూర్తి స్థాయిలో రీపేమెంట్ హాలిడేలాంటిది ఉండదు. దీనివల్ల కోర్సు పూర్తయ్యే నాటికి ఈఎంఐల భారం కొంత తగ్గుతుంది. అటు విద్యార్థి పనితీరు కూడా పరిశీలిస్తుంటాం. విద్యా రుణాలను కేవలం ఆర్థికంగానే కాకుండా మిగతా కోణాల నుంచి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. డిఫాల్టులను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. మీ విషయంలో డిమాండ్ ఉన్న కోర్సులేంటి? ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడిసిన్ వంటి విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. అయితే, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ మొదలైన వాటితో పాటు ఫిలిం మేకింగ్, సంగీతం, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర కోర్సులకు సైతం ఆదరణ పెరుగుతోంది. మీ ఎన్పీఏల శాతమెంత? విస్తరణ ప్రణాళికలున్నాయా? స్వల్ప వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు గతేడాది లాభాలు కూడా నమోదు చేశాం. ఇప్పటిదాకా హైదరాబాద్‌లో 700 మంది పైచిలుకు విద్యార్థులకు విద్యా రుణాలిచ్చాం. మార్చి 31 నాటికి మా విద్యా రుణం పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 450 కోట్లు. అందులో హైదరాబాద్ వాటా 16 శాతం పైగా ఉంది. మా ఖాతాల్లో ఎన్పీఏలు 0.05 శాతంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మేం రూ. 343 కోట్ల మేర విద్యా రుణాలిచ్చాం. ఈసారి రెట్టింపు స్థాయిలో రూ. 800 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. -
నానో.. ఫెరారీ 'సవారీ'!
అవసరం - సౌకర్యం - విలాసం. అడ్రస్ బట్టి మారిపోతాయి. ఒకచోట అవసరమైనది... మరోచోట విలాసం. ఒకచోట విలాసమైతే.... మరోచోట అనవసరం కూడా!! కారు కూడా అంతే. ఒకపుడు చాలామందికి విలాసం. వారి స్థాయికి గుర్తు. ఇపుడైతే అత్యధికులకు అవసరం. కొందరికైతే అత్యవసరం. మరి ఆ కార్లకు పెట్టే ధరెంత? కొందరైతే లక్షల్లో. మరి కొందరైతే కోట్లలో. అందుకే! మారుతి-800తో మొదలైన భారత దేశ కార్ల ప్రస్థానం... అలా అలా బుగట్టీ, రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టిన్ మార్టిన్, ఫెరారీ, లాంబోర్గిణి, బీఎండబ్ల్యూలను దాటిపోతోంది. నిజానికి కారు కొనేటపుడు అత్యధికులు చూసేది దాని ధర, మైలేజీ. ఈ రెండిటి తరవాత ఫీచర్లు. కాకపోతే పిండి కొద్దీ రొట్టె. డబ్బు కొద్దీ కారు. ఈ ధరను బట్టే... ఫీచర్లు, మైలేజీ అన్నీ మారిపోతుంటాయి. లక్ష రూపాయలకేనంటూ సామాన్యుల అవసరాలు తీర్చడానికి నానో ప్రత్యక్షమైతే... నేను కొందరికే సొంతం అంటూ రూ.38 కోట్ల బుగట్టీ వేరన్ రోడ్డుమీదికొస్తుంది. రూ.3 లక్షలు పెడితే మీ కుటుంబాన్నంతటినీ మోస్తానంటూ మారుతి ఆల్టో దేశానికి దగ్గ రైతే... రూ.8 కోట్లకు తక్కువ కాదంటూ రోల్స్‌రాయిస్ పాంథమ్ రోడ్డును మింగేస్తుంది. దేని ధర దానిదే. దేని ఫీచర్లు దానివే. దేని మైలేజీ దానిదే. ఒక్కమాటలో చెప్పాలంటే... దేనికదే సాటి. ఆ స్పెషాలిటీల సమాహారమే... ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ♦ చిన్నకార్ల కొనుగోళ్లలో ధరకే ఓటు ♦ మైలేజీ, ఫీచర్లు పెంచుతూ కంపెనీల ఎంట్రీ ♦ రూ.10 లక్షల లోపు కార్ల సెగ్మెంట్లో పోటాపోటీ ♦ దేశంలో కంపెనీల ఫోకస్ మొత్తంగా ఈ సెగ్మెంట్‌పైనే ♦ లగ్జరీ కార్ల కంపెనీల రూటే వేరు ♦ ప్రత్యేకమైన కస్టమర్ల కోసం ప్రత్యేక కార్లు ♦ బుక్ చేశాక కనీసం 4 నుంచి 8 నెలల దాకా వెయిటింగ్ ♦ దేశంలో అంతకంతకూ పెరుగుతున్న లగ్జరీ కార్లు ‘లక్ష’ నానోతో టాటా హల్చల్... టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్... ముంబై కేంద్రంగా 1945లో ప్రారంభమైంది. ప్రపంచ కార్ల కంపెనీల్లో దీనిది 17వ స్థానం. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2008లో ఇది ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. స్పెయిన్‌కు చెందిన బస్, కోచ్ తయారీ సంస్థ హిస్పానో, దక్షిణ కొరియాకు చెందిన కమర్షియల్ వెహికల్ తయారీ సంస్థ డీవో కూడా టాటా అనుబంధ సంస్థలే. సంస్థకు దేశంలో జంషెడ్పూర్, పట్నానగర్, లక్నో, సణంద్, ధార్వాడ్, పుణెతో పాటు అర్జెంటీనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, యూకేలో ప్లాంట్లున్నాయి. 2008లో లక్ష రూపాయలకేనంటూ నానోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ధర 2 లక్షలు దాటింది. 800 నుంచి మొదలు పెడితే... ఒకప్పుడు మారుతీ అంటే దేశీ కంపెనీ. ఇప్పుడిది జపాన్‌కు చెందిన సుజుకీ చేతుల్లో ఉంది. మొదట్లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌గా పిలిచిన ఈ సంస్థ... మారుతీ800తో దేశంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016 జనవరి నాటికి మన దేశీ కార్ల పరిశ్రమలో 47 శాతం వాటా దీనిదే. 1981లో మారుతీ ఉద్యోగ్ ఆరంభమైనా... తొలి 800 కారు బయటికొచ్చింది మాత్రం 1983లో. దేశంలో గుర్గావ్, మానేసర్‌లోని ప్లాంట్లలో సంస్థ ఏటా 14.50 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోం ది. ప్రస్తుతం ఈ సంస్థ హై ఎండ్ కార్ల మార్కెట్లో కూడా విస్తరిస్తోంది. పోటాపోటీగా... హ్యుందాయ్ 1967 డిసెంబర్లో దక్షిణ కొరియాలో ఆరంభమైన హ్యుందాయ్... ఇపుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కార్ల కంపెనీ. కొరియాలోని ఉల్సాన్లో దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ ప్లాంటుంది. దాన్లో ఏటా 16 లక్షల కార్లు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో విక్రయాలు సాగిస్తున్న ఈ సంస్థ... 1968లో ఫోర్డ్‌తో కలిసి రూపొందించిన ‘కోర్టినా’తో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. దేశంలో చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్లాంట్ నుంచి ఏటా 6 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోంది. 2007లో హైదరాబాద్ అభివృద్ధి, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. చౌక కార్లలోనూ డెట్రాయిట్ దిగ్గజం! ఒకనాటి నవలల్లో ‘చెవర్లెట్ కారు’ అని ముద్దుగా పిలిచినా... అసలు పేరు షెవర్లే. అమెరికన్ దిగ్గజం జనర ల్ మోటార్స్ విభాగ మిది. 1911లో స్విస్ రేస్ కార్ డ్రైవర్ లూయీ షెవర్లే, ఫైనాన్సింగ్ పార్టనర్ విలియం సి డురంట్‌తో కలిసి మిషిగన్‌లో ఈ కంపెనీని ఆరంభించా రు. ప్రస్తుతం 140 దేశాలకు విక్రయించిన షెవర్లే వాటా... మన దేశంలో 3 శాతం. గుజరాత్‌లోని హలోల్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ... 2014లో 24 వేల కార్లను ఉత్పత్తి చేసింది. క్రూజ్, ఆస్ట్రా, టవేరా తప్ప మిగిలివన్నీ జపాన్ నుంచి దిగుమతి అవుతున్నవే. జేఎల్ఆర్ను వదులుకున్నా.... ఫోర్డ్ మోటార్స్‌ను 1903లో హెన్రీ ఫోర్డ్ మిషిగన్‌లో ప్రారంభించారు. కార్లు, కమర్షియల్ వాహనాలను ‘ఫోర్డ్’ బ్రాండ్‌తో, లగ్జరీ కార్లను ‘లిన్‌కోల్న్’ బ్రాండ్‌తో విక్రయిస్తోంది. కొన్ని విదేశీ కార్ల కంపెనీలనూ కొనుగోలు చేసిన ఈ సంస్థ... జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను మాత్రం టాటాలకు విక్రయించేసింది. జపాన్‌కు చెందిన మజ్దాలో 2.1 శాతం, యూకేకు చెందిన ఆస్టిన్ మార్టిన్‌లో 8 శాతం, చైనాకు చెందిన జింగ్లింగ్లో 49 శాతం వాటా దీనికున్నాయి. దేశంలో గుజరాత్‌లోని సణంద్‌లో ఫోర్డ్ ఇంజిన్, అసెంబ్లింగ్ ప్లాంటుంది. బుగట్టి వేరన్గ్రాండ్ స్పోర్ట్స్ దేశంలో అత్యంత ఖరీదైన కారు ఇది. బుక్ చేశాక డెలివరీకి 6-8 నెలలు పడుతుంది. అది కూడా కస్టమర్ల స్థాయిని బట్టి!!. 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.7 సెకన్లు పడుతుందంటేనే... దీని ప్రత్యేకత అర్థమైపోతుంది. కారులోని ప్రతి అంగుళం ప్రత్యేకమైందే. కార్బన్ ఫైబర్ మోనోకోక్యూతో కారు బాడీ తయారవుతుంది. ⇒ ఖరీదు రూ.38 కోట్లు. ⇒ 8.7 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం దీని సొంతం ⇒ 987 బీహెచ్పీ పవర్ : 6,000 ఆర్పీఎం ⇒ 1,250 ఎన్ఎం టార్క్ : 2,200-5,500 ఆర్పీఎం ⇒ 7 స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ⇒ గరిష్ట వేగం గంటకు 407 కి.మీ. ⇒ మైలేజ్ లీటరుకు సిటీలో 2.3 కి.మీ. - హైవేలో 6.8 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు ఆస్టిన్ మార్టిన్ వాన్క్విష్ ⇒ ధర రూ.3.8 కోట్లు ⇒ ఏఎం 29 వీ12 ఇంజిన్ ⇒ 565 బీహెచ్పీ : 6,750 ఆర్పీఎం ⇒ 620 ఎన్ఎం టార్క్ : 5500 ఆర్పీఎం ⇒ 6 స్పీడ్ గేర్ బాక్స్ ⇒ గరిష్ట వేగం గంటకు 295 కి.మీ. ⇒ జీరో నుంచి 100 కి.మీ.లకు చేరుకోవటానికి పట్టే సమయం 4.3 సెకన్లు ⇒ ఇంధన సామర్థ్యం 78 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 4 కి.మీ., హైవేలో: 8 కి.మీ. రోల్స్ రాయిస్ ఫాంథమ్ సిరీస్-2 ఫాంథమ్ను మొదటిసారి మ్యాగజైన్ల మీద ప్రకటనల్లో కాకుండా నేరుగా చూసినవారెవరైనా... నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఫాంథమ్ పాంథా రోడ్డు మీద వెళ్తుంటే కారు ముందు, వెనక ఇరుసులు రోడ్డును మింగేస్తున్నట్టుగా కనిపిస్తాయి. 5.9 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ⇒ స్టాండర్డ్ వీల్ బేస్ ధర రూ.8 కోట్లు; ఎక్స్టెండెడ్ వీల్ బేస్ ధర రూ.9 కోట్లు ళీ రెండు వర్షన్లూ 6.7 లీటర్ వీ-2 పెట్రోల్ ఇంజిన్. ⇒ 453 బీహెచ్పీ పవర్ : 5,350 ఆర్పీఎం; 720 ఎన్ఎం టార్క్ : 3,500 ఆర్పీఎం ళీ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్; దీని గరిష్ట వేగం గంటకు 240 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్లు; మైలేజీ లీటరుకు సిటీలో: 4.38 కి.మీ.-హైవేలో 9.8 కి.మీ. లంబోర్గిణి అవెంటడార్ మూడు సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ కారు ధర... రూ.5.36 కోట్లు ⇒ 6,498 సీసీ పెట్రోల్ ఇంజిన్ ⇒ 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ ⇒ 690.62 బీహెచ్పీ : 8,250 ఆర్పీఎం ⇒ 690 ఎన్ఎం : 5,500 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 350 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 90 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 3 కి.మీ., హైవేలో 5 కి.మీ. బెంట్లీ ముల్సన్నే దేశంలో పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారు... 100 వేగాన్ని 5.3 సెకన్లలో చేరుకుంటుంది. ⇒ ధర రూ.7.5 కోట్లు. ⇒ 6.8 లీటర్ వీ 8 ఇంజిన్ ట్విన్ టర్బో చార్జ్డ్ ⇒ 505 బీహెచ్పీ : 4,200 ఆర్పీఎం ⇒ 8 స్పీడ్ ఆటో మేటిక్ గేర్ షిఫ్ట్ ⇒ టార్క్ 1,020 ఎన్ఎం : 1,750 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 296 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 96 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 4.3 కి.మీ. ⇒ హైవేలో: 10.1 కి.మీ. బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ మన దేశంలో ఫ్లయింగ్ స్పౌర్.. వీ 8, డబ్ల్యూ 12 వేరియంట్స్ అనే రెండు పెట్రోల్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ⇒ వీ8 ధర రూ.3.2 కోట్లు; 5,988 సీసీ 4 లీటర్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 500 బీహెచ్పీ : 6000 ఆర్పీఎం ⇒ 660 ఎన్ఎం : 1,700 ఆర్పీఎం టార్క్ ⇒ 8 స్పీడ్ ఆటో గేర్ బాక్స్; గరిష్ట వేగం గంటకు 295 కి.మీ. ⇒ 3.2 సెకన్లలో వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 4.5 కి.మీ., హైవేలో 10.2 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 90 లీటర్లు రోల్స్ రాయిస్ రైత్ ⇒ ధర రూ.4.6 కోట్లు ⇒ ట్విన్ టర్బో వీ-12 ఇంజిన్ ⇒ 8 స్పీడ్ ఆటోమేటిక్ జెడ్ఎఫ్ ట్రాన్స్మిషన్ ⇒ 6,592 సీసీ ఇంజిన్ ⇒ 624 బీహెచ్పీ : 5,600 ఆర్పీఎం ⇒ 800 ఎన్ఎం : 1,500-5,000 ఆర్పీఎం ⇒ 100 కి.మీ. వేగాన్ని చేరుకోవటానికి పట్టే సమయం 4.6 సెకన్లు. ⇒ గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.; ఇంధన ట్యాంక్ సామర్థ్యం 83 లీటర్లు ⇒ మైలేజీ లీటరుకు సిటీలో: 4.7 కి.మీ., హైవేలో: 10.2 కి.మీ. పోర్షే 911 టర్బో ఎస్ ⇒ ధర రూ.3 కోట్లు ⇒ బుక్ చేసిన 7-10 నెలల సమయానికి కారు డెలివరీ అవుతుంది. ⇒ 3.1 సెకన్లలో సున్నా నుంచి వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ 3.8 లీటర్ 24 వీ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 560 బీహెచ్పీ : 5,750 ఆర్పీఎం ⇒ 700 ఎన్ఎం టార్క్ : 2,100-4,500 ఆర్పీఎం ⇒ 7 స్పీడ్ గేర్ బాక్స్; గరిష్ట వేగం గంటకు 318 కి.మీ. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 7.46 కి.మీ., హైవేలో 12.8 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 68 లీటర్లు ఫెరారీ కాలిఫోర్నియా ⇒ ధర రూ.3-5 కోట్లు ⇒ ట్విన్ క్లచ్ గేర్ బాక్స్ ⇒ 4.3 లీటర్ వీ8 ఫ్రంట్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 482.7 బీహెచ్పీ : 7,750 ఆర్పీఎం; 505 ఎన్ఎం : 5,000 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 312.2 కి.మీ. ⇒ 7 స్పీడ్ ఆటో షిఫ్ట్‌తో మాన్యువల్ గేర్స్/ఆటోమేటిక్ రెండూ ఉంటాయిందులో. ⇒ 3.7 సెకన్లలో వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 4.32 కి.మీ., హైవేలో 7.75 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 73 లీటర్లు గమనిక: బీహెచ్పీ: బ్రేక్ హార్స్ పవర్; ఆర్పీఎం: రివల్యూషన్స్ పర్ మినట్; ఎన్ఎం: నానో మీటర్; టార్క్: ఫోర్స్ (బలం); భారతదేశంలో కార్ల కోసం అత్యధికులు పెట్టే బడ్జెట్ రూ.10 లక్షల లోపే. అందుకే ప్రతి కంపేని ఈ సెగ్మెంట్లోనే మోడళ్లను తెస్తోంది. వాటి పోటీ కూడా ఈ సెగ్మెంట్లోనే. మారుతీ, హ్యుందాయ్, టాటా. రెనో, నిస్సాన్, షెవర్లే, హోండా, ఫోర్డ్, ఫోక్స్‌వ్యాగన్, టొయోటా.. ఇలా అన్ని కంపెనీల పోరూ ఈ సెగ్మెంట్లోనే. కాకపోతే మారుతీ, హ్యుదాయ్, టాటాల వాటా ఎక్కువ. రూ.10లక్షల లోపు మోడళ్ల ఫీచర్లు, మైలేజీ తదితర వివరాలను చూస్తే... -
ఏ బైక్ కొందాం?
ఏ బైక్ కొందాం? బైక్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరి మనసులోనూ మొదట మెదిలే ప్రశ్న ఇదే. కొందరైతే తమ స్నేహితుల్ని అడుగుతారు. ఇంకొందరైతే బంధువుల్ని అడుగుతారు. మరికొందరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు. సమీక్షలు చదువుతారు... వివిధ బైక్‌ల ప్రకటనలు చూస్తారు. కాకపోతే విచిత్రమేంటంటే ఎంత ఎక్కువ చూస్తే అంత ఎక్కువగా అయోమయంలో పడతారు. ఎందుకంటే అన్ని బైక్‌లూ బాగానే ఉంటాయి. ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. మరేం చెయ్యాలి? బైక్ కొనేటపుడు చూడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ధర... మైలేజీ... ఫీచర్స్... లుక్. వీటిలో కూడా ఎవరి అవసరాలు వారివి. బడ్జెట్లో కొనాలనుకున్న వారు ధర చూస్తారు. ఎక్కువ తిరిగేవారు మైలేజీ చూస్తారు. కాస్త స్టైల్ కోరుకునే కుర్రకారు లుక్, ఫీచర్లు చూస్తారు. ఇక్కడ ఎవరి చాయిస్ వారిదే. అందుకే ఇపుడు దేశంలో అత్యధిక మైలేజీతో జనాదరణ పొందిన బైక్‌లపై ఈ ప్రత్యేక కథనం... ♦ మైలేజీయే ప్రధానాస్త్రంగా మార్కెట్లోకి కొత్త బైక్‌లు ♦ హీరో, బజాజ్, టీవీఎస్... అన్ని కంపెనీలదీ ఇదే రూటు ♦ స్ల్పెండర్ ఐస్మార్ట్ నుంచి ప్యాషన్ ప్రొ వరకూ అన్నీ దీన్లో కింగ్లే ♦ తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ బైక్‌లతో బజాజ్ పోటీ ♦ డిజైన్, ధరతో కూడా ఆకట్టుకుంటున్న టీవీఎస్ ♦ మైలేజీ, ధర, ఫీచర్లు, లుక్‌లో దేనికదే సాటి... హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 102.5 కిలోమీటర్లు/లీటర్ ధర - 52,008 దేశంలో అత్యధిక మైలేజ్‌ను ఇచ్చే బైక్ ఇది. లీటరుకు 102.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్న ఈ బైక్... దేశీ టూవీలర్ మార్కెట్ దిగ్గజం ‘హీరో మోటోకార్ప్’ ఉత్పాదన. కంపెనీ ఈ బైక్‌లో వినూత్న ఐ3ఎస్ టెక్నాలజీని ఉపయోగించింది. అంతేకాదు!! క్లచ్ పట్టుకుంటే చాలు. బైక్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ బటన్, కిక్రాడ్తో పని లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీ ప్రాంతాలకిది అనువుగా ఉంటుంది. ఎయిర్‌కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ వాడటం వల్ల ఈ మైలేజీ ఇస్తోంది. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. ట్యాంక్‌లో 8.7 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. బజాజ్ సీటీ 100 ఇంజిన్ - 99.27 సీసీ మైలేజ్ - 99.1 కిలోమీటర్లు/లీటర్ ధర - 39,389 తక్కువ ధరలోనే దేశీ దిగ్గజ టూవీలర్ కంపెనీ ‘బజాజ్ ఆటో’ అందిస్తున్న మైలేజ్ బైక్ ఇది. ఐస్మార్ట్ రాక ముందువరకూ దేశంలో అత్యధిక మైలేజీ బైక్ ట్యాగ్ దీనిదే. ఇపుడు మైలేజీలో రెండో స్థానానికి చేరింది. ఇందులో 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్‌కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బైక్... ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 8.05 ఎన్ఎం-4,500 ఆర్పీఎం. బజాజ్ ప్లాటినా ఈఎస్ ఇంజిన్ - 102 సీసీ మైలేజ్ - 96.9 కిలోమీటర్లు/లీటర్ ధర - 46,230 బజాజ్ ఆటో బైక్‌ల శ్రేణిలో మైలేజీలో రెండో స్థానంలో ఉన్న బైక్ ఇది. లీటరుకు 96.9 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇచ్చే ఈ బైక్‌లో అడ్వాన్స్డ్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ డీటీఎస్ -ఐ ఇంజిన్‌ను అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ప్లాటినా ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 8.6 ఎన్ఎం-5,000 ఆర్పీఎం. టీవీఎస్ స్పోర్ట్ ఇంజిన్ - 99.77 సీసీ మైలేజ్ - 95 కిలోమీటర్లు/లీటర్ ధర - 44,140 ‘టీవీఎస్ మోటార్’ కంపెనీ అందిస్తున్న బైకుల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్ ఇదే. లీటరుకు 95 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కంపెనీ ఈ బైక్‌లో 4 స్ట్రోక్ డ్యూరాలైఫ్ ఇంజిన్‌ను పొందుపరిచింది. ఇంజిన్ పవర్ 7.8 పీఎస్-7,500 ఆర్పీఎం. టార్క్ 7.8 ఎన్ఎం-5,500 ఆర్పీఎం. ఆకట్టుకునే డిజైన్ ఈ బైక్ సొంతం. స్పోర్ట్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 12 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో స్ల్పెండర్ ప్రొ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్ ధర - 50,500 హీరో మోటొకార్ప్ తయారీ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది దగ్గర ఈ బైక్‌ను మనం గమనిస్తూనే ఉంటాం. అధిక సంఖ్యాక ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న బైక్... బహుశా ఇదే అనొచ్చేమో. లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఎకో ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 48,336 హీరో మోటోకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను వాడారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో స్ల్పెండర్ ప్రొ క్లాసిక్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్ ధర - 51,300 హీరో మోటోకార్ప్ అందిస్తోన్న మరో మైలేజీ బైక్ స్ల్పెండర్ ప్రొ క్లాసిక్. ఇది లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11లీటర్ల పెట్రోల్ పడుతుంది. ప్రత్యేకమైన డిజైన్ ఈ బైక్ సొంతం. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 46,318 హీరో మోటొకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్యూ-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో ప్యాషన్ ప్రొ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 87.37 కిలోమీటర్లు/లీటర్ ధర - 52,400 హీరో మోటొకార్ప్ నుంచి వచ్చిన మరో బైక్ ఇది. లీటరుకు 87.37 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 12.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. హీరో హెచ్ఎఫ్ డాన్ ఇంజిన్ - 97.2 సీసీ మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్ ధర - 40,070 ఇది కూడా దేశీ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఉత్పాదనే. ఇది లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్పీఎం. టార్క్-8.05 ఎన్ఎం-5000 ఆర్పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. గమనిక పైన పేర్కొన్న మైలేజీలు... సెంట్రల్ మోటార్ వె హికల్ రూల్స్(సీఎంవీఆర్)ను అనుసరించి ప్రత్యేక పరీక్షల్లో నిర్ధారించినవి. రోడ్డుపై వాస్తవంగా వచ్చే మైలేజీకి కొంత తేడా ఉంటుంది. ఈ తేడా మామూలు ట్రాఫిక్‌లో 20% వరకూ తక్కువ ఉండే అవకాశము ఉంటుంది.అమ్మకాల్లో టాప్-10 స్కూటర్లు... నిజానికి దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో బైక్‌ల వాటాయే ఎక్కువ. కాకపోతే ఐదేళ్లుగా స్కూటర్ల వాటా మెల్లగా పెరుగుతూ వస్తోంది. 2015-16లో స్కూటర్ల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా 50 లక్షల యూనిట్ల మార్కును దాటి 50,31,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో 24.66 లక్షల యూనిట్ల విక్రయాలతో హోండా యాక్టివా టాప్‌లో నిలిచింది. ఇక టీవీఎస్ జూపిటర్ అనూహ్యంగా హీరో మాస్ట్రోను ఓవర్ టేక్ చేసి 5.37 లక్షల యూనిట్లతో రెండో స్థానానికి చేరింది. మాస్ట్రో 4.98 లక్షల యూనిట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో హోండా డియో, హీరో ప్లెజర్, సుజుకి యాక్సెస్, యమహా ఫాసినో, హీరో డ్యూయట్, హోండా ఏవియేటర్, యమహా రే టాప్-10 జాబితాలో చోటు సంపాదించాయి. 2015 మే నెలలో ఆవిష్కరించిన ఫాసినో నాలుగు నెలల్లోనే 1 లక్ష యూనిట్ల మార్కును దాటి.. యమహాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. భారత్‌లో కార్ల మార్కెట్ అంతకంతకూ పుంజుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని కార్ల కంపెనీలూ కొత్తకొత్త మోడల్స్‌ను విడుదల చేసేందుకు పోటీపడుతున్నాయి. మరి ఇన్నిరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారతీయ కస్టమర్లు కారు కొనే ముందు మైలేజీ, డిజైన్, కంపెనీ బ్రాండ్ ఇలా దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ కార్లు.. వాటి ప్రత్యేకతలు ఏంటి? అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కార్ల ప్రియులను కట్టిపడేస్తున్న లగ్జరీ కార్ల విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వచ్చే వారం ప్రాఫిట్ ప్లస్‌లో ఇవన్నీ మీ కోసం ప్రత్యేకం. సో.. గెట్ సెట్.. వెయిట్! -
ఇల్లు మారుతున్నారా?
బదిలీల వేళ... ప్రత్యేక కథనం.. బదిలీల కాలం షురూ అయింది. స్కూళ్లు తిరిగి తెరిచేలోపల బదిలీ అయిన చోట స్థిరపడాలన్నది ఉద్యోగుల ఉద్దేశం. అందుకోసం ఇల్లు వెతుక్కోవటం, సరైనది ఎంచుకుని అడ్వాన్సివ్వటం అన్నీ ఒకెత్తయితే... ఉన్న ఇంటి నుంచి ఆ ఇంటికి సామాన్లు చేరవేయటం, అక్కడ సర్దుకోవటం మరో ఎత్తు. ఉన్న ఊళ్లోనే ఒక చోటి నుంచి మరో చోటికి... ఒక ఊరి నుంచి మరో ఊరికి... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి... ఇలా దూరం పెరిగేకొద్దీ కష్టాలూ పెరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి ఏ అమరావతికో వెళ్లాలంటే రాష్ట్రం మారినట్లే. కాకపోతే వాహనాల రిజిస్ట్రేషన్ మార్చాల్సిన అవసరం లేకపోవటం వంటి అంశాలు కలిసొస్తాయి. ఇతర రాష్ట్రాలు అయితే ఈ కష్టాలూ తోడవుతాయి. ఈ నేపథ్యంలో... ఇల్లు మారేటపుడు టెక్నాలజీని ఎలా వాడుకోవాలి? ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాల్ని వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం * సరైన ప్యాకర్స్ను వెతకటంతో పని షురూ * గ్యాస్ నుంచి బ్యాంకు ఖాతా వరకూ బదిలీ తప్పనిసరి * చాలా పనులు ఆన్లైన్లోనే ముగించుకోవచ్చు రవి ఇటీవలే బదిలీ అయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి మారాడు. రవి అనుభవం ఆయన మాటల్లోనే... ‘‘మొదట ఇల్లు, పాపకు స్కూలు చూసుకున్నా. తరవాత బాగా తెలిసిన ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ను సంప్రదించా. వారు నా వ్యాగన్-ఆర్ కారుతో కలిపి ఫర్నిచర్ అంతటినీ మొదట అంచనా వేసుకుని... 24 గంటల్లో తర లించేశారు. చార్జీలు రూ.35 వేల వరకూ అయ్యాయి. కొత్త ప్రాంతానికి వచ్చాక మొబైల్ నంబరు మార్చలేదు. బ్యాంకు, పెట్టుబడులు, బీమా సంస్థల మార్పు సులభంగా జరిగింది. కానీ కొంత సమయం పట్టింది. బ్యాంకులో అడ్రస్‌ను అప్డేట్ చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా లోన్ పొందవచ్చు’’ అయితే దీనికోసం ముందుగా రవి ఏమేం చూసుకున్నాడో తెలుసా...!! ఎంపిక: సామాన్లను భద్రంగా చేరవేయడానికి మొదట నమ్మకమైన ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థను ఎంచుకోవాలి. తెలిసిన సంస్థో, మిత్రులు రిఫర్ చేసిన సంస్థో అయితే చార్జీలు, భద్రత విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. చార్జీలు: సామాన్లు తరలించటమే ప్రధానం. అసలు కొత్త ఇంటికయ్యే అద్దె, పిల్లల స్కూల్ అడ్మిషన్ చార్జీలు వంటి వాటికంటే సామగ్రిని తరలించడానికయ్యే మొత్తమే కాస్త ఎక్కువగా ఉంటుంది. తరలింపునకయ్యే ఖర్చుల్లో ప్రధానంగా 60-70 శాతం రవాణాకు, 20-25 శాతం ప్యాకింగ్‌కు, మిగతాది సామాన్లను లోడ్, అన్లోడ్ చేయడానికి, కొత్త ఇంట్లో సర్దడానికి అవుతుంది. ఉంటున్న నగరం పరిధిలోనే మారితే రవాణా ఖర్చు 80 శాతం ఉంటుంది. ప్యాకింగ్ ఖర్చు తగ్గుతుంది. సున్నితమైన వస్తువులుంటే మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తువుల పరిమాణం, తరలించాల్సిన దూరం బట్టి సిటీ పరిధిలో అయితే సగటున రూ.6 వేల దాకా అవుతుంది. వేరే ప్రాంతాలకైతే రూ.35 వేలపైనే అవుతుంది. అనుకోని కారణాల రీత్యా తరలింపు సమయంలో ప్రమాదం జరిగితే బీమా వెసులుబాటు కూడా ఉంది. అన్ని రకాల ఘటనలకూ వర్తించే ఈ బీమా ఆప్షనల్ మాత్రమే. కటింగ్ ధర: ఇల్లు మారేటపుడు వ్యయమే ప్రధాన సమస్య. అవసరంలేని పాత ఫర్నిచర్‌ను అమ్మేయటం ద్వారా సమస్య కొంత తీరుతుంది. పాత ఇనుము, స్టీలును విక్రయించినా కొంత సొమ్ము వస్తుంది. దీనివల్ల ఫర్నిచర్ తరలించటానికి మొత్తం ట్రక్కును బుక్ చేసుకోవాల్సిన పనిలేదు. ఉన్న కొద్ది సామగ్రిని వేరొక భాగస్వామితో కలిసి తరలించొచ్చు. ‘‘ కానీ షేరింగ్ వల్ల ఫర్నిచర్‌ను చేరవేయడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు ఢిల్లీ-ముంబై మధ్య రవాణాకు నాలుగు రోజుల సమయం పడితే, షేరింగ్ వల్ల అదే దూరానికి 10-12 రోజుల సమయం పడుతుంది’’ అని పీఎం రీలొకేషన్స్ సీఈవో, చైర్మన్ ఆకాంక్ష భార్గవ చెప్పారు. వారాంతపు రోజుల్లో కంటే వారం మధ్యలో రవాణాకు కొన్ని సంస్థలు తక్కువ చార్జీ వసూలు చేస్తున్నాయి. నెలలో చివరి శనివారమైతే బుకింగ్‌లు ఎక్కువగా ఉంటాయి కనక చార్జీలూ అధికంగానే ఉంటాయి. బ్యాంకింగ్, పెట్టుబడులు, బీమా: క్రెడిట్ కార్డుంటే కంపెనీకి అడ్రస్ మారుతున్నట్లు తెలియజేయాలి. బ్యాంకయితే హోం బ్రాంచ్‌ను మార్చాల్సిందిగా సంబంధిత బ్యాంకు అధికారులను కోరాలి. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది తప్పనిసరి. సొంత బ్రాంచ్‌కి వెళ్లి మారుతున్న అడ్రస్ వివరాలు వెల్లడిస్తే చాలు. పెట్టుబడులు, బీమాలకైతే సంబంధిత సంస్థలకు నూతన అడ్రస్ పత్రాలను అందించాలి. మొబైల్ ఫోన్, డీటీహెచ్: వేరే రాష్ట్రానికి మొబైల్ నంబరు మార్చాలనుకుంటే ముందు బకాయిలు చెల్లించి, సర్వీసు ప్రొవైడర్‌కు వెరిఫికేషన్ కోసం అడ్రస్, ఇతర పత్రాలను అందజేయాలి. కొత్త సిటీకి నంబరు మారడానికి కొంత సమయం పడుతుంది. ఇదే విధంగా డీటీహెచ్ ను కూడా తరలించవచ్చు. కనెక్షన్ తొలగించటానికైనా, కొత్త కనెక్షన్ కోసమైనా రూ.300-400 ఖర్చు అవుతుంది. మరి కారు తీసుకెళ్లాలంటే...? కార్లను డ్రైవ్ చెయ్యకుండా రవాణా చేసుకోవాలంటే ఆ అవకాశమూ ఉంటుంది. అయితే ఎస్యూవీలకైతే ఉదాహరణకు బెంగళూరు- ఢిల్లీ మధ్య తరలించ టానికి రూ.18-20 వేలు ఖర్చవుతుంది. చిన్న కార్లకైతే రూ.10-13 వేలు వ్యయమవుతుంది. అయితే రాష్ట్రం మారినపుడు ఆ వాహనాన్ని స్థానిక ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఇదంతా గజిబిజి ప్రక్రియ. దానికంటే వాహనాన్ని అమ్మేయడమే ఉత్తమం. ఒకవేళ కారు గనక రుణం తీసుకుని కొన్నదైతే... రెండు, మూడేళ్ల కన్నా పాతదైతే ఎంట్రీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వంటి అదనపు పన్నులు చెల్లించాలి. మహారాష్ట్ర వంటి చోట్లయితే 8 రకాల పన్నులు వసూలు చేస్తారు. అత్యవసర సామగ్రి వంట గ్యాస్‌కు సంబంధించి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉంటే తొలగించాలి. అలా తొలగించినపుడు బకాయిలన్నీ చెల్లించి... సదరు కంపెనీ దగ్గర లిఖితపూర్వకంగా రసీదు తీసుకోవాలి. ఒకవేళ సిలిండర్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ అయితే... ఒరిజినల్ సబ్ స్క్రిప్షన్ వోచర్‌తో పాటు రెగ్యులేటర్, సిలిండర్‌ను అప్పటిదాకా సిలిండర్ ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్‌కు అందజేయాలి. టెర్మినేషన్ వోచర్, రిఫండబుల్ డి పాజిట్ రూ.1,450 వెనక్కి తీసుకోవాలి. కొత్త ప్రాంతంలో సదరు టెర్మినేషన్ వోచర్‌ను, అడ్రస్ వివరాలను స్థానిక పంపిణీదారుడికి అందజేయాలి. సెక్యూరిటీ కోసం మళ్లీ రూ. 1,450 , రెగ్యులేటర్ కోసం రూ. 150 చెల్లించి గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. -
పింఛను కావాలా..?
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటే... పింఛనుతో కూడిన భరోసా! ఈ పెన్షన్ ఉంటుందనే ప్రభుత్వోద్యోగం కోసం ఏళ్లపాటు ఎడతెగని ప్రయత్నాలు చేసేవారు. మరిప్పుడు..? ఉద్యోగస్తులు మాత్రమే కాదు. ఎవరైనా పెన్షన్ తీసుకోవచ్చు. అది కూడా 58 ఏళ్లో, 60 ఏళ్లో దాటాక... అదికూడా రిటైరయ్యాక మాత్రమే కాదు. 45 ఏళ్లు దాటాక కూడా కావాలంటే పెన్షన్ తీసుకోవటానికి కొన్ని పథకాలున్నాయి. కాస్త ప్లానింగ్ ఉండి.. మొదటి నుంచీ పొదుపు పాటిస్తే... రిటైర్మెంట్ వయసు దాటాక జీతం కన్నా ఎక్కువ పెన్షన్ కూడా తీసుకోవచ్చు. అందుకు ఏఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి? వాటి నిబంధనలేంటి? రాబడులెలా ఉంటాయి? అనే వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... ఈపీఎఫ్, పీపీఎఫ్‌లతో పాటు పలు మార్గాలు ♦ పన్ను మినహాయింపులతో ఆకర్షణీయంగా ఎన్పీఎస్ ♦ బీమా పథకాలు, మ్యూచ్‌వల్ ఫండ్స్తోనూ పెన్షన్ ♦ మునుపటిలానే ఈపీఎఫ్‌కు పన్ను మినహాయింపులు పెన్షన్ కోసం దేశంలో అందుబాటులో చాలా పథకాలున్నప్పటికీ...90 శాతం మందికి పైగా ఎంచుకుంటున్నవి మాత్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లే. ఇవికాక బీమా పథకాలు, మ్యూచువల్ పెన్షన్ ఫండ్స్ కూడా పెన్షన్ అందిస్తుంటాయి. కానీ వీటిలో పెట్టుబడి పెట్టడానికి, వీటిపై వచ్చే రాబడులకు ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. కొన్ని పథకాల్లో వెనక్కి తీసుకునే మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తే, కొన్ని పథకాలు పన్ను లేని ఆదాయాన్నిస్తాయి. ⇒ ఈపీఎఫ్, పీపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై ఎలాంటి పన్నూ లేదు. ⇒ బీమా పింఛను పథకాల నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతానికే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ⇒ ఎన్పీఎస్ నుంచి తీసుకునే మొత్తంపై మొన్నటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈపీఎఫ్‌పై అసలు పన్ను లేకపోవడం, ఎన్పీఎస్కు పూర్తిగా పన్ను చెల్లించాల్సి రావటంతో... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొన్నటి బడ్జెట్లో ఎన్పీఎస్ నుంచి తీసుకునే మొత్తంలో 40 శాతానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మరోవంక ఈపీఎఫ్‌కు కూడా మొత్తానికి మినహాయింపును తీసేసి 40%కే మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. దీనిపై ఉద్యోగ కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి... ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈపీఎఫ్‌లో పాత నిబంధనలే.. ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ అంటే తెలుసు. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థ విధిగా పీఎఫ్ పథకాన్ని అమలు చేయాలి. దీని ప్రకారం జీతంలో ( బేసిక్ శాలరీ + డీఏ) 12 శాతాన్ని ఉద్యోగి చెల్లిస్తే... మరో 12 శాతాన్ని సంస్థ జమచేయాలి. సంస్థ జమచేసే మొత్తంలో 8.3 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలోకి వెళుతుంది. మిగిలిన మొత్తం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. అయితే 2014 వరకూ పీఎఫ్ ఖాతాలో చేరడానికి గరిష్ఠ జీతం పరిమితి రూ.6,500గా ఉండేది. దీనికన్నా జీతం ఎక్కువ ఉన్నా సరే... చట్టప్రకారం ఈ మొత్తంలో 12 శాతాన్ని (అంటే రూ.780) పీఎఫ్ ఖాతాకు జమ చేస్తే చాలు. కాకపోతే 2014 సెప్టెంబర్‌లో ఈ పరిమితిని రూ.15,000కు పెంచారు. దీన్లో 12 శాతం... అంటే రూ.1,800 కనీసం జమ చేయాలి. ఇంకా ఎక్కువ జీతం ఉన్న పక్షంలో... ఉద్యోగి, సంస్థ ఇష్టపూర్వకంగా మరింత మొత్తాన్ని కూడా ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయొచ్చు. ఇలా కేటాయించిన అదనపు మొత్తంపై కూడా ఇదే వడ్డీ రేటు, పన్ను రాయితీలు లభిస్తాయి. దీన్లో వలంటరీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అయితే వరసగా ఐదేళ్ల పాటు పనిచేసిన వారికి మాత్రమే పెన్షన్ లభిస్తుంది. ⇒ పీఎఫ్‌లో ప్రస్తుతం నెలకు జమ చేయాల్సిన కనీస మొత్తం రూ.1800 + 1800 ⇒ 2015-16 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీని ఇస్తున్నారు. ⇒ ఈపీఎఫ్‌కు జమచేసే మొత్తానికి కూడా ఏటా పన్ను మినహాయింపు ఉంటుంది. ⇒ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈపీఎఫ్ నుంచి... అత్యవసర సందర్భాల్లో డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం, రుణం చెల్లింపులు, ఇంటి రిపేర్లకు, పిల్లల చదువు, పెళ్ళి, వైద్య ఖర్చులు, ప్రకృతివైపరీత్యాల వలన నష్టాలు సంభవించినప్పుడు... నిబంధనలు అనుసరించి ఈపీఎఫ్ సొమ్మును వినియోగించుకోవచ్చు. ఇలా వెనక్కి తీసుకునే మొత్తంపై ఇకపై కూడా మునుపటిలానే పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈపీఎఫ్ ద్వారా వచ్చే నెలవారీ పింఛను చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈపీఎఫ్‌లో జమ చేసిన నిధితో యాన్యుటీ పథకాలను కొనుగోలు చేసి... మరింత పెన్షన్ పొందవచ్చు. అందరికీ అందుబాటులో... పీపీఎఫ్ ⇒ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్... ఉద్యోగస్తులే కాక ఎవరైనా పీపీఎఫ్‌లో ఖాతా తెరవవచ్చు. ⇒ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉండే పీపీఎఫ్ కాలపరిమితి 15 ఏళ్లు. ⇒ పెట్టుబడిపై ఏటా పన్ను మినహాయింపులుంటాయి; మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ఫ్రీనే. ⇒ పీపీఎఫ్‌లో ఏడాదికి రూ.500 నుంచి రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ⇒ పిల్లల పేరిట కూడా ఖాతా తెరవొచ్చు. 15 ఏళ్లు దాటాక మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు కూడా. ⇒ ఏడేళ్ల వరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తం నుంచి వెనక్కి తీసుకోలేము. ⇒ ఏడేళ్ళ తర్వాత ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకోవచ్చు. ప్రసుత్త వడ్డీ 8.7 శాతం. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పథకమే కాని పెన్షన్ అందించేది కాదు. పీపీఎఫ్ అకౌంట్ కాలపరిమితి తర్వాత వచ్చే మెచ్యూర్టీ మొత్తంతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా పెన్షన్ పొందవచ్చు. మరింత ఆకర్షణీయంగా ఎన్పీఎస్ సామాజిక భద్రతలో భాగంగా అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 2004లో న్యూ పెన్షన్ సిస్టమ్‌ను (ఎన్పీఎస్) ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్లో దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు. గతేడాది బడ్జెట్లో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద అదనంగా రూ.50,000 పన్ను రాయితీనిచ్చారు. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల పన్ను మినహాయింపులకు అదనం. ఇప్పటిదాకా ఈ పథకం నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై వారి వ్యక్తిగత ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వచ్చేది. వచ్చే ఏడాది నుంచి ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతం వరకు ఎలాంటి పన్ను ఉండదని తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. ⇒ 18-55 సంవత్సరాల మధ్య ఈ పథకంలో చేరవచ్చు. ⇒ ఇది కూడా ఫండ్ పథకాల మాదిరే పనిచేస్తుంది. ⇒ దీనికి జమయ్యే మొత్తాన్ని ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ⇒ ఎన్పీఎస్ ఫండ్స్‌ను ఎస్బీఐ, ఐసీఐసీఐ, యూటీఐ, రిలయన్స్, ఐడీఎఫ్సీ, కోటక్ మహీంద్రాలు నిర్వహిస్తున్నాయి. ⇒ ఈ ఫండ్స్ మూడు రకాలు. అధిక రిస్క్ ఉండే ఈక్విటీ ఫండ్‌లో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ⇒ రిస్క్ సామర్థ్యం ఆధారంగా నచ్చిన ఫండ్ మేనేజర్‌ను, ఫండ్‌ను మీరే ఎంచుకోవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.6,000. దీన్ని నాలుగు దఫాల్లో చెల్లించవచ్చు. కనీస వాయిదా రూ.500. ⇒ ఇందులో టైర్-1, టైర్-2 ఖాతాలుంటాయి. టైర్-1లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని 60 ఏళ్లు దాటాకే తీసుకోవాలి. ⇒ 60 ఏళ్ల తరవాత వచ్చే మొత్తంలో కనీసం 80% యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ⇒ టైర్-2లో అవసరమైనప్పుడు కనీసం 2వేలు ఉంచి మిగిలిన మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. ⇒ ఎవరైనా ఎన్‌పీఎస్‌లో ఖాతా తెరవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు, 60 ఏళ్లు దాటాక పెన్షన్ పొందవచ్చు. బీమాతోనూ పింఛన్ పొందొచ్చు.. బీమా కంపెనీలు అందిస్తున్న పెన్షన్ పథకాల్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. మొదటివి సాంప్రదాయ పెన్షన్ పథకాలు; రెండో రకం యూనిట్ ఆథారిత బీమా పథకాలు. సాంప్రదాయ పెన్షన్ పథకాలు స్థిరమైన రాబడినిస్తాయి. అదే యులిప్స్ పథకాల రాబడులైతే స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. ⇒ ఈ 2 పథకాల్లోనూ పాలసీ వ్యవధి మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. ⇒ రిటైరయ్యాక ఎంచుకున్న కాలానికి పెన్షన్‌ను అందిస్తాయి. ⇒ మెచ్యూరిటీ మొత్తంలో గరిష్టంగా 25-33% ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. ⇒ 33% వరకూ పన్నుండదు. ⇒ మిగిలినదాంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. ⇒ మిగిలిన బీమా పథకాలతో పోలిస్తే వీటిలో మోర్టాలిటీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు తక్కువ. ⇒ చాలా బీమా కంపెనీలు 45 ఏళ్లు దాటితే యాన్యుటీ ప్లాన్‌కు అనుమతిస్తున్నాయి. అంటే 45 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చన్న మాట. ⇒ పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ⇒ పెన్షన్‌గా వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. మిగిలిన పథకాలతో పోలిస్తే బీమా పెన్షన్ పథకాల రాబడి చాలా తక్కువ. కేవలం 6-7 శాతం రాబడులు మాత్రమే అందిస్తాయి. బీమా రక్షణతో పాటు పెన్షన్ కావాలనుకునే వారు వీటికేసి చూడొచ్చు. యాన్యుటీ అంటే... పైన పేర్కొన్నవన్నీ పెన్షన్ పథకాలే. కానీ ఇవి నిజంగా పెన్షన్ ఇవ్వవు. పింఛన్ కోసం నిధిని సమకూర్చుకోవడానికి పనికొస్తాయి. ఇలా సమకూర్చుకున్న నిధిని యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా పింఛను పొందొచ్చు. పెన్షన్ పథకం తీసుకున్న దగ్గరే యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవాలన్న నిబంధనేమీ లేదు. పెన్షన్ పాలసీ గడువు ముగిశాక మీకు నచ్చిన కంపెనీకి చెందిన యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవచ్చు. చేతికి ఎంత పెన్షన్ వస్తుందనే విషయం మీరు ఎంత కాలానికి పెన్షన్ కావాలనుకుంటున్నారు? మీ తదనంతరం మీపై ఆధారపడిన వారికి కూడా పెన్షన్ కావాలనుకుంటున్నారా? అన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయ్... ⇒ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే కేవలం నాలుగు పెన్షన్ ఫండ్లే అందుబాటులో ఉన్నాయి. ⇒ పదేళ్లుగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. ⇒ ఈ మధ్య రిలయన్స్ సంస్థ రిటైర్మెంట్ ఫండ్‌ను, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టాయి. ⇒ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఫండ్ విభాగంలోకి వస్తాయి. ఈక్విటీల్లో 40 శాతం, డెట్ పథకాల్లో 60 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ⇒ ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాలి. ⇒ వీటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. ⇒ వీటి లాకిన్ పిరియడ్ మూడు నుంచి ఐదేళ్లుగా ఉంది. గడిచిన పదేళ్లలో ఈ ఫండ్స్ 9 నుంచి 10 శాతం వార్షిక సగటు రాబడుల్ని అందించాయి. ఎన్‌పీఎస్‌తో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చులు ఎక్కువ. ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. కానీ వీటి నుంచి వెనక్కి తీసుకున్న మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనాలన్న నిబంధన ఏమీ లేదు. అలాగే ఇవి అందించే రాబడులపై ఎటువంటి పన్ను భారం ఉండదు. -
ఈ షేర్లు నిజంగా చౌకేనా?
బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతున్న షేర్లు ♦ పీఎస్‌యూ బ్యాంకులన్నిటిదీ అదే తీరు ♦ మెటల్స్, ఇన్ఫ్రా, హౌసింగ్ షేర్లదీ అదే బాట ♦ పతనాన్ని తప్పించుకున్న కొన్ని ప్రైవేటు బ్యాంకులు ♦ అన్నిటినీ బుక్ వ్యాల్యూతోనే అంచనా వేయొద్దు: నిపుణులు సాక్షి, బిజినెస్ విభాగం: ఈ మధ్య స్టాక్ మార్కెట్ పతనం మామూలుగా లేదు. సెన్సెక్స్, నిఫ్టీలు వాటి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే ఏకంగా 20 శాతానికిపైగా పతనమై బేర్ మార్కెట్లోకి జారిపోయాయి. ప్రతి పతనం కొనుగోళ్లకు గొప్ప అవకాశమని చెబుతారు తెలివైన ఇన్వెస్టర్లు. ఇతర ఇన్వెస్టర్లకు భిన్నంగా వారు మార్కెట్లు తక్కువ స్థాయిలో ఉన్నపుడే షేర్లు కొంటారు. పెరుగుతున్నపుడు అమ్మేసి లాభాలు సంపాదిస్తారు. కానీ అందరూ ఇలా చేయలేరు. ఒకవేళ మార్కెట్లు తక్కువ స్థాయిలో ఉన్నా మనం కొన్న షేర్లు పెరగాలని లేదు కదా? అలాంటి పరిస్థితుల్లో ఏ షేర్లు కొంటే మంచిది? మంచి షేర్లను కనిపెట్టడమెలా? ఇలా ఆలోచించేవారు ప్రధానంగా చూసే అంశాల్లో బుక్‌వ్యాల్యూ ఒకటి. ప్రస్తుతం బ్యాంకులు, లోహ షేర్లు, ఇన్ఫ్రా- రియల్టీ షేర్లు వాటి బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతున్నాయి. అసలు బుక్ వ్యాల్యూ అంటే ఏంటి? ఈ రంగాల షేర్లు ఎందుకు బుక్‌వ్యాల్యూ కన్నా తక్కువకు ట్రేడవుతున్నాయి? మున్ముందు ఈ షేర్ల పరిస్థితేంటి? ఇపుడు వీటిని కొనొచ్చా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... ఏడాది కిందట రూ.300పైగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఇపుడు అందులో సగం ధరకే దొరుకుతోంది. పతనానికి ఇది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. ఇదే కాదు. స్టాక్ మార్కెట్లో మొత్తం 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు లిస్టవగా... వాటిలో ఒక్కటి కూడా వాటి పుస్తక విలువకన్నా ఎక్కువకు ట్రేడ్ కావటం లేదు. ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం కొన్ని బుక్‌వ్యాల్యూ కన్నా ఎక్కువ ధరకే ట్రేడవుతున్నాయి. ఇక లోహ, రియల్టీ, ఇన్ఫ్రా, హౌసింగ్ రంగాలదీ అదే పరిస్థితి. నిజానికి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చాలా రంగాల పనితీరు పేలవంగా ఉంది. ఈ పతనానికి కారణాలేంటి? షేరు ధర దాని పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడవటానికి కారణాలు చాలా ఉంటాయి. కంపెనీ భవిష్యత్ పట్ల ఇన్వెస్టర్లకు విశ్వాసం లోపించడం ప్రధాన కారణం. కంపెనీ పనితీరు బాగోదన్న అంచనాలతో దాని షేరు పడిపోయి పుస్తక విలువకన్నా తక్కువకు ట్రేడవుతుంది. కం పెనీ తన పుస్తక విలువను పెంచుకోవడానికి ఖాతాల్లో కొన్ని విధానాల్ని అవలంబిస్తున్నదన్న ఇన్వెస్టర్ల అంచనాలూ షేరు ధర పుస్తక విలువకంటే తక్కువ ఉండటానికి మరో కారణం. కొన్ని సందర్భాల్లో ఆ కంపెనీ తాలూకు రంగం బాగులేనట్లయితే... ఆ కంపెనీ పనితీరు బాగున్నా సరే షేరు విలువ తక్కువే ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు, మెటల్స్, ఇన్ఫ్రా, రియల్ట్లీ షేర్లు.. కంపెనీల పనితీరుతో సంబంధం లేకుండా పుస్తక విలువకంటే దిగువకు రావటానికి కారణమిదే. అన్నింటిలో విలువ ఉన్నట్లేనా?.... సాధారణంగా బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకు ట్రేడవుతున్న షేర్లను ఫండమెంటల్స్ ప్రకారం చౌకగా పరిగణి స్తారు. ఈ సూత్రాన్ని రెండు, మూడు దశాబ్దాల క్రితం అన్ని షేర్లకూ వర్తింపచేసేవారు. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ప్రవేశించకముందు చాలా షేర్ల విలువలు అవి ఉండాల్సిన మార్కెట్ విలువలకంటే తక్కువగా ట్రేడవుతుండేవి. లాభాలకు అప్పుడు కేవలం పుస్తక విలువ సూత్రాన్ని అనుసరించారు. ఇప్పుడలా కాదు. ఎన్నో రకాల సంస్థలు, ఫండ్స్, ధనిక ఇన్వెస్టర్లు, రీసెర్చ్ సంస్థలు మార్కెట్లో పాలుపంచుకుంటూ అధిక షేర్లను జల్లెడ పట్టేశాయి. విలువ ఉందని తెలిస్తే అతివేగంగా దాన్ని అమాంతం పెంచేయటం, లేదని గ్రహిస్తే క్షణాల్లో దించేయడం జరిగిపోతోంది. దీంతో పుస్తక విలువకన్నా తక్కువకు ట్రేడవుతున్న షేర్లన్నిటిలోనూ విలువ ఉందని భావించలేం. కానీ మార్కెట్ పడినపుడు, పెరిగినపుడు ఆ హెచ్చుతగ్గులు అతిగా ఉంటాయి. దాంతో పుస్తక విలువ కిందకు జారిపోవడం సహజం. అందుకే బుక్ వేల్యూను చూసేటపుడు దాని భవిష్యత్ వ్యాపార విలువకంటే అది తక్కువకు ట్రేడవుతోందా? అన్నది గమనించాలి. అంటే.. బుక్ వ్యాల్యూనే కాకుండా కంపెనీ రాబడుల రికార్డు, భవిష్యత్ వ్యాపార అవకాశాలు కూడా పరిశీలించాలి. కొన్ని ఆస్తుల విలువ తగ్గొచ్చు కూడా... ఆయా రంగాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కంపెనీయే స్వయంగా దాని ఆస్తుల విలువను హఠాత్తుగా పుస్తకాల్లో తగ్గించడం, లేదా రద్దుపర్చడం చేయొచ్చు. అలాంటపుడు దాని పుస్తక విలువ పడిపోతుంది. ఉదాహరణకు టాటా స్టీల్...బ్రిటన్ ఉక్కు కంపెనీ కోరస్‌ను, వేదాంతా లిమిటెడ్, చమురు కంపెనీ కెయిర్న్ ఇండియాను గతంలో కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు, చమురు ధరలు పతనం కావడంతో టాటా స్టీల్, వేదాంతాలు వాటి బుక్స్‌లో చూపిస్తున్న కోరస్, కెయిర్న్ ఆస్తి విలువల్ని భారీగా తగ్గించేశాయి. పీఈ విలువ అనూహ్యంగా మారినపుడు... ఫండమెంటల్స్ ప్రకారం కంపెనీ షేరు విలువను కొలవడానికి ఉపయోగించే మరో సాధనం పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్). ఒక్కో షేరుకు కంపెనీ ఆర్జించే లాభం (ఈపీఎస్)తో పోలిస్తే ప్రస్తుత షేరు ధర ఎంతుందో తెలిపేదే పీఈ. కొన్ని సందర్భాల్లో మారిన పరిస్థితులవల్ల ఒక కంపెనీకి నష్టం రావొచ్చు. లాభాలు పడిపోవొచ్చు. అపుడు షేరు పీఈ పెరుగుతుంది. అంటే పీఈ సూత్రం ప్రకారం అది ఖరీదైపోయిందని లెక్క. అపుడు పీఈని కాక పుస్తక విలువను పరిగణనలోకి తీసుకుని, షేరు కొనాలా... వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. ఎక్కువ మూలధనాన్ని ఉపయోగించి, వ్యాపారం చేసే కంపెనీల రాబడులు తొలుత తక్కువ ఉంటాయి. నెమ్మదిగా పెరుగుతాయి. అలాంటి కంపెనీల షేర్ల విలువను గుర్తించేందుకు పీఈకంటే పుస్తక విలువ బాగా ఉపకరిస్తుంది. టాటా స్టీల్, సెయిల్, ఎస్బీఐ వంటివి ఈ కోవలోకే వస్తాయి. పుస్తక విలువ అంటే... కంపెనీ ఆస్తుల్లోంచి, అప్పుల్ని, గుడ్‌విల్, పేటెంట్స్ వంటి కనిపించని ఆస్తుల్ని తీసివేయగా వచ్చే విలువనే కంపెనీ పుస్తక విలువగా పరిగణిస్తారు. అంటే...కంపెనీ ఖాతా పుస్తకాల్లో దానికి నికరంగా ఉన్న ఆస్తుల విలువన్న మాట. కంపెనీ పుస్తక విలువను ఆ కంపెనీ తాలూకు మొత్తం షేర్ల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే కంపెనీ షేరు పుస్తక విలువ. దీనికంటే ట్రేడవుతున్న షేరు ధర తక్కువగా ఉంటే దాని ప్రైస్ టు బుక్ వ్యాల్యూ 1 కంటే దిగువనున్నట్లు. బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో మూడోవంతు షేర్ల బుక్ వ్యాల్యూ ప్రస్తుతం 1 కంటే తక్కువే ఉంది మరి. పుస్తక విలువకంటే ఎక్కువ ఉన్నంత మాత్రాన.. కొన్ని కంపెనీల షేర్లు పుస్తక విలువకంటే బాగా ఎక్కువగా వుంటాయి. అంతమాత్రాన వాటిలో విలువ లేదని చెప్పలేం. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని కంపెనీలకు మూలధన అవసరాలు తక్కువ. అందుకని వాటి పుస్తక విలువలకన్నా చాలా ఎక్కువకు అవి ట్రేడవుతూ ఉంటాయి. ఐటీసీ వంటి కంపెనీ షేరు ధర దాని పుస్తక విలువతో పోలిస్తే 8 రెట్లుంది. వాటిని పుస్తక విలువతో కాకుండా భవిష్యత్ వ్యాపారం, భవిష్యత్ ఆర్జన, పీఈ వంటి సాధనాలతో అంచనా వేయాలి. ఏదైనా పరిశ్రమకు చక్రగతిన ఏర్పడే వ్యాపార ఒడిదుడుకుల కారణంగా ఆ పరిశ్రమ మొత్తం కుదేలైపోతుంది. దాంతో ఆ పరిశ్రమకు చెందిన కంపెనీల షేర్లు వాటి పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడ్‌కావొచ్చు. ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా, మెటల్ కంపెనీల పరిస్థితి అలానే వుంది. భవిష్యత్తులో ఆయా రంగాలు కోలుకుంటే ఆయా షేర్లు బాగా పెరుగుతాయి - మూర్తి గరిమెళ్ళ, స్టాక్ ఎనలిస్ట్ ఇతర ఫండమెంటల్స్ అన్నీ సక్రమంగా వుండి, షేరు దాని పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడవుతుంటే..ఆ కంపెనీ షేరు విలువ వుండాల్సిన స్థాయిలో లేదని అర్థం. డిస్కౌంట్ ధరకు ఆ షేరును స్వంతం చేసుకోవడానికి మంచి చాన్స్. - పంకజ్ పాండే, రీసెర్చ్ హెడ్ ఐసీఐసీఐ డెరైక్ట్ -
ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?
11 నెలల్లో స్టాక్ మార్కెట్ల తీవ్ర పతనం * గరిష్ఠం నుంచి 25 శాతం వరకూ పడిన సూచీలు * 50-60 శాతానికిపైగా నష్టపోయిన మెటల్, బ్యాంకు షేర్లు * ఆకర్షణీయమైన ధరల్లో కనిపిస్తున్న ఇతర రంగాల షేర్లు * ఇంకా పడతాయన్న భయాలతో దూరంగా చిన్న ఇన్వెస్టర్లు * దీర్ఘకాలికమైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చంటున్న నిపుణులు * స్వల్ప, మధ్య కాలానికైతే వేచి చూడటమే నయమని సూచన ఏడాదిలో ఏకంగా 25 శాతం నష్టం!!. ఎవ్వరికైనా ఇది గుండె బేజారెత్తించే విషయమే. స్టాక్ మార్కెట్ మదుపరులు మాత్రం దీన్నొక అవకాశంగా చూస్తుంటారు. ఎందుకంటే ఇంత తీవ్ర పతనమైందంటే షేర్ల రేట్లన్నీ కిందికి దిగినట్లేగా? చవగ్గా వస్తున్నట్లే కదా? మరి ఇప్పుడు కొంటే పెరగటానికి అవకాశాలెక్కువ కదా? కాస్త దీర్ఘకాలం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు ఎవ్వరైనా ఆలోచించేది ఇలాగే. కానీ ఇక్కడో చిక్కుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అంత బాగులేవు. అన్ని దేశాల స్టాక్ మార్కెట్లూ ఘోరంగా పతనమవుతున్నాయి. పెపైచ్చు ప్రపంచానికంతటికీ పలు వస్తువుల్ని ఎగుమతి చేయటం... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన స్టీల్, చమురు తదితర వస్తువుల్ని దిగుమతి చేసుకోవటం చేసే చైనా ఆర్థిక పరిస్థితి అంత బాగులేదు. మరి ఈ పతనం ఇంకా కొనసాగితే ఎలా? ఇదే మదుపరుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నలకు సమాధానమివ్వటానికే ‘సాక్షి’ పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులను సంప్రదించింది. వారిచ్చిన సూచనల సమాచారమే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం.. నిజానికి 2008 పతనం తరవాత మన స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు రిటైలర్లు (చిన్న ఇన్వెస్టర్లు) దూరంగానే ఉంటూ వచ్చారు. దానికి తగ్గట్టే మార్కెట్ కూడా తీవ్ర హెచ్చుతగ్గులతో కదలాడింది. అయితే 2014 ఎన్నికలకు కొన్నాళ్ల ముందు పెద్ద ర్యాలీ మొదలైంది. ఆ ర్యాలీ దాదాపుగా గతేడాది జనవరి వరకూ కొనసాగింది. జనవరిలో మన మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిలను తాకాయి కూడా. మార్కెట్లపై నమ్మకం కుదరటంతో చిన్న మదుపరులూ అదే సమయంలో తిరిగి మార్కెట్లోకి ప్రవేశించటం మొదలెట్టారు. ఈ సారి నేరుగా కాకుండా అత్యధిక శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేశారు. కానీ బడ్జెట్ తర్వాత నుంచి సూచీలు నేల చూపులు చూడటం ఆరంభించాయి. గత 11 నెలల్లో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 25% నష్టపోయాయి. కొన్ని షేర్లయితే హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ముఖ్యంగా మెటల్స్, బ్యాంకు షేర్లు 40 నుంచి 50%కి పైగా నష్టపోయాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు పునరాలోచనలో పడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి కొత్తగా పెట్టుబడులు పెట్టడం దాదాపు నిలిపేసినట్లు మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెబుతున్నాయి. ‘‘నాకు తెలిసినంత వరకూ పెట్టిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటమైతే ఇంకా మొదలు కాలేదు. కానీ కొత్త పెట్టుబడులు రావటం తగ్గాయి’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజిమెంట్ కంపెనీ సీనియర్ ఫండ్ మేనేజర్ మనీష్ గున్వానీ ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధితో చెప్పారు. ఆకర్షణీయమే కానీ.. ప్రస్తుతం చాలా షేర్లు ధరలు తగ్గి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి వెనకంజ వేస్తున్నారు. మార్కెట్ పండితులు మాత్రం దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయడానికి ఇది చక్కని సమయమంటున్నారు. ‘‘మార్కెట్ల గత చరిత్రను చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. ప్రతిసారీ భారీ పతనం తర్వాత వెంటనే మార్కెట్లు ర్యాలీ చేశాయి. 2008లో జరిగిన భారీ పతనం తర్వాత 2009లో సూచీలు సుమారు 150 శాతం పెరిగాయి. అలాగే ఇప్పుడూ పెరిగే అవకాశం ఉంది. కాకపోతే గతంలో మాదిరిగా అన్ని రంగాల షేర్లూ పెరిగే అవకాశం తక్కువ. కొన్ని ఎంపిక చేసిన షేర్లలోనే ర్యాలీ వచ్చే అవకాశముంది’’ అని జెన్ మనీ జేఎండీ సతీష్ కంతేటి ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధితో చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలపై ఇంకా స్పష్టత రావటం లేదు కనక స్వల్ప, మధ్య కాలిక ఇన్వెస్టర్లు మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదన్నారాయన. ‘‘దీర్ఘకాలిక దృష్టిలో ఇన్వెస్ట్ చేసేవారు మాత్రం ఎంపిక చేసుకున్న షేర్లలో కొంచెం కొంచెం చొప్పున ఒక ఏడాదిపాటు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది’’ అని సతీష్ సూచించారు. బ్యాంక్ షాపింగ్ చేయొచ్చా?.. ప్రస్తుతం అన్ని బ్యాంకు షేర్లు దారుణంగా పతనమై దిగువ స్థాయి ధరల వద్ద ట్రేడవుతున్నాయి. కొన్నయితే వాటి గరిష్ఠ స్థాయి నుంచి 60 శాతానికి పైగా నష్టపోయాయి. ఇప్పుడివి చాలా ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నా... వీటిల్లో రిస్క్ ఇంకా పూర్తిస్థాయిలో తొలగిపోలేదని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. రిజర్వు బ్యాంకు సంస్కరణల పేరిట పలు చర్యలు తీసుకుంటోంది. దీర్ఘకాలంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఇవి మేలు చేస్తాయి. కానీ వీటి ప్రభావం బ్యాంకులపై ఏ స్థాయిలో ఉంటుందనేదింకా స్పష్టంగా తెలియటం లేదు. గతంలో రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగి అడ్డదిడ్డంగా ఇచ్చిన రుణాలను ఇప్పుడు ఎన్పీఏలుగా చూపించమని ఆర్బీఐ ఆదేశించడంతో చాలా పీఎస్‌యూ బ్యాంకులు ఎన్పీఏలను పెంచుకుంటూ నష్టాల బాటపట్టాయి. ఈ ఒత్తిడిని తట్టుకొని ఎన్ని బ్యాంకులు నిలబడతాయన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య. ఎన్పీఏలు భారీగా పెరగడంతో వచ్చే రెండేళ్లు బ్యాంకుల లాభాలు కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు రంగంలో వస్తున్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల నుంచి పోటీ మరింత పెరగనుంది. ఈ పరిణామాలు చిన్న స్థాయి ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్ని ఘోరంగా దెబ్బతీయొచ్చనేది ఈ రంగంతో సంబంధమున్న వారి మాట. రిస్క్ చేయదల్చిన వారు పెద్ద స్థాయి ప్రైవేటు, పీఎస్‌యూ బ్యాంకులకేసి దీర్ఘకాలిక దృష్టితో చూడొచ్చన్నది వారి సూచన. మరీ ఖరీదేమీ కాదు.. ప్రస్తుత రేట్ల వద్ద మన సూచీలు అంత ఖరీదుగా లేవని, అలాగని మరీ చౌకగా కూడా లేవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయాలతో పోలిస్తే ప్రస్తుత సూచీలు సుమారు 16 పీఈ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మన సూచీల సగటు పీఈ 15-16గా ఉంది. ఈ స్థాయి కంటే దిగువకు వస్తే షేర్ల ధరలు చాలా చౌకగా ఉన్నట్లు లెక్క. సెన్సెక్స్ 22,000 స్థాయికి రావచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థల అంచనా. అప్పుడు పీఈ 14 దగ్గరకు వస్తుంది. అంటే ప్రస్తుత స్థాయి నుంచి ఇంకా 4-5 శాతం పతనం కావడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది పెద్ద రిస్క్ కాదు కాబట్టి ప్రస్తుత ధర వద్ద నెమ్మదిగా కొనుగోళ్లు ప్రారంభించవచ్చనేది నిపుణుల సూచన. ‘‘సూచీలు ఇలా పతనమై ఉన్నాయి. కొన్ని రంగాల షేర్లు కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. బాగా పతనమై ఆకర్షణీయగా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఇన్వెస్ట్ చేసేంత ధైర్యాన్నివ్వటం లేదు. వివిధ రంగాల్లో ఉన్న రిస్క్ ఇంకా స్పష్టం కాకపోవటమే దీనిక్కారణం’’ అని జెన్ మనీ జేఎండీ సతీష్ వివరించారు. బేర్ దశలోకి... దేశీయ స్టాక్ సూచీల్లో బేర్ మార్కెట్ మొదలయ్యిందా... అనే రీతిలో పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సూచీలు గరిష్ట స్థాయి నుంచి వరసగా రెండు నెలలు పతన బాటలో ప్రయాణించడమే కాకుండా 20 శాతానికి పైగా నష్టపోతే దాన్ని బేర్ దశలోకి ప్రవేశించినట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం మన సూచీలు గత 11 నెలల్లో 23 శాతం నష్టపోవడం దీనికి సంకేతంగా భావించవచ్చు. ఇది బేర్ మార్కెట్‌గా మారుతుందా? ఇకా ఎన్నాళ్లు కొనసాగుతుంది? వంటివన్నీ ఇప్పుడే చెప్పలేమనేది వారి మాట. ‘‘గడిచిన 25 ఏళ్ల మార్కెట్ చరిత్ర చూస్తే బేర్ మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగిన దాఖలాలు లేవు. (25 ఏళ్ల సెన్సెక్స్ బుల్ ర్యాలీ-బేర్ మార్కెట్ పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది) అన్ని బేర్ మార్కెట్లు 13 నుంచి 19 నెలల్లోనే ముగిసిపోయాయి. ఒక్క 1994లో మొదలైన బేర్ మార్కెట్ మాత్రమే సుదీర్ఘంగా నాలుగేళ్లపాటు కొనసాగింది. నాలుగేళ్ల సుదీర్ఘ సమయంలో సూచీలు 41 శాతం నష్టపోయాయి’’ అని మార్కెట్ విశ్లేషకుడు మూర్తి గరిమెళ్ల తెలియజేశారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు సూచీలు మరింత పతనమవుతాయా? లేక దీర్ఘకాలంలో పరిమిత శ్రేణిలో కానసాగుతాయా అన్నది కొన్నాళ్లు వేచి చూస్తే తప్ప తెలిసేలా లేదు. -
ఆర్డర్ చేసినా రావటం 'కస్టమ్'
శ్రీధర్‌కు అంతర్జాతీయ వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయటం మహా సరదా! అలాగే సెర్చ్ చేస్తుండగా... ఇండియాలో రూ.20 వేలకు దొరుకుతున్న ఫోన్... చైనా ఆన్లైన్ దిగ్గజం అలీబాబా వెబ్సైట్లో రూ.12 వేలకే కనిపించింది. ఇంకేం! 8 వేలు తక్కువకు వస్తోంది కదా అని ఆర్డర్ ఇచ్చాడు. దాదాపు 40 రోజుల తరవాత ప్యాకేజీ శ్రీధర్ ఇంటికొచ్చింది. కాకపోతే రూ.10 వేలు కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని, అప్పుడే డెలివరీ ఇస్తానని చెప్పాడు పోస్ట్‌మ్యాన్. శ్రీధర్‌కు చుక్కలు కనిపించాయి. వద్దులే అని వెనక్కి పంపేశాడు. కాకపోతే సదరు వెబ్సైట్లో అమ్మేటపుడే ఓ కండిషన్ ఉంది. ‘‘మీ చేతుల్లో లేని కారణాల వల్ల పార్సిల్ మీకు అందకపోతే పూర్తి రిఫండ్ ఇస్తాం. కానీ మీ చేతుల్లో ఉన్న కారణాల వల్ల అయితే కొంత కోత వేస్తాం’’ అని. కస్టమ్స్ చార్జీలేమైనా ఉంటే కస్టమరే చెల్లించాలనే షరతు కూడా అందులో ఉంది. దీంతో శ్రీధర్‌కు మరో 30 రోజులు గడిచాక... రూ.4 వేలు కోత పడి, రూ.8 వేలు వెనక్కి వచ్చాయి. అవినాష్ ఉండేది అమెరికాలో. ఇండియాలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్‌ను సంతోషపెట్టాలనుకున్నాడు. ఆనంద్ బర్త్‌డేకు... అమెరికా నుంచి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్‌ను పంపించాడు. కాకపోతే ఆనంద్ బర్త్‌డే అయిపోయినా అది తనకు అందలేదు. అనంద్ నుంచి సమాధానం లేకపోవటంతో... తను పంపిన గిఫ్ట్ ఎలా ఉందని అవినాషే అడిగాడు. ఏ గిఫ్టంటూ తెల్లమొహం వేశాడు ఆనంద్. చివరకు ట్రాకింగ్ నంబరు అదీ ఇవ్వటంతో... అది కస్టమ్స్ దగ్గర ఇరుక్కుపోయిందని తెలుసుకున్నాడు ఆనంద్. ఎందుకు ఇరుక్కుంది? ఎప్పుడొస్తుంది? అనే విషయాలు తెలియక సతమతమయ్యాడు. శ్రీధర్, ఆనంద్‌లే కాదు. విదేశాల నుంచి పార్శిళ్లు, వస్తువులు తెప్పించుకునే చాలామందిది ఇదే పరిస్థితి. ఎందుకంటే 120 కోట్ల మంది ఉన్న ఇండియాకు లక్షల కొద్దీ పార్శిళ్లు విదేశాల నుంచి వస్తుంటాయి. అందులో ఏం ఉంది? దాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తెస్తున్నారా? లేకుంటే అవి డ్యూటీ (సుంకాలు) చెల్లించాల్సిన అవసరం లేనివా? తక్కువ ధరవా? వాటిని ఇండియాలోకి ఉచితంగా అనుమతించటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా? అవి ఇండియాలోని పర్యావరణాన్నో, మనుషుల్నో దెబ్బతీసే వస్తువులా?.. ఇలాంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించటం కస్టమ్స్ విభాగం బాధ్యత. ఈ ప్రక్రియలో కొన్ని వస్తువులు నెలల పాటు కస్టమ్స్ వద్దే క్లియర్ కాకుండా ఉండిపోతుంటాయి. ఇంకొన్ని అక్కడి నుంచే వెనక్కి తిప్పి పంపేస్తుంటారు. మరికొన్నిటికి భారీ పెనాలిటీలు వేస్తుంటారు. ఇవన్నీ ముందే తెలుసుకోవటం ఎలా? అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటమెలా? కస్టమ్స్ అధికారుల్ని సంప్రదించటమెలా? ..ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా కొనటానికి వీలు * అంతర్జాతీయ వస్తువులకు సుంకం తప్పనిసరి * కొన్ని డ్యూటీ ఫ్రీ వస్తువులు కూడా ఉంటాయ్... * గిఫ్ట్ అంటూ అబద్ధాలాడితే ఇరుక్కోవచ్చు * ట్రాక్ చేయటానికి; సంప్రదింపులకు ఎన్నో మార్గాలు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ఉన్న ఊళ్లోనే ఏ వస్తువైనా కొనటానికి అలవాటు పడ్డ వ్యక్తుల్ని... ఏకంగా విదేశాల నుంచి కూడా కొని తెప్పించుకునేలా చేసింది ఈ-కామర్స్. అమెరికా, చైనా సహా ఏ దేశం నుంచైనా ఆర్డరు చేస్తే... కొన్ని రోజుల్లోనే మన రాష్ట్రాల్లోని మారుమూల పల్లెలక్కూడా పార్సిళ్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే డ్యూటీ ఫ్రీ వస్తువులు మినహా... ఏ వస్తువును మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నా కొంత సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిజిటల్ కెమెరాలు, ఎల్సీడీ మానిటర్లు, ర్యామ్, ప్రాసెసర్ల వంటి కొన్ని ఐటీ సంబంధిత ఉత్పత్తుల్ని మాత్రం ‘డ్యూటీ ఫ్రీ’గా పరిగణిస్తుంటారు. వాటిపై సుంకాలుండవు. మిగిలిన వస్తువులన్నిటిపైనా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఇక ఈ వస్తువుల్ని పెద్ద ఎత్తున ఇండియాకు తెచ్చి విక్రయించేవారికి ఐఈసీ (ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ కోడ్) తప్పనిసరి. వ్యక్తిగత అవసరాలకు తెచ్చుకునే వారికి మాత్రం ఈ కోడ్ అవసరం లేదు. దేనికి డ్యూటీ చెల్లించాలి? ఎంతవరకూ మినహాయింపులుంటాయి? అక్రమంగా తెచ్చుకుంటే పరిస్థితేంటి? ఒక్కసారి చూద్దాం.... ఆన్లైన్ కంపెనీలకు కస్టమర్లు ముఖ్యం. కొనుగోళ్లు ముఖ్యం. అందుకని అవి తమ కస్టమర్లు భారీ కస్టమ్స్ ఛార్జీలు చెల్లించకూడదన్న ఉద్దేశంతో వస్తువుల్ని పంపేటపుడు కొన్ని చర్యలు తీసుకుంటుంటాయి. అవేంటంటే... * ఐఈసీ లేకుండా భారీగా దిగుమతులు చేసుకుంటున్న పక్షంలో మీరు పూర్తిగా ఇరుక్కున్నట్టే. * ప్యాకేజ్‌కు సంబంధించిన కస్టమ్స్ డిక్లరేషన్ ఫారంలో దాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా పేర్కొంటాయి. నిజానికి వేరొక వ్యక్తి కోసం ఒక వ్యక్తి ఆర్డర్ చేస్తే... అది బహుమతి. కానీ సొంతంగా ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేదానికి కూడా విక్రేతలు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా పేర్కొంటుంటారు. ఇది చట్ట విరుద్ధం. అయితే ఇది నిజంగా బహుమతేనా? కాదా? అనేది తెలుసుకోవటం కష్టం. ఒకవేళ ఆ గిఫ్ట్‌లో కూడా ఇన్వాయిస్ పెట్టారంటే... అప్పుడు పట్టుబడ్డట్టే. * గిఫ్ట్‌గా పేర్కొన్నా కూడా... సదరు వస్తువు ధర రూ.10 వేలు దాటితే కస్టమ్స్ అధికారులు సుంకం విధిస్తారు. అందుకని విక్రేతలు వస్తువుల ధరను తక్కువగా చూపిస్తారు. ఇదీ చట్ట విరుద్ధమే. ఒకవేళ ఆ వస్తువు పోయిన పక్షంలో మీకు బీమా పూర్తిగా రాదు. వస్తువు ధరను తక్కువగా చూపించారు కనక ఆ మేరకే వస్తుంది. * పైన పేర్కొన్న రెండు మార్గాలూ చట్టవిరుద్ధమైనవే. వాటి పరిణామాలు కూడా మీకు తెలిసి ఉండాలి. * ముఖ్యమైన విషయమేంటంటే... 4-5 రోజుల్లో షిప్పింగ్ చేస్తానన్నారు కదా అని చాలా మంది ఖరీదైన కొరియర్లను ఎంచుకుంటారు. కొరియర్ ఎంత ఖరీదైనదైతే నిఘా అంత ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఈఎంఎస్, డీహెచ్ఎల్ వంటి కొరియర్లను తక్కువ ధర వస్తువులకు వినియోగించరని, ఖరీ దైన వస్తువులకే వాడతారని కస్టమ్స్‌కు బాగా తెలుసు. అందుకని వీటిని మిగతా వాటికన్నా నిశితంగా స్కాన్ చేస్తారు. * అలాగని మామూలు రిజిస్టర్డ్ ఎయిర్ మెయిల్లో తెప్పిస్తే... భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండదు. అది చేతికి వస్తుందన్న నమ్మక ం ఉండదు. ఒకవేళ చేతికి వచ్చినా భద్రంగా... ఎక్కడా డ్యామేజీ లేకుండా రావటం కూడా కష్టం. వీటన్నిటికీ తోడు షిప్పింగ్ సమయం బాగా ఎక్కువ. * దీన్నిబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. నిజంగా వస్తువు కావాలనుకునేవారు కొంత డ్యూటీ చెల్లించటానికి వెనకాడరు. కొన్ని సందర్భాల్లో అన్నీ నిజం చెప్పినా కస్టమ్స్ ఇబ్బందులనేవి ఉంటుంటాయి. కస్టమ్స్ గుర్తిస్తే...? ఒకవేళ మీ వస్తువుపై సుంకం చెల్లించలేదని ది కస్టమ్స్ గుర్తిస్తే ఏమవుతుంది? మరీ మిమ్మల్ని అరెస్టు చేయటమో, కేసు పెట్టడమో చేయరు. అది కూడా మీరు తెచ్చిన వస్తువు స్థాయిని బట్టి ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఇలా గుర్తిస్తే కస్టమ్స్‌లో ఆ వస్తువును సీజ్ చేస్తారు. వివరాలడుగుతూ మీకు లెటర్ రాస్తారు. మీరు గనక నిజాయితీగా స్పందిస్తే... వారు సంతృప్తి చెందితే... కొంత సుంకం లెక్కించి చెల్లించమంటారు. చెల్లిస్తే మీ వస్తువు మీకు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఏ లేఖా లేకుండానే పోస్ట్‌మ్యాన్‌తో నేరుగా పార్సిల్ మీ ఇంటికి పంపి సుంకం చెల్లించమంటారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు కొంత పరిహారం కూడా తప్పదు. అయితే పదేపదే ఇలా చేస్తే మాత్రం ఇబ్బందులు ఖాయం. కస్టమ్స్ అడిగాక కూడా మీరు ఛార్జీలు చెల్లించకపోయినా... పోస్ట్‌మ్యాన్ తెచ్చినపుడు అందులో పేర్కొన్న మొత్తం చెల్లించకపోయినా ఆ వస్తువును వెనక్కి తిరిగి పంపేస్తారు. అయితే మీరు ఆన్లైన్లో కొన్నారు కనక... దాన్ని తిరిగి వెనక్కి పంపేస్తే ఆన్లైన్ కంపెనీ పూర్తి మొత్తాన్ని రిఫండ్ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. పోస్టేజీ కింద కొంత మొత్తాన్ని అది మినహాయిస్తుంది. కస్టమ్స్ వివరాలు తెలుసుకోవటమెలా? సాధారణంగా మీరు ట్రాకింగ్ చేసినపుడు దాని పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది. అది కస్టమ్స్ వద్ద ఉందా? లేక అక్కడి నుంచి క్లియర్ అయ్యి మీ ప్రాంతానికి పంపించారా? లేక కస్టమ్స్ వద్దే అధికారి క్లియరెన్స్ కోసం నిలిపేశారా? ఇవన్నీ తెలుస్తాయి. ఒకవేళ మీ వస్తువు కనక ముంబైలోని కస్టమ్స్ వద్ద ఉండిపోయిన పక్షంలో అది ఎందుకు ఉంది? ఛార్జీలేమైనా చెల్లించాలా? వంటి వివరాలు తెలుసుకోవటానికి ముంబై పోస్టల్ విభాగం ఒక బ్లాగ్‌ను నిర్వహిస్తోంది. దాన్లో మీ ప్రశ్నను పోస్ట్ చేస్తే అధికారులు స్పందించే అవకాశమూ ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టొచ్చు. నేరుగా ముంబై వెళ్లి సంప్రదించే బదులు ఈ బ్లాగ్ ద్వారా సంప్రతించటం కొంత ఈజీ కదా? ప్రయివేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న ఆ బ్లాగ్ పేరు... http://mumbaiforeignpost.blogspot.in/p/mainpage.html అయితే ఇలాంటి బ్లాగ్‌లలో పూర్తి వివరాలిచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీ చిరునామా, మొబైల్ నంబరు ఎక్కడా పబ్లిక్ వెబ్సైట్లలో ఉండకపోవటమే ఉత్తమమనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ముంబయి కస్టమ్స్‌కు సంబంధించి మీకు అధికారిక సమాచారం కావాలంటే... టఞఛి.ఝఠఝఛ్చజీః జీఛీజ్చీఞౌట్ట.జౌఠి.జీ ద్వారామెయిల్లో సంప్రదించవచ్చు. వస్తువు ట్రాక్ చేయటం ఎలా? ఇప్పుడు ప్రతి కొరియర్కూ సొంత వెబ్సైట్ ఉంది. కన్సైన్మెంట్ నంబరో, ట్రాకింగ్ నంబరో ఉంటుంది కనక వాటి సాయంతో ఈజీగానే ట్రాక్ చేయొచ్చు. అలా కాకుండా ఏ కొరియర్ సంస్థకు చెందిన పార్శిల్నైనా ట్రాక్ చేయటానికి 17ట్రాక్స్, ఆఫ్టర్షిప్ వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ విక్రేత తన దేశానికి చెందిన పోస్టల్ విభాగం ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తే... ఆయా దేశాల పోస్టల్ ట్రాకింగ్ కొంతవరకే పనికొస్తుంది. అంటే వస్తువు మన దేశానికి పంపేవరకూ ఆ సంస్థలు ట్రాక్ చేస్తాయి. అక్కడి నుంచి ట్రాకింగ్ ఉండదు. అయితే ఇలా ఏ దేశానికి చెందిన పోస్టల్ విభాగాన్నయినా... పంపిన దగ్గర్నుంచి డెలివరీ అయ్యేదాకా ట్రాక్ చేయటానికి ఇంటర్నేషనల్ పార్శిల్ సర్వీస్‌కు చెందిన ఐపీఎస్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. అవన్నీ చూస్తే... ఏ కొరియర్నైనా ట్రాక్ చేయటానికి... https://www.17track.net/en https://www.aftership.com/ అంతర్జాతీయ పోస్టల్‌ను ట్రాక్ చేయటానికి... http://ipsweb.ptcmysore.gov.in/ipswebtracking/IPSWeb_submit.htm -
టైమ్ షేర్... చలో టూర్
రోజూ పేపర్లో.. టీవీల్లో.. బయట హోర్డింగ్స్‌లో ఎక్కడ చూసిన ‘చలో నిక్లో.. ఫ్యామిలీ సే ఎంజాయ్ కరో’ అనే ట్యాగ్‌లైన్‌తో ఇస్తున్న ఆతిథ్య సంస్థల ప్రకటనలు రమేశ్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రమేశ్‌కు ఎప్పటి నుంచో దూర ప్రాంతాలకు ఒకసారి పర్యటించాలన్నది కోరిక. ధరలు కూడా అందుబాటులోనే ఉన్నట్టు కనిపించటంతో ఓ సారి ట్రైచేస్తే పోలా... అనుకున్నాడు. పండుగ సెలవులు కలసి రావటంతో ఆతిథ్య సంస్థల వెబ్సైట్లోకి వెళ్లి చూస్తే దిమ్మ తిరిగిపోయింది. సాధారణ రోజుల్లో కంటే రెండింతల అధిక రేట్లున్నాయి మరి. ఎందుకని ఆరా తీస్తే... పండుగ సెలవులిచ్చేది రమేశ్ ఒక్కడికే కాదుగా!! అందరికీనూ!! శేఖర్‌ది మరో కథ. తనకు ఓ మంచి హాలిడే రిసార్ట్‌లో పాతికేళ్ల పాటు సభ్యత్వం ఉంది. ఏడాదిలో వారం రోజుల పాటు ఆ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న రిసార్ట్‌లలో ఎక్కడైనా ఒకచోట ఉండొచ్చు. అయితే గతేడాది వేసవి సెలవులు వచ్చినపుడు, ఈ ఏడాది పండుగ సెలవులు వచ్చినపుడు అక్కడికి వెళదామని ప్రయత్నించాడు. తను అడిగిన చోట రిసార్ట్ గదులు ఖాళీ లేవని, అన్నీ ముందే బుక్ అయిపోయాయని సమాధానం. రెండుసార్లు ప్రయత్నించగా... రెండుసార్లూ అదే సమాధానం. వాళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పిన తేదీల్లో ఇక్కడ శేఖర్‌కి సెలవుల్లేవు. తను సభ్యత్వం తీసుకునేటపుడే ఇవన్నీ ఆలోచించి ఉంటే బాగుండేదనుకున్నాడు మనసులో. కొత్త సంవత్సరం వచ్చింది! సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు. కుటుంబంతో కలసి సెలవులు సరదాగా గడపటానికి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాడు సురేశ్. కుటుంబంతో మాట్లాడి... ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకున్నాడు. ప్రయాణానికి టికెట్లు కూడా సంపాదించాడు. అక్కడ బస చేయడానికి ఆన్లైన్లో సెర్చ్ చేశాడు. కాస్త మంచి హోటల్స్ అన్నీ... ముందే బుక్ అయిపోయాయి. ఖాళీగా ఉన్నవాటికి రేటింగ్స్ లేవు. యూజర్ల నుంచి ‘దీన్ని తీసుకోవటం శుద్ధ వేస్ట్’’ అంటూ కామెంట్లు కూడా ఉన్నాయి. ఇక చేసేదేమీ లేక ముందుగా బుక్ చేయకుండానే బయలుదేరాడు. అక్కడ ఇబ్బందులు మామూలుగా లేవు. హాలిడే సీజన్ కావటంతో విపరీతమైన రద్దీ. అదీ కథ. ఇదంతా ఎందుకంటే... ఇపుడు టైమ్ షేర్ ప్రాపర్టీల హవా నడుస్తోంది. చాలామంది వీటిలో సభ్యత్వం తీసుకుని సెలవుల్ని ఎంజాయ్ చేయగులుగుతున్నా... కొందరికి సభ్యత్వం ఉండి కూడా సదరు కంపెనీల తీరు వల్ల ఆ అవకాశం దక్కటం లేదు. ఇక దేన్లోనూ సభ్యత్వం లేనివారిదైతే మరో గొడవ. సీజన్లో వెళదామంటే విపరీతమైన చార్జీలు. వీటన్నిటి నేపథ్యంలో నిర్దిష్ట కాల వ్యవధికి మన యాజమాన్యంలో ఉండే ఆస్తుల (టైమ్‌షేర్ ప్రాపర్టీలు) వల్ల లాభమేంటి? నష్టాలేంటి? అసలు టైమ్‌షేర్ ప్రాపర్టీలంటే ఏంటి? వీటి వివరాలు ఏమిటి? వీటిలో సభ్యత్వం తీసుకునేదెలా? ఇవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... * సభ్యత్వం తీసుకుంటే ఏటా ఫ్రీ హాలిడేస్ * తక్కువ ఖర్చుకే స్టార్ హోటల్ వసతులు * ఏటా తప్పనిసరిగా టూర్లకు వెళ్లేవారికి లాభమే * వాడకపోయినా వార్షిక నిర్వహణ రుసుం తప్పదు * ఆచితూచి ఎంచుకుంటేనే టైమ్‌షేర్‌తో లాభాలు * హైదరాబాద్‌లోనూ టైమ్‌షేర్ ప్రాపర్టీలు.. అసలు టైమ్‌షేర్ ప్రాపర్టీ అంటే..? పలు వేడుకలు లేదా పార్టీలు జరుపుకునేందుకు వీలు కల్పించే ఉమ్మడి స్థిరాస్తి. అంటే ఒక లగ్జరీ హోటల్ గది లేదా స్టూడియో రూమ్ కావచ్చు. రిసార్ట్‌లో గది, విల్లా... ఇలా ఏదైనా కావచ్చు. ఒక హోటల్లో ఉండే గదుల్ని పాతికేళ్లో, 30 ఏళ్లో శాశ్వతంగా ఏడాదికి 5 రోజుల చొప్పునో, 10 రోజుల చొప్పునో, వారం రోజుల చొప్పునో లీజు కిస్తారన్న మాట. ఇలా ఇచ్చినందుకు ఒకేసారి సభ్యత్వ రుసుము తీసుకోవటంతో పాటు ఏడాది కి కొంత నిర్వహణ రుసుం కూడా తీసుకుంటారు. ఆ హోటల్ మామూలుగానే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. కాకపోతే సభ్యులు బుక్ చేసుకున్నపుడు వారికి ప్రాధాన్యమివ్వటంతో పాటు... నిర్దిష్ట వ్యవధి పాటు వారికి ఉచితంగా బస కల్పిస్తారు. తీసుకునే సభ్యత్వాన్ని బట్టి కేవలం గది ఉచితంగా ఇవ్వటం, భోజన సదుపాయాలతో కలిపి ఇవ్వటం, ఇతరత్రా విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పించటం వంటివి ఉంటాయి. అలాగే రిసార్ట్లు కూడా. వీటిలో సభ్యులు కావటం వల్ల నిర్దేశిత సమయంలో... కుటుంబంతో కలసి అక్కడ హాయిగా గడపవచ్చన్న మాట. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో 40కి పైగా సంస్థలు... దేశంలో టైమ్‌షేర్ ప్రాపర్టీల కొనుగోలు, అమ్మకం, లీజు వంటి సేవలను రిసార్ట్ కండోమినియమ్స్ ఇంటర్నేషన్ (ఆర్సీఐ), రమదా హోటల్స్ అండ్ రిసార్ట్స్, క్లబ్ మహీంద్రా, కంట్రీ క్లబ్, స్టెర్లింగ్ హోలిడే రిసార్ట్స్ వంటి 40కి పైగా సంస్థలు అందిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ సభ్యత్వాన్ని నెలసరి వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేసే వీలును కూడా కల్పిస్తున్నాయి. వీటిలో 20 లక్షల మంది సభ్యులున్నారని, ఏటా కొత్తగా 15వేల మంది చేరుతున్నారని ఆల్ ఇండియా రిసార్ట్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ఏఐఆర్డీఏ) చైర్మన్ రమేష్ రామనాథన్ చెప్పారు. ‘‘గడిచిన ఐదేళ్ల నుంచీ టైమ్ షేర్ ప్రాపర్టీల సంసృ్క తి పెరుగుతోంది. అందుకే మొత్తం పర్యాటకుల్లో టైమ్‌షేర్ సభ్యుల సంఖ్య కేవలం 0.069 శాతంగానే ఉంది. కాకపోతే 2006-15 మధ్య ఈ రంగం ఏటా 20 శాతం వృద్ధి రేటును కనబరుస్తూ వచ్చింది. ప్రాపర్టీ ఎంపిక, నిర్వహణలో పారదర్శకత, కస్టమర్ల సంతృప్తే ఇందుకు కారణం’’ అని వివరించారాయన. ఇదీ... టైమ్‌షేర్ ఆరంభం టైమ్‌షేర్ ప్రాపర్టీలు ఎలా మొదలయ్యాయనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ ఓ పరిశోధనా పత్రాన్ని తయా రు చేశారు. దాని ప్రకారం.. టైమ్‌షేర్ అనే హాలిడే ప్రణాళికను మొదట తీసుకొచ్చింది అమెరికా. 1968లో హోటల్ హవాయ్‌ని టైమ్‌షేర్ ప్రాపర్టీగా మార్చారు. 1970లో అమెరికాలో చమురు సంక్షోభం తలెత్తటంతో ప్రాపర్టీ నిర్వహణ భారంగా మారింది. దీంతో హవాయ్ కథ ముగిసింది. 1980 నుంచి నిర్మాణ రంగం ఊపందుకోవటంతో మళ్లీ టైమ్‌షేర్ ప్రాపర్టీలొచ్చాయి. వీటి ఆదరణ ఎలా ఉందంటే.. అప్పటివరకు అనిశ్చితిలో ఉన్న సెయింట్ థామస్, ఫోర్ట్ లాడర్డల్, పోర్టోరికో వంటివి కూడా టైమ్‌షేర్ ప్రాపర్టీలుగా మారిపోయాయి. ఇక మన దేశంలోకి తొలిసారిగా టైమ్‌షేర్ ప్రాపర్టీలను తీసుకొచ్చింది మాత్రం.. 1985లో వచ్చిన దాల్మియా రిసార్ట్స్. విదేశీ యాజమాన్యం, నిర్వహణ భారంతో పెద్దగా ఆదరణ పొందలేదు. ఆ తర్వాత... అంటే 1986లో ఆర్ సుబ్రమణియన్ చెన్నై కేంద్రంగా ప్రారంభించిన స్టెర్లింగ్ రిసార్ట్స్ విజయవంతమయింది. ఆ రోజుల్లోనే స్టెర్లింగ్‌కు దేశంలో 14 రిసార్ట్లు, 12 హాలిడే డెస్టినేషన్స్, లక్ష మంది సభ్యులు ఉండేవారు. నిజంగానే డబ్బులు ఆదా అవుతాయా! టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వంతో డబ్బులు ఆదా అవుతాయనేది సంస్థల మాట. అవి చెబుతున్న దాని ప్రకారం... సాధారణంగా ఫైవ్‌స్టార్ హోటల్లో వసతి కోసం రోజుకు కనీసం రూ.10-12 వేల మధ్య చెల్లించాలి. వారానికైతే రూ.70-85 వేలు ఉంటుంది. అదే టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వం ప్రారంభ ధర రూ.2-3 లక్షలుంటుంది. ఈ ప్రాపర్టీని ఏడాదికి వారం రోజుల చొప్పున 30 ఏళ్ల పాటు వినియోగించుకోవచ్చు. అంటే వారానికి రూ.10 వేలన్నమాటేగా. ఒకవేళ 30 ఏళ్లలో ఈ ధరలు భారీగా పెరిగినా... సభ్యులకు మాత్రం చివరిదాకా ఉచితంగానే వస్తుంది. జాగ్రత్త పడకుంటే నష్టమే...! * టైమ్‌షేర్ ప్రాపర్టీలతో నష్టాలున్నాయని చెప్పలేం గానీ... అన్ని రంగాల మాదిరిగానే దీనికీ నాణేనికి రెండో వైపు ఉంది. * అందుకే మంచి పేరున్న టైమ్‌షేర్ సంస్థ, బ్రాండ్‌కు ప్రాధాన్యమిచ్చే సంస్థల్లోనే సభ్యత్వం తీసుకోవాలి. ప్రాపర్టీలు బాగుంటే సరిపోదు. వాటి నిర్వహణ కూడా బాగుండాలి. క్లబ్‌ను ఎంచుకునే ముందు సంబంధిత సంస్థ గురించి మనకంటే ముందున్న కస్టమర్ల అభిప్రాయాలు, అనుభవాలు తెలుసుకోవాలి. * టైమ్‌షేర్ ప్రాపర్టీ సభ్యత్వానికయ్యే ఖర్చు సంగతి పక్కన పెడితే దాని నిర్వహణ కోసం ఒక్కో సభ్యుడు ఏటా కొంత సొమ్ము చెల్లించాలి. ఇది రూ.10-20 వేల మధ్య ఉండొచ్చు. అనివార్య కారణాల వల్ల సభ్యులు ఆ ఏడాది వినియోగించుకోకపోయినా నిర్వహణ రుసుము తప్పదు. దీనికి పరిష్కార మార్గంగా... సబ్‌స్క్రిప్షన్‌ను బంధువులు, స్నేహితులకు బహుమతిగా ఇచ్చే వీలును కల్పిస్తున్నా... వారు బయటి వారు కనక ఒక్కరికి రూ.1,100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. * ప్రాంతాలను ఎంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకిచ్చిన ప్యాకేజీలో 50 ప్రాంతాలుంటాయనుకుందాం. ఎన్నాళ్లయినా వాటిలోనే ఏదో ఒకటి ఎంచుకోవాలి. వేరే ప్రాంతానికి వెళదామనుకుంటే ఈ సభ్యత్వం పనికిరాదు. * కొన్ని సంస్థలు ఎప్పుడు బుక్ చేద్దామనుకున్నా... రద్దీగా ఉందని, మరో తేదీ చెప్పమని అడుగుతుంటాయి. ఆఖరికి ఆఫ్‌సీజన్‌లో అంటగడుతుంటాయి. అందుకే సంస్థ పనితీరు చూశాకే ఇలాంటివి ఎంచుకోవాలి. * మార్కెట్ ప్రతికూలంగా ఉన్నపుడో, ఆఫ్ సీజన్లోనో మీరు బుక్ చేస్తే తక్కువ ధరకు దొరికే అవకాశమున్నా... సభ్యులకు ఆ తగ్గింపు వర్తించదు. ఎందుకంటే వారు ముందే చెల్లించి ఉంటారు కనక. * ఇది పెట్టుబడి సాధనం కాదు. ఏటా కుటుంబంతో కలసి టూర్లకు తప్పకుండా వెళ్లేవారికే పనికొస్తుంది. * కొన్ని సంస్థలు దీన్ని కూడా ఒక పెట్టుబడి సాధనంగా చూపిం చి... మీ బదులు వేరేవారికి ఇచ్చుకోవచ్చని, డ బ్బులు ఆర్జించవచ్చని చెబుతుంటాయి. అలాంటివి నమ్మి మోసపోవద్దు. హైదరాబాద్‌లోనూ టైమ్‌షేర్ ప్రాంతాలు.. గోవా, మున్నార్, ఆగ్రా, మనాలి, సిమ్లా, బెంగళూరు, కూనూరు, కూర్గ్, చిలీ, డార్జిలింగ్, జోధ్‌పూర్, హైదరాబాద్ వంటి వందల ప్రాంతాల్లో టైమ్‌షేర్ ప్రాపర్టీలున్నాయి. హైదరాబాద్ వేదికగా మేడ్చల్, యాదాద్రి, చిలుకూరు బాలాజీ రోడ్ వంటి ప్రాంతాల్లో టైమ్‌షేర్ ప్రాపర్టీలున్నాయి. తమకు సొంతంగా 55 ప్రాపర్టీలున్నాయని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో 200 ప్రాపర్టీలతో ఒప్పందం ఉందని కంట్రీ క్లబ్ చెబుతోంది. క్లబ్ మహీంద్రాకు 40 ప్రాపర్టీలున్నాయి. క్లబ్ మహీంద్రా వివిధ పేర్లతో రూ.2.22 లక్షల నుంచి రూ.17.21 లక్షల విలువైన ప్యాకేజీలను విక్రయిస్తోంది. వీటి గడువు కూడా 5 నుంచి 30 ఏళ్ల వరకూ ఉంది. ప్రస్తుతం స్టెర్లింగ్ హాలిడేస్‌కు దేశ వ్యాప్తంగా 21 ప్రాంతాల్లోని 24 రిసార్టుల్లో 1,767 రూమ్స్ ఉన్నాయి. మన వాళ్లు ట్రావెల్ ప్రియులే...! * ఈ-ట్రావెల్ మార్కెటింగ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలో 36 శాతం మంది పర్యాటకులు ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ప్రయాణాలు చేస్తున్నారు. అది కూడా ఆతిథ్య సంస్థలందించే డీల్స్, డిస్కౌంట్స్ ఆధారంగానేనట!. * ట్రావెల్ సెర్చింజిన్ ‘స్కైస్కానర్’ సర్వే ప్రకారం... ప్రపంచంలోనే భారతీయ పర్యాటకులది మొదటి స్థానం. భారతీయుల్ని పరిశోధనాత్మక పర్యాటకులుగా వర్ణించిన ఈ సర్వే... 2015 జూన్ నాటికి ఇండియన్లు ఐర్లాండ్, స్వీడన్, గ్రీస్, జపాన్ వంటి 230 దేశాల్ని సందర్శించారని తెలిపింది. ‘‘భారతీయులకు ప్రయాణమనేది ఓ ఫ్యాషన్. ఏడాదిలో కనీసం మూడు సెలవుల రోజుల్ని టూర్‌కు వాడాలనిలక్ష్యంగా పెట్టుకుంటారు’’ అని ట్రిప్ అడ్వైజర్ సంస్థ కూడా చెబుతోంది. టైమ్‌షేర్‌తో లాభాలు ఇవీ... * తక్కువ ధరలో నాణ్యమైన హోటల్ గది, సేవలను పొందవచ్చు. * చాలా వరకు ప్రాపర్టీలు సిటీకి దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. కాలుష్యానికి దూరంగా.. వెకేషన్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. * సభ్యత్వ రుసుమును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా నెలవారీ వాయిదాల్లో చెల్లించే అవకాశం కూడా ఉంది. * ఏటా తప్పనిసరిగా ఏదో ఒక ప్రాంతానికి సెలవులు గడపటానికి వెళ్లేవారికీ, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నవారికీ ఇది అనుకూలం. * కొన్ని సంస్థలు బుకింగ్‌లో సభ్యులకు ప్రాధాన్యమిస్తుంటాయి. కనీసం నెల ముందో, 20 రోజుల ముందో బుక్ చేయాలనే నిబంధన పెట్టి... ఆ మేరకు బుక్ చేసినవారికి ఎంత రద్దీ సమయంలోనైనా గదులు కేటాయిస్తూ ఉంటాయి. -
జీఎస్టీ... మనకేంటి?
వస్తు సేవల పన్ను. సంక్షిప్తంగా జీఎస్టీ. దేశవ్యాప్తంగా అన్ని వస్తువులపైనా, అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పన్ను ఉండాలనేది దీని లక్ష్యం. 2006లో కాంగ్రెస్ శ్రీకారం చుట్టిన ఈ పన్ను ఇంకా పార్లమెంటు ఆమోదానికి ఎదురుచూస్తూనే ఉంది. లోక్‌సభ ఆమోదించినా... రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేక ప్రతిపక్ష కాంగ్రెస్ సాయం కోరుతోంది. కాంగ్రెస్ మాత్రం కీలకమైన కొన్ని సవరణలకు పట్టుబడుతోంది. వాటికి అంగీకరించని పక్షంలో బిల్లుకు సహకరించేది లేదంటోంది. కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్లలో ప్రధానమైనది... జీఎస్టీ గరిష్ట రేటును 18 శాతానికి పరిమితం చేసి... ఆ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట అకస్మాత్తుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ నేతృత్వంలోని కమిటీ జీఎస్టీపై కీలక సిఫారసులు చేసింది. అత్యధిక వస్తువులకు, సేవలకు వర్తించేలా జీఎస్టీ ప్రామాణిక రేటును 17-18 శాతానికి పరిమితం చేయాలని సూచించింది. కొన్ని తక్కువ రేటు వస్తువులపై కనిష్టంగా 12 శాతం, లగ్జరీ వస్తువులపై గరిష్టంగా 40 శాతం పన్ను విధించవచ్చని సిఫారసు చేసింది. ఒకరకంగా 17-18 శాతం రేటును ప్రామాణిక రేటుగా పేర్కొనటమంటే కాంగ్రెస్ డిమాండ్‌కు అంగీకరించినట్లే. కాకపోతే దీన్ని సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడానికి మాత్రం ప్రభుత్వం సుముఖంగా లేదు. నిజానికి జీఎస్టీ రేటు 23-26 శాతం వద్ద ఉండొచ్చని పలువురు అంచనా వేశారు. వీటన్నిటినీ తల్లకిందులు చేస్తూ 17-18 శాతంగా సిఫారసు చేయటం వల్ల... ఇదే గనక అమల్లోకి వస్తే చాలా రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అధికశాతం వస్తువులపై, కొన్ని వస్తు సేవలపై కేంద్ర, రాష్ట్రాలు కలిసి 29 శాతం వరకూ పన్ను విధిస్తున్నాయి. తాజా సిఫారసులు అమలైతే అది 17-18 శాతానికి దిగి వస్తుంది. ఆ మేరకు వస్తు, సేవల ధరలు తగ్గుతాయి. వస్తువుల ఉత్పత్తి వ్యయం తగ్గటంతో విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయి. ధరలు తగ్గితే మరింత మంది వాటిని అందుకుంటారు కనక ఈ చర్య ఆర్థిక రంగానికి ఊతమిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు జీఎస్టీ దేనిపై విధిస్తారు? అది వస్తే ఏఏ పన్నులు తొలగిపోతాయి? సామాన్యులకు లాభమా.. నష్టమా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం * ప్రామాణిక రేటును 18 శాతంగా సిఫారసు చేసిన కమిటీ * అదే అమలైతే హోటల్ బిల్లులతో సహా పలు బిల్లుల తగ్గుదల * కొన్ని సేవలపై పన్నులు పెరగొచ్చు * కనిష్ట రేటు 12% గరిష్ట రేటు 40%గా పేర్కొంటూ సిఫారసులు * ప్రస్తుతం పెట్రోలు సహా పలు ఉత్పత్తులపై భారీ పన్నులు * ఇవి అమల్లోకి వస్తే నష్టపోనున్న రాష్ట్రాలు.. రాష్ట్రాలకు వెసులుబాటిస్తే ఈ చట్టమే వృథా!? దేశ వ్యాప్తంగా ఒకే ధర... ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒకేరకమైన పన్నులుంటాయి. కానీ మన దేశానికి వచ్చేసరికి ఈ పరిస్థితి లేదు. ఆయా రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పన్నులు విధించుకుంటున్నాయి. దీనికి చక్కటి ఉదాహరణ పెట్రోల్, డీజిల్ ధరలే. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో లీటరు పెట్రోల్ ధర రూ.57.64 ఉంటే, ఢిల్లీలో రూ. 60.48గా ఉంది. అదే హైదరాబాద్‌కు వచ్చేసరికి రూ. 65.48గా, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రూ. 66.68గా ఉన్నాయి. మహారాష్ట్రలో పప్పు దినుసులు, బియ్యంపై పన్ను లేదు. కానీ తమిళనాడులో ఇది 1 శాతంగా ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతంగా ఉంది. ఒక వస్తువు ధర రాష్ట్రం మారినప్పుడల్లా మారడానికి కారణం ఆయా రాష్ట్రాలు విధిస్తున్న పన్నులే. దేశంలో ఏ మూలకెళ్లినా వస్తువుల ధరలు ఒకే విధంగా ఉంచే విధంగా ఏకీకృత పన్నుల విధానాన్ని అమలు చేయడమే జీఎస్టీ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు! పన్నులను తగ్గించడం వల్ల జాతీయోత్పత్తి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాగంటే పన్నులు తగ్గిస్తే ధరలు దిగివస్తాయి. దానివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. పన్నులు తక్కువగా ఉంటే పోటీని సమర్థవంతంగా తట్టుకొని దేశీయ కంపెనీలు ఎగుమతులు కూడా పెంచుకునే అవకాశముంటుంది. అంతేకాక విదేశీ కంపెనీలు కూడా ఇక్కడే తయారీ యూనిట్లను నెలకొల్పడానికి ముందుకొస్తాయి. దీనివల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఒకసారి దేశంలో జీఎస్టీ అమల్లోకి వస్తే దేశ జీడీపీ 1.5 శాతం నుంచి రెండు శాతం పెరుగుతుందని, ఎగుమతుల ద్వారా 15 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుందనేది నిపుణుల అంచనా. ధరలెందుకు తగ్గుతాయి? ప్రస్తుతం మన పన్నుల వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పన్నులు విధిస్తున్నాయి. కేంద్రం వ్యాట్, ఎక్సైజ్, కస్టమ్ సుంకాలు, కౌంటర్వీలింగ్ డ్యూటీలు (సీవీడీ), సర్వీస్ ట్యాక్స్‌లతో పాటు సర్ చార్జీలు, వివిధ రకాల సుంకాలను వేస్తుంటే, రాష్ట్రాలు అమ్మకం పన్ను, రాష్ట్ర వ్యాట్, వినోద, విలాస పన్నులు, అక్ట్రాయ్ వంటివి విధిస్తున్నాయి. ఇలా చెల్లించిన పన్నులపైనే పరోక్షంగా పన్నులు చెల్లించాల్సి రావడంతో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి ఒకసారి జీఎస్టీ అమల్లోకి వస్తే కస్టమ్స్ మినహా కేంద్రం విధిస్తున్న పన్నులన్నీ దీన్లో కలుస్తాయి. అలాగే రాష్ట్రం విధిస్తున్న వివిధ పన్నులూ దీన్లో విలీనమవుతాయి. దీంతో పన్నుపైన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు ధరలు తగ్గుతాయి. కంపెనీలకు లాభమా? నష్టమా? జీఎస్టీ అమల్లోకి వస్తే కంపెనీలకు నిర్వహణా వ్యయం బాగా తగ్గుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు కేంద్ర అమ్మకం పన్నును తప్పించుకోవడానికి ప్రతీ రాష్ట్రంలోనూ గిడ్డంగులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ అవసరం ఉండదు. కంపెనీలు వ్యూహాత్మక ప్రాంతంలో ఒకేచోట భారీ గిడ్డంగులను ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరుకును రవాణా చేస్తాయి. దీనివల్ల గిడ్డంగుల నిర్వహణ భారం గణనీయంగా తగ్గుతుంది. అలాగే కంపెనీలు పన్ను భారం తక్కువ ఉన్న ప్రాంతాల్లో గిడ్డంగులు ఏర్పాటు చేసుకొని దొంగతనంగా పక్క రాష్ట్రాలకు విక్రయించడాలు కూడా ఆగిపోతాయి. ఇలా పన్నులు ఎగ్గొట్టే వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్న చెక్‌పోస్టుల అవసరం ఉండదు. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభిస్తుంది కనుక విదేశీ కంపెనీలూ ఇక్కడ తయారీ యూనిట్లు పెట్టడానికి వస్తాయి. 10 శాతం పన్నును లెక్కలోకి తీసుకొని జీఎస్టీకి ముందు, జీఎస్టీ వచ్చాక వస్తువు ధరలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం..సామాన్యుడికి ఊరట..! సుబ్రమణ్యన్ కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే జీఎస్టీలో పన్ను శ్లాబుల్ని మూడు రకాలుగా వర్గీకరించినట్లు కనిపిస్తోంది. నిత్యావసర వస్తువులను 12 శాతం బ్రాకెట్లోకి, ఇతర వస్తువులపై 17-18 శాతం విధించాలని సూచించింది. అలాగే ఆరోగ్యానికి హాని చేసే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు, కూల్‌డ్రింక్స్ వంటి వాటితో పాటు విలాసవంతమైన కార్లు, ఇతర లగ్జరీ వస్తువులపై 40 శాతం గరిష్ఠ పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. ఇవే రేట్లు కనుక అమల్లోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడం ద్వారా సామాన్యుడికి పెద్ద ఊరట లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్ని వస్తువులపై సగటున 29 శాతం పన్నులు చెల్లిస్తున్నారని, ఇప్పుడది గణనీయంగా తగ్గి సామాన్యుడి జేబులోకి డబ్బులొస్తాయని ట్యాక్సేషన్ నిపుణులు పి.వి.సుబ్బారావు తెలిపారు. ఉదాహరణకు ఇపుడు ఆల్కహాల్‌పై 190 శాతం వరకూ పన్ను ఉంది. పెట్రోల్‌పై కూడా భారీ పన్నులున్నాయి. ఇవి గరిష్ఠ బ్రాకెట్ 40 శాతంలోకి వచ్చినా ధరలు భారీగా తగ్గుతాయని చెప్పొచ్చు. కొన్ని సర్వీసులు ప్రియం జీఎస్టీ ప్యానెల్ ప్రతిపాదనల ఆధారంగా జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే టెలిఫోన్, బ్యాంకింగ్‌లో పొందే సేవలు ఖరీదవుతాయి. ప్రస్తుతం ఈ సేవలపై 14.5 శాతం పన్ను రేటు ఉంది. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను రేటును 17-18 శాతంగా ఉంచాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ జీఎస్టీ ప్యానెల్ ప్రతిపాదించింది. అ మేరు ఈ సేవల ధరలు పెరుగుతాయి. వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. 1994లో సర్వీస్ ట్యాక్స్‌ను ప్రభుత్వం ప్రవేశం పెట్టింది. అప్పుడు సర్వీస్ ట్యాక్స్ 5 శాతంగానే ఉండేది, పరిమితమైన సేవలపైనే ఈపన్ను ఉండేది. ఇప్పుడు ఇది 14 శాతానికి పెరిగింది. కొన్ని మినహాయింపులు తప్ప దాదాపు అన్ని సేవలపైనే ఈ పన్ను ఉంది. స్వచ్ఛ భారత సెస్‌ను కూడా కలుపుకుంటే ఇది 14.5 శాతానికి పెరిగింది. కాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గల జీఎస్టీ కౌన్సిల్ తుది జీఎస్టీ రేట్‌ను నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు ఒప్పుకుంటాయా?... మన దేశంలో చాలా రాష్ట్రాలకు పెట్రో ఉత్పత్తులు, ఆల్కహాల్ ఉత్పత్తులపై వేస్తున్న పన్నులే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. జీఎస్టీ నుంచి వీటిని తప్పించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ సుబ్రమణ్యన్ కమిటీ వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇదే జరిగితే రాష్ట్రాలు ఆదాయాన్ని గణనీయంగా నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోఆల్కహాల్పై 190 శాతం వరకు పన్ను ఉంది. కానీ జీఎస్టీలో గరిష్ట పన్ను 40 శాతం మించి లేదు. మరి ఈ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవడానకి రాష్ట్రాలు సిద్ధపడతాయా అన్నది ప్రధాన సమస్య. జీఎస్టీ బిల్లు అమల్లోకి రావాలంటే 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ జీఎస్టీ అమల్లోకి వచ్చినా కొన్ని వస్తువులపై ఆయా రాష్ట్రాలు పన్నులు విధించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తే అసలు జీఎస్టీ ఉద్దేశమే దెబ్బ తింటుంది. దీంతో జీఎస్టీ అమల్లోకి వచ్చినా తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులు పొందలేరు. గతంలో వ్యాట్ అమలైన ప్పటి అనుభవాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జీఎస్టీని ప్రభుత్వాలు ఎంత నిబద్ధతతో అమలు చేస్తాయన్నది రానున్నకాలంలో తెలుస్తుంది.